Jump to content

పల్నాటి చరిత్ర/చారిత్రక విషయములు

వికీసోర్స్ నుండి

పల్నాటి చరిత్ర

గుంటూరు జిల్లా తాలూకాలలోని కెల్ల పల్నాడు పెద్దది. వైశాల్యము 1050 చ. మైళ్లు. ఉత్తరమున 80 మైళ్లు, కృష్ణా నది కలదు. కృష్ణ కావలి యొడ్డున నైజాముకలదు. పల్నాటి నుండి శ్రీ శైలమువఱకు నల్లమల కొండలును అడవులును వ్యాపించియున్న వి.

చారిత్రిక విషయములు

పల్నాడు:-నాడు అనగా దేశములో కొంత భాగము, మన పూర్వులు దేశమును నాడులు, సీమలు మండలములుగా విభ జించిరి. పల్నాడు, రేనాడు, పాకనాడు, వెలనాడు మొదలగు నవి నాడులు. గుంటూరు జిల్లాలోని చందవోలు పరిసర ప్రాంత మును ప్రస్తుతము తెనాలి, రేపల్లె, బాపట్ల తాలూకాలను) వెలనాడు అందుకు. దానికి కమ్మనాడు అని నామాంతరము కలదు. కొండవీడు మొదలు కందుకూరువఱకు (ప్రస్తుతము గుంటూరు, ఒంగోలు తాలూకాల్ను, సత్తెనపల్లి, నరసరావుపేట తాలూకాలలో కొంతభాగమును, నెల్లూరు కర్నూలు జిల్లాలలో కొంతభాగమున) గల ప్రదేశము పాకనాడు అందురు ప్రస్తుతము పల్నాటి తాలూకానున్ను, సత్తెనపల్లి నరసరావుపేట వినుకొండ తాలూకాలలో కొన్ని గ్రామములను కలిపి పూర్వము పల్నాడనిరి. పల్నాటికి పలనాడు, పలినాడు పల్లె నాడు అని నామాంతరములు, పల్లవులు పాలించుటచే పల్లవ నాడు అను పేరు వచ్చి తరువాత పలనాడుగను పల్నాడగను మాఱినదని చిలుకూరి వీరభద్రరావుగారి యాంధ్రుల చరిత్రలో కలదు. పల్లవులు చాల దేశము పాలింపగ ఈ దేశభాగమునకు మాత్రమే ఈ పేరెందుకు వచ్చెనో తెలియదు. పల్లె లుండుటచే పల్లెనాడు అని వచ్చినదనియు, అచ్చట దొరకు పాలరాతినిబట్టి పాలనాడు పలనాడు అనిన యింకను బాగుండు ననియు (The name is derived from pallenadu land of hamlets. A more poletical derivation of Palnad is Palanad(milk land) from the light cream coloured_marbles that abound there) అని కృష్ణా డిస్ట్రిక్టు మాన్యుయల్ లో కలదు. పల్లుగానుండుటచే పల్లునాడయి పల్లు విల్లు ముల్లు శబ్దములబోలె పలునాడుగను, తరువాత పలనాడు పల్నాడుగను మాఱియుండునని అక్కిరాజు ఉమాకాంతముగారు వ్రాసిరి, మాచర్ల యాదిత్యేశ్వరాలయ శాసనములో ‘పల్లిదేశ'మనికలదు. అమరావతి శాస నములో "పలనాడు" అని కలదు. కారెమపూడి తూర్పువైపు నల్లాంచక్రవర్తుల శాసనములో 'పలినాటి' వారు అని కలదు. పూర్వకవులు "పల్లెనాడు" అని గ్రంధస్థము చేసిరి, శ్రీనాధుని చాటుపద్యములలో 'పల్లెనాటిసీమ పల్లెటూళ్లు: 'రసికుడు పోవ పల్నాడు' ' పన్నుగ పలినాటిసీను ప్రజలందఱికిన్' 'పలినాటికి మాటికి పోవనేటికిన్' 'కారేమపూడి పట్టణము కాశిగదా పలివాటివారికన్' అని కలదు. ప్రభావతీ ప్రద్యుమ్ను ములో పింగలి సూరన తనవారు 'పలనాటను పాకనాటనున్ ప్రసిద్ధులైనట్లు వ్రాసికొనినాడు.

వీరభద్రకవి సన్మానంబొప్ప నొసంగె పుత్రికకు పల్నాడైదు దేశంబులన్' అని పల్నాటి వీరభాగవతములో వ్రాసి నాడు. ప్రబంధ పరమేశ్వర వేంకటేశ్వర విలాసములో 'పలనాటి గొల్లలపాటజాతి' యని గణపవరపు వేంకటకవి వ్రాసెను అప్పకవీయములో నప్పకవి "పల్లెనాటను నూటతొంబదియు నాలుగ్రామముల” అని వ్రాసెను. దొరకినదానిలోనికెల్ల పూర్వపుదియగు మాచర్ల యాదిత్యేశ్వరాలయ శాసనములో “పల్లి దేశ” మని యుండుటచే పల్లెలుండుటచే పల్లెనాడు పల్నాడు అని పేరు వచ్చియుండును.

