Jump to content

పరమయోగి విలాసము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

పరమయోగి విలాసము.

ప్రథమాశ్వాసము.


అవతారిక

ద్విపద.

శ్రీయలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
దోయజదళనేత్రిఁ? దోయధిపుత్త్రి
శ్రీవేంకటేశసంశ్రితకుచదేశ
దేవేంద్రవినత నాదిమవచోవినుత
గజరాజమిళిత నంగజరాజకలిత
విజితాలికులవేణి వికచాబ్జపాణి
జలజలీలాగేహ సౌవర్ణదేహ
జలజాతభవమాత జగదేకమాత
శ్రీవేంకటాధీశుఁ జిరకృపావేశు
దేవాధిదేవు సందీప్తప్రభావుఁ
దలఁచి భూనీళలఁ దడవి యాచక్ర
జలజకౌమోదకీశాఙ్గ౯ఖడ్గములఁ

దిర మొందుభక్తి నుతించి యనంత
గరువిష్వక్సేనకరుణయు బడసి
శ్రీకరవైష్ణవసిద్ధాంతవిభవ
పాకశాసనుఁ దాళ్ళపాకశాసనుని
యాచారవిజితామరాచార్యుఁ దిరుమ
లాచార్యు ఘను మదీయాచార్యుఁ దలఁచి
పరమార్యు వాధూలపతి నప్పగారి
గురుతరులగు [1]మహాగురువరేణ్యులను
రామాంఘ్రికమలాభిరామతాత్పర్యు
రామానుజాకారు రామానుజార్యు
నమలునిం బరమదయాకరమూర్తి
నమితవిద్యాపూర్ణుఁడగు మహాపూర్ణు
మందారహరణు నిర్మలపాదపద్మ
వందారు మాయాళువందారుఁ బొగడి
యామోదభరకీర్తితాబ్జనేత్రాభి
రామమిశ్రాఖ్యుని రామమిశ్రాఖ్యు
మండితనిజచిత్తమందిరనిహిత
పుండరీకాక్షునిఁ బుండరీకాక్షు
[2]నమలాత్ము మునినాథు నానాథమౌనిఁ
గుమతభంజననిరంకుశుఁ బరాంకుశుని

క్ష్మానుతద్రావిడాగమసార్వభౌము
లైన మావారల నాళువారలను
నిఖిలముక్తౌఘంబు నిత్యవర్గంబు
నఖిలభాగవతుల నాత్మలోఁ దలఁచి
హరితాత యను వేంకటాచలపూర్ణు
హరిపూజనాడంబి యగు గుర్వనంబి
నిరవొంద శ్రీవేంకటేశ్వరుచేతఁ
గరమొప్పు శంఖుచక్రము లందినట్టి
చిరకీర్తి వైష్ణవసేవానువర్తి
స్మరమూర్తి నలతొండమాన్ చక్రవర్తి
సతతవేదామృతశరధి దాశరథి
నతికృపాకరు భట్టరాచార్యవర్యు
సిరివరు నిజశిష్యుఁ జేసికొన్నట్టి
హరిభక్తిపరు ననంతాళువారులను
శఠమతరాద్ధాంతసంహారియైన
శఠకోపమునిఁ బోలు శఠకోపమౌని
వేదంబుఁ దెనుఁగు గావించి సంసార
ఖేదంబు మాన్పినకృష్ణమాచార్యు
ఘనతరపంచమాగమసార్వభౌము
ననఘు శ్రీతాళ్ళపాకన్నమాచార్యుఁ

దలఁచి యంజలిఁ జేసి తత్ప్రసాదంబు
కలిమిని బంచమాగమసార్వభౌమ
హరిసేవ కాశ్వలాయనసూత్రనంద
వరవంశభవ భరద్వాజసగోత్ర
పావన శ్రీతాళ్ళపాకన్నయార్య
ధీవిశారదసూనుఁ దిరుమలాచార్య
వినుతనందన తిరువేంగళనాథుఁ
డనుపేరి యేను కావ్యం బొండు సేయఁ
దలపోయుచున్నయత్తఱిఁ గరుణించి
కలలోన వైష్ణవాకారంబుఁ దాల్చి
యేతెంచి శ్రీవేంకటేశుండు తనదు
చేతఁ దా నారగించిన ప్రసాదంబుఁ
గృపచేసి పరమయోగివిలాస మనఁగ
నిపుడు కాసారయోగీంద్రాదికథలు
జానుగా సిరికిని సపరివారుండ
నైనట్టి తనకు నీ వంకితంబుగను
బనుపడ ద్రవిడప్రబంధంబు చూచి
తెనుఁగున రచియింపు ద్విపదరూపమున
నన విని మేల్కాంచి యలమేలుమంగ
ననుపమశ్రీవేంకటాధీశుఁ దలఁచి

తలఁపు తన్మూర్తులం దగులంగఁ జేసి
యలయంజనాద్రీశు నాత్మలో నిలిపి
యరు దంది శ్రీవేంకటాధీశువాక్య
సరణి నాకబ్బంబు సవరింపఁ బూని
కడలి దాఁటంగ రాఘవభూ[3]వరుండు
కడఁకమై సేతువుఁ గట్టించునప్పు
డనిలజముఖు లైన యగచరనాథు
లనుపమశక్తి మహాపర్వతములఁ
గట్టకట్టంగఁ దాఁ గట్టనుంకించు
నొట్టిన లోకూర్మి యుడుత చందమున
భువనంబులోన నభోమణి యొప్ప
దివిఁ గీటమణియును దెలి వొందుకరణి
సామజబృందంబు చనుదెంచుత్రోవఁ
జీమలపంక్తి వచ్చిన[4] విధంబునను
వేదంబులెల్ల ద్రావిడముగాఁ జేసి
వేదాంతవిదులుఁ గోవిదులు నైనట్టి
గురుతరు లగుపరాంకుశముఖ్యయోగి
వరులవైభవముఁ గావ్యము సేసినట్టి
యలఘుపూర్వాచార్యు లగువారియెదుట
నిల నితరుఁడు కావ్య మెట్లు చెప్పెడిని

గావునఁ దత్పాదకమలసేవకుఁడఁ
గావున వారిమార్గముననే యేను
జలజాతవాసినిచనుబాల ముట్టి
పలికెద నానేర్చుపరిపాటి నిప్పు
డలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి సబ్జపాణికిని
అతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్తసంతతికిఁ
గనకచేలునకు శృంగారలోలునకు
వినమితేశునకు శ్రీవేంకటేశునకు
నంకితంబుగను గావ్యంబుఁ గావింతు '
నింకఁ దత్ప్రారంభ మెయ్యది యనిన
మోదించి నారదముని చెప్పినట్టి
యాదవశైలమాహాత్మ్యంబునందు
గారవంబునఁ “గలౌఖలుభవిష్యంతి
నారాయణ పరాయణా” యని పలుకు
కలిహరం బైనభాగవతంబునందుఁ
గలిగి పూర్వాచార్యకథిత మై వెలసి
మఱియును వృద్దపాద్మంబునఁ బద్మ
తెఱఁ గొప్ప సూత్రవతికిఁ జెప్పినదియుఁ
గావునఁ దత్కథాక్రమ మొప్ప నేను
గావింతుఁ గృతి దాని క్రమ మెట్టి దనిన

కథారంభము.

