పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము/మనకర్తవ్యం

వికీసోర్స్ నుండి



5. మన కర్తవ్యం

"గాంధీజీ మనకు ఎలా జీవించాలో, ఎలా మరణించాలో తెలిపారు. భారత ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చారు. లక్ష్యసాధన కోసం క్రమశిక్షణ, ఆత్మత్యాగం అవసరమని బోధించారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించుటయే మనమివ్వగల నిజమైన నివాళి. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో గాంధీజీ మార్గమైన అహింస, సత్యనిష్ట ప్రేమ మార్గమే మనందరికీ జీవన విధానం కావాలి" అని ప్రధాని నెహ్రూ నివాళులర్పించారు.

తన ఒక్కమూర్తితోనే భారతకర్షకుడు, కార్మికుడు, నేతమనిషి, వ్యాపారి, యోధుడు, ప్రజాసేవకుడు, అపార కరుణాసాగరుడు గా గాంధీజీ లోకానికి ప్రత్యక్షమయినాడు. ఇంత అపారమయిన భారత ప్రజాబాహుళ్యం ద్వారా మిగతా ప్రపంచానికి అలభ్యమయిన అద్భుతశక్తి సామర్ష్యాలతో సహజ సంపదను ఉద్భవింపచేయవచ్చునని గాంధీజీ గమనించారు. ఈ సంపదకు వ్యాపార నైపుణ్యంకాని, పెద్ద పెద్ద అంగళ్ళుకాని, సామ్రాజ్య సైనిక వివాదాలుకాని, కరెన్సీ మారకంగాని, ఇన్ప్లేషన్, డిప్లెషన్లు గాని, శాస్త్ర పరిశోధనలుగాని, నవీనయంత్ర బలంగాని అవసరంలేదు. నిష్కళంకమయిన జీవితము, ఉదాత్తమయిన భావనాపటిమ, విశాలదృక్పథము, కాయకష్టము, నిజాయితీగా ధనార్థన-ఇవే గాంధీజీ విధానములోని ప్రధానలక్ష్యాలు.

గాంధీజీ పశ్చిమగోదావరి జిల్లాను సందర్శించిన ప్రతీ పర్యాయము జిల్లా వాసులు ధనిక, పేద, స్త్రీ, పురుష, బాలురు, వృదులు, కుల, మత తారతమ్యాలు విస్మరించి ఏకోన్ముఖులైనిండుగా అలలారుతున్న ప్రేమ, భక్తి పారవశ్యంతో ఘనస్వాగతాన్నితెలిపారు. ఆయన మాటలను అమృతధారలవలె స్వీకరించారు. గాంధీజీ రాక సందర్భమున రైల్వే స్టేషనులందు, గ్రామములందు, వీధివీధినా, సందుసందున, ఇండ్ల కప్పులపైన, గోడలపైన, కొన్ని చోట్ల చెట్లపైన కూర్చుండి మహాత్ముని దర్శించి తాదాత్మ్యం చెందారు. కుంకుమ, కర్పూర హారతులు, ఫలములు, పుష్పములు, ఖద్దరు ధోవతులు, ధనము, ఆభరణములు చేతపట్టుకొని గాంధీజీకి సమర్పించుటకు గంటలకొలది నిరీక్షించారు. ఆ నిరీక్షణలో చలి, ఎండ, పగలు, రాత్రి అనే భేదమే నశించింది. గాంధీజీ పదములు తాకి పశ్చిమగోదావరి జిల్లా పుడమి పులకించింది, ప్రజలు తరించారు. ఆయన చేపట్టిన ప్రతీ ఉద్యమంనందు జిల్లా ప్రజానీకం యావత్తు నిశ్చలమైన, నిర్మలమైన హృదయాలతో పాల్గొన్నారు. సహాయనిరాకరణ ఉద్యమాన్ని నిలుపు చేసిన సందర్భములో జిల్లా కాంగ్రెసు నాయకులు గాని, కాంగ్రెసేతర నాయకులుగాని, జన సామాన్యంకాని ఆయనపై ఇసుమంత విమర్శ చేయటానికి కూడా సాహసించలేదు. కాంగ్రెసు నాయకులు కొందరు స్వరాజ్యపార్టీ ఏర్పాటుచేసినా-జిల్లా నాయకులు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా నిర్మాణాత్మక కార్యక్రమాలను నిర్వహించారేగాని స్వరాజ్యపార్టీకి చేయూతనివ్వలేదు. గాంధీజీ నిరాహాదీక్ష చేబడితే జిల్లాలో అనేక మంది తాము కూడ నిరాహార దీక్ష చేశారు. గాంధీజీని ఖైదుచేస్తే ఆయన విడుదలకై అహింసాయుతముగా జిల్లాలో స్త్రీ, పురుషులు అందోళన చేశారు. క్రమంతప్పకుండా ప్రతీ అక్టోబరు రెండవ తేదీన ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. ప్రతీ పర్యాయము గాంధీజీ ఊహించిన దానికంటె హెచ్చు మొత్తాలను పికెటింగుచేశారు. ఆ ఉద్యమకాలంలో జిల్లాయందు మహిళ అరెస్టుకాని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. గాంధీజీని జిల్లాలో సందర్శించిన వయోవృద్దులు నేటికినీ తాముపొందిన మహత్తరమైన అదృష్ణాన్ని పదే పదే తలచుకొంటూ, తమ పిల్లలకు, మనుమలకు ఉప్పొంగే ఆనందంతో చెబుతుంటారు. తమ జన్మ చరితార్థమైనట్టు భావిస్తారు.

