Jump to content

పరమయోగి విలాసము/అష్టమాశ్వాసము

వికీసోర్స్ నుండి

పరమయోగివిలాసము.

అష్టమాశ్వాసము.

హైమసరోజాంగ! యలమేలుమంగ!
జీమూతసంకాశ! శ్రీవేంకటేశ!
మునిశారికాసారముఖ్యభక్తాళి!
వనమాలి! యవధారు వరదానశీలి!
జలధికన్యాముఖ్యజలజలోచనలఁ
గలసి విచిత్రవైఖరులు దీపింప
సంతతోత్సవములు జరగ శ్రీరంగ
కాంతుఁ డెంతయును బ్రకాశించుచుండె
నలపరాంకుశముఖ్యు లగుయోగివరులు
పలికిన దివ్యప్రబంధరత్నములు
వినుచు వారల గారవింపుచు భక్త
జనపోషణైకదక్షత నుండె నంత
విమలమై యొప్పు కావేరిచెంగటను
రమణమై వీరనారాయణం బనఁగఁ

గ్రామ మొప్పును శ్రుతిగ్రామప్రవీణు
లామహానగరంబునందు నుండుదురు
వీరనారాయణవిభుఁ డనుపేరి
శౌరితనూజుఁ డచ్చటఁ బెన్నుమిగులు
నమృతసంకాశంబు లైనతోయములఁ
గొమరారుసరసి యాకుఱఁగట వెలయుఁ
బరమభాగవతులు పరతత్త్వవిదులు
కరుణాపయోనిధుల్ కమనీయమతులు
నగణితవేదవేదాంగపారగులు
జగతీసురుల్ చతుస్సాహస్రసంఖ్య
నలవడియుండుదు రందుఁ బెంపార
నలరుశొట్టెక్కులం బాకులంబునను
అనఘుఁ డీశ్వరభట్టుఁ డనువైష్ణవునకు
ననుపమశౌరి సేనాధినాయకుని
యాదిమమంత్రి గజాస్యునియంశ
మాదటం బొడమి యోగాసక్తుఁ డగచు
ననుపమ [1]గానవిద్యా [2]విచక్షణుఁడు
మునుకొని శ్రీనాథముని యనఁబరఁగి
తనసేయుగీతవిద్యకు నారదుండు
తనువున శుభ్రతం దాల్చియుండఁగను

అఖిలకళావేత్తయై సొంపు మిగిలి
యఖిలేశు యోగవిద్యాప్రభావమునఁ
దనరుధ్యానమునఁ బ్రత్యక్షంబ చేరి
కొని డెందమున నిడికొని యటమీఁద
నరయంగఁ బృశ్నిగర్భాంశ మైనట్టి
వరపుత్త్రు నీశ్వరాహ్వయమౌనిఁ గాంచె
నతఁడు దానును గూడి యష్టాంగయోగ
చతురకేళీవిలాసములఁ దేలింప
సారసమందిరాసహితుఁ డైనట్టి
నారాయణుండు ముందర వచ్చి నిల్చి
కనుఁగొని యొకకొంతకాలంబు జనఁగఁ
దనయుండు దాను నెంతయుఁ బ్రేమతోడ
నావీరనారాయణాధీశుఁ డైన
శ్రీవరుననుమతి క్షితిమీఁదఁ గలుగు
హరిమందిరంబులు నచటితీర్థములుఁ
గరమర్థి సేవింపఁగాఁ గోరి కదలి
దనుజారిసదనతీర్థముల మూడేసి
దినములు నిలిచి వర్తించుచు నచటఁ
జెలువొందుమూర్తుల సేవించికొనుచుఁ
జెలఁగి భూమికిఁ బ్రదక్షిణము గావించి

కనకసారసజాత కమలాప్తజాతఁ
గనుఁగొని తత్తటాగణసీమయందుఁ
బొలుచుగోవర్ధనపురి బాలకృష్ణు
జలజాక్షు దేవకిచంటిబిడ్డనిని
సేవించి భక్తి నాశ్రీకృష్ణుపూజఁ
గావించుకొని పెక్కుకాల మున్నంత
నరసఖుం డగువీరనారాయణేశ
హరి వారితో విరహము సైఁపలేక
కలలోన వచ్చి యక్కడ నున్న మౌని
తిలకుల ననుజూడఁ దిరిగి రమ్మనిన
రమణతో వీరనారాయణుపురికిఁ
గ్రమమున నయ్యోగిరాజు లేతెంచి
యసమాను లై యుండి రటమీఁద కురుక
వసియించి యుండెడి వైష్ణవోత్తములు
అటఁ గొంద ఱేతెంచి యలపరాంతకుని
పటుతరదివ్యప్రబంధంబులోనఁ
బదిపాట వినుపింపఁ బదివేలగతుల
ముదమంది యానాథముని వారిఁ జూచి
యమృతపానోత్కృష్టమైన యీకావ్య
మమర నంతయు మీర లానతీవలయు

నావుఁ డీకృతి యోగినాయకోత్తముఁడు
కావించి కడుఁ బెక్కుకాలంబు సనియెఁ
బరికింపఁగా నీప్రబధంబు ముక్తి
కరమైనకతన లోకములోన మునుపు
యంతయుం జదివి నీయంతమాత్రంబె
యెంతయు ముక్తికి నేగుచుండుదురు
కావున ఖిల మయ్యెఁ గడమవృత్తములు
రావయ్యె ననిన నరసి నాథమౌని
కురుకకు నరిగి యాకురుకేశుఁ గాంచి
వరభక్తి నిదురవోవనిచింతక్రింద
నెలకొని శఠకోపనిజమూర్తిఁ గాన
వలయునుపాయంబు వరుసఁ జితించి
యెలమితో మధురకవీంద్రుండు మున్ను
పలికిన దివ్యప్రబంధ మంతయును
దాలిమితోడ నాదటం బదిరెండు
వేలు చందమున నావృత్తి గావింప
దాకొన్న [3]కరుణలో దరువులు వెట్ట
వైకుంఠముననుండి వచ్చి శఠారి
యతనికిఁ బ్రత్యక్ష మయ్యె నావేళ
నతిభక్తి నిరతుఁడై యానాథమౌని

యానందబాష్పంబు లడర శఠారి
మౌనీంద్రపాదపద్మముల మై వ్రాలి
వినుతింప నయ్యోగివిభుఁడు మోదించి
యనఘ నీవలసినయర్థంబు వేఁడు
మన విని ముకుళితహస్తుఁడై నాథ
ముని పల్కె శఠకోపమునివర్యుతోడ
భవదీయదివ్యప్రబంధరత్నములు
నవముగా నీదాసునకుఁ బ్రసాదించి
యిది దొరఁకొని దేవ యే ప్రబంధములు
జదువువారలకు విచారింప నెంత
యాయువుం గలిగిన యన్నాళ్ళు జగతిఁ
బాయకయుండ నాపై ముక్తి గలుగ
వరముఁ బ్రసాదింపవలయు నావుడును
బరికింప నయ్యోగిపతి సంతసమున
జలజాక్షు నిజమానసంబున నిల్పి
పొలుపార ద్వయమంత్రపూతంబు గాఁగఁ
దనదుదివ్యప్రబంధంబు లన్నియును
నొనర సార్థమ్ముగా నుపదేశ మొసఁగి
యావరంబును నిచ్చి యనురాగ మెసఁగ
నావేళఁ దనయున్న యచటికి నరిగె

నానాథమునినాథుఁ డా చింతక్రింద
నానవ్యకావ్యంబు లామోద మెసఁగ
వెలసి తానును దదావృత్తి గావింప
నలవీరనారాయణాధీశుఁ డైన
శౌరి స్వప్నంబునఁ జనుదెంచి మనము
గూరిమితో జోడుగూడి యిద్దఱము
నావృత్తిసేయుద మటకు రమ్మనిన
వేవేగ మరలి యావీటికి నరిగి
యాదేవుతోఁగూడ నాప్రబంధములు
సాదరభావుఁడై యావృత్తిఁ జేసి
దివిజగానమునఁ దద్దివ్యప్రబంధ
నివహంబు తాళమానితముగాఁ బాడి
తనశిష్యవరుల కందఱకు నాకృతులు
నొనర నవ్విధమున నుపదేశ మొసఁగె
నటుగాన నీద్రావిడాగమాంతములు
పటుగతిఁ దద్వంశపాలురచేత
వినుచుండు నెపుడు శ్రీవేంకటేశ్వరుఁడు
నననేల వేయును నట నొక్కనాఁడు
మతివిశేషంబున మానవగాన
వతియ మానవగానవతియుఁ జర్చించి

తమగానవిద్యలతారతమ్యములు
గ్రమమేరుపడఁ జోళ కాంతుముందరికిఁ
జనుచెంచి గానంబు సవరింపునపుడు
విని సభవారెల్ల విబుధగానంబు
దెలియక మనుజప్రతేతిగానంబు
సలిపెడువాని మెచ్చకయున్నఁ గనలి
దేవగానము సేయుతెఱఁగు వేవేగ
భూవిభుతోడ నప్పుడు విన్నవించెఁ
దనవిద్య యెఱిఁగిన ధరలోన నాథ
ముని దక్కఁగాఁ బరమును లెఱుంగుదురె
యన విని భూనాథుఁ డానాథమౌని
వినయ మేర్పడఁగ రావించి తా నరిగి
యనుపమసింహాసనాసీనుఁ జేసి
యనియె వీరలపాటలందలిమేలు
దేవర విని వాదు దేర్పంగవలయు
నావుఁడు విని మౌనినాయకోత్తముఁడు
వెలయ వారలపాట విని దేవగీతి
సలిపెడి వాని మెచ్చఁగఁజేయ నపుడు
సామాజికులు కొంత సందేహపడిన
నామాట విని నవ్వి యానాథమౌని

యాయెడఁ బంచలోహం బైనయట్టి
వేయుతాళములు వేవేగఁ దెప్పించి
యాయెడ నొక్కమాట న్నితాళములు
వాయించు మనుచు నావాద మాలించి
తలకొని యొక్కొక్క తాళమిన్నేసి
పలములటంచుఁ జొప్పడఁగఁ [4]జెప్పుటయు
సరియైన నరుదంది సభ్యులతోడ
ధరణీవిభుండు పాదములకు నెరగి
పరమవస్తువుల సంభావింపఁ దనదు
పురమున కరుదెంచి పొలుపు దెప్పించి
తగ జయత్సేనాంశధారియై యనఘుఁ
డగుపుండరీకాక్షుఁ డనుశిష్యునకును
సరవి కాళాంశసంజాతుఁడై భక్తి
నరుదారు కురుకేశుఁ డనుశిష్యునకును
ద్వయము దివ్యప్రబంధములు శాస్త్రములు
నయకరయోగవిద్యయును సాంగముగ
నేపార నుపదేశ మిచ్చె నిచ్చుటయు
నాపుండరీకాక్షుఁ డలఘువైభవుఁడు
తనశిష్యసమితికిం దత్ప్రబంధములు
ననుపమగానవిద్యయుఁ బ్రసాదించి

యంతరసాంతరహారి యైనట్టి
కంతుతండ్రిని గోపికామనోహరుని
యన్నాథముని మది ధ్యానంబు సేయు
చున్న యత్తఱిఁ జోళుఁ డొకనాఁడు కూర్మి
తనపట్టమహిషులుఁ దాను నేతెంచి
నసవిల్తుఁగురువీరనారాయణేశు
సేవించి పోవ నాక్షితిపాలవరుని
భావించి గోపికాభామలతోడ
నరుదెంచినట్టి శ్రీహరి యంచుఁ దలఁపఁ
బరువడి నాభూమిపాలునివెంటఁ
బురముఁ జొచ్చినదాఁకఁ బోవ డెందముల
నరుదంద నిజశిష్యు లామౌనిఁ జేరి
దేవ! మీ రిటకు నేతెంచినకార్య
మేవెర వది యానతిమ్ము నావుండు
నావల్లకీకమలాననాసహితుఁ
డైవచ్చు శ్రీకృష్ణుఁ డని విచారించి
వచ్చితి నన శిష్యవరులు మోదించి
రచ్చోట వీడ్కొని యానాథమౌని
మరలి వేగమె నిజమందిరంబునకు
నరుదెంచి సకలశిష్యావృతుం డగుచు

నీరీతి నేడునూఱేఁడులు గడపి
కూరిమిఁ దనశిష్యకులము నీక్షించి
ప్రీతిగా శ్రీపుండరీకాక్షుఁ బిలిచి
యాతతద్రవిడవేదాంతశాస్త్రముల
వసుధ నెల్లెడలఁ బ్రవర్తింపు మనుచుఁ
గిసలయాధరుఁ గురుకేశతారాఖ్యుఁ
గనుఁగొని యోగమార్గము నీవు వూని
యనయ మేమరక తదాసక్తి నుండు
మని కుమారునిఁ జూచి యనియె వెండియును
ఘనతరుం డై నీదుగర్భంబునందు
సరవి సింహాసనాంశజుఁ డైనయట్టి
యురుతరయోగీంద్రుఁ డుదయింపఁగలఁడు
అతనికి యామునాహ్వయ మిడు మనుచు
నతిభక్తిఁ బుండరీకాక్షు సన్మౌని
నలకురుకేశతారాఖ్యునిం బిలిచి
యెలమి మీరిరువురు నిటమీఁదఁబొడము
తనపౌత్త్రునకుఁ గులోత్తమునకే మునుప
నొనర మీ కుపదేశ మొసఁగినయట్టి
యనుపమసకలరహస్యార్ధవితతి
యును యోగమును గూడ నుపదేశ మిండు

