పదబంధ పారిజాతము/కొట్టకొన

వికీసోర్స్ నుండి

  • "కొక్కొక్కో యనుచుఁ గోడి కూయఁ దొడంగెన్." వరాహ. 4. 164.

కొక్కొరొకో అను

  • కోడి కూయు. ధన్యనుకరణము.
  • "కొక్కొరొకో యని కుక్కుటంబులు కూసె." కాశీ. 3. 235.

కొక్కొరోకో యను

  • కోడి కూయు. ధ్వన్యనుకరణము.
  • "కొక్కొరో, కోయనికూయఁ డే యతఁడు." నైష. 8. 79.

కొక్కోకో

  • కోడి కూయు. ధ్వన్యనుకరణము.
  • "కొక్కొకో యని కుక్కుటచ్ఛట లెలుంగుల్ రెచ్చె నల్దిక్కులన్." బహు. 3. 94

కొట్టకొన

  • చిట్టచివర.
  • "ఆ చెట్టు కొట్టకొనాన ఒక పండు వేలాడుతూ ఉంది." వా.

కొట్టరువు

  • ధాన్య ముంచుకునే కొట్టు.
  • "కొట్టరువునఁ బళ్ళు గొలిపించు చుండ." బస. 6. 168 పు.

కొట్టికత్తె

  • పనికత్తె.
  • "గుత్తులయెడ చిగుళ్లు...కొట్టికత్తెలు పిడికిన..." కేయూర. 4. 50.

కొట్టికాడు

  • పనివాడు, నౌకరు.
  • "హరిణాజినోత్తరీయుఁడు, నిరాయుధుఁడు నగుచు నతని నెల వగునడవిన్, జొరఁ గొట్టికాండ్రు డెక్కెముఁ, బరికించి యెఱింగి కలయఁబడి కూఁత లిడన్." ఆము. 3. 26.
  • రూ. కొటికాడు.

కొట్టి కోలాహలంగా

  • ఎక్కితొక్కి; పూర్తిగా, బాగా.
  • ఎట్లైనా చాలును అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "శేరు బియ్యం అయితే మన అందరికీ కొట్టి కోలాహలంగా సరిపోతుంది." వా.
  • "మూడుసేర్ల బియ్యం వేస్తే వారందరికీ కొట్టి కోలాహలంగా సరిపోతుంది." వా.

కొట్టి కోలాహలము చేయు

  • పాడు చేయు.
  • "కొట్టి కోలాహలము చేసి కూలఁ గ్రుమ్మి, చెండి చెకపికలాడమా యుండె నేని." సారం. 1. 74.

కొట్టినపిండి

  • బాగా తెలియును.
  • "కోమలి నాకు నెట్టి యెడఁ గొట్టినపిండి సమస్తలోకముల్..." కళా. 6. 37.
  • వాడుకలో కూడా ఉంది:
  • "వాడికి వ్యాకరణశాస్త్రం కొట్టిన పిండి." వా.

కొట్టివేయు

  • 1. దొంగిలించు.
  • "వాడు నా పుస్తకం కొట్టివేసినాడు." వా.
  • 2. త్రోసివేయు.
  • "కోర్టులో వాడి కేసును కొట్టివేశారు. ఆనాటినుండీ వాడు మనిషి మనిషి గా ఉండడం లేదు." వా.
  • 3. లెఖ్ఖ తీసివేయు.
  • "ఈ డబ్బు తీసుకొని నా లెఖ్ఖ కొట్టివేయండి." వా.
  • 4. పడగొట్టించు.
  • "దళ వాయితోడ గోడకు, వెలుపటి యిల్లిల్లు గొట్టివేయించి." కువలా. 3. 3

కొట్టుకాడు

  • 1. కొట్టుకొను.
  • "ఇట్టటు బెట్టుగఁ గొట్టుకాడుచున్." రాధి. 2. 89.
  • 2. కొట్టునట్టివాడు.
  • "ఉలుకును గొట్టుకాడు నగు." రాధి. 1. 128.