వలనొప్పఁ జిదచిదీశ్వరయుక్త మగుచు
నలచతుర్దశభువనాత్మకం బైన
కమలజాండంబును గడచి యామీఁదఁ
గమలతేజో వాయుగగనభూతాది
తతమహదవ్యక్తతత్వరూపముల
నతిశయం బొందుసప్తావరణముల
డాసిన ప్రకృతిమండలమున కవల
భాసిల్లుచుం బరాత్పరవాస మగుచుఁ
గుటిలతార్కికఘూకకుల[5]కర్క నేత్ర
పటలంబునకుఁ జండభానుమండలము
చతురాననేశవాసవముఖ్యులకును
మతి నెన్నఁగా నవాఙ్మనసగోచరము
ననయంబు హృతపునరావృత్తిపదము
వినతాదితేయంబు వేదవేద్యంబు
నంబుజోదరముకుందాహ్వయకార
ణంబు విద్యానిధానంబు సేవ్యంబు
నగుచుఁ బరవ్యోమ మని సంతతంబు
నిగమముల్ పొగడ నెన్నిక కెక్కి తనరి

యానందపాదత్రయాన్వితం బగుచు
నానందకాయుధు నావాస మగుచు
లుంఠితసంసారలోలశోకంబు
కుంఠితాఘంబు వైకుంఠంబు నాఁగఁ
గర మొప్పుభువన మాగమసన్నుతంబు
నిరతిశయానందనిలయ మైయుండు
నరము నరణ్యంబు ననుపేరి యమృత
శరధు లింపొందు నచ్చటఁ గవగూడి
యతుల మై దివ్య మై యటఁ గర్మయుగళ
యుతుల కయోధ్య నా నొప్పు నయోధ్య
యనుపేరు గలిగి శ్రీహరిరాజధాని
ఘనతరస్ఫూర్తిఁ బ్రకాశించు మఱియు
వరమణిమయమహావరణసహస్ర
పరివృతం బగుచు నపార మైయుండు
కడు నశ్వరంపులోకంబుల రోయు
వడువునఁ బవమానవలితాంచలముల
దీపించు వైజయంతీవితానంబు
లాపురంబున గోపురాగ్రంబులందు
నవరత్నమయసౌధనవ్య తేజంబు
లవిరళ రేఖలై యందంద పొదువ

నరయంగ నింద్రలోకాతీత మయ్యు
హరిధనుశ్శ్రీ నొప్పు నమ్మహాపురము
లలితేంద్రనీలజాలకదీప్తిజాల
ములు నభోగతి నొక్క మొత్త మై నిగుడఁ
గాళింది యాకాశగామిని యైన
పోలిక నొప్పు నప్పురవరంబునను
రాజితగృహపద్మరాగరాగముల
రాజిల్లు వరహీరరథ్యాచయంబు
ఘన శేషభోగసంఘంబుల నెప్పు
డనుకరింపుచు నుండు నతివైభవముల
సతతంబు నింద్రప్రజాపతు లనఁగ
నతుల తేజోమూర్తు లగు నిత్యవరులు
నాపురీవరగోపురాగ్రభాగముల
నేపారఁగా వసియించియుండుదురు
కులిశధారకు వడంకుచు లావు వెడలి
పలుకంటకములఁ జొప్పడువారిఁ గూడి
భూలోకమున నుండుభూధరతతులఁ
గేలి సేయుచు నుండుఁ గేళిశైలములు
తపనదోషాకరదర్శనం బాత్మ
నెపుడుఁ గోరుచు నొక్కయెడలను గుందు

ప్రాకృతపద్మకైరవసమూహంబు
లేకాలమును దమ కెనయే యటంచు
నగుచు సదా ప్రసన్నత మించి మించు
లగునట్టి పద్మకల్హారంబు లెసఁగు
నాసారపుష్పనీరాపూర్ణ దివ్య
కాసారశతములఁ గలిగి పెంపొందు
నచ్చట విలసిల్లు నారామతతులు
నిచ్చలు సౌరభానీకము ల్గలిగి
తరులతారూపముల్ తాల్చిననిత్యు
లరుదార ముక్తు లై యరుదెంచువారి
నెలకొన్న తమవైన నీడలచేత
ఫలములచేతఁ బుష్పంబులచేత
నుపచరింపుచు నుండు నుచితవైఖరుల
నెపుడు నత్తరువుల నెక్కి చూపట్టు
శుకపికాదులు శౌరిసుండు ప్రాఫ్యుండు
ప్రకటంబుగా నని పల్కుచు నుండు
నందులోఁ గొన్ని యుద్యానశైలాదు
లిందిరాసతి నటియించులీలలకె
ప్రతి లేక [6] యెప్పుడుఁ బాల్పడియుండుఁ
బతి[7]లీలకే పాలుపడియుండుఁ గొన్ని

యరయంగ మఱికొన్ని యాసతీపతుల
పరమలీలలకుఁ బాల్పడియుండు నెపుడు
దివ్యసౌందర్యులు దివ్యవిగ్రహులు
నవ్యయు లగుపౌరు లచట నుండుదురు
అలదివ్యనగరమార్గాంతరసీమ
నలఘువైభవముల కాలయం బగుచు
నయ్యబ్జనాభుని యనుకంప కెపుడు
నెయ్య మై సౌరభానీకంబుతోడ
లీయ మై పద్మమేలిమిచూపు వోలెఁ
దీయ మై యైరమ్మదీయమో నాఁగఁ
దళుకొత్తు సరసి సంతతవికాసములఁ
జెలువొందు కనకరాజీవబృందములఁ
దులగించు నపరంజితొగలమానికపుఁ
గలువలతేనియల్ గమిచి సొంపెక్కి
షట్పదంబులు వింతసరణు లేర్పడఁగ
షట్పదఝంకృతుల్ సలుప నెంతయును
నలనొప్పు నలసరోవరముచెంగటను
గొలఁది మీఱిన బిల్వకుంభినీజంబు
అవిరళశాఖాత్రయంబుతో సోమ
సవనంబు నా హేమచలదళం బమరు

[8]నాతరుచ్ఛాయఁ దా ననువొంద నిలిచి
ఏతెంచుముక్తుల కెదు రేగి వారిఁ
గొమరార భూషించుకొఱకు భూషాంజ
నములు [9]జలములుఁ జూర్ణములు మాలికలు
వేర్వేఱఁ బూని సవిస్మయాకృతులఁ
బర్విన యచ్చరపడఁతు లేనూఱు
లనిశంబు నచటికి నరుదెంచుముక్తు
లనుకైరవముల నపాంగచంద్రికలఁ
జాలువార వికసింపఁ జేయుచు నచట
మెలఁగుచుండుదురు సమేలంబుతోడఁ
జల్ల నై తద్దివ్యజనపదంబులకు
[10]నెల్ల యై యమృతవాహిని యై చెలంగి
యావరపురిచెంత నమితసంసార
దావతప్తాత్ముల తాపంబు దీర్చి
పురుడింపఁగా ద్రవీతభూత యైనట్టి
కరిరాజవరదుని కరుణయ సోలె
భాసిల్లి విరజ నాఁ బనుపడి ప్రకృతి
వాసనాపాంసువుల్ వడి నడంచుచును
నమల మై యెపుడు ముక్తాశ్రిత యగుచు
నమిత మై పరమహంసావృత యగుచు