నాగులేరు:- పూర్వము నాగులను జాతివారు నివసించు టచే నాగులేరను పేరు వచ్చెనందురు. 'నాగాధిపతి ప్రాణనాశంబుచేసి నడుముగాబాఱిన నాగులేఱాయె" యనియు 'తరువాత సర్పాఖ్యతటిని లోపలను' అని శ్రీనాధుడు పల్నాటి వీర చరిత్రలో చెప్పుటచే నాగుపామును పట్టి నాగులేరను పేరు వచ్చియుండును.

‘చంద్రవంక:- ఇది 'చంద్రభాగా' యని మాచర్లలోని యాదిత్యేశ్వరాలయ శాసనములో బేర్కొనబడినది. మాచర్ల వీరభద్రస్వామి యాలయములోని యెఱ్ఱబండ శాసనము సందును ‘చంద్రభాగ’ యనికలదు. హిమాలయమునుండి ప్రవహించునదులలో నొకదానికి చంద్రభాగయని పైశాసనములబట్టి చంద్రవంక కుకూడ చంద్రభాగయని పేరున్నట్లు తెలియుచున్నది. మాచర్ల వద్ద బాలచంద్రునివలె వంకరగా తిరుగుటచే చంద్రవంకయను పేరుగల్గెను.

గురజాల:- గురజాలకు గురివిందలయని మానవీపు రము అని ముదిగొండ వీరభద్రకవికృత వీరభాగవతమందు కలదు, మాధవియనగా గురివింద. గురివిందతీగలను నఱికి యూరుకట్టటచే గురిజాలయని వచ్చెనందురు. వీరచరిత్ర లోను గురిజాల, గుర్జాలయని శ్రీనాధుడు వ్రాసేను. చాటు పద్యములలో గురజాల యిష్టకామేశహరాయనియు గురిజాలసీమ యనియు వ్రాసెను. వీరభద్రస్వామి యాలయము లోని శక 1470 శాసనములో గురిందల గురిందలసీమయని కలదు.

మాచర్ల:- ఆదిత్యేశ్వరాలయ శాసనములో మహాదేవి తటాకమని మాచర్లకు వాడబడినది మాచర్ల వద్దనున్న మహదేవి చెరువునుబట్టి యీ పేరు వచ్చియుండును. వీరభద్రా లయములోని యెఱ్ఱబండ శాసనములో మాచెర్లయని కలదు. వీరచరిత్రలో మాచర్ల మాచెర్ల యని శ్రీనాధుడు వాడెను. బ్రహ్మనాయుడు మలిదేవాదులతో గూడి వలగామునినుండి విడివడివచ్చుచు మజిలీచేసిన చోటు కావున మాచర్లయని వచ్చినని వీరచరిత్రలోకలదు. రెండవ ప్రతాపరుద్రునికి లోబడి మాచర్ల సీమనేలిన మాచయనాయనిగారి పేరునుండి యైనను యాపేరు వచ్చియుండవచ్చును. మారీచుడేలిన చోటు మాచర్లయనియు ఖరుడేలినది కారెమపూడియనియు దూషణు డేలిననది దుర్గి యనియు, విశ్వామిత్రుడు సత్ప్రయాగము చేసినది సత్రశాలయనియు యందుఱుకాని యందులకుదగిన దృష్టాంతములు లేవు. మాచమనాయనికి పూర్వపు శాసనములందు మహదేవి చెరువనియు తరువాత శాసనములందును గ్రంధము లందును మాచర్ల మాచెర్ల యనియు కలదు.

దుర్గాలయమునుబట్టి దుర్గి యను పేరుగలిగెను. అలరాచమల్లు పేర మాచర్ల కాఱుమైళ్ల దూరమున రాచమల్లుపాడు (రచ్చమల్లెపాడు) కలదు. ఝట్టిరాజు పేర తుమృకోటకు నాల్గు మైళ్ళ దూరమున ఝట్టిపాలెము (జెట్టిపాలెము) అలుగురాజుపేర అలుగు రాజుపల్లెయు, మలిదేవాదుల పేర మల్లవరమును కలవు. అనుగురాజు సముద్రస్నానమునకు బోయినప్పుడు దొడ్డనాయుని పేర నాయునిపల్లెయు, శీలాంబ పేర చీరాలయు, పేర్నీని పేర పేరాలయు కట్టించినట్లు వీరభద్రకవి వ్రాసినాడు. తుమ్మురుకోడు:- ఇది కృష్ణానదికి మూడుమైళ్ల దూరమున నున్నది. గోల్కొండ నవాబుకు తన సామ్రాజ్యమునకు సరిహద్దుగానున్న తుమ్మురుకోడువద్ద తిమ్మరుసు మంత్రి పేర రాయలొక కోటగట్టి కొంత సైన్యము రక్షణగా నుంచెను. అందువలన నాగ్రామమునకు తిమ్మరుసుకోట యనియు తుమృకోడు యనియు పేరువచ్చెనందురు.