కొట్టుకొను

  • తన్నుకొను; ఏడ్చు; గట్టిగా చెప్పు.
  • "కడుపు నొప్పితో వాడు కొట్టు కుంటున్నాడు." వా.
  • "పిల్లడు పోయా డని ఆమె కొట్టు కొంటూ ఉంది." వా.
  • "వద్దో ఆవ్యాపారం అని కొట్టుకున్నాను. విన్నాడు కాదు." వా.

కొట్టు చీకుడు గుడ్డలు

  • అంగట్లో నిల్వ వుండిపోయి చీకు పట్టిపోయిన గుడ్డలు. క్రొత్త. 20.

కొట్టుడుబిళ్ళలు

  • గోళీకాయలు.<.big> బ్రౌన్.

కొట్టుపడు

  • దెబ్బ తిను.
  • "కొట్టువడి యటకు మును పే, తిట్టుంబడి." మను. 4. 86.
  • రూ. కొట్టువడు.
  • ఇందుకు దగ్గఱి భావచ్ఛాయలన్నీ ఈ అర్థంతోనే సరిపెట్టు కొనవచ్చును.

కొట్టు మిట్టాడు

  • చెల రేగు, కలతపడు, తన్ను కొను.
  • "రక్కసులు వేడబంబుల, మిక్కిలి నాముకొని కొట్టుమిట్టాడంగా..." యయాతి. 2.
  • "నట్టడవిలోన న న్నిట్టు నట్టు పఱచి, కొట్టుమిట్టాడ నేటికిఁ బట్టభద్ర, పుట్టునకు మున్న లేమకు బొట్టు గట్టి, చెట్ట వట్టుట కొకరుండు పుట్టెఁ జూవె." శకుం. (కృష్ణ) 2. 74.

కొట్టిమిట్టిపడు

  • ఎగిరి పడు.

కొట్ణము దంచు

  • ధాన్యము దంచు.
  • "అప్పుడమివేల్పు జవరాండ్రు కట్ణంబులకై కొట్ణంబు దంచుచు నమ్మహోత్సవాల యాంగణంబున..." హేమా. పు. 81.

కొట్నాలు దంచు

  • ధాన్యము దంచు.
  • "కూరిమి విషయముల కొట్నాలు దంచేము." తాళ్ల. సం. 9. 198.

కొట్లాడు

  • జగడ మాడు, పోట్లాడు.
  • "చుట్టములతోడ నొప్పమి పుట్టినప్పు, డడ్డపడి వారితోడఁ గొట్లాడి యైన, దాని నుడుపంగఁ జొరకున్న వానిఁ గ్రూర,కర్ముఁ డని చెప్పుదురు కర్మ కాండవిదులు." భార. ఉద్యో. 3. 242.

కొడి గట్టు

  • దీపం వత్తి కాలి నల్లవడు.
  • "దీపం కొడిగట్టి వెలుగు తగ్గింది." వా.

కొడిదిపూస

  • మొలతాడులో బిళ్ల. వేం. పంచ. 1. 598.

కొడిమెలాడు

  • నిందలు మోపువాడు.

కొడిమెలు గట్టు

  • అపనిందలు మోపు.
  • "జడముడి జాహ్నవీతటనిశాకర పోతముఁ జూచి యెవ్వ రీ, కొడిమెలు గట్టి పెండ్లికొడుకున్ గడియారము మోవఁ జేసిరి." జైమి. 1. 2.

కొడివడు

  • కదలు.
  • "పన్ని నిలిచెఁ గాయ్వుతో దానవఁ, కుల బలంబు నేల కొడివడంగ." కుమా. 11. 79.

కొడివాఱు

  • దీపం కొనసాగు.
  • "శ్రీకమల గృహము మోము వి, లోకింపఁగ దీపకళికలు కనుంగవ యౌ, నా కొడి వాఱిన సన్న పు, రేకలు నాబొమలు సుందరికిఁ జెలువొందున్." శకుం. 2. 179.

