పరమయోగి విలాసము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పరమయోగివిలాసము

ద్వితీయాశ్వాసము.


హైమసరోజాంగ! యలమేలుమంగ!
జీమూతసంకాశ! శ్రీవేంకటేశ!
మునిశాలికాసారముఖ్యభక్తాళి!
వనమాలి! యవధారు వరదానశీలి!
పుడమిఁ గాంచికిఁ దూరుపునఁ బయోరాశి
పడమట సర్వసంపదఁ జెన్నుమీఱు
సకలభూస్థలము నాస్థలమును బ్రహ్మ
యొకమాఁటుత్రాసున నునిచి తూఁచుటయు
ధరణితలం బెల్ల దానితోఁగూడ
సరితూఁగకునికి యాసరసిజాసనుఁడు
జగతిపై నిది మహీసారాభిధాన
మగుఁగాక యని యన్న నది యాది గాఁగ
మహి మహీసార నామమునఁ జెన్నొందు
బహుపుణ్యకైవల్యఫలద మై యెపుడు

నందును సకలలోకారాధ్యుఁ డైన
యిందిరాపతి వసియించి చెన్నొందు
వనధివేష్టితధరావలయపావనము
వనము మౌనీంద్రజీవనము తత్పురము
సరసను శోభిల్లు చైత్రరథంబు
గరిమలు చపచపంగాఁ జేయురమణ
నావనంబున వీక్షితాత్ముఁ డై లోక
పావనుం డైనట్టి భార్గవమౌని
పుడమిపైఁ బోఁక యాపోఁకపై సూది
యిడి దానిపైఁ బాద మిసుమంత యూఁది
యాననం బెత్తి కరాబ్జము ల్మోడ్చి
భానుమండలముఁ దప్పక విలోకించి
పదిలుఁ డై దేవతాభావపూర్వముగ
మదిలోన మంత్ర మేమఱక యెన్నుచును
మడువులలోన హేమంతకాలమున
వడఁ జల్లుతఱిఁ బంచవహ్నిమధ్యమున
నారూఢచిత్తుఁ డై యహరహం బిట్లు
ఘోరతపంబుఁ గైకొని చేయుచుండ
వడి మీఱి తత్తపోవహ్నులకీల
లడరి వాసవలోక మంటె నంటుటయు

విసుమాన మంది యవ్వేళ దేవేంద్రుఁ
డసమానభీతిచే నందంద వడఁకి
పూని యీక్రూరత పో వృత్తి నెట్టి
మానవుండ వని నమానవేశ్వరతఁ
గోరి డెందమునఁ గైకొనియెనో కాని
యేరీతి నుండునో యిది యంచుఁ దలఁచి
సంచితమన్యుఁ డై శతమన్యుఁ డపుడు
పంచాస్త్రుమోహనబాణంబుకరణిఁ
గనుపట్టు నచ్చరఁ గాంచనవర్ణి
యనుపేరిచెలువ నొయ్యనఁ జేరఁ బిలిచి
ధరలోన భార్గవతాపసుం డిప్పు
డురుఘోరతపము సేయుచునున్నవాఁడు
చపలాక్షి! నీవిలాసముచొక్కుఁ జల్లి
తపసి గూర్చినతపోధనముఁ గైకొనుము
మదవతి! నినుఁ గన్నమానవుఁ డింద్ర
పద మేలఁ దలఁచు నెప్పగిదినంటేని
రమణి! నీయరుణాధరముఁ గ్రోలువాని
కమృతంబు మై నేల యాసలుపుట్టుఁ
గాంత! నీకుచములుఁ గనువాని కమర
దంతికుంభములపైఁ దలఁ పేల కలుగు

నతివ! నీబాహుల కగపడువాఁడు
మతిఁ గల్పలతికల మఱి యేల యెన్నుఁ
బడఁతి! నీపలుగెంపుపసఁ గన్నవాఁడు
తడవునే యాత్మఁ జింతామణిఁ దలఁపఁ
దెఱవ! నీతోడిపొందికఁ గల్గువాఁడు
మఱియేల దేవసామ్రాజ్యంబు వెదకు
నని తన సేయుకార్యప్రకారమున
కనుగుణంబుగఁ బల్కు నమరేశ్వరునకుఁ
బ్రణమిల్లి తదనుజ్ఞఁ బడసి యా లేమ
గణుతింపఁ దగుహేమకళికలో యనఁగఁ
గనుపట్టు దేవతాకామినీమణులు
తనుఁ గొల్వ మేదినీస్థలి కేగుదెంచి
స్వర్గోపవనవికాసముఁ గ్రిందుపఱచు
భార్గవమునివనప్రాంతంబుఁ జేరి
పుట్టతొట్టెలలోని భుజగబాలకులఁ
బట్టి యొయ్యన జోలఁ బాడునెమళ్ళు
నెలమిఁ జెంతల నాడు నేణపోతములఁ
బిలిచి మచ్చిక యుగ్గుఁ బెట్టుబెబ్బులులుఁ
బలుమఱుఁ గరములం బట్టి లాలించి
కలభసంతతి ముద్దు గావించుహరులు

నలమి ప్రక్కలలోన నందంద పొదివి
యెలుకపిల్లలకుఁ జ న్నిచ్చుపిల్లులును
గలిగి యన్యోన్యరాగములతో వైర
ములు మాని సురవనమును గేలి గొనుచు
సారసభవు బోలె శంభునిం బోలె
శారదోద్యచ్ఛివాసంయుతం బగుచు
సురనాయకుని బోలె సుగ్రీవు బోలెఁ
గరిరాజ వనచర కమనీయ మగుచు
నాగలోకముఁ బోలె నలినాస్త్రుఁ బోలె
భోగీంద్రరతికుచభూషితం బగుచు
వనరాశిఁ బోలె దిగ్వలయంబుఁ బోలె
ననుపమాండజవిబుధాకీర్ణ మగుచుఁ
బనసభుజాతమ ల్ పారిజాతములు
ఘనసారపూగముల్ కనకపూగములు
చిరిబిల్వవారముల్ సింధువారములు
సరస రసాలముల్ చక్రసాలములు
పొదలుజాతులు బహుపుష్పజాతులును
బొదిగొన్న మల్లెలు బొండుమల్లెలును
జందనంబులు గలచందనంబులును
గుందహింతాలముల్ కురువతాలములుఁ

గోలకుంజములు నంకోలకుంజములుఁ
బాలమ్రాఁకులును రెప్పాలమ్రాఁకులును
గనుపట్టురావులు గంగరావులును
గొన బైనతేకులు గుముదుతేకులును
గలుగొట్టు రేఁగులు గంగ రేఁగులును
దలుకొత్తు నిమ్మలు దాడినిమ్మలను
గుదిగొన్నజువ్వులు కొండజువ్వులును
ముదిరినమోదుగుల్ ములుమోదుగులును
మొదలైనతరులతాముఖములఁ గలిగి
పదివేలతెఱఁగులఁ బ్రబలి యెంతయును
స్వర్గంబువనములఁ జౌక పుట్టించు
భార్గవువనములోపలి కేగుదెంచి
యచ్చరపూఁబోఁడి యచ్చట నిలిచి
వచ్చిన తనతోడివనితలు మెచ్చఁ
గట్టాణిముత్యాలఁ గనుపట్టుచున్న
బొట్టు మిక్కిలి నొఱపుగ సవరించి
నటనగాఁ జిన్నారినామంబుఁ దీర్చి
బటువుగాఁ బచ్చలపతకంబుఁ జేర్చి
కొనబుగాఁ గప్పారుకొప్పుఁ గీలించి
మినుకుగా మేదీఁగె మృగమదం బలఁది

యొఱపుగాఁ గుచ్చెల నొరయంగఁ గట్టి
మెఱపుగా మొలనూలు మీఁద నమర్చి
కళుకుగాఁ బౌఁజులకమ్మలు దాల్చి
తెలివిగా మొగపులతీవె లంకించి
[1]విన్నాణముగరాలపెండెంబు వెట్టి
వన్నియగా సేల వలెవాటు వైచి
డాలుగాఁ బసిఁడియొడ్డాణంబుఁ బూని
మేలుగా వజ్రాలమించులుఁ బూని
కాంతిగాఁ గెంపులకడియము ల్దొడిగి
వింతగాఁ గపురంబు విడియంబు చేసి
యొసపరి బాగుగా నుద్దాలు మెట్టి
యసమసాయకుని మోహనకాండ మనఁగ
ధళధళఁ దులగించు తాటంకరుచులు
తళుకొత్తు చెక్కుటద్దముల మై నిగుడ
నెఱబేడిసలజాడ నిగుడ నేత్రముల
మెఱుగారుచూపుల మిన్నెల్ల మెఱవ
నఱవిరిగతుల నొయ్యన మూఁపుమీఁద
నఱజాఱువేనలి యల్లాడుచుండ
ఝల్లుఝ ల్లని మునిస్వాంతంబు గలఁగ
ఘల్లుఘ ల్లని పాదకటకముల్ మొఱయ

గీటాడుగుబ్బల గికురించుకాంతు
లూటాడుపయ్యెదయోర డాలింప
నెరు లేరుపడి నిగనిగ చిదిరించు
మురువైనకుచ్చెల మొరమొర మెఱయఁ
గడు మించు మరువేఁట గంటలపోల్కి
నుడిదారముల గంట లుయ్యల లూఁగ
ధగధగ మించురత్నముల పెం పెసఁగు
మొగపులకటిసూత్రములు వెడజాఱ
మెఱుఁగుఁ బల్వరుసక్రొమ్మించుతో మోవి
చిఱునవ్వువెన్నెల చిందులాడంగ
వేఁగారుగుబ్బల వ్రేఁకంబుతోడ
లేఁగౌనుదీవియ లివలివ లాడ
ముంగేలికంకణంబులపంజరంబు
చెంగటి ముద్దురాలుక లాలించి
తమ్మఁ బెట్టెద రామ తమ్మ నాముద్దు
గుమ్మ మాటాడ రా కొటు కొట్టు మనుచుఁ
జిలుక నొయ్యన ముద్దుచిలుక నందంద
పిలిచిన తనదైన బింబోష్ఠమునకు
నొడిసిన రాచిల్క యొడుపు దప్పించు
బెడఁగున నొకవింతబెడఁగు చూపుచును

భావజుమదదంతిపగిది నాలేమ
యావనాంతరమున కరుదెంచి యచటి
ఘనతపోరాశి భార్గవమౌనివర్యుఁ
గనియుఁ గాననిదానిగతిఁ జేరవచ్చి
యలయుచు సొలయుచు నతనిముంగిటను
బొలయుచు మేనివల్పులు గుబాళించి
పన్నీటి యివము కప్రముమీఁది చలువ
వెన్నెలలో శీతు వెడనవ్వుకొనుచు
మట్ట మై తలిరుజొంపములతో నొక్క
పొట్టెమై లో నెండపొడవడకుండఁ
దలిరించి కడు నివతాళించుచున్న
యెలమావిక్రిందటి కేతెంచి నిలిచి
చరణంబు మై నొక్క చరణుబు నిలిపి
గురుకుచంబులతళుకులు పిసాళింపఁ
దలిరుకెంగేలఁ గెందలిరాకుగొమ్మ
నలవోకఁ బట్టి యొయ్యారంబు నిగుడ
మెఱుఁగువేనలి మూఁపుమీఁద నల్లాడ
నొఱపులు గులుకంగ నొకచిందువాడి
చెలికత్తెమూఁపుపైఁ జేయిఁ జేర్చుచును
జిలుకకు బుధ్ధులు చెప్పి నవ్వుచును

దళుదళుక్కున గండతల మొలయించు
నొలయించి కెంగేల నొయ్యన మాటు
మీఱుపాలిండ్లపై మెఱుఁగుగాఁ జెరఁగు
జాఱించు జాఱించి చక్కఁగా నొత్తుఁ
జిఱునవ్వువెన్నెలజిగి నెఱయించు
నెఱయించి మోవివెన్నెల సాళగించు
నల్లన నయనతోయజము లల్లార్చు
నల్లార్చిరెప్పల నడ్డంబు సేయు
నటన మూపునఁ గొప్పు నటియింపఁ జేయు
నటియింపఁ జేసి క్రన్ననఁ జక్కదిద్దుఁ
గరమూలయుగళిబంగరుసుంకురాల
విరిబంతి కెంగేల వికసింపమఱియుఁ
జెలికత్తియలపిండుఁ జేరఁజీరుచును
గిలగొట్టి యంతలోఁ గేరి నవ్వుచును
నలయుచు సొలయుచు నందంద నొసలఁ
జిలుకులేఁ జెమటఁ గెంజేత నూర్పుచును
గఱివంకబొమలు నిక్కంగ సంపంగి
నెఱతావి నెరయంగ నిట్టూర్పు లిడుచుఁ
దగఁ బచ్చపదకంబుతళుకులమెఱుఁగు
బిగిచన్నుగవచుట్టుఁ బేరెంబువాఱ

రం గైన కంకణరాగంబుతోడ
నుంగరంబులకాంతు లుప్పరం బెగయఁ
బసిఁడివన్నియఁ గ్రిందుపఱచునెమ్మేని
పసనిచాయలు వలిపముఁ జౌకళింప
గబ్బిగుబ్బలమీఁది కస్తూరిపూఁత
గొబ్బున మెఱసి దిగ్గున సోడుముట్ట
ధరలోని విరహిసంతతి నెలయింప
మరుఁడు పంటినయట్టి మాయామృగంబు
కరణిఁ జూపట్టి భార్గవమౌనిచిత్త
సరణిఁ బ్రవేశించుసరవిఁ జింతించి
పలుమఱు దనహావభావవిలాస
ములు చూపుచుండ నమ్మునివరేణ్యునకు
నంతరంగము చిందులాడంగఁ దొడఁగె
నంతట రవిమీఁద హత్తినచూపు
రాజాస్య తాటంకరవలమై నిగిడె
నోజ దప్పక విధియుక్తమంత్రంబు
నుడివెడి జిహ్వ కన్నుల కల్కినామ
మడుగ నుద్యోగించె ననురాగ మెసఁగ
హృదయాంబుజంబుపై నెనసినబుద్ధి
మదిరాక్షిపాదపద్మములమైఁ దగిలె

జపమాలికాసంఖ్య సవరించువ్రేళ్లు
చపలాక్షి ర మ్మని సన్నఁ గావించె
నప్పు డామునినాథుఁ డంతరంగమునఁ
గప్పిన కామాంధకారంబుతోడ
నయము పోవిడిచి మౌనముఁ గట్టిపెట్టి
నియమం బుడిగి మనోనిగ్రహం బేది
జపమాల సడలించి జప ముజ్జగించి
తప మోసరించి లో ధైర్యంబు డించి
యచ్చటఁ జెలువొందు నచ్చరలేమఁ
గ్రచ్చరఁ జూచి దగ్గఱ కేగుదెంచి
కమలాయతాక్షి జగన్మోహనాంగి
భ్రమరకుంతల దేవభద్రేభయాన
నీ వెవ్వ రబ్జాస్య నీకుఁ బే రేమి
దేవకన్యకవొ భూదేవకన్యకవొ
రాజకన్యవొ భోగిరాజకన్యకవొ
నీజాడ యెఱిఁగింపు నేఁదు మా కనిన
నీతఱిఁ జక్కెఁ బో యితఁ డంచుఁ జుప్ప
నాతికైవడి నలనాతి యి ట్లనియె
ననఘాత్మ వినుమయ్య యమరకన్యకను
గనకాంగి యనుపేరు గలిగినదాన

