పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నను చైత్యక, పూర్వశైల, అపరశైల, రాజగిరిక, సిద్ధాంతిక నికాయములు కేవలము తెలుఁగు దేశపు తెగలని తెలుఁగు దేశపు ప్రాకృత శాసనములందు వీ రుదాహృతు లగుటవలన నిశ్చయింప వచ్చును. వీరిలోఁ గడపటి నాలుగు తెగలవారు బౌద్ధ గ్రంథములందు అంధకులు అను పేరఁ బేర్కొనఁబడిరి. అంధకులే ఆంధ్రులు.

క్రీస్త్వబ్దమున కించుక పూర్వమునఁ గూడ ఆంధ్ర దేశమునందలి యీ ధాన్యకటక ప్రాంతము బౌద్ధమతమునకు పంట పొలమయి, బౌద్ధులకుఁ బట్టు గొమ్మగ నుండె నను టకు సింహళద్వీప చరిత్రమే యాధారము. బౌద్ధ వాఙ్మయ మున 'తాంబపణ్ణి' యనఁ బరఁగిన సింహళద్వీపమును క్రీ స్త్వబ్దమునకు రెండువందల సంవత్సరములకుఁ బూర్వమున పాలించుచుండిన 'దుట్ఠగామణి' యను ప్రభువు అనురాధ పురమున 'మహాథూపము' (ర్వాన్ వెల్లి మహాస్తూపము)ను నిర్మించుచుండిన సందర్భమున హిందూదేశమునందలి వేఱు వేఱు ప్రాంతములనుండి అర్హతులు, ఆచార్యులు వేలకొలఁది బౌద్ధసాంఘికులతో నచ్చటి కరిగిరఁట. ఇట్లు వెళ్లిన వారిలో అర్హతుఁడయిన మహాదేవుఁ డొక్కఁడు. ఇతఁడు 'పల్లవ భొగ్గ'ముననుండి నాలుగులక్షల యఱువదివేల భిక్షువు లను వెంట నిడికొని వెళ్లెనఁట. భిక్షువుల సంఖ్య యతిశ