పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

దీనిని గొంద ఱాదేశయతికి ఉదాహరణమందురు. అది కాదు.

319
భాస్కర రామాయణమున
ఉ.

అన్నవు తండ్రియట్ల విను మంతియగా దటుమీఁద రాజ నే
మన్నను లెస్సయౌను మణిమండనముఖ్యము లైనకానుకల్
మున్నుగ సీత నిచ్చి జనలోకపతిన్ గని సంధిసేయు మీ
సన్నపుఁ గార్యము ల్వలదు సంధియె మే లటుగాక తక్కినన్.

320
పారిజాతాపహరణమున
చ.

వనిత యొకర్తు మున్కొని గవాక్షతలంబున నిల్చి యుండుటన్
గనుఁగొనఁ బోయి...

321
రాఘవపాండవీయమున
గీ.

గళితహరికుంజరశతాంగముల ధరిత్రి, గప్పుచు యథామనోరథగతిఁ జరించె
నవనిజారూఢమదవారణక్రియలకు, నిలువలేక పార్ధబలయోధులు తొలంగె.

322


వ.

అని యి ట్లనేకప్రబంధములయందు విస్తారముగా నుదాహరణయోగ్యముగా లక్షణ
కవులైన మహాత్ములు చెప్పియున్నారు గనుక ఇది జాడ యని తెలిసి యతుల నిలు
పునది.

323

ప్రాదియతులు

భీమనచ్ఛందమున (సంజ్ఞ. 67)
క.

ప్రపరాపసమనుసుప్ర, త్యపినిర్దురధిన్యుపాభ్యుదాఙ్న్యత్యవప
ర్యుపసర్గవింశతికి వ, ళ్లు పరస్పరవర్ణయుక్తి నుభయముఁ జెల్లున్.

324


తా.

ప్ర, పర, అప, సం, అను, సు, ప్రతి, అపి, నిః, దుః, అధి, ని, ఉప, అభి, ఉత్, ఙ్, ని, అతి, అవ, పరి అని ఇరువదివిధముల యుపసర్గములు కలవు. వీనికి స్వరము లున్నచో నచ్చులకును, హల్లులకును యతి చెల్లుననుట. ఇందొక్కొక్కదానికిఁ బ్రత్యేకముగాఁ బూర్వకవిప్రయోగములు వ్రాయుచున్నాఁడను.

1. 'ప్ర' అను నుపసర్గయందలి యచ్చుకు ఉత్తరహరివంశమున
శా.

ప్రారంభం బగుశక్తి కుట్మలితహస్తాంభోజ యై యి ట్లనున్.

325
హల్లుకు పాండురంగమాహాత్మ్యమున
శా.

ప్రారంభించిన వేదపాఠములకున్ బ్రత్యూహమౌ నంచు నో...

326
2. 'పర' అను నుపసర్గయందలి యచ్చుకు శ్రీరంగమాహాత్మ్యమున
క.

పరమ మిది యొకరహస్యం, బరవిందజ వినుము మత్పరాయణు లెందున్
దురితములు పెక్కొనర్చియు, నరుగరు పటుఘోరనారకాధోగతులన్.

327