నరయ సంజీవని యై దివ్య మగుచు
మురసూదనుని దయామూర్తియుం బోలె
సరసిజాక్షియుఁ గూర్మచరణవర్ణితయు
గురుతరకోకవక్షోజభాసితయు
బిసరుహజాలశోభితయు నై ముక్తి
బిసరుహవాసిని పెంపు చూపుచును
దనలోనఁ గ్రుంకుమాత్రనె చేతనులకుఁ
దనుదేహముల డించి తఱగనిసిరుల
సరవిఁ బంచోపనిషన్మయాకృతులఁ
గర మర్ధి నొసఁగు నక్కజము రెట్టింప
నాయేటఁ గ్రుంకినయట్టిశరీరి
యాయతరాహుఘోరాస్యగహ్వరము
వెలువడి చనుదెంచువిధుమండలంబు
కలిమి సంసారపంకముతోడఁ బాసి
లీల నాచక్కి నిల్చిన యమానవుని
కేలికెందమ్మి సోఁకినయంతలోనె
కర మర్థి దివ్యమంగళవిగ్రహములు
ధరియించు నెట్టి[11]చిత్రమొ కాని మఱియు
వనమాలికాశ్రీనివాసితం బగుచు
వనమాలికాధరువక్షంబ పోలె

లాలితదశరథోల్లాసితం బగుచుఁ
బోలింప సాకేతపురమునుం బోలె
ఘనశంఖచక్రప్రకాశితం బగుచు
ననుపమం బగుకలశాబ్దియుం బోలె
సంతతమానవసంయుతం బగుచు
వింతగు సురరాజువీడునుం బోలె
రాజిల్లు నన్నగరంబు నెన్నడుమ
రాజార్కకోటుల రమణ నవ్వుచును
వైకుఠ మనుపేర వర్ణన కెక్కి
వైకుంఠనాథుని వాస మింపొందు
నామహానగరమధ్యమున మాణిక్య
హేమతోరణముఖానేకవస్తువులఁ
దనరి యానందసుధాలిప్త మగుచు
నినసహస్రంబుల కెన యైనకాంతి
నగణితమణిమయం బై వేదవిదిత
మగు సహస్రస్తంభ మనుమంటపమున
నిగనిగం దళుకొత్తు నెలకట్టుక్రింద
జిగివిభూతిద్వయచిత్రితం బగుచు
దివ్యపుష్పముల నాస్తీర్ణ మై వివిధ
దివ్యవాసనలును దివ్యరత్నములు

ధర్మాదిసూరిపాదములునుం గలిగి
భర్మకాంతులఁ గనుపట్టుచేలముల
నలువొందు సింహాసనమున సహస్ర
దళపద్మ మొప్పుఁ దత్కర్ణికనడుమఁ
గృతశబ్దతంత్రధురీణుఁ డై చంద్ర
శతములఁ గేలించుచాయఁ గైసేసి
పొడతెంచు రవిసరి బోలు కెంజాయ
లడరెడు పడగలయందలి మణుల
బలువైన తేజంబుపరపుగా మిగులఁ
బొలుపాఱ శేషునిభోగంబునందు
భానుకోటుల మించుప్రభ గల్గి నిర్భ
రానందుఁడును నిత్యుఁ డఖిల శేషియును
గురుతరుండును నిరంకుశమహెూదయుఁడు
పరమేశ్వరుఁడు నైన పద్మావిభుండు
నెమ్మితో శ్రీభూమినీళలం గూడి
నెమ్మోముచక్కి వెన్నెలనవ్వు చిలుక
[12]నెఱసంజ గనుపించు నెఱ్ఱదామరల
యొఱపు నెల్లిదమాడుచున్నపాదములు
పన్ని కాళియలసంపద ముట్టుకోలు
గొన్న నిగ్గులసోనఁ గురియులేఁదొడలు

శృంగారజలధి రాజిల్లు మైనాక
శృంగంబు లనఁగ మించినజానుయుగము
యౌవనారామంపుటనఁటులో యనఁగ
ఠేవసోయగము వాటిల్లు నూరువులు
మొలనూళ్ళమానికములరంగు లెనయు
కలధౌతచేలసంగతకటిస్థలము
నలువ నాఁ జని పదునాల్గులోకములఁ
గలిగించుపాపనిం గన్నపొక్కిలియుఁ
గడుపులోపలి త్రిజగములకు నెల్ల
నడర నేర్పఱచెనో యన నొప్పువళులు
జలరాశికన్యకాసౌధాగ్రరత్న
కలశమో యనఁగ నగ్గలపునిగ్గులును
నలవడి సకలజీవాత్మకం బగుచుఁ
దులగింపుచున్న కౌస్తుభదివ్యమణియు
నలరఁ బ్రధానతత్త్వాత్మకం బనఁగఁ
జెలఁగు శ్రీవత్సంబుచే నొప్పునురము
సతతంబుఁ దనయురస్థలిఁ బాయకుండు
నతివ లీలాడోల యన [13]నొప్పు మిగిలి
పొగడొందుచును మహాభూతస్వరూప
యగువైజయంతిఁ బాయనిభుజాంతరము

ఘనతరలావణ్యకలశాంబురాశిఁ
గనుపట్టు నవతరంగము లన నొప్పు
శారద నారదచ్చాయలఁ దెగడు
తారహారంబులఁ దనరుపేరురము
తొలఁగక వేగ నార్తులయార్తిఁ దీర్ప
వలసినయెడల నవ్వలియాయుధములు
కేలిమై నంది [14]సోఁకించుటే మిగుల
నాలస్య మనియెన్ని యనిశ మేమఱక
తగ నహంకృతి కధిదైవ మై చంద్రు
పగిదిఁ జూపట్టెడిపాంచజన్యంబు
రూపింపఁగా మనోరూప మై యశముఁ
బ్రాపించు నలసుదర్శనము నింపెసఁగ
బలసి కీర్తిప్రతాపము లిరుమేలఁ
జెలఁగించుకరణిఁ దాల్చినబాహుయుగము
పాఁపకంకటి నూఁదిపట్టి చూపట్టు
డాపలికేలు బిటారంబు నెఱప
జానువుపైఁ బాఱఁజాఁచినకేలు
మానితకేయూరమాణిక్యరుచిర
కటకము ల్మెఱయ నెక్కడ లేనివింత
నటనలు వెదచల్లు నాల్గుమూఁపులును

మంచికస్తూరి యుమ్మలి దొప్పఁదోఁగి
యంచితం బైన కంఠాంబుజాతంబు
చెలువంపుసిరి కొల్వు సేయుచునుండు
నలరుసామ్రాజ్యసింహాసనం బనఁగ
నవ్యాజకోమలహాసంబు మోవి
నవ్య మై పరఁగ నెంతయు నొప్పుమోము
మొనసిన నయనసముద్రమర్యాద
కొనర సేతువు నాఁగ నొప్పునాసికయు
మలఁగువీనులతోడ మలయుచు మిగుల
ధళ ధళ మనువెలిదమ్మికన్నులును
బొలుపాఱు విరళకపోలపాలికలఁ
గులుకు నిగ్గుల నక్రకుండలంబులును
లాలితశాఙ్గ౯ విలాసభావములఁ
బోలి మార్పడియున్న భ్రూలతాయుగము
నానతశశిరేఖ హసియించునొసలు
నానీలకుటిలదీర్ఘాలకంబులును
జగ[15]దధిరాజ్యసూచకము నై [16]తపను
ధగధగల్ దెగడు రత్నపుఁగిరీటంబు
నెఱసంజనీరెండ నెనసినమొగులు
తెఱఁగున దీపించు దివ్య తేజంబుఁ

