పుట:అనిరుద్ధచరిత్రము.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సాధనసమగ్రజాగ్రద్వీరభటసమూహసమావృత్తంబును, రుక్మిణీసత్యభామాప్రము
ఖాష్టమహిషీషోడశసహస్రసుందరీసందోహమందిరామందసుందరంబును, బద్మరాగ
వజ్రవైడూర్యగోమేధికపుష్యరాజమరకతనీలముక్తాప్రవాళఖచితస్తంభకుడ్యవా
తాయనవితర్దిప్రదేశంబును, బ్రద్యుమ్నసాంబసంకర్షణసుధేష్టాదికుమారవిహారసౌధ
యూధాభిరామంబును, సకలసౌభాగ్యలక్ష్మీనివాసంబును నగు గోపికావల్లభుమం
దిరంబునందు శృంగాగంబునకు సారంబును, విలాసంబునకు వాసంబును, భోగంబునకు
యోగంబును, భాగ్యంబునకు యోగ్యంబును, స్తోత్రంబునకుఁ బాత్రంబునునై, సహస్ర
భానుప్రభాభాసమానంబగు ననిరుద్ధకేళీసౌధంబులోపలం బ్రవేశించి యందు.

41


క.

అలరుక్మలోచనాకువ, కలశయుగాన్వితనిరూఢగాఢాశ్లేషో
జ్జ్వలపులకాంకితదానవ, సలలితసురతప్రసంగజనితశ్రముఁడై.

42


సీ.

బంగారుదివియకంబములపై నిరువంక దీపికాకాంతులు తేజరిల్లు
నమలమాణిక్యపర్యంకభాగంబునఁ బరువంపుజాజిపూఁబాన్పుమీఁద
నొకకేలు తలక్రింద నునిచి రెండవకరం బూరువుపై జాచి యొత్తగిల్లి
పరుపుపై ముత్యాలసరులు కుప్పవడంగఁ దెలిదమ్మితళుకుకన్నులు మొగిడ్చి
పూఁతనెత్తావి గమ్మునఁ బొలయుచుండ, నూర్పు లొక్కింతముకురులై యుప్పతిల్ల
నిదురపరవశమున నున్న యదుకుమారుఁ, గాంచెఁ దనగొప్పకన్నులకఱవు దీఱ.

43


ఉ.

మీసముతీరుఁ జూచి జిగిమేనిపటుత్వముఁ జూచి మోములో
హాసముఁ జూచి చేతులయొయారముఁ జూచి మనోజ్ఞరూపరే
ఖాసమలీలఁ జూచి యహహా యనుచుం దల యూచి ముందు దా
వ్రాసినభావ మెంచి తలవంచుకొనెన్ జలజాక్షి సిగ్గునన్.

44


వ.

తదనంతరంబ.

45


మ.

తనసమ్మోహనవిద్యచే జనుల నిద్రామగ్నులం జేసి య
య్యనిరుద్ధుం గొని ఖేచరత్వమున నుద్యద్వేగయై యేగి బా
ణనిలింపాహితరాజధానియగు శోణాఖ్యం బ్రవేశించి య
వ్వనజాతాక్షి యుషాలతాంగి సుషమావత్సౌధముం జేరఁగన్.

46


వ.

వచ్చుచున్న సమయంబున.

47


ఉ.

ఎప్పుడు వచ్చునో కువలయేక్షణ యాతనిఁ దోడుకొంచు నే
నెప్పుడు చూతునో సదమలేందునిభంబగు వానిమోము నా
కెప్పుడు గల్గునో యతని నింపుగఁ గూడెడు భాగ్యమంచు నా
కప్పురగంధి తాపమునఁ గంటికి నిద్దుర లేక వేఁగుచున్.

48


ఉ.

నావెత చూడలేక కరుణాపరురాలగు చిత్రరేఖ దా
నావిభుఁ దెత్తునంచు నకటా పరభూమికి సాహసంబునం