పల్నాటి చరిత్ర/పల్నాటి నేలిన ప్రభువుల చరిత్ర

వికీసోర్స్ నుండి

పల్నాటినేలిన ప్రభువుల చరిత్ర

క్రీస్తునకు పూర్వము నాగులను జాతివారు పల్నాటిలో నుండిరి. ఆంధ్రదేశములో బౌద్ధమతము వ్యాపించిన పిమ్మట బౌద్ధ శాసనములు పాళీ భాషలో నున్నవి. గురజాలలో రెంటచింతలపోవు రోడ్డు నానుకొని కోటసాని దిగుడు బావి వద్ద పాళీభాషలోని యొక శాసనముకలదు. నాగార్జునుని కాలమున ననగా రెండవశతాబ్దాన్తమున పల్నాడు ఆంధ్ర ప్రభువులగు శాతవాహన వంశపురాజులక్రింద నుండెను,

అప్పుడేలురాజునకు బంధువగు చాంతిశ్రీయను రాచకుమారి ప్రోద్బలముచే నాగార్జునకొండ స్థూపము కట్టబడినట్లు నాగార్జునకొండలోని పాళీభాషలోగల శాసనమునుబట్టి తెలియుచున్నది. ఆంధ్రులు నాలుగు వందల సంవత్సరములు పాలించిరి. వారిరాజ్యము 'కంచి' (కాంచీపురము) మొదలు మగధ (బీహారు) లోని పాటలీపుత్రము (పాట్నా) వఱకును. తూర్పు పడమరల నుభయసముద్రముల వఱకును వ్యాపించెను, వారు రోము మున్నగు దేశములతో వ్యాపారము చేసిరి, నాగార్జునకొండలో కొన్ని రోమీయనాణెములు దొరకినవి. ఆంధ్రులనాణెములమీద “ఓడ ” ముద్రింపబడినది. (వానిని నేను చూచితిని) వారలకు కొంతకాల మమరావతియు, కొంతకాలము అమరావతికి వాయవ్యదిక్కున మూడు మైళ్ల దూరముననుండు ధరణికోట (ధాన్యకటకము) ముఖ్య పట్టణములుగా నుండెను. మూడవశతాబ్దములో నిక్ష్వాకులు పాలించిరి. ఇక్ష్వాకుల నాణేములు కొన్ని నాగార్జున కొండలో దొరకినవి. అటుపిమ్మట పల్లవులు పాలించిరి. పల్లవుల పిమ్మట చోళులు పల్నాటిని పాలించిరి. గురజాలలోని యిష్టకామేశ్వరాలయము చోళులకాలమునాటిదని ప్రతీతి. కొన్ని శాసనములలోని ప్రభువుల పేర్లలో కన్నడపు పేరులు గాన్పించుటచే కన్నడ దేశపు రాజులు చోళులపిమ్మట పల్నాటి నేలినట్లు తెలియుచున్నది. ఆపిమ్మట చాళుక్యులు పాలించిరి. చాళుక్యప్రభువులలో చాలమందికి పేరులచివర ఆదిత్యుడని యుండును. (విజయాదిత్యుడు, గుణగాదిత్యుడు, విమలాదిత్యుడు మొద లగునవి.) అట్టి ఆదిత్యులలో నొకనివలన మాచర్లలోని యాది త్యేశ్వరాలయము నిర్మింపబడినది. అది శివాలయము, ఆదిత్య నిర్మిత దేవప్రాసాదమని శాసనములోనున్నది. దానికి చాగి బేతరాజు అను ప్రభువు క్రీ॥శ॥ 1111 లో భూదానము చేసెను. అటుపిమ్మట వెలనాటి ప్రభువు ధవళశంఖుని క్రింద పల్నాడుం డెను, వానికి చందవోలు ముఖ్యపట్టణము. అతడుతన కూతురు నకు పల్నాటి నరణముగా వివాహవేళనిచ్చెను. అంతటనుండి పల్నాటివీరులు పాలించిరి. వీరు హైహయవంశజులు. వీరిని గళచురి రాజులందురు. రేవా (నర్మదానది) ప్రాంత మునగల పాలమాచాపురి (జబల్పూరు) నుండివచ్చిరి. వీరిలోపల్నాటి నేలినది అలుగురాజు, నలగామరాజు మలిదేవాదులు, పల్నాటి యుద్ధము క్రీ॥