పదబంధ పారిజాతము/చెఱి ఒకటి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చెవిలో వేసికొను

 • మనసు పెట్టి విను.
 • "వా డేం చెప్పినా చెవులో వేసుకోడు." వా.

చెవిలో సొంటికొ మూదు

 • మూర్ఛపడినప్పుడు శుశ్రూష చేయు.
 • ".....సూర్య సుతుండు దేవతా, సూదన బాణవేగమున సొమ్మసిలెం జెవి లోన సొంటికొ,మ్మూఁదినవాఁడ వైతివె యయో..." రామాభ్యు. 8. 103.

చెవి వాలవేయు

 • చెప్పుడుమాటలకు లోబడు.
 • "అది వాళ్ల అమ్మమీద రోజూ ఏవేవో చెప్తూండే సరికి వాడూ చివరికి చెవి వాల వేశాడు." వా.

చెవి సోక జెప్పు

 • మనసునకు నాటునట్లు చెప్పు.
 • "చెవి సోఁకఁ జెప్పఁగన్." విజయ. 1. 31.

చెవుడు పడు

 • చెవులు గడియలు పడు - ముఖ్యంగా పెద్దశబ్దం వినుట వల్ల.

చెవుడు పఱుచు

 • చెవుడు కలుగునట్లు చేయు.

చెవుడుపాటు

 • చెవుడు కలుగుట.

చెవుడ్పాటు.

 • చూ. చెవుడుపాటు.

చెవులపండువుగా

 • కర్ణ పర్వముగా, వినుటకు ఇం పైనదిగా.
 • "నాకుఁ జెవులపండువుగ వినిపింపు నీ పలుకు లనియె." కళా. 3. 34.
 • "కవిబుధ శ్రేణికిఁ జెవులపండువులుగా, నాస్థానమున మాటలాడ నేర్చు." భీమ. 1. 65.

చెవులపిల్లి

 • కుందేలు.

చెవులపువ్వులు

 • ఒక చెవినగ. బుగడల వంటిది.

చెవులపూవులు

 • చెవినగ.

చెవులపోతు

 • కుందేలు.
 • "చెవులపో తెదు రయ్యెఁ జెమరు డా దెసఁ జూపె." ఉత్త. రా. 6. 235.

చెవుల బెట్టికొను

 • విను.
 • "కాని యా తప్పు నీ, చెవులం బెట్టి కొనంగ రాని పురి గాసిం బెట్టి కట్టిండి వా,సవుఁ డెట్టుం దనుఁ జంపఁజాలు...." ఉ. హరి. 1. 184.

చెవుల బెట్టు

 • చెప్పినది విను.
 • "ఏ మనఁగ నేమి నీమగఁ, డేమాటలు చెవులఁ బెట్టఁ డించుకయేనిన్." నలచ. 5. 141.

చెవుల బోయు

 • చెప్పు; బోధలు చేయు.
 • "చెవులఁ బోయమె సవిశేష కార్య వచనములు." భార. స్త్రీ. 1. 142.

చెవులలో చెట్టు మొలుచు

 • వినిపించుకోక పోవు. నిరసనగా అనుమాట. కొత్త. 346.

చెవులలో వేళ్లు పెట్టుకొను

 • ఏ మాత్రం వినక పోవు.
 • "వా డే మంచిపాట విన్నా చెవులలో వేళ్లు పెట్టుకొంటాడు." వా.
 • "మా సంగతి మేం మాట్లాడుకొంటూ ఉన్నాం. ఇష్టం లేకపోతే చెవుల్లో వేళ్లు పెట్టుకో." వా.

చెవుల వ్రేళ్ళు చెఱివికొను

 • చెవులు మూసుకొను - శబ్దము విన లేక.
 • "బిట్టుల్కి గట్టురాపట్టి దొట్టినభీతిఁ, జెవులఁ జుట్టనవ్రేళ్లు జెఱివికొనియె." దశా. కూర్మ. 49.

చెవులు గడియలు పడు

 • తిండి లేక పోవుటతోనో, పెద్ద శబ్దంవల్లనో చెవులు మూసుకొని పోవు.
 • "ఉడుగనిపస్తులఁ జెవులను, గడియలు వడ మేను వడఁక..." పాండు. 3. 103.
 • "మూన్నాళ్లనుంచీ తిండి లేక చెవులు గడియలు పడ్డాయి." వా.

చెవులు గఱచు

 • చాడీలు చెప్పు.
 • "పలు గూఁత లఱచువానిన్, గలు ద్రా వెడువానిఁ జెవులు గఱచెడు వానిన్." వేంక. పంచ. 1. 445.

చెవులు గింగురు మను

 • దెబ్బతో చెవులలో శబ్దము పుట్టు.
 • "ఆ శబ్దంతో చెవులు గింగురు మన్నవి." వా.

చెవులు చిందర్లు వోవు

 • చెవులు చిల్లులు వడు.
 • "చెవులు చిందర్లు వోవ." విప్ర. 4. 19.

చెవులు చిందఱ పోవు

 • చెవులు తూట్లు పడు - శబ్దాతిశయమువలన....
 • "చెవులు చిందఱ వోవఁ జెలఁగుకవీంద్రుల, పో రంటిమా..." కళా. 7. 19.

చెవులు చిందఱలు వోవు

 • చెవులు తూట్లు పడు - ఎక్కువ శబ్దముచే ననుట.
 • "చెవులు సిందఱలు వోఁ జెలఁగెఁ జిమ్మటలు." హరి. ద్వి. 1 భా.

చెవులు చికిలీ చేసుకొని

 • సావధానతతో.
 • "నీ పాట వినడానికి చెవులు చికిలీ చేసుకొని కూర్చున్నాను." వా.

చెవులు చిల్లులు వోవు

 • చెవులు తూట్లు పడు.
 • "చిలుకలు వల్కునో చెవులు చిల్లులు వోవఁగ నంచు నెన్నఁడున్." నైష.
 • చూ. చెవులు చిందఱ పోవు.

చెవులు చీములు గట్టు

 • దుర్భాషలచే బాధ కలుగు.
 • విన రానిమాటల వల్ల బాధపడు.
 • "పుడమిజనంబు లెల్ల నినుఁ బ్రువ్వఁగఁ దిట్టఁగ వించు నున్కి నొ, చ్చెడుమది యెప్పుడుం జెవులు చీములు గట్టెడుఁ గౌరవేశ్వరా!" భా. 2. 10.

చెవులు ఝాడించుకొని

 • పని కాక వెను తిరిగి.
 • "అంత దూరమూ వెళ్లి వాడు లేక పోయేసరికి, చెవులు ఝాడించుకొని వచ్చాను." వా.

చెవులు తెగిన వెధవ

 • ఒక తిట్టు - వ్యర్థుడు. నిష్ప్రయోజకుడు.

చెవులు తెగు

 • విధవ యగు.
 • ముండ మోస్తే భూషణాదులను తీసి వేస్తారు. ముత్తైదువ లక్షణాల్లో చెవియాకు ఒకటి. అందుపై యేర్పడిన పలుకు బడి.

చెవులు పట్టి యాడించు

 • వశవర్తిని చేసికొను.
 • "గరుడ గంధర్వ యక్ష కిన్నరులఁ గన్నఁ, జెవులు వట్టి యాడించు నశేష లోక..." నిర్వ. 4. 22.
 • "నిను గీతి సాహితీ మో,హనవాణులు చెవులు వట్టి యాడింపగా." విజ. 1. 155.

చెవులు బీటలు వాఱు

 • అతి శబ్దముచే చెవులు పగులు.
 • "చెవులు బీఁటలు వాఱంగఁ జెలఁగు నమ్మ, హారవమున కులుకక..." భార. ద్రో. 3. 222.

చెవులు మూసుకొను

 • వినరాని మాట అంటున్నావు సుమా అని సూచించు.
 • "ఆ దైవదూషణ వింటే ఏ ఆస్తికుడైనా చెవులు మూసుకుంటాడు." వా.

చెవులు సోకు

 • వినబడు, చెవిబడు.
 • "ఎట్టి వార్త, చెవులు సోఁకు నొక్కా చే వెట్టి కలఁచిన, భంగిఁ ద్రిప్పికొనఁ దొడంగె మనము." భార. ద్రోణ. 2. 230.
 • "వీణా,స్ఫుటమధురరవంబు చెవుల సోఁకినమాత్రన్." రుక్మాం. 2. 126.

చేంతాడు

 • బావిలోనుండి నీళ్లు తోడుకు నేందు కుపయోగించేతాడు.

చేకటులు

 • చేతులకు పెట్టుకునే ఒక రకమైన కడియాలు.

చేకట్టుదండ

 • చేతులకు కట్టు కట్టే దండ. వాకట్టు వంటిదే ఇక్కడి చేకట్టు.
 • "వాకట్టు బదనిక చేకట్టుదండలు." శృం. శాకు. 1. 113.

చేకత్తి

 • చేతికత్తి. చేకత్తికాడు
 • వీరుడు, భటుడు.

చే కలవాడు

 • బలశాలి, ఉదారశీలి. దాత అని శ. ర.
 • "నీరజగర్భ రమావిభుం గడుం, జే కల వాఁ డటం డ్రతని చిత్తము లాసమరంబు సేసి." శేష. 4. 92.

చే కాచు

 • చేయి అడ్డుపెట్టు.
 • "కొనగొమ్ము నాటునొ కోమలపాణి, యనుచుఁ జే కాచి." వర. రా. బా. పు. 49. పంక్తి. 25.

చే కానుక

 • కానుక.
 • "నాకుఁ జే, కానుక చేసె నీనృపతి కామిని." శుక. 3. 534.

చే కాన్క

 • కానుక. దశా. 1. 278.

చే కాసు

 • చేతిలోని డబ్బు. ఉన్నడబ్బు అనుట.
 • "తఱితీపు పుట్టించి తక్కి చేకా సెల్ల, వడివెట్టి రాఁదీయ వారిఁ జూచి." విప్ర. 4. 16.

చేకురు

 • దొరకు.

చేకూడు

 • దొరకు, నెరవేరు.

చేకూనలు

 • చేతిబిడ్డలు, చిన్న దూడలు.
 • "దసరయ్య దివ్యమస్తకసురధేను, లెసగఁ జేకూనల నీనినయట్లు." పండితా. ప్రథ. పురా. పుట. 305.

చేకూరు

 • 1. దొరకు.
 • 2. కలుగు.
 • "లోకఖ్యాతి చేకూరు." రుక్మాం. 2. 79.

చే కూలి

 • దినకూలి.
 • "ఏదో పని చేయడం డబ్బు తీసుకొనడం. నెలకొలువు కాదు.
 • "బాపని యింటఁ, జేకూలికిని గొల్చి జీవించుచుండి." పండితా. ప్రథ. దీక్షా. పుట. 145.
 • "చేకూలి గాని, పని వెలగొని చేయు బంట్లకు రాశి, గొనవచ్చు నే తన కూలియే తక్క." బసవ.

చే కొణుచు

 • పచ్చ చెదలు.

చే కొణుదు

 • పచ్చ చెదలు. శ. ర.

