పుట:అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టాంగయోగసారము

19

లయించు. దశమంబైన మేఘనాదంబున శ్రవణసహితంబుగా మనంబు నునిచి నిర్వ్యాపారంబుగా నిలిపి బాహ్యంబు మఱిచెనేని యమ్మానసంబుతోడఁ బవనం బందు లీనంబగు. ఇది నాదలీనానందకరంబైన లయయోగంబగు ఇంక హఠయోగం బెట్టిదనిన.

హఠయోగవిధానము

రాజపరిపాలితంబై న సుభిక్షరాజ్యమందు హఠయోగమంటపంబు నిర్మించి, యందుండి యభ్యాసంబు జేయవలయు నదెట్లన్నను సుగంధపుష్పఫలభరితంబైన వనమధ్యంబున గాలి చొరకుండ సూక్ష్మద్వారకంబైన మంటపంబు నిర్మించి దినదినంబును గోమయంబున శుద్ధి జేయింపుచు నందు వసియించి యతిశయించిన యుప్పు, పులుసు, కారములున్ను చేదు, వగరువస్తువులును, పిదప తిలతైలంబును, నజాది మాంసమద్యమీనంబులును, రేగుపండ్లున్ను, మిక్కిలి పసురాకుకూరలున్ను దధితక్రకుళుత్థములును, ఇంగువ లశునంబు మొదలైన తామసమందాహారముల విడిచి, యవ గోధుమ శాల్యన్నంబులున్ను, ముద్గసూపమున్ను, గోఘృతమున్ను, పొళ్ళకాయలు, పొన్నగంటి, చక్రవర్తి కూరలున్ను, శర్కర, ఖండశర్కర మొదలైన సాత్త్వికాహారముల గ్రహింపవలయు. తా భుజింపఁదగిన యన్నంబు నాల్గుపాళ్ళు జేసి యొకపాలు విడచి మూడుపా ళ్ళీశ్వరప్రీతిగా భుజింపుచు త్రిఫలంబు లౌషధంబుగా గ్రహింపుచు ప్రాతఃస్నానోపవాసవ్రత స్త్రీసాంగత్యాది దేహప్రయాసంబులు విడచి యనలార్కోదితంబులైన కాకలం బడక, శీతవాతంబులం దుండక యోగషట్కర్మంబు లాచరింపవలయు నవి యెవ్వియనిన.

యోగషట్కర్మములు

ధౌతికర్మ, వస్తికర్మ, నేతికర్మ, త్రాటకకర్మ, నౌళికర్మ, కపాలభాతికర్మంబులన నాఱు గలవు. అందు ధౌతికర్మం బెట్లనిన