పుట:అహల్యాసంక్రందనము.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

61

క. 'ఆరూపము నీరూపము
     సారూప్యముఁ జెంది యుండె జలజదళాక్షీ!
     మారుఁడు స్వైరవిహారుఁడు
     వీరనివారని మదిన్ వివేకము లణుచున్.16
ఉ. 'మోవిని మోవిఁ జేర్చు, నది ముద్దిడకున్నను మ్రొక్కుఁగేల, ని
     చ్ఛావిధిఁ గౌఁగిలించు, నది చన్నులనొత్తమి వెచ్చనూర్చుఁ జే
     నీవిక నంటు హత్తమికి నెవ్వగఁ బొర్లును బూవుఁబాన్పుపై ,
     దైవముఁదిట్టు దిట్టుకొనుఁ ద న్నినుఁ దిట్టును బెట్టు మూర్ఛిలున్.17
చ. 'యమవరుణాదు లెవ్వనికటాక్ష మపేక్ష యొనర్తు రాగమా
     గ్రములు యదీయరూపగుణకర్మము లెన్నును వందివైఖరిన్
     హిమకరసోదరీరమణుఁ డెవ్వని వాకిటికార్యకర్త యా
     యమరవరుండె గోరె నిను నంగన, నీదగుభాగ్య మెట్టిదో!18
చ. 'కొసరులొ చెక్కు నొక్కుటలొ కూకిరవల్ పలికించి పల్కుటో
     యొసపరియల్కలో నయములో రతిసుద్దులొ వింతముద్దులో
     పసఁ దొడసందుపొందికలొ వాతెరకూర్పులొ ప్రక్కమార్పులో
     రసికతలేనిగేస్తురతి రామకు నేమిసుఖంబు దెల్పుమా!19
చ. 'వ్రతములఁ గృఛ్రకోటి నుపవాసములన్ దనువుల్ కృశింపఁగా
     మతి నరతిన్ శిరోవృతిని మౌనముతో మొగమోరగా వడిన్
     పితరులయప్పు దీరె[1]ననిపింతురు యౌవనమత్తకాశినీ
     తతిహృదయంబు నేచుబలుతాపసులన్ బసులంచు నెంచుమా!20
సీ. 'నేఁటి కమవాస్య నేఁటికిఁ బున్నమ
                    నేఁటికి సంక్రాంతి నేఁడు విషువు
     నేఁడు వ్యతీపాత నేఁటికి వైధృతి
                    నేఁటికి మన్వాది నేఁటికిఁ దిథి

  1. ననిపించిన