పుట:అనిరుద్ధచరిత్రము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బోవుచునుండె నాకొఱకుఁ బోయినకార్యమునిర్వహింప రో
దేవతలార నాదిగులు దీఱఁగ మీకు నమస్కరించెదన్.

49


వ.

అని తలంచుచు.

50


తే.

తరుణి యిబ్భంగిఁ గుసుమకోదండచండ, కాండనిర్భిన్నహృదయయై కరుగుచున్న
యవసరంబు రతీమనోహరకుమారుఁ దెచ్చి పానుపుపై నుంచె మచ్చెకంటి.

51


వ.

అప్పుడు.

52


చ.

హృదయము ఝల్లుఝల్లుమన నెంతయు విస్మయమంది చూచి పెం
పొదవినభ్రాంతిచేత నిదియుం గల గాదుగదా యటంచు నె
మ్మదిఁ దలపోయుఁ గ్రూరుఁడగు మారుఁడు చేసినయింద్రజాల మో
యిది యని యంచుఁ బర్వ రజనీందుకళానన మోహితాత్మయై.

53


వ.

అంత.

54


క.

తెలివొంది చిత్రరేఖా, కలవాణిం గౌఁగిలించి కన్నుల హర్షా
శ్రులు జడిగురియఁగఁ దనుపునఁ, బులుకాంకురము ల్జనింపఁ బొంగుచుఁ బలికెన్.

55


ఉ.

ఈసుకుమారమూర్తి నిపు డీడకుఁ దెచ్చితి ప్రాణదానముం
జేసితి నీకు మే ల్మరలఁ జేయఁగనేర నమస్కరించెదన్
నీసుగుణంబు నీనెనరు నీయుపకారము ముజ్జగంబులన్
వాసికి నెక్కి నీకథలు వర్ణితమయ్యెడుఁగాక కోమలీ.

56


క.

అని పలుకుచున్న బాలిక, వినయోక్తుల గారవించి వేడుకతోడం
జనియె నిజమందిరమునకు, వనజానన యుండె నిచటివాంఛలు మీఱన్.

57


ఉ.

లేచుట యెప్పుడో నిదుర లేచినపిమ్మట నన్నుఁ గన్నులం
జూచి మనోనురాగమున సొక్కి కవుంగిట గౌరవింపఁ గాఁ
జూచునె లేక నామమత సుద్ది యెఱుంగమిఁజేసి వింతయై
తోఁచుచునుండునో యితనితో నపు డేమని పల్కుదాననో.

58


మ.

అని చింతింపఁగ నిద్ర మేల్కని యతం డాకర్ణవిశ్రాంతమో
హననేత్రాంబుజము ల్కనీనికలు చాయ ల్దేరఁగా విచ్చిచూ
చినయాచూపు మనంబున న్గిదలెఁ గించిన్మధ్యకు న్భావభూ
ధనురుద్యత్కటకాముఖాంకకరసంధానప్రయోగాస్త్రమై.

59


ఉ.

నాథుసుదర్శనంబువలన న్మదనగ్రహమోక్ష మయ్యె బిం
బాధరకున్ సుదర్శనమహామహిమం బిటువంటిదేకదా
యీధరఁ దత్ప్రయోగమున నెట్లు గ్రహంబులు నిల్వ నేర్చుఁ ద
త్సాధకు లైనమాంత్రికులు సార మెఱుంగుదు రప్పుడిప్పుడున్.

60