ధరఁ బావనాశ్రమస్థలములయందుఁ
జరియింపుచుండుదు సఖులతోఁ గూడి
మీవంటిఘనుల కర్మిలితోడ సేవఁ
గావింపఁ గోరి యీగతి సంచరింతు
నోమౌనికులవర్య యొంటి మీ కిట్లు
భామలతోఁ గూడి భాషింపఁదగదు
చివురుబోఁడులు తపశ్శీలవృత్తులకు
వివరింపఁగా వేరువిత్తులు గారె?
మదిలోన నొక్కటి మాటాడుటొకటి
మదిరాక్షులకు నియమంబు సంశయము
వావులు నహి నైజవర్తనల్ సున్న
భావసంసిద్ధి యెప్పాటను లేదు
వేచందమునఁ గృపావివశుఁ డై యీనఁ
గాచినపిదపఁ గుక్కల కిచ్చినట్లు
ఘనతపోధన మెల్లఁ గడపట నొక్క
వనిత కై యేటికి వఱదవుచ్చెదవు
పరమతపోరాజ్యపట్టబద్దుండ
వరయ నీ కిది యేల యని కేలు మొగిచి
పోయివచ్చెద నని పోవ నుంకింప
నాయెడ భార్గవుం డనియె నచ్చరకుఁ

గలకాల మెల్లను గానలో నాకు
నలములుఁ దిని తిని యలయ నేమిటికిఁ
బరమసౌఖ్యం బైనభామలపొందు
మరుగనివాని జన్మంబు జన్మంబె
పరికింపఁగా మున్ను పార్వతీసతికి
హరుఁ డిచ్చె సగముదేహం బన వినవె
యదియునుగాక తోయజభవుం డేల
వదనపం కేజంబు వాణికి నిచ్చె
వార లట్లుండ నీవనజాక్షుఁ డేల
శ్రీరమాదేవిఁ దాల్చెను వక్షమందు
నిన్నియు నన నేల యిహసౌఖ్యవితతు
లన్నియు నిచ్చువా రన్నుల కారె
విపరీతముగ [2]నన్ను విడనాడ నేల
తపము పండినమీఁదఁ దాల్తురే జడలు
చపలాక్షి నీతోడిసంగంబు గలుగఁ
దప మేల జప మేల తక్కిన వేల
నన విని తనకు లోనగుటఁ జింతించి
కనకాంగి మౌనివాక్యము సమ్మతింప
మునినాథుఁ డప్పు డామోదకుంజముల
వనజాస్త్రబాణవిహ్వలచిత్తుఁ డగుచుఁ

దొలుత నా గాధిసుతుండు మేనకను
గలసినకరణి నాకనకాంగిఁ గూడి
సరససల్లాపహాసవిలోకనముల
మరుకేళిఁ దేల్చి పిమ్మట విచారించి
యిచ్చలో నిది తగు నిది తగ దనక
యిచ్చట నే నుండి యేమి చేసితిని
యెచ్చటి సురలోక మెచ్చటితపము
నెచ్చటియచ్చర యిట కేల వచ్చె
వచ్చెఁబో యే నేల వనజాక్షిచూపు
మచ్చువేసిన నిట్లు మరు లేల కొంటిఁ
గడుచిత్ర మిది గాదె కడలిలో నుప్పు
నడవిలో నుసిరికాయయుఁ గూడినట్టు
లే వీటి కనకాంగి యేవీటిమౌని
యీవిధి వాటిల్లె నేమికారణమొ
యది చూడవచ్చిన నట్టిద కాదె
ముదితలయెడ నున్నమునివర్యుఁ డైన
జడియక యెట్లుండుఁ జర్చింప వహ్ని
కడ నున్నయీవెన్న కరుఁగ కేలుండు
నచ్చెరుపడి వేయు నన నేల నొకరి
యిచ్చ గా దెన్నిన నిది దైవకృతము.

అని యాత్మవిద్యావిహారి యై యాత్మ
వనజోదరునిపాదవనజముల్ దలఁచి
పరమవిరక్తుఁ డై నభముక్తుఁ డగుచు
నరిగె నంతటఁ దీర్థయాత్రానురక్తి
నాయెడ మునిఁ గూడినంతనే దేవ
లో యజవదన సద్యోగర్భ యగుచుఁ
గమలాక్షుదివ్యసంకల్పంబువలన
దమితదైతేయసుదర్శనాంశజుని
నఘదూరు యోగీంద్రు నతులలగ్నమున
మఘతారకను బౌష్యమాసంబునందుఁ
గని తనవచ్చినకార్య మంతయును
ననుకూల మయ్యెఁ బొ మ్మంచు గర్వించి
వనజాసనేంద్రాదివంద్యుఁ డౌవాని
మనుజమాత్రుని గాఁగ మది విచారించి
గుమిగొన్న యొక వేత్రకుంజంబులోనఁ
గొమరుని నునిచి గ్రక్కున నేగె దివికి
మౌనినందనుఁడు నిర్మానుషం బైన
కానలో బెగ్గిలి కావు కా వనుచు
విలసిల్లఁగా సామవేదనాదముల
నెలుఁ గెత్తియేడ్వ నయ్యెడఁ గరుణించి

యామహీసారనాయకుఁ డైనశౌరి
యామౌనిసుతుఁ డున్నయట కేగుదెంచి
వనధిమేఖల గారవమున లాలించి
తనకటాక్షామృతధారలచేతఁ
దనివి నొందించి యంతట సేదదేర్చి
తనరించి యంత నంతర్ధాన మైన
జలజాక్షువిరహంబు సైరింపలేక
యెలుఁ గెత్తి యాబాలుఁ డేడ్చునత్తఱిని
మలయంగ నెడ దుప్పిమై నోర గాఁగ
మొలత్రాటఁ జెక్కినమోటకత్తియును
గొనసిగతోఁ గూడి కురు లొకయింత
గనుపట్టఁ జెరివిన గన్నెరాకమ్ముఁ
గొనల వెల్వడుపుట్టగోఁచియు నెరులు
బెనఁగొన్న నునుదబ్బపీఁచు డా కేల
వెడవెడ జివ్వాడు వెదురుసలాక
యెడమచే బొటవ్రేలి యినుపయుంగరము
నడరంగ [3]యడమొట్టి యగుగొడ్డుటావుఁ
బిడిముక్కుతోడునఁ బెనచి [4]రాఁబట్టి
తనతోడిజోడు మేదరులు సోదరులు
వెనువెంటఁ జన నొకవేణులావకుఁడు

హరిదాసుఁ డనుపేరియతఁడు భూసార
పురవాసుఁ డవ్వనభూమి కేతెంచి
కఱ కెక్కి చిట్టెలు గట్టి లో ముణిఁగి
కుఱచ లై వంకరకొంకరల్ వోక
సల్ల లై చక్క నై సవర నై పెరిగి
వెల్లవోవని పండువెదురులు చూచి
నఱకి కుప్పలు వైచి నయముగాఁ జివ్వి
ముఱియించి కుదియించి మోపులు గట్టి
యూరికి మరల నుద్యోగించుతఱిని
వారికి నాచెంత వనవీథి నున్న
బాలురావము వినఁబడిన వా రప్పు
డాలించి మార్జాల మని సంశయించి
పాక్కపా క్కని తమభాషఁ జెప్పుచును
గ్రక్కున నటకు డగ్గఱ నేగుదెంచి
యలమౌనిసుతుఁ డున్నయట్టికుంజంబు
వలచుట్టియుండిరి వలచుట్టినట్లు
హరిదాసుఁ డనుపేరియతఁ డేగుదెంచి
దరుల మేదరుల సోదరుల నీక్షించి
బాలురానం బేమొ పరికింపుఁ డనుచు
నాలోని కేతెంచి యమితతేజమున

భానుబోటిస్ఫూర్తిఁ బ్రహసింపుచున్న
మౌనినందనుఁ గాంచి మది సంతసించి
పిల్లి గా దోరి జాబిల్లి గాఁ బోలుఁ
జల్లనివెన్నెల చల్లుచున్నాఁడు
అనుచు నబ్బాలు రె ప్పార్ప కెంతయును
గనుఁగొని వేడుకకడలి నోలాడి
యానందబాష్పంబు లాననాబ్జంబు
మై నిండి దిగువాఱమై గరుపారఁ
బెన్నిధిఁ గన్నట్టి పేదచందమున
నున్నతోన్నతుఁ డైన యోగినందనుని
దనయులు లేమి నాదరమున నెత్తి
కొని కూర్మితోడ నక్కునఁ జేర్చి వేడ్కఁ
గొనకొని యావేత్రకుంజంబు వెడలి
తనవార లెల్ల నెంతయుఁ జోద్యపడఁగ
మునిపుత్త్రుఁ గొని పురంబున కేగుదెంచి
తనయాలిచేతి కెంతయుఁ బ్రేమ నొసఁగ
నరవిందనాభుఁ గన్నట్టియశోద
కరణి నుప్పొంగి యాకాంతాలలామ
యనువొందఁగా బోరు కాడించికూర్మి
యినుమడింపంగఁ జ న్ని చ్చె నిచ్చటయు

నామహీసారనాయకుఁ డైనయట్టి
హేమాంబరుఁడు తనయెదుట నిల్చుటయు
హరిపదధ్యానామృతాహారలహరిఁ
బరితృప్తిఁ జెంది యాభార్గవాత్మజుఁడు
చనుగ్రోలఁ డయ్యె నాజాడనే పెక్కు
దినము లుండంగ నెంతే వెఱఁ గంది
మగనితోఁ బలికె నమ్మగువ దూఱుచును
నగుబాటు చేసి తిందఱలోనఁ దనకుఁ
గటకటా! వీని నెక్కడనుండి తెచ్చి
తిటువంటి పసిబిడ్డఁ డెందైనఁ గలఁడె
చనునోటఁ బెట్టండు చను గ్రోలకున్న
మినుకంత యుగ్గైన మ్రింగఁ డేడువఁడు
ఆఁకొన్నచంద మింతైనను లేదు
తేఁకువ చెడఁ డొండుదిక్కుఁ గన్గొనఁడు
ఆరయ వీఁడు దయ్యము గాని భూమి
వారిబిడ్డలవంటివాఁడె? చూడంగఁ
జిక్కండు నలుగండు చెలు వగ్గలించి
యొక్క-చందంబున నున్నాఁడు గాని
యనుచు నిద్దఱు నరు దంద నావార్త
జను లాలకించి యాశ్చర్యంబు నొంది

యాబాలగోపాల మట కేగుదెంచి
యాబాలుఁ జూచుచు నరుగుచుండంగ
నానగరినె వృద్ధుఁ డగునట్టిపుత్త్ర
హీనుఁ డొక్కరుఁడు పెక్కేండ్లనుండియును
సంతానకాముఁడై సతియును దాను
నంతరంగమున శో కార్తుఁడై యుండి
యావార్త విని వెఱఁ గంది డెందమున
భావించి యితఁడు తప్పదు దేవుఁ డనుచు
నత్తపోధనుఁ జూచునభిలాష నటకు
రిత్తచేతులఁ బోవ రీతి గా దనుచు
నొకసోలనెయి, పాలు నొకచేరెఁడన్ని
యకలంకమతి నిచ్చి యది కేలఁ బూని
యనురాగవల్లిక యంతరంగమున
నన లొత్త నటకుఁ గ్రన్నన నేగుదెంచి
హరి మున్ను నందగేహములోన నున్న
వరుస నావేణులావకునింటిలోనఁ
బసనిమాయావటపత్రతల్పమున
వసియించి నిదురించువాఁడునుం బోలె
బా గొప్పఁ దొట్టెలపైఁ బవ్వళించి
యోగనిద్రాసక్తి నుండు నమ్మౌనిఁ

గని చేత నున్నదుగ్ధము యోగిమ్రోల
నునిచి సన్నుతి చేసి యోగీంద్రవర్య!
నాకేశసన్నుత! నా చేయుభక్తిఁ
గైకొని నను నీవు కరుణింపవలయు
సీరిసోదరుఁడు కుచేలునియటుకు
లారగించినరీతి నవధారు దేవ!
భక్తవత్సల! కృపాపారీణ! నాదు
భక్తిఁ గైకొమ్మని పదముల వ్రాల
నతనిభక్తికి నాత్మ ననయంబు మెచ్చి
యతివేగమునను బద్మాసనుం డగుచుఁ
గరుణాపయోరాశి కాన నామౌని
వరుఁడు తత్‌క్షీర మాస్వాదించె నపుడు
జను లెల్లఁ జేయుపూజలు లెక్కగొనని
ఘనుఁడు నాసేవ నిక్కము మెచ్చె ననుచు
మనమున నుప్పొంగి మగుడి యీరీతి
దినదినంబును బాలు దెచ్చుచునుండి
యంతట నొక్కనాఁ డాదృఢవ్రతుఁడు
కాంతయుఁ దాను నక్కడి కేగుదెంచి
ప్రతివారముసు దెచ్చుపగిది దుగ్ధంబు
నతనికి నర్పింప నాయోగివరుఁడు

సగ మారగించి నిశ్చలదయాదృష్టి
సగము వారలకుఁ బ్రసాదింప నతఁడు
తనసతియును దాను తత్ప్రసాదంబు
ననురక్తిఁ, బ్రాసించె నంతలోపలనె
తరుణభావంబులు దాల్చి యిద్దఱును
బరమానురాగసంభరితు లై యోగి
యనుమతంబున నింటి కరిగి రంతటను
మునినాయకునివరమున నవ్వధూటి
గరు వొంది భవ్యలగ్నంబునం జక్ర
పరిచరాంశజు లోకపావనమూర్తిఁ
గణికృష్ణుఁ డనుపుత్త్రుఁ గాంచెనయ్యోగి
మణి యైన భార్గవమౌని శేఖరుఁడు
పరతత్త్వ మయ్యు గోపాలుచందమున
హరి నందగేహంబునం దుండుకరణిఁ
గారియెవ్వారికిఁ గానరాకుండ
నీఱు గప్పినయట్టి నిప్పుకమాడ్కి
కీర్తికెక్కిన నిజాకృతి డాఁచి ధరణి
వర్తించుచున్న సంవర్తుచందమున
ననుపమయోగీంద్రుఁ డయ్యు నమ్మౌని
తనరూపు డాఁచి మేదరివిధంబునను

సరవి మై నమ్మహీసారంబునందుఁ
గర మొప్ప శూర్చవిక్రయము సేయుచును
గమలేశపాదపంకజయుగధ్యాన
సమధికామృతముచే సంతుష్టుఁ డగుచుఁ
గడునల్ల నగుదివిఁ గనుపట్టుసూర్యు
వడువున వేణులావకునిగేహమునఁ
దేజరిల్లుచుఁ గొన్నిదినములమీఁద
నోజఁ బెంపెసఁగెడు యోగానురక్తి
భాసిల్లు నాయోగిభర్త గుహాధి
వాసుఁ డై నియమితవాసరుం డగుచు
యమనియమప్రముఖాష్టాంగపూర్తు
లమరంగ విహితపద్మాసనుం డగుచు
భాతిగా నస్తికపాలభాతియును
ధౌతినీతియు నౌళితాటనం బనఁగఁ
బొలుపొందు షట్కర్మముల నాచరించి
సలలితోడ్డీయాణజాలంధరములు
మొదలైన దశమహాముద్రలం జక్కఁ
గదియించి యిడయుఁ బింగళయు సుషుమ్న
యాపూరణము మొదలై యెన్నఁదగిన
లో పదునాల్గునాళుల వివేకించి

