పుట:అహల్యాసంక్రందనము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వనిత. మహాకవి గిరీశచంద్రుడు, పూర్ణచంద్ర అనే నాటకం వ్రాశాడు. ఈ ఇతివృత్తం తీసుకుని — శ్యాలకోటను, శాలివాను డనే రాజు పరిపాలించుతున్నాడు. ఇచ్ఛా అనే ఆమె అతని మహిషి. పూర్ణుడు, కుమారుడు: కొంతకాలానికి రాజు, లూనా అనే మోసగత్తెను రాణిగా చేసుకుని, అసలుభార్యను విడిచిపెడతాడు. లూనా, ఆమెతండ్రి, జాంగలికుడైన జంబూ, వీళ్లు ఇద్దరూ చేరి, రాజ్యం అపహరించాలి ఏలాగైనా అని కుట్రలు చేస్తూంటారు. లూనా, పూర్ణుడు తనను బలాత్కరించాడని రాజుతో అబద్ధము చెప్పి, - కళ్లు పొడిపించి పాడునూతిలో కూలదోయిస్తుంది. ఇక రాజును కడతేర్చడానికి, విషం పానీయంలో కలిపి త్రాగించపోయే సమయానికి, గోరక్షనాథుడనే పరమశివరూపుడైన సిద్ధుడిఅనుగ్రహంవల్ల కళ్లు వచ్చి, సన్యాసి అయిపోయిన పూర్ణుడు అక్కడకు వచ్చి తండ్రిని కాపాడుతాడు. రాజు, లూనా చేసిన ద్రోహం అప్పటికి పూర్తిగా గుర్తించినా, ఆమె అదృష్టంవల్ల, పూర్ణుని బోధలలో రాజు మనసు కరిగి ఆమెను క్షమించుతాడు. వలచి, ఆతడే దైవమని నమ్ముకుని, సమాగమంకోసం వేచుకుని ఉన్న సుందరారాణి వలపును ధన్యం చేయకుండా, ఆమెకూ, తల్లికీ ఉపదేశం చేసి వారిఅనుజ్ఞ తీసుకుని పూర్ణుడు, జీవితం సన్యాసిగానే గడపుతాడు.

ఇది, గిరీశబాబు నాటకం కథాసంగ్రహం. సారంగధరుని కథ — కథలలో, నామములలో తేడాలతో హైందవసారస్వాతంలో విశేషంగా వ్యాపించి ఉన్నది.[1] వేంకటకృష్ణప్పనాయకుడు, చేమకూర వానిని

  1. నవనాథుల చర్యలకు ప్రధానరంగము మహారాష్ట్రదేశభాగముగా గనబడుచున్నది. శివపుత్రుడగు మీననాథుడు తండ్రివలన నధ్యాత్మవిద్యోపదేశమును బొంది, ధరణిపై జరియింపబొమ్మన, నాతనియాజ్ఞ వడసి, భూలోకమున సులలితయోగాబ్ధిచంద్రుడై, సకలదేశంబులును దిరిగి, మాళవదేశంబున, రాజమహేంద్ర నరేంద్రపరిపాలితంబగు మాంధాతపురంబున దొలుత విడిసిన వాడయ్యెను. ఈ సందర్భమున నీతడు తిరిగిన దేశములలో నాంధ్రదేశ మున్నట్లు చెప్పబడియుండలేదు. ఈతడు తొలుత వాస మేర్పఱచుకొన్నట్లుగా చెప్పబడినది, మాళవదేశమునందలి మాంధాతపురముగాని, యది యాంధ్రదేశమునం దేపట్టణమును గాదు.

    ఈ మాంధాతపురాధీశుండగు రాజమహేంద్రుని కుమారుడు, సారంగధరుడు. ఈతనికథయంతయు, నీమాలవదేశగతమగు మాంధాతపురముననే జరిగెననియు, తత్ పురసమీపమునందలి కొండలలో వాస మేర్పఱచుకొనియున్న మీననాథుని యనుగ్రహమువలననే యాతనికి గాలుసేతులు మరల గలుగగా, 'చౌరంగి' యనునామమున సిద్ధుడై యాతని శిష్యులలో నొకడయ్యెననియు, నీరాజమహేంద్రుని యాలమందలను గాచు గోరక్షకుడుగూడ, నాతని ముఖ్యశిష్యులలో నొకడై, యోగసామ్రాజ్యపట్టభద్రు డయ్యెననియు జెప్పబడినది....

    ......మీననాథుడు కాని, యాతని 'వెంటనంటియున్న సారంగధరుడుకాని, యాంధ్రదేశమునకు వచ్చినట్టులైన గనబడదు. ఇట్లీ నవనాథుల కధలన్నియు హిందూదేశమున బశ్చిమతీరభాగమునకు సంబంధించిన ట్లగపడుచుండగా నిందు ప్రధానపురుషులలో నొక్కడును మీననాథుని తొలిశిష్యుడును నగు సారంగధరుని గూర్చినకథ యాంధ్రదేశమునకును, నందు నాయకరత్నమునుబోని రాజమహేంద్రవరమునకును సంబంధించినదిగా జిరకాలమునుండి యీదేశమున దలంపబడుచుండుట యాశ్చర్యకరము కాకమానదు ...