గలిగి సహస్రారకమలపూర్వాది
దళవీథులందుఁ జిత్తరముగా నిలిచి
కమలానిభాకృతుల్ గలిగి యెంతయును
విమలలోచన లైన విమలాదిసతులు
చామరహస్త లై సరవి సేవింప
నామహాకమలమధ్యము పూర్వదిశను
గలికి బాగుల ననుగ్రహ యనుపేరి
చెలువ బంగారుకుంచియ వైచుచుండఁ
దనకుఁ బీఠము చేల తల్పంబు దీప
మును ఛత్రపాదుకల్ మొదలుగాఁ గలవి
తాన యై దివ్యసౌందర్యవేషంబు
పూని యనంతుఁ డాపొంత సేవింపఁ
బడగయు మిత్రుండు బంటు వీవనయు
నడతెంచు నరద మున్నతవితానంబు
మొదలైనపరికరములు తానె యగుచు
నెదుటఁ బక్షీంద్రుఁ డొక్కెడఁ గొల్వు సేయ
వరుస విద్యాధిదేవత యైనవేత్ర
మరుదారఁ బూని సేనాధినాయకుఁడు
వరగుణోజ్జ్వలుఁడు విష్వక్సేనుఁ డెలమిఁ
బరిచరత్వముఁ దాల్చి భజియింపుచుండ

రమణఁ దత్పురనగరద్వారగోపు
రములు సాలములు నారసి కాచుచున్న
యమలు లైనట్టి చండాదినిత్యులును
గుముదాదినిత్యులుఁ గుంజరాస్యాది
ఘనులుఁ జెంతల నూడిగంబులు సేయఁ
బనిపూని దానవప్రాణపారణల
నలవడి దివ్యాంగు లగుచుఁ బార్శ్వములఁ
దళుకొత్తు పంచాయుధంబు లుప్పొంగి
జయజయశబ్దముల్ సవరించుకొనుచు
నయమారఁ జెంత సన్నతులు గావింప
నత్యంతసంతోషితాత్ము లై మఱియు
నిత్యులు ముక్తులు నిగమసంతతులు
నెలమిఁ జంకలఁ జేతు లిడి కొల్చుచుండ
నలఘువైభవముల నాపరాత్పరుఁడు
మూడుకాలంబులు మునుముట్ట నెఱిఁగి
మూ డగు నక్షరములయర్థ మగుచు
మూడుధామంబుల మొనసి నిల్చుచును
మూడుగుణంబుల మునుమిడి దాఁటి
మూడువర్గంబుల ముదమార నొసఁగి
మూడుతాపంబుల మురియఁ గొట్టుచును

మూడులోకముల కిమ్ముల నేలి కగుచు
మూడుమూర్తులకును మొదలివాఁ డగుచుఁ
గరుణాకటాక్షవీక్షణసుధాధార
శరణాగతులయెద చల్లఁజేయుచును
నమితకల్యాణగుణాభిరాముండు
సమఘనరహితుండు సర్వేశ్వరుండు
నిర్వికారుండును నిగమవేద్యుండు
సర్వజ్ఞుఁ డనఘుండు సర్వశేషియును
నైన ప్రాణేశ్వరు [17]నక్కునం గదిసి
యాననం బెత్తి నెయ్యము తియ్య మొదవ
రాకేందుముఖి యకారణదయామూర్తి
నా కేశనుత జగన్నాథునిదేవి
జగదేకజనయిత్రి సర్వశేషిణియు
నగు నిందిరాదేవి యప్పు డిట్లనియె
సరసిజోదర సర్వజనక యోగీంద్ర
కరుణామయాత్మ యుగమవేద్య నీవ
తెలియంగ సృష్టియు స్థితియు నంత్యమునుఁ
గలిగించి పిమ్మటఁ గలిగింప నొంప
నరయ నీసేవకు లగుపద్మసూతి
హరుల కిద్దఱకును నధికార మొసఁగి

వగపెల్లఁ దీఱ దేవర సంతతంబు
జగములఁ బోషింపఁజాలి వెండియును
సదయుండ వై సర్వజనుల నీడేర
మొదలికర్మబ్రహ్మముల స్వరూపముల
విదితంబు గావించు వేదజాలములు
తదుపబృంహితము లై తనరుశాస్త్రములుఁ
గలిగించి దేవరఁ గాంచుమార్గంబుఁ
దెలిపి చూపిన నట్టితెరువునఁ జనక
ప్రకృతివాసన డీలుపడుచు నజ్ఞాన
తికరవారిధుల మునింగి తేలుచును
దనయాజ్ఞ మీఱిన దాసులమీఁదఁ
గనలి భూపతి దండు గదలినపగిదిఁ
దమకించి నీయాజ్ఞ దాఁటి నిచ్చలును
దమయిచ్చఁ దిరుగు నాత్మల విలోకించి
పనిబూని వీరి నేర్పడఁ బట్టితెత్తు
నని రామకృష్ణముఖ్యావతారముల
నవతరించియుఁ గొన్నియాత్మలఁ గరుణ
నవనంబు సేసి యిట్లరుగుదెంచితివి
నిఖిలజీవుల నెన్న నీశేషభూతు
లఖిలజీవులకు నీ వయ్య వట్లయ్యుఁ.

గొందఱ విగతదుఃఖులఁ జేసి మఱియుఁ
గొందఱ విహితదుఃఖులఁ జేయఁ దగునె
జాడతో దేవర సకలజీవాళి
నీడేర్చువిధము నా కెఱిఁగింపుమయ్య
యన విని లేఁతన వ్వాననాబ్జమున
ననలొత్తఁ దనప్రాణనాయికఁ జూచి
యల్లనఁ దనకేల నాపద్మహస్త
పల్లవం బొనఁగూర్చి బళి బళీ యనుచుఁ
దలిరుఁబోఁడిరొ నీవు తలఁచినగతినె
తలఁపులో నేనును దలఁచుచున్నాఁడ
ననయంబు నీవు న న్నడిగినందులకు
వినుము చెప్పెద నది వివరంబు గాఁగ
సిరి పద్మ! యే నేమి సేయుదు మున్ను
ధరలోన నానావతారముల్ దాల్చి
యున్నట్టి నన్నొకానొకఁ డాత్మలోన
నెన్ని బ్రహ్మంబుఁ గా నెఱిఁగి భజించుఁ
గొందఱు శత్రుగాఁ గోరియుండుదురు
కొందఱు మిత్రుగాఁ గోరియుండుదురు
కొందఱు రాజుగాఁ గోరియుండుదురు
కొందఱు బాలుగాఁ గోరియుండుదురు

అందఱు నాచంద మరయరు వారి
నిందఱ నేరీతి నీడేర్తు నింకఁ
దనుఁగొల్వు మని యాత్మఁ దలఁచి యాత్మలకుఁ
దనువు లింద్రియములుఁ దాన యిచ్చితిని
ఇచ్చిన నవి దాల్చి హీనభావముల
నిచ్చలో నామూర్తి నెఱుఁగంగ లేక
యెనయ నిధ్మములఁ దే నిచ్చినకత్తిఁ
గొని యాలతోఁకలు గోసినరీతిఁ
దనుఁ గొల్వనిచ్చిన తనువులు దాల్చి
యనయంబు పరవిషయాసక్తు లగుచు
[18]నాసురప్రకృతు లై యనిశ మనాది
వాసనామూఢు లై వంతలఁ జిక్కి
గొనకొన్నరాట్నపుగుండ్రలకరణిఁ
బనిబూని ఘనకర్మపరతంత్రు లగుచు
నరకంబులందు జన్మంబులయందుఁ
దిరుగుచు నిట్లు వర్తిలెడుజీవులకు
నెలనాఁగ! యే నెట్టు లీడేర్తు నైనఁ
గలదు నుపాయ మొక్కటి విను మింకఁ
దలపోసి వారి కంతర్యామి నగుచుఁ
దెలిసిశ్రీరంగాదిదివ్యదేశముల

