ఉపోద్ఘాతము
యోగభ్యాసము భారతీయుల దగు పరమగోప్యమగు సర్వస్వము, యోగీశ్వరు లాంతరదృష్టిచే నపూర్వములగు విశేషములు నెన్నింటినో కనుగొని యట్టి జ్ఞానమునకు కారణమగు యోగమును గుఱించి బహుముఖముల కొనియాడుటయే గాక వివరముగ తెలిపియున్నారు. యోగవిషయము విపులముగ నితర గ్రంథములందు (హఠ యోగాదు లందు) కలదు. ఆ విషయములనే సంగ్రహముగ నీ చిన్న పొ త్తమున కూర్పబడి యుండుటచే నీ గ్రంథమునకు అష్టాంగయోగసారమను పేరెంతయుఁ దగియున్నది.
భారత దేశము తూరుపు వెలుగై దేశదేశములు కీర్తి చంద్రికలఁ బర్వఁ జేసెనను ప్రశస్తినందుటకు మనదేశమందలి యోగీశ్వరుల యద్వితీయ యోగసాధనమే ప్రబలకారణము. ఆధ్యాత్మిక విద్యయందు ముందంజ వేసి యాత్మానుభూతినే పరమలక్ష్యముగ గ్రహించిన మనభారతీయ యోగీశ్వరులు యోగసిద్ధులగు నప్లైశ్వర్యముల నంతగా గణింపక తత్త్వదృష్టి నే కాలముగడుపుచు యోగభ్యాసము వలన సమస్తభోగముల ననుభవించు చుండిరి. తత్త్వాన్వేషణమునకు యోగాభ్యాసమత్యావశ్యకము. అంతియ కాదు. మన యార్యవిజ్ఞాన సౌధమున కంతయు యోగసాధనము ప్రథమ సోపానము. భారతీయల యోగసాధనము అంతరదృష్టిని వృద్ధి జెందినది.
నేటికాలమున నవనాగరక దేశము అని ప్రసిద్ధిచెందిన అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్సు, జర్మనీ మొదలగు పాశ్చాత్య దేశములు దూర దర్శనము దూరశ్రవణము, జలాంతర్గమనము వ్యోమయానము మున్నగు వానిని సాధించితిమని గర్వించుచున్నారు. వీని నెల్ల సాధించుటకు బాహ్యములగు యంత్రము ల త్యావశ్యకములుగ నున్నవి. బాహ్యమగు ప్రకృతి