నాయకురాలి కనుమ:- బాలచంద్రుని బోనీయక యిచ్చట నాయకురాలు పంగచాచి నిలుచుండెననియు, బాల చంద్రుడు ఖడ్గముచే కొండనునఱకి త్రోవ చేసికొని పోయెననియు నందురు. కొండనిలువుగా నరికినట్లు గన్పించును. కొండశిఖ రమునుండి బాలచంద్రుడు గుఱ్ఱమును దూకించిన ప్రదేశమును అచ్చటివారు జూపింతురు.

గుత్తికొండ బిలము:- యుద్ధమున చనిపోయినవీరులను బ్రహ్మనాయుడు బ్రదికించి వెంటబెట్టుకొని గుత్తికొండబిలములో ప్రవేశించెననియు నందఱు నిజరూపముల గైకొని రనియు వీరభద్రకవి వ్రాసెను.

వీరులగుడులు:- కారెమపూడిలో నాగులేటి యొడ్డున గంగధార మడుగు వద్ద నివికలవు. కొన్ని విడిస్తంభములు మండపములు కూడ కలవు. యుద్ధములో చనిపోయిన వీరుల పేర రాళ్లు కలవు. పల్నాటి యుద్ధానంతరము మహమ్మదీయుల కాలమున నొక గొప్ప సైన్యము దక్షిణమునుండి హైదరాబాదుకు పోవుచు కారెమపూడిలో నాగులేటి యొడ్డున విడిపి వీరుల లింగములను పొయిగడ్డలకు వాడుకొనగా సైన్యమంతయు మూర్ఛిల్లెనట. అంత నొకబ్రాహ్మణునిచే, తన యపచారము తెలిసికొని వీరులకు గుడులు కట్టించునట్లు మ్రొక్కు కొనగా సైనికులు లేచిరట. అంత నతడాగుడులను కట్టించె నెట. అతడు వీరుల యందుభక్తిగలిగి వీరుల శౌర్యములు వినగనే నావేశముగలిగి యతడును యతని తమ్ముడును పొడుచుకొని చచ్చిరట. వారి గోరీలిప్పటికిని యున్నవి. పంచమకుల సంజాతుడైనయొక వీరునిగుడికూడ నిందు నిర్మింపబడియున్నది.

బాస్వెలు దొరవారి రిపోర్టులో “I may mention that lead is found in considerable quantities near Karempudi in Palnad but the mines are not worked. Copper is found both in Palnad and Vinukonda taluks " అని కలదు. గవర్నమెంటుకు దొరచేసిన రిపోర్టు 7-11_1870 తేదిగల G. O. (Act 1 of 1870) లో నచ్చుకాబడినది. పల్నాటిలోని కొన్ని గ్రామములలో నినుము కరిగిన పెద్ద కొలుముల చిహ్నములు నిప్పటికి స్పష్టముగా గన్పించుచున్నవనియు మరియు గుత్తికొండలోని నొకభాగమునకు కొలుములపాలెమని పేరున్నదనియు ఉమాకాంతముగారు వాసిరి. గుత్తికొండవద్ద కొండను తుమృకోటవద్దకొండను నినుపకొండలని యిప్పటికి నందురు. గురిజాలలో సూరెకారపుఉప్పును ముప్పదిసంవత్సరముల క్రిందటి వఱకు చేయుచుండిరి. ఆచిహ్నము లిప్పటికిని స్పష్టముగా నున్నవి.Memos of Geographical survey of India vol 8 1 0 పుటలో పల్నాటిలోని తుమృుకోడువద్దను మల్లవరమువద్దను వజ్రపు గనులున్నట్లున్ను మొగలాయి రాజుల కాలమునం దాగనులలో పనిచేయుచుండినట్లున్ను గలదు. కోహినూరు వజ్రమునకు పల్నాటిలోని నదీతీర ప్రాంతమే జన్మస్థానమని యూహింపబడు చున్నది. చెన్నపట్టణమునుండి హైదరాబాదుకు పోపురోడ్డు పల్నాటిలోనుండిపోవును. అది తూర్పుయిండియా సంఘము వారిచే నిర్మింపబడినది, చెన్నపురినుండి హైదరాబాదుకు సైన్యములామార్గమునబోవుచుండెనట. దానిని దండుబాటయని పిలుతురు.

మేళ్లవాగువద్ద నాగులేటికి యానకట్ట కట్టి నీరు నిలువ చేసికొంతభూమిని మాగానిచేయుటకు వీలుకలదు. దాచేపల్లి వద్ద రాళ్లు భూమినుండి పైకి లేచి ఒకేమాదిరిగా వంగియుండును. అవిచూచుటకు చిత్రముగానుండును. గురజాలలో (పూర్వము గ్రామముండినచోట నొక సంవత్సరము క్రిందట కొన్ని రాగినాణెములు దొరికినవి. అవి అనేక వందల సంవత్స రములక్రిందటి నాణెములు. 1953 లోసెకండరీగ్రేడు ట్రయినింగు స్కూలువార్షికోత్సవసందర్భమునన (Exhibitionగా) ప్రదర్శింపబడినవి.

_____________