పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విద్య-మాధ్యమం

మూలం : రవీంద్రనాథ్‌ ఠాగూర్‌


ఆంగ్ల విద్య

అత్యవసరం, అనివార్యం అయినదానికే పరిమితమవ్వడం మనిషి కర్తవ్యం కాదు. మనం ఒక హద్దువరకు అవసరాల సంకెళ్ళలో బందిలమై వుంటాం. కొంతవరకు స్వతంత్రంగానూ వుంటాం. మన శరీరం మూడు మూరల పొడవుగదా అని మూడున్నర మూరల యింటిని నిర్మిస్తే మనకి గడవదు. స్వేచ్చగా అటూ యిటూ తిరగడానికి పొడవు వెడల్చుగల విశాలమైన స్థలం కావాలి. అలా కాకపోతే మన ఆనందం, ఆరోగ్యాలకు అంతరాయం కలగవచ్చు. మనం స్వస్టతతో, ప్రసన్నంగా వుండలేం. విద్య విషయంలో కూడా అదే చెప్పవచ్చు. కేవలం అవసరాల మేరకు బాలబాలికలను బందీలుగా చేస్తే వారి మానసిక సాధన జరగదు. అవశ్యకమైన విద్యతోపాటు అంతగా ప్రయోజనంలేని అధ్యయన కార్యక్రమానికి మించి పాఠాలు భిన్న విషయాలు నేర్చకపోతే వారు పూర్తి మనుషులు కాలేరు. వయస్సులో పెద్దవారయినా వారు పిల్లలుగానే వుండిపోతారు.

కానీ దురదృష్టవశాత్తు మనవద్ద సమయం లేదు. సాధ్యమైనంత తొందరగా విదేశీ భాషలు నేర్చుకొని వాటితో యోగ్యతపరీక్షలో ఉత్తీర్ణత పొంది పనిముగించుకోవలసి వస్తోంది. పాఠాలు కంఠస్థం చేయడంలో యితరులకన్నా వెనక బడకుండా వుండాలని, చిన్నతనం నుండి గుర్రపుపందాలలో గుర్రాల మాదిరి పరిగెడుతుంటారు. మరింకే విషయానికి మనకు సమయం దొరకటం లేదు. అందువల్ల పిల్లల చేతుల్లో పాఠ్యపుస్తకాలు తప్ప మరే యితర మనోల్లాసకరమైన, ఉపయోగకరమైన పుస్తకాలు కనిపిస్తే వెంటనే వాటిని లాక్కొంటారు.

అసలు ఉపయోగకరమైన పుస్తకాలు ఎక్కడ అఖిస్తున్నాయి? మొదటగా మన భాషల్లో అటువంటి పుస్తకాలు లేవు. ఒకవేళ కాద్దోగొప్పోవున్నా అవి వున్నా లేకపోయినా ఒకటే. ఎందువల్లనంటే మన పిల్లలకు మాతృభాష నేర్పే విధానం వల్ల వాళ్ళు యింటి దగ్గర స్వతంత్రంగా ఏ పుస్తకమైనా చదివి ఆనందించగల స్థితిలో లేరు. ఆంగ్లంలో పిల్లల పుస్తకాలు చదివి అర్ధం చేసుకునేటంత ఆంగ్లభాషా జ్ఞానం కూడా వీరికి లేదు. పిల్లల కోనం రాసే పుస్తకాలలో ఉపయోగించే ఆంగ్లభాషలో ఆ భాషకు సహజమైన సామెతలు, పదబంధాలు, మాట్లాడే ఆంగ్లం బి. ఎ, యమ్‌. ఏ. లకు కూడా అర్ధం కానట్టు వుంటుంది.

వాస్తవానికి పరమాత్మ మన బిడ్డల నుదుట ఆంగ్లవర్ణమాల, పదకోశం, భూగోళం తప్ప మరేదీ లిఖించలేదు. వీరివంటి అభాగ్యులు ప్రపంచంలో మరెక్కడా వుండరు. యితర దేశాల పిల్లలు తమ వచ్చీరానీ దంతాలతో చెరకు ముక్కల్ని కొరికి రసాస్వాదన చేస్తూ ఉండే వయస్సులో మన పిల్లలు పాఠశాలల్లో బెంచీలమీద కూర్చొని తమ బలహీనమైన కాళ్ళను ఊపుతూ గురువుగారి కటువైన తిట్లు తప్ప మరేవిధమైన మనోరంజక మసాలా లేనీ జెత్తపు దెబ్బలు తింటూ వుంటారు.

తత్ఫలితంగా శారీరక, మానసిక ఆహారాన్ని జీర్ణం చేసుకునే శక్తి తగ్గిపోతుంది. సరియైన భోజనం, మనస్సుకు నచ్చిన ఆట పాటలు లేక పిల్లల శరీరాలు దుర్చలంగా, పీలగా తయారవడమే కాక మనస్సులు కూడా బలహీనమై పోతున్నాయి. వారిలో ఆలోచనలు పుట్టి పెరిగేందుకు తగిన శక్తి పెంపొందటం లేదు. యీ రకమైన బలహీనత వల్ల బి.ఏ., యమ్‌.ఏ. లాంటి డిగ్రీలు పొందినా, పుస్తకాల గుట్టలు నమిలి మింగినా మన బుద్దిమాత్రం వికసించటం లేదు. బుద్ధి పరిపక్వం చెందటం లేదు! ఏ విషయాన్నయినా సమగ్రంగా అర్ధం చేసుకుని, స్వతంత్రంగా దాని గురించి చెప్పగలిగే యోగ్యత లేకుండా పోతోంది. మన నమ్మకాలు, మన అభిప్రాయాలు, మన మాట - నడత, కట్టు - బొట్టు, ఆలోచనలు మొదలైనవేవీ స్వతంత్రమైనవిగా, పద్ధతి ప్రకారంగా వుండడం లేదు. అందుకనే మన మాన సిక దౌర్చల్యాన్ని బాహ్వాడంబరంతో, ప్రదర్శనలతో, కుప్పిగంతులతో కప్పిపెట్టటానికి, దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.

చిన్నప్పటినుండీ విద్యాభ్యాసానికీ, ప్రసన్నతకూ, ఆనందానికి సంబంధం లేకపోవటమే దీనికి ముఖ్యకారణం. ఎంత అవసరమో అంతే కంఠస్థం చేస్తున్నాం. 6వా అభ్యాసం వల్ల మన పని జరుగుతోంది. కాని బుద్ధి వికసించటం లేదు. గాలి తింటే కడుపునిండదు. అన్నం తింటే కడుపు నిండుతుంది, కానీ భోజనం చక్కగా అరగాలంటే, శఠీరంలోకి గ్రహించుకోవాలంటే గాలికూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా పాఠ్య పుస్తకాలను, వాటి అర్ధాన్ని గ్రహించాలంటే యితర మనోరంజక సామాగ్రి కూడా ఎంతైనా అవసరం. మానసిక ఉల్లాసంతో చదివిన చదువువల్ల చదివేశక్తి వికసిస్తూ పోతుంది. మన ఆలోచన్నా అవగాహనా కూడా చక్కగా పెంపొందుతాయి. మానసిక శక్తులను నాశనం చేసే ఆనంద రహితమైన విద్య అనే పంజరం నుండి మన పిల్లలను ఎలా విముక్తులను చేయాలో ఎంత ఆలోచించినా మనకి తెలియటం లేదు. అంగ్లభాష మన భాష కాదు. విదేశీయులది. మన భాషాపదాలు

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఫిబ్రవరి-2021

13