శ॥ 1180 ప్రాంతమున జరిగెను, ఆకాలమున వరంగల్లు నేలుచున్న కాకతీయ ప్రభువగు మొదటి ప్రతావ రుద్రుడు నలగాముని సహాయార్థము1000 గుఱ్ఱపు సైన్యమును బంపెనని పల్నాటి వీర చరిత్రలోకలదు. నాయకురాలు సంధికై బ్రహ్మనాయనివద్దకు పంపిన రాయబారి కోటకేతుడు ధరణికోటరాజు. ఇతడు శక 1104 (1182 A.D) లో రాజ్యమునకు వచ్చినట్లు అమరావతి శాసనములో నున్నది. నలగాముడు సహాయము కొఱకుత్తరములు పంపినవారిలో (రెండవ) వీరభల్లాణుడు కలడు. ఇతడు ద్వారసముద్రము రాజధానిగా క్రీ. శ. 1173 మొదలు 1221 వఱకు రాజ్యమేలెను. వీర చరిత్రలో వెలనాటి చోడుడు కూడ నుదహరింపబడినాడు. ఇతని యసలు పేరు రాజేంద్రచోడు డైనట్లును క్రీ.శ. 1158 మొదలు 1200 వఱకు పాలించినట్లను తెలియుచున్నది. అలుగురాజు నలగామరాజుల కాలములో ననేక చోట్ల చెరువులు త్రవ్వబడినవి. ఆలయములు బాగు చేయబడినవి. మాచర్ల చెన్నకేశవాలయమును బ్రహ్మనాయుడు బాగుచేసి పెంపుచేసెను. పల్నాటివీరుల పిమ్మట యనగా 13వ శతాబ్దమున పల్నాటిని పద్మనాయకులు పాలించిరి. కనిగిరిసీమ ప్రభువగు కాటమరాజునకును నెల్లూరి ప్రభువగు మనుమసిద్ధి రాజునకును పశువుల పుల్లరివిషయమై యుద్ధముజూగేరు. ఖడ్గ తిక్కన మనుమసిద్ధిరాజువద్ద సేనానిగానుండెను. పల్నాటి పద్మనాయకులు కాటమరాజునకు యుద్ధమునందు సహాయము చేసిరి. (కాటమరాజు గుడులచ్చ టచ్చట ప ల్నాటిలోకలవు, పశువుల విషయమై యాపదలు వచ్చినప్పుడీ గుడులకు మ్రొక్కుకొందురు.) మనుమసిద్ధిరాజుయుద్ధమునందోడెన కాటమరాజు నెల్లూరి నాక్రమించెను.మనుమసిద్ధిరాజుకు మంత్రియు నాస్తానకవియునగు తిక్కన సోమయాజి వరంగల్లునకు బోయెను. కాకతీయ చక్రవర్తియు మొదటి ప్రతాప రుద్రుని కుమారుడునగు గణపతిదేవుడు అప్పుడు వరంగల్లు నేలు చుండెను. గణపతి దేవునివద్దగల బౌద్ధులను జైనులను తిక్కవ సోమయాజి వాదమునందు గెలిచి గణపతి దేవుని మెప్పుపొందెను. తిక్కనకోరికపై మనుమసిద్ధిరాజు సహాయమునికై గణపతి సైన్యమును బంపెను. కాటమరాజు నెల్లూరివిడచి పారి పోయెను. మనుమసిద్ధిరాజు నెల్లూరికి ప్రభువయ్యెను. పల్నాడు కాకతీయ సామ్రాజ్యములోనికి వచ్చెను. అనగా పల్నాటియుద్ధము జరిగిన 50 సంవత్సరము లకు పల్నాడు గణపతి దేవుని క్రిందకు వచ్చెను.