కొడి సాగు

  • కొనలు తేరు.
  • "ఉడుగని వెలుపటి యుద్యోగము వలె కొడి సాగెడి మితి కోరికలు." తాళ్ల. సం. 11. 78.

కొడి స్తంభము

  • ధ్వజ స్తంభము. బ్రౌన్.

కొడుకులు కొమ్మలు

  • సంతానము. జం.
  • "కొడుకులఁ గొమ్మలం బడసి కొండొక కాలము ధాత్రి యేలి." బుద్ధ. 2. 28.
  • "వాని కేం కొడుకులా కొమ్మలా ? అదంతా ఎవరికో పోవలసిందే." వా.

కొడుకైనా కూతురైనా

  • ఉన్న దల్లా ఆ పిల్లే అనుట.
  • "కొడు కైనా కూతు రైనా నా కున్న దల్లా ఆ పిల్లే. ఈ అవస్థంతా దాని కోసం కాకపోతే ఇం కెందుకు?" వా.

కొడుగురు వోవు

  • చలితో కొంకెర్లు వోవు.
  • "సీతునం, గొడుగురు వోయి యున్న సఖుఁ గ్రోతిఁ గనుంగొని." కేయూర. 3. 270.

కొడ్దిపూస

  • కొడిదిపూస
  • చూ. కొడిదిపూస.

కొణుజెక్కు

  • పిడుదులు పశువులకు పట్టు.
  • "ఎరువు తిప్పులు గొని యెల్ల మందలు గొణుజెక్కు." హరి. పూ. 6. 5.

కొతుకుపడు

  • జంకుగొంకులతో సంకోచించు.
  • "లేమిం గొతుకుపడినభర్తను." కాశీ. 2. 79.

కొత్తగా మాట్లాడు

  • నీ మాటలు మామూలుగా లేవు అనుపట్ల 'ఏమిటే! కొత్తగా మాట్లాడుతున్నవే' అంటారు. ఈ ధోరణి యేమిటి? కొత్తగా ఉందే అని భావము.
  • "ఏ నీ కెపుడుఁ బ్రసన్నుఁడ, గానే తరళాక్షి ! క్రొత్తగా నిటు పలుకం,గా నేల?" మార్కం. 5. 205.

కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకొని పోయినట్లు

  • ఎవరో - ఏదో - వచ్చి, ఉన్నవారిని - వానిని - తొలగించుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • కొత్తవానితో పాతవి వెనుకబడి పోయినప్పుడు దీనిని ఉపయోగిస్తారు.
  • "కొత్తనీరు వచ్చి పాతనీరు కొట్టుకు పోయినట్లుగా యీ ఇంగ్లీషు చదువులు వచ్చి వేదాలు శాస్త్రాలు మన చదువులన్నీ మూల బడ్డాయి." వా.

కొత్తా పాతా లేదు

  • చాలా కలగలుపు మనిషి.
  • "ఆ అమ్మాయికి కొత్తా పాతా లేదు. అందరితోనూ చాలా హాయిగా కాలం గడుపుతుంది." వా.

కొత్తిమీద కూడు

  • (?)

కొత్తెమ్మసాని

  • యోగిని. విప్ర. 2. 14.

కొదల పొందని

  • అపార మయిన, కొఱత లేని అనుట.
  • "కొదలం బొందనిబహుసంపదలన్." నిరంకు. 2. 85.

కొదలు పడు

  • కొఱతపడు.

కొదల్పడు

  • కొఱతపడు.
  • "నా, తమ్ముని ముద్దుమాటలు గొదల్పడఁ బల్కెడుచిల్కబోద." నిర్వ. 5. 105.