నర్చావతారంబు లంగీకరించి
యర్చనాసుముఖుండ నగుచు నుండెదను
జేనంటి యింటఁ బెంచినయిఱ్ఱిఁ జూపి
కానలో నిఱ్ఱులంగైకొన్నకరణి
నరయ సజాతీయు లగువారిచేతఁ
జిరజీవతతుల వశీకరించెదను
గావున ధరలోనఁ గమలాయతాక్షి!
నీవు విశ్వంభర నీళావధూటి
ధర చక్రశాఙ్గ౯నందక గదా నాగ
వరవైనతేయవిష్వక్సేనముఖులు
శ్రీవత్సకౌస్తుభాంచితనిత్యవరులుఁ
గోవిదు లగుచండకుముదాదిఘనులుఁ
దక్కునిత్యులును భూస్థలిఁ బ్రవేశించి
పెక్కువర్ణంబులఁ బెంపొందఁ బొడమి
పెక్కుదేశముల సంప్రీతి వర్తిలుచుఁ
బెక్కుభాషలు నేర్చి పెక్కుకబ్బములు
సర్వాధికారముల్ సకలవేదాంత
నిర్వాహకంబులు నిగమరూపములు
నతులమద్గుణవర్ణనాలంకృతములు
నతులముల్ ద్రవిడభాషానురూపములు

గేయముల్ నిత్యసంకీర్తనాత్మకము
లాయతరసపోషణానుభావ్యములు
నగుచు నొప్పఁగఁ జేసి యలవానిచేత
జగతిమై దుష్టదర్శనపరాయణుల
ననయంబు బాహ్యరాద్ధాంతతమిస్ర
మునఁ జెంది మోహితాత్ములు నైనవారి
నరయంగ సంసార మనుకానలోనఁ
దిరిగెడు కరులపొందిక నున్నవారిఁ
గట్టుకంబంబులఁ గదియంగఁ జేర్చి
కట్టు నేనుంగులకరణి మీరలును
బదరక భక్తిప్రపత్తిమార్గములఁ
బదవుల నొందించి భవము లడంచి
పరమార్థ మగుపరాత్పరుఁ డని నన్ను
నరయంగఁ జేయుఁడా యని నియోగింప
వనజాతవాసిని వనజాక్షుఁ జూచి
యనియె దేవర మమ్ము నలధరాస్థలిని
బొడమి ద్రావిడవాక్యములఁ బ్రబంధంబు
లొడఁగూర్పు మనుటకు నుచిత మిం కెద్ది
నావుఁ డానందించి నారాయణుండు
శ్రీవనజాక్షి నీక్షించి యిట్లనియెఁ

గలుషసంతతులరాకాసి నాఁ గాశిఁ
గలుగంగఁ జేసిన గంగచెంగటను
హరపార్వతీవివాహముఁ జూడఁ గోరి
సురలు మునీంద్రు లచ్చోటి కేతేర
నాభారమున నుత్తరాశావకాశ
భూభాగ మెడల నొప్పున గ్రుంగ నపుడు
బొమ్మరవోయి వేల్పులమూఁక వేల్పుఁ
గమ్మరిఁ బిలిచి యక్కజము చూచితివె?
యురుతరం బగు దీనియొరఁగు దిద్దంగ
వెరవు గల్గిన మాకు వినిపింపు మనినఁ
జెప్పిన నామాటఁ జేసెదరేనిఁ
జెప్పెద నని సురశ్రేణి కిట్లనియె
నమితతపోధనుం డగుకుంభతనయుఁ
గ్రమమొప్ప వలదిక్కుకడకుఁ బంచినను
సమరీతి నొప్పు రసాచక్ర మనినఁ
దమకించి యాకుంభతనుజన్ముఁ డలిగి
నులివెచ్చనూర్చి కన్నుల కెంపు నెఱయఁ
దలఁపున నెలకొన్నతాల్మి వోవిడిచి
కనలుచు నావిశ్వకర్మ నీక్షించి
యనియె నీవక్రోక్తు లాడ నేమిటికిఁ

బనిఁ బూని పార్వతీపరిణయోత్సవముఁ
గనఁ గోరి యంతరంగమున నెంతయును
లలిమీఱఁ బెక్కుగాలములనుండియును
గలుషాత్మ! యిచ్చటఁ గాచియుండంగఁ
జెనఁటి వై విఘ్నంబు చేసితో లేదొ?
యని కనలుచుఁ దావకాన్వయులకును
బని యధికంబు నల్చము కూలి యగుచుఁ
జనుఁగాక యని ఘనశాపంబు నిచ్చె
నిచ్చిన ననయంబు నిచ్చలోఁ బొగిలి
క్రచ్చఱ నావిశ్వకర్మ యిట్లనియెఁ
గటకటా! సకలోపకారంబు గాఁగ
నిటఁ బిల్చి నను సురలెల్లఁ బ్రార్థించి
యడిగినందుల కుపాయంబుఁ జెప్పుటకు
నుడికి నీ వీగతి నుచితంబుఁ దప్పి
శపియింపఁ దగునె యోచపలాత్మ! యనుచుఁ
గుపితుఁ డై యమ్మౌని కోపించి పలికె
నీవు తాల్చినయట్టి నిగమసంతతులు
ద్రావిడరూపముల్ తాల్చుఁగా కనుచు
శపియింప నిరువురజగడంబుఁ జూచి
యపుడు వారలకోప మమరులు మాన్చి

పనిబూని కుంభసంభవుఁ బెక్కుగతుల
వినుతించి దక్షిణోర్వికిఁ బంపుటయును
జని ఖిన్నుఁ డై కలశజమౌనితిలకుఁ
డనుపమం బగుమలయాద్రిమీఁదటను
హిమవారి మునిఁగి వెయ్యిన్నూఱుదివ్య
సమములు ననుఁ గూర్చి సవరించెఁ దపము
నత్యంతసంతోష మడర నే నపుడు
ప్రత్యక్ష మై వేఁడు ఫల మిత్తు ననిన
వినతుఁ డై మునియు వేవేలచందముల
వినుతించి తనపూర్వవృత్తంబుఁ దెలిపి
యావిశ్వకర్మశాపాయత్తమైన
ద్రావిడత్వము వచ్చెఁ దనవేదములకు
నేమి సేయుదు నింక నిందిరానాథ!
యీమనోవిగ్రహం బెట్లు మాన్పెదవొ?
యనినం బ్రసన్నుండ నై ద్రావిడత్వ
మొనరిన శ్రుతులె సర్వోన్నతత్వంబుఁ
గలిగి మదీయభక్తశ్రేణిచేత
వెలయునట్లుగఁ జేసి వివరింతు నేను
నని వరం బిచ్చితి నదికారణమున
మును మిమ్ము ద్రావిడముఖ్యదేశముల

నవతరింపుఁడ యంటి నారీతి మీరు
నవతరింపుఁడు వేగ నాదేశములను
అని వారి నియమించి యారమానాథుఁ
డనుపమం బైన శేషాచలంబునను
శ్రీరంగముఖ్యవిశేషదేశముల
ధారుణి నర్చావతారరూపములు
ధరియించి భక్తసంతతులఁ బ్రోచుచును
బరిపూర్ణవిభవసంభరితుఁ డై యుండెఁ
గాంచనరత్నప్రకాశితజాల
కాంచితం బగు తనయందంబుఁ గాంచి
యనిమిషుల్ ముక్తితోయజనేత్ర కాంచి
యన నొప్పుచును గాంచి యనుపేరఁ బరఁగి
గరిమ నే డగుముక్తికరము లైనట్టి
పురములలో నెల్లఁ బొగడొంది యపుడు
వనజకల్హారజీవనవతి కడలి
ననబోఁడు లెంతె మన్నన సేయుసవతి
విమలాంబుపూరసంవిజితభోగవతి
కమనీయసురభిసంఘాతభోగవతి
యమలకారండవహంసపూగవతి
సుమితపున్నాగఖర్జూరపూగవతి