కాకతీయుల పాలన

కాకతీయుల కాలమునాటి దానశాసనములు పల్నాటిలో చాలగలవు శాసనములందు, శాలివాహన శకమే కాకుండ కాకతీయ చక్రవర్తుల పేరులు సహితము పేర్కొన బడినవి. మాచర్లరోడ్డు వంతెనవెంబడి చంద్రవంక యొడ్డున పాడుపడిన గుడివద్దనున్న శాసన మట్టివానిలో నొకటి. గణపతి దేవుడు క్రీ॥ శ॥ 1260 వఱకు రాజ్యమేలెను. అతని కాలమున నతనిమంత్రులలో నొకడు రాష్ట్ర పాలకులలో నొకడునగు సాహిణి గంగయ్యక్రింద పల్నాడుండెను. గణపతిదేవు ని పిమ్మట అతనికుమార్తెయగు రుద్రమదేవి కాకతీయ రాజ్యమేలెను. ఆరాణి కాలమున యామెరాష్ట్రపాలకుడగు జన్నిగదేవరాజు క్రింద పల్నాడుండెను. ఈజన్నిగదేవరాజు సాహిణి గంగ య్యకు మేనల్లుడు. ఈజన్నిగదేవునికాలమున కారెంపూడి లోని సురేశ్వరాలయమునకు గోపుర ప్రాకారములు కట్టబడినవి. దుర్గి లోని శ.క. 1191 (1269 A.D) శాసనములోను కారెంపూడి శ॥క ॥ 1186 (1264 AD) శాసనములోను జన్నిగదేవరాయనిపేరు పేర్కొనబడినది. జన్నిగదేవరాయల పిమ్మట త్రిపురాంతకదేవుడు రాష్ట్రపాలకుడుగా నుండెను. అతని క్రింద పల్నాడుండెను . దాచేపల్లిలోని శ.శ. 1135 (1213 A. D.) నాటి శాసనమునందు త్రిపురాంతక దేవుని పేరు చెప్పబడినది. రుద్రమదేవి పిమ్మట నామె మనుమడగు రెండవ ప్రతాపరుద్రుడు వరంగల్లునకు ప్రభువ య్యెను. అతనికాలముననే కాకతీయ రాజ్య మంతరించెను. అతనికి మంత్రి ప్రసిద్ధిచెందిన యుగంధరుడు. అతనికాలమున నతని రాష్ట్రపాలకుడును మంత్రియునగు సాహిణి మాచయ సేనాని క్రింద పల్నాడుండెను. ఇతడు క్రీ శ. 1311 సంవత్సరమున గురజాల, పింగళి స్తలములు చేరియున్న పలినాటి సీమ కధికారియని కోన వెంకటరాయశర్మగారు వ్రాసిన దండనాధులను పుస్తకములో నున్నది. ఇతను మహదేవి చెర్వు పట్టణము (మాచర్ల) నేలుచుండినట్లు మాచర్లలోని శ. క. 1236 (1314 A. D) నాటి శాసనములోనున్నది. ఇతని పేరు శ.క.1229 (1307 A. D) నాటి కారెమ పూడి శాసనములోగూడ నున్నది. ఇతనినిబట్టియే మహదేవి చెర్వు పట్టణమునకు మాచెర్లయని పేరువచ్చియుండవచ్చును. తంగెడకోటను ఉప్పల అనుములు మాచిరెడ్డి యనుగతడు కట్టించినట్లు తెలియుచున్నది.

