పదబంధ పారిజాతము/గుటుకు మనుచు మ్రింగు
స్వరూపం
గుజరాను పఱచు
- అర్పించు; కాన్క యిచ్చు.
- "...హైదరుజంగు గాంచి నజరు గుజరాను పఱచి." రంగా. 2. 85.
గుజ్జుబ్రాలు
- ధాన్యవిశేషం. బ్రౌన్.
గుజ్జుమామిడి
- ఒక రకమైన మామిడి.
గుజ్జెనగూళ్లు
- పిల్లలు బొమ్మలాట ఆడుకొనేటప్పుడు చిన్న గురిగెలలో వండుకొను అన్నము. ఒక విధమైన పిల్లల ఆట.
గుటకలు మ్రింగు
- ఏదో ఒకదానిని ఆశించి, అది యెప్పుడు మనకు వస్తుందా అని వేచి యుండు.
- "...పటుతయుఁ దోఁప మ్రొక్కి నిజ వాస్తవమున్ స్తవమాదిగా ననెన్, గుటకలు మ్రింగుచుం ద్రిదశకోటిగతుం డిటు తాటకాంతకా?" రామకథా. ఉ. భా. 6. 219.
గుటకలు వేయు
- ఎంతో ఆశించు.
- "వీధిలో పొయ్యే అమ్మాయిలను వీడు గుటకలు వేస్తూ చూస్తుంటాడు." వా.
- చూ. గుటకలు మ్రింగు.
గుటకాయ స్వాహా చేయు
- అపహరించు. కొత్త. 435.
గుటగుట మను
- సంకోచము కలుగు.
- "మనమున గుటగుట మను." శ్రవ. 3. 86.
గుటగుట యను ధ్వన్యనుకరణము.
- "ఉల్ల మగలంగ నయ్యుగ్రభల్లుకంబు, గుట గుట యటంచు రొప్పి యక్కుటిలుఁ గదిసి." శుక. 1. 500.
గుటిక మ్రింగిన సిద్ధు డగు
- నిశ్చలు డై యుండు.
- "గుటిక మ్రింగినసిద్ధుఁ డగుచుఁ దరలఁడు." వర. రా. అయో. పు. 330. పంక్తి. 23.
గుటుకు మనుచు మ్రింగు
- గుటుక్కున మ్రింగు. ధ్వన్యనుకరణము.
- "క్రోఁతిమూఁకల మ్రింగెద గుటుకు మనుచు." బాల. 159.
గుటుక్కను
- చచ్చు.
గుటుక్కు మను
- చనిపోవు.
- "వాడు కాస్తా గుటుక్కు మంటే అప్పుడు తెలుస్తుంది అయ్యసంగతి." వా.
గుట్టీక
- మనసులోని బాధ నితరులకు తెలియ నీక.
- "గుట్టీక నలంగియు నత్తమామల చిత్తంబు వచ్చునట్లు భక్తి శక్తులు మెఱసి పాటులంబడుమఱందలి." పాండు. 3. 24. గుట్టుకీడు
- రహస్యశత్రువు. ఆము. 4. 250.
గుట్టు కోల్పడు
- బయట పడిపోవు, కొంచె పడు.
- "నిన్ను నమ్మి నా, గుట్టును దేజము న్మి గులఁ గోల్పడి పోయితి నేమి సేయుదున్." పారి. 1. 127.
గుట్టు గలయది
- రహస్యమును మనసులోనే పెట్టుకొనగలది - పెట్టుకొన గలవాడు, మర్మిష్ఠి.
- "మండోదరితో, నంతయును దెలిపి క్మమ్మఱి, కాంతునికడ నుండె గుట్టు గలయది వోలెన్." శుక. 3. 273.
గుట్టు గైకొను
- రహస్యము నెఱుగు.
- "ఎట్ట కేలకు నాదు గుట్టు గైకొని." పాణి. 3. 32.
గుట్టు చప్పుడు కాకుండా
- రహస్యముగా, ఎవరికీ తెలియకుండా.
- "వాడు ఊళ్లో నలుగురిదగ్గరా అప్పులు చేసి, గుట్టు చప్పుడు కాకుండా లేచి పోయినాడు." వా.
గుట్టు చెడు
- రహస్యభంగ మగు.
- "ఎట్ట కేలకు గుట్టు చెడి." శ్రవ. 1. 85.
గుట్టున పోనిచ్చు
- ఊరకే అల్లరి లేకుండా వదలి పెట్టు.
- "మౌనముఁ దాల్చిన గుట్టునఁ బోనీఁడు నిరంకుశుండు." నిరం. 3. 15.
గుట్టుపట్టు
- గుండె. వావిళ్ళ.
గుట్టు బిట్టాడు
- క్రక్కదలు.
- "చిందరవంద రయి గుట్టుబిట్టాడంగన్." సారం. 3. 15.
గుట్టు మట్టు
- రహస్యము, ఆంతర్యము. జం.
- "మీ బండాలము కొండల కెగఁబ్రాకు చున్నను మీలోని గుట్టుమట్టు నే గట్టిగాఁ గనిపెట్టినాఁడను." ధర్మజ. 63. పు. 11. పం.
గుట్టు వీడు
- బయల్పడు. మనసులో నున్నది వెలనాడు.
- "చెలఁగన్ మున్నుగ గుట్టు వీడుటకు నై చింతింతు రన్యోన్యమున్." రాజగో. 2. 68.
గుట్టు సాకిరి
- 'వాది తన వ్యవహారము గెల్చుటకొఱకు రప్పింపగా వచ్చి దాగియుండి ప్రతివాది యొక్క మాట లన్ని యు జక్కగా విన్న సాక్షి.' శ. ర.
గుడగుడ ధ్వన్యనుకరణము.
- "గుడగుడ నుడికెడి యుదకము." సింహా. 8. 188.