శీతలభ్రమరిభస్త్రికమూర్చ కేవ
లాతతరవిభేదనాదినామములు
గల యష్టవిధకుంభకముల నేర్పఱచి
కలకేవలపుకుంభకమునఁ గుంభించి
లీల మై నాసనలింగహృన్నాభి
తాలుమూలలలాటతలములయందు
నాధారమణిపూరకాదినామముల
సాధారణంబు లై సరవిఁ బేర్కొనఁగఁ
బదిల మై నా ల్గాఱు పది పది రెండు
పదియాఱు రెండు నై పరఁగుపత్రముల
నను వొందుచుండెడు నారుదామరల
ననిలునిచేత నొయ్యన మేలుకొలిపి
నాభిపంకజముక్రిందటను ముమ్మూల
శోభిల్లు బాహ్యాండశోభితం బైన
గంభీరనాళికాకందంబులోనఁ
గుంభించి వాయువుఁ గొని దానిచేత
నాధారకమలమధ్యత్రికోణాంత
రాధీనరేఫాక్షరాంతరవహ్ని
వెలుఁ గొండఁ జేసి పర్వినగాలితోడ
మిళితంబు చేసి యెన్మిదివదనములఁ

బలువుగా నాక్రింది పశ్చిమనాళి
తలక్రిందుగాఁ జుట్టి తలకనిభుజగి
వదనగహ్వరము చువ్వన దాఁటఁజేసి
చెదరనికడఁకఁ బశ్చిమనాళిఁ జొనిపి
వెనకఁ జొప్పడునేకవింశతిమణుల
బెనఁగొని సంతతాభేద్య మై తనరి
జలజాసనేశకంజదళాక్షనామ
ములు గల్గి వజ్రంబుమురువున నున్న
యామీఁది గంధిత్రయంబు భేదించి
యామీఁది యూర్ధ్వముఖాంబుజాతంబు
తలక్రిందు సేసి యందలిసుధారసము
నలరెడుహృదయతో యజములో నించి
మండితయోగసామ్రాజ్యసౌభాగ్య
మండనుం డగుచు నమ్మౌనివర్యుండు
పావనవనసప్తపర్వతగుహల
నీవిధి నేడునూఱేఁడునూఱేండ్లు
వేర్వేఱ వసియించి విమతంబు లైన
సర్వసిద్ధాంతముల్ చర్చించి చూచి
కాణాద గురుభట్ట కపి లాక్షపాద
పాణిని మిథ్యాప్రపంచశాస్త్రముల

లక్షించి చూచి యల్పము లని పూర్వ
పక్షము ల్చేసి యభంగవిస్ఫూర్తి
శుద్ధాంతరంగుఁ డై శుభకరవిష్ణు
సిద్ధాంతమూర్థాభిక్తుఁ డై పొలిచి
తలఁపుఁదామరలోని తామరకంటి
చెలువంబునకు నెంతె చిక్కిచొక్కుచును
దఱచుగా నందునఁ దగిలి బాహ్యంబు
మఱచి హరిధ్యానమగ్నుఁ డైయుండె
నాపావనునిభక్తికలరి యావిశ్వ
రూపి యప్పుడు విశ్వరూపంబుఁ జూప
నామూర్తిఁ గనుఁగొని యాత్మనుప్పొంగి
వేమాఱు నుతులు గావించె విష్ణుండు
నలయోగివరు డెంద మనుతమ్మిలోని
యెలడేఁటి యై యుండె నెంతయుం బ్రీతి
ముక్తరాగుం డదిమొదలుగా జగతి
భక్తిసారుం డనఁ బ్రఖ్యాతి నొంది
యట వీడుకొని యొక్కయటవీతలమున
ఘటితపద్మాసనకమనీయుఁ డగుచు
నత్తపోధనుఁడు శ్రీహరిపదాయత్త
చిత్తుఁ డై హృతలోకచిత్తుఁ డైయుండె

గుబ్బెతనునువాడిగుబ్బలం దెగడు
గుబ్బకొమ్ములుసోగ కుఱుచవీనులును
గగనగంగోత్తుంగకల్లోలలోల
మగుగంగడోలుఁ జె న్నగుజల్లితోఁక
నిడువెడఁ దగువెన్ను నెఱిగుజ్జుమెడయుఁ
గడుదొడ్డపిఱుఁదు చక్కనిముద్దునడలుఁ
గదలుమూఁపురము డాకాలినూపురముఁ
గుదు రైనగిన్నె బాగులగొరిజులును
బస మించుమువ్వలుం బసిఁడిగంటలును
బసిదిండిగంతయుఁ బాపపట్టెడయుఁ
దెలిమించుముకుఁద్రాడు తిన్ననిమోము
గలిగి తేజీకూనగతి నొప్పు మీఱి
యడరుగబ్బున ఘణి ల్లన ఱంకె లిడుచు
నడతెంచుకైలాసనగ మననొప్పు
వెలిగిబ్బ నెక్కి యవ్విధుఖండమౌళి
వలిగుబ్బలితనూజ వలిగుబ్బ లిఱియఁ
గౌఁగిటఁ దను బిగ్గకరముల నొక్క
వీఁగుచు సంతోషవివశుఁ డైపొంగి
యావేళ నిచ్ఛావిహారియై మింటఁ
బోవుచు నుండునప్పుడు శైలతనయ

ధర నున్న భార్గవతనుజాతుఁ జూచి
వరుఁ జూచి యత్తపోవనవీథియందు
ఘనతపోనిష్ఠ నొక్కఁడు శంక లేక
వినిమీలితాక్షుఁ డై వెలితలం పుడిగి
నరునిచందమున నున్నాఁడు తత్తేజ
మరుణకోటుల కెక్కు డై చెలంగెడిని
యితఁ డెవ్వఁడో మన మిమ్మహామహుని
గతియుఁ దన్మహిమయుఁ గనిపోవవలయు
నని నంది వాగెయు నందంద గుదిచి
వినుతించి పలుమాఱు వేఁడుకొనంగ
నాయెడఁ దనప్రియురాలివాక్యములు
త్రోయఁజాలక నిల్చి తుహినాంశుధరుఁడు
వృషభంబు డిగి మౌనివృషభునిం జేరి
విషకంఠుఁ డనియె సవినయవాక్యముల
నుడురాజమౌళి నే నోమౌనిచంద్ర!
యడుగు మిచ్చెద వరం బనఁ గన్నుఁ దెఱచి
యిగురొత్తువేడుక నెదుట నున్నట్టి
నగసుతాపతిఁ జూచి నగుచు నయ్యోగి
తనచెంత నున్నబొంతను మునుమున్నె
చొనిపియుండినయట్టి సూది చేఁబూని

దారంబు నంది యీదారంబు సూది
ద్వారంబునందు సంధానింప నిపుడు
వర మిమ్ము నీవు దేవర వైతివేని
హర! మాకు నిది మనోహరము నావుఁడును
భవుఁడు రోషావేశభరితుఁ డై యలిగి
యవు రౌర! నాతోడనా కేరడంబు
లెఱుఁగవే పురముల నెఱియించువార్త
మఱచితే తారకు మర్ధించుకడఁక
వినవె? నాకథలు భూవిదితంబు లిప్పు
డన నేల? తొంటివి యవి చెప్ప నేల?
యిదె తపోధనుఁడ వైతేని యీక్షణమ
కదలక నాదుముంగల నిల్వు మనుచుఁ
గ్రచ్చఱఁ జిచ్చఱకన్ను విచ్చుటయుఁ
జిచ్చఱకోలలేర్చినరీతి దెసల
మింట మంటలు జంట మెఱయఁ దారకలు
గెంట నద్రులు పెల్లగిలి కూలి వ్రాలఁ
జిటచిటధ్వనులతో శిఖకోటి వెడలి
పటుతరబ్రహ్మాండభాండంబు నిండ
ఖద్యోతకాంతు లొక్కట లెక్కగొనని
ఖద్యోతబింబంబుకరణి నమ్మౌని

హరనేత్రవహ్నికి నడ్డంబు గాఁగఁ
జరణాంబుజాతంబుఁ జాచెఁ జాఁచుటయు
నందుఁ జూపట్టె నత్యర్కాగ్నికోటి
చందంబు గలుగులోచనకోటియందుఁ
బొడముమంటలు భుగ భుగ నాకసంబుఁ
బుడమియు నిండి నిప్పులు గుప్పళింప
గడ గడ ధరణి గ్రక్కదల మి న్నగల
నుడుపంక్తి లాజలయోజమైఁ బెటల
వెఱపింపఁగాఁ బోయి వెఱచినకరణిఁ
గరకంఠుఁ డానేత్రఘనవహ్ని కులికి
తలఁచిన ధారాళధారాధరములు
బలువిడి గర్జనప్రభలతో నిగుడి
గుడిగొని జడివట్టి కురియంగఁ దొడఁగెఁ
దొడఁగిన మౌనినాథుఁడు లెక్కగొనక
దేవకీసుతుఁడు లోఁ దెలి వొందియున్న
గోవర్ధనంబు బాగుగ నున్నఁ జూచి
శర్వుండు మిగుల నాశ్చర్యంబు నంది
శర్వాణి కమ్మునీశ్వరుఁ జూపి పలికెఁ
గంటివే యెనలేక కనలెడుకంటి
మంట నాహుతిగొనుమంటఁ గల్పించె

నే నెంత యితఁ డెంత యెన్నిచూడంగ
శ్రీనాథుభక్తు లజెయ్యు లెవ్వరికి
సురవర్యుఁ డైన భూసురవర్యుఁ డైన
నరనాథుఁ డైనఁ గిన్నరనాథుఁ డైన
నారయ హరిదాసు లధికులు గాన
వారలతోడ గర్వము పని లేదు
అంబుజనేత్ర! యెట్లంటేనిఁ దొలుత
నంబరీషుఁడు గెల్వఁడా యత్రిసుతుని
హరిదాసు లఖిలలోకైకపావనులు
హరిదాసు లపగతాహంకారమతులు
హరిదాసు లగువార లధికుల కధికు
లరయ వారలకంటె నధికులు లేర '
యనుచుఁ గపర్ధి సంయమినాథుఁ జూచి
వినుతవాక్యంబుల వేమాఱుఁ బొగడి
యోమౌనికులనాథ! యోగీంద్రచంద్ర!
నీమహామహిమ వర్ణింప శక్యంబె
యింతవాఁ డని నిన్ను నెఱుఁగమిఁ జేసి
తింతకార్యంబు నే నిట్టినేరంబు
మఱచి మమ్మిరువుర మదిలోన నెపుడు
మఱవకు మనుచు నుమామనోహరుఁడు

నక్కాంతతోడ మి న్నంది యన్నంది
నెక్కి కైలాసాద్రి కేగె నాతనికి
నక్షులు పాదంబునం దున్నకతన
నక్షపాదాహ్వయం బమరె నంతటను
జెదరకుండఁగ భవజీర్ణవస్త్రములు
పొదివి మాయాసూత్రమునఁ గాలసూచి
నొడలిబొంతలు కుట్టుచున్నమాయావి
వడువున సమ్మౌనివసుధేశ్వరుండు
తఱచు కుట్టులువడఁ దనబొంతపొంత
కుఱువాఁడిసూదిచేఁ గూర్చుచున్నంత
గగనమార్గమునఁ గొంకణుఁ డనుసిద్ధుఁ
డగణితదివ్యమంత్రాదిసిద్ధుండు
చిఱుతకెంజడలమై సింగినాదంబు
నెఱసినమేనివన్నెలబూదిపూఁత
బెత్తంపుమొలత్రాట బిగిసిచూపట్టు
గుత్తంపుగోఁచి చిక్కులకుట్లబుఱ్ఱ
నిగనిగ మెఱయుమానికపుఁగామాక్షు
లొగి ఫాలమున నొప్పుచున్నరుద్రాక్ష
మొగసిరిమసిబొట్టు మొనసంకుబేర్లఁ
దగిలినపెనుజన్నిదపు [5]రుండమాల

కప్పెరనట్టెంబుఁ గక్షపాలయును
నొప్పుగా బిగిసినయోగపట్టెయును
గలిగి డాకాలిమైఁ గాలు సంధించి
నలువొందు నురము నెన్నడుము నిక్కించి
కేలిమైఁ గేలు వొక్కించి మోకాలి
కేలిక్రిందట నిఱికినబాగు చూపఁ
బొలుపొందులాతంబు ఫులికళాసంబుఁ
గలిగి సిద్ధుఁడు శరద్ఘనఘనం బనఁగఁ
గనుపట్టె గగనమార్గమున శార్దూల
మనిలవేగంబున నట వచ్చి వచ్చి
ధర నున్నభార్గవాత్మజుదివ్యతేజ
మురుతరబ్రహ్మాండ మొరసి క్రిక్కిఱిసి
యిలకును మింటికి నేకంబు గాఁగఁ
దలుపు వైచినరీతి దట్ట మై పొదల
నావరతేజంబు నలవుమై దాఁటి
పోవంగలేక బెబ్బులివావురంబు
గ్రక్కున నిలిచి వేగము దక్కి వెనుకఁ
ద్రొక్కుచునున్న సిద్ధుఁడు కోపగించి
వాగియబిగు వింత వదలి దాఁటించి
రాగేలు బిగియించి రవళి ధే యనుచుఁ

దర మిడి కేలి బెత్తపుఁదర టెత్తి
చురుకుట్ట వైచిన స్రుక్కుచు నదియు
నడుగు ముందఱ కిడ కందంద బెగడి
మడిదోఁక పెట్టుచు మాటిమాటికిని
వెనువెన్క కే వచ్చి వెస ముందు సాగి
చనకున్నఁ జూచి వేసరి కొంకణుండు
గాలి డెందముఁ గల్చుగతుల శార్దూల
మేలకో చని చని యిటఁ బోక నిలిచెఁ
జిట్టకంబున నొండుసిధ్ధుండు తెరువుఁ
గట్టెనో కాక వాకట్టెనో లేక
యున్నతోన్నతుఁ డైన యోగీంద్రవర్యుఁ
డున్నాఁడొ యీచక్కి యుర్విభాగమున
నని దెసల్ పరికించి యాచెంత యోగి
జననాథుఁ డగుభక్తిసారు నీక్షించి
పసిదిండి డిగ్గి తాపసవర్యుపాద
కిసలయయుగళి సాగిలి వ్రాలి నిల్చి
యోగీంద్ర! మౌనిజాతోత్పలచంద్ర!
భాగవతోత్తంస! భక్తాబ్జహంస!
విజితారిషడ్వర్గ! విహితసన్మార్గ!
నిజకృపాభరితాంగ! నిగమాంతరంగ!