అని వారి నియమించి యట నొక్కనాఁడు
ననవిల్తుజనకు నన్నలినలోచనుని
సేవించి గానంబు సేయుచునున్న
నావేళ నిజపుత్త్రి యరిమురి వచ్చి
వినవె యిద్దఱు పెద్దవిండులఁ బూని
వనితతోఁ గూడ క్రేవల నొక్కక్రోఁతిఁ
బాయకుండఁగఁ దాట బంధించిపట్టి
యీయెడ మనయింటి కేతెంచి రనిన
నామానినియె సీత యాయిరువురును
రామసౌమిత్రు లారయ వానరంబె
హనుమంతుఁ డనుచు నిజావాసమునకుఁ
జనుదెంచి వారి నచ్చటఁ గనుంగొనక
వెదకి వారలు వేరి వేరి యటంచుఁ
గొదుకక యడుగుచుఁ గొంతద వ్వరిగి
యొకకొందఱను గాంచి యొక్కపూఁబోఁడి
యొకయిద్దఱును గ్రోఁతియును గూడి యింత
నిపుడు వచ్చిరి గానరే యన్న వార
లపు డెవ్వరిని గాన మన్న మోహించె
నదియెకారణముగ నటఁ బరంధామ
పదపట్టబద్ధుఁడై పరఁగె నమ్మౌని

యది విని తనుజాతుఁ డాశిష్యవరులు
గుదిగొన్నవగతోడ గుబ్బన వచ్చి
యానాథమునివిగ్రహంబు సేవించి
యానాథసుతునిచే నాశిష్యవరులు
మెలుపుమీఱఁగ బ్రహ్మమేధసంస్కార
మలవరింపించి పర్యాయంబుతోడ
నుచితకృత్యంబుల నొనరఁ జేయించి
రచలుఁడై కురుకేశుఁ డనుశిష్యుఁ డంత
గురుని సంస్కారంబు గొలిపినచోట
నిరవొంద నొకచిన్నయిల్లు గావించి
బాగుగా గురుపాదపద్మముల్ తలఁచి
యోగవిద్యాభ్యాస మొనరింపుచుండె
నాపుండరీకాక్షుఁ డానాథయోగి
శ్రీపాద మాశ్రయించినవారి నెల్ల
నొనఁ గూర్చుకొని దర్శనోద్ధరణంబు
నొనరింపుచుండె సర్వోపచారములు
పనుపడఁజేయఁ బాల్పడి కుముదాక్షుఁ
డనుశూరియంశంబునం దుదయించి
శ్రీరామమిశ్రాఖ్యఁ జెలఁగుశిష్యునకు
గారవం బెసఁగ నాగమరహస్వములు

కృపచేసి యటమీఁద నీశ్వరమునికి
సపరిమితౌదార్యుఁ డగుకుమారకుఁడు
యామునేయుం డనునతఁ డుదయించు
నామహాత్మునకు నేఁ ననువొంద నీకు
సవరించినట్టి యా సర్వార్థములును
వివరంబుగా నీవు వేసట లేక
యనువర్తనము సేసియైన నీవొసఁగు
మన విని రామమిశ్రాహ్వయుం డంత
నలయీశ్వరమునికి నాత్మజుం డెపుడు
గలుగునో యని కోరికలు గోరుకొనుచుఁ
దనగురుఁడొసఁగిన తత్త్వరహస్య
మనుభవింపుచు నుండె ననురక్తితోడ
నటమీఁద సింహముఖాంశసంభవుఁడు
పటుసత్త్వమయుఁడు శ్రీపతి కృపాయుతుఁడు
నీశ్వరముని కుదయించి తా శాశ్వ
తైశ్వర్యనంతుఁడై యామునాహ్వయము
నొనరంగ ధయించి యుపనీతుఁ డగుచు
జనకుండు వేదంబు చదువంగ నిడినఁ
జదువుచుం దొలినాఁడు చదివించుచదువె
చదువుమటన్న నాచార్యు నవ్వుచును

జదువక యింటికిం జనుదేర జనకుఁ
డదలించి చదువలేదా యని యనిన
నిన్నఁ జెప్పినయదే నేఁడుఁ జెప్పెడిని
యన్న! నే నటఁ బోవ నన్న నాతండ్రి!
అట్లైన నిన్న నీ కాతండు చెప్పి
నట్టివేదము నచ్చునా చెప్పు మనినఁ
గ్రన్నన నింతయుం గడమలేకుండఁ
జెన్నార నంతయుఁ జెప్పిఁ చెప్పుటయు
విని తండ్రి మిక్కిలి వెఱఁ గందుకొనుచుఁ
దనయుని కఖిలవేదములుఁ జెప్పించి
పరిణయం బొనరించి పటుతరబుద్ధి
సరవి శాస్త్రంబులు చదివింపవలసి
కోరి మహాభాష్యగురుఁ డనుపేరి
సూరిసన్నిధిఁ గూర్మి చూలి శాస్త్రములు
చదువుచుండఁగఁ జోళజనవరేణ్యునకు
విదితశాస్త్రంబులు వివరించుకొనుచు
హితుఁడైన నిజపురోహితుఁడైన సూరి
ధృతి తనతోడ వాదింపంగలేక
యున్న విద్వాంసుల నొండొండఁ బట్టి
పన్నుఁ గైకొనుచుఁ దద్భాష్యదేశికుని

పైపన్నుఁ దెమ్మని భటులచే బిరుద
దీపితం బైనపత్రికఁ బంఫుటయును
నది చూచుకొనుచు మహాభాష్యగురుఁడు
కిదుకుచు నెంతయు ఖిన్నుఁడైయుండె
నాయెడం జనుదెంచి యామునసూరి
యాయనచే పత్ర మలవోకఁ జూచి
పెలుచ గోపించి యాబిరుదపత్రంబు
బలిమిఁ గైకొని చించి పాఱంగవైచి
తనదైనబిరుదుపత్రమున లిఖించి
పనివడి వారిచేఁ బంపెఁ బంపుటయు
నది చూచి కోపించి యాపురోహితుఁడు
ముదమేది చోళునిముందరం బెట్టి
యామాట లెఱిఁగింప నరుదంది రాజు
యామునేయుని వేగ నటకు రప్పించి
యమరంగ సప్తపూర్వాద్రులనడుమ
హిమసేతువులలోన నిద్దరలోన
వదలనికడకతో వాదించి నన్ను
నెదిరెడువిద్వాంసుఁ డెవ్వఁడు లేఁడు
అనునర్థ మొదవఁ బత్రాలంబనంబు
జననాథు వాకిట సవరించి యపుడు

హితమతి హితపురోహితయుతుం డైన
క్షితినాథుకడకు వేంచేసినఁ జూచి
యీవిధి బిరుదంబు లెన్నినవాఁడ
వీవేళఁ దనపురోహితునితో నీవు
వాదించి గెలువంగవలయు నావుఁడును
మోదించియున్న యామునుజూచి నృపతి
యా వేళ విద్వాంసు లైనసభ్యులను
రావించి పట్టపురాణితోఁ గూడ
నరుదార సింహాసనారూఢుఁ డగుచు
వరుస నాయిరువుర వాదింపుఁ డనిన
యామునేయుని జూచి యాపట్టమహిషి
యామహీపతితోడ ననియే నీఘనుఁడు
గెలుచు నవశ్యంబు గెలువకయున్న
గలయ నీనగరికుక్కల కెల్ల వండి
పెట్టెద ననిన నాబింబోష్ఠిఁ జూచి
గట్టిగా ననియె భూకాంతుఁ డవ్వేళ
నీమెయిఁ దనపురోహితుఁ డోడెనేని
సామిత్తు నాదురాజ్యములోన నీకు
నని ప్రతిజ్ఞలు చేసి రాపురోహితుఁడు
మునుకొని యీశ్వరమునిసూనుఁ బలికె

నగపడి నీవు గావన్నవి యెల్ల
నగునని నిలిపెద నదియునుంగాక
యావల నీ వగునన్నవి యెల్ల
కావని నిలుపంగఁగలవాఁడ నిపుడు
కాకున్న నీపాదుకను దననోరు
వేకొని వైపు మీవిభుఁడు వీక్షింప
నన విని తప్పకు మని యామునేయుఁ
డనియె నిన్నునుగన్నయంబ యవంధ్య
యెన్నఁ బతివ్రత యీపట్టమహిషి
పన్నిచూచిన సార్వభౌముఁ డీరాజు
అని యుత్తరము లిందు కనువొందఁ జెప్పు
మని వాని నోడించి యంతటం బోక
యలఘుశాస్త్రోక్తుల నాపురోహితుని
గెలిచిన మెచ్చి యాక్షితినాథుదేవి
యలయామునేయుఁ జయ్యన నెత్తుకొనుచు
వలనొప్ప నన్నేల వచ్చితో తండ్రి!
యనియె నాకతమున నాళువందారు
లనుపేరు కలిగె నయ్యామునాఢ్యునకు
నాపురోహితుఁ జూచి యామునాచార్యుఁ
డేపార గెలిచితి నిన్ను నే నిపుడు

పట్టి నీనోరు నాపాదుకచేతఁ
గొట్టుమంటివి నిన్నుఁ గొట్ట నేమిటికి
నినుఁ గాచి మెచ్చితి నృపపురోహితుఁడ
వని యన్న సభవార లగ్గించి రతని
నామహీపతి కడు నచ్చెరు వంది
యామునాచార్యున కవనతుం డగుచుఁ
దనపురోహితుఁ దెచ్చి తచ్ఛిష్యుఁ గాఁగ
నొనరించి యెంతయు నుపచరింపుచును
మును తనదేవి కిమ్ముల నిత్తు ననుచుఁ
దనసీమలోన నర్ధము పంచి యొసఁగ
నాదేవి తనసీమ యామునేయునకు
నాదట నిచ్చె నెయ్యమునఁ బూజించి
యనిపినం గ్రమ్మఱ యామునేయుండు
చనుదెంచి నిజనివాసంబున నిలిచి
యాలేమ యొసఁగినయర్ధరాజ్యంబు
నేలుచు నుండె ననేకవైఖరుల
నీరీతి నంతయు నెఱిఁగి మోదించి
శ్రీరామమిశ్రుఁ డంచితభక్తితోడ
యామునేయునకు రహస్యార్థవితతి
తా ముపదేశింపఁ దలఁచి వేంచేసి

యామహైశ్యరంబునందుఁ బెంపొందు
యామునార్యునికొలు వబ్బకయున్న
నీతనిం బొడఁగాన నెద్ది యుపాయ
మీతఱి నని తనయిచ్చ నూహించి
యతనిపాచకులతో యామునేయునకు
నితవైనశాకంబు లెవ్వి నావుండు
నలరి మిక్కిలిప్రియం బైనది ముండ్ల
ములిచితకూర నామోదించి యతఁడు
చని వారిచేతి కాశాకంబు వెదకి
దినదినంబును గోసి తెచ్చి యిచ్చుచును
నెమ్మి నీగతి నాఱునెలలు వాటించి
కిమ్ముల మఱియునుం గేలి లేకున్న
నాకు నాగురునియానతి ద్రోయరాదు
చేకొని యిఁక నేమిసేయుదు ననుచు
ననయంబుఁ దాఁ దెచ్చునట్టిశాకంబు
కొనిరాకయుండె నెక్కొని యొక్కనాఁడు
యామునేయాచార్యుఁ డట యారగింప
నామనోహరశాక మపుడు లేకున్న
లాలితం బైన యలర్కశాకంబు
నేల కావింప రియ్యెడ నన్న వారు

ననిశంబు నొకవృద్ధుఁ డగువైష్ణవుండు
కొనివచ్చు నేఁడు దా కొనిరాకపోయె
సరవిమై నాఱుమాసములనుండియును
గరమర్థిఁ దెచ్చు నీగతి శాక మనిన
నతఁ డెవ్వఁ డేటికి నరుదెంచె నతని
గుతుకంబుతోఁ దోడుకొని రండు రేపు
అన విని వా రేగి యారామమిశ్రుఁ
గని మఱునాఁడు వేగంబె తోతేరఁ
బదముల కెరఁగి యాపరమభాగవతు
మది యిగురొత్తఁ బ్రేమమున నిట్లనియె
నీమెయి దేవర యిటకు వేంచేయు
టేమికారణము నా కెఱిఁగింపు మనిన
ననువొంద మీవార లర్థనిక్షేప
మునిచిరి నాయొద్ద నున్నది నీకుఁ
దెలిపెద నని వచ్చితిని గాని యొండు
వలనుమీఱఁగఁ గోరి వచ్చుట లేదు
అనిన నామునివర్యుఁ డానతి మ్మనిన
దినదినక్రమమునఁ దేటపడంగ
నన్నియు శ్రీగీత లానతిచ్చుటయుఁ
జెన్నార విని మదిఁ జిగురించుకూర్మి

