పదబంధ పారిజాతము/గుడి కట్టు

వికీసోర్స్ నుండి

గుడార మెత్తు

  • వెళ్లి పోవు.
  • "వా డా ఊరునుండి గుడార మెత్తేసి చాలాకాల మయింది." వా.

గుడి కట్టు

  • గ్రామం ఎల్లల యేర్పాటు. బ్రౌన్.

గుడికి ముద్ర వేసుకొను

  • దేవదాసీత్వము నవలంబించుస్త్రీ పెళ్ళి లేకుండా ఉండిపోవు.
  • "గుడికి ముద్ర వేసికొని కులమున వన్నె, వాసిఁ గాంచి మాట వాసిఁ బెరిఁగి, సాని మగువలందు జాణ వై మగనాలి, పాటు కోర్చి తెట్లు పద్మనయన." ప్రబంధరాజ. 654.
  • చూ. గుడిముద్ర వైచికొను.

గుడికొను

  • జొత్తిల్లు.
  • "గుడికొనుకన్నీరు గ్రుక్కికొనుచున్." సారం. 3. 163.

గుడి గుండ మనక

  • ఇదీ అదీ అనకుండా ఎల్ల చోటులా అనుట.
  • "గుడి గుండ మనక పల్లియ, పడుసర నా కరయుఁ జెఱచి పఱచిన శిష్యున్." పంచ. వేం. 1. 25.

గుడిగుడి కన్నీరు

  • జిటజిట రాలు కన్నీరు.

గుడి గుడి గుంజంబులాట

  • ఒక బాల్యక్రీడ. 'గుడి గుడి గుంజం గుంటానాదం పాం పట్టుకో పక్కచెవ్‌' అంటూ ఆడుతారు. పండితా. ప్రథ. పురా. పుట. 460.

గుడి గుడీ

  • హుక్కా.

గుడిగొను

  • వ్యాపించు.
  • "గుడిగొన్నయే ఱెంత కొంకర వంకర లైనా, పుడమికి లోఁ గొనక పోవు నటయ్యా!" తాళ్ల. సం. 7. 273.

గుడిచాటుకాడు

  • పని చేయనివాడు. గుడినీడ చల్లగా ఉంటుం దని అక్కడే పడిఉండు వాడు. సోమరి అనుట.
  • "కఱపుల గుడిచాటుకాఁడ వై యిట్లు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1706. 7.

గుడిచుట్టు

  • గిర్రున తిరుగు; పరివేషము.

గుడి త్రిప్పు

  • గుడి తిరుగు.

గుడి దిరుగు

  • ప్రదక్షిణము చేయు.
  • "ఒకమా, టకుటిలమతి గుడిఁ దిరిగిన." భీమ. 3. 169.
  • రూ. గుడి దిరుగుకొను. గుడినుండి గుడిత్రాళ్లు గోయు
  • ఒకరి ఆశ్రయంలో ఉంటూ వారికే అపకారం తలపెట్టు.
  • "గుడినుండియె గుడిత్రాళ్లె,క్కుడుగాఁ గోయుట సగోత్రగుణములు సుమ్మీ." పాంచా. 4.
  • చూ. గుడినుండి గుడిరాళ్లు తీయు.

గుడి నుండి గుడిరాళ్లు తీయు

  • కృతఘ్ను డగు. ఉపకారికే ద్రోహము చేయు. తిన్న యింటి వాసాలు లెక్క పెట్టుటవంటి పలుకుబడి.
  • "గుడి నుండి గుడిరాళ్లు తీయుకరణి." పాండు. 3. 68.

గుడి, పాడు చిక్కు

  • సర్వశూన్య మగు, పా డయి పోవు.
  • "అంగళ్లయందు మిట్టాడ మానిసి లేక, గుడియుఁ భాడును జిక్కఁ జెడియె..." కాశీ. 5. 267.

గుడి మింగువానికి నంది పిండి వడియము

  • అంత పెద్దపనే చేసేవానికి మిగతపని ఒక లెక్కా అనుపట్ల ఉపయోగించే సామ్యము.
  • "అంతలేసి మహాత్ముల నింత సేయు, మాకు నిను సంహరించుట మాత్ర మెంత, యెందు గుడి మ్రింగువారికి నంది పిండి, వడియ మనుప ల్కెఱుం గవే పుడమిలోన." విక్ర. 2. 238.
  • చూ. గుడి మ్రింగువానికి తలుపు లప్పడములు.

గుడి మింగేవానికి లింగ మెంత?

  • చూ. గుడి మింగువానికి నంది పిండి వడియము.