యపరాధ మపరాధ మని సన్నుతించి
కృపణుఁ డై మౌనీంద్రుఁ గృపవుట్టఁ బలికి
యింతవానికి నీకు నిట సూదిఁ బూని
గంత బొంతయుఁ గూర్పఁ గారణం బేమి?
యణిమాదిసిద్ధుల కధిపతి వీవు
ప్రణుతింప మునిసార్వభౌముండ వీవు
నీయట్టివానికి నీచకృత్యంబు
సేయుట దగునె? యోసిద్ధమౌనీంద్ర!
యనుచుఁ దాఁ దొడిగినయట్టిమానికపుఁ
గొనబుకుచ్చులవింతకుచ్చలిగంత
పటుకక్షపుటిలోని పారదదివ్య
ఘుటికయు నయ్యోగికులచక్రవర్తి
ముందఱ నిడి కేలు మొగిచిన మోవి
చెందలిరాకుమైఁ జిఱునవ్వు నెఱయఁ
గొంకణుదెసఁ దేరకొని మాధవాంఘ్రి
పంకజయుగలగ్నభావుఁ డిట్లనియె
నిది యేమిఫల మిచ్చు నెట్లు గైకొంటి
వివరింపుమా మాకు వీనిచందంబు
లనిన సిద్ధుఁడు భార్గవాత్మజుఁ జూచి
వినతుఁ డై వేర్వేఱ వివరింపఁదొడఁగెఁ

దనువున నీకంథ ధరియించినట్టి
మనుజుఁ డందఁడు జరామరణదుఃఖములు
పొసఁగెడురసములఁ బోసి శోధించి
రసపంచకమును బరము లెన్మిదియును
భాసిల్లి ధృతిబీజపక్వరత్నముల
గ్రాసంబు లొసఁగి సాంగంబుఁ గావించి
పదియునెన్మిదియు నై పరఁగుసంస్కృతులఁ
బదిలంబు గాఁగ నీపగిది నొనర్పఁ
బటుతపోమహిమలఁ బడసినయట్టి
ఘుటికోత్తమము దీనిగుణము నీతోడ
నేటికి నిఁక దాఁప నిది సోఁకినంతఁ
గోటిలోహము మంచికుందనం బగును
అన విని యలఁతిన వ్వాననాబ్జమున
నన లెత్త నమ్మౌనినాయకోత్తముఁడు
తనమేన రవికోటిఁ దలఁకించుకాంతిఁ
గనుపట్టు మణికంచుకంబుఁ జూపుచును
ఆజగత్త్రయసేవ్య మగు నిజపాద
రాజీవరేణుపరాగంబుఁ దిగిచి
పలుమాఱుఁ బాషాణబాధలఁ జెంది
కలకాల మెల్లను గానలఁ దిరిగి

తడయక దేశ మంతయుఁ ద్రవ్వికొనుచుఁ
బొడివోసికొని పొట్టుపొర లౌచు వేఁగి
పుడమి నెందులకైనఁ బుటములు వెట్టి
కడపట నీ విట్లు ఘటియించుఘుటిక
యినుము బంగరు సేయు టేమియాశ్చర్య
మనుచుఁ బాదానీత మగుదానిఁ జూపి
పాటింప నిది లోహపాషాణకోటి
కోటులు గావించు కుందనంబుగను
ఇల నెవ్వఁ డిది ధరియించు నాతనికిఁ
దలఁచినపని యెల్లఁ దనుతానె యగును
ఇందును నందును నెదురు లే దరుణు
నిందును నగుకాంతి నెనసి యాఘనుఁడ
యగణితాయుష్మంతుఁ డై యక్షుకలిమి
నగుచుండ మృత్యువునకు బొమ్మ వెట్టుఁ
జరచర బెట్టు నిర్జరభావ మొందుఁ
దరుణీకదంబకందర్పుఁ డైయుండుఁ
జెనఁటి యీభవవార్దిచే యీఁత నీఁదు
వనజాసనేంద్రాదివంద్యుఁ డైయుండు
నతనివశం బగు నఖిలలోకంబు
లతఁడు లోకోత్కృష్టుఁ డగుసిద్ధవర్యుఁ

డరయ నీరెండు లక్ష్యమె లోకులకును
సిరివరు దాసు లిచ్చినఁగాని లేవు
పనివడి నీతోడఁ బలుమాఱు వేయు
నననేల? నేనిచ్చినట్టి యీఘుటిక
ప్రతి చూడు మని యోగిపతి ప్రసాదింప
నతిభక్తిఁ గొంకణుం డవనతుం డగుచు
నరుదంది నిజవాహనారూఢుఁ డగుచు
సరభసగతిఁ జని చని యొక్కచోట
మునుభార్గవాత్మజముని యిచ్చినట్టి
తనకేలిఘుటికచందముఁ జూతు ననుచు
దూరంబు చనక శార్దూలంబు డిగ్గి
తోర మై మిన్నులతొడ రాయుచును
జిత్రకూటంబులఁ జె న్నగ్గలించు
చిత్రకూటం బనుశిఖరిశేఖరము
చెంతకుఁ జని ముని శ్రీపాదపంక
మంతయుఁ బూని యయ్యద్రిపై వైవ
నలదేవతలు మింట నాశ్చర్వ మంది
కలిగెఁబో రెండవకనకాద్రి యనుచు
నది భానుమండలం బగలించుకాంతిఁ
బదియాఱువన్నియపసిఁడి యై యొప్పె

నప్పుడు కొంకణుఁ డంతరంగమున
ముప్పిరిగొనుమోదమున వెఱఁ గంది
యనుపమం బైన యీహైమాద్రి యిచట
నునిచిపోతినయేని యుర్విమీఁదటను
గ్రయవిక్రయములు భంగంబు లై పోవు
నయ మేది యంతరాంతరములు దక్కుఁ
గ్రతుదానభోగముఖ్యములందు మిగుల
నతిశయం బగుచున్నయట్టి కాంచనమె
యితరలోహములతో నెనయైనఁ గార్య
గతి దప్పు నిది బుద్ది గాదురా యనుచుఁ
దనయోగశక్తిచే ధరణీతలంబు
ఘనతరవివరంబుగాఁ జేసి యందు
సురగిరితో నీడుజో డాడుహేమ
గిరిశేఖరంబు నిక్షేపంబు సేసి
నెఱయ రొప్పులపొడనీలని నెక్కి
మఱియు వచ్చినత్రోవ మగుడి యేతెంచి
యపరిమితానుకంపామృతానారు
నపగతసంసారు నాభక్తిసారుఁ
గని భక్తిఁ బాదపంకజముల వ్రాలి
వినుతించి హస్తారవిందముల్ మొగిచి

యే మనువాఁడ బ్రహ్మేంద్రాదు లైన
నీమహామహిమ వర్ణింప నోపుదురె?
శ్రీరామపదపద్మరేణువు సోఁకి
ధారుణిమై శిల తరుణి యై నిల్చె
నన వింటి మున్ను ప్రత్యక్షంబు నేఁడు
కనుఁగొంటి నీపాదకమలరజంబు
సోఁకినఁ బరుసంబు సోఁకినయినుము
వీఁక శైలము హేమవిజితాద్రి యయ్యె
హరికన్న హరిభక్తు లధికులే యనుట
యరయంగ నిపుడు తథ్యం బయ్యె నయ్య
వినఁ జెప్పఁ జోద్య మై వివరింప నెట్టి
ఘనులందు లేని నీఘనదివ్యమహిమ
మీఱి యెన్నఁగ వశమే? మూడుమాట
లాఱుతప్పులు మిమ్ము నభినుతింపంగ
నియ్యెడ గణుతింప నే నెంతవాఁడ
వేయినోళ్ళును రెండువేలజిహ్వలును
గలుగువానికిని శక్యమె? పదివేలు
గలవు నానేరముల్ క్షమియింపు మనుచు
వినతుఁ డై పులి నెక్కి వినువీథిచక్కిఁ
జనియె భార్గవమునీశ్వరుఁ డంత నొక్క

గిరిగుహాంతరసీమఁ గృతనిష్ఠుఁ డగుచు
నిరుపమనిజయోగనిరతుఁ డై యుండె
నాసమయమున విహారేచ్ఛతోడ
నాసరోభూతమహాయోగివరులు
చనుచుండి యాభక్తసారుతేజమునఁ
గొనకొన్న యాశైలగుహకు నల్లంత
దవ్వులఁ జనుచుండి తమయోగదృష్టి
మువ్వురు భార్గవమునితేజ మరసి
యున్నతోన్నతుఁ డైనయోగీంద్రుఁ డొక్క
డున్నాఁడు వాఁడె లేకున్న నిబ్భంగి
శాతశితాంశుతేజముల గేలించు
నీతేజ మొరులకు నేల సిద్ధించు
నని సంతసం బంది యందులో నిరువు
రనురాగమున భార్గవావాసమునకు
జలజాతబాంధవచంద్రులకరణి
వలచుట్టుకొనుచు నవ్వల దాఁటి చనిరి
భాసురం బైన తత్ప్రభఁ జూచి యంత
నాసరోయోగీంద్రుఁ డచ్చెరువంది
చారుయోగాధ్వసంచారుఁ డౌ భక్తి
సారుఁ డున్నట్టియచ్చటి కేగుదెంచి

యతనిడగ్గఱ కేగి యభినుతి సేయ
హితమతి నాతండు నెదు రేగుదెంచి
యనయంబు మెచ్చుచు నాత్మబంధువులఁ
గనుఁగొన్నగతి వేడ్కకడలి నోలాడి
యాననేందుప్రభ లడరుచందమున
నానందబాష్పంబు లందంద దొఱఁగ
నొండొరు నుతులు సేయుచు ధర సాగి
దండంబు లిడుచు నెంతయుఁ బ్రియం బెసఁగ
నాలింగనక్రియ లాచరింపుచును
గేలు కేలున బిగ్గఁ గీలించుకొనుచుఁ
జెలఁగి యిద్దఱు సుఖాసీను లై ప్రేమ
గులుకంగఁ దమతమకుశలంబు లరసి
యత్తపోధను లంత హరిపదాయత్త
చిత్తు లై విగళితచిత్తు లై కూడి
హత్తి పాయనియట్టి యానందలహరి
మత్తు లై నిరతాప్రమత్తు లై యచట
గరిమమై క్షీరోదకన్యాయ మెసఁగ
నిరువురు నుండి రనేకకాలంబు
తదనంతరమున నత్తపసు లచ్చోటు
గదలి పర్వతనదీగహనముల్ గడచి

యలపూర్వజలరాశియపరభాగమునఁ
బొలుచు మయూరాఖ్యపురముచెంగటను
గైరవకంజాతకలిత మైనట్టి
కైరవతీర్థంబుకడఁ గల్పకంబు
పాలు పొందుకేసరభూజంబుక్రింద
నిలిచి యోగసమాధినిరతిఁ బెంపొంది
యిరువు రచ్చోట ననేకకాలంబు
పరతత్త్వభజనానుభవమునఁ దేలి
యుండి రంతట సరోయోగినాయకుఁడు
దండ భార్గవమౌనిధరణీశుఁ జూచి
యింతకాలము మన మెనసి యొక్కింత
యంతరంగంబున నరమర లేక
జోడుకోడియల మై జోఁకతోఁ దోడు
నీడల మగుచు నన్నిటఁ గూడిమాడి
దాయక పాయక తలఁపు లేకముగఁ
దోయజాక్షునిపాదతోయజాసక్తి
నన్నదమ్ములు వోలె ననగి పెనంగి
యిన్నాళ్ళు నుండితి మెర వింత లేక
గణన మించిన యింతకాలంబు నొక్క
క్షణ మయ్యె నాకు నీసంగతి నింక

ధరమీఁద నర్చావతారరూపమున
హరి యున్ననిలయంబు లచటితీర్థములు
సేవించి మఱియు మీశ్రీదివ్యమూర్తి
సేవింప మఱలివచ్చెద నంచుఁ బలికి
ప్రణమిల్లి ప్రణమిల్లి భక్తిసారుండు
ప్రణుతించి యానందబాష్పముల్ నించి
యక్కుననిఱియంగ నలమి యమ్మౌని
నక్కడనుండి పాయనికూర్మితోడ
మరలిచూచుచు మందమందయానమున
నరిగె నంతటిమీఁద నక్షపాదుండు
ననుపమయోగవిద్యాసక్తిఁ గొన్ని
దినము లచ్చోట వర్తిల నొక్కనాఁడు
తఱచుగా నామముల్ ధరియించుకతన
మఱి ధరింపఁగఁ దిరుమణి లేకయున్న
నిపు డూర్ధ్వపుండ్రవిహీనత నుండి
జపతపోముఖ్యముల్ సలుపఁ గాదండ్రు
తలపోయ నిది కృష్ణధారుణి యిచటఁ
దెలివొందు ధవళమృత్తిక యిఁక నెట్లు
గలిగెడు ననుచు హృత్కమలంబులోనఁ
దలఁపుచు యోగనిద్రాసక్తుఁ డైన

బంగారుగజ్జెలుఁ బసిఁడియందియలుఁ
జెంగావిచాయ మించినపైఁడివలువ
మొగపులమొలనూలు ముత్యాలకుచ్చు
బిగిసి చూపట్టుముప్పిడికటారంబుఁ
గటి సంఘటించిన కరపల్లవంబుఁ
బటువరంబుల నిచ్చుపాణిపద్మంబు
వలమురినెఱవాఁడి వలయపుఁగ త్తి
బలసి చూపట్టెడు పాణియుగ్మమును
బొడ్డుమానికము కెంపులబిటారించు
నొడ్డాణమును మించు నుదరబంధంబు
భుజకీర్తులును బాహుపురులు తాయతులు
భుజగభూషలతట్టు పుణుఁగుమైపూఁత
యక్కుననెలకొన్న యలమేలుమంగ
యక్కజం బగువైజయంతిసరంబుఁ
దారహారములుఁ బుత్తడిజన్నిదములు
జారుమౌక్తికకంఠసరము బేరురముఁ
గంబుకంధరమును గౌస్తుభమణియు
బింబాధరంబు నొప్పెడికపోలములు
మందస్మితంబును మకరకుండలము
లిందుబింబము హసియించునెమ్మోముఁ

దెలిదమ్మికన్నులుఁ దిలనాసికంబుఁ
దెలిమించునాణిముత్తియపునామంబుఁ
గనకపిప్పలదళకలితపట్టంబు
ననుపమమణిమయం బగుకిరీటంబుఁ
గలుగు శ్రీవేంకటగ్రావాధినాథుఁ
డలమునిస్వప్నంబునందు వేంచేసి
పొడకట్టి తనకరంబుల మేను నిమిరి
వడదేర్చి లాలించి వరదుఁ డై పలికె
వలవంత వలవ దోవత్స! నీచింత
జలజాకరాంతరస్థలి సుధాకాంతి
నాయాజ్ఞచేఁ దిరునామ మింపొందు
నాయింద్రముఖులకు నది యలభ్యంబు
అరయంగ నది యణువంత ధరించు
నరుఁ డొందు సురల కందఁగరానిపదము
నది నీవు గైకొను మనునంతలోనె
ముద మంది భార్గవముని మేలుకాంచి
యంతరంగంబున నాదేవదేవు
నెంతయుఁ దలపోసి యింపు రెట్టింపఁ
గరిరాజపాలన! కమలాక్ష! భక్త
వరద! రమానాథ! వాత్సల్యజలధి!

