పుట:అహల్యాసంక్రందనము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38

అహల్యాసంక్రందనము

తే. నలఘుశతకోటికాంక్షలు నతనుదండ
     భృతులు నంజనతృష లలకేహితములు
     నిన్మడింపఁగ ననిమిషదృష్టు లైరి
     అంబుజభవోపలాల్య నహల్యఁ జూచి.28
సీ. కల్కికటాక్షంబు కల్గితేగద తాను
                    గుసుమాస్త్రుఁడ నటంచుఁ గుసుమశరుఁడు
     కొమ్మవాతెఱతేనెఁ గ్రోలితేగద తాను
                    మధువు నౌదునటంచు మాధవుండు
     నెలఁతముద్దుమొగంబు నిమిరితేగద తాను
                    ఘనకళానిధి నంచుఁ గమలవైరి
     సుదతియూరువుతావి సోకితేగద తాను
                    గంధవాహుఁ డటంచు గాలివేల్పుఁ
తే. దలఁచి రచ్చట సిద్ధగంధర్వయక్ష
     చారణాదులు దత్కాంతిపూరవార్ధి
     మగ్నులై చిత్రరూపులమాడ్కి నుండి
     రంత శచికాంతుఁ డెంతయు నాత్మలోన.29
మ. ఎలమించున్ దులమించు హేమలతయో యీరేడులోకంబులన్
     వలపించందగు కామదివ్యకళయో వాంఛన్ ద్రిలోకీదృగు
     త్పలనీహారమయూఖరేఖయొ జగద్భాగ్యంబె యీరూపమై
     లలిఁ [1]గన్పట్టెనొకాక యింతులకు నీ లావణ్యమున్ గల్గునే?30
ఉ. డంబులు శైలశేఖరవిడంబులు దీనికుచంబు లెన్న నొ
     చ్చెంబులువల్కుఁ గుందనపుఁ జెంబుల, నిద్దపుటద్దముల్ గపో
     లంబులు, నీలమేఘపటలంబులు పెన్నెరు లౌర, యౌర యా
     యంబుజగంధి రత్న మిలయందలి సుందరులందు నెంచఁగన్.31

  1. గన్పట్టును