Jump to content

పాండురంగమహాత్మ్యము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

పాండురంగమాహాత్మ్యము

ప్రథమాశ్వాసము

శా.

శ్రీకాంతామణిఁ గన్మొఱంగి మదిధాత్రిన్ మంచినన్ దద్ధృతి
శ్రీకాదంబునిమీఁది కుబ్బెననగా శ్రీవత్సముం దాల్చి ము
ల్లోకంబు ల్పొదలించుకృష్ణుడు దయాళుం డేలు శ్రీవైష్ణవ
స్వీకారార్హు విరూరి పట్టణపతిన్ వేదాద్రిమంత్రీశ్వరున్.

1


సీ.

అవతారమందె నే యఖిలైకజనయిత్రి
        కలశరత్నాకరగర్భసీమఁ
దోఁబుట్టు వయ్యె నేతులితకాంచనవర్ణ,
        వెలఁది వెన్నెలఁగాయు వేల్పునకును
బాయకయుండు నే పరమపావనమూర్తి
        చక్రిబాహామధ్యసౌధవీథి
నభిషేకమాడు నేయభివర్ణితాచార
        దిగ్గజానీతమౌ తేటనీట


గీ.

నవనిధానంబు లేదేని బవణిసరకు
లమ్మహాదేవి శ్రీదేవి యాదిలక్ష్మి
సరసశుభదృష్టి రామానుజయ్యసుతుని
నాదరించు విరూరి వేదాద్రినాథు.

2


ఉ.

మాద్రికి మీరు నంచవెలిమావుపయిన్ మురువైనజోదుచే
భద్రమయాత్ముచే భువనపాలనఖేలనుచే సరస్వతీ

ముద్రితవక్త్రుచేత నలుమోములవేలుపుచే విరూరి వే
దాద్రిచమూవిభుందు గను నాయువు శ్రీయు నిరంతరాయమున్.

3


శా.

కద్రూజాంగదుతోడబుట్టువు శరత్కాదంబినీచంద్రికా
చిద్రూపాంచితపద్మగర్భముఖరాజీవాళిహంసంబు వ
ర్ణద్రాక్షాఫలకీరి శారద కృపన్ రామానుజామాత్యు వే
దాద్రిస్వామికి నిచ్చునిచ్చలును విద్యాబుధ్ధివాక్సిద్ధులన్.

4


ఉ.

ఈచిగురాకు నీప్రసవ మీపువుఁదేనియ యెంతయొప్పెడిన్
జూచితిరే! యటంచుఁ దనచుట్టు శుకాదులు గొల్వఁగాఁ గప
ర్దాచితచంద్రగాంగజల మైనశివాహ్వయకల్పశాఖి వే
దాచలమంత్రికీర్తికలశాబ్ధిని వెన్నెలమాడ్కిఁ జూచుతన్.

5


ఉ.

చిద్రసవేదియౌ కొదమచిల్కకు విష్ణుసహస్రనామముల్
ముద్రతి మోము మోనినిడి మున్కుచు గోరున మేను దువ్వుచున్
భద్రనిధానమై వెలయు పర్వతకన్య వికూడిమంత్రి వే
దాద్రికి విష్ణుభక్తిమహిమాతిశయం బనయంబు నీవుతన్.

6


సీ.

సూత్రవతీ దేవి సొబగుపాలిండ్లపై
        మలుపచ్చిగందంపువలపుతోడ
శిరసులువంచు నిర్జరకోటిఁ బనిగొను
        తపనీయవేత్రహస్తంబుతోడఁ
బనియేమియని విన్నపమ సేయు సుమనోర
        థములైనదివ్యాయుధములతోడ
బ్రహ్మాండకోటుల పారుపత్తెము లెల్లఁ
        గనియున్కి నిద్దంపుమనసుతోడ


గీ.

శార్ఙ్గి రెండవమూర్తియై జగము లేలు
మునిమనోహరి శ్రీసేన మొదలియారి
చేయుపనులెల్ల సఫలముల్ సేయుఁగాత
మలరి రామానుజయ్య వేదాద్రిపతికి.

7

శా.

మీఁదం దారధరాధరంబుగల యా మేరున్నగంజాలిత
త్తాదృక్తుండరుచి న్దలిర్చుఖగయూధస్వామి హేమప్రభా
ప్రాదుర్భావశుభప్రభుండుమనుచు న్రామానుజామాత్యు శ్రీ
వేదాద్రీశు విరూరిమందిరు జగద్విఖ్యాతకీర్తీశ్వరున్.

8


సీ.

ధరణీభరముదాల్చు తనచేవయంతయు
        భుజపరిఘంబులఁ బొంకపఱిచి
మునుమిన్కుగనియైన తనప్రజ్ఞయంతయు
        మతివిశేషమునందు మస్తరించి
దైత్యారివశమైన తనచిత్తమంతయు
        నినుచుగౌరవమున నివ్వటించి
తనువు వెన్నెల గాయు తనమూర్తియంతయు
        గీర్తివైభవమునఁ గీలుకొలిపి


గీ.

వేషుఁ డఖిలప్రపంచవిశేషశాలి
నిత్యముక్తుల కాద్యుఁడై నిలుచుమేటి
చారుచారిత్రు రామానుజయ్యపుత్రుఁ
గరుణ వేదాద్రిమంత్రిశేఖరుని మనుచు.

