పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఆంధ్రభాష విశేషముగ సంస్కృతముపై నాధారపడి యున్నమాట వాస్తవమేకాని యందుఁ జాలదేశ్యపదములు గూడ నిమిడియున్నమాట యంద ఱెఱుంగనిది కాదు. సంస్కృతభాషయం దమరకోశము మున్నగు నిఘంటువులు పెక్కులున్నవి. నిఘంటుసాహాయ్యము లేనిదే యెంతటి భాషానిష్ణాతునకైన నొక్కొక్కచో నొక్కొకశబ్దముయొక్క విశేషార్దములు గోచరింపక మహాకవులు కావ్యరసగ్రహణమున కంతరాయము కలిగించును. అట్టి నిఘంటువులు మన యాంధ్రభాషయందుఁ జాలతక్కువ. ఉన్నవానిలో నిఘంటుత్రయమని పిలువఁబడుచున్న 1 ఆంధ్రనామసంగ్రహము 2 ఆంధ్రనామశేషము 3 సాంబనిఘంటువు నను నీమూఁడును బ్రశస్తములు, వ్రాత కనువగు సాధనములు స్వల్పమగుటయు గురుముఖము నుండి శిష్యున కెట్టిశాస్త్రమైనఁ బరంపరాగతము కావలసియుండుటచేతను బ్రాచీనకాలమునుండియు నేశాస్త్రమైనను ఛందోబద్ధము కావింపఁబడుచుండెడిది. ఆసంప్రదాయమున కనుగుణముగనే యీమూఁడు నిఘంటువులును బద్యరూపముగ విరచింపఁబడినవి. విశేషశబ్దములఁ దమనిఘంటువులఁ జేర్చి యాంధ్రమహాకవులరచనలు జనసామాన్యమున కందుబాటులో నుండుటకుఁ దోడ్పడిన పైనిఘంటుత్రయకర్తల కాంధ్రజనులు చిరకృతజ్ఞతను జూపవలసియున్నది.