పల్నాటి చరిత్ర/ఇతర ప్రఖ్యాత పురుషులు

వికీసోర్స్ నుండి

ఇతర ప్రఖ్యాత పురుషులు

1. దుగ్గరాజు రాజనాయకుడు:- 13 వ శ తా బ్ద ము వాడు. కాకతీయగణపతిదేవునికి విశ్వసనీయులగు సేనానులలో నొకడు. గణపతి కళింగ దేశముపై 1212 A. D. ప్రాంతమున చేసిన యుద్ధములందితడు ముఖ్యుడు. 1228 A.D న గణపతి దేవుని పై కుట్రలు చేసిన సామంతరాజులు నడచుటయందు ఇందులూరి సోమయ్య మంత్రికితడు సహాయము చేసెను. ఈ రాజనాయకుని కుమారుడగు కాటయ శ.క. 1158 (1236 A. D.) లో భూదానము చేసినట్లు ఉప్పరపల్లె శాసనములో నున్నది. ఇతడు పల్నాటిలోని దుర్గి వాస్తవ్యుడనియు, దుగ్గరా జను గృహనామము కలవాడనియు, నియోగి బ్రాహ్మణుడ నినియు, ( Hyd Arch Ser No 3) లోని 'కరుణాన్విత దుర్గివరము కాటయ కొసగున్' అను పద్యపాదమునుబట్టి దుర్గి యనగా పల్నాటిలోని దుర్గిగ్రామమునగల పార్వతి యనియు, కాటయకాలమునుండి దుర్గినిబట్టి గృహనామము దుగ్గరాజు అని వచ్చెనని యూహింపవచ్చుననియు కోన వేంకటరాయ శర్మగారు దండనాధులను గ్రంధములో వ్రాసిరి.

2. పింగళి గోవిందయ్య:- ఇతడు 'కల్యాణి' రాజధాని గా నేలిన పశ్చిమచాళుక్యుని ప్రభువగు త్రిభువనమల్ల విక్రమాది త్యుని ప్రచండ సేనానియగు అనంతపాలయ్యకు మేనల్లుడు. 12 వ శతాబ్దమువాడు, కొండపల్లి దుర్గాధిపతి, నియోగి శైవ బ్రాహ్మణుడు. యుద్ధమునందు విక్రమచోడరాజును గెలిచెను. పింగళియనగా పిన్నెలియగుటచే (23, 24 పుటలు చూడుము) నితడు పల్నాటిలోని పిన్నెలికి చెందినవాడు. తన పూర్వులగు పింగళివారు శాఖలుగా చీలి కృష్ణా గోదావరి మండలములందును, పలనాటను పాకనాటను ప్రసిద్ధులైనట్లు పింగళి సూరన వ్రాసెను.

3. పింగళి మాదయ్య..ఇతను క్రీ.శ. 17 వ శతాబ్దము వాడు. క్రీ.శ. 1672 నుండి 1687 వఱకు గోల్కండ రాజ్య మేలిన కుతుబ్ అబుల్ హసన్ (తానీషా) కు ప్రధాన మంత్రి. ఈ తానీషా కాలముననే గోలకొండ రాజ్య మంతరించెను . ఇతనికాలముకనే రామదాసుకథ జరిగెను, తానీషా పేర నిజమునితడే గోల్కొండ రాజ్యమేలెను. వరుసకు తమ్ముడగు అక్కన్నను సేనాపతిగా నియమించు కొనెను. బందరులోనుండిన యాంగ్లేయులు యితనికి నజరానా చెల్లించి దయ సంపాదించి గోలకొండనవాబగు తానీషానుండి రూపాయి నాణెముల ముద్రించుటకు నధికారమును బొందిరి. ఇతడును పల్నాటిలోని పింగళి (పిన్నెలి) కి చెందినవాడు. ఈముగ్గురి వివరములకు విమర్శకశిరోమణి శ్రీ కోన వేంకటరాయశర్మగారు రచించిన “దండనాధు" లను గ్రంధము చూడవలెను. తెలంగాణా కును, మరాటావాడకు మధ్య బీదరుజల్లాలో పింగళి యను గ్రామము కలదట. కాని పింగళి సూరనగారి యభిజన గ్రామమగు పింగలి యా గ్రామమనుట కాధారములు లేవు. సూరనగారిది గౌతమగోత్రము పిన్నెలివారిది భారద్వాజస గోత్రము కాని పిన్నెలిలో కొలవాసియను నింటి పేరుగల నియోగులు గౌతమగోత్రులు కలరు. పూర్వము వారింటి పేరు పిన్నెలియనియు, వారిపూర్వులలో నొకడు భూమికొలతయందు వాసికెక్కుటచే కొలవాసి యను పేరు పౌరుషనామధేయముగ వచ్చెననియు వారనెదరు. సూరనయు నతని తండ్రి తాతలు నంద్యాల ప్రాంతముననే నివసించిరి.

4. దుర్గిలోని సాధ్విలక్ష్మి:- ఈమె స్తానం పల్నాటిలోని దుర్గి. కమ్మకులము, తండ్రి దిగుమర్తి ముసలప్పనాయుడు, భర్త చిరుమామిళ్ల వెంకానాయుడు. ఈమె కోడరికమందలి కుటుంబ బాధల నోర్చెను. తనను భర్త చంపుచున్నను ప్రాణ ములవిడుచు సమయములో గూడ భర్తయొక్క దయనేకోరెను. ఈమెయిప్పటికిని పూజింపబడుచున్నది. ఈమెకధను సంచారిక శధకులు బొబ్బిలికధవలె చెప్పుచుందురు. ఈమెకధను లక్ష్మమ్మ శ్రీలక్ష్మమ్మ యను రెండు సినిమాలుగా చిత్రించినారు.

5. పిడుగు శంకరయ్య:- శంకరయ్య యను పురుషుడు పల్నాటిలోని గాదెవారిపల్లెవద్ద సిద్ధి (జీవసమాధి) నొందెను అందుచేనాగ్రామప్పటికి సర్కారు లెక్కలలో 'శంకరాపురం సిద్ధిహాయి' అని వ్యవహరింపబడుచున్నది అతని వంశములోని వారిలో కొన్ని వివాదములుగలిగి సమాధిమీదిరాతిని తొలగింపగా నతడు జీవించియుండెనట. అతడు వివాదముల దీర్చెనట. మరలనట్లు తొలగింపకుండుటకై నతని కోరికపై వారతని సమాధిపై స్థిరముగా గచ్చుతో కట్టబడి చేసిరట.

6. బెల్లంకొండ సుబ్బారావుగారు:- వీరి స్వగ్రామము పల్నాటిలోని తక్కెళ్లపాడు. గురజాల, నరసరావుపేటలో న్యాయవాదిగా నుండిరి. సుప్రసిద్ధ నటకులు. కృష్ణరాయబారములో శ్రీకృష్ణపాత్రను ధరించి ఆంధ్రదేశములోని ప్రతిపట్టణములోను ప్రసిద్ధికెక్కిరి.