పదబంధ పారిజాతము/చుక్కకాడ
స్వరూపం
చుంచుకుఱ్ఱ
- చిన్న వాడు.
- "ఇల్లొకపట్టునం గడచి యేఁగగ నేరని చుంచుకుఱ్ఱలన్." అచ్చ. రా. బా. 104.
చుంచుమిద్దె
- ముందుకు చుంచులు వచ్చు నట్లుగా కట్టిన మిద్దె.
చుంచుఱాయి
- మిద్దె కైన పలకఱాయి. బ్రౌన్.
చుంచెలుక
- చుంచు.
- రూ. చుండెలుక.
చుండ్రాళ్ళు
- ఒక పిల్లల ఆట.
చుక్కకాడ
- మాగాణిలో మొలిచే ఒక మొక్క. బ్రౌన్.
చుక్కచేరు
- నుదుట వ్రేలాడగా తలపై ఉంచే నగ.
చుక్క తెగి పడినట్లు
- అకస్మాత్తుగా.
- "...అంతం జుక్క తెగి పడిన వడువున నెక్కడ నుండియో యాకస్మికంబుగ నింటికిం జలిఁది వంటకంబుఁ గుడువం జనుదెంచి." పాండు. 3. 24.
చుక్కబొట్టు
- చుక్క.
చుక్కయెదురు
- ప్రతికూలము; చెడు కలిగించునది.
- జ్యోతిశ్శాస్త్ర రీత్యా వచ్చిన పలుకుబడి.
- "శుక్రుడు ఎదురుగా ఉండగా ప్రయాణాదులు చేయరా దని తచ్ఛాస్త్రవిధి. తద్వారా ప్రతికూల మనుటగా మారినది.
- "దైత్యావరోధనదయితాధరములతో, సొబగువీడెములకుఁ జుక్కయెదురు." ఉ. హరి. 3. 147.
- చూ. ఎదురుచుక్క, చుక్కెదురు.
చుక్కలను జూచి కుక్కలు మొరిగినట్లు
- గొప్పవారిని చూచి నీచులు ఆడిపోసుకొన్నా, దూషించినా లెక్కేమిటి అనుట. శరభాంక. 47.
చుక్కలు గోరాడు
- మిన్నంటు.
- "చుక్కలు గోరాడు సున్నపు మేడలు." వర. రా. అయో. పు. 323. పంక్తి. 6.
చుక్కల్లోకి చూచు
- గర్వమును ప్రదర్శించు. కొత్త. 14.
చుక్కవాలు
- ఎదురుచుక్క.
- విరోధి అనుట.
- "అమరుల బోనపుట్టిక సహస్ర మయూఖుని జోడు కోడె సం,తమసము వేరువిత్తు కుముదంబుల చిక్కిలిగింత పుంశ్చలీ, సమితికిఁ జుక్కవాలు నవసారస లక్ష్మీ తొలంగుబావ కో,కములకు గుండెతల్లడము కైరవ మిత్రుఁడు దోఁచెఁ దూర్పునన్." పారి. 2. 41.
చుక్కెదురు
- ప్రతికూలము.
- "పాపములకును జుక్కెదురు కాశి." కాశీ. 7. 215.
- చూ. చుక్కయెదురు; ఎదురుచుక్క.
చుచ్చుఱు కైన
- మిక్కిలి తీక్ష్ణ మైన.
- "చుచ్చుఱుకు పలుకులు." రామా. 5. 199.
చుటుక్కు మను
- ధ్వన్యనుకరణము.
చుట్టకుదురు
- కుండలు బిందెలు ఉంచే కుదురు. భీమ. 4. 49.
చుట్టగు
- దూర మగు.
- ముఖ్యంగా దారి విషయంలో ఉపయోగిస్తారు.
- "ఎంచఁగ నా గమనమునకు, నించుక చు ట్టయిన నయ్యె నిది." కళా. 2. 4.
- వాడుకలో -
- "కాశీకి బెజవాడనుండీ కలకత్తామీద పోతే చాలా చుట్టవుతుంది. ఇటార్సీ మీద పోతే చాలా దగ్గఱ." వా.
- "అది చుట్టుదారి. ఆ దారిలో పోవద్దు." వా.
- చూ. చుట్టుదారి.
చుట్టపక్కములు
- బంధువులు. జం.
- "ఒల్లను శీల మా మగని నొల్లను కాఁపు మొల్ల మాన మే, నొల్లను చుట్టపక్కముల నొల్లఁ గులంబును నొల్ల నామనోవల్లభ నీదు కెంజిగురువాతెరఁ గ్రోల మాన నేల నీ, వొల్లనిసుద్దు లిం పెన యున్నదినం బొక టైనఁ జాలదే." తారా. 3. 8--
- చూ. చుట్టపక్కాలు.
చుట్టపక్కాలు
- బంధువులు.
- "చుట్టపక్కాలకు శుభపత్రికలు వ్రాసి." రాధి. 1. 70
- చూ. చుట్టపక్కములు.
చుట్టపు చూపుగా
- బంధుమర్యాదగా. ఏదో చూచి పోదా మని.
- "వా డేదో చుట్టపుచూపుగా వస్తే నీవు పని చేయిస్తున్నా వేమిట్రా?" వా.
చుట్టపుదనము
- బంధుత్వము. భార. స్త్రీ. 2. 103.
చుట్టపుబగలు
- హితశత్రువులు. తాళ్ల. సం. 12. 198.
చుట్టపుమేలము
- బంధురీత్యా చేసే హాస్యము.
- "అట్టి సురతరువు నెఱుఁగక, చుట్టపు మేలమునఁ గొంచు సురిఁగెడుమది." పారి. 4. 57.