పానశాల/నా అభిమాన కవికోకిల

వికీసోర్స్ నుండి

నా అభిమాన కవికోకిల - సింహపురి సిరి

దువ్వూరి రామిరెడ్డి
-కె. హరిప్రసాద్ రెడ్డి

`పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని మహాకవి వేమన అన్నట్లే కవులలో కూడా మహాకవులు వేరయా అని చెప్పవలసి వుంటుంది. అటువంటి మహాకవుల కోవలోకి చెందినవారే `కవి కోకిల' దువ్వూరి రామిరెడ్డి.

ప్రసిద్ధ కవులు నండూరి సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, అడివి బాపిరాజు జన్మించిన 1895 వ సంవత్సరంలోనే రామిరెడ్డి కూడా జన్మించారు - గూడూరులో లక్ష్మీదేవమ్మ, సుబ్బారెడ్డి దంపతులకు. జన్మదినం - నవంబర్ 9. రాములవారు తమపై దయతలచారని కాబోలు ఆ ప్రథమ సంతానానికి - తల్లిదండ్రులు రామిరెడ్డి అని పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత - ఆ దంపతులకు మరో మగబిడ్డ, ఒక ఆడపిల్ల కలిగారు. కడగొట్టు చెల్లెలు రుక్మిణమ్మ పట్ల రామిరెడ్డిగారికి అపురూపమైన వాత్సల్యం ఉండేది.

బాల్యదశలో గూడూరులోని వీథిబడిలోను, పెమ్మారెడ్డి పాళెంలో సీతయ్య అనే సాతాని అయ్యవారి వీథి బడిలోను రామిరెడ్డి చదువు కొనసాగింది. నెల్లూరు హార్వీ దొరవద్ద 8వ తరగతి వరకు చదువుకున్నారు. అక్కడితో బడి చదువు ఆగిపోయింది. జీవితాధ్యనం ఆరంభమైంది.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రామిరెడ్డికి సాధారణ విషయాలకు భిన్నంగా అసాధారణంగా ఉండాలనే ధోరణి బాల్యం నుంచే ప్రబలి వుండాలి. లేకపోతే - విజ్ఞానశాస్త్రం, మెకానికల్ ఇంజనీరింగ్, చిత్రలేఖనం, విగ్రహాల రూపకల్పన, జ్యోతిషశాస్త్రం వంటివాటిమీద ఆయనకు ఆసక్తి కలగడమేమిటి? వాటిలో ఆయన విశేష కృషి చేయడం ఏమిటి?

విడి భాగాలు తెప్పించి తనే స్వయంగా ఒక కెమేరా వంటిది తయారుచేసి, ఫోటోలు తీయడం, విడి భాగాలతో ఒక రేడియో తయారు చేయడం, ఇంకొకటి చేసి నెల్లూరు మునిసిపాలిటీకి బహూకరించడం, అందమైన శిల్పాలు రూపొందించి తమ ఇంటికి అదనపు అందాన్ని చేకూర్చడం వంటి పనులు రామిరెడ్డి సన్నిహితులకు ఆశ్చర్యానందాలు కలిగించేవి.

రామిరెడ్డిగారికి 1915లో శేషమ్మగారితో వివాహం జరిగింది. ఆ సంవత్సరమే ఆయనను కవితాకన్య కూడా వరించింది!

ఆయనకు చిన్నప్పటినుంచీ హేతువాద భావాలు. `సాహితీ వ్యాసంగం పూర్వజన్మ సుకృతం' వంటి మాటలు ఆయనకు నచ్చేవి కాదు. `మనిషి ప్రయత్నించితే - చేయలేనిది ఏదీ ఉండదు' అని ఆయన గట్టి నమ్మకం.

ఆ నమ్మకంతోనే తన కవితాకాంక్షకు రూపురేఖలు దిద్దే కార్యక్రమంలో `సులక్షణాసారం', `అప్పకవీయం' పునాదులుగా చేసుకుని, తన భావనా పటిమతో భాషపై అధికారాన్ని చేబట్టి అంతవరకూ కృషీవలుడుగా ఉన్న రామిరెడ్డి సాహితీ కృషీవలుడుగా మారారు!

ఇరవై మూడేళ్ళకే `రసిక జనానందము', `స్వప్నా శ్లేషము', `అహల్యానురాగాలు', `కృష్ణరాయభారము' అనే నాటకం (అముద్రితం) మాతృశతకం రచించారు. `ఋతు సంహారము', `పుష్పబాణ విలాసము' అనువదించారు.

1917లో నెల్లూరులో సి.ఆర్. రెడ్డిగారి అధ్యక్షతన జరిగిన సభలో రామిరెడ్డిగారికి స్వర్ణపతకం బహూకరింపబడింది. 1918లో ఆయన రాసిన `వనకుమారి' కావ్యం విజయనగర మహారాజాస్థానంలో ఏర్పాటు చేయబడిన కావ్యస్పర్ధలో ప్రథమ స్థానాన్ని పొంది, ఐదువందల రూపాయల బహుమతిని గెల్చుకుంది.