    సారంగధరుని గూర్చిన కథలు:- మత్స్యేంద్రనాథుని యనుగ్రహమువలన సిద్దుడై చౌరంగి యనుపేరు వహించిన యీసారంగధరునికథ భిన్నరీతుల గానవచ్చుచున్నది. మహారాష్ట్రభాషలోని నవనాథచరిత్రనుబట్టి రచింపబడిన తెలుగుగ్రంథములో, నీచౌరంగి పేరు కృష్ణాగరుడని కలదు. ఈతడు కౌండిన్యనగరాధిపుడగు శశాంగనృపాలుని పుత్రుడు. ఈతని పట్టమహిషి మందాకిని. వీరికి చిరకాలము సంతానము లేకుండుటచే వీరు మాధవుని ధ్యానించి, సంగమేశ్వరమున నాతని బూజింప, నాప్రదేశమున నొకనాడు రాజు అర్ఘ్యంబిడుసమయంబున శివవీర్యబలంబుచే నాతని యంజలీభాగంబున నర్భకు డుద్భవించెను. అతని దెచ్చి రాజు భార్యకొసగి కృష్ణాగరుడని నామకరణంబొనర్చెను. పిదప నీతనికి వివాహము జేయ, రాజు ప్రయత్నము చేయుసమయంబున మందాకినీదేవి మరణించుటయు, రాజు, కొమరునికై యుద్దేశించిన చిత్రకూటనగరాధిపుని కుమార్తెయగు భుజావంతిని దానె వివాహమయ్యెను. ఈమె యొకప్పుడు నవయౌవనుడగు కృష్ణాగరుని జూచి మోహించి, రాజు మృగయావినోదంబున నరణ్యంబున కేగినతఱి, యొకచెలికత్తెను బంపి యాతనిం బిలిపించి, తనచిత్తంబునగల చిత్తజునితాపమును వెలిబెట్ట, నాత డతికృద్ధుడై యామెప్రార్థనమును దిరస్కరించి, తనయింటికిబోయెను. పిదప, నీవిషయము కృష్ణాగరుడు తండ్రి కెఱిగించునేమో యనుభయముచే, బరితపించుచుండు సమయంబున దనచెలికత్తెచేసిన దుర్బోధనలచే, నేరంబు కుమారునిపై వైచి, రాజునకు గోపము పుట్టించి, కరపాదఖండనము జేయించెను. అప్పుడా యూర ద్రిమ్మరుచున్న గోరక్షనాథు డీవిషయము మత్స్యనాథునికి తెలిపి, కృష్ణాగరుడు శివవీర్యోద్భవు డగుట యెఱింగి, చతురంగపీఠముపై కరచరణంబులు ఖండింపబడినకతంబున నాతనికి చౌరంగనాథ నామం బిడి తండ్రి కెఱిగించి వానిం దోడ్కొని, బదరికాశ్రమంబునకు జని, యచ్చట ఘోరతపోనియమంబున, గరచరణంబులతో గూడ, మహాసిద్ధుల నాతడు బడయునట్లు చేసి, యనుగ్రహించెను.

    చేమకూర వేంకటకవి సారంగధరచరిత్రకు బీఠిక వ్రాయుచు నందాకథకు మూల మనదగిన చౌరంగికథ నవనాథచరిత్రములం దిట్లు కలదని, యీక్రింది కథను వేదము వేంకటరాయశాస్త్రులుగారు ఇచ్చియున్నారు.

    రుద్రపురమున భులేశ్వరుడను రాజు కలడు, అతనికి, చంద్రావతి, శోభావతి యను నిద్దఱుభార్యలు. శోభావతి, సవతిని వేలార్చుటకై, యామెపై ఱంకులు మోపి, గర్భిణీయగు నామె నరణ్యమునకు వెడలగొట్టించెను. ఒకశివాలయముకడ నొకగంధర్వకన్య యీమెకు మత్స్యేంద్రవ్రత ముపదేశించెను. చంద్రావతియు, మునుల యాశ్రమమున నొకసుతుని గని, చంద్రశేఖరుడని మునులచే నామకరణము చేయబడిన యాతనికి మత్స్యేంద్రోప్రాప్తి నుపదేశించెను. ఒకప్పుడు, భువలేశ్వరుడు, యజ్ఞము చేయుచుండగా, మునీశ్వరులతో గూడి యీకుమారు డచ్చటకు బోవుటయు, యజ్ఞభూమికడ మునిశిష్యులతో బంతులాడుచున్న యీకుమారుని, శోభావతి చూసి మోహించి, యాతని బంతి తనచేటికచే చెప్పించుకొనెను. బంతియడుగబోయిన చంద్రశేఖరునికిని శోభావతికిని, పావురమడుగబోయిన సారంగధరునికి చిత్రాంగికి జరిగినవృత్తమే జరిగినది. శోభావతీప్రేరణంబున రాజు చంద్రశేఖరుని కాలుసేతులు తలారులచే దఱిగించెను. మత్స్యేంద్రనాథస్మరణముచే నాతడు కాలుసేతులు మరల బడసి తల్లియొద్దకు బోయెను. రాజు తథ్యమును దెలిసికొని శోకింప, మత్స్యేంద్రనాథు డాతనిచే బ్రాయశ్చిత్తముగా నొకశివాలయము నిర్మింపజేసెను. అదియే బదరికాశ్రమమున భులేశ్వర మనుపేరనున్న దేవాలయమట.