చేకొద్ది కుంచము

 • అందుబాటులో నున్న అమూల్యవస్తువు.
 • "కరతలామలకంబు కైవల్యసంపద, యింటఁ జేరినపంట యీప్సితంబు, ఓడఁ గట్టినదూల మీడు లేనిశుభంబు, చేకొద్దికుంచ మశేషభూతి." చంద్రా. 1. 57.
 • చూ. చేపట్టు కుంచము. చేకొను
 • దగ్గర తీయు; తీసుకొను.
 • "మానము దూలినవాని...జేకొండ్రె." భాస్క. యుద్ధ. 1243.
 • ఇతర భావచ్ఛాయ లనేకం దీని ననుసరించే కానవస్తాయి.

చేకోల

 • చేతికఱ్ఱ.

చేకోలు

 • చేకొనుట.

చేగగడ్డ

 • ఒక ఓషది. బ్రౌన్.

చేగడియ

 • వాకిలి కున్న గడియ. చేతితో తీయగలది - చిన్నది. శుక. 2. 127.

చేగ దేరు

 • చేవ దేఱు; గడిదేరు.
 • "చేగదేరి వారలు సేసినదే చేఁత." తాళ్ల. సం. 8. 118.

చేగానుగ

 • చేతితో త్రిప్పేగానుగ. హర. 1. 18.

చేగిండి

 • చేతితో పట్టుకొనగల గిండి - కూజాచెంబు. దశా. 4. 97.

చేగొడ్డలి

 • గండ్రగొడ్డలి, చిన్నగొడ్డలి. భాగ. 9. 467.

చేగోడీలు

 • ఒక తినుబండం. కోడివడలు, కోడిమెడలు అని దక్షిణాంధ్రం వాడుక.

చే చమురు

 • నెయ్యి - చేతిలో వేసు కుంటారు గనుక.

చే చాచు

 • ఆశించు, సిద్ధపడు.
 • "ఎవ్వారికిం, జేరన్ రానిమహానిధానమునకుం జే చాచితిం దొయ్యలీ!" ఉత్త. హరి. 5. 155.
 • "ఎవ్వనితో నిచ్చోటం, జివ్వకుఁ జే సాఁప వలదు." కాశీ. 1. 109.
 • పరమ. 3. 157. పుట.

చేచేత కుడిపించు

 • స్వయముగా అనుభవింప జేయు.
 • "చేసినకార్యంబు చేచేతఁ గుడిపించె." శశి (అప్ప) 467.

చేచేపు

 • చేపు.
 • "పాలిండ్లు చేచేప, మదిఁ బుత్రుపైఁ బ్రేమ మల్లడి గొనఁగ."

చేజిక్కు

 • వశ మగు. రాధ. 2. 105.

చేజేతుల చేసికొను

 • స్వయంగా చేసుకొను.
 • "ఆ వ్యాపారంలో దిగి పాడై పోయావు. చేజేతులా చేసుకొన్నదానికి ఒకరిని అని లాభం యే ముంది?" వా. చేజోడి
 • చేతులు చేతులు పట్టుకొని పోవువాడు.
 • "వ్రీడ యించుక లేని చేజోడి బొజుగు." కవిక. 4. 99.

చేట కొట్టు

 • ఇం కేమీ లే దను.
 • ధాన్యం అయిపోయిన దని చేటను తట్టుటపై వచ్చిన పలుకుబడి.

చేటకొల్లారు

 • త్రిశాల. గృహవిశేషం. ఆంధ్ర. భా. ద్వి. 161.

చేట చేరుపుగా

 • గోడకు చేట నానించినట్లు - కొంచె మేటవాలుగా.
 • "చేట చేరుపుగా పెట్టవే పళ్ళెం. పడ గలదు." వా.

చేట పెయ్య

 • 1. పనికి మాలినవాడు.
 • "చెఱచుటకు చేట పెయ్య చాలును." సా.
 • 2. దూడ పోగా గడ్డి, చర్మంతో కుట్టిన దూడరూపు.

చేటప్పు

 • చేబదులు.
 • అందులో డబ్బయితే చేతి అప్పు, ధాన్యమయితే చేటప్పు.

చేట యెత్తుక వచ్చు

 • తన్నుటకై వచ్చు.
 • ఆడవాళ్లు సామాన్యంగా చేటతోనూ, పొరకతోనూ కొట్టుటా, కొట్టుదు మనుటా అలవాటు. అందుపై వచ్చిన పలుకుబడి.
 • "చెవు డనఁగా రాదు చేట యెత్తుక వచ్చు." శుక. 3. 21.

చేటలో పడినదిమొదలు కాటిలో పడువఱకు

 • పుట్టినదిమొదలు చచ్చు వఱకు.
 • "చేటలోఁ బడినదిమొదలు కాటిలోఁ బడువఱకు, మనము ప్రత్యక్షముగ, నిరంతరముగ నేడువవలసిన యేడుపులు మనకుఁ జాలునా?" సాక్షి. 66.
 • పూర్వకాలం మంత్రసానులు పిండం బయట పడగానే చేటలో పెట్టు అలవాటుపై వచ్చిన పలుకుబడి.

చేటలో పడు

 • పుట్టు.
 • చూ. చేటలో పడినది మొదలు...

చేటుకాలము

 • వినాశకాలము.
 • "చేటుకాల మైనఁ బ్రతిపట్టి నంతియ." భార. ద్రోణ. 4. 291.
 • "నరకుఁ డిమ్మెయి, గారించెం దనకుఁ జేటుకాలంబునకున్." ఉ. హరి. 1. 114.
 • ఇది నేటికీ చిత్తూరు ప్రాంతంలో విశేషంగా ఉపయోగిస్తారు.
 • "వాడి కేం చేటుకాలం వచ్చింది? అంత మాట అన్నాడు." వా.

చేటుగాలము వచ్చు

 • పొయ్యేకాలము వచ్చు.
 • చూ. పొయ్యేకాలము వచ్చు.

చేటుతఱి

 • అవసానకాలము. భాస్క. రా. యు. 461.

చేటుపడు

 • చచ్చు, భగ్న మగు.
 • చూ. చేడ్పడు.

చేటుపాటు

 • భంగపాటు. వేం. పంచ. 3. 168.

చేటుపాటులకు లోనగు.

 • ఇబ్బందులకు, ఇక్కట్టులకు లోబడు.
 • "అకటా ! నీ విటు చేటుపాటులకు లో నై యున్నయిల్లాల విం,తె కదా ! పుట్టినయిల్లుఁ జేర్చువగ లేదే..." శుక. 3. 265.

చేట్పాటు

 • కష్టము. భీమ. 3. 4.

చేట్ల కొఱివి

 • ఒక తిట్టు.
 • దౌర్భాగ్యుడు - దుష్టుడు. కొంపలకు నిప్పంటించువాడు. కొఱవి అనికూడా తిట్టుగా ఉపయోగించడం కలదు.

చేట్ల పురులు

 • అమాయకురాలు, పసిపాప. పూర్వం చేటలో పురుడు పోసుకునే వారు.
 • చేటలోని పురుడు - శిశువు - వంటి అమాయకురాలు.
 • 'చేటలో పడింది మొదలూ' అని పలుకుబడి.
 • "ఆతనిఁ గోరి తపము, సేసెదట గౌరి! నీ వెంత చేట్లపురులొ!" కుమా. 7. 38.
 • చూ. చేటలో పడు.

చేడ్పడు

 • చేటు చెందు, నొప్పి పెట్టు, చెడు.
 • "కాలు చేడ్పడఁ దన కేల తిరుగ." భీమ. 4/ 32/
 • వాడుక లోనూ 'కాళ్ళు చెడేట్టు తిరిగాడు' అంటారు.

చేడ్పాటు

 • చూ. చేడ్పడు.

చేతకత్తె

 • చెలికత్తె.
 • "అతనుచేఁతకత్తె లమరంగఁ గాంతలు." వేమన.

చేత కాని....

 • అసమర్థ మైన, వ్యర్థ మైన.

చేతగట్టు

 • కృతకాద్రి. శ. ర.

చేతగాని మాటలు

 • పనికి రాని మాటలు.
 • "ఊరికే చేతగాని మాటలు మాట్లాడ వద్దు." వా.

చేత గుండెకాయ యిడినా

 • ఎంత నమ్మించినా.
 • "వారల నమ్మంగఁ, గాదు సేత గుండె కాయ యిడిన." భార. శల్య. 2. 397.

చే తడి యార లేదు

 • పని ముగిసి ఇంకా కాసింత సే పైనను కాలేదు. ఆ పని చేసి యింకా క్షణ మైనా కాలేదు - చేతడి యారునంత సేపు కూడా పట్ట లే దనుట. పని ముగించగనే చేతులు కడుగుకొనుట - నిత్య నైమిత్తిక కర్మలలో 'అప ఉపస్పృశ్య' అనుకొనుట ఆచారము. అది యాఱ లే దనగా ఆ తడి యింకా ఆఱ లే దనుట.
 • "ఆజ్ఞ వెట్టించి చే తడియార దిపుడు, దీని కెబ్భంగి మోహనం బైనవేణి, గలిగె." కా. మా. 1. 54.
 • రూ. చే తడి యాఱ లేదు.
 • "చెట్టులఁ గట్టి నమ్ము మని చే తడి యాఱదు చంపు టెట్లు..." పంచ. వేం. 1. 49.
 • చూ. చేతడి యాఱకుండ.

చే తడి యాఱకుండ

 • వెనువెంటనే.
 • "చెలువ కుమారునిన్ వడుగు చేసిన చేతడి యాఱకుండఁగాఁ బొలు పెస లారఁగా..." హరవి. 2. 103.

చేత తడాఱదు

 • ఇప్పు డిప్పుడే ఆ పని చేసితి నను సందర్భంలో ఈ పలుకు బడిని ఉపయోగిస్తారు.
 • దానం చేసేటప్పుడు ధారా పూర్వకంగా చేసే అలవాటుపై వచ్చిన పలుకుబడి.
 • "చేతి తడాఱ దుచ్ఛిష్టపు లేమ." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 390.
 • "వాడికి ఎంత పెట్టానో లెక్క లేదు. ఇంకా నా చేతి తడి ఆరక ముందే వాడు ఎదురు తిరగడం మొదలు పెట్టాడు." వా.
 • క్రమేణా ఈ పలుకుబడి ఏ పనైనా చేసీ చేయక ముందే అనే అర్థంలో కూడా పరిణమించింది.
 • చూ. చే తడి యార లేదు.

చేత తీఱ కుండు

 • చేయి తీరక పోవు, తీరుబడి లేక పోవు.
 • "తెంపు సేయఁగఁ జేతఁ దీఱకున్నదియొ." వర. రా. సుం. పు. 91. పంక్తి. 3.

చేత దీఱు

 • చేత అగు.
 • "పో నేర నచ్చటికి నా చేతఁ దీఱదు." వర. రా. బా. పు. 191. పంక్తి. 9.
 • చేత తీఱ దనగా, చేత కా దనుట.

చేత నగు

 • చేయుటకు సమర్థు డగు. ఇది అన్ని రకాలుగాను ఉపయోగిస్తారు.
 • చేత కాని వాడు, వాడికి చేత నవుతుంది. వాడి చేత కాదు ఇత్యాదులు.
 • "అతని నంపించు మిప్పటి కితనిచేతఁ, గాక యుండినఁ జూతము గాక యనిన." హంస. 5. 194.

