పుట:అనిరుద్ధచరిత్రము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

మఱియు నన్నగరీలలామంబు వైకుంఠపురంబునుంబోలె నాగనగరంబువిధంబున ననంత
కళ్యాణగుణాభిరామంబై, నభోమండలంబుతెఱంగున సుకవికల్పితప్రబంధంబుచాడ్పు
నఁ గలితకవిరాజవిరాజితంబై, చంద్రబింబంబుపోలికఁ గుసుమితద్రుమంబులీల విరాజ
మానసాగరంబై, యలకాపురంబుభాతి జలజాకరంబురీతిఁ బద్మాలంకృతంబై, యధ్య
యనవిద్యావిశేషంబుకైవడి సంగీతరత్నాకరంబుచెలువున వర్ణక్రమప్రశస్తంబై, రామా
యణకావ్యంబుగతి భార్గవవంశంబుకరణి రామాభిరామంబై, మిత్రభావప్రకాశం
బయ్యును గువలయానందంబై, రాజాభ్యుదయంబయ్యును గమలాంచితంబై, హరివి
హారంబయ్యును బుణ్యజనరంజనంబై, విబుధవరవిరాజితంబయ్యును సమస్తగోత్రప్ర
చారంబై, గురుప్రదీప్తంబయ్యును గవిహితంబై, సంపదలకుం గొటారును, సౌభాగ్యం
బులకుఁ బుట్టినిల్లును, సౌఖ్యంబులకు నాలవాలంబును, సారస్యంబులకుఁ గాణయాచి
యు, సంతోషంబునకు నాటపట్టునునై వసుంధరాసుందరీనిటలతటసంఘటితముక్తా
లలామంబుసోలికఁ జతుర్ముఖనిర్మితప్రపంచాభరణంబై యొప్పుచుండు.

73


ఉ.

ఆపురలక్ష్మికిన్ రమణుఁడై విలసిల్లుచునుండు బ్రహ్మలీ
లాపరిపూర్ణమానుషవిలాసుఁడు భక్తగృహాంతదృశ్యని
క్షేపము రూపమోహనవశీకృతగోపవధూకదంబుఁ డు
ద్దీపితకీర్తిశాలి వసుదేవతనూజుఁడు కృష్ణుఁ డున్నతిన్.

74


సీ.

వరలీల దేవకీవసుదేవులకుఁ బుట్టి నందయశోద లున్నతిగఁ బెనుపఁ
బెరిగి దైతేయులఁ బెక్కండ్ర వధియించి యమునానదీతీరమందమంద
బృందావనక్రీడఁ బెంపొంద గోవులఁ బాలించి మురళీవిలోలుఁ డగుచు
వల్లవకాంతల వలపించుచు రమించి భక్తజనావనప్రౌఢి మెఱసి
రుక్మిణీసత్యలాదిగా రూపవతులఁ, జాలఁ బెండ్లాడి సంసారసౌఖ్యనిరతి
నెలమిఁ ద్రిభువనసామ్రాజ్య మేలుచుండెఁ, గృష్ణుఁ డంచితకీర్తివర్ధిష్ణుఁ డగుచు.

75


మ.

హరికిన్ రుక్మిణికిన్ దనూభవుఁడు మీనాంకుండు లోకైకసుం
దరలీలాసుకుమారమూర్తి రతికాంతాపద్మరాగోపమా
ధరసారామృతపానకేళిరతుఁ డుద్యద్విక్రమాటోపశం
బరసంహారుఁ డుదాత్తకీర్తి నమరున్ బ్రద్యుమ్ననామాంకుఁడై.

76


ఉ.

ఆరతివల్లభుండును శుభాంగి యనందగురుక్మికూఁతు నం
భోరుహనేత్రఁ గూడి కులభూషణుఁడైనకుమారుఁ గాంచె శృం
గారరసంబువిగ్రహముగా నొనరించినమాడ్కి నొప్పునొ
య్యారమువాని భాగ్యవిభవాదికలక్షణలక్షితాంగునిన్.

77


క.

అనిరుద్ధనామధేయుం, డనిరుద్ధవముఖ్యు లతని నరివీరులు డా
య నిరుద్ధతులన్ జేసెడి, యనిరుద్ధస్ఫుటపరాక్రమాఢ్యుండగుటన్.

78