పుట:అహల్యాసంక్రందనము.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

63

     ర్థాంతరముల్ చరించిన నొయారికి రూపవిలాసవంతుఁడౌ
     కాంతునిఁ గౌఁగిలించినసుఃఖంబు లభించునటే విలాసినీ!26
ఉ. ఎందును సంచరింప కఖిలేంద్రియముల్ సుఖమొంద డెందమున్
     బొందుగఁ దన్నుఁ దా మఱవ బుద్ధి కగోచరమైనయట్టి యా
     నందము బ్రహ్మ మందు రది నవ్యవయోనవమోహనాంగియౌ
     చందనగంధికిన్ దొరకుఁ జక్కనిమక్కువకాఁడు చిక్కినన్.27
ఉ. చేతన మౌటయే యరిది చేతనమైన మనుష్యజన్మ మ
     త్యాతతపుణ్యలభ్య మటు లైనను స్త్రీజననం బలభ్య మా
     జాతికిఁ గామమున్ సురతసౌఖ్యము హె చ్చది పోవఁద్రోచినన్
     పాతక మాత్మహత్యకు సమం బగుపాతక మొక్కటున్నదే?28
ఉ. వారక నత్తగారి కనుబ్రామి, నిజేశ్వరు మోసపుచ్చి యా
     యారునుదూరు నై నఁబడి యందరికన్ని ఘటించి యాత్మఁ దా
     గోరిననాథునిం గలసి కొల్లలుగా సుఖమందకున్న నా
     సారసపత్రనేత్రి యెలజవ్వన మేటికి జన్మ మేటికిన్.29
సీ. కాంతుదంతక్షతిఁ గాంచనిమోవియు
                    మోవియే చల్లమ్ముగ్రోవి గాక
     సరసుండు బట్టని చన్నులు చన్నులా
                    యల మేకమెడచన్ను లంతె గాక
     ప్రాణేశుఁ డనుభవింపని యౌవనమ్ము యౌ
                    వనమటే నిజమ యవ్వనము గాక
     పతిమేన మకరికల్ వ్రాయని వ్రేళ్లును
                    వ్రేళ్లటే కలజువ్వివేళ్లు గాక
తే. చంద్రకిరణమ్ము సోఁకిన చంద్రకాంత
     మనఁగఁ బదియాఱుకళల జిమ్మనికరంగ
     కరఁగి కరగించి కాంతునిఁ గవయకున్న
     నారి నారియటే వింటినారి గాక.30