పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

807 గ్రామాల సమస్యను పరిష్కరిస్తూ 1.12 టీ.ఎం.సీ.ల శుద్ధి చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వై.ఎస్.ఆర్. సుజలధార ప్రాజెక్టును డిసెంబరు 14, 2023 న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు.

ఇంధన శక్తి

113. ఆర్థికాభివృద్ధికి కీలక సూచిక అయిన విద్యుత్ తలసరి వినియోగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1,203 యూనిట్లుగా ఉండగా, డిసెంబర్ 2023 నాటికి 1,400కు పెరిగింది. విద్యుత్ ప్రసార మరియు పంపిణీ నష్టాలు 13 శాతం నుండి 9.27 శాతానికి తగ్గాయి. మన రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ ను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది.

114. యూనిట్ కు కేవలం 2 రూపాయల 49 పైసల ఆకర్షణీయమైన రేటుతో సంవత్సరానికి 7 వేల మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియాతో మన రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, కృష్ణపట్నం లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ లోని 800 మెగావాట్ల 2వ దశ యూనిట్ ని, అదే విధంగా, ఇబ్రహీంపట్నం లోని నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ లోని 800 మెగావాట్ల 5వ దశ యూనిట్ ని రాష్ట్రానికి అంకితం చేయటం జరిగింది.

115. సుస్థిర భవిష్యత్తు కోసం హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం-2020, ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజీ ప్రమోషన్ పాలసీ-2022 మరియు ఆంధ్ర ప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ-2023 లను ప్రకటించింది. పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం అనుకూల ప్రదేశాలను గుర్తించడంలో, మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది.

30