9


క.

పుట్టకుఁ బుట్టెడువేళం
దిట్టపు నునుపచ్చి పుట్టతేనియచవితో
బుట్టె ననఁ నమృతముట్టెడు
పుట్టనిసువుసత్కవిత్వములు వర్ణింతున్.

10


క.

ఇట్టాడరానియాగము
ఘట్టమునకునడవ యచ్చు కట్టినమునిరా
ట్పట్టాభిషిక్తుఁ దపముల
పుట్టిననెలవయిన వ్యాసముని వర్ణింతున్.

11


తే.

వ్యాస వాల్మీకి ముఖసూక్తి వైభవముల
నేర్పుమీరంగనిజకావ్యదర్పణముల

సరసమానసముల నేఱుపఱుచుకీర్తి
ధవుల నన్నయభట్టాది కవులఁ దలఁరు.

12


ఉ.

చాటుక విత్వతత్వరససాగరపారగులయ్యు సత్కవుల్
పాటిగఁబట్టివిందురొకపాటివిగావన కన్యకావ్యముల్
కైటభవైరియౌనతశిఖామణిశ్రీసతిఁ బేరురంబునన్
మాటియు నీటికెంపుబహుమానముగంబదకంబుఁ జేయడే.

13


తే.

తప్పుగలిగినచోటనే యెప్పుఁ గలుగు
నరసి కావలె కవితల యవగుణములు
సరసకవి తావపోక్తుల సరణియందు
నమృతధారాప్రవాహంబు లడరుగాదె.

14


తే.

కానదోషాత్ములైన దుష్కవులకతన
గరిమవహియించుఁ గవిరాజ కావ్యమహిమ
బహుళపక్షంబుచీఁకటి బహుళమగుట
జాయవెన్నెలతరితీపు సేయుకరణి.

15


వ.

అని నిఖిలభవనప్రధానభవ్యంబులగుమాన్యదైవతంబులం గొని
యాడి రూఢి మెలయు కవివృషభుల నభినుతించి యురంచితంబగు
కవిత్వతత్వంబునంగలగరిమంబు బరీశీలించి వంచకులగు కొంచెపుం
గవులరవళి యదలంచి పంచాశత్కోటివిస్తీర్ణం బగునర్ణసమేఖలా
వలయంబునగల పరమవైష్ణవరత్నంబులకుఁ బయత్నపూర్వకంబుగ
నభివందనం బాచరించి.

16


క.

వాక్కాంతాశ్రయభట్టరు
చిక్కాచార్యుల మహాత్ము శ్రీగురుమూర్తిన్
నిక్కపుభక్తి భజించెద
నిక్కావ్యకళాకలాప మీడేఱుటకున్.

17

క.

ఠవణింతు నొక్క శ్రీభా
గవనచరిత్రంబుఁ బరమకల్యాణసము
ద్భవభవనంబుఁ జతుర్దశ
భువనమహారత్న సూత్రముగఁ దగుసరణిన్.

18


వ.

అని యిట్లభినవ ప్రబంధనిర్మాణ కౌతూహలాయత్తచిత్తుండ
నయి యేనున్న సమయంబున.

19


సీ.

తనకులాచారవర్తన వైష్ణవాచార
        పర్యాయముల కొజ్జబంతి యనఁగఁ
దనసూనృతము పురాతనసత్యనిధులయు
        న్నతికిఁ బునఃప్రతిష్ఠితము గాఁగఁ
దనబుద్ధి నీతీశాస్త్రరహస్యములు తెల్ల
        ముగఁ దెల్పువ్యాఖ్యానముద్ర గాఁగఁ
దనవ్రాయు గంటంబు మొనవాఁడి విశ్వంభ
        రాప్రజలకుఁ బ్రాణరక్ష గాఁగ


తే.

వెలయు మంగయ గురువభూవిభుని పెద్ద
సంగభూపాలమణి రాయసప్రవృత్తి
సఖయుతుండైన రామానుజయ్యసుతుఁడు
భద్రగుణసీరి విరూరి వేదాద్రిశౌరి.

20


మ.

కవులుం బాదకులున్ బ్రధానులు నలంకారజ్ఞులున్ బ్రాజ్ఞులున్
ధవళాక్షు ల్భజియింప నిండుకొలువై తారేందుతారావళీ
ధవళంబైనసువర్ణకుంభయుతసౌధంబందు నావాసమై
వివిధామ్నాయపురాణగుంభనకథ ల్వించున్ బ్రమోదంబునన్.

21


క.

నను రామకృష్ణకవిఁ గవి
జనసహకారావళీవసంతోత్సవసూ
క్తినిధి బిలిపించి యర్హా
సనమునఁ గూర్చుండఁబనిచి చతురత ననియెన్.

22

సీ.

జగతి సొబగుల నెన్నఁగఁ గావ్యధారల
        ఘనుఁడ వాశువునందుఁ గరము మేటి
వఖిలభూమిపాలకాస్థానకమలాక
        రోదయతరుణసూర్యోదయుఁడవు
శైవ వైష్ణవ పురాణావళీనానార్థ
        రచనాపటిష్ఠైకగమ్యమతిని
లౌకికవైదికలక్షణచాతుర్య
        ధైర్యప్రభారూఢకార్యచణుఁడ


గీ.

