పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచవిధసామప్రకారములు

వ.

ఇట్టి సామప్రకారంబు లన్నియునుం గూడి యైదువిధంబులై
యుండు నది యెట్లన్నను పరస్పరోపకారప్రదర్శనంబును, బర
స్పరగుణకీర్తనంబును, బరస్పరసంబంధకథనంబును, నుత్తమ
కాలఫలప్రదర్శనంబును, నేను నీవాఁడనని తను నిచ్చుకొనుట
యుంగా, మఱియు నది ప్రయోగించు తెఱం గెట్లన్నను.

111

సామప్రయోగవిధానము

గీ.

ఎలమి నిరువుర యుపకార మెంచి మించు
గుణముఁ గొనియాడి సంబంధగణన సేసి
మీఁదటిఫలంబు గనఁబల్కి మీకు నేను
దగు లటనుచును సామోక్తిఁ బలుకవలయు.

112


గీ.

అరసి బహుమాన మొనరించు నట్టికరణి
నాదరంబునఁ గనుఁగొనునట్టిసరణి
నమృతకణములు చిలుకుచున్నట్లు నేర్పు
కులుకుచుండఁగ సామంబుఁ బలుకవలయు.

113


క.

సామంబుగ నిజ మాడుట
ప్రేమం గొనియాడుటయును బ్రియ మాడుటయుం
దా మఱి ప్రార్థన సేయుట
యీమార్గము మనుజపతుల కెఱుఁగగవలయున్.

114


క.

నేమమునఁ గార్యసిద్ధికి
సామమె యొనరింపవలయు సకల మగునెడన్
సామమునఁ గార్య మగు నని
ధీమంతులు సంతతంబుఁ దెలిపెడుకతనన్.

115