చేతనపడు

 • తెలివి నందు.

చేతనబ్రాలు

 • తలబ్రాలు.
 • "తరంగమాలికా, నీతము లైనముత్తెములు...చేతనఁబ్రాలు వోయుగతి." వాల్మీ. 1. 70.
 • రూ. చేతన్నబ్రాలు.

చేతనించు

 • తెలివి పొందు.

చే తప్పు

 • చేతితప్పు - వ్రాతలో.

చేత నయినట్లు చెప్పు

 • ఎంత తెలిస్తే అంత చెప్పు.
 • "ఎఱుంగకున్న నీ,చే నయిన ట్లిఁకం దెలిసి చెప్పు మనన్." కళా. 7. 15.
 • "నేను చెయ్యలే నంటే కుదరదు. ఇం కెవరూ లేరు. నీచేత నయినంతవఱకే చేయి." వా.

......చేత పోవు

 • ....చేత మరణించు.
 • "కృపాశ్వత్థామ కృతవర్మ కర్ణ శల్యులు నీచేతఁ బోయెడువారు." భార. కర్ణ. 2. 122.

చేత బట్టు

 • ఆధారముగా చేసుకొను. భార. విరా. 117.

చేతబడి

 • మంత్రతంత్రాదులతో ఒకరికి కీడు గలుగునట్లు చేయు అభిచారికక్రియ.
 • "వాడు చేతబడి చేయించినాడు. దానితో ఆ కుటుంబం నాశనం అయి పోయింది." వా.

చేతఱికము చేయు

 • కీడు చేయు.
 • "ప్రాఁత యగుమంత్రి తనకుం, జేఁతఱికముఁ జేసె ననుచు శిక్షించి."

చే తవులు

 • దొరకు.
 • "చేతుల కసివోఁ గయ్యము, సేత విలెడు...." ఉత్త. హరి. 5. 22.

చేతాకు

 • సాహసము, పొగరు.
 • "నాతోఁ దలపోయక రో, షాతురతన్ బ్రతిన వట్టి తవనీనాథ, వ్రాతంబు వినఁగ నిట్టులు, చేతాఁకున దెప్పరంబు సేసితి కంటే." భార. ద్రోణ. 2. 302.

చేతా వాతా కాని

 • చేత కాని.
 • "వాడు వట్టి చేతా వాతా కానివాడు." వా.
 • "వాడికి చేతా కాదు వాతా కాదు." వా.
 • రూ. చేతాకాదు, వాతాకాదు.

చేతి కబ్బు

 • దొరకు.
 • "కొమెరవయసుదే చేతి కబ్బెను కొంక నేమిటికి." తాళ్ల. సం. 3. 64.

చేతికాయ

 • చేదుకాయ.
 • ఇలాగే చేతిదొండ, చేతి దోస, చేతి పుచ్చ, చేతి పొట్ల, చేతి బీఱ, చేతి సొఱ ఇత్యాదులు - చేదైన...

చేతికి అంది వచ్చు

 • సాయపడగల స్థితికి వచ్చు.
 • "సమయానికి కొడుకు చేతికి అంది వచ్చాడు గనక సరిపోయింది గానీ, లేక పోతే నానాబాధా పడిపోయేవాడు." వా.
 • చూ. చేతికి వచ్చు.

చేతికి ఎముక లేక

 • ధారాళంగా, దాన పరుడుగా.
 • "చేతికి నెమ్ముక యింత యుండమిన్." పాణి. 5. 28.
 • చూ. చేతికి ఎముక లేదు.

చేతికి ఎముక లేదు

 • అతి దానశీలు డనుట.
 • "వాడిచేతికి ఎముక లేదు. అడిగినవాడి కల్లా అడిగినంతా యిచ్చాడు." వా.

చేతికి చిప్ప యిచ్చు

 • సర్వనాశనము చేయు.
 • భ్రష్ట మొనర్చు.
 • "వాణ్ణి నమ్ముకుంటే నీకు చేతికి చిప్ప యిచ్చి పంపిస్తాడు." వా.

చేతికి చెయ్యి నష్టం

 • ద్రవ్యం మారకంవల్ల కలిగే నష్టం.
 • దినినే వట్టం అంటారు. కాశీయా. 72.

చేతికి రాని

 • అక్కరకు రాని.
 • "అలయక నాల్గుచట్ల పెరుఁ గమ్మినఁ జేతికి రాని రూక నా,వలె నల సంతలోన..." శుక. 2. 580.

చేతికి లోనగు

 • దొరకు.
 • "చేతిపదార్థముఁ దలఁచక చేరువ నుండినవారల, చేతి పదార్థము గోరిన చేతికి లో నౌనా." తాళ్ల. సం. 5. 209.

చేతికి వచ్చు

 • 1. తనకు తోడ్పడుటకు తగిన వయసువా రగు.
 • "వాడి కేం? వాడి కొడుకులు చేతికి వచ్చినారు." వా.
 • 2. దొరకు.
 • "డబ్బు చేతికి వచ్చిందా." వా.

చేతిక్రింద....

 • అధికారము క్రింద, యాజమాన్యము క్రింద.
 • "అతని కేమి? అతని చేతిక్రింద బోలెడంతమంది పని చేస్తున్నారు." వా.
 • "ఆ ఊళ్లో అలగాజనం అంతా అతడి చేతికిందనే ఉంటారు. వాడు ఏ మయినా చేయగలడు." వా.

చేతి కీలుబొమ్మ

 • చెప్పినట్లు వినునట్టివాడు - వినునది.
 • "వాడు పెళ్లాంచేతి కీలుబొమ్మ అయిపోయాడు." వా

చేతిగరలు కనబడు

 • తెల తెలవాఱు.
 • రాయలసీమలో నేటికీ వాడుకలో -
 • 'చేతి గీరలు కనబడే పొద్దున లేచిపోతిని.'
 • 'పరువు నేల పోయేటప్పటికి చేతిగీరలు కనబడినాయి.' అంటారు.
 • "తన చేతి గరలు కనఁబడఁ, జనియెఁ బ్రభావతి రహస్య సదనంబునకున్." శుక. 4. 88.
 • చూ. చేతిగీరలు కనబడు.

చేతిగీరలు కనబడు

 • తెల తెలవారు.
 • "చేతిగీరలు కనబడగానే వెళ్ళరా. సులువుగా వూరు చేరుకుంటావు." వా.

చేతిచమురు భాగవతము

 • దండుగపని.
 • సొంతడబ్బు ఖర్చు పెట్టుకొని చేయు సమష్టి పని.
 • భాగవత మాడించుటకై అగు ఆముదపు ఖర్చు అంతా తా నొకడే భరించడం దండుగే కదా?

చేతిచిలుము వదలు

 • డబ్బు దండుగ అగు.
 • "ఆ వ్యాజ్యంలో దిగితే చేతి చిలుము వదలడం తప్ప నీకు జరిగే ఉపకారం ఏమీ లేదు." వా.

చేతి తీట మాన్చు

 • భుజకండూతి తొలగించు.
 • "కలిగెఁ గదా ! నాకుఁ గదనరంగమునఁ, గలుషంబుతోఁ జేతిగమి తీఁట మాన్ప." ద్విప. భాగ. కల్యా. పు. 147.

చేతి నిమ్మపండు

 • వశవర్తి.
 • "చుట్టాల సురభి రాజుల చేతి నిమ్మ, పండు." బహులా. 5. అ.
 • చూ. చేతిలోని వాడు.

చేతి బంగారము

 • అందుబాటులోని అమూల్య వస్తువు. తాళ్ల. సం. 9. 219.

చేతిబరువు కనుగొను

 • పరాక్రమము రుచి చూచు.
 • "నా చేతిబరువు, గనుఁగొనియెద విపుడ యనియె." భార. కర్ణ. 2. 12.

చేతిబిడ్డ

 • పసిబిడ్డ.
 • చంటిబిడ్డకన్న కాస్త పెద్ద.

చేతిమీదుగా.....

 • పర్యవేక్షణక్రింద, యాజమాన్యముక్రింద.
 • "నీచేతిమీదుగా ఎన్ని శుభకార్యాలో జరిపించావు. ఈ ఒక్క కార్యం కూడా నీచేతిమీదుగానే జరగనీ అని నా అభిలాష." వా.
 • "ఈ ఊళ్లో ధర్మకార్యా లన్నీ అతడి చేతిమీదుగా నడచేవే." వా.

చేతి యదరువ్రేతలు

 • అదురు వేట్లు
 • "లజ్జారోషభూషితంబు లైన యా యోషారత్నంబు, చేతి యదరువ్రేఁతలు తమకు నూతనోత్సవంబు లగుచు." ప్రభా. 5. 69.
 • నేటికీ రాయలసీమలో వాడుకలో ఉన్నది.
 • "ఒంటిగా చిక్కినప్పుడు నాల గదురేట్లు వేసి పంపితే వాడే దారికి వస్తాడు." వా.

చేతియద్దము

 • పిడి ఉండి చేతితో పట్టుకొనుట కను వయిన అద్దము.

చేతిలో ఉండు

 • వశవర్తి యై ఉండు.
 • "వాడు నాచేతిలో ఉన్నాడు. ఏం చెయ్య మన్నా చేస్తాడు." వా.

చేతిలో చేయి వేయు

 • ప్రమాణము చేయు.
 • "వా డీపని చేస్తా నని చేతిలో చేయి వేసి చెప్పాడు." వా.

చేతిలో తడి

 • చూ. చేతిలో తేమ.

చేతిలో తేమ

 • డబ్బు.
 • "చేతిలో తేమ ఉంటే ఈపాటికి యిలా ఉండేవాణ్ణా?"
 • "చేతిలో తేమ లేక మెత్తబడ్డాడు గానీ...."
 • చూ. చేతిలో తడి.

చేతిలోనిది

 • వశ మైనది, తనది.

చేతిలోనియది

 • చేతిలోనిది.
 • "సజ్జనుని చేతిలోనియది బ్రహ్మలోకంబు." భార. శాంతి. 6. 298.

చేతిలోని వాడు

 • అధీనుడు, వశవర్తి.
 • "భీమధన్వుండు నీ చేతిలోని వాఁడ యదియ మాకుం బ్రదుకుఁ దెరువు." దశకు. 10. 43.
 • "ఇట్లు సేయరేని యింద్ర! మీ రెల్ల నా, చేతిలోని వార చెప్ప నేల." ప్రభా. 1. 88.

చేతిలో పెట్టిపోవు

 • 1. అప్పగించు.
 • "వాడు పోతూ పోతూ యీ పిల్లలను నా చేతిలో పెట్టి పోయాడు. వాళ్లను ఒకదారికి తెచ్చేభారం నామీ దుంది." వా.
 • 2. ఇచ్చు.
 • "వాడి కేదో ఒక రూపాయ చేతిలో పెట్టి పంపించు." వా.

చేతిలో ఉండు

 • స్వాధీన మై ఉండు.
 • "ఒకరిచేతిలో ఉన్నాక చెప్పిన వన్నీ చేయాలి కదా!" వా.

(ఒకని) చేతిలో బ్రతుకు

 • ఒకరి ఆధారము మీద బ్రదుకు.
 • "అ, ట్లే తా నాతని చేతిలో బ్రదుకు వాఁడే యౌఁ జుమీ మీఁదటన్." ఆము. 4. 213.
 • "ఒకరిచేతిలో బతకడం నా కిష్టం లేదు." వా.

