పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

కొలుచుకొటారులందు నృపకుంజరుఁ డెంతయు నాప్తు నిల్పి తాఁ
గలయఁ గనుంగొనన్‌వలయు గల్గినయాయము కొద్ది వెచ్చముం
దెలిసి యొనర్పఁగాఁదగు మదింపక యెందును భూమిభర్తకుం
గొలుచుకొటారులే కదయకుంఠితజీవనహేతువుల్ మహిన్.

60


చ.

చెఱువులు గట్టుటల్ గృషులు సేయుట వాడల లెక్కచేయుటల్
కరులను బట్టుటల్ గనులు గైకొనుటల్ వనదుర్గసేతువుల్
పొరయుట బేరమాడుటయు భూస్థలి నిట్టివి యష్టవర్గ మౌ
నరపతి వీనిఁ గూర్చుటకు నమ్మినవారలఁ బంపగాఁ దగున్.

61


క.

ఇలఱేఁ డీవ్యవహారము
వలనం గడుఁబేదలైనవారలు ప్రబలం
గల రా యా వ్యవహారం
బుల వారల కడ్డపాటు వోఁ జేయఁదగున్.

62


గీ.

క్రంప గొట్టించి సేద్యముల్ గలుగఁజేసి
పైరు దలకొనఁ గాపాడఁ బంచి ఫలము
గలుగుచో దండయుక్తిని గాఁచియుండఁ
జేయఁగాఁదగు నటులైన సిరులఁ జెందు.

63


ఉ.

వైరులచేత దొంగలగువారలచే నధికార్లచేత భూ
మీరమణుండు లోభమున మించుటచేఁ జనవర్లచేత ని
ద్ధారుణికిన్ భయంబులగు దా నిటు లైదువిధంబు లౌభయం
బారసి వేళయందె ఫలమందుట మేలు త్రివర్గవృద్ధికై.

64


క.

బలసి యెదురొడ్డి గరువం
బులు గల యధికారిజనులఁ బుండ్లునుబలెఁ దా
నిలఱేఁడు చీల్చివేయఁగ
వలయుం గడు ధూర్తు లైనవారలు వెఱవన్.

65