వరయ భూమికుచాగ్రహారాభమైన
శ్రీతెనాల్యగ్రహారనిర్ణేత వగ్ర
శాఖికాకోకిలమ నీవు సరసకవివి
రమ్యగుణకృష్ణ రామయ రామకృష్ణ.

23


క.

కౌండిన్యసగోత్రుఁడ వా
ఖండలగురునిభుఁడ వఖిలకావ్యరససుధా
మండనకుండలుఁడవు భూ
మండలవినుతుఁడవు లక్ష్మమావరతనయా!

24


క.

యశము గలిగించు నీమృదు
విశదోక్తులఁ బౌండరీక, విభుచరితఁజతు
ర్దశభువనవినుతముగ శుభ
వశమతి నా పేరనుడువు వరతత్వనిధీ.

25


ఉ.

స్కందపురాణనీరనిధి కౌస్తుభమై ప్రభవించు దేవకీ
నందనుసత్కథోద్యమము నవ్యకవిత్వకళాకలాపమన్
కుందనమున్ ఘటించి కడుఁ గ్రొత్తగు సొమ్మొనరించి విష్ణుసే
వందిలకించు నప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా.

26

మ.

ఉదయం బస్తనగంబు సేతువు హిమవ్యూహంబునం జుట్టిరా
విదితంబైనమహిన్ మహాంధ్రకవితావిద్యాబలప్రౌఢి నీ
కెదురేరీ? సరసార్థబోధఘటనాహేలాపరిష్కారశా
రద నీరూపము రామకృష్ణ కవిచంద్రా! సాంద్రకీర్తీశ్వరా!

27


వ. అని సంభావించి కనకాంబరాభరణంబులు బ్రసాదించి
యాప్రధానపంచాననుండు.

28


మ.

పలుకుందొయ్యలి మౌళిగాంతి కెనయౌ బాగాలు నయ్యింతిచె
క్కులఁబోలుం దెలనాకు లయ్యువిదపల్కుల్వంటికప్రంపుఁబ
ల్కులతోఁగూడినవీడియం బొసఁగె నాకుం బద్మనాభార్చనా
కలనాపావసహస్తకంకణఝణత్కారంబు తోరంబుగన్.

29


వ.

ఇట్లు లోకోత్తరగుణోత్తరుండగు నాప్రధానశేఖరుండు పరమపురుష
పరికరచరిత్రంబునకు నధీశ్వరుడగుట తీర్థంబును స్వార్థంబును జాదులుం
దేవరప్రసాదంబును పుణ్యంబునుం బురుషార్థంబును నయ్యె నయ్యభ్యుదయం
బునకుం గల్యాణాచారంబుగాఁ గృతిపతి వంశావతారం బభివర్ణింపంబూని.

30


సీ.

మిగులఁ గన్నొదివిన బిగువ యెక్కుడుగాని
        కరుణాకటాక్షవీక్షణమువాఁడు
దంష్ట్రావిటంకవర్ధనమయెక్కుడుగాని
        ముద్దుఁజందురునేలు మోమువాఁడు
నరమృగదేహ విస్ఫురణమెక్కుడుగాని
        బహుకోటిమదనరూపంబువాఁడు
దైత్యుదండించునుద్ధతియె యెక్కుడుగాని
        శ్రితజనావళుల రక్షించువాఁడు


గీ.

నాఁగ గరుడాద్రిసింహాసనముననుండి
యెల్లజగములనేలు లక్ష్మీశ్వరుండు

శ్రీయహోబలనరసింహ నాయకుండు
శఠమఠనగోత్రమంత్రి రక్షణ మొనర్చు.

31


చ.

జఠర వసత్ప్రపంచసురసత్తమతుల్యుఁ డశేషయోగిరా
ణ్మఠహృదయుండు మునిజనమాన్యుఁడు ధన్యుఁడు ముక్తికామినీ
కఠినకుచద్వయీనిహితకాంచనమాలికహేలికల్పుఁ డా
శఠమఠణర్షి శేఖరుఁ బ్రశంస యొనర్పఁదగుం జగంబులన్.

32


శా.

ఆవాచంయమవంశసాగరమునం దవ్యాహతైశ్వర్యల
క్ష్మీవంతుండు విరూరికర్త సచివశ్రేష్ఠుఁడు విద్యాహయ
గ్రీవుం డన్నయమంత్రి యవ్విభుని సత్కీర్తు ల్విజృంభించు నీ
ద్యావాపృథ్వ్యవకాశపుంఖిత నిజవ్యాపారపారీణతన్.

33


ఉ.

ఆసచివావతంసముకులాంగన చెల్వగు లక్ష్మమాంబ గౌ
రీసతియొ, యరుంధతియొ, రేవతియో యల యాదిలక్ష్మియో
వాసపురాణియో యనఁగ వాసియు వన్నెయుఁ గల్గి కీర్తులన్
జేసినమూర్తివోలెఁ బతిచిత్తము వచ్చిన సచ్చరిత్రలన్.

34


ఉ.

