పల్లెపదాలు/వరికలుపుపాట

వికీసోర్స్ నుండి

8 వరికలుపుపాట

—వరిచేనులో కలుపుతీస్తున్నప్పుడు, అంటే పొలాన్ని నిర్మాలిన్యము చేస్తున్నప్పుడు కూలివారి కల్పన సుకుమారి కోడలిమీదకి ప్రసరించింది. బంగారు బిందెలోని చేమంతికట్టలలోని చిన్నపు మంచపు సన్నపు నులకమీద పడుకున్నదట జాణ లక్ష్మమ్మ! పాటనంతా వినండి.

చిక్కుడూఆకుల్ల వెన్నియ్యలో
శివసద్దులుగట్టి వెన్నియ్యలో
చిత్తూరునేబోదు చుట్టాలజూడ
అక్కడెవరున్నారె ఆంభోజిరాజు
మా అమ్మతమ్ములు మాకు మేనమామలు
మముగన్నతండ్రికి బావమరదులమ్మ
బావమరదులుగూడి బాయితోడించిరి
బాయిలో ఉన్నది బంగారిబిందె
బిందెలో ఉన్నది చామంతికట్ట
కట్టలనెవున్నది చిన్నపు మంచము
చిన్నపు మంచానికి సన్నపునులుక
దానిమీద పండేటి జాణలెవరమ్మ
పనిజేసె లక్ష్మమ్మ పవళించినాది
విసనగఱ్ఱలతోటి విసిరిలేపన్నా
విసిరినాలేవదు విరజాజిమొగ్గ
కొబ్బరాకుడకలతో కొట్టి లేపన్నా

కొట్టినా లేవదు కోమటోరిపట్టి
డొప్పళ్ళ గందంబు గుప్పిలేపన్నా
గుప్పినా లేవదు ఈ గురిజలబంతి
దొడ్లో పనులెళ్ళే దోరఎండలొచ్చె
ఇకనన్న లేవవే దొడ్డివారిబిడ్డ
మందపసులెళ్ళె మారుఎండలెక్కె
ఇకనన్న లేవవె మా అమ్మ కోడలా

దోరటెండలూ మారుటెండలూ, దొడ్డికడువులూ వాటిపశువులూ మేతకు పోయేవేళలే; సూర్యుడుకాదు దినాన్ని నడిపేది! కోళ్ళూ, పశువులూ పాలెవాళ్ళూన్ను. మచ్చపడని చైతన్యము కనపడుతుందికాదూ పల్లెటూళ్లలో?

—ఊడ్పులూ కలుపుతీతలూ అయిపోతే పల్లపు పొలములలో పనులుండవు. మళ్లీ కోతనాడే కూలిజనముల కోలాహలము.