పుట:అహల్యాసంక్రందనము.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

అహల్యాసంక్రందనము

     తలఁచి పలుకంగరాని దుర్దశలఁబొందు
     మఘవు నే నందుఁ గనుఁగొంటి మచ్చెకంటి.9
ఉ. ఎవ్వతెమీఁదనో హృదయ మీభువనత్రయనాథు నింతగా
     రవ్వలఁ బెట్టినట్టి యలరక్కసి యెవ్వతొ చూతమంచు నే
     నవ్వల మధ్యకుంజకుహరాంతరసీమ నణంగియున్నచో
     నవ్వలశాసనుం డనియె నవ్వల నవ్వలమానవేదనన్.10
ఉ. 'ఏల సృజించె దాని నను నేల సృజించెను బ్రహ్మ దాని కీ
     లాలితరూపయౌవనకళాలలితాంగవిలాసవిభ్రమం
     బేల నొసంగె? బేలతని మేటికి నిచ్చె, మదీయబుద్ధికిన్?
     బాలికతోడ నామనవి బల్కెడువారి జగానఁ గానఁగా.11
మ. 'కలలోఁ జూతునటన్న నిద్ర యెఱుఁగన్ గన్నారఁ జిత్తర్వునన్
     దెలియం జూచెదనన్న బాష్పములచే నేత్రాబ్జముల్ క్రమ్మెడిన్
     కలయన్ ధ్యానముఁ జేతునన్న మది నున్మాదంబు సంధిల్లెడిన్
     ఇలలోఁ దాళఁగరానితాప మహహా యెట్లోర్చెదన్ దైవమా!12
చ. 'కులుకుటొయారపున్నడలు గుబ్బచనుంగవ గొప్పకన్నులున్
     తొలుకరిక్రొమ్మెఱుంగుగమితో గమితోపమమైన మేనితో
     నలయలివేణి లోవెలి నహర్నిశమున్ గనుపట్టుచుండియున్
     జలగత చంద్రమండలము చాడ్పునఁ జేతికి నబ్బ దక్కటా!13
మ. 'ధనికున్ జేయును లోభివాని నెఱదాతన్ బేదఁగాఁ జేయు ర
     త్యనభిజ్ఞుండగు నెడ్డెకున్ మదనతంత్రప్రౌఢయౌదాని భా
     ర్యనుగాఁ జేయు నటన్న కోపమునఁ గాదా బ్రహ్మశీర్షంబు ద్రుం
     చెను శంభుం డటువంటివానికి ననౌచిత్యం బనన్ జెల్లునే?'14
క. అని పలికి చిత్రఫలకం
     బునఁ దనభావమున నున్న ముద్దులగుమ్మన్
     దనువునఁ బులకలమొలకలు
     పెనఁగొనఁగా వ్రాసి చూచి పేరెద నునిచెన్.15