పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
  • గ్రామ పంచాయతీలలో థీమాటిక్ అప్రోచ్స్ - హెల్తీ విలేజ్ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరిలో 3 రోజుల జాతీయ శిక్షణా శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది.
  • 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ భాగస్వామ్యంతో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ మరియు సెమీకండక్టర్ ఇన్నోవేషన్ సమావేశాలను నిర్వహించటం జరిగింది.

కేంద్ర రాష్ట్ర సంబంధాలు విభజన సమస్యల పరిష్కారం

146. 2014 సంవత్సరంలో మన రాష్ట్రం విపత్కర పరిస్థితులను చవిచూసింది. అయితే, గత ప్రభుత్వం అవసరమైన సమయంలో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి, అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన హక్కులు పొందేందుకు ఎటువంటి ముఖ్యమైన చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు వారసత్వంగా రావడం మరియు పొరుగు రాష్ట్రంతో ఉన్న విభేదాల వలన మేము మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడవలసి వచ్చింది. 2014-15 రెవిన్యూ లోటు గ్రాంటు క్రింద 10,460 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుండి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్రము నుండి మన రాష్ట్రానికి 6,756 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ఆదేశాలు జారీ అయ్యేలా కృషి చేసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు సంబంధించి మన రాష్ట్రం మరియు తెలంగాణా రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం జరిగింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన 1050 కోట్ల రూపాయల గ్రాంటును రాబట్టగలిగాము. 15వ ఆర్థిక సంఘంను ఒప్పించడం ద్వారా, 30,497 కోట్ల రూపాయల గరిష్ట రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగాము. అంతేకాకుండా, మా అలుపెరగని పోరాటం ద్వారా, పోలవరం ప్రాజెక్టు నవరించిన అంచనాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మన కృషి మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మిగిలిన ఇతర సమస్యలకు కూడా త్వరలో పరిష్కారం లభించబోతోంది.

42