గుడిముద్ర వైచికొను

  • దేవదాసిగా నుండు, బసివిగా నుండు.
  • వైష్ణవంలోనూ, శైవంలో కూడా కొందఱు ఆడపిల్లలను దేవునికి సమర్పించేవారు. వైష్ణవంలో దేవదాసీ లనీ, శైవంలో బసువులు లేక బసువురాండ్రు అనీ వీరికి పేరు. వీరు అలా బ్రహ్మ చారిణులుగా ఉండేవారు. కడకు వీరే వేశ్య లయినారు. ఏదో ఒక ఆలయానికి వీరిని సమర్పించేవారు గనుక ఆ గుడిముద్ర వీరిపై పడినట్లు. అట్లే దేవునికి వదలిన ఆబోతులను - అచ్చుపోసిన ఆబోతు లని అంటారు.
  • "జననము నందినం బురుషజన్మము కావలెఁ గాక యాఁడు దై,నను గుడిముద్ర వైచికొనినం దగు లేక కులాంగ నాస్థితిన్..." శుక. 2. 507.
  • చూ. గుడికి ముద్ర వేసుకొను. గుడిమేళము కాదు నగిరి మేళము
  • ఇది కొంత కష్టసాధ్య మనుట.
  • పూర్వం దేవదాసీలు నాట్యం చేసేవారు. గుడిలో నాట్యం చేయడం సులభం. కాని రాచనగరిలో మేళం కట్టి మెప్పించడం కష్టం అనుట పై వచ్చిన పలుకుబడి.
  • "కరణమయ్యతో కంటు కట్టుకుంటే నీ కథ తెలిసొస్తుంది. గుడిమేళం కాదు. ఇది నగిరిమేళం." వా.
  • ఏమీ తెలియని రైతులను ఏడిపించినట్టు కాదు అనుట.

గుడి మ్రింగువానికి తలుపు లప్పడములు

  • ఘోరమైన పని చేయగల వానికి అల్పాపకారములు చేయుట ఒక లెక్కలోనిది కా దనుట.
  • మొత్తం గుడినే మ్రింగే వానికి తలుపులు అప్పడాలతో సమానం కదా !
  • "అలమి గుడి మ్రింగువానికిఁ దలుపు లప్పడములు గాకుండునే. " పాండు. 5. 229.
  • చూ. గుడి మ్రింగువానికి నంది పిండి వడియము.

గుడి వడు

  • గుండ్ర మగు.

గుడిసెవాటు

  • గుడిచేటు.

గుడిసెవేటు

  • గుడిచేటుది; కులట.
  • చూ. గుడిసెవాటు.

గుడిసె వైచు

  • వ్యభిచారము చేయు. తక్కువ రకము కులటలు గుడిసె వేసికొని ఉంటారు. దానిమీద వచ్చిన పలుకుబడి. ఇప్పటికీ రాయలసీమలో హాస్యంగా 'నీ బిడ్డ కేం గుడిసె వేస్తావా? పెండ్లి చేయకుండా' అంటారు. దీనిమీద వచ్చినదే గుడిసె వ్రేటు - గుడిసేటు, గుడిశేటిది.
  • "నీ వపుడు వీఁడు వాఁ డని, భావింపక గుడిసె వైచి పరులం బొందన్." శుక. 2. 46.

గుడుగుడుక్కున మ్రింగు

  • గ్రుక్కిళ్ళు మ్రింగుటలో ధ్వన్యనుకరణము.
  • "గుడుగుడుక్కున మ్రింగు గ్రుక్కిళ్ళ తోడ." ద్విప. నల. 5. 101 పం.

గుడు గుడు గుంచము లాడు

  • పిల్లల ఆటపై వచ్చిన పలుకుబడి.
  • అక్కడక్కడే తిరుగు.
  • "ఒకభార్య నంట గట్టుకొని లొడి తెడు సంసారములో గుడుగుడు గుంచంబు లాడుట కిష్టపడక బ్రహ్మ చారి యై లోకముమీఁద విఱుచుకొని పడి..." సాక్షి. 109.

గుడుగుడు ప్రాణంగా

  • వచ్చే పొయ్యే ప్రాణంగా.
  • "వాడిపరిస్థితి గుడు గుడు ప్రాణంగా ఉంది." వా.

గుడుగుడు మని నడచు

  • గునగున నడచు.
  • "అడుగులు పుడమిని వడి నిడి, గుడు గుడు మని నడచి." పార్వ. 4. 163.

గుడుసు పఱచు

  • తక్కువ చేయు; హీనము చేయు.

గుడుసువడు

  • శూన్య మగు; హీన మగు.
  • "గుడుసువడెఁ జదువు." తాళ్ల. సం. 11. 3 భా. 103.