అన్నయ లక్ష్మమాంబ సుతు లర్థివిధానము తిప్పరాజు సం
పన్నుఁడు రంగరాజుఁ బ్రతిభానిధి గుండమరాజుఁ బొల్చి రా
సన్నుతభాగ్యవర్ధనుల సన్మతి శౌర్యము ధైర్యమున్న యా
భ్యున్నతి నీతిరీతి జయ మొప్పును నేర్పును నెన్నశక్యమే!

35


క.

ఆమువ్వురిలో రంగ సు
ధీమణి దీపించె వంశతిలకం బగుచున్
శ్రీమహిత గంగమాంబా
రామా రమణీయరాగరసరంజితుఁడై.

36


క.

ఆరంగరాజు కీర్తులు
శ్రీరంగనివాసహాసశివకరలక్ష్మిం

జేరంగ దిగుచునహితులఁ
బారంగా నెగుచునతని బాహాసి యనిన్.

37


సీ.

శ్రీమదష్టాక్షరీసేవైకనిపుణుండు
        గీతార్థసాగసంకేతవేది
పరిచితదివ్యప్రబంధసంధానుండు
        మహితసౌదర్శనమనువిదుండు
వితతప్రభాసితవిజ్ఞానకోవిద
        నిజసమయావననిపుణబుద్ధి
సరసరామాయణసప్తకాండజ్ఞాత
        యాళువందారుస్తవాభిశోభి


గీ.

సలిలనిధిజాల జంఘాలజలవిశాల
ధూళిఫాళీభవాళీక ధూమభూమ
శంకితాత్మప్రతాపవైశ్వానరుండు
గంగమాప్రాణవిభుఁ డొప్పు రంగరాజు.

38


తే.

దశరథేశ్వరు భార్యయై ధన్యమహిమ
మున్ను కౌసల్య శ్రీరాముఁ గన్నకరణి
రంగయామాత్యు సతియైన గంగమాంబ
మతిమరున్మంత్రి శ్రీరామమంత్రి గనియె.

39


క.

ఆరామరాజువాహిని
వారాన్నిధులేడు దాఁటె వసుమతి మున్నీ
శ్రీరామరాజు వాహిని
వారాన్నిధులేడు దాఁటి వర్ధిలునవలన్.

40


సీ.

పుడమిపై నడనేర్చి యడుగుబెట్టెడునాఁడె
        ధర్మంబు నాల్గుపాదముల నిలిపె
జిలిబిలిపలుకులు - పలుకనేర్చిననాఁడె
        సత్యభాషాహరిశ్చంద్రుఁ డయ్యె

వరుసమీదటివ్రాలు వ్రాయనేర్చిననాఁడె
        కమిచి దిక్కులజయాంకములు వ్రాసె
ముఖ్యవ్రతస్ఫూర్తి ముంజిఁ గట్టెడునాఁడె
        కవులబ్రోచుటకుఁ గంకణము గట్టె


గీ.

నంబయాంబిక గళ్యాణమైననాఁడె
వాసిగలకీర్తి లక్ష్మికి సేస వెట్టె
ధైర్యహేమాద్రిప్రజ్ఞాశాంతనవుమాద్రి
రంగయామాత్యవరుని శ్రీరామమంత్రి.

41


సీ.

సంహృతాంహస్స్ఫూర్తి సింహాసనుండు నృ
        సింహవిక్రముఁడు నృసింహశౌరి
త్రయ్యంతవాసనాగ్రహబుద్ధి నొయ్యారి
        యొయ్యారి రామానుజయ్యగారు
గంగాతరంగసారంగలాంఛనదీప్తిఁ
        బొంగుకీర్తికి రాజు రంగరాజు
శరణాగతత్రాణ కరుణాచరణకేళి
        వరదరాజులబోలు వరదరాజు


గీ.

ననఁగ శ్రీరామవిభునికి నంబముకును
గలిగి రాచంద్రతారార్కగతిఁ బ్రశస్తి
నలువురాత్మజు లౌదార్యసలిలనిధులు
భుజగశాయికి నాలుగుభుజములట్లు.

42


గీ.

అందు నగ్రజుఁ డఖలవిద్యావినోది
శ్రీనృసింహాఖ్యసన్మంత్రిసింహ మలరు
లీల లక్ష్మమ్మ తనకు నిల్లాలు గాఁగ
జెలఁగె లక్ష్మీనృసింహవిశేషముద్ర.

43


క.

శ్రీనరసింహుని లక్ష్మీ
మానవతికి వెంగళాఖ్యమంత్రీశ్వరుఁడున్

గోనప్పయు ననఁదగువి
ద్యానిధు లిరువురును బుత్రులై మని రవనన్.

44


క.

నయవినయంబుల కైవడి
జయతేజము లట్లు విభవశమముల క్రియ స
వ్యయయశులు వెంగళయ కో
నయ లిరువురు వెలసి రవని నాథార్చితులై.

45


క.

ఆవెంగళమంత్రీశ్వరు
దేనికి శ్రీయౌభళాఖ్యతిలకపతికి రా
ధావిభుదేవేరియు నల
కావేరియు నీడుజోడు గౌరవకళలన్.

46


క.

గానకళాతుంబురుఁ డనఁ
గా నయవిద్యావివేకగౌరవలక్ష్మీ
జాని యనంగా నిద్ధర
గోపప్రభుఁ డొప్పు మంత్రికులతిలకంబై.