చేతివ్రాలు

 • చేవ్రాలు. శ. ర. చేతుల కసి పోవగా
 • చేతుల కసి దీరునట్లు, చేతుల నిండా (యుద్ధము చేయు.)
 • "చేతులకసి వోవంగ న,రాతులు బెగ్గి లఁగఁ గ్రీడి ప్రకటస్ఫురణన్." భార. కర్ణ. 2. 300
 • "చేతులకసి వోఁ గయ్యము, చేత వినిన యట్టివిధము చింతించి ననున్." ఉ. హరి. 5. 22.

చేతులకసి వోవునట్లు

 • చేతులకసి తీరునట్లుగా.
 • "వీరు వా రనక వీరావేశంబునం జేతుల కసి వోవం జెలఁరేగి సింహనాదంబులు సేయుచు మోఁదువారును." ఉ. హరి. 4. 229.

చేతుల కాటి నిల్చు

 • ఎదిరించి నిలువ గలుగు.
 • "......ఏమియున్, డయ్యక కొంతసేపు పెనుఢాకను జేతుల కాటి నిల్చువాఁ, డెయ్యెడఁ బోటుబంటునకు నెంతయుఁ గౌతుకకారి కాఁడె." ప్ర. 2. 58.

చేతుల తీట

 • భుజకండూతి, యుద్ధేచ్ఛ.
 • "చెనసి కలహభీతి చేతుల తీట వోఁ, బొడువఁ జాలునేని..." కుమా. 10. 144.
 • "చేతుల, తీఁట నిలుపరాక త్రిభువనముల రేపు, చున్నవాఁడు." కుమా. 11. 103.

చేతుల చఱచు

 • చేతులతో కొట్టు.
 • "ఇరువుర మీఁదన్, జెచ్చెరఁ జేతులఁ జఱచుచు, వచ్చెను గద! దూ ఱటంచు వనరుచుఁ దమలోన్." ఉషా. 3. 57.

చేతులను తేల్చు

 • చేతులు కడుగుకొను.
 • "కర్కరికాముఖాగ్ర, గళితగంధోదకంబులఁ గంసవైరి, చేతులను దేల్చె బాంధవశ్రేణితోడ." పారి. 2. 20.

చేతుల బట్టు

 • చేర దీయు.
 • "సీతఁ గానఁగ లేక చేరిన నన్నుఁ, జేతులఁ బట్టక చెదరఁ ద్రోలుదురు." వర. రా. కిష్కి. పు. 490. పంక్తి. 16.

చేతుల లావు

 • భుజబలము
 • "వీఁడు నీ చేతులలా వెఱుంగఁడు." భార. ద్రోణ. 183.

చేతులవ్రేళ్ల మడచికొనుచు నేడ్చు

 • ఏడ్చుటలో ఏమీ చేయలేక పోవుట సూచిస్తూ చేయు చేష్ట.
 • "మార్చి మార్చి చేతుల వ్రేళ్ల మడఁచి కొనుచు, నింక నెట్లమ్మ యంచు నయ్యింతు లేడ్వ." ఉ. హరి. 5. 276.

చేతు లాడించుకొంటూ

 • పని కాక (తిరిగి వచ్చు.)
 • "ఆ నీ కొడుకు వెళ్ళ కేం? వెళ్లాడు. చేతు లాడించుకొంటూ వచ్చాడు." వా.
 • రూ. చేతు లూగించుకుంటూ.

చేతులార

 • తనివి తీరా, చేతులకు సంతృప్తిగా.
 • "చేతు లారంగ శివునిఁ బూజింపఁడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని..." భాగ. 10.

చేతులార చేసుకొను

 • స్వయంగా తెలిసి తెలిసీ చేసుకొను.
 • "చేతులారా చేసుకొన్న దానికి అనుభవించక తప్పుతుందా?"
 • చూ. చేజేతుల జేసుకొను.

చేతులు కట్టుకొని

 • వినయంతో. చేతులు కట్టుకొని కూర్చుండుట వినయసూచకం.
 • "వీళ్ళంతా యిక్కడ యిన్ని మాటలు మాట్లాడుతారు గానీ, రెడ్డిగా రొచ్చేసరికి చేతులు కట్టుకొని నిల్చుంటారు." వా.

చేతులు కడుగుకొను

 • సంబంధము వదలుకొను. చేతులు కడుగుకొనుట ఏదో పని ముగించుటను తెలుపును.
 • "ఈ పిల్లను అత్తవారింటికి పంపించి చేతులు కడుక్కొని, కాశీకి వెళ్ళి పోదా మనుకున్నాను." వా.

చేతులు కావు, కాళ్ళు

 • ప్రాధేయపడునప్పుడు అను మాట.
 • పట్టుకోవడం చేతులనే అయినా కాళ్లు పట్టుకున్నట్లు భావించు మనుట.
 • "నీ వెలాగో ఈ పని చేసి పెట్టాలి. చేతులు కా వివి కాళ్లు. వాడిమీద కోపం మానివేసెయ్." వా.

చేతులు తీయు

 • చేతులు నొప్పి పెట్టు.
 • "నిరస్తచాపుఁ డై, చేతులు తీయఁగా మరుఁడు సెజ్జపయిం బడు." నిరంకు. 2. 11.
 • "ఈ రోజు రాసి రాసి చేతులు తీస్తున్నాయి." వా.
 • దీనిపై వచ్చినవే చేతుల తీపులు, కాళ్ల తీపులు.

చేతులు నెత్తిమీదికి వచ్చు

 • దిగులు కలుగు. దిగులుగా ఉన్నప్పుడు కూర్చొని రెండుచేతులతో తల పట్టుకొనడం అలవాటు. అందుపై వచ్చినది.
 • "ఆ వ్యాజ్యం పోవడంతో వాడికి చేతులు నెత్తిమీదికి వచ్చాయి." వా.

చేతులు పట్టి పల్కు

 • అబ్బురముగా చెప్పుకొను.
 • "చానలు చేతులు పట్టి పల్కఁగన్." రాధి. 3. 79.

చేతులు పిసుకుకొను

 • ఏమి చేయుటకూ తోచక పోవు.
 • "భాగ్యదేవతలార! యీబారి గడవఁ, బెట్టరే యంచుఁ జేతులు పిసికికొనుచు." ఉత్త. హరి. 7. 185.

చేతులు బయలూచు

 • ఊరక చేతు లాడించు.
 • "గుఱు పొడుచువారు... చేతులు బయ లూఁచువారు." భాస్క. యుద్ధ. 276. చేతులు ముడుచుకొని కూర్చుండు
 • ఏమీ చేయక ఉండు, కర్తవ్య పరాఙ్ముఖు డగు.
 • "అవసరం వచ్చినప్పుడు ఏదో చెయ్యాలి గానీ, చేతులు ముడుచుకొని కూర్చుంటే యెట్లా?" వా.

చేతులు విచ్చు

 • చేతులు వెల్లకిల వేయు. నిరసనను తెలుపు. రాధి. 4. 15.

చేతు లెత్తి మ్రొక్కు

 • ఆదరముతో నమస్కరించు.
 • "...... వసుధావిబుధుం, డచ్చప లాక్షిమణికిన్, ముచ్చటతోఁ జేతు లెత్తి మ్రొక్కినయంతన్." శుక. 2. 462.
 • "అతను న న్నెంతో ఆదుకున్నాడు. అతనికి చేతు లెత్తి మొక్కాలి." వా.

చేతు లొగ్గు

 • దోసిలి పట్టు, ప్రార్థించు.
 • "ఏ తల్లి తనకు నై చేతు లొగ్గినవారి." దేవీ. 1. 17.

చేతు లొడ్డుకొను

 • చేతు లడ్డు పెట్టుకొను.
 • "వనితలు చల్లెడి,యుదకంబునకుఁ జేతు లొడ్డుకొనుచు..." కళా. 6. 229.

చేతెంట

 • చేతివెంట. ప్రతిచేతి పొడవు నేలకూ, పండితా. ద్వితీ. పర్వ. పుట. 480.

చేదండ

 • కై దండ, చేయూత.
 • "చే యెత్తి తెమ్మని చేదండ యిచ్చి." ద్విపద. సారం. 3. 115. పు.

చే దప్పిపోవు

 • చేయి జాఱిపోవు. పొరబాటున అనిష్టము జరుగు అని కూడ.
 • "ఎంత లే దింతె కద దీని కిట్టు లనకు, తానె పోయెను గాంత చేఁ దప్పి పోవ, నేమి సేయుదు మని." హంస. 2. 215.
 • చూ. చేదప్పు.

చే దప్పు

 • చేయి దాటిపోవు.
 • "చేదప్పిన కార్యములకు, వేదనఁ బొందుదురె..." ఉత్త. రా. 4. 105.

చే దరి సెనము

 • కానుక.
 • చూ. చేదర్సెనము.

చే దర్సెనము

 • కానుక.
 • "నెమ్మి నీరీతిఁ జేదర్సెనమ్ము లొసఁగి." జైమి. 3. 76.
 • చూ. చేదరిసెనము.

చే దివియ

 • చేతి దివియ.
 • రూ. చేదివ్వె.

చేదుకట్టు

 • పిత్తకోశము.

చేదుడ్డు

 • చేతికఱ్ఱ.
 • చూ. చేకోల. చేదు మ్రింగు
 • సాహసకార్యమునకు పూను. అపథ్యమును సేవించు. విషము మ్రింగుట సాహస కార్యము కనుక.
 • "చేఁదు మ్రిం గెద వంచుఁ జిలికి నవ్వె ఘృతాచి, మాయలాఁ డని తిట్టె మంజుఘోష." మను. 3. 109.

చేదోడుగా

 • సహాయముగా.
 • "పని పాట సేయఁ జేదోడుగఁ జెం చెతల్పలుకుదోడుగ." కా. మా. 2. 72.
 • చూ. చేదోడు వాదోడు.

చేదోడు పడు

 • సాయ పడు.
 • "హరిపైఁ జిక్కినచిత్తంబు దనకుఁ జేదోడుపడన్." హరి. ఉత్త. 5. 201.

చేదోడు వాదోడు

 • సహాయము.
 • చేయితోడు, వాయితోడు అనగా పనికి తోడుగానూ, పలుకు తోడుగానూ ఉండు ననుట.
 • "ఇది యదృచ్ఛానులాభ మై యొదవెఁ దోటపనికిఁ జేదోడు వాదోడు పాటు పడును." వైజ. 2. 106.

చేదోయి ముకుళించు

 • నమస్కరించు.
 • "చేదోయిన్ ముకుళించి వీడుకొనె." జైమి. 1. 104.

చే నిమ్మపండు

 • అందుబాటులో నున్న వాడు - ఉన్నది. కరజంభలము.
 • "క్రమ్మర నిదె వెంకటేశ నీచే నిమ్మపం డైన నీబంటు." తాళ్ల. సం. 11. 2 భా. 67.
 • చూ. కరజంభలము.

చేనీరు

 • చేతిలో తీసుకొన్న నీరు.
 • "చేనీట నేత్రరాజీవముల్ తుడిచి." వర. రా. యు. పు. 196. పం. 12.

