పానశాల/ఖయ్యాము ప్రశంస
ఖయ్యాము ప్రశంస
ఓయీ! ఉమ్రఖయామ, నీవు చని యెన్నో యేండ్లుపూండ్లాయె; లే
ప్రాయంపుం జెలి సాఖియు\న్ ధరణిగర్భంబందు నిద్రించె; గు
ర్తే యౌపట్టక నీ నిషాపురము జీర్ణించెం గదా! నీదు గో
రీయైన\న్ సడలు\న్; రుబాయతొకటే స్మృత్యంకమై నిల్చెడున్.
పంచాంగంబును సంస్కరించు గణితప్రావీణ్యమున్న\న్ సలా
మంచు\న్ సంజరు షాహి ప్రీతిమెయి నీ కర్ధాసనం బిచ్చి మ
న్నించంగల్గియు, గ్రీకుశాస్త్రముల పాండిత్యంబు నార్జించియుం
గాంచంగల్గుదె నేఁటికీర్తి కవివే గాకుండిన\న్ ఖయ్యమా?
ఎందఱులేరు జోస్యులు? మఱెందరు నీవలె హేతువాదులై
మ్రందిరి? వారి పుట్టువుల మాటయె లోక మెఱుంగఁబోదు; నీ
నందనవాటిక\న్ గఱికనట్టులఁ బూఁబొదరిండ్లనీడ మా
కందఱకు\న్ రసార్ద్రకవితాసవమిచ్చితి వాసదీఱఁగ\న్.
నీతత్త్వంబులు మాకుఁ బూజ్యములు కానీ, కాకపోనీ, మఱే
మీ, తత్త్వాలకు నేమిగాని, మధురస్మేరాస్యయౌ సాఖి దృ
క్పాతం బైహిక జీవితార్తి పరితప్తస్వాంతులౌ వారికిం
జేతఃప్రీతినొసంగు; మాకదియె యాశీర్వాద మిప్పట్టున\న్.
బ్రతుకు టెడారిలో నిసుకబాటలఁ ద్రిమ్మరి నీరువట్టి దుః
స్థితి మరణింపనున్న యొక జీవి కదృష్టపువాఁగువోలె సం
తతముఁ ద్వదీయ దివ్య కవితారస నిర్ఝరిణీ ప్రపాత మ
ద్భుతముగ చిత్తతాపమును బోనడచు\న్ శిశిరాంబుసేచన\న్.
తెలుఁగుందోఁటలఁ బచ్చబీళ్ళ ననురక్తిం బానశాలాప్రతి
ష్ఠలు గావించి త్వదీయకావ్యరసభాండంబుల్ గులాబీలు బు
ల్బులిపిట్టల్ మధుపానపాత్రికలు సొంపుల్ గుల్కు సాఖీయు భూ
తలనాకం బొనరింప నిల్పి రసికాంధ్రప్రీతి గావించితి\న్.
పారసికన్న శ్రావ్యమయి పల్లవకోమలమై సుధారసం
బూరెడు మా తెనుంగునుడి నొప్పిదమౌనటు నీదు భావముల్
ఏరిచి చేర్చికూరిచితి నింపగుకావ్యము నోఖయామ, నీ
పేరిఁక యావదాంధ్రపృథివీస్థలి శాశ్వతమై తనర్చుత\న్!
అలరెడు నాణిముత్యముల యాశ్రయగౌరవ మొందిసూత్రముల్
గులుకుమిటారి జవ్వనపు గుబ్బల నాట్యములాడుఁ గాదె యే
కలిమియు లేకయుండియును, ఖయ్యమ, నీ మృదుముగ్ధభావమం
జులత సమాశ్రయించు కృతి సొంపిలదే రసికార్చనీయమై.
తెలతెలవాఱ, సంజకడఁ, దెమ్మెర కమ్మగవిచ్చు పూల తా
వులఁ బువుఱేకులన్ విసరిపోయుత నీదు సమాధిపైని; బు
ల్బులులు గులాబిపూఁబొదలలోఁ జిరకాలము నీదు కీర్తి నిం
పొలయ నుతించుఁగాక! సెలవోయి ఖయామ, సలాము, వచ్చెదన్.