47


తే.

ఆ విదేహాధిపతిపుత్రి యాత్మభాగ్య
గాఁగ విఖ్యాతిఁ బొందు రాఘవునికరణి
రాఘవాంబాధినాథుఁడై శ్లాఘమీరు
శ్రీనృసింహుని కోనప్ప సిరులకుప్ప.

48


ఉ.

సామదరక్షణుఁ గొలిచి సన్నుతి కెక్కినభాగ్యశాలి శ్రీ
రామచమూపశేఖరుని రంగనమంత్రి ననంతమాంబికా
స్వామి నుతింతు మన్మథభుజానతపుష్పధనుర్మధూళిధా
రామధురోక్తిగుంభసభరస్ఫురణాపరిణాహచాతురిన్.

49


చ.

ఉరుమతి రంగమంత్రి తనయుల్ విలసిల్లిరి పుల్లమల్లికా
హరదరహాసహీరహిమహారపటీరయశోధురంధరుల్
వరదయగల్గువారు గుణవంతులు శాంతులు కాంతిచంద్రముల్
వరదయమంత్రిపుంగవుఁడు వాసవతుల్యుఁడు రాఘవయ్యయున్.

50

క.

రంగయవరదామత్యు వి
హంగమవిభు గమనభజనహంసధ్వజు సా
రంగధరహారనిభవా
గ్గంగాశృంగారితాస్యకమలు నుతింతున్.

51


సీ.

సమకూర్పగా నేర్చు సకలవైష్ణవశాస్త్ర
        సిద్ధాంతశుద్ధాంతసిద్ధిగరిమ
హవణింపఁగా నేర్చు నఖిలావనీచక్ర
        సామ్రాజ్యపూజ్యవిశాలలక్ష్మి
వలపింపగా నేర్చు వాలారుఁజూపుల
        కోపులు చూపు చకోరదృశల
బాలింపగా నేర్చు బాన్థవకవిగాయ
        కార్థార్థినివహంబు ననుదినంబు


గీ.

దండనాథునిమాత్రుఁడె దశదిశావ
కాశసంపూర్ణవిజయప్రకాశశాలి
రంగయామాత్యు వరదయ్య ప్రకటశౌర్య
ధారి వాచాధరాధరధారిశయ్య.

52


క.

తిమ్మాంబ యక్కమయు వర
దమ్మయు వరదప్పభార్యలై వెలసిరి తే
జమ్మున శక్తిత్రయమ వి
ధమ్మున సకలోన్నతప్రధాప్రథతమతిన్.

53


ఉ.

మున్నొక రాఘవుండు తలమోచిభజించు విభీషణాదులన్
మన్ననఁబ్రోచె గాఁచెననుమాటలె కాని గుణప్రసన్నతన్
బ్రన్నదనంబుఁ జూపఁగల రంగయరాఘవమంత్రి నిచ్చలున్
వన్నెకుఁ దెచ్చునిచ్చు నభవాంచితవస్తువు లర్థికోటికిన్.

54


క.

తేజమున రాఘవుని యం
భోజేక్షణ తిమ్మమాంబ పోల్పందగునా

రాజీవవదన శారద
రాజార్ధకిరీటపూర్ణ రాజనిభాస్యన్.

55


క.

శ్రీరామమంత్రివరద సు
ధీరత్నము కులవధూటి దీపించుయశో
దారమణిరమణవిష్ణు
శ్రీరంజితకొండమాంబ చిరపుణ్యమునన్.

56


క.

ఆదంపతులకు గలిగిరి
గాదిలిసత్పుత్రవరులుగను కొండనయున్
శ్రీదనరు నౌబళయ్యయు
వేదస్మృతిజాయమానవినయనయగతిన్.

57


క.

కనుగొండ యితనిధైర్యము
పెనుగొండగు నితనినెదిరి భీతిఁ బగఱ వే
చనుఁగొండల కనఁగాఁ దగుఁ
గనుఁగొండయ నాగమాంబికావల్లభుఁడై.

58


ఆ.

అతనిసోదరుండు మతకళాజంభారి
గురుఁడు బంధులోకసురభి వెలయు
నౌబళాఖ్యమంత్రి యౌ బళా! యీతని
జయము నయమునంచు జనులు బొగడ.

59


ఉ.

ఇమ్మనవద్యహృద్యసముదీర్ణగుణాళికిఁ గల్పవృక్షపుం
గొమ్ము నవీనదానగుణ గుంభనసంభృతిఁ బద్మనాభుఁగ
న్నమ్మవరామరస్తుతజయస్థితి కౌబళమంత్రిభార్యయౌ
నమ్మమ యమ్మదద్విరదయానకు నేసతు లీడు ధారుణిన్.

60


వ.

ఏవంవిధాన్వవాయపయఃపారావారంబునకుఁ దారకాకమనాకృతియగు కృతిపతితెరం గెట్టిదనిన.

61


ఉ.

మానితరాజితద్యుతీసమంచితమోహనమూర్తి వైష్ణవ
జ్ఞానపరాయణుం డమృతసాగరరాజగభీరుఁ డర్థిసం

తానసురద్రుమం బతడు దానవనానతశాత్రవుండు రా
మానుజమంత్రి వర్ధిలు మహామహుఁడై నిజవంశకర్తయై.