నే విష్ణుఁ బొందుట కెద్ది యుపాయ
మీవేళ మీ రానతిండు నావుడును
బలుమఱుఁ బొంగి ప్రపత్తిమార్గంబుఁ
దెలిపిన యామునదేశికుం డపుడు
పరమవిరక్తి చొప్పడె; రామమిశ్ర
గురుఁడు యామును దోడుకొని సంతసమున
శ్రీరంగమునకు వేంచేసి యాదేవు
శ్రీరంగనాథుని సేవింపఁజేసి
యీమూర్తి మీతాత లిడిననిక్షేప
మేమి యాగుఱుతుగా నెఱుఁగుకొ మ్మనుచు
నపుడు ద్వయంబు రహస్యార్థములను
నుపదేశ మొసఁగె నయ్యురుసత్త్వవిధియు
నంత సన్యాసియై యచ్చట రంగ
కాంతుని హృదయసంగతుని గావించి
సిద్ధార్థుఁడై జ్ఞాససిద్ధియు నాత్మ
సిద్ధియు నీశ్వరసిద్ధియు ననఁగఁ
జెలువారుకృతులను శ్రీహరిస్తోత్ర
ములును శ్రీగీతార్థములసంగ్రహంబు
భూగురునుతమైన పురుషనిర్ణయము
నాగమప్రమితియు ననుప్రబంధములు

వివరించి కుముదాక్షవిమలాంశ మగుచు
నరయ మహాపూర్ణుఁ డగుశిష్యవరుఁడు
నలశంఖకర్ణునియంశమై మిగులఁ
జెలువార రంగికుశీలవాఖ్యుండు
నాయమానవమూర్తియై హస్తిశైల
నాయకుతోడ నెంతయు మాటలాడు
స్థిరభక్తినిరతుండు తిరుకుచ్చినంబి
కరయంగ నలవామనాంశ మనంగఁ
జెలువారుచుండు గోష్ఠీపురీశుఁడును
మొదలైన నిజశిష్యముఖుల కందఱకు
ముదమున సర్వార్థములుఁ బ్రసాదించి
యలవివాఱినయట్టి యఖిలశాస్త్రములుఁ
జెలఁగి వ్యాఖ్యానంబు సేయుచున్నెడల
నలరామమిశ్రుఁ డాయామునార్యునకుఁ
బలికె నేకతమునఁ బ్రమదంబుతోడ
మును నాథమునిశిష్యముఖుల కందఱకు
ననువొంద సకలరహస్యార్థములును
నుపదేశమొనరించి యోగరహస్య
మపు డిచ్చె కురుభావ లప్పనిం బిలిచి
యాదివ్యయోగవిద్యారహస్యంబు

లే దెవ్వరికి నొకలేశమంతయును
గరమర్థి నతఁడు గంగాహరనగరి
నిరుపమతద్యోగనిరతి నున్నాఁడు
అది నీవు సాధింపు మటఁ బోయి యనిన
ముదమంది యామునమునివేగ వెడలి
యొకజీర్ణవసతిలో యోగసమాధి
నకలంకగతినున్న యయ్యోగికడకుఁ
జని యామునీంద్రునిశ్చలయోగభావ
మునకు విఘ్నము సేయ మొగమోడి యంతఁ
దసశిష్యులును తాను దద్భాగమునకు
వెనుకటిదెస మౌనవృత్తి నుండుటయు
గోరియిప్పుడెచొట్టెకులజాతు లైన
వారెవ్వరైనఁ గ్రేవల నున్నవారె
యనుచు నయ్యోగీంద్రుఁ డానతి యొసఁగ
విని యామునేయుండు వేవేగ వచ్చి
వినతుఁడై హస్తారవిందముల్ మోడ్చి
యనియె నచ్చెరు వంది యాయోగితోడఁ
బనిఁబూని మఱుగునం బని వినియున్న
నను నీవు గను టెట్లు నా కానతీయు
మనిన నయ్యోగీంద్రుఁ డనియె నాతనికిఁ

గనుఁగవ బాష్పాంబుకణములు దొరఁగ
సిరికూర్మిఁ గౌఁగిటఁ జేర్చుటకంటెఁ
బరమభోగ్యముగ నాపయిఁ గరుణించి
నాసేయు యోగమునకుఁ జిక్కియున్న
శ్రీసతీశుఁడు నేఁడు చెలరేగి నిక్కి
మూపులపైఁ గరముల నూఁది వెనుక
చూపుచునుండంగఁ జూచి యే నిప్పుఁ
డరయంగ నీకృప నలనాథమౌని
వరకులమునఁ గల్గువారిపైఁ గాని
లేదని తెలిసి పిల్చితినన్న మిగుల
మోదించి యామునముని సాగి మ్రొక్కి
యిరవొంద దేవర యీయోగవిద్య
సరవిమై నాకుఁ బ్రసాదింపు మనిన
నురుతరం బైన యాయోగంబు తనదు
చరమకాలమునఁ బ్రసాదింతు ననుచు
నాకాల మావేళ యాముహూర్తంబు
చేకొని యొకచిన్నచీటిపై వ్రాసి
యిచ్చి నీ వావేళ కేతెంచితేని
యిచ్చెదఁ గ్రమమున నీయోగవిద్య
యని పనుపుటయును యామునేయుండు

చని రంగవిభునియాస్థానంబులోన
గొలువున్నతఱి శఠకోపప్రబంధ
మలనాథమునివంశుఁ డైనగాయకుఁడు
ఒగి వినిపింపుచునుండినయంత
నగరేశు శ్రీపద్మనాభుని వేగ
సేవింపుఁ డని తమ్ము చేజేతఁ జూపి
యా వేళ బలుమాఱు నభినయించుటయు
నది గని రంగేశుననుమతి యనుచు
మదిలోన యామునమౌని చింతించి
వేవేగ నాదేవువీటికి నరిగి
సేవించి యచట వేంచేసియున్నపుడు
తమకు నాకురు కేశు తాతముందరను
బ్రమదంబుతో నిచ్చుపత్రికఁ జూపి
యామౌని ముక్తికి నరిగెడువేళ
యామాసమును నాడియైన [5]బొంకుచును
గటకటా యొకపుష్పకము గల్గెనేని
యటపోవవచ్చుఁగా యని యట్ల వగచి
తనశిష్యులును దాను దడయక మగుడి
చనుదెంచి రంగవాసంబున నిల్చి
శ్రీవేంకటాద్రిగోష్ఠీపురస్థలిని

యీవిధి నొప్పు సర్వేశుధామముల
స్థాపితపటుజయస్తంభంబు లనఁగ
నేపారుశిష్యుల సిద్ధవైభవులఁ
ద్రిదశవందితుఁడైన తిరుమలనంబి
మొదలైన శిష్యుల మునుకొనినిల్పి
యిటమీఁదఁ దమమతం బీడేర్చునట్టి
పటుతరశిష్యుఁ డిప్పాటునం గల్గు
ననుచు వేదాంతవిద్యాలోలుఁ డగుచు
ఘనతరకీర్తిసంకలితుఁడై యుండెఁ
దిలకించుతుండీరదేశంబునందుఁ .
బొలుపుమించిన మహాపూదూ రనంగ
రాజిల్లు నగ్రహారంబు ననాగ
రాజాంశజుఁడు లోకరక్షణశాలి
భూసురకులజాతభూషణం బైన
నాసురి కేశవాహ్వయవైష్ణవునకు
సలలితచిత్రమాసంబున నార్ద్ర
జలజాప్తకోటితేజము నగ్గలించి
జనియించి రామానుజఖ్యాతిఁ దాల్చి
పెనుపొందఁ గ్రమమునం బెరుఁగుచు నుండె
జనకుండు పంచసంస్కారముల్ సేసి

ననుపార నుపనయనంబు నొనర్చి
యఖిలవేదాధ్యక్షుఁ డైననందనుని
నఖిలాగమంబులు నటఁ జదివించి
వరవైభవముల వివాహంబు సేసి
పరమానురాగసంభరితుఁడై యుండె
నామహాయోగి రామానుజార్యుండు
తా మహాశాస్త్రవిద్యలు నెఱింగియును
దేవకీసుతుఁడు సాందీపుని యొద్ద
వేవచ్చి తాఁ జదివినరీతి నంతఁ
గాంచికినరిగి యాకరిరాజవరదుఁ
గాంచనాంబరుని శ్రీకరుని సేవించి
వరుస నచ్చో యాదవప్రకాశాఖ్యఁ
బరఁగిన సన్యాసిపజ్జ నిచ్చలును
విదితమై యొప్పెడు వేదాంతవిద్య
చదువుచో యాదవసంయమీశ్వరుఁడు
అలఘుశిష్యులకు వేదాంతశాస్త్రంబు
చెలఁగి వ్యాఖ్యానంబు సేయుచు నుండె
నాతఱి నద్వైత మనువదించుటయు
ద్వైతయుక్తుల వానిఁ దరలఁగొట్టుచును
అతనితోఁ జదివినయట్లుండుఁ దుదకు

నతనికిఁ బ్రతివాది యగుచు వాదించు
నొనర నాసంయమియొద్ద నీరీతిఁ
బనివడి వేదాంతపఠన సేయంగ
నిరతంబు గాంచిలో నెలకొనియున్న
పరమభాగవతులు భక్తిమీఱంగ
శ్రీరంగమునను వేంచేసి పల్మాఱు
నారూఢి రామానుజార్యుఁ డొక్కరుఁడు
ననిశంబు యాదవుం డనుయతియొద్ద
ననువొంద వేదాంత మధికరింపుచును
అతని యద్వైతవాక్యంబులనెల్ల
నతులితద్వైతవాక్యముల గొట్టుచును
అచ్చట నున్నవాఁ డన విని పొంగి
మచ్చిక యామునమౌనిశేఖరుఁడు
నతనిఁ గటాక్షింప నాత్మఁ జింతించి
ప్రతిలేని శిష్యపారంబు సేవింపఁ
గాంచి కేతెంచి యక్కడనున్న శిష్యుఁ
గాంచీశుతోఁగూడఁ గదిసి మాటాడు
నయవేది తిరుకచ్చినంబినిం బిలిచి
దయతోడ నతనికైదండ గాఁబట్టి
దేవనాథుని మహాదేవుని నంత
సేవించి యటఁ బ్రదక్షిణము వచ్చుచును

వలనొప్ప శేషనివాస వల్మీక
మలవడ సేవించి యాచెంత నిలిచి
తనశిష్యవరులును దాను యాదవుఁడు
చనుదెంచి యాహస్తిశైలవాసునకు
వల చుట్టి రాఁగ యాళ్వందారు వారిఁ
దెలియంగఁ గన్గొని తిరుకచ్చినంబి
కని వారిలోన లక్షణసూరిపేరి
ఘనుఁ డిటువంటియాకారంబువాఁడు
అన విని యట్ల వారందఱకంటె
ఘనమైనవాఁడు చక్కనివాఁడు మిగుల
నించుబాహువులవాఁ డెఱ్ఱనివాఁడు
కాంచనాంబరుభుక్తి గలిగినవాఁడు
నలవాఁడె యనఁ గాంచి యామునాచార్యుఁ
డలలక్షణాఖ్యు దయాదృష్టిఁ జూచి
తావకదర్శనోద్దారకుం డితఁడు
గావలయును దేవ కరిరాజవరద
యనుచుఁ బ్రార్థించి యాహస్తిశైలేంద్రు
మనసిజగురుని బ్రేమమున సేవించి
తిరముగా మది మెచ్చి తిరుకచ్చినంబి
కరిరాజవరదు కైంకర్యార్థ మచట

నునిచి శిష్యులతోడ నొనఁగూడి మగుడి
చనియె శ్రీరంగవాసమునకు నంత
నాదేవుఁ డఖిలశిష్యావృతుం డగుచు
సాదరుం డగుచు వ్యాఖ్యానంబు సేయ
నాతఱిఁ జోళనాయకుని హితాత్మ
జాతుని బ్రహ్మరాక్షసుఁ డావహింప
మంత్రవాదులు మహామహులు నేతెంచి
మంత్రయంత్రములఁ బల్మాఱు గాసించి
విడిపింపలేక నివ్వెఱపడి పాట్లఁ
బడి తుది యేమిటం బనికిరాకున్నఁ
దొలఁగిన చోళనాథుఁడు విచారించి
యిల మహామాంత్రికు లెట లేరె యనిన
నఖిలవేదాంతవిన్యాసి సన్యాసి
నిఖిలప్రశస్తుండు నిర్జితేంద్రియుఁడు
నతులమాంత్రికుఁ డైనయాదవాహ్వయుఁడు
సతతంబు గాంచికాస్థలి నుండు ననిన
విని రాజు పిలిపింప వేవేగఁ గదలి
తనశిష్యముఖ్యు లెంతయుఁ జేరి కొల్వ
యాదవుం డాలక్ష్మణార్యుతోఁ గూడి
యాదటం జోళనాయకపురంబునకుఁ