చేను చెట్ర

 • చేలు. జం.
 • "మీయాట లేమో మీపాట లేమో యదియే మీకుఁ బట్టెను గాని చేను చెట్ర యే మాయెనో మడి మట్ర యేమాయెనో యది మీకుఁ బట్టదాయె." ధర్మజ. 44 పు. 14 పం. తె. జా.

చే నులుచు

 • చేతిని మెలివెట్టు.
 • "చెచ్చెర నేతెంచి చే నుల్చి చాఁపి, పుచ్చుచు." పండితా. ద్వితీ. మహి. పుట. 126.

చే నెత్తురు కాకుండ

 • రక్తపాతము చేయకుండ.
 • "... అనూనధైర్యనిధి తావకపుత్రుఁ డితండు నేఁడు చే, నెత్తురు గాక యుండ నతినిష్ఠుర శాత కృపాణ ధారచే..." రాజశే. 2. 39.

చేపట్టిన మన్ననలు

 • పొందిన బహూకృతులు.
 • "చేరి వారి కరుణే చేపట్టినమన్ననలు." తాళ్ల. సం. 8180.

చే పట్టు

 • 1. గ్రహించు.
 • "...నీ పట్టంబు నీ మంత్రు లి, చ్చిరి నా కింతయు నీదు రాజ్య మిది వే చేపట్టు నేఁ బోయెదన్." భా. రా. కిష్కిం. 1. 30.
 • 2. వధువుగా లేక వరునిగా పరిగ్రహించు.
 • "పుట్టితి వజుతనువునఁ జే, పట్టితివి పురాణపురుషు భవనము..." భాగ. 1. స్కం. 9.

చేపట్టుకుంచము

 • అందుబాటులోని అమూల్య వస్తువు.
 • "కొల్చినవారికిఁ జేపట్టుకుంచమవు." తాళ్ల. సం. 6. 173.

చేపట్టుకొమ్మ

 • ఆధారము.
 • "సదాచారమునకుఁ బ్రాపు నైపుణ్యమునకుఁ జేపట్టుకొమ్మ." ఉత్త. రా. 1. 37.

చేపట్టు చేయు

 • భోజనానికి కూర్చునే ముందు విస్తరి వేయుచోట ముందుగా నీళ్లు చల్లి అలికి ముగ్గుకఱ్ఱ వేయు.
 • "చూపట్టఁగ గోమయమున, జేపట్టొనరించి." శుక. 2. 38.
 • "రారయ్యా యని శుద్ధిమచ్చరణు గోత్రా దేవతా పుత్రు వి,స్మే రాగ్ని ప్రభుఁ గూరుచుండ నిడి మ్రోల్చేపట్టు గావించి నీ,రారం బండిన ప్రాఁతరాజనపు దివ్యాన్నంబు నొక్కింత..." పాండు. 4. 168.
 • ఇందులోని 'చేయు' పర్యాయ పదాలయిన ఒనరించు, కావించు ఇత్యాదులు వేనితో నయినా ఇది ప్రయుక్త మవుతుంది.

చేపట్లకు వచ్చు

 • కొట్లాటకు వచ్చు.
 • "సిగ వీడన్ వెనుచక్కి పింజె వదలన్ జేపట్లకున్ వచ్చినన్." ఉత్త. రా. 6. 361.

చేపడవ

 • చిన్న దోనె. హంస. 4. 182.

చేపడు

 • 1. దొరకు.
 • "జడధి కియ్యునికి చేపడదు గాక." విప్ర. 2. 65.
 • "ఆ పసిఁడి గిన్నె యెవ్వరి, చేపడియెనొ వీరి నేల సిలుగులఁ బెట్టం, జూపోపరు గా." విప్ర. 5. 28.
 • 2. అగు, కలుగు.
 • "శ్రీయును బ్రాయంబుఁ దెలియఁ జేపడును దుదిన్." హరి. ఉత్త. 7. 106.
 • 3. వశ మగు.
 • "మాలని చేపడుటకు." మార్క. 1. 234.
 • 4. పట్టువడు.
 • "పాండవుల్ చేపడిరేని చంప." భార. ఉద్యో. 4. 68. చేపలకు చలి
 • అసంభవం - చేపలకు చలి ఉండ దనుట. కృష్ణ నీ. 73.
 • చూ. మొసలి పడిశము.

చే పావడ

 • చేతిరుమాలు.
 • "చేపావడల మొగంబులు తుడిచి కొనుచు." రఘు. రా. 2. 33.

చేపుణికిళ్లాడు

 • తడవు లాడు. సుమతి. 93.

చేపెట్టు మేయు

 • చెంపదెబ్బ తిను.
 • "మౌని నయినాఁడ రాముని,చే నొక చేపెట్టు మేసి." చం. రా. 5. 60.

చేపెట్టె

 • చిన్న పెట్టె. శ. ర.

చేబంతు లాడు

 • చెండ్లు, బంతులు ఆడు.
 • "పుష్పవాటికలలోఁ బొదలందు విహరించుఁ, బంతంబు మెఱసి చే బంతులాడు." బ్రహ్మా. 3. 30.

చేబడి

 • పని, చేతిపని.
 • "నీనాభి జనియించు నిసువు చేబడి గాదె, భువన ప్రచారంబు పొంకపడుట." సాంబో. 4. 21.

చేబదులు

 • లెక్ఖ వ్రాయకుండా తీసుకునే అప్పు.
 • "చేబదు లైనా తేవాలి పది రూపాయలు." వా.

చేబాడిత

 • చేతి బాడిస.

చేబాడిస

 • చేతి బాడిత.

చే బార లిడు

 • వట్టిచేతులు చాపు, అంగ లార్చు.
 • "ఆ బలం బెల్ల సహాయంబు గాక, చేబార లిడినఁ దెచ్చెదరె జానకిని." వర. రా. కిష్కి. పు. 438. పం. 3.

చేబారలు పెట్టు

 • పాఱిపోవు, అంగలార్చు.
 • "మిఱుమిట్లు గొన్న దృష్టులు మిడిచి మన్నీ లెల్ల, బెదరి చేబారలు పెట్టుచుండ." రాజగో. 1. 46.

చేబియ్యము

 • తవుడున్న ముడి బియ్యము. బ్రౌన్.

చేబిరుసులు

 • చేతితో కాల్చే బాణసంచా. బిరుసు లనే వీనిని నే డంటారు. రావి. 5. 61.

చేబుఱ్ఱ లిడు

 • ఒకరక మైన కొమ్మువంటి వాద్యాలను ఊదు. పరమ. 4. 205.

చేబోడి

 • డబ్బు లేనివాడు.
 • "నీడ యించుక లేని చేబోడిజొజుగు." కవిక. 4. 99. చేమంతిపువ్వు
 • అలాంటి బంగారు నగ.

చేమకూర శై త్యాలు

 • అసంభవములు. తాళ్ల. సం. 7. 34.

చేమపూరాజనాలు

 • ధాన్యవిశేషం.

చే మఱచు

 • ప్రమత్తు డగు.
 • "రాముని తేజంబు రావణాసురుఁడు, చేమఱచుటయు నీక్షించి సూతుండు." వర. రా. యు. పు. 434. పం. 10.

చే మించు

 • చేయి దాటిపోవు.
 • "చే మించి యిటు నడచిన కార్యమునకు." వర. రా. కిష్కి. పు. 353. పం. 12.

చేమిరి పెట్టు

 • పాలలో తోడుపెట్టు.
 • "కలదండి పసిఁబిండి కాఁచి చేమిరిఁ బెట్టి, యొఱఁగకుండఁగఁదిట్టి యుట్టి నొట్టి." వేం. పంచ. 4. 455.

చేమీదుగా

 • స్వయముగా తనచేత.
 • "అఖిలకల్యాణగుణశీల యా సుశీల, పెట్టెఁ జేమీఁదుగా నెల్లచుట్టములకు." పాండు. 4. 267.
 • "మీ చేతిమీదుగా ఈ పుణ్యకార్యం కూడా నెఱవేర్చి పుణ్యం కట్టుకోండి." వా.

చే ముంచి నేరము చేయు

 • బుద్ధిపూర్వకముగా తప్పు చేయు, చేజేతులా చేయు.
 • "నా మనసే చక్కనైతే నాకుఁ బ్రత్యక్షము గావా, చే ముంచి నేర మేమి చేసితినో కాక." తాళ్ల. సం. 6. 175.

చేముట్టు

 • పనిముట్టు, సాధనము.
 • "చేముట్టు నాగంటి జీవితంబు." పాండు. 2. 66.

చేమొగుచు

 • చేతులు జోడించు.

చేమొగుపు

 • నమస్కారం.

చేమోడుచు

 • నమస్కరించు.

చేమోడుపు

 • నమస్కారం.

చేమోడ్చు

 • నమస్కరించు.

చేమోడ్పు

 • నమస్కారం.

చేయనిది పాపము

 • అన్నీ చేసె ననుట.
 • "శివలింగముఁ దాల్చిన జన, నివహం బేమైనఁ జేయనిది పాపము." ఆము. 4. 44.

చేయప్పులు

 • చేతిబదుళ్లు.
 • "చే యప్పు లడిగి తెచ్చెద నంచుఁ జని కాంచుఁ, గోడెమిండనిఁ దప్పుకోలు మ్రొక్కు." శుక. 2. 368.

చేయబెట్టు

 • చేయించు.
 • "భోజనము చేయఁబెట్టిన భూవరేణ్య, పైతృకం బొప్పు సర్వ సంపన్న మగుచు." వి. పు. 4. 266.

చే యమ్ము

 • చేతితో వేసే బాణం. చంద్రా. 2. 38.

చేయలతి గను

 • చేతి బలము తెలిసికొను.
 • "చేయలఁతిం గని సమరము, సేయుము ననుఁబోటితోడ." భార. ద్రోణ. 4. 243.

చేయలతిగా

 • దగ్గఱగా.
 • "పఱచుం దవ్వుగఁ జేయలంతి నిలుచున్." భార. అర. 6. 372.

చేయలతి యగు

 • అధీన మగు.
 • "నా చిత్త మేకీడునకుఁ జేయలఁతిగా కేపొద్దు నీయంద యలరుఁ గాత." హరి. ఉత్త. 5. 203.

చేయలతియా?

 • సాధ్యమా ? శక్యమా ?
 • "....నీకుఁ జేయలఁతియె యీ యెడ యింక నీవు నిలిచినఁ బడ నడతురు." నిర్వ. 4. 84.

చే యాడక

 • చేయి రాక.
 • "కాడినయమ్ముచే సొలసి కంసవిరోధి శిరోధ వ్రేలఁ జే,యాడక మూర్ఛవోయె." ఉ. హరి. 1. 154.
 • "అతండు గయ్యంబు సేయఁ జేయాడక చెడు." భార. ద్రోణ. 5. 311.
 • "వాణ్ణి తన్నాలంటే నాకు చేయాడ్డం లేదు." వా.

చేయార

 • చేతులారా.
 • "చేయార నీసేవ నేఁ జేసుట లేదు." తాళ్ల. సం. 8. 60.
 • నోరార అనుటకు పర్యాయముగా ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.
 • "ఏమని చేయార నీబంట నని చెప్పుకో నేను." తాళ్ల. సం. 10. 2.