గాంధీజీ పర్యటించినంత ఎక్కువగా భారత దేశమంతా పర్యటించి ప్రజల యోగక్షేమములను, ఆర్థికస్థితిగతులను అవగాహన చేసుకొని, అంత అధికంగా వారికి సేవ చేసిన భారతీయుడు ఇంకొకరులేరని చెప్పవచ్చును. స్వరాజ్య సాధనకు పూనుకొనడమంటే సామ్రాజ్యవాద తత్వాన్ని వలస తత్వాన్ని ఎదిరించటం. అంతేకాని ఒక వ్యక్తినో, ఒక జాతినో, మరొక దేశపు ప్రజలనో ప్రతిఘటించటం కాదు అని గాంధీజీ పేర్కొన్నారు. ఆయన చరఖాకు, ఖాదీకి, గ్రామపరిశ్రమలకు ప్రాముఖ్యమిచ్చారు. ఆయన చరఖాను ప్రజల దృష్టిలో ఒక ఆర్థిక సంకేతముగా, విప్లవ చిహ్నంగా రూపొందించారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో ఆర్థిక చిహ్నంకంటే విప్లవ చిహ్నంగానే ఖాదీపరిశ్రమకు ప్రాముఖ్యం ఉండేది. గాంధీ టోపీ, ఖద్దరు ధారణ కాంగ్రెసు వాదులకు వన్నెతెచ్చాయి. ఖద్దరుధరించిన వారు శాంతికాముకులనీ, గాంధేయవాదులని, సౌజన్యమూర్తులని భారతీయసమాజంలో ఒక గుర్తింపు వచ్చింది.

గాంధీజీ ప్రభావం దేశంలో ఇంద్రజాలం వలె వ్యాపించినది. ఆయన కంఠంలో ఒక అద్భుతశక్తి ఉంది. అది ఇతరులలో ధైర్యం కలిగించేది. వారిలో దేశభక్తిని రెచ్చగొట్టి త్యాగాలకు సిద్ధమయ్యేటట్టు చేసింది. వేనవేల ప్రజానీకానికి ఆయన వాక్కులు వేదమంత్రాలయినవి. ఆయనను సందర్శించిన ప్రతీవ్యక్తి ఆజన్మాంతము సాధువర్తన శీలియై ఆమధురక్షణాలను తలచుకొంటూ జీవించాడు.