ననుఁ గన్నతండ్రి! క్రొన్ననవిల్తుతండ్రి !
యని సన్నుతించుచు [6]నాశ్చర్య మంది
పదిలుఁ డై కొలనులోపల డిగ్గి తనదు
మదికి జో డగు జలమధ్యభాగమున
దండి మై పూర్ణిమాతారాధినాథ
మండితం బగుతిరుమణి సంగ్రహించి
మౌనీంద్రమణి తిరుమణి రమణీయ
మైనది యని యాత్మ నచ్చెరు వంది
తటమున కేతెంచి తత్తరుచ్ఛాయ
ఘటితకంజాసనకమనీయుఁ డగుచు
నది క్రమంబునఁ గేశవాదినామములఁ
బదిరెండు నుడువుచు భక్తిపూర్వముగ
నుచితస్థలంబుల నూర్ధ్వపుండ్రములు
రచియించి తదనంతరమున నయ్యోగి
యలచోటు వాసి సోయగముల మించు
నలకాంచితం బైన యలకాంచిఁ గాంచి
యచటి కేతెంచి తదంతరసీమ
నచట భోగీంద్రపర్యంకంబునందుఁ
జెలఁగి సరస్వతీసింధుబంధనము
సలిపెడు సేతువుసరణిఁ జెన్నొంది

యవిరళశుభమూర్తియై లచ్చిఁ గూడి
పవళించి యున్నట్టి పద్మాకళత్రు
సేవించి ప్రణతులు సేసి సన్నుతులు
గావించి యంతరంగమున భావించి
యచ్చట తైలధారాచ్ఛిన్న మగుచు
నచ్చినభక్తి నన్నగరంబునందు
భోగితల్చుని మనమునఁ బాదుకొల్పి
యోగవిద్యాసక్తి నుండె నుండుటయు
జనలోకనుతభక్తిసారుని చరిత
మనిశంబు విని విని యాశ్చర్య మంది
యాదటఁ గణికృష్ణుఁ డఖిలవేదాంత
వేది యై హరిపాదవిహితాత్ముఁ డగుచు
భక్తిసారమునీంద్రు పదపంకజాను
రక్తుఁ డై యితరవిరక్తుఁ డై యిపుడు
తనపాలిగురువును దైవంబు గాఁగఁ
దనయాత్మఁ గోరి యాతని జూడఁ గోరి
జగతిఁ దన్మౌనిసంచారపూతంబు
లగునట్టి దేవాలయముల శైలముల
నదులఁ దీర్థముల నానాదిగంతముల
వెదకుచు వచ్చి దైవికమున నచట

భోగీంద్రవరతల్పభోగి యాగాను
యాగి యై యున్న యయ్యోగి నీక్షించి
తనతల్లిఁ గన్ననందనునిచందమున
ననయంబు హర్షించి యడుగుల కెరఁగి
పరఁగెడి యానందబాష్పపూరములఁ
జరణాంబుజముల మజ్జనము గావించి
పోఁడిమి నీమూర్తి పొడఁగనం గలిగె
నేఁడు వో నేత్రముల్ నేత్రంబు లయ్యెఁ
బరమపావన నిన్ను భజియించుకతన
ధరఁ గృతార్థుఁడ నైతి ధన్యుండనైతి
నిదె యేను మ్రొక్కఁ బోయినయట్టిదేవుఁ
డెదురుగా వచ్చిన ట్లేగుదెంచితివి
ఏయుపాయమున బ్రహ్మేంద్రాదిసురలు
సేయనిభాగ్యంబుఁ జేసితి నేను
దలఁప భవత్ప్రసాదంబుచే మునుప
యలదృఢవ్రతునకు నాత్మజుఁ డైతిఁ
గణికృష్ణుఁ డనుపేరు గలిగినవాఁడ
గణుతింప నీదుకింకరుఁడఁ జుమ్మనుచుఁ
బ్రణుతింప నెలమితో భక్తిసారుండు
కణికృష్ణు నంతరంగంబునఁ జేర్చి

యితనిచే లోకంబు లీడేరు ననుచు
మతి విచారించి యమ్మౌని శేఖరుఁడు
సరస నొప్పెడి హేమసారకీర్ణ
సరసి యందులఁ గృతస్నానుఁ గావించి
పొంకంబుగాఁ దనపూర్వాంకపీఠిఁ
బంకజాతాసనభాసితుం జేసి
పరమగురుం డైనపద్మేశుహృదయ
సరసిజాంతరసీమఁ జక్కఁగా నిలిపి
కరము వేడుక మస్తకముమీఁద తనదు
కర మూఁది దక్షిణకర్ణంబులోన
స్వరవర్ణ చరణార్థ జూతాదివిధుల
సరణు లేర్పడఁగ నిశ్చలదయాదృష్టి
సరవిమై కృతపురశ్చరణంబు మంత్ర
వరము యోగమును సర్వముఁ దేటపడఁగ
నుపదేశ మొసఁగి సర్వోన్నతు గాఁగఁ
గృపచేసె నక్కణికృష్ణు వర్ధిష్ణుఁ
దను నంటుకొనువారు తనయంతవారి
లనుమాట జగతిఁ దథ్యము చేసె నతఁడు
కృతకృత్యుఁ డగు కణికృష్ణుఁ డామౌని
పతిపదాబ్జములకు భక్తిమై వ్రాలి

భజియింప నర్మిలి భక్తిసారుండు
నిజశిష్యుతోడ నన్నికటంబునందు
నకలంకయోగవిద్యాభ్యాసుఁ డగుచు
నొకగుహాంతరసీమ నుండె నయ్యోగి
విదితచారిత్రము ల్విని విని యొక్క
ముదుసలి తద్గుహాముఖముఁ బ్రత్యహము
నలికి మ్రుగ్గులు వెట్టి యక్షత గంధ
ఫల పుష్ప ధూప దీపముల నర్చించి
వినుతించి మ్రొక్కి యవ్విధమునఁ బూజ
లొనరింపుచుండ నయ్యోగి[7]పంకేజ
దినమణి యొకకొన్నిదినములు చనఁగఁ
గను విచ్చి చూచి యోగసమాధిఁ దెలిసి
ముంగిలి నున్న యమ్ముదితతోఁ బలికె
నంగనా! నీచేయునట్టి యీభక్తి
కిచ్చమెచ్చితి వర మేమి కామించె
దిచ్చెద నీవచ్చు నీరాదు నాక
వినుపింతు నొకమాట విను మింకఁ దుదిని
వనజభవాండ మవ్వలను లోపలను
నిది యడుగఁగవచ్చు నిది రాదటంచుఁ
గొదుకక వర మేరికొను మిత్తు ననిన

ననురాగమునఁ బొంది యప్పు డాజరఠ
మునినాథునకుఁ గరములు మోడ్చి పలికె
బలుముల పగ దాయపగటుల పచ్చ
చెలువంబునకు గొంగ జిగిచిచ్చుఁగొఱవి
[8]నీటులమిత్తి వన్నెలవేఱువిత్తు
పాటించిచూడ రూపము పాలి మాలి
తలఁపులరోఁత రోఁతలవీడుబట్టు
పొలుపొందు నిజభోగములవీడుకోలు
నగుబాటుగని జవ్వనపుముక్కుగొయ్య
యగునట్టి ముదిమి వాయఁగఁ జేసి నన్ను
లలితరూపవయోవిలాసము ల్గలిగి
విలసిల్లఁగాఁ జేయవే మౌనిచంద్ర!
యనుఁడుఁ బ్రసన్నాత్ముఁ డై భక్తిసారుఁ
డనుపమకరుణాకటాక్షవీక్షణము
నెలఁతమై నిగుడించె నిగడించుటయను
నలరామపదరేణు నంటినయంత
శిల చట్టురూపేది చెలువ యైనట్టు
చెలువమెల్లను బ్రోది చేసినకరణి
వనజనేత్రునిపాదవనజంబు సోఁకి
తనరుచుఁ గుబ్జ సుందరి యైనకరణి

వెలఁది చల్లని నిండువెన్నెలనీటఁ
బులుకడిగినకల్వపూదూపు వోలెఁ
బరమయోగీశ్వ రాపాంగసంగమున
జరతోడఁ బాసి నిర్జరభామ యగుచు
నూరునిర్జితరంభయును నాసికాప్త
తారుణ్యజితతిలోత్తమయును జరణ
మంజీరరవజితమంజు ఘోషయును
రంజితతనులతారమణతావిజిత
చిత్రరేఖయు నౌచుఁ జెన్నగ్గలించి
చిత్రంబు గాఁగ నచ్చిగురాకుఁబోఁడి
బెడఁగు లై బెళకక బెళకుకన్నులును
గుడిగొని కలుకక కలుకుగుబ్బలును
నలువొంది నవ్వక నవ్వునెమ్మోము
మెలపున మెదలక మెదలువేనలియు
సన్న మై జడియక జడియునెన్నడుము
మిన్న యై మెఱవక మెఱయుమైదీఁగె
తోరమై తొలకక తొలకుపిఱుందు
చారుచేలంబు మించక మించుతొడలు
తెగడి కెందమ్ములఁ దిట్టక తిట్టు
చిగురులచాయ మించినపదంబులును

జిగితేనె చిందక చిందుపల్కులును
సొగసులై సొలయక సొలయుభావములుఁ
గలిగి యొప్పారు జగన్మోహనాంగి
చెలఁగి యమ్మౌనీంద్రుశ్రీపాదములకు
నతు లొనర్పుచు హస్తనళినముల్ మోడ్చి
నుతియింపఁ దొడఁగె సన్మునిలోకనాథు
నలసురాసురులకు నందంగరాని
చెలువంబు నీకృపచే నాకుఁ గల్గె
మౌనీంద్ర! మీమహామహిమాతిశయము
నేను వర్ణింపంగ నెంతటిదాన
నన విని హర్షించి యాకోమలాంగిఁ
గనుఁగొని పల్కె నుత్కంఠ దీపింపఁ
దరళాక్షి మత్ప్రసాదంబున నింక
నిరుపమసంపదల్ నినుఁ జెండఁగలవు
పరికింపఁగాఁ బట్టబద్ధకామినులు
పరిచారములు సేయుభాగ్య మందెదవు
నీమానసంబున నీలాహివేణి
మామకధ్యానంబు మఱవకు మనుచు
ననిచినఁ దదనుజ్ఞ నయ్యిందువదన
తనయింటి కరుగు నత్తఱి దైవికమున

నాపట్టణం బేలు నవనీవిభుండు
భూపాలనికర మింపుగఁ జేరి కొలువ
నెఱమించు గురిగింజనీలని నెక్కి
మెఱయుచు నావేళ మృగయానురక్తి
నరుగుచుఁ దనవచ్చినట్టిమార్గమున
నరుదెంచుచున్న యయ్యతివ నీక్షించి
మరుబారిఁ జిక్కి వేమఱు సొక్కిచొక్కి
యరు దంది మఱియు ఱె ప్పార్పక చూచి
తళదళుక్కున ధరాతలమున మెఱసి
నిలిచినమెఱుఁగొ మానికములగనియొ
బంగారుప్రతిమయో భావజుకేలి
చెంగల్వచిలుకొ పూచినకల్పలతయొ
కన్నెకయ్యమునకుఁ గాలు ద్రవ్వుచును
జెన్నొందు మరునిరా [9]చిలుకవావురమొ
యని తేజి డిగ్గి తోయజనేత్రఁ జేరఁ
జని గారవించి యచ్చన లాడువేడ్క
నాసతిఁ జతురంతయానాధిరోహఁ
జేసి తోకొనుచుఁ దేజీ నెక్కి మగుడి
యక్కన్యరూపంబునందునం దగిలి
చిక్కి తత్కులగోత్రశీలనామముల

నరయంగ మఱచి నిజావాసమునకు
నరుదెంచి శుభవేళ నాకోమలాంగి
సిరి మించ దివిజు లచ్చెరు వంది చెలఁగ
వరవైభవముల నుద్వాహ మై యంతఁ
బొలుపుమైఁ గమ్మవల్పులు సోడుముట్ట
నలరుటిండ్లను మణిహర్మ్యవాటికల
భువనజాకరముల భువనేశ్వరముల
నవిరళచంద్రశాలాంతరస్థలుల
నాలేదుతోఁ గూడి యంగజకేళిఁ
దేలి తేలించి యెంతే సొంపు మెఱసి
తద్దయు నింతిపైఁ దగిలినప్రేమఁ
బ్రొద్దుగ్రుంకులు పొడుపులు రాత్రి పగలుఁ
దెలియ కీసరణి మత్తిలి రతికేళి
సలుపుచుఁ బెక్కేండ్లు చనినపిమ్మటను
గొమరుబ్రాయం బను కొమ రైనచెఱకు
నమలినపిప్పి నా నరసె వెంట్రుకలు
[10]పొడిబొడి నెరులతో బొమదోయిబిగువు
సడలినవిం డ్లనా జాఱె నొక్కింత
[11]మున్ను పి న్నెఱుఁగక ముదితతోఁ గూడి
కన్ను గాననిరీతిఁ గప్పెను బొరలు

ఫలియించి రస మింకుపంటచందమున
సొల పైననెమ్మేను స్రుక్కిళ్ళువారెఁ
దుదిని గామాంధునితోఁపొందురోసి
వదలినగతి నింత వదలె ద్విజాళి
ముత్తరంబున వచ్చుముదిమిక్రొమ్మోసు
లొత్తినగతి మీస లొక్కింత నరసె
ముదుకఁ డై యిట్లు కాముకబుద్దితోడ
నదవదఁ జెందు యయాతిచందమున
జనపతి యొకనాఁడు సతి విలోకించి
ననియె నేకాంతహర్మ్యంబులో నుండి
కటకటా! భూమి నెక్కడ లేనివింత
యిటఁ గల్గెఁ గంటివే యేణాయతాక్షి!
ముదిత నాథునికంటె మునుమున్నె ముదియు
ముదితకంటెను బతి ముదియునే మున్ను
అరయ మజ్జనభోజనాదులు వయసు
లిరువురకును సమం బెన్నిచూచినను
దన కేల వచ్చె వార్దకము నీ వేల
యినుమడించినచేవ నెనసి నానాఁటఁ
జెందినజిగితోడఁ జెట్టునడిగిన
పిందియకరణిఁ గాన్పించెద విపుడు

నెరు లింత నెరయవు నెమ్మోముచాయ
తఱుఁగదు చనుదోయి తరల దింతైన
వారిజనేత్ర! నీవయ సెక్కివచ్చు
కారణం బేమి నిక్కము చెప్పు మనిన
నొఱపుగాఁ బరపుపై నొకకరం బూది
చిఱునవ్వు మోవిపైఁ జిందులాడంగఁ
బయ్యెద యరజాఱఁ బాలిండ్లమీఁద
నొయ్యన హారంబు లుయ్యెల లూఁగ
నునుసిగ్గునిగ్గుకన్నుల నామతింపఁ
గొనగోళ్ళ వెడజాఱుకురులు దిద్దుచును
వినయ మేర్చడఁగ నవ్విభుదిక్కుఁ జూచి
యనియె నచ్చెలువ నెయ్యంబు రెట్టింప
భక్తిసారుం డనఁ బరఁగెడు భక్తి
ముక్తిదాయకుఁ డైన మునివరేణ్యుండు
నగరాంతికమునఁ బన్నగభోగిశాయి
నగరిచెంగట గుహాంతరసీమ నుండు
నతనికిఁ గణికృష్ణుఁ డనుశిష్యుఁ డతఁడు
నతనియంతటివాఁడె యాకృష్ణయోగి
కవిసార్వభౌమవిఖ్యాతిఁ జెన్నొందు
భువనత్రయంబునం బురుడు లే దనఁగ