చేయార్చు

 • 1. చేతులు కొట్టు.
 • "వాయుపుత్రుఁడు చూచువగ వేక్షశాఖఁ, జేయార్చి రెండుగాఁ జీరి నవ్వుటయు." ద్వి. జగ. 207.
 • 2. చేయి కదల్చు.
 • "నేనుఁ దోడ్పడ నతనికిఁ జేయార్ప వచ్చునే?" భార. ద్రోణ. 4. 291.

చే యార్చుకొనగ లేక

 • శక్తి లేక, అలసిపోయి, చే యాడించుకొన లేక. నీటిలో మునిగిపోవువాడు చే యాడించినప్పుడే పైకి తేలుట సాధ్య మగును. ఆ ఆడించుకొను శక్తి లే దనగా నిస్సహాయు డనుట.
 • ఈత కొట్టునప్పుడు అలత లేనంతవరకూ చేతులు కొట్టడం సాగుతుంది. బాగా అలసినప్పుడు చేతు లాడవు.
 • "హా! సరోజాక్షి గోత్రవధార్ణవమున, మునిఁగి యున్నాఁడఁ జేయార్చు కొనఁగ లేక." జైమి. 1. 106. చేయి కడుగకుండ భోజనము చేయ వచ్చు
 • వెనువెంటనే, వచ్చినదే తడవుగా.
 • "....స్వామియారగింపు కాఁగనే వచ్చి, దశవిధభోగములును చేయి గడుగక మీరు భోంచేయవచ్చు." నందక. 47 పు.

చేయి కడుగుకొను

 • సంబంధము వదలుకొను.
 • చూ. చేతులు కడుగుకొను.

చేయి కాయు

 • అభయ మిచ్చు, అడ్డుకొను.
 • "మయునంతవాని చేయి గాయక జయించి." వర. రా. యు. పు. 23. పంక్తి. 6.

చేయి కాల్చుకొను

 • వంట చేయు.
 • "ఇంట్లో ఆడవాళ్లు బయట చేరడంవల్ల నేనే చేయి కాల్చుకోవలసి వచ్చింది." వా.
 • చూ. చెయ్యి కాల్చుకొను.

చేయి క్రిం దగు

 • ఒకరిచే దానము పొందు స్థితిలో ఉండు.
 • "...నూత్నమ, ర్యాదం జెందుకరంబు క్రిం దగుట నా హస్తంబు మీఁ దౌట మేల్, గాదే..." భాగ. స్కం. 8.

చేయి చాచు

 • 1. ఒకరిని యాచించు.
 • "వాడు బతికినన్నాళ్లూ ఒకరి కిచ్చాడుగానీ ఒకరి ముందు చెయ్యి చాచి యెఱగడు." వా.
 • చూ. చెయి చాచు
 • 2. వేకారు.
 • "శ్రీపతి నీ కయి చేయి చాఁచెదము." తాళ్ల. సం. 8. 19.

చే యిచ్చు

 • ఆసరా యిచ్చు, సాయపడు.
 • "ఇంటివారిని లేపి యీవల దొంగ, బంటుకు చెయ్యిచ్చుపాపాత్మురాల." గౌర. హరిశ్చ. పు. 168.

చేయి చేయి కలుపు

 • సమాధాన పఱుచు.
 • "వాణ్ణి వీణ్ణి చేయి చేయి కలిపి వెళ్లాడు వాళ్ల నాన్న. అప్పటినుంచీ సంసారం కాస్త కుదటపడింది." వా.

చేయి చేసికొను

 • తన్ను.
 • "వా డేదో అన్నా డని వీడు చేయి చేసుకొన్నాడు." వా.
 • చూ. చెయి చేసుకొను.

చేయి జాఱు

 • అధీనము తప్పు.
 • "ఆ వ్యవహారం నా చేయి జాఱి పోయింది. ఇంక నేను చేసే దేమీ లేదు." వా.
 • చూ. చేయి దాటి పోవు.

చేయి తీరదు

 • చేతిలో పని ఉన్న దనుట. చేయి పనికి ప్రత్యామ్నాయంగా మనకు అనేకపలుకు బళ్ల లో కనిపిస్తుంది.
 • "నాకు చేయి తీరడం లేదు. తరవాత రా. గింజలు వేస్తాను." వా.
 • "నాకు చేయి తీరనంత పనిగా ఉంది." వా.

చేయి తీరిక లేదు

 • తీరుబడి లేదు. ఏదో పని చేస్తున్నా ననుట.
 • "ఇప్పుడు చేయి తీరిక లేదు. తరవాత రావయ్యా. ఆ సంగ తేదో చూస్తాను." వా.

చేయి దాటి పోవు

 • మించి పోవు, స్వవశము తప్పి పోవు.
 • "ఈ విషయంలో నేను చేయగలిగింది యేమీ లేదు. ఆ వ్యవహారం అప్పుడే చేయి దాటి పోయింది." వా.
 • చూ. చెయి దప్పి పోవు.

చేయిదోడు

 • సహాయము.
 • "సృజియించు బ్రహ్మకుఁ జేయిదోడు." భీమ. 1. 44.
 • చూ. చేదోడు, చేదోడు వాదోడు.

చేయి మఱచు

 • విధ్యుక్తధర్మమును నిర్వహింపకుండు.
 • "మీకు నిట్టి యెడలన్, బ్రమయక చే మఱువ కునికి పటుశౌర్య మగున్..." కళా. 4. 191.

చేయి మించు

 • అధీనము తప్పు, చేయి దాటిపోవు.
 • "అని బహు భంగులం దన బలాదిక దర్పవిజృంభణంబు నే,ర్పున వివరించి పై ననియె భోరున నా చెయి మించె..." రంగా. 2. 44.
 • "ఆ వ్యవహారం నా చేయి మించి పోయింది. ఇంక నేను చేసే దేమీ లేదు." వా.
 • "నే నప్పుడే ఆ నోటు పంపించేశాను. ఇక నా చెయి మించి పోయింది. మీ కేం ఇబ్బందు లున్నా పై అధికారి దగ్గర చెప్పుకోవాల్సిందే." వా.
 • చూ. చెయి మించు.
 • 2. అతిశయించు, మేలు చేయి యగు.
 • "చేయి మించఁగ వలెన్ జుమి నీ కని." విజయ. 3. 115.

చేయి మీ దగు

 • తాను ఇచ్చువా డగు.
 • "...నూత్నమ, ర్యాదం జెందుకరంబు క్రిం దగుట నా హస్తంబు మీఁ దౌట మేల్, గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే." భాగ. స్కం. 8.

చేయి మీదుగా నడచిన

 • ఎప్పుడూ ఒకరిని దేహి అనక, ఒకరికే తాను ఇస్తూ బ్రతికిన.
 • "చేయి మీఁదుగా, నడచిన పూర్ణ కాముఁడవు." పాండు. 3. 44.

చేయి మునుగ జుర్రుకొను

 • సంతృప్తిగా జుర్రుకొను. వాడుకలో కొన్నివర్గాలలో 'చెయ్యి ములగా జుర్రుకొను' అనే వినబడుతుంది.

చేయి మునుగ పాడి

 • పాడి సమృద్ధిగా ఉన్న దనుట. ఇది వాడుకలో కొందరిలో 'చెయ్యి ములగా పాడి' అన్నట్లు వినవస్తుంది.
 • "వాళ్ళ కేం ? పదావులు, పది యెనుములు. చేయి మునగా పాడి." వా.

చేయి యెటు లాడు

 • ఇంత దుర్మార్గ మైన పని చేయుటకు చేతులు ఎట్లా వచ్చును?
 • "ఓయి దయావిహీనమతి! యూరక యీ పసిబిడ్డఁ గొట్టఁగాఁ జే యెటులాడె నీకు-" మను. 4. 87.
 • "ఆ పిల్లవాణ్ణి కొట్టడానికి నీకు చేతులు ఎట్లా ఆడాయి." వా.

చేయి వదలు

 • రక్షణబాధ్యతను వదలు కొను.
 • "చేయి వదలక చేపట్టువారిఁ గాచుటలు." వర. రా. సుం. పుట. 88. పంక్తి. 15.
 • చూ. చేయి విడుచు.

చేయివాసి

 • హస్తవాసి.
 • "ఆయన చేయివాసి మంచిది. ఏ మిచ్చినా నయ మవుతుంది." వా.

చేయి వీచు

 • ఆజ్ఞ యొసగు, ప్రోత్సహించు, ముదల యిచ్చు.
 • "గోత్ర భీ,కరముగ బాహు లెత్తి తమకంబున సేనకుఁ జేయి వీచినన్." పారి. 5. 14.
 • "ఆవృకోదరుపైఁ గవియంగఁ జేయి, వీచె సేనకుఁ గాళింగవిభుఁడు గడఁగి." భార. భీష్మ. 2. 70.

చేయీక

 • చేతికి దొరకక.
 • "లేటి బొట్టెలు బిట్టు చెదరి చెదరి చేయీక పఱచిన." హర. 1. 3.

చేయీక తివియు

 • చేతి కందక లాగు.
 • "తనరు మహాభద్రదంతులరీతిఁ జేతికి నొడిసినఁ జేయీక తివిసి." ద్విప. మధు. పు. 18.

చేయీత నీదు

 • ఏ యితరసహాయం లేక చేతులతో ఈదు.
 • "చెనఁటి యీ భవవార్ధిచేయీఁత నీదు." ద్విప. పరమ. 2. 86. పు.
 • "ఏచి మున్నీరు సేయీఁత నీఁద." భార. విరా. 4. 213.

చేయునది లేక

 • ఇంకో మార్గం లేక, గత్యంతరం లేక, తప్పనిసరియై.
 • "బయటఁబడి చేయునది లేక యాకఠకు మగిడి తుఱముఁ దిద్దుచు." ఆము. 4. 35.
 • "వారల నవ్వలకుం ద్రోసి చనినఁ జేయునది లేక యిచ్ఛావిహారవిరోధి యగు నిజకులాచారంబులం దలంచుకొని..." శుక. 2. 10.

చేయూత

 • సహాయకము.
 • "యోగవిద్యాబలంబు చేయూఁత గాఁగ." నైష. 3. 3.

చే యూదుకొను

 • చేతులను ఆధారముగా దేనిపైనో ఆనించు.
 • "ఒండొరుఁ జే యూదికొనుచు." పండితా. ద్వితీ. పర్వ. పుట. 279.

చే యెత్తి నమస్కరించు

 • హృదయపూర్వకంగా బహూకరించు, కృతజ్ఞత తెలుపు.
 • "నా కొక జీవనం కల్పించినవా డాయన. ఆయనకు చే యెత్తి నమస్కరించాలి." వా.

చేయేతము

 • చేతితో తోడు ఏతాము.
 • "అబ్బావికిఁ జేయేతం, బుబ్బుచుఁ దంబళి యొనర్చి." హంస. 1. 186.

చే యొడ్డు

 • అడ్డుపెట్టు.
 • "ఒరుల యీగికి నకట! చే యొడ్డకుండు." భార. శాంతి. 4. 158.

చేరగ బిల్చు

 • దగ్గరకు తీయు.
 • "భీమునిఁ జేరఁగఁ బిల్చి." జైమి. 3. 45.
 • చూ. చేర దీయు.