కాకతీయులపిమ్మట కొండవీటి రెడ్డిరాజుల క్రిందకు పల్నాడువచ్చెను. కొండవీటి రెడ్డిరాజులు ఒరిస్సాకు ప్రభువు లగు గజపతులకు సామంతులుగ నుండిరి. కొండవీటి రాజ్యమునగల 14 సీమలలో పల్నాటిసీమ యొకటి. పల్నాటిసీమలో గురజాలసముతు మాచర్ల సముతు తుమురుకోడు సముతు తంగెడసముతు కారెంపూడి సముతు యని యైదుసముతులుండెను. దాచేపల్లిలోని పాడుపడినకోట కొండవీటి రెడ్డిరాజులచే గట్టబడినది. కొండవీటి చరిత్రము కొండవీటి దండకవిలె వలనను, మద్దులపల్లి గురుబ్రహ్మశర్మగారు వ్రాసిన కొండవీటిసామ్రాజ్యమను గ్రంధమువలనను తెలియనగును. కొండవీటి రెడ్ల యాస్తానకవి యగు శ్రీనాధుడు పల్నాటిలో ననేకపర్యాయములు తిరిగి మనోహరములగు పద్యములు చెప్పెను. పల్నాటి వీరగాధను ద్విపదకావ్యముగా రచించెను. అనగా యుద్ధము జరిగిన 300 సంవత్సరములకు మొదటితూరి (ద్విపదగా) వీరగాధ రచింపబడెను. కొండవీటిని కృష్ణదేవరాయలు క్రీ. శ. 1516 లో గెలిచెను. అప్పుడు పల్నాడుకూడ విజయనగర సామ్రాజ్యము లోనికి వచ్చెను.

విజయనగర రాజుల పాలన

పారిజాతాపహరణము నందు నంది తిమ్మన "సీ. ఉదయాద్రివేగ నత్యుద్ధతిసాధించె | వినుకొండమాట మాత్రన హరించె | గూటముల్ సెదరంగ కొండవీడగలించె | బెల్లము కొండ యచ్చెల్ల జెఱచె" నని పల్నాటినానుకొనియున్న వినుకొండ బెల్లముకొండ దుర్గములను కృష్ణదేవరాయలు గెలిచెనని వర్ణించెను. కృష్ణ దేవరాయని శాసనములు శ. క. 1440 (1518 A. D.) పట్లవీడులోను కలవు. పట్లవీడు శివారు రామడక అను గ్రామమును మాచర్ల చెన్న కేశవస్వామివారికి సమర్పించినట్లు పట్లవీటి శాసనములో మన్నది, అనగా రాయలస్వాధీనమైన రెండు సంవత్సరముల కీదానము జరిగినది. ధరణికోట శాసనములో అద్దంకి , వినుకొండ. బెల్లము కొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరము, మొదలగు దుర్గములను రాయలు గెలిచెనని కలదు. అహోబల శాసనములో వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, అద్దంకి, అమ్మన బ్రోలు, తంగెడ, కేతవరము మొదలగు దుర్గముల రాయలు గెలిచెననికలదు. కృష్ణ దేవరాయల పాలనమునందు క్రీ.శ. 1518న నతని రాష్ట్రపాలకుడగు యల్లవినాయంకరు మకృకాతిమ్మరు నాయంకరు పాలనముక్రింద పల్నాడుండినట్లు పట్లవీటి శాసనము వలన తెలియుచున్నది. క్రీ.శ. 1526 యందు కృష్ణదేవరా యలరాష్ట్రపాలకుడగుకోనపనాయనింగారిక్రిందపల్నాడుండినట్లు మాచర్ల శాసనమువలన తెలియుచున్నది. మాచర్ల వీరభద్రా లయములోని యెఱ్ఱబండ శాసనమునందు సదాశివ రాయలు విజయనగర సామ్రాజ్యము పాలించుచుండగా ఆ సామ్రాజ్యము నకు లోబడి నాగార్జున గుకొండ సీమను పాలించు ప్రభువగు తిమ్మానాయనింగారి భార్య లింగాంబ తనపేర లింగాపురమను గ్రామము కట్టించి వీరభద్రస్వామికి సమర్పించి నట్లున్నది. ఈ దానశాసనము ననుసరించి యిప్పటికిని యీలింగాపురము వీరభద్రస్వామివారి కైంకర్యమునకు వినియోగ పడుచున్నది.