బాగొప్పు నచ్చోట భక్తిసారుండు
యోగవిద్యాసక్తి నుండునవ్వేళ
మునుకొని తద్గుహాముఖముఁ బూజించి
కొనియుండ నాయోగికులవరేణ్యుండు
కారుణ్య మెసఁగ నాకడఁ జూచి దివ్య
తారుణ్య మీగతి దయచేసె నాకు
నది యోగివరదత్త మైనది కానఁ
జెదర దెన్నటికి నోక్షితిపాల! నీవు
వలసిన నయ్యోగివల్లభుపాద
జలజముల్ చేరి నిర్జరభావ మొందు
మనుఁడు రాజసము నహంకార మెసఁగ
మనుజనాథుఁడు సభామంటపస్థలికి
నరుదెంచి సింహాసనారూఢుఁ డగుచు
బరిచారకులదెసఁ బరికించి పలికె
ఫణిశాయిమందిరప్రాంతంబునందుఁ
గణికృష్ణుఁ డనుపేరి కవి యున్నవాఁడు
మతిలోన మీ రనుమానింప కరిగి
యతని నేఁ బిల్చెద నని తోడితెండు
అని పిల్చి పంచిన నాపరిజనులు
చని కణికృష్ణు నచ్చటఁ బొడఁగాంచి

తనయున్నచోటికి ధరణివల్లభుఁడు
నిను దోడితెమ్మని నియమించె మమ్ము
ననఘాత్మ విచ్చేయు మనవుడు గురుని
యనుమతిఁ గణికృష్ణుఁ డవనీశుకడకు
నేతేర రాజసం బెసఁగ భూనాథుఁ
డాతని నుచితాసనాసీనుఁ జేసి
కర మర్ధిఁ బలికె నోకణికృష్ణ! మాకు
గురుతరుం డగు భవద్గురుని సేవింప
వేడు కయ్యెడి నిదె వేవేగఁ బోయి
తోడితెమ్మనుచు నందుల కేమివినుము
కవిత నీవలెఁ జెప్పఁగారా దటంచుఁ
గవు లెల్ల నినుఁ బెక్కుగతుల వర్ణింప
విని విని యిటకు రావించితిఁ గవిత
వినఁగోరి యిప్పుడు విఖ్యాతి గాఁగ
సిరి మించుసొమ్ములు చీనాంబరములు
హరులదంతులతోరహత్తుగా నిత్తు
వరరసరీతి భావవ్యంగ్యముఖ్య
పరిపూర్ణ శుభశబ్దబంధంబు గాఁగ
ననయంబు నీనేరు పంతయు మెఱసి
తనమీఁద నొక్కపద్యముఁ జెప్పు మనిన

నానీచనరపాలుఁ డాడువాక్యములు
వీనుల నిడక యవ్వేళఁ దాపసుఁడు
నెరుసరికరిఁ జూచినిగుడికోపించు
తెఱఁగునఁ గనలి గద్దియ డిగ్గనుఱికి
శ్రీమనోహరపదాశ్రితచక్రవర్తి
మామకగురుఁడు సామాన్యుఁడే తలఁప
నీరధు లాపోశనించినయతఁడు
కారించి యరకాలఁ గనుచూపినతఁడు
కడగంట నమృతాంశుఁ గన్నట్టియతఁడు
కడలిఁ ద్రావెడువహ్నిఁ గ్రక్కినయతఁడు
పుట్టి యేగినవారు పుట్టినవారు
పుట్టనుండినవారు భువి క్రింద మీద
నక్షపాదునిఁ జెప్పినట్టిచోఁ బూర్వ
పక్షంబు లగుదు రెప్పాటుననైనఁ
దోయజభవశివాదుల లెక్కగొనఁడు
నీయున్నచోటికి నేఁ డేల వచ్చు
రూపింపఁ జక్కెరరుచి గొన్నయతఁడు
వేఁపచే దడుగునే వివరించిచూడఁ
గమలసంభూతశంకరముఖ్యసురల
కమితంబు లైన బ్రహ్మండకోటులకు

నేలిక యగుశౌరి నెన్నెడు నాదు
నాలుక నిను నెన్నునా? దుర్మదాంధ!
నీవు లక్ష్యమెనాకు? నీ విచ్చునట్టి
యీవి లక్ష్యమె? తుది నిచ్చితివేని
యలవి ననిత్యంబు లసుఖంబు లైన
శిలలు లోహంబు లిచ్చెద వింతెకాని
యిభరాజపాలకుఁ డిచ్చినయట్టు
లుభయవిభూతులు నొసఁగ నోపుదువె?
దానవాంతకుఁ దక్కఁ దక్కినయట్టి
మానవాంతరమున మానవాంతరము
వేయైన భజన గావించుట వినుతి
సేయుట నా కన్నచెలియలివావి
నరనాథ! నీమీఁద నను జెప్పుమంటి
హరి హరి! యెట్లునో రాడె నీ కనిన
భీషణుం డగుచు విభీషణుమీఁద
రోషించుదశకంఠురూపు దీపింప
బొమముడి గదుర చూపుల నిప్పులురల
భ్రమితాక్షుఁడై యోష్ఠపల్లవం బదర
మోమెల్ల జేవుఱుముద్దచందమున
సోమించఁ గణికృష్ణుఁ జూచి యి ట్లనియెఁ

దద్దయు నిన్నునాదరమునఁ బిలిచి
పెద్దచేసిన నేల ప్రేలెదు నన్ను
నివ్వీటఁ బొగడుకవీంద్రులలోన
నెవ్వరిఁ బోలుదు రీవు నీగురుఁడుఁ
బెరిమెఁ బోనిమ్మని ప్రియము గావింప
నరిమీఱి పల్కె దున్మత్తుచందమున
నీ వనఁగా నెంత నీగురుం డెంత
నీ వేల యతఁడేల నీవు [12]నాతఁడును
దండిమై తన యేలుధారుణిలోన
నుండక చనుఁ డింక నుండితిరేని
దండింతు ననుఁడు నత్తాపసోత్తముఁడు
మండుచుఁ బలికె నమ్మనుజాధమునకుఁ
గావించు తపమెల్లఁ గనలినఁ జెదరుఁ
గావున శపియింపఁ గా దని కాక
నీఱేనితనమును నిన్ను నీక్షణమ
నీఱు సేయఁగ నోపనే యింక నేల
నిన్నుఁ గన్గొనరాదు నీ వేలుధరణి
నున్నఁ బాపము చెందు నోరి పాపాత్మ!
యని వానిఁ జూడక యచ్చోటు వాసి
దినకరబింబంబుదిక్కుఁ గన్గొనుచు

సరభసగతి భక్తిసారుఁ డున్నెడకు
నరుదెంచి తత్క్రమం బంతయుఁ దెలిపి
యీపాపమతి యేలు నిలలోన నున్నఁ
భాపంబు చెందు నోపరమమునీంద్ర!
యున్నతి మీపాదయుగళంబు నాత్మ
నెన్నుచు నిటమీఁద నెచ్చోటికైనఁ
బనివినియెద నంచుఁ బదముల కెరఁగి
వినుతించుశిష్యుని వీక్షించి పలికెఁ
దనయ! నీ వొల్లనిస్థల మిది యేల
నినుఁ బాసి యుండంగ నేర్తునే యేను
ఏ వత్తు నీవెంట నే వచ్చినంత
నావెంటనే వచ్చు నాగేంద్రశాయి
యతనివెంబడి వత్తు రఖిలదేవతలు
నితరంబుఁ దలపోయ నేల నీకనుచు
గ్రక్కున నచ్చోటు గదలి యుగ్రంపుఁ
జక్కి నొప్పెడి శేషశాయిసన్నిధికి
నేతెంచి యాయిందిరేశ్వరుఁ గాంచి
నాతండ్రి! జగదేకనాథ! గోవింద!
భక్తవత్సల! కృపాపరతంత్ర! భుక్తి
ముక్తిదాయక! జగన్మోహనాకార!

ఫణిశాయి! నీభక్తభక్తుఁ డైనట్టి
కణికృష్ణుఁ డిచటిభూకాంతుతో నలిగి
యరిగెడు నిటఁ బాసియతనితో నేను
నరిగెద నింక నీయహిశయనంబు
మడఁచి బాహాదండమధ్యంబునందు
నిడికొని నీవు నీయెలనాఁగఁ గూడి
నావెంట వేంచేయు నన్ను మన్నించి
వేవేగ నాకూర్మివింద! గోవింద!
యని యొక్కపాటచే నారమానాథు
వినుతి చేసిన భక్తవివశుఁ డై యతఁడు
పెనుపొందఁ బఱచిన పెనుబాపచాపఁ
దనచంక నిఱికి పద్మాయుతుం డగుచు
మునుకొని చనుచున్న మునికులోత్తంసు
వెనువెంటఁ బాయక వేంచేయునప్పు
డినకులుం డడవికి నేగుచోఁ బౌర
జనులెల్ల నతనిపజ్జను బోవునట్లు
నిజవాసములు డించి నిఖిలదేవతలు
భుజగతల్పుని గొల్చి పోవు నత్తఱిని
కులగిరు ల్గ్రుంగె [13]దిక్కుంభులు మ్రొగ్గె
జలరాశివర్గంబు చలచల మరఁగె

నుడుపంక్తి చెదరె సూర్యునివేగ మడరె
వడఁకె శేషుఁడు ధరావలయంబు వేలె
నీరీతి జగ మెల్ల నిట్టట్టు వడియె
నారసిచూచిన నది యట్ల కాదె
హరిభక్తు లలిగిన యది నివారింప
హరహరబ్రహ్మాదు లైన నోపుదురె
నెట్టన సురనాథు నిరసించుతపసి
తిట్టు దాఁకినయట్టిదివియునుం బోలెఁ
గప్పు మీఱినయట్టి కావిరి విరిసెఁ
గప్పి నల్గడల చీఁకట్లు గ్రమ్ముచును
ఆమహీపతి యేలునట్టిపట్టణము
సీమయు నవ్వేళ శివపాడు వైవ
భావించి మంత్రులుఁ బౌరు లవ్విధము
భూవిభుతోడ నద్భుతముగాఁ జెప్పఁ
గాంచి యేలెడుమహీకాంతుఁ డత్తెఱఁగు
గాంచి వారలు వల్కుక్రమ మాలకించి
తనుఁ గట్టుత్రాడును దనుదానె తెచ్చి
కొనునట్లు నాయవగుణ మింత సేసె
నని తనసేయుమహాపరాధంబు
మనమునఁ దలఁచి వేమఱు భీతి నొంది

యియ్యోగివరుచిత్త మేరీతిఁ గరఁగు
నియ్యపరాధ మిం కేమిటఁ బాయు
నేను గావించిన దిది మహాద్రోహ
మైన నామౌని కృపాకరుం డగుట
వరశరణాగతవత్సలుం డగుట
శర ణన్నఁ గాచు నిశ్చయ మింతకంటె
సరయంగ మఱి యుపాయము లే దటంచు
సరివోరు భయము విస్మయ మాత్మఁ బొదలఁ
దడయక మంత్రులు తనవెంట నడువ
నడుగులు దొట్రిల్ల నలయిక వొడమఁ
బెదవులం దడుపుచుఁ బెం పెల్లఁ దక్కి
యదపేది తన్మార్గ మరయుచు వేగ
నరిగి యేగుచునున్న యయ్యక్షచరణ
చరణాబ్జములఁ జక్క సాగిలి వ్రాలి
తొడబడి రెండుచేతులఁ బాదయుగము
విడువక వడి వెక్కి వెక్కి యేడ్చుచును
జలమతి ద్రోహి నృశంసుండ మిగులఁ
జులుకనివాఁడ నసూయాపరుండ
జడుఁడఁ దామసుఁడ వంచకుఁడఁ గష్టుఁడను
బుడమి నెవ్వరిసరిఁ బోలనివాఁడ

నమరేంద్రవంద్య! సర్వాపరాధములు
క్షమియింపు కృపఁ జూడు సకలశరణ్య!
తనయుండు నేరక తప్పుఁ జేసినను
జనకుండు కోపింపఁ జనునె యోతండ్రి!
యని పెక్కుభంగుల నభినుతుల్ సేయ
మనమునం గరుణించి మౌనివల్లభుఁడు
హరిచక్రమున కోడి యత్రినందనుఁడు
సిరివరు వేఁడ నాశ్రితవత్సలుండు
సొలయక యంబరీషుని వేఁడు మనిన
చెలువున నామౌనిశేఖరుం డనియెఁ
బ్రణతులచేఁ గాని ప్రణుతులఁ గాని
కణికృష్ణు వికసింపఁగాఁ జేయ వేని
వేమాఱు న న్నెంతవేఁడిననైన
మామకభక్తుండు మగడ కే రాను
రమణతో నియ్యపరాధ మయ్యోగి
క్షమియింప కేనును క్షమియింప ననిన
క్షితినాథుఁ డాకణికృష్ణుపాదముల
కతిరయుంబున వ్రాలి యార్తరావమునఁ
గన్నీరు దొరఁగ గద్గదకంఠుఁ డగుచుఁ
బన్నినదైన్య మేర్పడ సన్నుతింప

నవిరళం బగుసహస్రాపరాధములు
సవరించి తుది వచ్చి శరణు చొచ్చినను
ఘను లైనవార లాకరటినేరములు
మనమునఁ బెట్టక మన్నింతు రెపుడుఁ
గావునఁ గరుణమై గణికృష్ణయోగి
భూవరు [14]చేయుతప్పులు మది నిడక
యతఁడునుం దాను నయ్యక్షపాదునకు
నతులు గావించి మన్నన సేయు మనిన
సంతసింపుచు భక్తిసారయోగీంద్రుఁ
డెంతయుఁ బ్రీతుఁ డై యెలమి నెక్కొనఁగఁ
జిరతపోనిధి యైనశిష్యుండుఁ దాను
నరుదెంచె మగుడి పూర్వాశ్రమస్థలికిఁ
గ్రేపువెన్జనుగోవుక్రియ భోగిశాయి
యాపద్మయును దాను నతనితోఁగూడఁ
జనుదెంచె నతనితో సకలదేవతలుఁ
జనుదెంచి నిజనివాసముల నెక్కొనిరి
యోగీంద్రుఁ డంత ము న్నుండినయట్టి
నాగేంద్రతల్పునినగరి కేతెంచి
యాదేవదేవు దయామృతాంభోధి
వేదగోచరు భక్తి వినుతిఁ గావించి

ఫణిశాయి! కాంచికాపట్టణాధీశ!
కణికృష్ణుఁ డిచటికిఁ గ్రమ్మఱ వచ్చె
నీవును నింక ము న్నిట్టిచందమున
శ్రీవధూమణిఁ గూడి శేషతల్పమునఁ
బవళింపు మని యొక్క పద్య మొనర్ప
భువనైకతల్పుఁ డప్పుడు ముదం బెసఁగ
నాయోగివరుఁ గూడి యనురక్తి వెంటఁ
బోయివచ్చినరీతి భువనంబు లెఱుఁగ
సవ్యహస్తంబు మ సముక్రింద నునిచి
సవ్యేతరముఁ గటస్థలిమీఁదఁ జూచి
కడలికన్నియ పాదకమలంబు లొత్త
నుడురాజుతెలి మించు నురగేంద్రుమీఁదఁ
బుండరీకముమీఁదఁ బొలుపొందునట్టి
గండుతుమ్మెదఱేనిగతి నొప్పు మిగిలి
శయనించి తొల్లింటిసరవి నిం పొంది
యయకరుం డైయుండె నదికారణమున
ధారుణిమీఁద నందఱును యథోక్త
కారీశుఁ డని యెన్నఁగడగి రావేల్పు
చరణాబ్జముల వ్రాలుజనపాలుఁ జూచి
కరుణించి మంత్రివర్గంబుతోఁగూడఁ