కొదవ కార్యము చూచికొనగ వచ్చు

  • తక్కినపని నెఱవేర్చుకో వచ్చు.
  • "కడప కడ్డము గాఁగఁ బడి సివమాడుము, కొదవకార్యము చూచి కొనఁగ వచ్చు." శుక. 2. 350.
  • వాడుకలో రూపం:
  • "నీ వక్కడికి వెళ్లు. మిగతా పని నేను చూచుకొంటాను." వా.
  • "నీ వతనికి కనబడి రా. మిగతపని నేను చూచుకొంటాను." వా.

కొదవ చేయు

  • తక్కువపఱచు, కించపఱచు.
  • "హితంబుఁ, గోరిక నన్నింత కొదవ చేసితివి!" వర. రా. అర. పు. 215. పం. 15.
  • "పంపఁ దగ దంపినచో మఱి నిన్నుఁ గొదవ సేసినతెఱఁ గగు." విప్ర. 4. 73.
  • "నీ కేం కొదవ చేసినా నని అలా మూతి ముడుచు క్కూ చున్నా వే కోడలా?" వా.

కొదవడు

  • ఆగిపోవు, పని కాక మిగిలి పోవు; తగ్గు.
  • "యాగము కొదవడకుండఁగ, సాగింపుఁడు." శకుం. 3. 106
  • "జనసత్త్వమంచుఁ గొదవడుఁ జూపుల్." సుద. 2. 136.

కొదవపడు

  • తక్కు వగు, లోపము జరుగు.
  • "ఏ మైనఁ గొదవ పడెనొ." విప్ర. 4. 38.
  • "కొదవపడియెఁ బని యనుచున్." వేం. పంచ. 1. 96.

కొదవపఱచు

  • తగ్గించు.
  • "ఎవ్వనియశంబు జగ మెల్ల నెనసి చుట్టు, కొండ యవ్వలి తమ మెల్లఁ గొదవ పఱుచు." కాళిం. 1. 35.

కొదవలు తడవు

  • లోపము లెన్ను.
  • "నేను మీదాన నగుట మీ గానకథలు, వడిన నవ్వేళఁ గొదవలు దడవ రేమొ." కళా. 2. 45.

కొదవ లేదు

  • సమృద్ధిగా ఉన్న దనుట. లోటు లేదు.
  • "ముదిత! మేలు మేలు కొదవ లే దెందు." కళా. 2. 35.
  • నేటికీ వాడుకలో :
  • "వా ళ్లింట్లో పెట్టుపోతల కేమీ కొదవ లేదు." వా.
  • "నీవు మంచి యింట్లో పడ్డావు. నీ కేం కొదవమ్మా కూతురా !" వా.
  • "వాడికి కొడుకులు చేతి కెదిగి వచ్చారు. వాడి కేం కొదవ?" వా.

కొదుకుకొను

  • భయపడు; జంకు.
  • "గోలయును బోలె నొదుగుచుఁ గొదికి కొనుచు." విప్ర. 3. 3.

కొద్దిపడు

  • కొంచెపడు.

కొద్దిపఱచు

  • హీనపఱుచు.
  • "తిట్టె నేనిఁ గొట్టె నేనిఁ గొట్టినఁ గొట్టును, గొట్టె నేని యముడు కొద్ది పఱుచు." వేమన.

కొన కెక్కు

  • పరాకాష్ఠ నందు.
  • "గోవిందుఁడు మన్నించితే కొంచెము దొడ్డున్నదా, కోవరపుసిరు లంది కొన కెక్కుఁ గాక." తాళ్ల. సం. 9. 134.

కొనకొన కోడి

  • నీటికోడి. క్రీడా. 52.

కొనగోర దిద్దు

  • గోటితో వెంట్రుకలను సవరించుకొను.
  • "చెలు వెడఁగోఁ జన్న నిలువుటద్దముఁ జూచి, కొనగోర నటు దిద్దుఁ గురులు విరులు." కళా. 7. 102. కొన మునిగించు
  • పూర్తిగా ముంచు.
  • "కినిసి పల్కితి వారిఁ బిశా చులార పొం,డని యిటు లన్న మాత్రనె మహా శనిపాతమువోలె వారలం, గొన మునిగించె నాపలుకు కుత్సితరూపులు గాఁగఁ జేయుచున్." ఉద్ధ. 1. 188.