జని మున్ను బ్రహ్మరాక్షసుఁ డావహిలిన
జననాథసుతునిపజ్జకు నేగుదెంచి
కడగి ధిక్కారహుంకారంబు లెసఁగఁ
దడయక యుగ్రమంత్రము జపియింప
రాజనందనగత రాక్షసుం డప్పు
డోజ దప్పక యింతయును లెక్కఁగొనక
తనరెండుకాళ్ళు యాదవుదిక్కు చాఁచి
యనియె నీకిట్టి యహంకృతి యేల
నిను నెఱుంగుదు నోరి! నీవు జపించు
మను వెఱుంగుదు నోరి మామకంబైన
జననంబు నెఱుఁగుదు చల మేటి కిపుడు
వనరక తలగు మివ్వల కుండ కనుచు
నాతఱి నీవు మహామాంత్రికుండ
వైతేని దొంటి నీదైనపుట్టువును
వినుపింపు తానైన విశదంబు గాఁగఁ
దనపూర్వజన్మమంతయు నెఱింగింతు
తొలఁగు నీచేతఁ బోదునె పట్టిచలము
వలవ దిచ్చో నుండవలదు పొమ్మనిన
అన విని యాదవుం డనువందివిప్ర
మనుజాసననునితోడ మఱియు నిట్లనియె

నైన నీదగు తనదైన జన్మంబు
పూని వచింప నీపోవుచందంబు
వినుపింపు మనిన నవ్వేళ యాదవుని
గనుఁగొని పలికె రాక్షసుఁ డేపు మిగిలి
యోరి యాదవ విను మొగి నీవు మునుప
ఆరయ మధురాంతరాగ్రహారంబు
కడ నొప్పు ఘనతటాకముకట్టమీఁద
నుడుమవై యుండుదు వొకపుట్టలోన
నారీతి నుండి సర్వావనీస్థలుల
వారును బరుషగా వచ్చునత్తఱిని
శ్రీవేంకటేశ్వరు సేవింపవచ్చు
శ్రీవైష్ణవాళి భుజింప నచ్చోటఁ
జిందినమెదుకులు చెలువార మొసఁగి
తందులకతన నీ వందితి విట్టి
జననంబు తనపూర్వజన్మంబు వినుము
మునుపు దాఁ గ్రతువు ప్రేముడిఁ జేయఁ బూని
పటుమంత్రతంత్రలోపము సేయ వచ్చె
నిటువంటిపుట్టు విం కేమిటం బోను
ఇల నెల్ల నీడేర్ప నేతెంచినట్టి
యలమహాత్ముండు శేషావతారుండు

ననుపముం డైనరామానుజార్యుండు
తను నేగు మనిన నీధరణీశసుతుని
విడచి యీపుట్టువు విడిచి ముక్తికిని
నడచెద నంచు గ్రన్నన లేచి వచ్చి
యాదట రామానుజాచార్యవర్యు
పాదపద్మములపైఁ బ్రణమిల్లి పొగడఁ
గని యాదవుండు భూకాంతుండు నట్ల
యనుమని వేఁడ రామానుజార్యుండు
భూవిభుసుతుఁ బాసి పొమ్ము నీ వట్ల
పోవు నందులకు నిప్పుడు గుఱు తొకటి
యెనయంగ నిందఱ కెఱుఁగంగఁ జూపి
చనుమన్న బ్రహ్మరాక్షసుఁడు మోదించి
యాయున్న రావి యాయతశాఖ విఱిచి
పోయెద నని చెప్పి భూపాలసుతుని
వదలి యాచెంత నశ్వత్థంబునందుఁ
బొదలిన యొకమహాద్భుతశాఖ విఱిచి
రామానుజుని పరిగ్రహవిశేషమునఁ
దా ముక్తిపదము నిత్తఱిఁ బ్రవేశింతు
నని చెప్పి యరిగిన నాలక్ష్మణార్యుఁ
గని వెఱఁ గంది యాకాంతుఁ డెంతయును

ననయంబు వినుతించి యాదవునెదుట
వినుతవస్తువుల బల్విడిఁ బూజ సేయ
రామానుజుండు తద్రమ్యవస్తువులు
తాము గైకొనక యాదవునకు నిచ్చి
జగతీశు వీడ్కొని సంయమితోడ
మగుడఁ గాంచికి వచ్చి మఱియొకనాఁడు
అనురాగమున లక్ష్మణార్యుండు చెలఁగి
యనువొందఁగాఁ దల యంటుచునుండు
యాదవుం డుప్పొంగి యఖిలశిష్యులకు
నాదట వేదవాక్యం బెన్ని యొకటి
జలజనికాశలోచనయుగళంబు
గలిగినయట్టి శ్రీకామినీవిభుని
వనచరాసనవర్ణవలితాక్షయుక్తుఁ
డనుచు నీరీతి నపార్థంబుఁ జెప్ప
విని యది చెవులకు వేఁడియైయున్న
ననయంబు వగచు రామానుజార్యునకుఁ
గన్నుల బాష్పము ల్గ్రమ్మ నం దొక్క
కన్నీటిబొట్టు దిగ్గన జాఱి వచ్చి
యప్పు డాయతితొడ యందుఁ బైఁ జింది
నిప్పు సోఁకినరీతి నెరయంగ నులికి

తలయంటుచున్న యాతనియాననంబు
తలయెత్తి చూచి యాదవుఁడు కోపించి
తనయొద్దఁ జదువ కింతటినుండి నీవు
చను మెటకైన నిచ్చట నుండవలవ
దన విని రామానుజార్యుఁ డవ్వేళ
మనమునఁ జెలఁగి దుర్మద మింక వినఁగ
వలదు న న్నీసహవాసంబు సేయ
వల దని మాన్పె నీవరదుండ యనుచుఁ
దనయింటి కరిగి మాతకు నివ్విధంబు
వినుపింపఁ దనయుని వీక్షించి పలికెఁ
జాలు ముందర నీవు చదివినచదువె
యాలస్య ముడిగి శ్రీహస్తిగిరీంద్ర
దానవాంతకున కెంతయుఁ బరమాప్తుఁ
డైన సర్వోత్తము నఖిలపావనుని
దేవతాసము నలతిరుకచ్చినంబి
సేవించి యానతిచ్చినవాక్యసరణి
నలవరింపుచునుండు మనిన డెందమునఁ
దిలకింపుచును వచ్చి తిరుకచ్చినంబిఁ
గని మ్రొక్క తనవచ్చుక్రమము తెల్లముగ
వినిపించి నా కెద్ది వెఱ వని యనినఁ

దెలిసి యెంతయు మెచ్చి తిరుకచ్చినంబి
యలలక్ష్మణార్యున కనియె నింపొదవ
ననిశంబు దేవరాయనికి నీచేర్వ
మొనయుశాలాకూపమున సలిలములు
ముదమున నర్చనంబున కొకబిందె
డొదవ దెమ్మనుచు నియోగించుటయును
ననయంబు చెలఁగి తోయంబు కైంకర్య
మొనరింపుచుండె శ్రీయుతుఁడు నాకరణి
నాయాదవుని బాసి హస్తిశైలేంద్రు
తోయకైంకర్యంబుఁ దొడరిసేయుచును
ననురక్తి నున్నవాఁ డని విని మదిని
ననయంబు రాగిల్లి యామునేయండు
పొదరి శిష్యుని మహాపూర్ణునిం బిలిచి
సదయుఁడై కాంచికాస్థలి కేగి నీవు
నచ్చటి రామానుజార్యవర్యునకు
మచ్చిక నీస్తవమణి వినుపింపు
మతఁ డెందునిల్చిన నచ్చోట నిలిచి
సతతంబు నీ విది చదువుమటంచుఁ
బనిచిన చని గురుపదపద్మములకు
వినతుఁడై కాంచికి వేవేగ వచ్చి

వరదరాజున కనవరత మంబువులు
కరమర్థితోడ లక్ష్మణదేశికుండు
కొనివచ్చుత్రోవ నెక్కొని యామునేయ
ముని వచించినస్తోత్రములు వచించుటయు
నది విని రామానుజార్యుఁ డెంతయును
ముద మొంది యమ్మహాత్మునకు వందనము
సవరించి యమ్మహాస్తవమణి యిట్లు
సవరించినట్టి యాచార్యుఁ డెవ్వాఁడు
అన విని యపుడు మహాపూర్ణుఁ డతని
కనియె నీనుతి యామునార్యశేఖరుఁడ
యొనరించె నమ్మహాయోగిపుంగవుఁడు
మునుకొని శ్రీరంగమున నున్నవాఁడు
అనిన రామానుజుఁ డనియె నన్నిప్పు
డనఘాత్మ యాయామునాచార్యవర్యు
పాదంబు లాశ్రయింపంగఁజేసెదవె
నీదయ నామీఁద నిగుడించి యిప్పు
డనుటయు మెచ్చి మహాపూర్ణుఁ డట్ల
యొనరింతు రమ్మని యొడఁగూడఁ బలికి
యారామ సోదరు నపుడు దోకొనుచు
శ్రీరంగమునకు వేంచేసి కావేరి

దరి చేరఁబోయి యత్తఱిఁ బురిలోన
నరుదైనకలకలం బైన నాలించి
యరుదెంచువారల నరసిన లోక
గురుఁడైన యొకముని గురుశేఖరుండు
చనియె వైకుంఠవాసమునకు ననిన
విని మూర్ఛఁ జెంది యుర్వీస్థలి వ్రాలి
పొరలుచుండిరి మహాపూర్ణుఁ డవ్వేళ్ళ
దిర మొందు ధీరతఁ దెలిసి పల్మాఱు
భూమిపై నందంద పొరలుచునున్న
రామానుజార్యు చేరఁగఁ బోయి తెలిపి
యతనిదోకొని వేగ నరిగి కావేరి
సుతటంబునం గడు సొంపారుచున్న
యామునాచార్యుని యమలవిగ్రహము
వేమఱు సేవించి వెఱఁగందుచున్న
మునుప నాయామునమునిలోకనాథుఁ
డనువొందఁ బట్టిన వ్యాఖ్యానముద్ర
యడలకు మిఁక సకలార్థముల్ నీకు
నెడపక యీవేళ నిచ్చితి మనిన
ననువున విడువ రామానుజార్యుండు
కని వెండియును నమస్కారంబుఁ జేసి

యామునాచార్యుపాదాబ్జముల్ చేరి
యామౌనిచే సకలార్థంబుఁ దెలియ
వచ్చిన నీగురువరుఁ దను నిట్లు
చెచ్చెర నెడసేసి శ్రీరంగవిభుఁడు
ప్రల్లదంబున సిగ్గుపడక యే నింకఁ
జెల్లఁబో యేమని సేవింతు ననుచుఁ
బంచిన వగలఁ జొప్పడుచు నాపెరియ
నంబికి మ్రొక్కి విన్నపముఁ గావించి
శ్రీరంగనాథుని సేవింపకపుడు
భోరునఁ గాంచికిఁ బోయి యచ్చోట
మనసిజగురునకు మచ్చిక మునుప
నొనరించి కైంకర్య మొనరింపుచుండె
నలవడ నిఁక నిశ్చితార్థంబు లెల్లఁ
దెలిసెద నని వచ్చి తిరుకచ్చినంబిఁ
గనుఁగొని పాదపద్మములకు వ్రాలి
వినవె యాకరిగిరివిభుచెలి కాఁడ
తలఁపులోఁ గొన్ని యర్థంబు లీవేళఁ
దలఁచితి యే నిట్లు తలఁచితి ననుచు
శ్రీకాంతుఁ డగుహస్తిశిఖరశేఖరున
కేకాంత మగునట్టియెడ విన్నవించి

పూనికమీఱ నాపుండరీకాక్షుఁ
డానతిచ్చినరీతి నానతీవలయు
నన విని యట్లకా కనుచు నయ్యోగి
యనువొంద మూఁపుపై యాలవట్టంబు
హరి విహరించుదేహపుమేడయందు
సిరిమించఁ జేర్చునిచ్చెన లననొ ప్పు
నురుతరాయతధవళోర్ధ్వపుండ్రంబు
కరమొప్పఁ బచ్చల కనకపొంగళ్ళు
సలలితవస్త్రభూషణజాలములును
మలయసొంపులతిరుమణివడంబులును
నలర నేకాంతపాయస మారగించి
యలహస్తిశైలనాయకుఁ డింపుతోడ
నేకాంతమున నున్నయెడ నేగి నిలిచి
చేకొని వీవనఁ జెన్నార విసరి
యుపచార మొనరింపుచున్న నాయోగి
కృపఁజూచి యాహస్తిగిరినాథుఁ డనియె
నొనరంగ విన్నపం బొకటి మా కిప్పు
డొనరింపఁదలఁచిన ట్లున్నాఁడ వీవు
కలదె యేమైన నిక్కము సెప్పు మనిన
నలవరు దనకు నిట్లని విన్నవించె