బురమున కనిచి యప్పుడు భక్తిసారు
నురగేంద్రతల్పుని నురుకృపాంబుధిని
సేవించి మఱియు నచ్చినభక్తిఁ బ్రణుతిఁ
గావించి యంతరంగము భక్తిరసము
వెలికి నుప్పొంగినవిధమున నేత్ర
జలజాతయుగళి బాష్పములు బిట్టడర
గోపాలపాలక! గోవింద! కృష్ణ!
నాపాలిదైవమ! ననుఁ గన్నతండ్రి!
భావింప బ్రహ్మాండపటలసంతతులు
నీ వాడుమన్నపూనిక నాడు; నట్టి
జాడ నొప్పెడురమాస్వామి ! యే నిప్పు
డాడించుకైనడి నాడితివీవు
ఫాలాక్షనుత! భక్తపరతంత్ర! నీదు
సౌలభ్య మే మని సన్నుతించెదను?
అని పాదములమీఁద నందంద వ్రాలి
ఘనతరసంతోషకమలధిఁ దేలి
గుఱి మీఱు తొలిపల్కుకొన వేల్పుమ్రానఁ
దఱిఁ బండుపంట నా ద్రావిడభాషఁ
గృతకృత్యజననమస్కృతియు లోకోప
కృతియునుంగా నొక్కకృతి సంఘటించి

యంత క్షీరాహారి యై శిష్యుతోడ
నంతరంగమున శ్రీహరిఁ బాదుకొలిపి
వేడుకతో యోగవిద్యానురక్తి
నేడునూఱేఁడు లయ్యిరవున నుండి
యటమీఁద నామూర్తి నామూర్తి యగ్ర
తటమున నిలుచున్న ధరచక్రధరుని
యాసరి శయనించునట్టిగోవిందు
నాసీనుఁ డై యున్నయట్టి లక్ష్మీశుఁ
దలఁపులో నిడుకొని తత్పాదభక్తి
సొలపులు మీఱ నచ్చోళమండలము
వెడలి తీర్ధంబులు విపినాంతరములుఁ
గడచిశిష్యుఁడుఁ దానుఁ గడుసంతసమున
భూరివారిమరందపూరకల్హార
నారకాసారప్రసారవిస్తార
సారసబిసగణాస్వాదనలోల
వారణమదగంధవళితాళినాథ
విలసిత యైనకావేరిచెంగటను
నలువొందు కుంభఘోణమున కేతెంచి
భాసితగోపురప్రాసాదతతుల
భాసిల్లు మణిమంటపంబులోపలను

నెరయఁ దెమ్మరదూది నించి చూపట్టు
పరపుపై నొసపరిబాగు లేర్పడఁగఁ
బవళించి శ్రీదేవిపాలిండ్లబటువు
కవమీఁదఁ బాదపంకజములు సాఁచి
శిరముక్రిందట నొకచెయిఁ జేర్చి యొక్క
కరము బిత్తరముగాఁ గటిమీఁదఁ జాఁచి
వీనులఁ గదిసిన వెలిదమ్మికన్ను
గోనల నమృతంబుఁ గురియుచునుండఁ
గడలుపింజెలు వారఁ గట్టినపసిఁడి
పొడలు రెట్టింపుసొంపులు దువాళింపఁ
గఱకువేయంచులకత్తిచా లెడయు
మెఱసి వేడము గొన్నమెఱుపు లైయొప్ప
నిడువాలుపుత్తడినెట్టంబుపసలు
బెడఁగు లై నలుగడఁ బేరెమల్‌వార
ముద్దులమొసలిసొమ్ములచకచకలు
తద్దయుఁ జెక్కుటద్దముల నర్తింప
నెఱమించు లొదవుమానికములఱేని
మెఱపులు డెందంబుమీఁదఁ [15]గ్రేళ్ళుఱుక
జిగిదమ్మిమోముచే శీతాంశుసొంపు
నగునతృప్తామృతనాథనామకుని

బరమాత్ము నాశాఙ౯పాణి దర్శించి
ధర సాగి మ్రొక్కి యెంతయు సన్నుతించి
పరిపూర్ణ మగు భక్తి పారవశ్యమునఁ
బరికించి వెండియుఁ బ్రణుతింపఁ దొడఁగె
భద్రనాగేంద్రంబు పైఁ బవ్వళించి
నిద్రించె దేటికి నిర్ణిమిత్తముగ
నీతఱిం బవళించి తేమి కారణము
నాతోడఁ జెప్పవే ననుఁ గన్నతండ్రి !
ఘనతరం బైనచక్రము కేలఁ బూని
చెనఁటిరక్కసులఁ ద్రుంచినబడలికయొ
జలరాశిఁ జొచ్చి రాక్షసు లగీటణఁచి
చెలఁగి వేదములు దెచ్చినబడలికయొ
క్షీరసింధువు మధించియుఁ గ్రుంగకుండఁ
జేరి మందరము మోచినబడలికయొ
ముఖదంతకోరకమున జగత్త్రయము
నిఖిలభారంబు నానినబడలికయొ
పైకొన్నయుక్కుకంబముఁ గొనగోళ్ళఁ
జేకొని వ్రక్కలించిన బడలికయొ
జగము లీ రేడును చక్కనియడుగు
చిగురుటాకునఁ గొలిచినబడలికయొ

గండగొడ్డట రాజకంఠ నాళములు
చెండి చెండాడి వైచినబడలికయొ
దండకావనమున దనుజవర్గంబుఁ
జెండివైచుచుఁ జరించినబడలికయొ
కౌరవాధిపునితోఁ గనలి తత్పురము
సీరాగ్రమునఁ బెకల్చినబడలికయొ
యలవి మీఱంగ గోపాంగనామణుల
చెలువంపురతులఁ దేల్చినబడలికయొ
మేలిమితురగంబుమీఁదట నెక్కి
లీల వయ్యాళిఁ దోలినబడలికయొ
యీయెడ నాతోడ నింతయుఁ దెలియ
మాయన్న యెఱిఁగింపుమా యన్న నపుడు
మునినాథువిన్నపమునకు డెందమున
ననయంబు హర్షించి యాశాఙ౯ పాణి
తల యెత్తి చూచి యాతనితోడఁగూడఁ
బలుమఱు సరసత భాషించి మెచ్చి
సవిభూతికముగ నిజస్వరూపంబు
నవిరళగతిఁ జూప నయ్యోగివరుఁడు
నలమయూరపు రంబు నుండివచ్చి
యలవి మీఱినకాంచికాంతికస్థలిని

జెన్నొందు శారదాసింధువుచెంతఁ
బన్నగరాజతల్పంబున నేను
మును గనుఁగొన్నయీమూర్తినే యిచటఁ
గనుఁగొంటి నాతపోగరిమ యెట్టిదియొ
యనుచు ననంతవేదాంతార్ధవితతి
బనుపడఁగా శాఙ౯ పాణి మీఁదటను
స్తవరూప మగుప్రబంధముఁ జేసి మఱియు
భువనమోహనమూర్తిఁ బుండరీకాక్షు
నావేల్పువేల్పు రెప్పార్పక మఱియు
సేవించి యందునం జిక్కి చొక్కుచును
సప్తశతద్వయసంవత్సరములు
ప్రాప్తయోగాభ్యాసభరితుఁ డై యుండె
నాద్యుఁ డాఫణిశాయి యది కారణముగ
నుద్యోగశాయి యై యుండు నెప్పుడును
అటమీఁద నామూర్తి నాత్మకంజమున
ఘటియించి కతిపయగ్రామముల్ గడచి
యలఘువైభవముల నమరపట్టణముఁ
బొలుచుశార్దూలాఖ్యపురవరంబునకు
నరుదెంచి శూర్పంబు లమ్మెడువాని
సరవిఁ దత్పురవీథి సంచరింపంగ

నాసమీపము పంచటరఁగుపై నొక్క
భూసురేంద్రుఁడు వటుపుంజంబుఁ గూర్చి
స్వరవర్ణములు తదుచ్చారణశక్తి
గర మొప్ప వచియింపఁగా శిష్యసమితి
[16]యప్పుడు తమయుపాధ్యాయులమోము
తప్పక చూచి యెంతయుభయం బెసఁగఁ
బలుమఱు మునివ్రేళ్ల పనస లెన్నుచును
మెలిగొన్నశిఖ లింత మిటిమిటిపడఁగ
నిడుసాగిలగ మెడల్ నిక్కించి బిగువు
సడలి యోష్ఠంబులు చాఁచి దంతములు
వెలువడ నొండొరుల్ వివృతాస్యు లగుచు
వలనొప్ప సారెకు వల్లించుకొనుచు
నుండ నవ్వేళ నయ్యోగివల్లభుఁడు
దండ కేతేర నాధారుణీసురుఁడు
నితరు లెవ్వరుఁ దను నెఱుఁగరాకుండ
నితరవేషము ధరియించి యేతెంచు
పరమపావనుఁ డని భావింపలేక
పరునిగాఁ దలపోసి పామరబుద్ధిఁ
జదువు చెప్పుట మాని చదివెడువాండ్ర
నదలించి నిలిపిన నయ్యోగివరుఁడు

నాసన్నయెఱిఁగి తా నచ్చోటు వాసి
యాసన్నవీధికి నరిగె నవ్వుచును
ఆతరవాతఁ దా నాతరవాయి
[17]యేతరి యోజ రు వ్వీయఁబో నంతఁ
దనకును దనశిష్యతతికిని ముందు
వెనక దోఁపకయున్న వేఱొండువిప్రు
నడుగఁబోయిన వాఁడు నారీతి నొండు
నుడువనేరక మూఁగనులివున నున్నఁ
దలపోసి మనము ముందర వేదపఠన
సలుప మేదరిరీతిఁ జనుదెంచె నొక్కఁ
డతని శ్రీహరిదాసుఁ డనక యిందఱము
మతిలోనఁ గడు నవమానంబు సేయ
నెట్టనం దనభక్తు నిరసింప శౌరి
బెట్టుగా వాఙ్ముద్రఁ బెట్టినాఁ డనుచు
ననుతాప మొదవంగ నతఁ డెట్టిఘనుఁడొ
యనుచు నందఱుఁ గూడి యాజాడఁబట్టి
యరిగి వేఱొకచోట నతిభానుకోటి
కిరణుఁ డై యున్నయోగిని విలోకించి
ప్రణుతించికొనుచుఁ దత్పాదపద్మములు
ప్రణుతులయ్యాలోకపావనమూర్తి!

బ్రహ్మణ్యమునివేద్య! భవరోగివైద్య!
బ్రహ్మయోగీంద్ర! కృపానిధీ! యేము
నెన్నంగఁ జేసిన యెల్లనేరములు
మన్నించి మాకు బ్రాహ్మణ్యంబు గలుగ
దేవరనిగమోపదేశంబు మాకుఁ
గావింపు మని పలుకఁగ మౌనివిభుఁడు
భావజగురుపాదపద్మసంసక్తుఁ
డే వారితో మాటలాడ సైపమిని
వల కేలికొన నల్లవరిగింజ గిల్లి
యలవిస్రగణముపై నడరించుటయును
రామునిశ్రీపాదరజముచే రాయి
రామ యైనట్లు వారలజిహ్వలందుఁ
బాషాణతృణజడప్రాయ మైనట్టి
భాష నిజస్వరూపమునఁ జెన్నొందె
నాదటఁ దత్క్రియ యర్థంబు దెలుపు
వేదంబు నెఱిఁగి భూవిబుధు లుప్పొంగి
వలగొని యయ్యోగివరునకు మ్రొక్కి
యలరి గృహంబుల కరుదెంచి రంతఁ
గావున హరిభక్తి గలిగినవారు
భావింపఁ ద్రైలోక్యపావనాధికులు

మౌనీంద్రుఁ డంతఁ ద న్మార్గంబుఁగడచి
యనగరాధీశుఁ డగు దానవారి
సదనంబు వలచుట్టి చరియింపుచుండ
సదనంబులో రమాసహితుఁ డైయున్న
యాతపసులభాతి నతనినీక్షించు
కౌతుకం బతనిపైఁ గరుణయుఁ బెనఁగ
నామౌని యేదెస కరుదెంచెఁ దాను
నాముఖం బైకరుణాపాంగతతులఁ
గప్పుచు నమ్మౌనిఁ గనుఁగొనఁ దొడఁగె
నప్పుడు హరిపాదుఁ డను విప్రవరుఁడు
యాగకర్మారంభుఁ డైయేగుదెంచి
యాగాంతరాత్మకుం డైన యావేల్పు
నురుభక్తి మైషోడశోపచారముల
సరవిఁ బూజించి యంజలిచేసి మ్రొక్కి
యాగాగ్రపూజార్హుఁ డైనట్టి దివ్య
యోగివాఁ డని చూపునొప్పు దీపింపఁ
గరమర్ధిఁ బరివృత్త కంధరుండైన
హరిఁజూచి యేమకోయని వెఱఁ గంది
పరికింప నిట యెట్టిపరమయోగేంద్రుఁ
డరుదెంచి యీచక్కి నరుగుచున్నాఁ డొ

కడుఁ జోద్య మని తదాగారంబువెడలి
వడినేగి తానును వలచుట్టుకొనుచు
నందంద నలుదిక్కు లరయుచువచ్చి
ముందరిదెస జగన్మోహనాకృతిని
వికసితధవళారవిందమధ్యముల
మకరంద రేఖలమాడ్కి నెమ్మేన
ధవళోర్ధ్వపుండ్రమధ్యముల శ్రీచూర్ణ
మవిరళ రేఖ లైయనువొందుచుండ
రవిసుతాగంగాతరంగముల్ రెండు
కవగూడియొప్పెడి కరణినెంతయును
దులఁగించు నలినాక్షతులసికామాలి
కలుకంబు కంఠలగ్నంబు లైయొప్ప
నొప్పుచునున్న య య్యోగీంద్రుఁగాంచి
ముప్పిరిగొనుమోదమునఁ జేర నరిగి
పాదపద్మములపైఁ బ్రణమిల్లి విష్ణు
పాదకోవిదుఁ డంతఁ ప్రణుతిఁగావించి
యయ్య! నాకావించు యాగంబు సఫల
మయ్యె నీదర్శనంబబ్బుటవలన
నదె యాగశాల నీవటకు వేంచేసి
తుదలేనికృపఁ గృతార్థుని జేయవలయు.