కొనల కెక్కు

  • పై కెక్కు; ఉన్నతి నందు. వర. రా. అయో. పు. 269. పం. 4.

కొనలు నిగుడు

  • పెరుగు, వర్ధిల్లు.
  • "కుశల మడిగి ప్రియము కొనలు నిగుడ." భార. అర. 5. 29.
  • చూ. కొనలు సాగు.

కొనలు వాఱు

  • వర్ధిల్లు. ప్రభా. 2. 105.

కొనలు సాగు

  • వృద్ధి చెందు.
  • ఇది తీగలు మొదలగునవి పెరుగుటలో కొనలు సాగుటను బట్టి వచ్చిన పలుకుబడి. ఇలాంటివే కొనలు నిగుడు, తీగ సాగు ఇత్యాదులు.
  • "అనవుడుఁ గనుంగొనల గొనలు సాగు, కనలున..." కా. మా. 1. 57.
  • "శబరకాంతాఘనస్తనశాతకుంభ, కుంభ యుగములఁ గరికరి కొనలు సాఁగె." కా. మా. 3. 12.
  • "లోన దండెమ్ముల లోమలు చుట్టుగాఁ, బెనఁగొని మీఁదికిఁ గొనలు సాఁగి." రాజగో. 1. 96.

కొనలొత్తు

  • వర్ధిలు.
  • "వేడ్కలు కొనలొత్తునపుడు." రంగ. రా. బాల. 25 పుట.

కొనసాగు

  • 1. వర్ధిల్లు.
  • "ఇంకఁ గొనసాఁగుఁ జుమీ కుశలంబు మాదెసన్." పాండు. 4. 53.
  • "రాజీవనయనకు రాగంబు కొనసాఁగె." రాధా. 1. 128.
  • 2. బాగా జరుగు.
  • "శర్వుల చిత్తవృత్తి కొనసాఁగుచు నుండుట." హర. 4. 45.
  • "ఈ విధంగానే ఎన్నాళ్లు కొనసాగుతుం దనుకుంటున్నావు?" వా.

కొనాకులు మేయు

  • పైపైన రుచి చూచు.
  • సమగ్రము, కూలంకషము కాని దనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "....నేను మాత్రము భావికార్యము నెడ కొనాకులు మేయఁబోను..." ధర్మజ. 65 పు. 8 పం. తె. జా.

కొనితెచ్చి పెట్టుకొన్న తద్దినం

  • అనవసరంగా కల్పించుకొన్న చిక్కు.
  • "వా ణ్ణేదో బుద్ధి చాలక ఇంట్లో ఉండమన్నాను. వా డింత పని చేశాడు. ఇదంతా కొని తెచ్చిపెట్టుకొన్న తద్దినంలాగా తయా రయింది." వా. కొని తెచ్చుకొను
  • బుద్ధిపూర్వకముగా చిక్కులను తెచ్చి పెట్టుకొను.
  • "అనవసరంగా వాణ్ణి మాట్లాడించి తగాదా కొనితెచ్చుకొన్న ట్లయింది." వా.

కొనియాడు

  • 1. పొగడు.
  • "హరుఁ జెడనాడి వీరిఁ గొనియాడెదు." కుమా. 2. 31.
  • 2. గౌరవించు.
  • "కుంతీమహాదేవి కోడండ్రలోపల, నగ్గలంబుగఁ గొనియాడఁ బరఁగి." భార. విరా. 2. 216.
  • 3. స్తుతించు.
  • "కొనియాడిన నాపై కోప మేల?" త్యాగయ్య.
  • 4. ప్రోచు.
  • "అతని పుత్రకులు దాని, నెంగిళులు వెట్టి కొనియాడ నెలమిఁ బెరిఁగి." భార. కర్ణ. 2. 54.
  • 5. పెద్దగా ఎంచుకొను.
  • "విధివశమున వచ్చిన కీ, డధములు గొనియాడి వ్రేఁగు లై విపులభవాం,బుధి మునుఁగుదురు." భార. ఆను. 1. 9.