స్వామి! తావకపదాసక్తుఁ డైనట్టి
రామానుజుండు గారవము దీపింపఁ
దలఁపులోఁ గొన్ని యర్థంబులు దలఁచి
నలువొంద మీకు విన్నపము గావించి
యిరవొంద మీ రానతిచ్చినసరణిఁ
దిరుగంగఁ దనతోడఁ దెలుపుమటన్న
నావిన్నపమ్ము సేయఁగఁబూనినాఁడ
నీవేళ నవి యాన తిమ్ము నావుఁడును
చిన్నారిమోముపైఁ జిఱునవ్వు నెరయఁ
గన్నుగొనల నిండి కరుణ దైవాఱ
సేవింపుచున్న కాంచీపూర్ణుతోడ
నావేల్బురాయఁ డిట్లని యానతిచ్చె
నతఁ డెఱుంగనియట్టి యర్థము ల్గలవె?
యతఁడు సర్వజ్ఞుఁ డీయవనిలోపలను
ఇటువలెఁ దాను నీయిందఱకరణి
నటియింపఁగాఁ గోరి నను వేఁడినాఁడు
ఐన నే మయ్యె రామానుజార్యుండు
తా నాత్మలోపలఁ దలఁచునర్థమ్ము
లెవ్వరు తనగురుఁ డెద్ది యుపాయ
మెవ్వఁడు పరతత్త్వ మెద్ది సన్మతము

అని యెన్ని నాఁడు మహాపూర్ణగురుఁడె
తనగురుం డలప్రపదనముపాయంబు
తత్త్వంబు నేను సద్వైతంబ మతము
తత్త్వార్థ మిది ప్రపదనమున కరయ
నంతిమస్మృతి వల దని చెప్పు మనిన
నంతట నరిగి రామానుజార్యునకు
నావిధం బంతయు నానతిచ్చుటయు
భావించి యాశ్చర్యపడి ముద మంది
చెలువుమీఱంగఁ గాంచీపూర్ణుపాద
ముల వ్రాలి యమ్మహాముని సమ్మదమున
నలమహావూర్ణుని నాశ్రయింపంగఁ
దలఁచి డెందమున సంతస మిగురొత్తఁ
బరువడి శ్రీరంగపట్టణంబునకు
నరుగుచు మధురాంతరాగ్రహారమున
నలసి తటాకనాయకుఁ డను నచటి
జలజలోచనునివాసముఁ జేర నేగి
దైవయోగమున నత్తఱి మహాపూర్ణుఁ
డావేళ సకుటుంబుఁ డై యేగుదెంచి
యిటమీఁదఁ దను గాంచి యీడేర్తు ననుచు
నటవచ్చివచ్చి యాహరిమందిరమున

నున్నట్టి యాదేశికోత్తముఁ గాంచి
వెన్నెలఁ బొడఁగన్న వెన్నెలపులుఁగు
సరవి భానుని గన్నజలజంబుకరణిఁ
గర మర్థి పాదపంకజముల వ్రాలి
యున్న రామానుజు నొగి గౌఁగిలించి
కన్నీరు దుడిచి యంగములెల్ల నివుర
నామహాపూర్ణున కాలక్ష్మణార్యుఁ
డామోద మెసఁగ నిట్లని విన్నవించె
నుపదేష్ట మగుచు హితోపదేశంబుఁ
గృపఁజేసి నను గటాక్షింపంగవలయు
నన విని శ్రీకాంచి యల్లదే యింక
ననతిదూరము మన మటఁ బోయినపుడు
ఠేవగాఁ బుణ్యకోటిచ్ఛాయ నచట
దేవనాథునిసన్నిధిని సకలములు
నలయామునాచార్యు నన్నియు మీరు
తెలివిమీఱఁగఁ బ్రసాదించెద రనినఁ
గటకటా మున్నెఱుంగరె యామునార్యు
నటఁ బోయి కనియెద మని పోయినప్పు
డేమయ్య దేహంబు లెన్న నిత్యములె
యీమెయి మీ రానతిత్తురె యిపుడు

కృపసేయు మనిన నాకృతి లక్ష్మణునకు
నపు డారమాపతి యగ్రభాగమున
వకుళమూలమున నాళ్వందారుమదిని
ప్రకటించి గురుపరంపరమూలమనువు
ద్వయముఖ్యములను నర్థముతోడఁగూడ
దయసేసి రామసోదరున కిట్లనియెఁ
దొలుత రాముఁడు భరతునకుఁ బాదుకల
నిలఁ బ్రోవఁ దా నిచ్చి యేగినకరణి
నారీతి నను బ్రోవ యామునేయుండు
సారంబు లగు తమచరణపద్మములు
మనుమణియునుగూడ మాయందుఁ బెట్టి
మునుకొని యరిగిరి ముక్తిభూస్థలికి
సామంతమునకు వాచ్యంబైనదాని
బ్రేమమై నీకుఁ జూపెద రమ్మటంచు
నంచితంబుగ లక్మణార్యుండుఁ దాము
గాంచికి నేతెంచి కాంచీపురీశు
నతిభక్తిఁ గాంచి రామానుజార్యునకు
మతినెన్న వీఁడె తన్మంత్రవాచ్యుండు
అనుచు నానతియిచ్చి యాఱుమాసంబు
లనురక్తి శిష్యుతో నచ్చోట నుండి

సకలహితోపదేశములు ఛాత్రునకుఁ
బ్రకటింపుచుండె నాపై నొక్కనాఁడు
తమదేవి రామసోదరునిదేవియును
గొమరారఁ జని యొకకూపంబునందు
సొరిది నీళ్లును జేదుచును జేదకుండ
లిరువుర నొరయ నయ్యెడ లక్ష్మణార్యు
కాంత కులంబులక్రమ మేర్పఱించి
కాంతాళమునఁ జేతికలశంబుఁ గొట్టి
తనయింటి కరిగె నత్తఱి మహాపూర్ణు
వనిత యేతెంచి యవ్వడువు చెల్వునకుఁ
దెలిపిన నాలోకదేశికుం డాత్మ
నలికి యెక్కడ వైష్ణవాపచారంబు
వచ్చునో యని శిష్యవరుతోడఁ జెప్ప
కచ్చోటు వాసి చయ్యన రంగపురికిఁ
జనియె నామై ననుష్ఠానంబు సేసి
యనురక్తితోడ రామానుజార్యుండు
చనుదెంచి గురునివాసమునకు నరిగి
యనువొందుభక్తి నిజాచార్యు నడుగఁ
గోరి యచ్చో నెలకొనియున్న వారు
శ్రీరంగమునకు వేంచేసిరి యనిన

నాతోడఁ బిల్చి యానతియీక యిట్టు
లీతఱి నరుగుట కేమికారణమొ ?
యన విని వారు మహాపూర్ణగురుని
వనిత మీవనితయు వాకిటిబావి
జలములు చేఁదంగఁ జని చేఁదుచున్న
బలువిడి నొండొరుభాండము ల్సోఁకఁ
దమకుండ మీకుండ తాఁకుటెట్లనుచుఁ
దమకించి యాభిజాత్యంబులు దలఁచి
గ్రక్కున మికొమ్మ కనలి చేకుండ
వ్రక్కలు సేయు నవ్వడువు దా నెఱిఁగి
కలఁగి మిక్కిలి దమకాంతఁ గోపించి
యలుకుచు శ్రీవైష్ణవాపచారంబు
లొనఁగూడు నిచ్చోట నున్న నిం కనుచుఁ
జని రన్నఁ గనలి లక్మణదేశికుండు
నేమిసేయుదు నింక నియ్యపచార
మేమిటం బెడఁబాయు నిట్లు రాఁదగునె
యరయంగఁ బ్రతికూల యగుభార్య విడుచు
టిరవొందఁగా శాస్త్రహితమే తలంపఁ
జెనఁటియైనట్టి సంసృతి యింత రోఁత
యని యాత్మ నొకయుపాయంబుఁ జంతించి

యనురక్తిఁ దనదేవి నటఁ బుట్టినింటి
కనిపెడుకైవడి ననిపి గొబ్బునను
జెన్నొందు నాహస్తిశిఖరమందిరుని
సన్నిధానంబున జనులెల్ల వినఁగఁ
దక్కక సోదరీతనయుదాశరథి
దక్కఁ దా సకలబాంధవుల డించితిని
అని హస్తిశైలనాయకునిచే సర్వ
జనులు సన్నుతి సేయ సన్న్యాస మంది
తనగురుం డగుహస్తిధరణీధ రేశు
ననుమతి మఠమున కరుదెంచినంత
నాశ్రితసురభూజ మగువేల్పుచేత
నాశ్రమస్వీకార మలవడం జేసి
యలలక్ష్మ ణాచార్యుఁ డని సర్వజనులుఁ
బలుక రామానుజభక్తమందారు
చెలియలికొమరుఁ డాశ్రితపారిజాత
[6]మలఘుప్రతిష్ఠితునంశ మైనట్టి
సలలితగురుఁడు దాశరథి యవ్వేళఁ
దను నొండు దక్కంగఁ దక్కినబంధు
జనము డించితి నని సన్న్యసించుటయు
విని యమ్మహాత్ముఁ డెవ్విధి నన్ను విడువ
ననియెఁ గృతార్ధుండ నైతిఁ బొమ్మనుచు

నాసమీపమునఁ గూరాగ్రహారమున
భాసిల్లు లోకైకపావనమూర్తి
యలసర్వనేత్రునియంశమై మిగులఁ
జెలువారు శ్రీవత్సచిహ్న దేశికుని
ననురక్తిఁ దోకొని యతఁడును దాను
జని కాంచినున్నలక్మణమౌనివర్యు
సేవించి పాదరాజీవయుగ్మంబు
తావిఁ జొక్కుచు షట్పదంబులై వ్రాలి
కృపచేసి మముఁ గటాక్షింపంగవలయు
నిపు డని వినుతింప నెంతయుఁ బ్రీతిఁ
బంచసంస్కృతులుఁ జొప్పడఁజేసి వారి
కంచితపరమరహస్యంబు లొసఁగి
శరధిగంభీరు దాశరథిఁ గూరేశు
గురుని నిర్జితదేవగురుని నెంతయును
బ్రేముడి సేసి రాప్రియశిష్యవర్యు
లామౌనిచంద్రుని యఖిలసేవలను
రమణఁ జేయుచు నంతరంగులై యుండి
రమలవిద్యామనోహరమూర్తు లగుచు
నంత యాదవమాత యాత్మజుఁ జూచి
యెంతయు వగచి నీ కిట్లుండఁ దగునె

యఖిలకర్మములకు నధికార మొసఁగు
శిఖయు జన్నిదమును జెల్లఁబోవిడిచి
యీమెయి నుండుట యిది శాస్త్రహితమె
రామానుజార్యగారవమున నీవు
నురుగతి శిఖయు యజ్ఞోపవీతమును
ధరియింపు మనిన నాతల్లి నీక్షించి
దండి నిన్నా ళ్ళేకదండినై యిట్టు
లుండితి శిఖయు యజ్ఞోపవీతమును
నేరీతి ధరియింతు నివి పూనుకొఱకు
నారయ నింకఁ బ్రాయశ్చిత్తముగను
వలగొనవలయు భూవలయుంబు తనకు
బలము లేదని యార్తిఁ బడి కను మూయఁ
గలలోనఁ జనుదెంచి కరిరాజవరదుఁ
డిలచుట్టి రాకున్న నేమయ్య వలదు
రమణతో నీవు మారామానుజార్యుఁ
దమకంబు డిగ్గి ప్రదక్షిణం బొకటి
చేసిన భూప్రదక్షిణము సాంగముగఁ
జేసినవాఁడవేఁ జెప్పినకరణి
నొనరించి లక్ష్మణార్యునియొద్ద నాతఁ
డొనరించు సన్న్యాస మొనరింపు మనినఁ

గల మేలుకాంచి యక్కల విశ్వసింప
కలకాంచిపూర్ణుని నావేళఁ గాంచి
యీతెఱం గంతయు నెఱిఁగించి మీర
లీతెఱం గిభశైలహేమాంబరునకు
నెఱిఁగించి యతఁ డానతిచ్చినరీతి
నెఱిఁగింపవలయు నా కిటమీఁద ననినఁ
దడయక శ్రీహస్తిధరణీశు నట్ల
నడిగి యేతెంచి యిట్లనియె నాఘనుఁడు
జలజలోచనుఁడు నీస్వప్నంబునందు
నెలమితో మును పానతిచ్చినకరణి
సవరింపు మనియెఁ గొంచక యని యనిన
వివరించి యంతయు వెఱఁ గందుకొనుచు
యాదవుఁ డరిగి రామానుజమౌని
పాదపద్మములకుఁ బ్రణమిల్లి పొగడి
సేవించి వడిఁ బదక్షిణముగా వచ్చి
యీవిధం బంతయు నెఱిఁగింప నతఁడు
కరుణ దైవాఱ లక్మణదేశికుండు
నురుతరం బైన వేదోక్తమార్గమున
నయమారఁ బునరుపనయనంబు సేసి
యయకరం బగు త్రిదండాశ్రమం బొసఁగి

