పుట:అనుభవసారము (పాల్కుఱికి సోమనాథుడు).PDF/2

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ

అనుభవసారము

ఉ.

శ్రీగురులింగజంగమవిశిష్ట[1]విభేదసదన్వయంబులన్
శ్రీగురులింగజంగమముఁ జెప్పఁ ద్రిమూర్తి [2]నిరూఢమై చనున్
శ్రీగురులింగజంగమవిశేషము లేకముగాఁ దలంచి యా
శ్రీగురులింగజంగమవశీ[3]కృత మౌమదిఁ గొల్చి సమ్మతిన్.

1


క.

పరమపరుం బరమేశ్వరుఁ
బరమానందస్వభావు భక్తి నుతింతున్
గురులింగము హరలింగముఁ
జరలింగము శాంత్యతీతు శంభున్ శరణున్.

2


క.

భవనాశుఁ బాపనాశను
వివిధేంద్రియవిషయనాశు వినుతింతు సదా
శివు శివదేవు శివాత్మకుఁ
బ్రవిమలవిజ్ఞాను భర్గు భక్తనిధానున్.

3


క.

పశుపాశవినిర్ముక్తునిఁ
బశుపాశపతిన్ భజింతుఁ బశుపాశవిసృ
ష్టశరీరు విముక్తి[4]ప్రద
కుశలున్ విశ్వేశు విమలు గురు హరు శరణున్.

4
  1. మహామహిమంబు వేఁడెదన్
  2. నిగూఢ
  3. కృతమై
  4. ప్రదు