సదాశివరాయలు క్రీ. శ. 1542-1568 వఱకు పాలిం చెను, ఆకాలమున మాచర్ల ప్రాంతము నాగార్జున కొండసీమ యని వ్యవహరింపబడుచుండెననియు, దానికి తిమ్మానాయనింగారను వాడు రాష్ట్రపాలకుడుగా నుండెననియు తెలియుచున్నది. గురజాలలో వీరభద్రస్వామి యాలయములో నాగుపాములు చిత్రింపబడిన రాతి స్తంభపు శాసనముమీద తిరుమల దేవరా యనికాలపు శాసనమున్నది. కాబట్టి క్రీస్తుకు పూర్వము రెండు పిమ్మట రెండు శతాబ్దములందు ఆంధ్రరాజులు, 3 వ శతాబ్ద మున ఇక్ష్వాకులు, 4, 5, 6, 7, 8, శతాబ్దములందు పల్లవులు, 9, 10 శతాబ్దములంగు చోళులు, 11వ శతాబ్దమున చాళుక్యులు వెలనాటిచోళులు, 12 వ శతాబ్దమున పల్నాటి వీరులు పద్మనాయకులు, 13, 14, శతాబ్దములందు కాకతీయ రాజులు, 14, 15 శతాబ్దములంకు కొండవీటి రెడ్డిరాజులు, 16 వ శతా బమునందు విజయనగర ప్రభువులు పాలించిరి.

మహమ్మదీయపాలన

విజయనగర సామ్రాజ్య మంతరించగనే పల్నాడు క్రీ. శ. 1565 ప్రాంతమున గోల్కొండనవాబు వశమయ్యెను. నాగార్జునకొండకు పదిమైళ్లు దక్షిణముగా కృష్ణాతీరమున { పెందోటయను పట్టణముండెను. దానిని ధవళేశ్వరపు మార్కండేయుడను విశ్వబ్రాహ్మణప్రభువు పాలించెను. ఇతడు 1585 A. D. ప్రాంతమున నుండెను. అప్పుడు గోల్కొండను పాలిం చుచున్న మహమ్మద్ కుతుబుర శాహికి మంత్రియై, సామంతుడై యతని రాజ్యవిస్తరణకు తోడ్పడెను. కుతుబురశాహి కీ. శ. 1580 నుండి 1611 వఱకు పాలించెను. తుర్కా రాజు కవి, అయ్యంకి బాలసరస్వతి యను నిరువున కవుల పోషించి ఈ మార్కండేయ ప్రభువు స్కాందపురాణములోని నాగర ఖండమును వారిచే తెలుగు చేయించి కృతినొందెను.క్రీ.శ. 1660 ప్రాంతమున నుండిన అప్పకవి తన గ్రామమగు కామేపల్లి సాయప వేంకటపతి భూనాయకునిచే నీయబడినదని వ్రాసికొనెను. అప్పకవి కాలములో పల్నాటిలో 194 గ్రామము లుండెనని ‘పల్లెనాటను నూట తొంబదియునాల్గు గ్రామముల' అను అప్పకవీయములోని పద్యమువలన తెలియుచున్నది. (కొండవీటి రెడ్లకాలమున 150 గ్రామములున్నట్లు తెలియుచున్నది. ఇప్పుడు శివారుతో కలిపి 133 గ్రామము exన్నవి.) గోల్కొండనవాబు పిమ్మట పల్నాడు ఆర్కాటు నవాబు క్రిందికివచ్చెను, 18వ శతాబ్దం ప్రారంభమున రామరాజు మంత్రప్ప దేశాయి యనునతడు పల్నాటికి దేశముఖుడు (దేశ వ్యవహర్త) యయ్యెను. అతని మనుమడు వీరభద్రయ్య వరుసగా 34 సంవత్సరములు పల్నాటికి దేశముఖుడుగా నుండెను. ఆర్కాటునవాబగు మహమ్మద్ ఖాన్ క్రీ. శ. 1764 లో వీర భద్రయ్యను తొలగించెను. అప్పుడు పల్నాడు ఉత్తరసర్కారులలో లేదు. పల్నాడు, ఒంగోలు తాలూకాలు తప్ప మిగిలిన గుంటూరుజిల్లా మాత్రమే యుత్తరసర్కారులలో నుండెను. ఒంగోలు నెల్లూరితో బాటు పల్నాడు ఆర్కాటునవాబు క్రింద నుండెను. ఆర్కాటునవాబు తన రాజ్యమును కొన్ని భాగములుగ విభజించి తనకు రావలసినశిస్తును తనసభలో ప్రతిసంవత్సరము వేలము వేయుచుండెను. ఎక్కువ పాట పెట్టినవాడు పాట మొత్తమును నవాబుకు చెల్లించి పాట పెట్టిన గ్రామములలోని ప్రజలనుండి శిస్తు వసూలు చేసికొనుచుండెను. తుమృకోడులో కొంత సైన్యముతోబాటు నొక ఫౌజుదారుని నెలకొల్పెను. 1766 నుండి ఈస్టు ఇండియాకంపెని వారి సైన్యము కూడ కొంత తుమృకోడులో నుండెను. తుమ్పకోడులో చనిపోయిన ఆంగ్లేయ సైనికోద్యోగుల సమాధులలో ఆర్కాటునవాబగు (క్లైవుకాలమందలి) మహమ్మదాలిపేరు నమోదు కాబడినది. 24-2-1787 న యితర జిల్లాలతో బాటు పల్నాటినికూడ నవాబు కంపెనివారికి తాకట్టు పెట్టెను. 1790 జులై నెలలో కంపెనివారి పాలన ప్రారంభమయ్యెను.