యతని గోవిందనామాంకితుం జేసి
యతులితసకలరహస్యంబు లొసఁగి
నిజశిష్యు గాఁగ మన్నించి యచ్చోటఁ
ద్రిజగంబు లెఱుఁగ వర్తిలుచుండె నంత
యామునాచార్యపాదాసక్తమతులు
రామానుజార్యు చర్యలు విని యలరి
శ్రీరంగమున రంగ శేషపర్యంకుఁ
జేరి విన్నపములు చేసి యగ్గించి
రామానుజుండు దర్శనగురుం డగుచు
స్వామి యెల్లపుడు నిచ్చట నుండవలయు
నన విని రంగనాయకుఁడు సంతసము
మునుకొని శ్రీనాథమునివంశుఁ డైన
రంగనాయకుని చేరఁగఁబిల్చి మిగుల
నంగవింపుచుఁ గాంచి కరిగి వేవేగ
ననువొంద నేయుపాయంబున నైనఁ
గొనిరమ్ము లక్ష్మణగురుని నిక్కడికి
నన విని ప్రణమిల్లి యాగాయకేశుఁ
డనురక్తిఁ గాంచికి నరుదెంచి యంత
వరదుఁడు పరిజనవైభవస్ఫూర్తి
యరుదారఁ గొలువున్నయత్తఱి వచ్చి

ఘనమైన తనదివ్యగానంబు సొగయ
వినుపించి యానాదవేదిఁ జొక్కింప
వలనుగా మెచ్చి యావరదుఁడు కొంక
వలదు వేఁడుము నీకు వలయు నర్థమ్ము
లన విని రామానుజార్యుని నాకు
వనమాలి వరద యీవలయు నావుఁడును
వరదుం డితఁడు దక్క వలయునర్థంబు
లరుదార నిచ్చెద ననిన గాయకుఁడు
రామావతార వారకరెండుమాట
లీమెయి మీ రానతీ నెట్లు వచ్చు
ననిన నేమరితి మే మప్పుడే యనుచుఁ
గనకాంబరుండు లక్ష్మణమౌనివరుని
నిచ్చినఁ బొంగి రంగేశుగాయకుఁడు
మచ్చికతోడ నమ్మౌనిఁ దోకొనుచు
శ్రీరంగమునకు వేంచేయు నవ్వేళ
శ్రీరంగపతి తనసేనానితోడఁ
బరమభాగవతులు పరిచరజనము
నరుదార నెదురుగా ననిపి వెండియును
నామౌని తమకడ కరుదెంచువేళఁ
బ్రేమమై నెదు రేగి పెక్కుచందముల

ముదమున నడుగుఁదమ్ములఁ బ్రసాదించి
తుదలేనివేడ్కతోఁ దోకొనివచ్చె
నాలక్ష్మణార్యుండు నఖిలభాగవత
జాలంబుతోఁగూడఁ జనుదెంచి భక్తి
శ్రీరంగనాథుని చెలువంబు కన్ను
లారంగ మఱియు నందంద సేవింప
నారంగవిభుఁడు రామానుజాచార్యుఁ
జేరంగఁ బిలిచి మచ్చికసేసి నీవు
నొగి నేనె పాలింపుచున్న విభూతి
యుగము నీ కిచ్చితి నొకకొఱలేదు
పన్ని మామకగృహపరికరాదులకు
నన్నిటికిని గర్త వైయుండు మనిన
నాయెడ రంగనాయకుని దివ్యాజ్ఞ
త్రోయక యమ్మౌని తోయజతరణి
నిఖిలేశుఁ డగురంగనిలయు కోవెలకు
నఖిలంబునకుఁ గర్తయై తాను నిలిచి
యగు ననువారల నగు నంచు మెచ్చి
తగ దనువారలఁ దగ దంచుఁ దిగిచి
యామీఁద నిజశిష్యుఁ డగునకలంక
భూమీశుఁ డనురాజపుంగవు నొకని

నారంగపురమున కధికారిఁ జేసి
శ్రీరంగపతి సమంచితవైభవముల
నెప్పటికంటెఁ దా నినుమడి గాఁగఁ
దప్పక నడుచుచందంబు సేయించి
యట నొక్కనాఁడు మహాపూర్ణగురుని
బటుభక్తి సేవించి పదముల కెరగి
యనురక్తి మీకు నయ్యామునాచార్యుఁ
డొనరంగ నుపదేశ మొసఁగినయట్టి
ఘనరహస్యము లింకఁ గలిగినఁ దనకుఁ
జనువుమీఱంగఁ బ్రసాదింపవలయు
నన విని యతిపూర్ణుఁ డాయామునేయ
ముని యొసంగినయర్థములు మునుమున్నె
కల నెల్ల నీ కలకాంచిలోపలనె
తెలిపితి మిందు సందేహంబు లేదు
అని తమసుతుని రామానుజార్యునకు
వినుతశిష్యుని జేసి వెండియుఁ బలికె
యామునమౌనిరహస్యము ల్గొన్ని
ప్రేమమై నెంతయుం బ్రియశిష్యు లైన
యలతిరుమలనంబి కలదామధరుని
కలగోష్ఠిపూర్ణున కనఘుఁ డైనట్టి

యలరంగనాథగాయకునకు నెలమిఁ
దెలిపినా రని నీవు దెలిసికొ మ్మనిన
ఘనమైనశిష్యసంఘముతోడఁగూడ
ననురక్తి రామానుజాచార్యుఁ డంత
శ్రీగోష్ఠిపూర్ణుని సేవించుకొఱకు
శ్రీగోష్ఠిపురికి వేంచేసి యాగురుని
గని భక్తి పాదపంకజముల వ్రాలి
మనమార నలచరమశ్లోకమునకుఁ
జనునర్థ మెద్ది ప్రసాదింపవలయు
ననిన నాగురువరుం డట్ల కా కనుచు
రామానుజునిమనోరాగంబుఁ దెలియ
నీమాటు వోయి ర మ్మెఱిఁగింతు ననిన
నీరీతి ముని పదియేడువారములు
సారెకుఁ దిరిగి వేసారక మదిని
జింతింపుచుండంగ శ్రీరంగమునకు
నంత శ్రీగోష్ఠిపూర్ణాఖ్య శిష్యుండు
చనుదేర నపుడు లక్ష్మణమౌనివరుఁడు
తనలోనియార్తియంతయుఁ దోఁచునట్లు
తెలిపి యాఘనుని కిత్తెఱఁగెల్ల మీరు
చెలువార నేగి గోష్ఠీపూర్ణునకును

నెఱిఁగించి తలఁపులో నిరవొందువగపుఁ
తరలంగఁ జేయు మిత్తఱి నని పనుప
నరిగి యాఘనుఁ డంత నలగోష్ఠిపూర్ణు
గురున కీతెఱఁగు సేకొని విన్నవింప
ననయంబు హర్షించి యాదేశికుండు
తనశిష్యుఁ బిలిచి యత్తఱి నీవు వోయి
తనదుపవిత్రంబు దండంబుఁ దాల్చి
కొని పెరవారిఁ దోకొనిరాక తాన
యేతెంచెనేని నే నిత్తు నటంచుఁ
దో తెమ్ము మౌనిచంద్రుని వేగ ననుచు
ననిపిన నరిగి రామానుజార్యునకు
నొనర నవ్విధమంతయుం దేటపఱచి
రమ్మన్న నుప్పొంగి రామానుజుండు
సమ్మదం బెసఁగ దాశరథిఁ గూరేశుఁ
దోకొని యాతనితోడ నేతెంచి
యాకరుణానిధి నాచార్యవర్యు
సేవింప నపుడు గోష్ఠీపూర్ణుఁ డనియె
నావేళ చెంత రామానుజుతోడఁ
గరమర్థి నిన్నునొక్కనినె రమ్మనిన
నిరువుర నీవెంట నిటకుఁ దేఁ దగునె

యనినఁ బవిత్రంబు నలఘుదండంబుఁ
గొని పని విను మనం గోరి యేనట్ల
యీవేళ మీ రానతిచ్చినయట్ల
వేవేగ నిల పని వింటి నావుడును
నిండారుకూరిమి నీ కిందులోన
దండ మెవ్వరు పవిత్రం బెవ్వ రనిన
దండ దాశరథియే దండంబు గూర
మండలేశ్వరుఁడె మామకపవిత్రంబు
నన విని మోదించి యాగోష్ఠిపూర్ణుఁ
డనియె నే నొసఁగు రహస్యార్ల మీవు
నీయిరువురుఁ దక్క నెవ్వరితోడ
మాయానఁ జెప్పకు మఱి మౌనివర్య
యని రహస్యంబున నాపరమార్థ
మొనర మౌనీంద్రున కుపదేశ మొసఁగి
యనిపిన యతిపతి యామఱునాఁడు
ఘనతరశ్రీగోష్ఠి కానాథుఁ డైన
శ్రీవరుతిరునాళ్లు సేవించుకొఱకు
శ్రీవైష్ణవాళి వేంచేసియుండంగ
నందఱు వినుచుండ నాచరమార్థ
మందంబుగాఁ బెట్టి యానతిచ్చుటయు

నామాట విని యప్పుడాగోష్ఠిపూర్ణుఁ
డామౌనిఁ జేరంగ నఱిముఱి వచ్చి
యేమోయి యిటకు మీ రిరువురుఁ దక్క
నీమహనీయార్థ మెవ్వరితోడఁ
జెప్పకు మని బుద్ది చెప్పితి నానఁ
దప్పి యీగతి సేయఁ దగునె నీ కిపుడు
క్షితిగురుతోడ బొంకినవాని కరయ
గతి యెద్ది తుది నరకమెకాక యనిన
ననియె రామానుజుం డాగోష్ఠిపూర్ణుఁ
గని యొక్కరుఁడు నరకముఁ బొంద నేమి
యిందఱు మీకృప నీడేరి శౌరిఁ
జెందుదు రని యేను జెప్పితి ననినఁ
గౌఁగిటఁ జేర్చి లక్ష్మణమౌనివర్యు
వీఁగనికూర్మితో వినుతులు చేసి
యిల సర్వలోకుల నీడేర్పవచ్చు
నలవాఁడ వీ వని యందంద పొగడి
యిటమీఁద దొరఁకొని యీదర్శనంబు
పటుగతి నీపేరఁ బరఁగు నెల్లెడల
నని వరం బిచ్చి నిజాత్మజు శిష్యు
నొనరించె నప్పు డయ్యోగిచంద్రునకు

యతిపురందరుఁ డంత నాగోష్ఠిపూర్ణు
నతిభక్తి వీడ్కొని యరిగె నంతటను
శ్రీమాలికాధరుచే ద్రవిడాగ
మామోదకరరహస్యంబు లెఱింగి
కరమర్థి శ్రీరంగగాయకుచేతఁ
బరిపూర్ణతద్గానభంగులు దెలిసి
శ్రీరంగమున నిట్లు శిష్యశేఖరుల
కారూఢి వేదాంత మానతియిచ్చు
చున్న యత్తఱి దండ నొకయేకదండి
క్రన్నన గంగసంగడినుండి వచ్చి
తనతోడ శాస్త్రవాదము సేయు మనుచు
ననయంబు గర్వించి యతిరాజుఁ జూచి
యొండొరు వాదింప నోడినవారు
దండిమైఁ గొల్చు నాతనిశిష్యవరుఁడు
గావలయునటన్నఁ గని లక్మణార్యుఁ
డావాక్యమున కెంతె యంగీకరించి
సొలయక యుద్బాహుసుందరనామ
దళితహిరణ్యుముందరి కేగుదెంచి
నిండారుకణఁకతో నిలిచి యయ్యేక
దండితోఁ దొడరి యుద్దండుఁడై పేర్చి

పదియేడుదినములు పట్టినచలము
వదలక వాదించి వాదించి మదిని
వేసరి యతిరాజు వెడఁగన్ను మూయ
నాసమయమున రంగాధీశ్వరుండు
చనుదెంచి ప్రతివాదిజయహేతియుక్తి
నొనరంగ నుపదేశ మొసఁగ మేల్కాంచి
యామఱునాఁడు రామానుజాచార్యుఁ
డామహాప్రతివాది నలవోక గెలిచి
దయతోడ నయ్యేకదండి కవ్వేళ
నయమారఁ బునరుపనయనంబు చేసి
మగుడ ద్రిదండాశ్రమముఁ బ్రసాదించి
తగశిష్యవరుల కెంతయు ముఖ్యు జేసి
సాదరుం డగుచు వేదాంతదీపంబు
వేదాంతసారము వేద్య మైనట్టి
అరవిందదళలోచనార్చనాక్రమముఁ
గరమొప్పు సొబగుల గద్యత్రయంబుఁ
దళుకొత్తుచున్న గీతావివరణము
నలవడఁజేసి వ్యాఖ్యానంబు చేసి
చుక్కలలో నొప్పు సోముచందమున
నొక్కటఁ బరమశిష్యులతోడఁ గూడి

దెసలకు వేంచేసి తిమిరసంతతుల
పసగరగొనియెడు భానుచందమునఁ
బరమతవాదులఁ బరపి యచ్చోటి
ధరణీశ్వరుల శిష్యతములఁ జేయుచును
బాయనికడఁక నుద్భటశిష్యవరుల
నాయాయితిరుపతు లందునిల్పుచును
వెలయ నీరీతి దిగ్విజయంబు చేసి
యిల వలగొని యిట్టు లేతెంచుచుండ
సార కాశ్మీరదేశమునందునున్న
శారదాపీఠదేశమున కే తేర
శారదానారదసంకాశ యైన
శారద యప్పు డాసంయమీంద్రునకు
నెదు రేగి పదముల కెరగి నుతించి
ముదమున నిజవాసమునకు నేతేర
రామానుజుండు శారదఁ జూచి యేమి
నామీఁద నీ వింత నంటుజేసెదవు
అన విని వాణి యిట్లనియె నోమౌని
వినవయ్య జగదేకవిఖ్యాతచరిత
మునుపొక శ్రుతివాక్యమునకు శంకరుఁడు
వనమాలి కపిగుదవర్ణ నేత్రుండు