62


సీ.

కతపత్ర మిడవచ్చుఁ గలఁగాంచునపుడైనఁ
        గోరికఁ బరకాంత గోరడనుచు
ముడియవైవఁగ వచ్చు మొనదారసించిన
        శూరత్వమును వెన్ను చూపఁడనుచు
దిగ్బె మెత్తగఁవచ్చు సుబ్బురంబగుకల్మి
        మేరమీరినతి మెలఁగడనుచుఁ
జేసాఁకగావచ్చు శివుమీఁద నేనియు
        బూనికతో బల్కి బొంకఁడనుచు


గీ.

జలధివలయితవసుమతీస్థలవతంస
భాసురాంతసమాశ్రితప్రౌఢకీర్తి
శఠమఠనగోత్రభవమంత్రి చక్రవర్తి
యైనరామానుజయ్యకు నై కడంగి.

63


శా.

రాధానాథాపదాబ్జభృంగ మగునా రామానుజామాత్యుతే
జోధారాళి భానుభానునుపమం జూపట్టు మిత్రాంబుజో
ద్బోధంబుం బ్రతిపక్షకైతవనిరుద్బోధంబు నిర్హంక్రియా
సాధుత్వంబు వహింప దుర్దమతపస్సంబాధముల్ జూఱఁగన్.

64


క.

కామగవీ సురతరువులు
వేమాఱునును నిచ్చుఁ దవులు విడిబేరముగా
రామానుజయ్య దాన
ప్రామాణికముద్ర కొంగు బంగారమగున్.

65


శా.

ఆ రామానుజమంత్రిచంద్రుఁడు వివాహంబయ్యె నెయ్యంబుతో
భారద్వాజపవిత్రగోత్రనిధికిన్ బల్పాటి కన్నయ్యకున్
గారామైన కుమారికాతిలకమున్ గౌరీధరాధరాశారదా
మారామపర మప్రసిద్ధమతి నమ్మాజమ్మఁ దేజంబునన్.

66

సీ.

తొడవులు పెక్కులు దొడవియుండెనె కాని
        సత్యంబు తనకు నిజాలతొడవు
చుట్టాలసురభియై సొబగు నొందెనెకాని
        నెనరైన చుట్టంబు దనకుఁ గీర్తి
కులదైవతం బహో బలనాథుఁ డనె కాని
        పతిమూర్తి పరమదైవతము తనకుఁ
జక్కఁదనంబులు సహజంబులని కాని
        తనచక్కఁదనము వర్తనమునంద


గీ.

యనఁగ విలసిల్లె నిఖిలవిద్యారహస్య
పరమవిజ్ఞానపాండిత్యభద్రమూర్తి
విప్రసురశాఖి రామానుజప్రధాన
మౌళి యర్ధాంగలక్ష్మి యమ్మాజియమ్మ.

67


క.

ఇమ్మహి రామానుజవిభు
నమ్మాజమ్మకు జనించి రబ్జభవముఖా
బ్జమ్ములఁ బోలిన సుతర
త్నమ్ములు నల్వురు నుదారతాజితరథుల్.

68


సీ.

మద్రేశనిభసమున్నిద్రశౌర్యోద్రేక
        విద్రావితారి వేదాద్రిశౌరి
విష్ణుపదధ్యాననిష్టాతవిజ్ఞాన
        కృష్ణుండు శ్రీరామకృష్ణమంత్రి
శరశరచ్చంద్రికాహరహారహిమహీర
        కరకీర్తివరశయ్య తిరుమలయ్య
పక్ష్మలితత్యాగలక్ష్మీకరోద్యోగ
        లక్ష్మలక్షితమూర్తి లక్ష్మఘనుఁడు


గీ.

ననఁగ వెలసిరి రామానుజయ్యసుతులు
దశరథక్షోణిపాలనందనసమృద్ధి

దైవతేశమదావళదంతరేఖ
నురగపర్యంక నిజచతుర్వ్యూహలక్ష్మి.

69


ఉ.

ముద్రితవైరివక్త్రులగు మువ్వురుతమ్ములుఁ బంపుసేయ వే
దాద్రివిరూరి మందిరుఁ డహర్పతితేజుఁడు రాజిలున్ యశో
భద్రుఁడు రామభద్రుని ప్రభావనయున్ గురుభక్తియున్ బ్రతా
పద్రవిణప్రసిద్ధియును బంధుజనంబు ప్రియంబు సేయగన్.

70


సీ.

పట్టెవట్ట్రువయును బరిపుష్టి తలకట్టు
        గుడిసున్నకియ్యయు సుడియుముడియు
నైత్వంబు నెత్వంబు నందమందంబు
        గిలకయు బంతులు నిలుపు పొలుపు
జయము నిస్సందేహతయు నొప్పుమురువును
        ద్రచ్చివేసినయట్ల తనరుటయును
షడ్వర్గశుద్ధియు జాలి యోగ్యతయును
        వృద్ధిప్రియత్వంబు విశదగతియు


గీ.

గీలుకొన వ్రాయసంబులు వ్రాయవ్రాయ
గొంకుకుకొసరును బేతప్పు గొనకయుండు
లలితముక్తాపలాకారవిలసనమున
మతిమరున్మంత్రి వేదాద్రి మంత్రివరుడు.