గాంధీజీ ఎంతటి వినయుడయినా ఆయనలో సానపెట్టిన వజ్రకాఠిన్యం ఉండేది. మృదుమధురభాషి అయినా ఆయనలో ధృఢనిశ్చయం స్పష్టంగా గోచరించేది. ఆయన కళ్ళు గంభీరముగా, ప్రశాంతంగా కనిపించినా వాటి వెనుక అచంచల దీక్ష పట్టుదల, మహోజ్జ్వల శక్తి ప్రతిబింబించేవి. ఆయన విశిష్ట వ్యక్తిత్వం, చిత్తశుద్ధి ఎదుటివారిని వశీకరణ చేసుకొనేవి. ప్రతీవ్యక్తికీ ఆయన మాటలు తనకే ప్రత్యేక సందేశమనే భావన కలిగించేవి. విప్లవ వాదులమని చెప్పకునే వారికెవరికీ చేతగానంతగా ఆయన భారతీయ ప్రజాహృదయాలను అర్థంచేసుకోగలిగారు. ఆయన ఏదైతే ప్రవచించారో దాన్ని స్వయంగా ఆచరించి చూపారు. ఆయన రూపొందించిన శాంతియుత సహాయనిరాకరణ, సత్యాగ్రహం నిశ్చయంగా ఆయన భారతదేశానికి, ప్రపంచానికి ప్రసాదించిన అమోఘమైన అస్త్రాలు.

గాంధీ ఒక చోట ప్రసంగిస్తూ "మన మధ్య వేల కొద్దీ తాగుబోతులుండటం కంటే భారతదేశంలో అందరూ దరిద్రులయినా మంచి దేనని, తాగుడుమాన్పిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గినా ఫరవాలేదనీ, అట్లాంటి ఆదాయాన్ని వినియోగించి అభివృద్ధి కార్యక్రమములు చేపట్టకపోయినా మెరుగే" నని చెప్పారు. మరి గాంధీజీ వారసులమంటూ మనం చేస్తూన్నదేమిటి? నగరాలలోనే కాదు, గ్రామ సీమల్లో కూడా మద్యం దుకాణాలను అనుమతించి 'ప్రజలమధ్యకు మద్యం' కార్యక్రమాలు చేపడుతున్నాం, ప్రజలకు దురలవాట్లను అంటగట్టివారిని ఆర్థికంగా కొల్లగొడుతున్నాం. "అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచి వెళ్ళగలిగిననాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పాలి" అని గాంధీజీ ప్రవచిస్తే స్త్రీకి గుడ్డపేలికలు తగిలించి, దరిదాపు నగ్నం చేసి అంగాంగ నృత్యాలు చేయిస్తూ నిర్లజ్జాకరమైన రాక్షస ఆనందాన్ని పొందటానికి యధేచ్చగా అనుమతినిస్తూన్నాం. విదేశీ వస్తువులను, బహిష్కరించమని, గ్రామీణ స్థాయిలో కుటీరపరిశ్రమలు ప్రోత్సహించమని, రైతు క్షేమమే దేశ సౌభాగ్యమని, దేశానికి గ్రామాలేపట్టు కొమ్మలని ఆయన బోధిస్తే, విదేశీ వస్తువులను, కంపెనీలను ఆహ్వానిసూ, ప్రపంచీకరణ పేరిట దేశస్వాతంత్ర్యాన్ని వాయిదాల పద్ధతిపై విదేశీయుల హస్తగతం చేస్తూన్నాము. అది ఒక పవిత్ర కార్యక్రమంలా విస్తృతమైన ప్రచారం సాగిస్తూన్నాం. రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా చేసి అప్పుల ఊబిలో కూరుకొనిపోయేటట్టు చేస్తూన్నాం. ఒక చెంప పై కొడితే మరి ఒక చెంప చూపమని మహాత్ముడు ప్రవచిస్తే, రెండు చేతులతో బాంబులు పట్టుకొని వీధులలో విశృంఖలంగా వీరవిహారం చేస్తూ, హత్యలు, మానభంగాలుచేస్తూ నీచనికృష్ణ కార్యక్రమాలలో పోటీపడుతున్నాం.

నేటి ఈ అశాంతితో నిండిన వాతావరణంలో ద్వేషం, హింస, స్వార్థం, భోగలాలసత, అవినీతి, అనైతికత విశృంఖలముగా పెచ్చురిల్లుతున్న కాలంలో గాంధీజీ జీవితం, ఆయన సిద్దాంతాలు, ఆయన జీవన విధానం అధ్యయనం చేయటం అత్యవసరం. ఆయన మార్గం సదా అనుసరణీయం. నేటి ప్రభుత్వాలకు ప్రజలకు అదే శరణ్యం. గాంధీజీ చెప్పినట్టు “ఆయన జీవితమే, ఆయన సందేశం.”