వరుణమందిరరాగవతి పక్షిరాజ
వరవేగవతి వేగవతి యనునేఱు
చుట్టును విలసిల్లుచుం దనుఁదానె
పెట్టనికోట యై పెంపొందుచుండ
నుత్తరోత్తరవృద్ధి నొదవించు బ్రహ్మ
యుత్తరవేది నా నొప్పు నప్పురిని
యురుతరవరదోత్సవోద్యన్మృదంగ
బిరుదగంభీరదభేరీరవంబు
విని యకాలమునందు వేడ్క నెమళ్ళు
ఘననాద మనుచుఁ గేకాధ్వను ల్సేయు
నమిత మై యగ్రహారాధ్వరధూమ
మమలాంబరంబున నమరి చూపట్టఁ
గాదంబినీపంక్తిగాఁ దలపోసి
నాదించి వెండియు నర్తింపుచుండు
బయలేఱు నెల శిరోభాగదేశముల
నయమార భోగిసంతతిమండనమ్ము
లగుచున్నసౌధంబు లలయామ్రనాథుఁ
డగు నాగకంకణు హసియింపుచుండుఁ
గాముబాణము లనంగా వేఱ కలవె
కామించి వీరల కన్నులే కాక

కనకసూనము లనంగా వేఱ కలవె
ననుపారు వీరలనాసలే కాక
ఘనమైనవిరు లనంగా వేఱ కలవె
కొనలు మించిన వీరిగుబ్బలే కాక
కమ్మదామర లనంగా వేఱ కలవె
ముమ్మాటికిని వీరిమోములే కాక
కనకపత్రిక లనంగా వేఱ కలవె
చెనకమించిన వీరిచెక్కులే కాక
కంబుపోతము లనంగా వేఱ కలవె
కంబుకంఠుల మించుగళములే కాక
గగనఖండము లనంగా వేఱ కలవె
నగవుమోముల వీరినడుములే కాక
కదళికాతరు లనంగా వేఱ కలవె
యుదుటుమీఱిన వీరియూరులే కాక
కడఁగుతాఁబే ళ్ళనంగా వేఱ కలవె
కడు మించు వీరిమీగాళ్లులే కాక
అనిమిషాదులు గొనియాడంగఁ జక్కఁ
దనమెల్ల జగములోఁ దమసొమ్మె యనఁగఁ
బసిఁడిసలాకలో భావజువింటి
కుసుమాస్త్రములొ యనఁ గొమరు దీపించి

పరమలావణ్యసంపదచేత జనుల
నరు దందఁ జేయు తోయజనిభాననలు
నిఖలశాస్త్రాగమనిధు లైనబుధులు
నఖిలేశచరణసంయతు లైనయతులు
హరికోటిసమతేజు లైనరాజులును
హరహితునకు ఘను లగువైశ్యజనులు
హరిభక్తిమతిభద్రు లైనశూద్రులును
హరినీలమణిచారు లైనతేరులును
ఘనబలవిజితదిక్కరు లైనకరులు
ననుపమజవజితహరు లైనహరులుఁ
గవులును రసికపుంగవులునుం గలిగి
యవిరళశ్రీలచే ననువొంది యుండు
నరయ నన్నగరిమధ్యమున ననంత
సరసిచెంగట హస్తిశైలాంతరమున
బంగారుబోఁడుల పాలిండ్లఁ బోలు
బంగారుకుండలపస మించి మింటి
కాఁపురంబులవారు కని సన్నుతించు
గోపురంబులు వజ్ర కురువింద నీల
లలితంబు లైనజాలములజాలములు
మలయజవిద్రుమమణిమంటపముల

ధళధళం బొలుచుకుందనపువాకిళ్ళ
చలప నిచ్చలపుఁబచ్చలతోరణముల
సురనీలవిరచితసోపానతతుల
గురుచంద్రకాంతపుఁగొణిగెచూరులను
జలువనెత్తావులు సారెకు మలయ
మలయమారుతముల మలయుమాళిగలఁ
గళుకుకంబముల బంగారుబోదియలఁ
జిలుకలచాలు దీర్చినవలీకముల
నింపొంది మఱియు ననేకచిత్రములఁ
బెంపొంది లోచనప్రీతి రెట్టింప
నంచితం బగు సదనాంతరసీమ
మించిన శేషవల్మీకంబు [19]చెంత
మదిరి పసిండిచే నొనరించినట్టి
[20]మదిరె చేతులవయ్యు మాళిగెమీఁద
నోట నొక్కొకమాఱు నొడివినం బుణ్య
కోటి నిచ్చుచుఁ బుణ్యకోటి నా వెలయు
బంగారు మేడలోపలభూమిఁ గల్గు
సింగార మొకకుప్ప చేసినరీతిఁ
జెందమ్మిరేకులఁ జెనకుపాదములఁ
జెందిన పసిఁడి గజ్జియలు నందియలు

చుట్టిన కెలఁకులఁ జుంగులువాఱఁ
గట్టిన హేమాంశుకంబు చూపట్ట
నురుతరంబుగ గద యూనుహస్తంబు
వరుస భక్తులఁ బ్రోచు వరదహస్తంబు
పాటి మీఱినయట్టి పద్మభవాండ
కోటికోటుల నించుకొన్నబొజ్జకును
వదలకుండఁగఁ గట్టువైచినరీతి
నుదరబంధం బెంతయును నొప్పుచుండ
జడియనిబాహుపాశములచేఁ గట్టు
వడిన సోమార్కబింబములచందమున
నలరక్కసులమిత్తి యగుచుట్టుఁ గత్తి
వలమురియును నెంతె వలనొప్పుచుండ
విన్నుపైఁ గ్రొమ్మించువెన్నెలసోగ
యున్నకైవడి సిరి యరమునఁ జెలఁగ
నలరమాదేవి సౌధాగ్రంబు రత్న
కలశంబుకైవడి కౌస్తుభం బలరఁ
బంటవలంతి గుబ్బల మీఁదనొత్త
నంటిన మకరరేఖాంకంబు లనఁగఁ
గులుకుముద్దులనక్రకుండలాకృతులు
తళు కొత్తు చెక్కుటద్దముల మైనిండి

భాసిల్లఁగా వపాపరిమళోల్లాస
వాసితాధరపల్లవమున లేనగవు
నిగుడంగ సంపంగినెఱిచూపునాస
తెగ గల తెలిదమ్మిఁ దెగడుకన్నులును
గోపు వంచినవింటికొమ రైనబొమలు
నాపూర్ణసోముని హసియించుమోము
నిటలభాగంబున నెలవంక లైన
కుటిలకుంతలములు కొమరు దీపింప
నిఖలయౌవనపద్మినికి గుడి కట్టి
శిఖర మెత్తినయట్లు జీవరత్నముల
రీతిఁ జూపట్టుకిరీటంబుఁ గలిగి
పాతకాభీలజం బాలసూర్యుండు
దేవరాయఁడు రమాదేవితో భక్త
సేవితుం డై తలఁచినవారి కెల్ల
వరము లిచ్చుచు దేవవరమునీశ్వరులు
వరదరా జనుచు భావన సేయ నజుని
హోమగుండంబులో నుదయించి యిష్ట
కామంబు లిచ్చు నెక్కాలంబునందు
రమణ మై యతనియగ్రంబున హేమ
కమలాకరం బొండు గల దందులోన

