పుట:అనిరుద్ధచరిత్రము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కముహూర్తం బిదియంచుఁ దెల్పుచు మహాకందర్పమౌహూర్తికా
సమహస్తాయసదండభిద్భవఘణాంచల్లోహయంత్రాకృతిన్.

78


ఉ.

కాంచనగాత్రిముద్దువగఁ గాంచి కవుంగిట గుబ్బ లంటఁ గీ
లించి సుధాధరంబుఁ గబళించి హసించి కపోలపాళిఁ జుం
బించి చమత్కరించి వలపించి కళ ల్గరఁగించి మించి సొ
క్కించి కడుస్సుఖించి కిలికించితకేళి రమించె వేడుకన్.

79


సీ.

సురుచిరాంబరబంధకరణంబు భేదించి వ్రీడాబలంబుల విఱుగఁదోలి
ఘనకుచశైలదుర్గముల లగ్గలు పట్టి జఘనవసుంధరాచక్ర మాఁగి
యూరూరుసంయుక్తతోరణంబులు గట్టి చతురుఁడై మధ్యదేశంబుఁ బొదివి
యంగాంగములు భుజాహంకృతిలోఁ గొని యౌవనభండార మాక్రమించి
సురతసంగతి జయలక్ష్మిసౌరిది గాంచి, తరుణికౌఁగిలి నిజరాజధాని గాఁగ
నెలమి మన్మథసామ్రాజ్య మేలుచుండె, సిద్ధసంకల్పుఁ డయ్యనిరుద్ధవిభుఁడు.

80


ఉ.

చంచలలోచన న్సురతసౌఖ్యమున న్గరఁగించె నంచు వ
ర్ణించఁగ నేటికి న్వలపుఁ బేరురు లొడ్డి జగంబువారి మొ
గ్గించెడివాని పెద్దకొడు కేయఁట రూపవిలాసవైఖరి
న్మించినయింతికి న్వలవనేరఁడొ తా వలపింపనేరఁడో.

81


సీ.

జలచరనేత్ర కన్నులవెరపింపుకే యెత్తినబిరుదాంక మేటఁ గలిపి
కార్ముకభ్రూయుగకనుబొమ్మవంపుకే పట్టినవిల్లు నిష్ఫలము చేసి
లలితశుకాలాపపలుకుజంకెనలకే మావుల నందంద పోవఁద్రోలి
చెలఁగు పల్లవపాణిచేగద్దికలకె కృపాణంబు లడవులపాలు చేసి
ప్రియుని సాహాయ్యమున విజృంభిచుచున్న, వెలఁదితో విగ్రహింపనవేళ యనుచు
సమరరంగప్రచారంబు సన్న్యసించి, యంగజుఁడు కార్య మెఱిఁగి సమాశ్రయించె.

82


చ.

వలచినపొందులై మనసు వచ్చిన చక్కఁదనంబులై భ్రమల్
కొలిపెడియౌవనంబు లయి కూరుము లద్దిన క్రొత్తలై కళల్
దెలిసిన నేర్పులై కొదవలేక రమింపఁగఁ గల్గినట్టి యా
చెలువుఁడు నింతియుం దొలుతఁ జేసిన పుణ్యఫలంబు లెట్టివో.

83


గీ.

అంత నానవోఢ యానందమునఁ దను, సురతమున జయింపఁ బరిభవంబు
నొందియున్నయట్టికందర్పువదనంబు, తెల్లవారినట్లు తెల్లవాఱె.

84


ఉ.

చిందఱవందఱై యసురసేనలు డెందమున న్భయాకులం
బంది పతంగపుంగవశతాంగరథాంగమహోగ్రధాటి నం
దంద యడంగినట్టు లుదయార్కునిరాక నడంగెఁ జీఁకటుల్
గొందులసందులన్ గుహలగుట్టలఁబుట్టలచాటుమాటులన్.

85