నోజతో నీదాసుఁ డొనరించు నగ్ర
పూజ నీ వవధరింపుము మౌనిచంద్ర!
యపుడు నాయజ్ఞంబు యజ్ఞ మైయొప్పు
నపుడుగదా కృష్ణుఁ డదియొప్పికొనును
గావున నీభృత్యుఁ గరుణించియటకు
వేవేగ దేవర వేంచేయవలయు
నని వెండియును జరణాంబుజాతముల
వినతుఁ డైలేవక వినుతిఁగావింపఁ
గరుణించి య య్యోగికంఠీరవుండు
హరిపాదకోవిదు నలమిలాలించి
వెనుకొని యతఁడు సేవింపుచురాఁగఁ
జనుదెంచె న య్యాగశాలలోపలికి
నంత నావిష్ణుపాదాహ్వయసూరి
సంతసంబున భక్తిసారయోగీంద్రు
ననుపమభద్రపీఠాసీనుఁ జేసి
యనువొంద నఘ్య౯ పాద్యాదుల నొసఁగి
మును చేదిభూపాలముఖ్యులు చూడ
వనజాక్షునకు ధర్మవసుధేశ్వరుండు
సవరించు నగ్రపూజయుఁ బోలె నపుడు
సవనంబు గనుఁగొనఁ జనుదెంచు జనులు

దినకరనిభులైన ద్విజులు ఋత్విజులు
గనుఁగొన నాగమోక్తప్రకారమున
రంగైనకనకపాత్రమున నమ్మౌని
పుంగవునకు నగ్రపూజఁ గావించెఁ
గావింప ఋత్విజుల్ గని కోప మెసఁగ
నావిష్ణుచరణు నందంద తిట్టుచును
సర్వశాస్త్రజ్ఞు లైచర్చింప వేద
పర్వతములవంటి బ్రాహణు లుండఁ
బేర్చి బృహస్పతి పెకలివచ్చినను
జర్చింపగల ఘనశాస్త్రు లుండంగ
నశ్వమేధాదిపర్యంతముల్ దెలిసి
శాశ్వతమతు లైన శ్రౌతులుండగను
మనమున భయ మింతమాని యీయున్న
[18]ఘనులనందఱ గట్టకడఁ బారవైచి
యెవ్వనినోతెచ్చి యితరులు తన్ను
నవ్వ నిందఱ నట్టనడుమనుబెట్టి
యగ్రజన్ముల కహ౯మగుచు శోభిల్లు
నగ్రపూజనమిచ్చు టది యెట్టులోరి!
[19]యోజమాలినవాజ వోరిపోవ్రాత్య
నీజన్నమంతయు నేఁడు ఫలించె

జగతి నెవ్వరు నీకు సరిలేరు నీకుఁ
దగునాతఁ డతనికిఁ దగుదువు నీవు
భాగ్యంబు చేసితి బంధుల యెదుట
యోగ్యుండ వైతి వీయుర్వి నెన్నంగ
వైదికుం డని జను ల్వర్ణించిచూడ
నీదు బ్రాహ్మణ్యంబు నేఁడు సిద్ధించె
యాగమంతయు సాంగ మయ్యె నౌరౌర !
నీగుణంబుల నెన్ననేర్తుమే యేము
అనుచు నొండొరు మోము లాగ్రహవృత్తిఁ
గనుఁగొని నిడువాలు గడ్డంబు లదర
జగడించి కెరలుచుఁ [20]జంకపుస్తములు
దిగజార వదలఁగట్టిన పంచె లూడఁ
దొట్టిపెంజెమటలు దొఱఁగ ఫాలముల
దట్టంపుఁ బట్టెవర్ధనములు గరఁగఁ
ప్రాఁకుబన్నులు వెలిఁబడఁగ బాహువులు
వీఁక మైఁ జాచియ వ్విప్రుఁదిట్టుచును
గడపట వీని సంగడి నింతనుండి
కుడువకుం డెవ్వఁడుఁ గుడిచినవాని
[21]బొంపిరి జన్నిదమ్ములు త్రెంపివైచి
పెంపెల్లఁ జెడఁగొంపఁ బెరికింపవలయు

నని పోవ నుద్యుక్తులై యున్నవారిఁ
గనుఁగొని య య్యోగికంఠీరవుండు
మును మరుత్తునియాగమునకు సంవర్తుఁ
డనిమిషగర్వంబు లఁడచుచందమున
హరిపాద! వెఱవకుమని యాదరించి
సరగున హృదయకంజము శౌరిఁజూచి
హరి, రమాపతి, సహస్రారాంకపాణి,
వరదాయి షడ్గు ణైశ్వర్యసంపన్ను
గాఢతరాజ్ఞానగర్వాంధ విప్ర
మూఢులవదనముల్ ముద్రించి నట్లు
నీపాపసేవకు నిందించినట్టి
యీపాపమతుల యేపెడయ నివ్వేళఁ
దలఁపులోపలి శేషతల్పు నాలోన
వెలుపల నీదివ్యవిస్ఫూర్తిమూర్తి
వేవేగ జనులెల్ల వెఱఁగందికొనుచు
సేవింపంగాఁ బ్రకాశింపించు మనుచు
హృద్యంబుగా లోకహితముగా నొక్క
పద్యంబు సవరింపఁ బంకజోదరుఁడు
నామౌని శీతాంశు నగ్రభాగమున
సోమార్కకోటుల సొం పగ్గలించి

శ్రీరసానీళలు సిరిమించు హస్త
సారసంబుల నిజచరణంబు లొత్త
మణిమయ కింకిణీమంజీరకాంతి
గణసముజ్జ్వల పాదకమల యుగ్ముండు
కనక చేలావృతఘంటికాఘటిత
ఘనసప్తకీశోభికటి చక్రతలుఁడు
బంధురోడ్యాణ శంపాలతాజఠర
బంధరోమాళి షట్పదపంక్తి యుతుఁడు
సందీప్తదరసుదర్శన గదా శాఙ౯
నందకయుత సమున్నత కరాబ్జుండు
శ్రీవత్సకౌస్తుభ శ్రీవనమాలి
కావరచందన కలితవక్షుండు
వరహీరదర్పణోజ్జ్వల గండయుగళ
నిరుపమచాంపేయ నిభనాసికుండు
నాకర్ణవిశ్రాంత హరిణాంబుజాత
నీ కాశకరుణాంకనేత్రభాసితుఁడు
చారుమందస్మిత చంద్రికాసార
పూరబింబాధరభూషితా ననుఁడు
నకలంకకంకణహార కేయూర
మకరకుండలదివ్యమణికిరీటుండు

నగుచు భోగీంద్రశయానుఁ డైశేష
ఖగరాజసేనేశ ఘననిత్యముఖులు
వ్యాసాంబరీష రుక్మాంగద కపిల
వాసిష్ఠముఖ భాగవతులు సేవింప
సరసిజభవ శర్వశక్రాదివిబుధ
గరుడ గంధర్వనికాయంబు గొలువ
నిత్యప్రసన్నుఁ డానీరజోదరుఁడు
ప్రత్యక్ష మయ్యె నాభక్తిసారునకు
నప్పు డాభూసురు లరుదంది భయము
ముప్పిరిగొనఁగ న మ్మునినాథవరుని
నతనికిఁ బ్రత్యక్షమైన యవ్వేల్పు
నతనికిఁ బరిచరు లైనవారలను
సేవించి మొల్లపూఁచినరీతి మేని
తీవలుగరుపార ధృతభీతులగుచు
వడవడవణఁకుచు వచ్చియమ్మౌని
యడుగుదమ్ములమీఁద నందందవ్రాలి
యపరాధులము దురహంకారమతుల
మపరిమితాజ్ఞాన మనువార్ధిమునిఁగి
దరిగాన మిన్నాళ్ళు తావకపాద
తరణిచే నిటమీఁద దాఁటంగఁగలము

శరణాగతత్రాణజగదేకవినుత
పరికింపఁగా ద్విపాత్పశువుల మైనఁ
దమదునేరములు చిత్తమునందు నిడక
క్షమియింపవలయు నేచందాన నైన
ఘనబలోత్కట మైన గంధసింధురము
కినిసికుక్కలుమొఱగిన లెక్కగొనునె
నీచంద మెఱుఁగక నీచునందమున
మోచి నేమునుగొన్ని మొఱగితిమయ్య!
యవియెల్లఁ దలఁపక యభయం బొసంగి
భవవార్దివెడలింపు పరమయోగీంద్ర!
మఱియెఱుంగుదు మేని మహనీయమహిమ
యెఱిఁగిన నీమూర్తి యెఱుఁగంగవలయు
నని పెక్కులాగుల నందంద వినుతు
లొనరింప భార్గవయోగిచంద్రుండు
కరుణించి యావిప్రగణము నీక్షించి
సురగరు డోరగుల్‌చూచి నుతింప
నపుడు ప్రత్యక్ష మైనట్టి మాధవుని
సపరివారాయుధ శయనేందిరముగఁ
దడయక డెందంపుఁ దామరయింట
నిడికొని తొల్లింటి యింపు మైనున్న

వీక్షించి భూసురవితతి వెండియును
నక్షపాదునకు సాష్టాంగంబు లెరగి
యతనిచెంగట నున్న హరిపాదసూరి
నతిభక్తి నుతియించి యడుగుల కెరగి
పరమపావన! నీప్రభావంబు నాత్మ
నరయక దుర్భాషలాడితి మిప్పు
డవియెల్ల నోర్చుకొ మ్మని[22]ఫళఫళని
దవుడలు కరములఁ దాటించుకొనుచు
నావిష్ణుపాదున కభివాదనములు
గావించి క్రతువు సాంగముసేసి రంత
వనజాసనాదిదేవతలు న మ్మౌని
యనుమతి నెలవుల కరిగి రవ్వేళ
సారసదళనేత్ర చరణాహ్వయుండు
ధారుణీసురలును దానును గూడి
యవబృథస్నాతు డై యరుదెంచి యోగి
ధవుని శ్రీపాదతీథ౯ము న న్వయించి
యాయక్షపాదుని యాబాల్యమహిమ
వేయుచందంబుల వివరింపఁదొడఁగె
నోసుదర్శనమూర్తి యురుతపోరాశి
రాసికి నెక్కు భాగ౯వమునీంద్రునకుఁ

బొడమి యీప్రాకృతభోజ్యవస్తువులఁ
గుడువక హరిదివ్యగుణసుధారసముఁ
గ్రోలుచు వృద్ధులు గొనివచ్చినట్టి
పాలుగైకొని భక్తపరతంత్రబుద్ధి
సగ మారగించి వాత్సల్యంబుతోడ
సగము వారలకుఁ బ్రసాదించి కరుణ
వారికి మగుడజవ్వనము రాఁజేసి
ధారుణి వొగడ సంతానంబునొసఁగి
పరయోగిసామ్రాజ్య వైభవశ్రీలఁ
బరమాత్ము విశ్వరూపము విలోకించి
కఱకంఠుఁ డెరగ లికను చూపు మగుడ
నఱకాలనయన సహస్రము ల్చూపి
కొంకణు రసపాదఘుటికను బాద
పంకజరజముచేఁ బరిహసింపుచును
నీరజభువుఁ డయోనిజుఁ డైన యోగి
ధారుణీవిభుని బాంధవ మాచరించి
శ్రీవేంకటేశదర్శిత సుధాసార
భావితకుండంబు పరికించి కాంచి
కణికృష్ణు నిజశిష్యుగాఁగఁ జేపట్టి
గణుతింప ముదుసలిఁ గన్యఁగావించి

జగములు గొనియాడ జగదేకనాథుఁ
డగుఫణిశాయి లెమ్మని తోడుకొనుచు
ననుచరుం డైవచ్చు నాదేవు మగుడఁ
జనుదెంచి తొల్లింటి సరవిమైనుంచి
కువలయ ప్రాణంబు కుంభకోణంబు
భవనంబుగానున్న ఫణిరాజశయను
సేదదేరఁ గనుతిసేసి మెప్పించి
యాదేవుతో మాటలాడి యంతటను
వడినహంకృత విప్రవరులనాలుకలు
పెడతలఁ బట్టించి భీతు లైవారు
శరణుఁజొచ్చిన దివ్యసారస్వతంబుఁ
గరుణించి యాచోటఁ గందర్పగురుఁడు
కరమర్ధిఁ బరివృత్తకంధరుం డగుచు
గరిమతో నినుఁ బెక్కుగతుల వీక్షింపఁ
బావనచరిత నాభాగ్యంబువలన
దేవర యిటకు నేతెంచి నాసేయు
నగ్రపూజనము నీ వంగీకరించి
యగ్రజన్ముల దురహంకార మెడయ
ననఘుగోవిందుఁ బ్రత్యక్షంబు సేసి
కొని యాత్మలో నిడికొంటి యివ్వేళ

యెన్నశక్యము గాని యిట్టి నీమహిమ
నిన్నును వర్ణింపనేర్తునే యేను
భావించి చూచినఁ బరమయోగీంద్ర !
దేవరమహిమ శ్రీదేవుండె యెఱుఁగు
నని ప్రణామములు సమర్పింప మిగుల
మునిలోకవిభుఁడు ప్రమోదంబుతోడ
హరిపదాహ్వయుఁ డైన యాసోమయాజి
గరిమడగ్గఱఁ బిల్చి కౌఁగిటఁజేర్చి
ధరణి సర్వాభీష్టదాయకం బైన
వర మిచ్చి య వ్విప్రవరు నందునునిచి
ననుబోటి కలుషమానసుల వెండియును
దన కృపామృతముచే ధన్యులఁజేసి
కణికృష్ణుతోఁ గూడఁ గ్రమ్మఱ మౌని
గణయ తుఁ డై ధరగలుగు తీథ౯ ముల
శ్రీశైలరంగ విశేషభూవలయ
దేశంబు లందు వర్తింపుచునుండె
నిరవొందు భక్తిమై నీభక్తి సారు
చరితల నీధరాస్థలి నెవ్వఁ డేని
గృతియొనర్చిన యట్టి కృతకృత్యమతికి
హతబుద్ధిఁ బ్రతిదినం బెన్నువారలకు

వినిన వ్రాసినఁ జదివిన వారి కెపుడు
ననుపమదీఘా౯యు రైశ్వర్యతతులు
నకలంకశుభములు నభిమతార్థములు
సకలసిద్ధులుఁ గరస్థలినుండు ననుచు
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
నతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్త సంతతికి
నంకితంబుగను శ్రీహరిభక్త నికర
పంకజార్యమతాళ్ళపాకన్నయార్య
తనయ తిమ్మార్యనందనరత్నశుంభ
దనుపమశ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మమండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ
సదనావధూలబ్ధసరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాథ
కృత మైన పరమయోగివిలాసకృతిని
నతులితంబుగ ద్వితీయాశ్వాస మయ్యె.

___________
 1. బిన్నాణమగరాల
 2. నిన్ను విడనాడ
 3. యెడమోటి
 4. చేఁబట్టి
 5. గుందమాల
 6. నానంద మంది
 7. శేఖరుఁడు! అనుకంపమై కొన్ని యబ్దముల్ చనఁగ
 8. నేటులతిత్తి, నీటులడెత్తి.
 9. చిలుకొ పావురమొ
 10. పొడివడి.
 11. మున్నె పెన్నెఱుఁగక.
 12. నీగురుఁడు
 13. దిక్కులు వ్రక్క లయ్యె.
 14. చెయ్యు లప్పుడు
 15. బెల్లురక, గెల్లురక
 16. అప్పుడందఱు నుపా
 17. యొజ్జ యుర్విం బోయినంత, యోఝరు వీయబోనంత
 18. గట్టకట
 19. మాలినవాఁడ
 20. జంకలపుస్థు జంకలవుస్థు
 21. బంపిరి
 22. ఫళిఫళిని భళిభళిని