చేరగిల బడు

 • విశ్రాంతి తీసుకొను.
 • "పొద్దున్నుంచీ పనితో సతమత మయి పోయాను. కాస్త చేరగిలబడితే కానీ వీలు లేదు." వా.

చేరదీయు

 • దగ్గఱకు తీయు.
 • "అల్లనఁ జేరఁదీసి." విప్ర. 4. 88.

చేరబడు

 • 1. కలియు, ఒకటి అగు.
 • "గోరపుఁ బాపములు నీవుఁ గొడుకులు నాలుం, జేరఁబడి పంచుకొందురొ?" వాల్మీ. 2. 100.
 • 2. ఒరగు, చేరగిలబడు.
 • "ప్రొద్దు చేరఁబడినఁ బోయి రిండ్లకు వారలు." నారా. పంచ. 1. 90.

చేరబొంతల యాట

 • ఒక బాలక్రీడ. పండితా. ప్రథ. పురా. పుట. 460.

చేరల గొలువగ వచ్చు (కన్నులు)

 • విశాల మైనవి అనుట.
 • "చేరలం గొలువఁగ వచ్చు కన్నులు." పాండు. 2. 70.
 • చూ. చెంపకు చేసెడేసి కండ్లు. చేరెడేసి కండ్లు.

చేరల గొల్వగ వచ్చు

 • చేరె డంతేసి ఉన్న వనుట.
 • "కన్ను లంటిమా చేరలఁ గొల్వఁగా వలయు." విజయ. 1. 131.

చేరవచ్చు

 • సమీపించు.
 • "నీరజాక్షి నిరంకుశుఁ జేర వచ్చె." నిరంకు. 4. 93.

చేరవేయు

 • ఒకచోటికి చేర్చు, ఒకటిగా పెట్టు.
 • "అవన్నీ యింట్లోకి చేర వేయరా." వా.
 • "చిల్లా పల్లా పడిన వన్నీ ఒకచోట చేరవేయవే." వా. చేరిక యగు
 • సమీపించు.
 • "అనయముఁ జేరిక యగుతఱి, ననివార్యవ్రీడభయభరాకులగతి యై." ప్రభా. 5. 31.

చేరిక లొనర్చు

 • స్నేహం చేయు.
 • "చేరిక లొనర్చి తేనియల్ చిలుకఁ బలికి." హంస. 2. 169.

చేరుకోల

 • చెలకోల.
 • పశువులను తోలే కొరడా వంటిది. భార. భీష్మ. 3. 234.
 • రూ. చేర్కోల.

చేరుగడ

 • 1. ఆధారము.
 • "వట్టి యపకీర్తులకుం జేరుగడ." విప్ర. 3. 12.
 • 2. చేరబడు దిండు.
 • "ఆశ్రితశ్రేణి కేయధిపుని పాదరా,జీవ యుగ్మంబులు సేరుగడలు." భాగ. స్క. 1. 257.

చేరుగొండి

 • 1. తగులాటకత్తె. శ. ర.
 • 2. చేర వచ్చిన భార్య. బ్రౌన్.

చేరుగొండి పశువు

 • తప్పిపోయిన పశువు. బ్రౌన్.

చేరుగొండియావు శ. ర.

 • చూ. చేరుగొండి పశువు.

చేరుచుక్క

 • పాపట బొట్టు.
 • "కలువపై యొడ్డాది కటకాధిపతి వధూ, సీమంతవీధులఁ జేరుచుక్క." కాశీ. పీ. 34.
 • చూ. చేర్చుక్క.

చేరుడుబియ్యము

 • ముడి బియ్యము. ఉత్త. హరి. 3. 13.

చేరువకాడు

 • 1. సేనాని. రామా. 7. 27.
 • 2. ఎకిమీడు, అధికారి. శేష. 5. 98.

చేరువడు

 • సిద్ధించు.

చేరువపంట

 • అందుబాటులోనిది.
 • "....భుజంగకోటికిన్, ఘటితనిధానసీమ యుపకాంతుల చేరువపంట..." హంస. 1. 215.

చేరువఱుచు

 • సిద్ధింపజేయు.

చేరెడుకండ్లు

 • విశాలము లయిన నేత్రములు.

చేరెడు నేల

 • కొద్దిపాటి నేల.
 • "అకటా ! చేరెడు నేలకుం దగఁడె సప్తాంభోధివేష్టీభవత్, .....రాజ కుమారుండు." హరిశ్చంద్రో.

చేర్చుక్క

 • పాపటబొట్టు.
 • "చేర్చుక్కఁ జేరిచి చిత్రంబుగాను." పల. పు. 72.
 • "చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లి చే, సిందూరతిలకంబు చెమ్మగిల్ల." మను. 1. 5.
 • "చొనిపె సీమంతవీధిఁ జేర్చుక్క యోర్తు." ఆము. 6. 128.
 • చూ. చేరుచుక్క.

చేర్లకోల

 • చెలకోల. వరాహ. 5. 108.

చేర్వచుట్టములు

 • దగ్గఱిచుట్టాలు. నిరం. 4. 69.

చేర్వారు

 • సమీపించు, దగ్గఱపడు.
 • "వై,శృంఖల్యంబునఁ బట్టు కళ్లెపు సరుల్ చేర్వార నుచ్చైశ్రవ: కంఖాణంబు గదల్చె." నిరంకు. 4. 125.

చేఱుకుట్టు

 • ఒక రోగము.

చేఱుకోల

 • చూ. చేరుకోల.

చేఱుబొందు

 • కొట్టెడు తోలుపట్టెడ. శ. ర.

చేఱులకోల

 • చెలకోల. శ. ర.

చేలా గిచ్చు

 • చేయూత నిచ్చు.
 • "చేరి చేలాగిచ్చు..." ఇందు. 3. 27.

చేలు దొండముక్కు పడు

 • ఎఱ్ఱ బారు, పక్వ మగు.
 • "దొండముక్కు వడియెం బ్రాసంగుఁ జేల్." శివ. 4. 19.
 • "పెస రుసురుకొనియె దవనిక పొదలె, ఱెక్క ప్రాసంగు దొండ ముక్క వడియె." కాశీ. 3.23.

చేవగల వాడు

 • సత్త్వవంతుడు.
 • చూ. చేవబారు.

చేవట్టి తిగుచు

 • చేయి పట్టి లాగు.
 • "నీకు బలె సన్మానంబుతోఁ జక్క వ,చ్చెదొ యేమే గలదే యటంచుఁ దిగి చెం జేవట్టి యా యంగనన్." కళా. 7. 123.

చేవ డించక

 • చేతితో పట్టుకొని నలిగిపోవునట్లు చేయక.
 • చేవ - సారముపై, డించు వచ్చిన దనుకుంటే=సారవిహీనము కాకుండ అనుట.
 • "....చేవ డించక కావడించి." పాండు. 3. 89. చే వదలు
 • నిరాశ్రయుని చేయు; వదలి పెట్టు.
 • "చెలికాని నెఱుఁగక చే వదలుదు రె." వర. రా. కిష్కి. పు. 401. పం. 8.

చేవ బారు

 • సత్త్వవంత మగు.
 • చెట్టు చేవ బారిన దనగా కఱ్ఱ యెఱు పెక్కి బాగా గట్టిపడినది అనుట.

చేవ మీఱు

 • 1. సత్త్వవంత మగు, బలపడు.
 • "వలపుల్ రేచి మనంబులం గరఁచి చేవల్ మీఱ లోనైన యా..." రాజగో. 1. 103.
 • 2. విజృంభించు.
 • "సురనాథుల్ చేవమీఱన్ సమి, త్కేళీలోలతఁ గాలమేఘముల మాడ్కిన్." కా. మా. 2. 61.

చేవ యెక్కు

 • బలపడు, సత్త్వవంత మగు.
 • "ఇక్కడఁ బౌండ్రభూపతి విహీన వివేకతఁ జేవ యెక్కఁగాఁ నెక్కడి వాసుదేవుఁడు ?" ఉ. హరి. 3. 4.

చేవ యొసగు

 • ప్రోత్సాహ మిచ్చు, బలము చేకూర్చు.
 • "బహువిధచాతుర్యంబులు శౌర్యంబులకుఁ జేవ యొసంగ." ఉ. హరి. 4. 213.

చేవలతులు

 • 1. చేతి కందుబాటులోనివి.
 • "చేవలఁతు లగుచు దక్కును." పాండు. 3. 118.
 • 2. భుజబలము. హర. 1. 20.
 • 3. సమీపము. శృం. శకుం. 1. 132.

చే వాటునేల

 • సమీపప్రాంతము. చేతితో రాయి విసిరినంత దూరము.
 • "చెలువార నిచటికిఁ జే వాటునేలఁ, గల దొక నిర్మలకమలాకరంబు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1729-30.

చేవాడికాడు

 • చేతి మెలకువ గలవాడు.
 • "గడిదొంగ చేవాఁడికాఁడు దోఁపుడుకాఁడు." వేంక. మాన. 31.

చే వాడి మెఱసి

 • చేతి మెలకువ చూపి.
 • "చే వాడి మెఱసి.... అస్త్రములకు బలివెట్టి." వర. రా. యు. పు. 366. పంక్తి. 13.

చే వార్చు

 • చేతులు కడుగుకొను.
 • "అందఱు భుజించి చేవార్చు నవసరమున." పార్వ. 5. 186.

చే విచ్చు

 • నమస్కరించు. శ. ర. చే విప్పు
 • నమస్కారం. వావిళ్ళ.

చే వెలు గిడి

 • బాగుగా కనబడుటకై కాస్త వయసైన వారు చేతిని కనుబొమ్మ దగ్గర అడ్డుగా పెట్టుకొని
 • "దీవించి యతని వదనము, చే వెలుఁగిడి చూచి." హర. 2. 49. సా. స.

చేవ్రాలు

 • 1. సంతకము.
 • 2. చేతిలోని రేకలు.

చే వ్రేసి నవ్వు

 • చేతులు చఱచి నవ్వు.
 • "ఆ విదర్భుఁడు గెల్చె ననుచు నొండొరులు, చే వ్రాసి నవ్వుచు సీరి నీక్షింప." ద్విప. కల్యా. 129.

చే సడలు

 • చేయివదలు. వసు. 6. 84.

చే సరులు

 • ఒకనగ.

చే సఱచి నగు

 • చేతులు కొట్టి నవ్వు. నవ్వునప్పుడు చేతులు కొట్టుట కలదు కదా !
 • "రాచూలిం జూచి చెలులు, గలకల చే సఱచి నగిరి." నైష. 2. 46.

చే సాచి అడుగు

 • యాచించు.
 • "చేయించె నెందఱో చే సాచి యడిగిన, బ్రహ్మచారులకు వివాహములను." పాణి. 1. 66.

చేసినది జపము, వేసినది గాలము

 • చెప్పేదానికీ చేసేదానికీ సంబంధము లే దనుట. చంకదుడ్డు శరణార్థి వంటిది.
 • "చేసినయది జపమున్ మఱి, వేసినయది గాల మనుట వృథ కాకుండన్." విజ. 2. 135.

చేసి పెట్టు

 • నెఱవేర్చు.
 • "ఈ పని కాస్తా మీరు చేసిపెట్టితే నేను చాలా సంతోషిస్తాను." వా.

