పుట:అనిరుద్ధచరిత్రము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తులలేనిమల్లెమొగ్గలు దంతములు గాఁగ సుమిళిందమాలికల్ చూపు గాఁగఁ
బల్లవితతమాలపాదపచ్ఛాయలు, సరసమైనవేణీభరము గాఁగ
నెన్నఁదగియె నప్పు డిందుబింబానన, యౌవనంబుఁ బోలి యవ్వనంబు.

45


సీ.

భూరుహావళుల శృంగారభావములు లోచనపఙ్క్తులకు వికాసంబు నెఱపఁ
గలకంఠశుకశారికాకలరావంబు రహి మించి కర్ణపర్వంబు సేయ
లలితచాంపేయపాటలకుందవాసనల్ నాసికంబునకు నానంద మొసఁగఁ
నమృతోపమానంబులగు ఫలరసములు వెలయ జిహ్వలకును విందు లొసఁగ
గమ్మతావులు పయిపయిఁ గ్రమ్మ విసరు, చలువతెమ్మెర మేనులయలఁతఁ దీర్ప
సొరిది పంచేంద్రియములకు సుఖము గాఁగ, వనవిహారంబు సలిపి రవ్వనజముఖులు.

46


సీ.

అధరబింబాపేక్ష నరుదెంచు చిలుక లద్దపుఁజెక్కులజవాదితావులకును
వదనాంబుజములకై కదియు భృంగంబు లుత్తంసచంపకసుగంధంబులకును
భుజమృణాళాస క్తిఁ బొదువు రథాంగముల్ సరసమందస్మేరచంద్రికలకు
హస్తపల్లవములకై డాయు కోయిఁలల్ ముద్రికాంకితరామమూర్తులకును
జకితగతిఁ జెంది చెదరఁగఁ జంద్రముఖులు, చతురతఁ జరించి రప్పుడు చారుచరణ
చలితచామీకరాంగదఝణఝణంఝ, ణంఝణధ్వని చెవుల కానంద మొసఁగ.

47


వ.

మఱియు నమ్మదవతీతిలకంబు కదంబకాంచనకదలీక్రముకకరవీరఖర్జూరనారికేళ
తమాలతిలకకురంటకమాధవీప్రముఖతరుషండంబులవలనం దిరుగుచు, వనమయూరం
బుల వెంబడి నరుగుచు, మహీరుహంబుల నామూలాగ్రంబుగాఁ బెనఁచి యల్లికొనియు
నేలాలవంగద్రాక్షాదిలతావితానడోలాజాలంబులఁ నుయ్యలలూఁగుచు, బొదరిండ్లఁ
డాఁగుచు, నసమంబులగు కుసుమరసవిసరంబులు వెసంగ్రోలి ఝంకారంబు సేయు మధు
కరనికరంబులం జోపుచుఁ, బ్రసూనఫలభరితలై యున్నకొమ్మలకు జేతులం జాఁపుచు,
స్వచ్ఛంబులైన కుసుమగుచ్ఛంబులును మార్దవనిలయంబులైన కిసలయంబులును మనో
రథఫలంబులైన ఫలంబులును గోయుచు, దోహదవిశేషంబులు సేయుచు, శారికాకీరకల
కంఠకపోతకలరవప్రముఖవిహంగనాదంబులకుం ప్రమోదించుచుఁ, గ్రీడావిశేషంబుల
వినోదించుచుఁ, గరకమలకలితకాంచనకంకణకాంచీకలాపఘంటికానికరనూపురసం
జనితఝణఝణరవంబువన దేవతామనోహరం బై చెలంగం జరియించుచుఁ దమలోన.

48


క.

చూతము చూతము సుదతీ, వ్రాతము రారమ్మ మధుకరవ్రజగీతో
పేతము సుమసౌరభవి, ఖ్యాతము విరహిహృదయాభిఘాతముఁ దలఁపన్.

49


క.

కాంచనవర్జ్యము కువలయ, సంచారము మాధవప్రసన్నతయును బా
లించుచు వానప్రస్థతఁ, గాంచు మధువ్రతకులంబుఁ గంటివె చెలియా.

50


తే.

పేరుగలజాతులకు నెల్లఁ బెంపు దఱుగ, సౌఖ్య మొదవెఁ గుజాతివిజాతులకును
గాలకుటిలంబుఁ జూడుమా కంబుకంఠి, మాన్ప నెవ్వరివశ మమ్మ మాధవాజ్ఞ.

51