గుడ్డవృత్తులు

  • ఇనాము భూములు.
  • గుడ్డము - ఊరవాకిలి. ఊర గవిని.
  • పశ్చిమాంధ్ర ప్రాంతంలో నేటికీ ఊరగవిని అనే అర్థంలో 'గుడ్డం' అని ఉపయోగిస్తారు. గూడెమునకు ఈ గుడ్డమునకు సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. గుడ్డవృత్తు లనగా గ్రామం సమష్టిమీద ఆయగాళ్ళు మొదల్గువారికి ఇచ్చే యినాము భూములు కావచ్చును.
  • "గుడ్డవృత్తులు వృత్తులు గొలుచు గుత్త చేలు..." పాండు. 3. 16.

గుడ్డిగవ్వ చేయదు - (డు)

  • బొత్తిగా పనికి రానిది, విలువ లేనిది.
  • ఒకానొక కాలంలో గవ్వలు అతి తక్కువైన కనీసపు నాణ్యాలుగా ఉండేవి. అందులో గుడ్డిగవ్వ మరింత తక్కువ.
  • "వాడి పాండిత్య మంతా ఆ ఊళ్లో గుడ్డిగవ్వ చేయదు." వా.
  • "వాణ్ణి తిప్పి తిప్పి వేలం వేసినా గుడ్డిగవ్వ చేయడు." వా.

గుడ్డిగా

  • విచక్షణ లేక, ముందుచూపు లేక.
  • "ఆవెధవసావాసం పట్టాడు. అప్పటి నుండీ గుడ్డిగా వాడు చెప్పిన ట్లల్లా వినడం తప్ప స్వబుద్ధితో ఏమీ చేయడం లేదు." వా.

గుడ్డి గుఱ్ఱపు తాపు

  • తాకితే తాకుతుంది, తప్పితే తప్పుతుంది. గట్టిగా తగులు నని కూడ.
  • నారాయణ దాసు రుక్మిణీకల్యాణము.

గుడ్డిదర్బారు

  • విచక్షణ లేని పెత్తనం.
  • "వాడి దంతా గుడ్డి దర్బారు. మంచి అంటే మంచి. చెడ్డ అంటే చెడ్డ." వా. గుడ్డిదీపం
  • ఎక్కువ ప్రకాశం లేని దీపం.
  • "ఆ గుడ్డిదీపం వెలుగులో ఏమీ కనపడ లేదు." వా.

గుడ్డినమ్మకం

  • అంధవిశ్వాసం.
  • "శకునా లన్నా, గౌళి శాస్త్రం అన్నా వాడికో గుడ్డినమ్మకం." వా.

గుడ్డిలో మెల్ల

  • కొంత మేలు.
  • "వాళ్లంతా వట్టి కఠినులు. ఈ అబ్బాయే వాళ్లల్లో కల్లా కాస్త గుడ్డిలో మెల్ల." వా.

గుడ్డివడు

  • అంధకారబంధుర మగు.
  • "కొన్ని దేశంబు లిరులచే గుడ్డివడియె." కాశీ. 1. 137.

గుడ్డెద్దు చేలో బడినట్లు

  • ఇష్టం వచ్చినట్లు, చాలూ మూలా లేకుండా.
  • గుడ్డెద్దు కేదీ కనబడదు కనుక దొరికిం దల్లా తింటూ, ఎటు పడితే అటు తొక్కుతూ నానాబీభత్సం చేస్తుంది అనుటపై వచ్చిన పలుకుబడి.
  • "గుడ్డెద్దు చేలో బడ్డట్లు పోలీసు లా నాడు జనంలో పడి దొరికినవాళ్ల నల్లా బాదారు." వా.

గుడ్లగూబ చూచినట్లు చూచు

  • క్రూరముగా, వికారముగా చూచు.
  • "వాడు చూడు. గుడ్లగూబ చూచినట్లు చూస్తున్నాడు." వా.

గుడ్లల్లో కూన

  • ఎత్తిపొడుపుగా మరీ చిన్న వాడు లే అనునప్పుడు అనే మాట.
  • "అవును పాపం! నీ కొడుకు గుడ్లల్లో కూన. ఏమీ తెలీదు." వా.
  • రూ. గ్రుడ్డులోపలి చిన్నకూన.

గుడ్లు అప్పగించి

  • ఏమీ చేయ లేక.
  • "నలుగురూ చేరి వాణ్ణి నలగ దంచుతూ ఉంటే వీడు గుడ్లు అప్పగించి నిలుచున్నాడు. వీ డేం మనిషి ?" వా.