అని యపార్థముఁజెప్ప నది తప్పటంచు
దనుజారి పంకజదళనేత్రుఁ డనుచు
నీవంబు పార్థ నెన్నితి వందుకొఱకు
భావించి సంతోషభరితనై యిప్పు
డారీతి నిన్నుఁగన్నంత నుప్పొంగి
యీరీతిఁ జేసితి నేను నీయెడను
సన్నుతనిఖిలశాస్త్రంబులన్నియును
నున్నవి యచ్చోట యోగీంద్రచంద్ర!
చేకొని నీవలసినశాస్త్ర మిపుడు
కైకొను మనిన లక్ష్మణయోగివరుఁడు
భువనంబులన్నియుఁ బొగడఁ దా మున్ను
సవరించువేదాంతసంగ్రహం బెత్తి
యేముసేసినశాస్త్ర మిది దీనఁదప్పు
లేమేనిఁ గల్గిన నెఱిఁగింపు మనుచుఁ
దనకేల నున్నపుస్తకము పంకేజ
తనుజాతరాణిహస్తములకు నొసఁగ
ధరలోన సకలశాస్త్రముల కెల్లపుడు
సరకు గైకొనక మెచ్చక యుండువాణి
యిరవొంద నాఘనుఁ డిచ్చుశాస్త్రంబు
శిరసావహించి మెచ్చినమౌనివరుఁడు

నత్తఱి బోధాయనాఖ్యనిర్మాణ
వృత్తి శారదచేత వేగఁ గైకొనుచుఁ
గడుఁ బెక్కువిధములఁ గంజాతసూను
పడఁతుక నంత సంభావించి కదలి
యంత శ్రీపురుషోత్తమాధీశుఁ గాంచి
సంతసంబునఁ గూర్మశైలేశుఁ జూచి
యలసింహశైలనాయకుఁ బొడఁగాంచి
సలలితాహోబలేశ్వరుని సేవించి
శ్రీవేంకటాధీశు సేవింపఁగోరి
శ్రీవేంకటాగంబు చేర నేతెంచి
శ్రీపురంబునకు వేంచేసి నెయ్యమున
నాపురిఁ బాలించు నలవిఠ్ఠలేంద్రు
క్షితినాయకుని గృప సేసి యచ్చోట
నతనిచే నొకయగ్రహారంబుఁ గొనుచు
నఖిలశాస్త్రజ్ఞులు ననుపమేయులును
నిఖిలసన్నుతులును నిజశిష్యు లగుచు
చెలఁగి డెబ్బదినాల్గుసింహాసనముల
నలనడువారిలో నందుఁ గొందఱను
బరమానురక్తి ముప్పదిమందిఁ బిలిచి
తిర మొంద నందుఁ బ్రతిష్ఠఁ గావించు

నప్పు డయ్యతివరుఁ డా శేషనగము
తప్పక సేవించెఁ దద్దయుఁగూర్మిఁ
బరమపావనుఁ డైన పరకాలముఖ్యు
లరుదెంచి శేషాంశ మనుచు నగ్గిరిని
ద్రొక్కనోడిరి తాము దొడిబడ నింకఁ
ద్రొక్కరా దన విని తుందుడుగొనుచు
నతులశేషాంశ మైనట్టి యనంత
పతిశిష్యముఖ్యు లేర్పడఁగ నిట్లనిరి
యీవేళ మీ రిది యెక్కకయున్న
దేవ మీశిష్యులు దిక్కులవారు
నారోహణము సేయ రగ్గిరిమీఁద
నీరీతి తగవు గా దేవేళ మీరు
నాగేంద్రశైలేంద్రనాథు సేవింప
వేగ నవశ్యంబు వేంచేయవలయు
ననిన రామానుజుం డాశైల మెక్కి
చనువేళ నావచ్చుచందంబుఁ దెలిసి
యలతిరుమలనంబి యనురక్తిఁ బంపి
వలనొప్ప వేంకటేశ్వరుఁ డారగించి
దయసేయు తత్ప్రసాదమును గైకొనుచు
రయమున నరిగి శ్రీరామానుజులకు

నెదురుగాఁ జనిన మౌనీంద్రుఁ డావేళఁ
ద్రిదశవందితుఁ డైన తిరుమలనంబిఁ
గని భక్తిఁ బాదపంకజముల వ్రాలి
తనరారఁ దత్ప్రసాదము స్వీకరించి
యారయ సర్వలోకాచార్యు లైన
మీ రీప్రసాద మిమ్మెయి దేరవలెనె
పనిఁ బూని యొకపిన్నపాపనిచేత
ననిపినం జాలదే యనిన నాఘనుఁడు
నిప్పుడు మీ రానతిచ్చినకరణి
తప్పక నగర మెంతయు వెదకితిని
ఆకడ వైష్ణవు లగువారిలోన
నాకన్న నెన్న చిన్నలు లేరు గానఁ
దెచ్చితినన్న నాదేశికుమాట
మచ్చిక వేదాంతమార్గమై యున్న
ననయంబు మోదించి యామౌనివరుఁడు
తనశిష్యవరుల నందఱ విలోకించి
కంటిరే యిపుడు వేంకటపూర్ణుమహిమ
గెంటక మది నహంకృతిలేశమైన
నరయక పెద్దవా రైన నైచ్యంబు
దొరయంగ భాగవతులయెడాటమున

రూపింపుచున్న స్వరూప మందఱకు
దీపింపఁ జేసి తా దేశికుం డయ్యు
వరుసతో శ్రీవైష్ణవస్వరూపంబు
లరయనిగతి నుండు నని నుతింపుచును
గామధేనువులును గల్పభూజములు
కామితార్థము లిచ్చుకమనీయమణులు
సిద్ధరసంబులు సిద్ధమూలికలు
సిద్ధమౌనీంద్రులచేఁ జెన్నుమిగులు
నన్నగరాజంబు నహిరాజమూర్తి
కన్నులపండువు గాఁగఁ జూచుచును
దిరుమలనంబితోఁ దిరమొందుప్రేమఁ
దిరుమలమీఁది కేతెంచి కోవెలకు
వలచుట్టివచ్చి పావనతలభరణి
మిళితసంసారతమిస్రౌఘతరణి
ననుపమసుకృతసంహతిజన్మధరణి
జననుతయును నైన స్వామిపుష్కరిణి
స్నానంబుఁ జేసి యాచక్కిఁ జెన్నొందు
భూనళి సొక్షినొంపునఁ గౌఁగిలించి
ఫణిరాజుపై నొక్కపధ మూఁది దివ్య
మణిమయభూషణమండితుం డగుచు

దైవాఱుపుడమిపైదలిమోముదమ్మి
తావులు గ్రోలెడుధరణీవరాహు
సేవించి యటఁ బ్రదక్షిణముగా వచ్చి
యావరణంబుల కాదియై మిగుల
గొమరారువైకుంఠగోపురంబునకుఁ
బ్రమదంబుతో మున్ను ప్రణమిల్లి యంతఁ
జనుదెంచి గారుడస్తంభంబుచక్కి
వినతుఁడై చెంత క్రొవ్విరిసాల కేగి
వలనొప్పుచంపకావరణంబు వేగ
వలచుట్టి వచ్చి యాస్వామిపుష్కరిణి
తోయంబు [7] లోని యుత్తుంగభాగమున
నాయహికులపతియవతార మగుచుఁ
దిరుగనిచింతలుం దెరలించునీడ
దిరుగనిచింత కెంతే భక్తి మ్రొక్కి
రమణ రెండవగోపురము దాఁటి లోని
కమలమహానసాగార సేవించి
నెలకొని యానందనిలయాఖ్య మగుచు
నలువొందు మణివిమానంబు సేవించి
పటుమహామణిమంటపంబు సేవించి
యట వచ్చి తురగతార్క్ష్యాహినాయకుల

సేవించి దనుజారిసేనాధినాథు
సేవించి నరసింహు సేవించి తార్క్ష్యు
సేవించి నిత్యుల సేవించి కూర్మి
నావేళ లోనికి నరుదెంచి యచటి
పంచాస్త్రకోటుల [8]భావంబు మించి
పంచవిగ్రహముల భాసిల్లి పసిఁడి
గజ్జలు నందియల్ కనకాంబరంబు
గొజ్జంగిముత్యాలకుచ్చుకటారి
బెడఁగుగాఁ గటిమీఁద బెరసిన కేల
నుడుగక వరముల నొసఁగు కెంగేలు
నుదరబంధంబు కేయూరహారములుఁ
బొదలుతావులుతట్టు పునుఁగుపైపూత
కుడిరొమ్ముమచ్చ యక్కుననెలకొన్న
కడలికన్నియదివ్యకంఠసరంబు
ధళధళఁ దుళగించు దరము, చక్రంబు
బలసిచూపట్టెడు పాణిపద్మములు
బింబాధరమ్ము నొప్చెడుకపోలములు
కంబుపోతంబు నెక్కసమాడుగళము
మకరకుండలములు మణికిరీటంబు
వికసితధవళారవిందనేత్రములు

చల్లనిచూపును జారునాశికయుఁ
దెల్లనిమెఱుఁగుముత్తియపునామమును
గలిగి యెంతయును శృంగారభావంబు
మలయునయ్యలమేలుమంగామనోజ్ఞు
సేవించి ప్రణమిల్లి చేరి సన్నుతులు
గావించి పులకితగాత్రుఁడై చెలఁగి
శ్రీరంగమున నున్న శేషపర్యంకు
డీరూపమున వచ్చి యిటఁ బొడచూపెఁ
బరతత్త్వ మీతండె పరయోగిహృదయ
పరిపూర్ణుఁ డితఁడె శ్రీపతియును నితఁడె
పరమకారుణికుండు భక్తవత్సలుఁడు
పరవాసుదేవుఁ డీపంకజాక్షుండె
జగములు వొడమింప సమయింపఁ బ్రోవఁ
దగువాఁడు నితఁడె యీధరణీధరంబె
వైకుంఠ మితని కెవ్వరు సరి గలరె?
యీకమనీయనగేంద్రరాజునకు
సరి లేరటంచు వేసరణుల వేద
శిరముల సన్నుతి చేసి సద్భక్తి
తనరఁ దీర్థప్రసాదము లన్వయించి
యనురక్తి దివసత్రయంబు వసించి

యాకాశగంగాదు లైనతీర్థములు
చేకొన్నభక్తితో సేవించి యంతఁ
గరమర్థి శౌరికైంకర్యంబు సలుప
నిరువదినలువుర నేకాంగిపరుల
నలవడ శ్రీమాలికాదికైంకర్య
ములు సేయ నిలిపెఁ బ్రేముడి పెచ్చు పెఱుగఁ
దమమాఱు గాఁగ నిద్దఱయతీశ్వరులఁ
గ్రమమునఁ బట్టంబుఁ గట్టి యావేళ
నిఖిలేశుఁ డైన శ్రీనిలయునివసతి
కఖిలంబునకుఁ గర్తవై యుండు మనుచుఁ
గపిరాజరూపసంకలితముద్రికలు
కృపచేసి శ్రీవేంకటేశున కెరగి
మగుడి యంతటఁ దిరుమలనంబి తాను
దగువేడ్క నమ్మహీధ్రము డిగ్గి వచ్చి
శ్రీపతిపురికి వేంచేసి యచ్చోట
నేపాఱ శేషాచలేశ్వరపూర్ణు
వాసంబునందు నివాసంబు చేసి
భాసిల్లు వేంకటపతిపూర్ణుచేత
ననురక్తి రామాయణార్థమంతయును
విని తాను మునుపు గావించినయట్టి

సలలితవేదాంతసంగ్రహముఖ్య
ముల వినుపింప నామోదించి యతఁడు
తనయుని రామసోదరమౌనిశిష్యు
నొనరింప నప్పు డయ్యోగిచంద్రుండు
మహితాత్మ నలతిరుమలనంబిశిష్య
సహజు విద్యోదయసంపన్ను ననఘు
గోవిందుఁ డనుదేశికుని గాంచి యతఁడు
గావించు నాచార్యకైంకర్యమునకు
నరుదంది శ్రీవేంకటాచలపూర్ణుఁ
గరమర్థి వేఁడి యాఘనుఁ దోడుకొనుచు
సేతువుదనుక వేంచేసి శ్రీవిభున
కాతతనిజనిలయము లైనయట్టి
యాయాయితిరుపతు లచట శోభిల్లు
తోయజనాభుమూర్తులును సేవించి
మరలి రంగాధీశుమందిరంబునకు
నరుదెంచి యచట బోధాయనవృత్తిఁ
గనుఁగొని శ్రుతులవాక్యముల కైక్యముగఁ
బనుపడి యొప్ప శ్రీభాష్యంబు చేసి
యలఘుశిష్యులకు వేదాంత మంతయును
జెలఁగి వ్యాఖ్యానంబు సేయుచునుండె

