పుట:ఆంధ్ర నిఘంటు త్రయము, టీకా తాత్పర్య సహితము.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఆంధ్రనామసంగ్రహము

ఇది పైడిపాటి లక్ష్మణకవిచే రచింపఁబడినది. ఈకవి యేకామ్రమంత్రి పుత్రుఁడు. కౌండిన్యగోత్రుఁడు. శివభక్తుఁడు. ఈ కవి కాలమును నిర్ణయించుటకుఁ దగినయాధారములు దొరకలేదు. కాని యడిదము సూరకవి యాంధ్రనామసంగ్రహమునఁ చెప్పని తెలుఁగుపదముల నేరి యాంధ్రనామశేషమను నిఘంటువు రచియించెదనని చెప్పుటచేత నాతనికన్నఁ బ్రాచీనుఁడని మాత్రము చెప్పవచ్చును.

ఆంధ్రనామశేషము

ఇది అడిదము సూరకవిచే రచింపఁబడినది. ఇతఁడు నియోగిబ్రాహ్మణుఁడు. ఈకవితండ్రి బాలభాస్కరుఁడు. ఈతఁడు రచించిన చాటుపద్యములు మున్నగువానివలన నీతఁడు విజయనగరాధిపతియైన రెండవ విజయరామరాజుగారి కాలములో నున్నట్లు విశదమగుచున్నది. ఈ విజయరామరాజు గారు క్రీ.శ. 1759 సం॥రం మొదలుకొని 1794 సం॥రం వరకు రాజ్యపాలనము చేసిరి. కావున నీకవి కూడ నీకాలములోనివాఁడే యని తెలియుచున్నది. ఇతఁడు కవిజనరంజనము, కవిసంశయవిచ్ఛేదము, ఆంధ్రచంద్రాలోకము, రామలింగేశ్వరశతకము అను గ్రంథములనుగూడ రచించెను.

సాంబనిఘంటువు

ఇది కస్తూరిరంగకవిచే రచింపఁబడినది. ఈకవి యార్వేలనియోగిబ్రాహ్మణుఁడు. ఈతనితండ్రి వేంకటకృష్ణయామాత్యుఁడు. తల్లి కామాక్షమ్మ. ఇతఁడు క్రీ.శ. 1790 సం॥రం ప్రాంతమున తంజావూరి సంస్థానమునందుండెను. ఈ కవి లక్షణచూడామణియను నామాంతరము గల రంగరాట్ఛందస్సును, కృష్ణార్జునసంవాదమను ప్రబంధమునుగూడ రచించెను. ఆంధ్రకాళిదాసబిరుదశోభితుఁడగు నాలూరి కుప్పనకవి తా నీతనిశిష్యుఁడని తన శంకరవిజయమున వ్రాసికొనియున్నాఁడు.

ఈ కవిత్రయము రచించిన పైమూఁడునిఘంటువులను బండితు లగువారిచే టీక వ్రాయించి నిర్దుష్టముగ ముద్రింపించితిమి. దోషము లున్నయెడలఁ బండితులగువారు దయయుంచి మాకుఁ దెలియఁజేసినయెడల రాబోవుముద్రణమున సవరించుకొందుము.


కురుకూరి సుబ్బారావు