71


తే.

మాద్రి మీరువిరూరి వేదాద్రిరాజు
దానధారార్థ మఖిలప్రధాననదుల
వెచ్చ పెట్టుటఁ దలఁకియో విబుధతటిని
తరుణశశిమౌళి జడలలో డాగియుండు.


ఉ.

చేతుల ద్రిప్పుచున్ బ్రభులచెంతల నూరక దుర్వినీతులై
యేతులఁబోవుచున్ దిరుగు నిప్పటిమంత్రులు తంత్రు లిందఱున్
భూతలకల్పవృక్షముఁ బ్రభూతగుణాఢ్యుని సర్వలోకవి
ఖ్యాతు వినీతు వేదగిరిఁ గాతరచిత్తులు పోలనేర్తురే.

73

సీ.

కరుణించి చూచెనా కవిగాయకార్థార్థి
        నివహగేహంబుల నెరయు సిరులు
కోపించి చూచెనా కొంటతో నెనవచ్చు
        ననవచ్చునతఁడైన నవని దూఱు
మెచ్చి మన్నించెనా మెదకపాలసుఁడైన
        దొరతనంబున నిల్చి పరిఢవించు
బొందుగావించెనా భువి నెట్టిఖలునకు
        నాదట కరుణాప్రసాద మొసఁగు


గీ.

మంత్రిమాత్రుండె దుర్మంత్రిమథనకథన
చారుచర్చాచమత్కారచక్రవర్తి
యద్రి నిభుఁడు విరూరివేదాద్రి రామ
భద్రపాదసరోరుహబంభరంబు.

74


మ.

జలజాక్షాంఘ్రిసరోజషట్పదము విశ్వామిత్రగోత్రోద్భవుం
డలఘుప్రాభవుఁ డర్ధిలోకసులభుండై కీర్తిఁ బెంపొందు నా
కలకాళాస్తితనూభవన్ సుగుణలక్ష్యన్ దిర్మలాంబ న్బ్రభల్
వెలయంగా కులకాంతఁ జేసి వెలసెన్ వేదాద్రి భద్రోన్నతిన్.

75


సీ.

వృషభేంద్రగమనుఁ డీ వేదాద్రినాథుండు
        గిరిరాజతనయ యీ తిరుమలాంబ
వేదనిశ్వాసుండు వేదాద్రినాథుండు
        ధృతి శారదంబ యీ తిరుమలాంబ
విహగేంద్రగమనుఁడు వేదాద్రినాథుండు
        శరధితనూజ యీ తిరుమలాంబ
విబుదాధినాథుఁ డీ వేదాద్రినాథుండు
        ధర శచీదేవి యీ తిరుమలాంబ


గీ.

యనఁగ ననుకూలదాంపత్యవినుతమహిమ
హరువుదీపించె నౌర వేదాద్రివిభుఁడు

హారియశుఁ డైనకలకాళహస్తితనయ
తిరుమలాంబయు నిత్యవర్ధిష్ణులక్ష్మి.

76


సీ.

వేదమార్గప్రతిష్టాదైవతజ్యేష్టుఁ
        డభ్యస్తషడ్దర్శనార్థరాశి
యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత
        యఖిలపురాణేతిహాసకర్త
బంధురదివ్యప్రబంధానుసంధాత
        పంచసంస్కారప్రపంచచణుఁడు
వాధూలమునిచంద్రవంశవర్ధనమూర్తి
        సకలదేశాచార్యనికరగురువు


గీ.

పట్టమేనుంగు శ్రీరంగపతికి నణ్ణ
గారిగర్భాంబురాశినీహారరశ్మి
సారసాహిత్యసర్వస్వసయ్య నేటి
యాళవందారుకంగాళయప్పగారు.

77


శా.

తత్తాదృగ్విభవప్రభావనిధిఁ గందాళప్పగారి న్దయా
యత్తస్వాంతు నితాంతశాంతియుతు లోకాచార్యవర్యు న్సుధీ
చిత్తాంభోరుహభానుఁ గొల్చుచుఁ దదాశీర్వాదలబ్ధోన్నతిన్
హత్తెన్ దాను కరూరిమంత్రిమణి వేదాద్రీశుఁ డుద్యద్రుచిన్.

78


వ.

వెండియు నవ్వేదాద్రి మంత్రీశ్వరుండు రవికులతిలకుఁడును
రణరంగధీరుండును నంబునిధిగంభీరుండును భట్టరభావాంకుండును నక
లంకుండును నవత్తారుమండలీకరగండుండును నుద్దండభుజాదండుండు
నునై పరనారీసహోదరుం డయ్యును నితరసముపార్జితవధూవల్లభుండు
ను గోపికాగోవిందుండయ్యు నీశ్వరలక్షణలక్షితుండును బొన్నాంచా
రుదేవి దివ్యశ్రీపాదపద్మారాధకుండయ్యును బ్రతిష్టాపితపరమవైష్ణవకు
టుంబవిశేషుండును నయిన ఘనుని.

79


గీ.

గుఱుతుగలరాజు మంగయ గురువరాజు
పుత్రు పెదసంగభూపాలు శత్రుజైత్రు

భానుసమతేజు విద్యాసంధానభోజుఁ
గొల్చి వేదాద్రి నిత్యలక్ష్ములఁ దలిర్చు.

