Jump to content

పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భేదోపాయములు

క.

ఇచ్చుట యాశలు చూపుట
మచ్చిక మాటాడుటయును మన్నించుటయున్
హెచ్చినభయంబు చూపుట
నిచ్చలు భేదంబు సేయునేర్పులు జగతిన్.

149


క.

మును భేదముఁ బొరయింపుచు
దనయరిసైన్యంబుమీఁద దండ మొనర్పన్
దను దానె ఎఱుగుచుండును
ఘనముగ నుసిపరువు దినినకట్టియవోలెన్.

150


క.

బలవంతులతోఁ గలహం
బలవడ భేదమున గెలువ నగుఁ జండామ
ర్కుల భేదపఱచి దివిజులు
గెలువరె దానవుల నెల్ల క్షితి నుతియింపన్.

151


వ.

దండోపాయప్రకరణము.

152


క.

అలమటఁ బెట్టుట చంపుట
కలిగినదనమెల్ల నొడిచి కైకొనుటయుఁగా
నిల దండము మూఁడుదెఱం
గుల వెలయు నటండ్రు నీతికోవిదు లెల్లన్.

153


వ.

అందు వధరూపంబగు దండంబు ప్రకాశంబు నప్రకాశం బన
రెండుదెఱంగులై యుండు నది యెట్లన్నను.

154


క.

జగతిని జారులు చోరులు
నగువారిని దనకు శత్రులగువారి మదిం
దగ నెఱిఁగి తాఁ బ్రకాశం
బగు దండ మొనర్పఁ జెల్లు నధిపతి కెందున్.

155