చేసిపోయిన కాపురము చూడ వచ్చు

 • తాను చెడ్డపేరు తెచ్చుకొన్న ఊరికే తిరిగి వచ్చు.
 • "ఆ మహాతల్లి తిరిగి వచ్చిం దటనే. చేసిపోయిన కాపరం చూడడానికి వచ్చిం దేమో!" వా.

చేసు వెల

 • అసలు ధర. అది యెంత చేస్తుందో అంత.
 • "బేరము పొసఁగించి చేసువెల కిప్పించెన్." హం. 5. 360.

చే సేత

 • చే జేతుల - స్వయంగా. తనకు తానై. చేసినచేతనే ఫల మనుభవించు ననుపట్టున ఉపయోగించే పలుకుబడి.
 • "ఫలంబు సిద్ధింప నోపు చేసేత." పండితా. ద్వితీ. మహి. పుట. 61.
 • "చే జేతుల అనుభవిస్తాడు." వా.
 • "స్వయంగా వాడు చే జేతులా తలకు ఉరి తెచ్చుకొన్నాడు."
 • చూ. చే జేతుల.
 • 'వాడు చే జేతులా చేసుకున్నాడు. ఎవ రేం చేస్తారు' అని వాడుక. అలాగే 'ఈ చేత్తో చేసి ఆ చేత్తో అనుభవిస్తున్నాడు'. వెంటనే అనే అర్థంలో ఇట ప్రయుక్తం.
 • "శివపూజఫలము సేసేత గొన్నట్లు, తవిలి యాతనికి నంతన సమకూడె..." బసవ. 5. 131.
 • "చేసేత న్మాడలు వే,యేసి దెసలఁ గీర్తి లతిక లెలమి వహింపన్." కా. మా. 3. 146.
 • "చేసిన నేరమి చేసేతఁ గుడువ." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 423.

చేసేత బట్టు

 • చేజేతులతో పట్టుకొను.
 • "చేసేతఁ బట్టి." కుమా. 10. 66.
 • చూ. చేసేత.

చేసే నొసగు

 • ఒకరి కొకరు చేతులతో అందించు.
 • నలుగురు వరుసగా నిలుచుకొన్నప్పుడు ఒకరి చేతిలోని పాత్రను రెండవవారికి, ఆ రెండవవారు మూడవవారికి ఇలా క్రమంగా ఇచ్చుట.
 • "చెలువ ల్గొందఱు హేమకుంభములతోఁ జేసే నొ సంగన్." పారి. 2. 11.
 • స్వయముగా అని వావిళ్ళ ని. సరిగా కనిపించదు.

చొంగలు గురియు

 • నోటిజొల్లు కారు.
 • "....నోరఁ జొంగలు, గురియఁగఁ గడ లేక నడచె గుఱ్ఱపుఁబౌజుల్." కవిక. 2. 79.

చొక్కిళ్ళు వోవు

 • సొట్టలు పడు.
 • "గదిసి మై గందంగఁ గౌఁగిట బిగియింప, జొక్కిళ్ళు వోయిన సొమ్ముతోడ." యయా. 2. 99.

చొక్కు చల్లి నట్లు

 • మత్తుమందు చల్లినట్లు.
 • "గొల్లపల్లియలో నున్న గొల్లవారు, చొక్కు చల్లినకైవడి నొక్క రైన, మేలుకొనక నిద్రింప." వి. పు. 7. 76.

చొక్కుటాకు

 • వగుడాకు.

చొక్కునీరు

 • కల్లు. యయా. 3. 122.

చొక్కు పెట్టు

 • మత్తు మందు చల్లి మైమఱపించు. వి. పు. 8. 164. చొక్కుపొడి
 • మత్తు మందు పొడి. దశా. 1. 260.

చొక్కుమందు

 • చూ. చొక్కుపొడి.

చొక్కు మడగు

 • మై మఱగు, వశము తప్పు.
 • "శ్రుతిపుటంబుల శక్తి చొక్కుమడఁగ." కాశీ. 1. 139.

చొక్కు వెట్టు

 • మత్తు మందు చల్లి మైమఱపించు.
 • "సురగి చౌడయగారిఁ జొక్కు వెట్టితివొ." పండితా. ద్వితీ. మహి. పు. 215.
 • చూ. చొక్కు పెట్టు.

చొచ్చి వచ్చు

 • మీది మీదికి వచ్చు. ఇందు. 4. 58.

చొచ్చో యనిపించు

 • తఱిమి వేయు.
 • "వెచ్చానకు లే దనఁగా, నిచ్చటి కేతెంచి యాతఁ డిచ్చిన మేలే, వచ్చినది లాగుకొని మఱి, చొచ్చో యనిపింతు నిదియ నూ మత మనుచున్." వైజ. 3. 99.

చొటచొట

 • ధ్వన్యనుకరణము.

చొడచొడ

 • చూ. చొటచొట.

చొత్తెంచు

 • ప్రవేశించు. కాశీ. 7. 68.

చొప్ప కాడి

 • రెండెడ్లను గట్టి త్రోలెడు దిండువంటి చొప్ప మోపు. శ. ర.

చొప్పడు

 • ఒప్పు; సరిపడు ఇత్యాద్యనేక భావచ్ఛాయలలో...
 • "ఆడువా రగుట రూపుంప నేరక రుచులఁ జొప్పడక." రంగ. రా. బాల. పు. 12. పంక్తి. 10.

చొప్పదంటు ప్రశ్నలు

 • సారం లేని ప్రశ్నలు. కంకులు వేసిన తరవాత జొన్నదంట్లను చొప్పదంట్లంటారు. అవి చప్పగా ఉంటాయి. అందుపై యేర్పడిన పలుకుబడి.
 • "ఏమి టోయి! ఊరికే చొప్పదంటు ప్రశ్నలు వేస్తున్నావు?" వా.

చొప్ప బెండ్ల మంచములు

 • ఒక బాలక్రీడ. హంస. 3. 146.

చొప్పరికించు

 • పరికించు.

చొప్పఱుచు

 • ఏర్పఱించు; ఆరోపించు.

చొప్పలా చప్పగా ఉంది

 • చొప్పదంటువలె సారవిహీన మయిన దనుట.
 • "ఆ కావ్యం చొప్పలా చప్పగా ఉంది." వా. చొప్పాడు
 • సత్యము చెప్పు.
 • "కీడున కోడ కించుకయుఁ గేకయభూపతి యింటఁ బుట్టి చొ,ప్పాడక పాపజాతి వయి తక్కట..." భాస్క. రా. అయో. 20.

చొప్పు మార్చు

 • 1. త్రోవ తప్పించు.
 • "తప్పుత్రోవల నీరీతిఁ జొప్పు మార్చి." కా. మా. 4. 56.
 • 2. తావు మార్చు.
 • "రతిశ్రాంతాంగనా నేత్రకో,ణని కాయంబుల డాఁచి తద్ధవళిమన్ దాఁ బూనెనో చొప్పు మా,ర్ప ననన్ వెల్వెలఁ బాఱె దీపకళికావ్రాతంబు శాతోదరీ." మను. 3. 56.
 • 3. వేషము మార్చు.
 • "చొప్పు మార్చితిఁ బెక్కు చోట్ల శాత్రవభీతి, నావారు గనలేరు నన్ను నరసి." కళా. 8. 166.

చొరబడు

 • ప్రవేశించు. వాడుకలో జొరబడు అని వినవస్తుంది.

చొర జోటు లేదు

 • తలదాచుకొనే చోటు లేదు. ఆశ్రయం లేదు.
 • "చొరఁజోటు లే దంచు సొమ్మసిల్లుచును." బస. 6. 165.

చొరపోతగా

 • ఎడతెరపి లేకుండా. బ్రౌన్.

చొరబాఱు

 • చొచ్చు.
 • "సందు సందులం దెఱపిగని చొరంబాఱి మధురసమిళిత పరాగరాగంబు." విప్ర. 3. 38.

చొరబెట్టు

 • ప్రవేశపెట్టు. బ్రౌన్.

చొరవకాడు

 • మాంచి చొరవ కలవాడు. ప్రవేశించువాడు.

చొరవ చేయు

 • సాహసించు. మాటా. 78.

చొరవడ

 • చొరవ, సాహసము. బ్రౌన్.

చొరుదల

 • మొదలు.

చొఱచొఱ

 • ధ్వన్యనుకరణము.
 • "చొఱచొఱ నెత్తురులు వడియ." హరి. 10. 184.

చొల్లువాఱుడు మాటలు

 • సొల్లుకబుర్లు, వట్టి వ్యర్థ ప్రతాపాలు.
 • "చొల్లు వారుడు మాట లెల్ల నేమిటికి." బస. 6. 171. చో టిచ్చు
 • 1. అవకాశ మిచ్చు.
 • "ఘనతేజంబున నొప్పెద, రనుచుం జోటిచ్చి మత్కులాఖ్యలు వినియెన్." కళా. 4. 43.
 • 2. ఆశ్రయ మిచ్చు.
 • "నేను ఆవూళ్లో బతుకు లేక బట్ట బుజాన వేసుకొని వస్తే, అత డింత చోటిచ్చి నన్ను ఆదరించాడు. అతనికే నేను ద్రోహం ఎలా తలపెట్టను?" వా.

చోటు చేయు

 • స్థాన మిచ్చు. తాళ్ల. సం. 4. 157.

చోటు చేసికొను

 • ఆశ్రయ మేర్పరుచుకొను.
 • "వా డేదో ఆ మాటా యీ మాటా చెప్పి వాళ్లింట్లో చోటు చేసుకున్నాడు." వా.

చోద్యపడు

 • ఆశ్చర్యపడు.
 • "అచ్చోటి మహిమకుఁ జోద్యపడుచు." నిరంకు. 4. 6.

చోపిడు

 • పారదోలు, కలత పెట్టు.

చోపుడుగోల

 • వేటలో మృగాలను సోపుట కుపయోగించే కఱ్ఱ.

చోపుడు వెట్టు

 • ఒకవైపునకు తోలుకొని వచ్చు.
 • వేటలో సాయుధు లయిన వేటగాళ్లు ఒకవై పుంటారు. మరికొందరు డప్పులు మొదలైన వాద్యాలతో శబ్దం చేసుకుంటూ మృగాలను వారివైపుకు తోలుకొని వస్తారు. దీనినే చోపుడు వెట్టుట అంటారు.
 • "పొలము చోపుడువెట్ట న న్నెలవరులకు, సెల వొసంగిన నృపమౌళి చిత్త మెఱిఁగి." శుక. 1. 257.
 • "అగ్నియంత్రంబులు ముట్టించియు రొద మిన్ను ముట్టం జోపు వెట్టించిన." మను. 4. 37.

చోపుదారుడు

 • వెండిబెత్తం పట్టుకొని రాజులముందు బరాబరులు చెప్పు సేవకుడు. బ్రౌన్.

చోపు వెట్టు

 • చూ. చోపుడువెట్టు.

చోరస్వదేశము

 • అసంభవము.
 • దొంగకుఏ దేశమైనా ఒక్కటే. దొంగతనం చేయక మానడు కదా. రాధ. 4. 79.

చోఱబుడుత

 • చేపపిల్ల, చేపలవంటి కనులున్న స్త్రీ.