80


మ.

విభవేంద్రుండు విరూరిశాసనమహావిఖ్యాతి రామానుజ
ప్రభువేదాద్రి లిఖించువ్రాయసము లౌరా పెద్దసింగావనీ
విభుచిత్తంబు నెఱింగి గంటమురవల్ విద్యావధూనూపుర
ప్రభవప్రౌఢఝళంఝుళారభటిసౌభాగ్యంబుఁ గల్పింపగన్.

81


చ.

అతని సహోదరు ల్వెలసి రార్యగుణాఢ్యులు రామకృష్ణుఁ డా
యతభుజశౌర్యుఁడెౌ తిరుమలయ్య విచక్షణభవ్యసత్కళా
చతురుఁడు లక్ష్మణయ్యయు రసాతలనూతనకామధేనువుల్
చతురపథావిధాననయసాంద్రులు చంద్రులు కాంతిసంపదన్.

82


క.

ధర్మనిర్ణేత వేదాద్రి కూర్మితమ్ము
డైనశ్రీరామకృష్ణప్రధాని వెలసె
లక్ష్మమాంబాధినాథుఁడై లక్ష్మితోడ
నాదినారాయణునికృప ననుదినంబు.

83


క.

ఇంతిం దిరుమలమంత్రి య
నంతునుఁ గొనియాడవలయు హరిహయనగర
ప్రాంతోపవనలతాంతా
నంతమరందస్రవంతికాంచితసూక్తిన్.

84


క.

ఆ లక్ష్మణమంత్రీశ్వరు
లీలావతి వెంగళాంబ లేఖవిభువధూ
పాలితనానావిధల
క్ష్మీలక్షణశోభి విభవకీర్తుల వెలసెన్.

85


క.

సోదరులు సుతులు సతులును
వేదోదితమార్గచర్య వినయము నయమున్
శ్రీదాంపత్యము నెసఁగఁగ
వేదాద్రి మహాప్రధాని వెలయుం గృతులన్.

86

షష్ఠ్యంతములు

క.

ఏవంవిధగుణమణిఖని
కావిర్భవదురుకృపాకటాక్షజనికి ల
క్ష్మీవల్లభచరణాంబుజ
సేవాహేవాకశీలశీలనమునికిన్.

87


క.

అంధకరిపుగంధద్రుమ
గంధాంధద్విపవిపక్షగరుడత్రోటీ
బాంధవబంధురకీర్తిసు
గంధిలభువనత్రయునకు ఘనవినయునకున్.

88


క.

చతురుదధివలయవలయిత
కుతలభరణకరణభుజునకును సుజనునకున్
నుతిశాలికి జితిశౌరికి
హితకారికి సమదగమనహేలాకరికిన్.

89


క.

వాణీసఖముఖమఖరిత
వీణానిక్వాణపల్లవితనూత్నసుధా
ప్రాణసఖలేఖినీకల
రాణున కాచరితభూసురత్నాణునకున్.

90


క.

సంధారఘుపతికి వృష
స్కంధున కైదంయుగీనకర్ణునకు సమి
న్మాంధాతకు బాంధవశుభ
సంధాతకు ధాతకును వృషభగమనునకున్.

91


క.

భీమక్రోధాంధవిమత
సీమంతవతీలలామ సీమంతమణి

స్తోమాపాకరణపటు
శ్యామల తరవాలజయసహాయభుజునకున్.

92


క.

రవికిరణరుచికి మతిభా
రరికి విమతసచివగళితరవపదభూషా
రవికి భుజాంతరమణిహా
రవికిని రుచిరాకృతికి ధరాశ్రుతికృతికిన్.

93


క.

రామానుజార్యసుతునకు
శ్రీమంతున కర్థిసార్థజీమూతహయ
స్తోమోన్నతికి విరూరి
శ్రీమద్వేదాద్రి మంత్రిసింహంబునకున్.

94

కథాప్రారంభము

వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పఁబూనిన పౌండరీక
మాహాత్మ్యంబునకుం గథావిధానం బెట్టిదనిన.

95


మ.

తులితోక్షధ్వజసూతుఁడై వెలయుసూతుం గాంచి మున్ శౌనకా
దులు క్షేత్రంబును వేల్పుఁదీర్థము బుధస్తుత్యప్రభావంబులై
దళితైనస్తిమిరంబులై యిహపరార్థప్రాప్తిమూలంబులై
యిలపై నొక్కడఁ గల్గెనే ననఘమూర్తీ తెల్పవే నావుడున్.

96


క.

ఆఋషులప్రశ్న మంగీ
కారం బొనరించి పలుకు గథకుఁడు శ్రీనా
థారాధసహితచర్యున్
బారాశర్యుం దలంచి ప్రాంజలియగుచున్.

97

పుట:పాండురంగమహాత్మ్యము.pdf/23 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/24 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/25 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/26 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/27 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/28 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/29 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/30 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/31 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/32 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/33 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/34 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/35 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/36 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/37 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/38 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/39 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/40 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/41 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/42 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/43 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/44 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/45 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/46 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/47 పుట:పాండురంగమహాత్మ్యము.pdf/48