దూతచరవికల్పప్రకరణము — దూతలక్షణము
చ. |
తలఁపున మించి క్లేశములు దాశి ప్రయాసము నోర్చి దక్షుఁడై
చెలఁగుచుఁ బోవ రాఁ గలిగి శీలముఁ జెంది పరేంగితంబు నూ
హలు దనలో నెఱింగి కఠినాత్ముఁడు గా కటు యుక్తిపెంపునున్
గలిగినవాఁడు దూత యనఁగా నుతికెక్కుచునుండు నెచ్చటన్.
| 78
|
వ. |
ఇది దూతలక్షణం బగు నింకఁ జారలక్షణంబు వివరించెద.
| 79
|
చారలక్షణము
క. |
మునులును జారులు శిల్పులు
ననఁ దగి దిశలందు ధూర్తులై తిరుగంగాఁ
జను వేగువారు వార్తల
ననువుగఁ దెలియుచును బతికి నవి తెల్పుటకై.
| 80
|
చ. |
ఇలఁ గల దూరకార్యముల నెల్లఁ గనుంగొనఁ జాలునట్టి క
న్నులు పతి కెందు నెంచఁగ వినూతనచాతురిఁ బొల్చువేగువా
రలె కద కాన వారలు ధరాతలమందుఁ జరించుచు సర్వవా
ర్తలు దెలుపం జనున్ బతిహితంబుగ వచ్చుచుఁ బోవుచుండఁగన్.
| 81
|
చ. |
చెలఁగెడు సూక్ష్మసూత్రములచేత బలెం దనవేగువారిచే
నిలఁ గల సర్వవార్తలు మహీపతి దా నెఱుఁగంగ నొప్పు ని
ట్లలవునఁ జారచక్షుఁడయు యందము నొందినరాజు నిద్రచే
నలరినవేళ మేల్కనినయట్టివిధంబున మించు నెంచఁగన్.
| 82
|
గీ. |
కదలుటలచేత వ్యాపించు గాలిలీలఁ
గిరణములచేత వ్యాపించు తరణికరణి
నరపతికి లోకసమ్మతులైన వేగు
వారిచేతనె వ్యాపించవలయు జగము.
| 83
|