ఆంగ్లేయుల పరిపాలన

పల్నాటికిని ఒంగోలునకుకు కలిపి (Erskine) యిర్శికిన్ యనునతని కలెక్టరుగా కంపెనివారు నియమించిరి. తుమృకోడులో నొక డిప్యూటి తహసీలుదారు డుండెను. 1793 లో కృష్ణనుదాటి నైజామునుండి వేయిమంది సిపాయులు బందిపోటు దొంగలుగా వచ్చి కంపెనివారి సైన్యమును చంపి దేశమును దోచుకొనిరి. వినుకొండనుండి కంపెని వారి సైన్యము వచ్చి వారిని పాఱదోలెను. 1801 లో ఆర్కాటునవాబు పల్నాటిని కంపెనివారికి చ్చెను. 31-7-1801 (scot) స్కాటు యనునతడు కలెక్టరాయెను. 1816 లో పిండారీలు అమరా పతివద్ద కృష్ణనుదాటి దేశమును కొల్లగొట్టుచు గుంటూరు నరసరావుపేట వినుకొండ మీదుగా కంభముకు పోయిరి. గుంటూరిని పిండారీలు దోచుకొనిరి. పిండారీలలోని యొక గుంపును నరసరావుపేటజమీందారుడగు గుండారాయుడు కోట ప్పకొండవద్ద జయించెను. 1832-33 (నందన) సంవత్సరమందు గుంటూరు కృష్ణాజిల్లాలకు పెద్దకఱవువచ్చెను. దానిని డొక్కలకఱవందురు. అప్పుడు రైలుమార్గములు లేనందున గోదా వరి ప్రాంతము పండినను ఆ ధాన్యమిచ్చటకు వచ్చుటకు వీలు లేక కఱవుచే ప్రజలు బాధపడిరి. 1859 డిశంబరు లో గుంటూరు మచిలీపట్టణము జిల్లాలను కలిపి కృష్ణాజిల్లాగ చేర్చిరి. దరిమిలా గుంటూరు కృష్ణాజిల్లాలు వేఱయ్యెను. ధాత కఱవు (1876) లో ప్రజలు బాధపడిరి. తహసీలుదారు ఆఫీసు దాచేపల్లి నుండి గురజాలకు మార్చబడెను. కారెమపూడిలో పల్నాడు వినుకొండ నరసరావుపేట తాలూకాలకు నొక మునసబుకోర్టుండెను. దానిపై యప్పీలు చేయుటకు బందరులో జడ్జికోర్టు ఉండెను. యూరపియనులు డిస్ట్రక్టు మునసబులుగను జడ్జిలుగనుండిరి. వైటుదొర (white) డిస్ట్రక్టమునసబుగా నుండినప్పుడు 1895 ప్రాంతమున మునసబు కోర్టు కారెమపూడినుండి నరసరావుపేటకు మార్చబడెను. గుఱ్ఱపుబండ్లు అంచెలుగా నేర్పడి వాని మీద ప్రయాణములు చేయుచుండిరి. ఇప్పటికి 50 సంవత్సర ముక్రింద దైదవద్ద కృష్ణానదికి ఆనకట్ట కట్టవలయునను నుద్దేశ్యముతో సర్కారువారు యీతాలూకాను కొలిపించి ప్లానులు తయారుచేయించిరి. కృష్ణవద్ద నొక బంగళానుకట్టిరి తరువాత నాప్రాజెక్టును మానుకొనిరి. ఆ బంగళా యిప్పటికిని యున్నది. 