    వీనిని బోలిన కథ యొకటి కొంతభేదముతో గన్నడభాషలో గూడ, 'కుమారరాముని కథ' యను పేరుతో బొడసూపుతున్నది.

    — పదునాల్గవశతాబ్దిని కంపిలిరాయుడను రాజొకడు హంపీసమీపమున గల కంపిలినగరము పాలించుచుండెను. ఈతనికి గుమారరాముడను కుమారుడొకడు కలడు. ఈతడు మహాశూరుడు, బాహుబలపరాక్రమశాలి. దిగ్విజయార్ధము బయలుదేరి, యనేకులగు రాజులనోడించి, తండ్రికి గప్పము గట్టునట్లు చేసెను...

    ఒకనాడు కంపిలిరాయడు వేటకై యరణ్యమునకు బోయినసమయంబున కుమారరాముడు స్నేహితులతో జెండాట నాడుచుండ బంతి, విధివశమున రాజు రెండవభార్యయగు రత్నాజి మేడపై బడెనట. దానిని తెచ్చుకొనుట కీత డచటికి పోయి యామె నడుగగా, నామె యీతనిని మోహించి, క్రీడాగృహమునకు రమ్మనుటయు, నాత డాపాపకార్యమున కంగీకరింపక, విదిలించుకొని పాఱిపోయేను. రా జరణ్యమునుండి యింటికి రాగానే, రత్నాజి, కుమారరాముకు తండ్రి యింటలేనిసమయముజూచి, తనమేడకు వచ్చి తన్ను బలాత్కరించెనని కొండెములు చెప్పగా, రా జామె మాటలను నమ్మి కుమారునికి మరణదండనము విధించెను. మంత్రియగు బైచప్ప రత్నాజి చేసిన మోసమును దెలిసికొని, కుమారు నొకపాతాళగృహమున దాచి, యాతని వధించితినని రాజుతో జెప్పి, యాతనిని సమ్మతింపజేసెను. రా జన్యాయముగా గుమారుని చంపించెనన్న వార్త లోకమున వ్యాపించెను. ఈసందర్భమును, ఢిల్లీసుల్తాన్ దెలిసికొని, కంపిలిరాజ్యమును స్వాధీనము చేసికొనుటకై కొంతసైన్యముతో బహదూర్ ఖానుని బంపి, యాత డద్దానిని సాధింపలేకపోగా, తానె స్వయముగా వచ్చి కోటను ముట్టడించెను. అప్పుడు కుమారరాముడు జీవించియున్నచో, శత్రువును సులభముగా పాఱద్రోలి కోటను రక్షించియుండెడివాడని, జనులందరు రాజును నిందింపసాగిరి. ఆసమయమున బైచప్పమంత్రి భూగృహమునుండి కుమారరాముని దీసికొనివచ్చి, యాతని ముందిడుకొని, కోటవాకిలి దెఱుచుటయు నాకుమారరాముడు శత్రుసేనలను జెండాడి, యావలికి బాఱద్రోలెను. కాని, ఢిల్లీసుల్తాన్ సేన లపారముగా నుండుటచే, వారితో బోరాడుచూ, కుమారరాముడు రణరంగమున బ్రాణముల విడువవలసినవాడయ్యెనట.

    .. ఢిల్లీసుల్తాన్ గా నున్న తుగ్లక్ కంపిలిరాయనిపై దండెత్తి యానగరమును స్వాధీనపఱుచుకొనినట్లు, చారిత్రకనిదర్శనములు గలవు. రాజమహేంద్రవరమందు వలెనె అచ్చటను, గొన్నిస్థలములను ‘చిత్రాంగిమేడ, రత్నాంగిమేడ యున్నస్థలము' అని చెప్పి చూపుచుండువాడుకయు గలదట...

    మఱియు, బౌద్ధజాతకములలో గూడ, వీనిని బోలిన కథయే గలదట—

    [- గౌరన ద్విపద నవనాథచరిత్ర పీఠికలో, కోరాడ రామకృష్ణయ్యగారు]