నసమానపాంచజన్యాంశంబు వచ్చి
పసిఁడినెత్తమ్మిగర్భముఁ బ్రవేశింప
భాసిల్లఁ నానాఁటఁ బ్రబలి చూపట్టెఁ
గాసారలక్ష్మికి గర్భచిహ్నములు
గాటంపుతమ్మిమొగ్గలచన్ను మొనలఁ
దేఁటిక ప్పెదవెఁ బూఁదీవె నెమ్మేను
పలుకఁబాఱెను గనుపట్టె నంతటను
వలనొప్ప నల్లగల్వలబంతి యారు
తెలిదమ్మి నెమ్మోము తెలతెలఁబాఱె
నొలయులేనురువుచిట్టుములు బి ట్టయ్యెఁ
దరఁగలవళులు మందంబు లై తనరె
సరసమృత్తికలవాసనలె యింపయ్యె
నలఁగి తిన్నటియంచనడలు జాగయ్యె
నలమహాచామీకరాబ్జినియందు
హరినాభి నుదయించు నజునిచందమున
హరితార నాశ్వయుజాఖ్యమాసమునఁ
గాంచనపంకజగర్భంబునందుఁ
బాంచజన్యాంశ ముద్భవ మయ్యె నపుడు
నాయోగి రవి యుదయం బైనకతనఁ
గాయజాజ్ఞానాంధకారంబు లణఁగె

దివినుండి మొఱసెను దేవదుందుభులు
దివిజకామినులు నర్తించి రందంద
సురలు వర్షించిరి సూనవర్షములు
సొరిదిఁ దక్కినయట్టి శుభసూచకములు
శౌరి దేవకియందు జన్మించునప్పు
డారయ నేరీతి నారీతి నుండెఁ
గమలాక్షుఁ డపుడు దిగ్గన నేగుదెంచి
కమలవాసిని యైనకమలయుఁ దాను
భ్రమరపంక్తుల సరషణులతోఁ దూఁగు
రమణీయ మైన సారసపుఁదొట్టెలను
వేదనాదంబుఁ గావించుబాలకుని
మోదంబుతోఁ జూచిమురవైరి గదిసి
చేతఁ గైకొని చెంత సిరిపువ్వుఁబోఁడి
చేతికి నిచ్చె నిచ్చిన లోకమాత
తనయుపైఁ గూర్మి నెంతయుఁ బాలు గుబ్బ
చనుదోయి గురియంగ సందిటం గ్రుచ్చి
నయమార నాలింగనము సేసి శిరముఁ
బ్రియమార మూర్కొని పెరిమెఁ జన్నిచ్చి
యెలమి శౌరియుఁ దాను నిట్లు పోషింప
జలజనివాసిని చనుబాల [21]పుష్టి

వనజాస్త్రకోటిలావణ్యంబుతోడఁ
గనుపట్టి యయ్యోగికంఠీరవుండు
సరసిజాలయపదాబ్జములపై శౌరి
చరణాంబుజములపై సాగిలి మ్రొక్కి
నుతియింప నతని సన్నుతులకు మెచ్చి
శతపత్రనేత్రుండు సారసనిలయ
సజ్జీవనత బహుసత్త్వయోగమును
ముజ్జగంబులతాపములఁ దీర్చుగరిమ
యనుపమగాంభీర్య మమృతమూర్తియును
నొనర సరోనామ మొసఁగి యాతనికి
నమిత మై దుష్ట మైనట్టిసంసార
తమములోపలఁ జిక్కి తముఁ గానలేని
జీవుల నెల్ల రక్షించి వేదంబు
త్రోవకుఁ దెమ్ము నేరుపున నోతనయ!
నీయంద మేమును నిలిచెద మనుచు
నాయోగిహృదయంబునందు వసించి
యుండి రంతట సరోయోగి [22]డెందమున
నిండారువేడ్కతో నిఖిలదేశములఁ
బరయోగిసామ్రాజ్యవైభవం బెసఁగఁ
జరియించుచుండె నిచ్ఛావిహారముల

ఘోరనక్రగ్రాహకూర్మాదిలస ద
పారపారావారపారంబునందు
ముల్లోకముల సమమును మించు లేని
మల్లాపురం బను మహనీయపురిని
ముక్తిపోషుండు కౌమోదకీదివ్య
శక్తిమయుం డైన సన్మౌనివరుఁడు
మును వచించినమాసమున వసుతార
ననుపమనీలోత్పలాంతంబునందు
జనియించె నిందిరాసహితుఁ డై శౌరి
చనుదెంచి కడుసంతసమున నీక్షింప
వనరాశితనయ క్రేవల నున్నతనయుఁ
గొనకొన్నప్రేమఁ జేకొని యెదం జేర్చి
పతిచేతి వలమురి పా లిడఁబూని
కుతుకంబుతో సత్త్వగుణ మనుపాలు
హరిభక్తి యనుస్నేహ మందంద [23]కలిపి
పరిపూర్ణమతి యోగిపతి కడుపునకుఁ
బోసి పోషించె నొప్పుగ దానవారి
యాసమయమున భూతాభిధానంబు
నతనికి నొసఁగి నీ వవనిపై భూత
తతిని సంసృతిసముద్రముఁ దరింపంగఁ

జేసెదు గాన నిచ్చితి మిట్టినామ
మాసురప్రకృతిచే నజ్ఞాను లగుచు
మముఁ గానకున్న యాత్మల నాత్మవిద్య
మము నెఱుంగఁగఁ జేయు మాపుత్త్ర యనుచుఁ
దోడు నీ డై ముకుందుఁడు పద్మ యతని
తోడనె తిరుగంగఁ దొడఁగి రంతటను
నలమాసమున సముద్రాగారతార
నలఘుమయూరపురాహ్వయపురిని
దళుకొత్తు లతికాహ్రదం బనుపేరఁ
గలకొలంకున రత్నకైరవాంతమున
శ్రీనందకాయుధు చె న్నగ్గలించి
శ్రీనందకాంశ మై చెలువొందు యోగి
జనియించె నప్పు డాజగదేకమాత
వనజాక్షుఁడును గారవములు దైవాఱ
గడుఁ బెద్ద యగుకూర్మి కడలి నోలార్చి
నిడుదనెయ్యములోన నిగుడఁ బోషించి
తద్దయు మెచ్చి పెద్దలకెల్ల నీవ
పెద్ద వై జగతి దీపించెదు తనయ!
యనుచు మహాహ్వయం బతనికి నొసఁగి
యనుఁగు నెక్కొనఁగ నయ్యాదిదంపతులు

నకలంక మైనట్టి యయ్యోగిహృదయ
వికచాంబుజంబుఁ బ్రవేశించి రంత
మురవైరి నాబాల్యమున నుండి చిత్త
సరసిజాంతరములఁ జక్కఁగా నిలిపి
పరిపూర్ణచిత్తు లై బ్రహ్మవిన్యస్త
భరు లైన యయ్యోగివరులు మువ్వురును
దముఁ బోలినట్టి యుత్తము లైనయోగి
తము లెవ్వ రని దేవతామందిరముల
నదుల దేశముల నానాతీర్థములను
వెదకుచు నొక్కచో వీసమంతయును
నాసక్తి లేక సాయంగేహు లగుచు
భాసిల్లుచుండిరి పంకజోదరుఁడు
వారల నిజమహత్త్వంబు నియ్యెడల
వారని తనపరత్వంబు మోకముల
నెగడించి యజ్ఞాననికరమోహంబు
లగలింతు నని యెన్ని యాయోగివరుల
ముగురి నాకస్మికముగ దేవనగరి
నగుచుండు శ్రీవామనక్షేత్రనగరి
నొనఁగూర్ప బయటఁ బురోపకంఠమున
నునికిగా నల్లంత నున్న యత్తఱిని