గుడ్లు తేలవేయు

  • ఏమీ చేయలేక తన పని ముగిసినట్లు తెలియజేయు.
  • ప్రాణం పోవునప్పుడూ, మూర్ఛ పోవునప్పుడూ గుడ్లు తేల వేయుటపై వచ్చిన పలుకుబడి.
  • "తీరా వ్యవహారం వచ్చేసరికి వాడు గుడ్లు తేలవేశాడు." వా.

గుడ్లు వెళ్లుక వచ్చు

  • చనిపోవు.
  • కనుగ్రుడ్లు బయటికి వచ్చు. చంపినప్పుడు, చస్తున్న పుడు అలా జరుగుతుంది.

గుణ మిచ్చు

  • పని చేసి మేలు కలిగించు.
  • "ఆ మందు వేయగానే గుణ మిచ్చింది." వా. గుణము చేయు
  • గుణ మిచ్చు.
  • "ఆ మందుతో గుణం చేసింది." వా.

గుణము సారించు

  • ధనుష్టంకారము చేయు.
  • "శంఖంబు పూరించి గుణంబు సారించి." భార. ద్రోణ. 2. 60.

గుణమొలనూలు

  • మొలత్రాడు.

గుత్తకాడు

  • గుత్తకు తీసుకొన్నవాడు. శ. ర.

గుత్తకు తీసుకొన్నట్లు

  • ఇది అంతా నాదే నన్నట్లు.
  • "ఊరంతా గుత్తకు తీసుకొన్నట్లు మాట్లాడుతున్నావే?" వా.

గుత్తగట్టు

  • గుత్త కిచ్చు. నీలా. 1. 118.

గుత్తగా ఉంచుకొను

  • స్వంతంగా పెట్టుకొను. వేశ్యలు ప్రబలంగా ఉన్న రోజుల్లో, వారు ఎవరికీ చెందిన వారు కాక పోయినా, ఎవడో కొంత ధన మిచ్చి తన అధీనంలో ఉంచుకొనేవాడు.
  • "రంగసానిని రామయ్య గుత్తగా ఉంచుకొన్నాడు." వా.
  • చూ. గుత్తగొను.

గుత్తగొను

  • సొంతము చేసికొను.
  • భూముల విషయంలో గుత్తకు తీసుకొనడం అలవాటు. తద్వారా వచ్చిన పలుకుబడి.
  • "...ఇక్కలికి గుత్తగొనుఁ బో,తక్కక దివి నిమిష మున్న దైవతవిటులన్." కళా. 3. 79.
  • "గోపికావళిన్, బొక్కఁగఁజేసి తద్రు చిరభోగము గుత్తగ నీవ కైకొనన్." ఆము. 5. 68.
  • చూ. గుత్తగా ఉంచుకొను.

గుత్తచేలు

  • సంవత్సరానికి ఇంత డబ్బు అన్న ఒప్పందంపై సాగుకు తీసుకొన్న భూములు. పండిన ధాన్యంలో భాగానికి ఒప్పందం చేసుకుంటే అవి కోరు భూములు.
  • "గుడ్డవృత్తులు వృత్తులు గొలుచు గుత్త చేలు." పాండు. 3. 16.

గుత్తపుదాసి

  • ఉంపుడుకత్తె.
  • "...గుత్తపుదాసి దా రవికకుట్టు పుటుక్కున విచ్చె రంభకున్." శకుం. పీ. 80.

గుత్తవట్టు

  • గుత్తగొను.
  • "పచ్చిఱ్ఱితోల్బఱ్ఱె చుచ్చాలమె ట్లంది, కొను దాన యూ రెల్ల గుత్తవట్టు." ఆము. 6. 69.

గుత్తికవ్వము

  • కవ్వము.

గుత్తివడు

  • కష్టపడు.
  • "కొన్ని దేశంబు లిరులచే గుత్తి వడియె." కాశీ. 1. 137.

గుత్తగు త్తను

  • ప్రాణం బితబిత మను భయ భ్రాంతి కలుగు.
  • "ప్రాణములు గుత్తుగు త్తనంగ." హరి. పూ. 9. 132.

గుదగుదలు

  • అనుమానాలు.

గుదగుద మను

  • దిగులు కలుగు; మనసు ఎలాగో అగు.
  • "గుడి కేఁగ రామిని గుదగుద మనుచుఁ, గుడవక..." బస. 6. 180. పు.

గుదగుద లాడు

  • డగ్గుత్తికతో నేడ్చు. బ్రౌన్.