ఆ తర్వాత `కృషీవలుడు', `జలదాంగన', `యువక స్వప్నము', `కడపటి వీడుకోలు', `సీతా వనవాసం', `కుంభరాణా', `మాధవ విజయం' నాటకాలు రచించారు.

రామిరెడ్డిగారి జీవితంలో 1925, 1926 సంవత్సరాలు విషాదాన్ని మిగిల్చాయి. 25లో భార్య శేషమ్మ మరణించారు. ఆ మరు సటి సంవత్సరంలో వారి యేడాది శిశువు కుముదమ్మ మరణించింది. ఆ విషాద స్మృతుల నుంచి మరో మలుపుగా 1926లో అక్టోబర్ 5న `పానశాల' అనువాదాన్ని ప్రారంభించారు రామిరెడ్డి. ఆ మరుసటి సంవత్సరం - నవంబర్ 24 తేదీకి అనువాదం పూర్తయింది. ఆ రచన 1928లో ప్రప్రథమంగా `భారతి'లో ప్రచురితమైంది.

1929లో జూన్ 16న రామిరెడ్డి గారికి అన్నపూర్ణమ్మ గారితో రెండవ వివాహం జరిగింది. ఆ సంవత్సరంలోనే ఆంధ్ర మహాసభ (బెజవాడ) వారు ఆయనకు `కవికోకిల' బిరుదును ప్రదానం చేశారు.

1934లో ఆయన `గులిస్తాన్'ను అనువదించారు. `35లో `కాంగ్రెస్ వాలా' అనే నాటకాన్ని రాశారు. `36లో `సతి తులసి' అనే చిత్రానికి రచన చేశారు. ఆ మరుసటి సంవత్సరం `చిత్రనళీయం' అనే చిత్రానికి రచన, దర్శకత్వం నిర్వహించారు. అప్పట్లోనే `వేంకటేశ్వర మహాత్మ్యం' (39), పార్వతీ కల్యాణం, సీతారామ జననం చిత్రాలకు పద్యాలు రాశారు. 1940-44 మధ్య `పళ్లతోట'ను అనువదించి `పలిత కేశము', `కవి-రవి' అనే కావ్యాలు రచించారు.

1945లో ఆయనకు పక్షవాతం వచ్చింది. 1947 సెప్టెంబర్ 11న జీవన పోరాటంలో అలిసిసొలిసి, అంతిమ విశ్రాంతిని తీసుకున్నారు.

రామిరెడ్డి మతం - మానవ మతం. విజ్ఞానవాదం ఆయన ధ్వజం.

`ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ' అన్నారు చలం 1940లో.

                           ``బాధలే నాకాప్త బంధువర్గంబు
                              బీదతనంబె నా ప్రియమైన హక్కు
                              లోకహితంబు నాలోచించు పనియె
                              కఠినంబు విధి - దైవ ఘటితంబు నదియు

అన్నారు రామిరెడ్డి 1935లోనే. నిజమైన కవి లక్షణం అదే. అందుకే ఆయన రచనలు, కీర్తి సాహితీ సీమలో శాశ్వతస్థానాన్ని చూరగొన్నాయి!

కవికోకిల
దువ్వూరి రామిరెడ్డి

జననం: నవంబరు 9, 1895 గూడూరులో.

చిన్నప్పటినుండి విజ్ఞాన శాస్త్రంమీదే వీరి మనసంతా. అందుకే వీరి స్కూలు జీవితం చాలా కొద్ది. చిత్రలేఖనము, శిల్పము వీరి జీవితానికి క్రీడారంగాలైనవి. 20 సం|| వయసులో వీరు కవితారంగంలోకి ప్రవేశించారు. స్వయంకృషితోనే ఇంగ్లీషు, ఫ్రెంచి, జర్మన్, సంస్కృతము, బెంగాలీ, పెర్షియన్, ఉర్దు, తమిళంలో పాండిత్యం గ్రహించారు. వీరి కవిత్వం పాత క్రొత్తలకు ప్రాక్పశ్చిమాల మేలికలయికగా అందాలు అవరచుకుంది. శ్రమజీవియైన కర్షక జీవితము కవితా వస్తువేనని వీరు నిరూపించినారు.

ఖయాము రుబాయతులకు తెలుగులో యెంత మధురంగా గానం చేశారో, కర్షక జీవితాన్ని అంత కమ్మగా పాడారు.

1920లోనే విశ్వశాంతి కోసం వేదనపడి, శాంతి గీతికలు ఆలపించిన యీ కళాశీలి, తెలుగు సారస్వతాకాశాల్లో నవకుసుమాలు పూయించి మనకిచ్చి, 1947 సెప్టెంబర్ 11వ తేదీన దివంగతులైనారు.