ననుపమం బైన మహానిశివేళ
వనదోదయము లేనివానఁ గల్పింప
నప్పు డాపెనువాన యశనిపాతముల
చప్పుళ్లతోడ ఝంఝామారుతమున
వడగండ్లతో నలవడి వడి మీఱి
సుడిగొల్పు రవళితో జో రని గురియఁ
జిడిముడి మొగ మడఁచినఁ గానరాక
కడుఘోర మగు నంధకారంబు వొడమ
నొకనికిఁ గూర్చుండియుండంగఁ జాలు
నొకచిన్నగేహళి యుండంగఁ జూచి
యాయోగివరులలో నాదియోగీంద్రుఁ
డాయెడఁ జనుదెంచి యచ్చోట నిలిచె
నంత రెండవయోగి యట కరుదేర
నంతరంబున నున్న యామునీశ్వరుఁడు
చనుదెంచి తేటి కీసంకటస్థలికిఁ
జినుకున కోడి యాసీనుండ నగుచు
నేనుండి తిరువుర మిటమీఁద నిలిచి
యైన నుండుదము ర మ్మని చేరఁబిలిచి
యున్నతి నమ్మౌనియును దాను నచట
నున్నయత్తఱి మహాయోగి యేతేర

నొకనికి శయనించి యుండరా దిచట
నొకరీతి నొదుగుచు నొదుగుచు మేమ
యీలోన నున్నార మిరువుర మిప్పు
డీలోనఁ జనుదెంచి తీవు నిచ్చటికి
నెక్కొన్న వానలో నిలువక రమ్ము
కక్కసం బైన యిక్కడ నీవు మేము
నొండొరులకు మన మొద్ది కై సరదు
కొండము ర మ్మంచుఁ గూడి మువ్వురును
నుండి రాగేహళి నురుతరవృష్టి
దండి మై గురియ నత్తఱి నేగుదెంచి
యలయోగిహృదయంబు నరసెద ననుచుఁ
దలపోసి తపసిడెందపుసందడీఁడు
కడుఁ గక్కసమున నక్కడ నున్నవారి
నడుమ సొత్తెంచి లేనవ్వు నవ్వుచును
గణియంబు లోలిఁ బ్రక్కల నున్న చెఱకు
గణికల నొత్తడిఁ గావించుపగిది
నొత్తున మొదలనే యొదిగెడువారి
నొత్తడి సేయ నయ్యోగీంద్రవరులు
మనము మువ్వుర మిందు మసల నెన్నడుమఁ
జనుదెంచి తనరూపుచందంబు డాఁచి

యిఱికెడి నడుమ వీఁ డెవ్వఁడో వీని
తెఱఁగు తెల్లంబుగాఁ దెలియుద మనుచు
నచ్చెరు పడుచుండి రయ్యదియోగి
నిచ్చలం బగుభక్తి నిలిపి డెందమున
ధరణి పంతియ సముద్రంబులు సేయి
యరుణు దీపముఁ జేసి యరుణాంశుతతుల
గారాబుచక్రంబు కైఁ బూన్చినట్టి
నీరజాక్షున కిచ్చె నీరాజనంబు
నంత రెండవయోగి యతనిపైఁ బ్రేమ
పంతియ మితి లేనిభక్తియే చమురు
నానందభరితహృదబ్జంబె వత్తి
గా నొనరించి వికాస మై యాత్మఁ
దిర మొందుజ్ఞానంబు దీపంబుఁ జేసి
పెరిమె నారాయణార్పితముఁ గావించె
బంధురజ్ఞానదీపప్రకాశమున
నంధకారం బెల్ల నణఁగె నవ్వేళ
ననుపముఁ డైన మూడవయోగి శౌరి
తనదుముందరను ప్రత్యక్ష మై నిలువ
సిరిఁ గంటిఁ జెన్ను మించినమేను గంటిఁ
గర మొప్పువదనవికాసంబుఁ గంటి

సల్లలితావనీస్తనకుంభశుంభ
పల్లవంబులఁ బోలుపాదము ల్గంటి
సరసిజహలశంఖచక్రాంకుశాంక
చరణముల్ జగదేకశరణముల్ కంటిఁ
దరణిబింబముచాయఁ దరళించుకనక
సురుచిరాంశుకము నంశుకముఁ గన్గొంటి
శ్రీ మించుకటితట శ్రీసతీవరణ
దామముల్ మేఖలాదామము ల్గంటి
వాత్సల్యజలధికైవడి నొప్పుచున్న
వత్సంబుఁ గంటి శ్రీవత్సంబుఁ గంటిఁ
జుట్టుఁ గైదువు వలచుట్టుశంఖంబు
పట్టిచూపట్టినబాహువు ల్గంటి
శాతాంశుమండలశతకోటికోటి
రీతిఁ జూపట్టుకిరీటంబుఁ గంటి
మలఁగులై తెల్లఁదామరలఁ దా మరలఁ
గలహించు నిడువాలుఁగన్నులఁ గంటి
మకరకుండలబాలమార్తాండరుచుల
వికసించు వదనారవిందంబుఁ గంటి
నని నుతింపఁగఁ జూచి యయ్యిరువురును
వినుతింపఁ దలఁచి రవ్విష్ణు నీక్షించి

యాపూర్ణమతులకు నావేళ విశ్వ
రూపి యప్పుడ విశ్వరూపంబుఁ జూప
నాసర్వమయురూప మవలోకనంబు
చేసి మ్రొక్కుచు మునిశేఖరు ల్మఱియు
నా నంద సుతురూప మపుడు సేవించి
యానందపరవశు లగుచు నుప్పొంగి
యంతాదు లనుపేర నలరుప్రబంధ
చింతామణులు ముక్తిఁ జేర్చునిచ్చెనలు
వేదరూపములు గావించిరి మూడు
వేదాంతవేద్యుఁ డావిశ్వమయుండు
నంటున నయ్యోగినాథుల మతులఁ
దొంటిచందమున నస్తోకుఁ డై యుండె
యోగినాథులు దివ్యయోగసామ్రాజ్య
భోగు లై భువిఁ జరింపుచునుండి రనుచు.
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
అతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్తసంతతికి
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమ తాళ్ళపాకన్నయార్య.

తనయ తిమ్మార్యనందనరత్నశుంభ
దనుపమశ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మమండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ
సదనావధూలబ్ధసరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాథ
కృత మైన పరమయోగివిలాసకృతిని
యతులితంబుగఁ బ్రథమాశ్వాస మయ్యె.


___________
  1. సర్వ
  2. నమలుని ముని
  3. విభుండు
  4. చందమునను
  5. తర్క
  6. యెపుడుఁ బాల్పడియుండు లోక
  7. లీలలకె
  8. నాతరువులనీడ
  9. జెలములు రాజేలములు
  10. నెల్లనై
  11. విచిత్రమో మఱియు
  12. నెరసంజ గనువిచ్చు
  13. సొంపు
  14. పొంకించుటే
  15. దభి
  16. తనుప
  17. ననుఁగునం
  18. నసురప్రకృతులయి
  19. చేర్ప
  20. మదిని చేతులవయ్య
  21. ముష్టి
  22. హృదయమున
  23. కులికి