1915 ప్రాంతమున మోటారు బస్సు సర్వీసు యేర్పడెను. 1920 లో అసహాయోద్యమ సందర్భమున ప్రభుత్వ సైనికులచే జంగమహేశ్వరపురము, పొందుగుల, రామాపురం మొదలగు: చోట్ల నల్లరులు జరిగెను. పుల్లరిని కట్టవద్దని ప్రచారము చేసిన కన్నెగంటి హనుమంతు యనునతడు మించాలపాడువద్ద కాల్చబడెను. 3-1-1927 న గురజాలలో మునసబుకోర్టు యేర్పడెను. 1928 లో నాగార్జునకొండ విషయము బయలు పడెను. 1929 లో పల్నాటికి రైలుమార్గమేర్పడెను. 1937లో గోపన్న యానునతనిచే గురజాలలో మూడున్నర రూపాయలకు 15 రోజులలో నాలుగురూపాయ లిచ్చునట్లు కంపెనియేర్పడి ముప్పదిలక్షల రూపాయలవఱకు వ్యాపారము చేసి ప్రజలను నష్టపఱచెను. పల్నాటికి మొదటి హైస్కూలు గురజాలలో నేర్పడెను. దరిమిలా చాలగ్రామములందు హైస్కూళ్ల నేర్పచిరి. 1937 లో కావూరి వెంకయ్య గారిచే గురజాల హరిజన వసతి గృహమేర్పడెన. అది దినదినాభివృద్ధి చున్నది. 1939 లో ప్రారంభమైన రెండవ ప్రపంచయుద్ధము 1945 లో అంతమయ్యెను. 15–8_47 న మన దేశమునకు స్వాతంత్య్రము వచ్చెను. 1948 లో నైజాములో జరిగిన రజకార్ల యల్లరుల మూలమున చాలమంది నైజాము ప్రజలు పల్నాటిలో తలదాచుకొనిరి. 26-1-50న మనదేశము రిపబ్లిక్ ఆయెను. 1950 లో కమ్యూనిస్టులు యల్లరుల మూలమున పల్నాటి ప్రజలు బాధపడిరి. ఆహార వస్తువులమీదను, వస్త్రముల మీదను యుద్ధకాలమున పెట్టబడిన కంట్రోళ్లను స్వాతంత్య్రము వచ్చినను తీసివేయనందున ఇతర ప్రాంతములందలి ప్రజలతో బాటు పల్నాటిప్రజలు కూడ బాధ పడిరి. 1952లో కంట్రోళ్ళు తొలగింపబడెను. ఆ సంవత్సరమే గురజాలలో సెకండరిగ్రేడు ట్రయినింగుస్కూలు యేర్పడెను.

_________________


పల్నాటి కవులు

1. పింగళి సూరన:- పింగళి సూరన గరుడపురాణమును తెనిగించెను. రాఘవ పాండవీయమను శ్లేషకావ్యమును, కళాపూ ర్ణోదయమను నద్భుత కావ్యమును, ప్రభావతీ ప్రద్యుమ్నమును రచించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు. గౌతమగోత్రుడు . 16వ శతాబ్దమువాడు, ఇతడు క్రీ.శ 1566వ సంవత్సర ప్రాంతయిన నుండెనని కందుకూరి వీరేశలింగముగారు నిర్ధారణ చేసిరి కృష్ణదేవరాయలు (1509 -1530) వఱకు రాజ్యమేలెను.