గుదికర్ర

  • జంజాటము.
  • పశువులమెడలకు గుదికర్ర కడతారు, అందుపై ఏర్పడినది.
  • "వృద్ధునకుఁ దన కీ గుదికర్ర యెందులకో." సుకన్య. 10.

గుదికాలు

  • మడమ.

గుదికుచ్చు

  • పేర్చు, కూర్చు.

గుదిగుంజలు

  • పసులదొడ్డి వాకిట పాతిన గుంజలు. బ్రౌన్.

గుదిగుంపులు చేయు

  • కలత పెట్టు
  • "దివిజవేశ్యల, సదనంబుల నున్న మౌని సంతతి తలఁపుల్, గుదిగుంపులు చేసి మథిం,పదె." నిరంకు. 2. 32.

గుదిగొను

  • ఎక్కువగు, చిక్క నగు ఇత్యాది భావచ్ఛాయలలో వినిపించే మాట.

గుది గ్రుచ్చి

  • వరుస పెట్టి.
  • "ముదిలంజవిధమున ము న్నిట్టికథలు, గుది గ్రుచ్చుకొని చెప్పికొని పోవ వలదు." ప్రభులిం. 7. 60.

గుదిగ్రుచ్చు

  • 1. ఒకచోట చేర్చు.
  • "గురుతర ద్రుమములు గుదిగ్రుచ్చు నట్లుగ." కళా. 6. 68.
  • 2. ఒక గుదెకు - సూదికి గ్రుచ్చు.
  • "గుదిగ్రుచ్చెఁ గొందరఁ గూల్చెఁ గొందరిని." పల. పు. 113.
  • "ఆ పూల నన్నిటినీ గుదిగుచ్చి మాల కట్టు." వా.

గుదిత్రాడు

  • దూడకాలికి కట్టే త్రాడు. బ్రౌన్.

గుదిత్రోయు

  • గుదికట్టి త్రోయు.

గుదియకఱ్ఱలు

  • గుదికఱ్ఱలు. గుదివడు
  • కట్టుబడు. కాశీ. 2. 141.

గుదివెట్టు

  • గుదికట్టు.

గుదులుకొను

  • నాటు; కూలబడు.

గుదులుపట్టు

  • తిమ్మిరి పట్టు.

గుదెలవాడు

  • రక్షకుడు.

....ద్ద చుట్టురా అప్పులు

  • ఎటు చూచినా అప్పులే.

గుద్దలిగొను

  • కుళ్ళగించు, పెళ్ళగించు.
  • "కులమున కెల్లను గుద్దలి గొనియె." పండితా. ప్రథ. దీక్షా. పుట. 125.

గునగున నడుచు

  • గునుకుపరువులతో నడచు.

గునిసి నడచు

  • కులుకుచు నడచు.
  • "నేల జీరక యుండఁ గేలఁ గుచ్చెలఁ బూను,కొని యూడిగపుఁజెలు ల్గునిసి నడువ." శుక. 3. 314.

గునిసియాడు

  • చిందులు తొక్కుతూ ఆడు. కుణుసు (కన్న.)
  • "నిలువ కేతెంచి వేఁటకుక్కలు కుమార!, చుట్టుక గునిసి యాడంగఁ జూడ వేమి." కా. మా. 3. 75.

గునుకుపరువున వచ్చు

  • గునగున పరుగెత్తుకొని వచ్చు.
  • "మనవుల కని చెలుల్ గునుకు పర్వున వచ్చి, మొగ తెఱ కట్టుతో ముచ్చ టాడ." హంస. 5. 85.

గునుకెత్తు

  • పరువెత్తు.
  • "గునుకెత్తుచున్న గాడిద, గనుఁగొని." వేంక. పంచ. 4. 521.

గున్న గచ్చకాయల కరణి

  • బాగా తిని నునుపుదేరిన యెడ అను సామ్యం.
  • "....దాదుల్ దినదినము మిసిమి యిడఁగాఁ, గనుపింతురు గున్న గచ్చకాయల కరణిన్." శుక. 2. 333.

గున్నేనుగు

  • పొట్టిగా లావుగా ఉన్న వాళ్లను వెక్కిరింపుగా అను మాట.
  • "వాడు ఒక గున్నేనుగు. వా డేం కొండెక్కుతాడు." వా.

గుప్పెట్లో పెట్టుకొను

  • తన వశములో ఉంచుకొను.
  • "ఆవిడ మొగుణ్ణి తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎంత చెప్తే అంతే." వా.

గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొను

  • ప్రాణభీతితో నుండు.
  • "ఈ దుర్మార్గుని కొంపలో గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను." వా.

గుప్పుగుప్పను

  • ధ్వన్యనుకరణము.
  • కుమా. 11. 155.