పుట:అనిరుద్ధచరిత్రము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఆమోదం బొనరింపఁగ, నామోదము విరియుఁ బోలె నైక్యస్థితితో
దామోదరపౌత్రుఁడు సు, ప్రేమోదయహృదయుఁ డగుచుఁ బెనఁగెన్ రతులన్.

116


వ.

తదనంతరంబ యాదవసమూహం బవ్వధూవరులం దోడ్కొని కతిపయప్రయాణంబుల
ద్వారవతీపురంబునకుంజని యథోచితసుఖంబు లనుభవించుచుండి రయ్యనిరుద్ధుండును.

117


చ.

విలసితలగ్నవేళఁ గడువేడుకతోడ గృహప్రవేశ మిం
పలరఁగఁ జేసి యవ్వనరుహాసనఁ గూడి యతండు ప్రేమచే
సలలితకేళికావనుల సారససారసరోవరంబులం
జెలువగురత్నగేహములఁ జిత్తము రంజిలఁ గారవించుచున్.

118


సీ.

కేల నంటఁగరానిగిలిగింతచే మాఱు పెనఁగుట లొకకొన్నిదినములందు
నేమి చేసినఁ గాని హితము చేసుక సమ్మతించుట లొకకొన్నిదినములందుఁ
జవుసీతిబంధవిశ్రాంతిమార్గములన్ని దెలిసికూడుట కొన్నిదినములందుఁ
దాన పైకొని సురతప్రౌఢిఁ దమిదీర నెనయుట లొకకొన్నిదినములందు


నగుచు నారుక్మనయనాసమాగమంబు, తనమనంబున కంతకంతకుఁ బ్రమోద
రసము కొలుపంగ గాఢానురక్తి నుండె, రసికశేఖరుఁ డారతిరాజసుతుఁడు.

119


క.

అని శుకుండు పలికె ననినం బ్రమోదహృదయులై శౌనకాదులు సూతుం గనుంగొని
యయ్యనిరుద్ధుని విహారం బెవ్విధంబుననుండె నటమీఁదటివృత్తాంతంబుఁ దేఁటపఱుపు
మనుటయు.

120


చ.

వరవరదానశీలమదవారణవారణకృజ్జలాటభీ
కరకరచక్రజన్మలయకారణకారణనైజలీలసా
దరదరహాసదుష్టరిపుదారుణ దారుణకోటితేజభూ
ధరధరదుగ్ధసాగరసుతానవతానవభోగసంగమా.

121


క.

నిలయీకృతవైకుంఠా, బలవద్రిపుభయదశౌర్యపటుతాకుంఠా
కలితరుచికంబుకంఠా, సలలితలక్ష్మీప్రసంగజనితోత్కంఠా.

122


మాలిని.

మునిహృదయనివేశా మోక్షదానప్రకాశా
వినుతగగనకేశా వీతసంసారపాశా
సనయనిజనిదేశా చారువక్షఃప్రదేశా
మనుజచరవినాశా మంగళాద్రిస్థలేశా.

123


గద్య.

ఇది శ్రీమంగళాచలనృసింహకృపాప్రసాదసంప్రాప్తవిద్యావైభవ కనుపర్తిరాయన
మంత్రినూభవ సుజనహితకృత్యనిత్య యబ్బయామాత్యప్రణీతంబైన యనిరుద్ధచరిత్రం
బనుమహాప్రబంధంబునందుఁ బ్రథమాశ్వాసము.