నంతటఁ గులపాంసుఁ డైనట్టిచోళ
కాంతవంశజుఁడు దుష్కర్మపుంజంబు
భవపాదమతి యైన పరమపాషండుఁ
డవిరళదుష్టసాహసకృత్యపరుఁడు
వారనితనకర్మవాసనవలన
ధారుణిపై నచ్యుతద్వేషి యగుచు
హరుఁడే పరబ్రహ్మ మనియెడుభ్రాంతి
కరము డెందమ్మునఁ గడలుకొనంగఁ
దలకొని జగతి విద్వాంసుల నెల్లఁ
బలువిడి భటులచేఁ బట్టితెప్పించి
పనుపడఁగా “శివాత్పరతరం నాస్తి”
యని వ్రాలు వెట్టుండ యనుచుఁ బెట్టింప
నపుడు చతుర్గ్రామి యనువైష్ణవుండు
కపటాత్ముఁ డగుచోళకాంతునిఁ జూచి
యరయ నవైదికు లగువారు గాఁగ
నిరవొంద నిట్టివ్రా లిడిరిగా కరయఁ
దాచియావేద [9]పదప్రతిష్టాప
నాచార్యుఁ డైన రామానుజార్యుండు
నీరీతిఁ జేయునే? యిందిరావిభుఁడె
నారయఁ బరతత్త్వ మని నిల్పుఁగాక

యన నేయిచల్లినయనలంబుకరణిఁ
గనలి చోళుండు కింకరుల రావించి
యరిగి శ్రీరంగంబునం దున్న యట్టి
హరిభక్తు రామానుజార్యుని వేగఁ
బట్టి తెండని చెప్పి పనిచిన భటులు
పట్టినకడఁకతో బలువిడి వచ్చి
గట్టిగా నేగి లక్ష్మణమౌనిమఠముఁ
జుట్టి పిల్చెడు మిమ్ము చోళుఁ డీవేళ
నన విని వాకిట నడరి వైష్ణవులు
చని లోననున్న లక్ష్ముణమౌనిఁ గాంచి
యీవార్త నంతయు నెఱిఁగింప నంతఁ
బోవుద మని మౌనిపుంగవుఁ డనిన
నాకూరనాథుఁ డిట్లనియె మౌనీంద్ర!
నీకార్య మంతయు నెఱుఁగరు మీరు
పరమపాషండియై భ్రాంతిమై వాఁడు
హరుఁడె దైవం బని యందఱచేత
వ్రాలు పెట్టింపుచు వరుస మీచేత
వ్రాలు పెట్టింప నీవడువున భటుల
దేవర నటకుఁ దో తెమ్మని కదలి
యీవేళఁ బుత్తెంచె నీవేలఁ దుదిని

వేదశాస్త్రంబులు విభజించి గెలుచు
వాదంబు గాదు వివాదంబు గాని
విలసిల్ల నిలలోన విత్తులకొల్పు
గలుగఁ దక్కినవెల్లఁ గలిగింపవచ్చుఁ
గావున దేవర కలిగినఁ జాలు
మావంటివారల మఱియుఁ దేవచ్చు
వాఁ డతిక్రూరుండు వానికి గురుఁడు
లేఁడు దేవుండును లేఁడు మౌనీంద్ర!
తావకవేషంబుఁ దాల్చి యే నిపుడు
వేవేగ నరిగెద వివరించిచూడ
నిట నుండఁ దగవు గాదీవేళ మీర
లెటకేని వేంచేయుఁ డితరవేషమున
నన విని రామానుజార్యుండు శిష్యుఁ
గనుఁగొని యెంతయు గారవం బెసఁగ
వాని గెల్చుటకు శ్రీవత్సాంకగురుని
చే నగు ననుచు నిశ్చితబుద్దితోడఁ
దమకమండలమును దండశాటులును
బ్రమదంబుతోఁ గూరపతికిఁ దా మొసఁగ
నవి పూని రెండవ యతినాథుఁ డగుచు
వివరింప నాకూరవిభుఁడు వేవేగఁ

జనుదేర చోళరాజన్యునిభటులు
గనుఁగొని యితఁడె లక్ష్ముణమౌని యనుచుఁ
గొనిపోయి యప్పు డాక్రూరునియెదుట
నునుప నాపాపాత్ముఁ డుగ్రతం బిలిచి
పనుపడఁగా "శివాత్పరతరంనాస్తి”
యనుచు వ్రా లిడు మని యాకు గంటంబు
చేకొని తాన యిచ్చిన జంకు లేక
కైకొని వైష్ణవకల్పభూజంబు
తగఁ "ద్రోణమస్తితతః పరం” బనుచు
బెగడ కందున వ్రాలు వెట్టెఁ బెట్టుటయు
నవి చూచి యుగ్రుఁడై యాజ్ఞయు సేయఁ
దివిరిన యాధరాధిపుఁ జూచి హితులు
ఇతఁడు రామానుజుఁడే కాఁ డటన్న
నతనిఁ దో తెండని యనిచిన భటులు
పరువడి శ్రీరంగపట్టణంబునకు
నరిగెడిసమయంబునందు ముందుగను
సరవిగా వెల్లలజాతిగృహస్థు
కరణి వేవేగ లక్ష్ముణదేశికుండు
పురము వెల్వడిపోవ భోరన భూమి
వరభటవర్గంబు వడి మీఱి కదియ

నావేళ శ్రీలక్ష్మణాచార్యవర్యుఁ
డావచ్చు టెఱిఁగి సయ్యనఁ జెంతనున్న
యిసుము గైకొని వేంకటేశ్వరుమీఁద
నసమానగతిఁ దొల్లి హరిచిత్తయోగి
యెసఁగించు నొకపద్య మెన్ని లోలోనె
మసలక యట నభిమంత్రించి వైవ
నది రాజభటులకు నడ్డమై పొదలి
కదలక పర్వతాకారమై యుండె
నాకొండవలె నున్న యది చూచి భటుల
మూఁక రానోడుచు మొనచెడి యరిగి
నాదట వేగ రామానుజమౌని
యాదవాచలమున కరిగె నంతటను
నడుగక కపటసన్యాసియై తనదు
కడకు వచ్చుట యని కడుఁ గోపగించి
తివిరి చోళుఁడు కూరతిలకునేత్రములు
తివియుండ యని పల్క ధీరుఁడై యాతఁ
డనియె విష్ణుద్రోహి వగునిన్ను నిపుడు
గనుఁగొన్న యిటువంటికన్ను లేమిటికి
నని తమగోళ్ళతో నపుడు రాఁ దిగిచి
కొనుచు నచ్చో నెలకొనియుండలేక

సరగున నిజశిష్యసహితుఁడై రంగ
పురమున కరిగి యాపోయివచ్చుటయు
వడిమీఱ నొకశిష్యవరు లక్ష్మణార్యు
కడకుఁ బంపుటయు శీఘ్రమె యేగి యతఁడు
వినుపింప నెంతయు విన్ననై వగచి
కనలి శ్రీవేంకటగ్రావేశుఁ దలఁచి
జగతీశ చోళపాషండి నిర్మూల
మగుఁ గాక యని యొక యర్ఘ్య మిచ్చుటయు
వెలయుప్రహ్లాద విద్వేషిపైఁ గనలు
నలనరసింహునియనువున నింగి
శ్రీవేంకటేశుండు శితఖడ్గధార
నావేళ కలలోన నరుదెంచి వాని
గళనాళ పార్శ్వంబు ఖండింప నందు
విలవిల మనుచుఁ బర్వినకంపుతోడ
బెడిదంపుఁబురువులు భేదించి పుచ్చి
వెడలంగఁ జోళుండు విడిచెఁ బ్రాణమ్ము
లదిమొదల్ క్రిమికంఠుఁ డనుపేర వాఁడు
విదితుఁడై యుండెఁ దద్వృత్తాంత మెల్ల
రామానుజార్యుఁ డారసి సంతసించి
యామోదవార్ధి నోలాడి యామీఁద

నారాయణాచలనాథు శ్రీనాథు
నారాయణుని భక్తి నాట సేవించి
యతనియుత్సవచేరమయెన్నదగిన
జితకాము శతరూప శ్రీమనోహరుని
యదుగిరీశ్వరు సంపదాత్మజాహ్వయుని
ద్రిదశవందితుని బ్రతిష్ఠ గావించి
శ్రీరంగమునకు వేంచేయ నుంకింప
నారసి యట నున్న యఖిలవైష్ణవులు
నేతెంచి మిముఁ బాసి యిచ్చోట నుండ
నేర్తుమే మౌనీంద్ర! నీరూపు గాఁగ
నొకవిగ్రహము నిట నునిచిన మాకు
నకలంక ! యొకమనసై యుండు ననినఁ
దమవిగ్రహంబుచందమున కెంతయును
నమర నర్చావిగ్రహంబుఁ జేయించి
యట నిల్పి సకలశిష్యావృతుం డగుచుఁ
బటుగతి శ్రీరంగపట్టణంబునకు
వేంచేసి యాకూరవిభుఁ గౌఁగిలించి
యంచితభక్తిమై నందంద వగచి
వరదుఁడౌ హస్తిపర్వతరాజువాసు
కరమర్థి వినుతించి కరుణ దైవాఱ

నలకూరనాథున కప్రాకృతాక్షు
లిలలోన వెలయంగ నిప్పించి యంత
నలకూరనాథుని యాత్మజువంశ
తిలకు శ్రీభట్టరుఁ దిర మొందుప్రేమఁ
దోకొని రంగనాథుని భజియింపఁ
జేకొన్నభక్తి నీ శ్రీరంగనాథుఁ
డాకూరనాథునియాత్మసంభవుని
గైకొని నిజపుత్త్రుఁ గావించుకొనియె
నంతట రామానుజార్యశేఖరుఁడు
సంతసింపుచు నివాసమున కేతెంచి
యమదండదండనం బైన త్రిదండ
మమలవేదత్రయం బన నొప్పుమిగుల
మలయక యుభయమీమాంసానురాగ
ములు తమ్ము మిగులఁ బ్రేముడిఁ జుట్టినట్లు
మలయుచు భూషాయమానకాషాయ
ములు కటితటి శిరములఁ జెన్నుమీఱ
గాత్రంబుమీఁద సంకలితసద్బ్రహ్మ
సూత్రమౌ నలబ్రహ్మసూత్రంబు మెఱయ
హరిజయస్తంభంబు లందుఁ దన్ముద్ర
లిరవొందఁ బెట్టిన యింపు దీపింప

మొనసిన నిజబాహుమూలంబులందు
గనుపట్టు శంఖచక్రములు శోభిల్ల
బాలమున్నీటిలోపల నీదులాడి
బాలుండు మెట్టిన పదపంక్తి యనఁగ
నురుతరాయతధవళోర్ధ్వపుండ్రములు
కరము శోభిలఁగ లక్మణమౌనివరుఁడు
అజనుతరామానుజార్యసిద్ధాంత
విజయధ్వజంబుల విత్తయై మిగులఁ
దళుకొత్తుచుండు త్రిదండముల్ దాల్చి
యలఘుశాస్త్రాధారు లగుయతీశ్వరులు
పొందుగా నిజపార్శ్వముల నేడునూఱు
మంది యెంతయు నసమానులై యంత
చెలఁగు డెబ్బదినాల్గుసింహాసనములఁ
గలిగినదేశికాగ్రణు లేడువేలు
నెన్నంగఁదగినట్టి యేకాంగిముఖులు
నున్నతిం గొలువ సర్వోన్నతుం డగుచుఁ
బరమతమదదంతిపంచాస్య మగుచు
నరుదార నుభయవేదాంతశాస్త్రములు
గలిగినశిష్యసంఘములకు నెమ్మి
చెలఁగ వ్యాఖ్యానంబు సేయుచునుండె



నురుభక్తితోడ నియ్యోగీంద్రవరుల
చరిత మొక్కొకమాఱు జను లెవ్వరేని
వినిన వ్రాసినఁ జదివినఁ బేరుకొనిన
నెనలేనియిష్టంబు లెసఁగించు ననుచు
నలమేలుమంగకు నమలాంతరంగ
కలినీలవేణికి నబ్జపాణికిని
అతిలోకమతికి శేషాచలరాజ
పతికి సరోముఖ్యభక్తసంతతికి
నంకితంబుగను శ్రీహరిభక్తనికర
పంకజార్యమతాళ్ళపాకన్నయార్య
తనయ తిమ్మార్యనందన రత్నశుంభ
దనుపమశ్రీవేంకటాద్రీశదత్త
మకరకుండలయుగ్మమండితకర్ణ
సకలవైష్ణవపాదసంసేవకాబ్జ
సదనావధూలబ్ధ సరసకవిత్వ
విదితమానస తిరువేంగళనాథ
కృత మైన పరమయోగివిలాస సుకృతి
నతులితంబుగ నష్టమాశ్వాస మయ్యె.


సంపూర్ణము.

  1. యోగ
  2. ప్రభావమున
  3. గతులతో
  4. దెప్పించి
  5. పొక్కు
  6. మలసు
  7. లాని
  8. భావించి
  9. పథ