కొనుకొను

  • వెలకు పుచ్చుకొను.
  • "బ్రదుకు గలిగె, నేని యర్థంబు లీరాని విచ్చి యైనఁ, బొందు గొనుకొందు నెట్లరవిందనయన." ఉద్భ. 2. 168.

కొనుగోలు

  • అమ్మకం.
  • "ఆ భూమి వాని కప్పుడే కొనుగోలయి పోయిం దట." వా.

కొనుబడి

  • విక్రయం.

కొనుమొదలు

  • సంచకరువు (?)
  • కొనుట కిచ్చిన సొమ్ము అని... బ్రౌన్: శ. ర.

కొన్న, అంగడిలోనే మాఱు బేరమా

  • కూడనిపని అనుట.
  • "నిన్నుం డేమానిసి యే, ని న్నేలిం జేయఁ బూనె నెలఁత బలారే, కొన్నం గడి లోపలనే, యన్నవలా మారుబేర మగునే చెలియా?" రాధి. 3.

కొప్పు పట్టి ఈడ్చు

  • ఆడవాళ్లను శిక్షించుటలో కొప్పు పట్టి లాగుట ఒకటి.
  • "నా యిగురుఁబోడి కొప్పు పట్టి తివం బోవ..." కళా. 3. 127.

కొప్పువల

  • తల వెండ్రుకల బంధించు ముత్యాలసరము. బ్రౌన్.

కొ ప్పెక్కించు

  • పై కెత్తు, గౌరవించు.
  • "లలిఁ గొప్పెక్కించితి మధు, పుల శుకులకు నడుగుపఱచి పుష్పాస్త్రా!" చంద్రా. 5. 91.
  • ఇక్కడ కొప్పు ఇంటికొప్పు.

కొప్పెత్తు

  • పరాజిత మై పాఱిపోవ నుంకించు.
  • కోడిపందెములలో ఓడిపోయిన కోడి కొ ప్పెత్తడం, అలా యెత్తిన వెంటనే పారిపోవడం కనబడుతుంది. మెడమీది ఈకలు పైకి లేవడాన్ని కొప్పెత్తడ మంటారు. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "అదేమిట్రా? అన్ని మాట్లాడి అతను రాగానే కొప్పెత్తావు." వా.
  • "ఆ కోడి కొప్పెత్తింది." వా.
  • "నా కోడికి కత్తికట్టగానే నీ కోడి కొప్పెత్తుతుందో లేదో చూడు." వా.
  • చూ. ఎత్తి పోవు.

కొమరాలు

  • 1. యువతి.
  • "కొమరాలి సిబ్బెంపు గుబ్బ పొందమ్మి మొగ్గలు." శకుం. 2. 87.
  • 2. సుందరి.
  • "అట్టి కొమరాలు భాగ్యోదయమున, వచ్చి కామింప నొల్లని వాఁడు గలఁడె." భాగ. 3. 787.
  • 3. ఆడుది.
  • "తమ్మి కొమరాలు పద్మనేత్రములు ముడిచె." వేం. పంచ. 4. 234.

కొమరునాడు

  • యౌవనం.
  • "కొమరునాఁడే చెల్లె మావైఖరుల్." కకు. 4. 26.

కొమరుబాయము

  • యౌవనము. కళా. 4. 46.

కొమరు మిగులు

  • అంద మగు.
  • "కువలయానందకరలక్ష్మిఁ గొమరు మిగిలి." జైమి. 1. 27.
  • "పులుఁగుల గమికాఁడు పలు దెఱంగుల దాఁటు, గుఱ్ఱంబు బంటు నై కొమరు మిగులు." రుక్మాం. 1. 125.

కొమరు మెఱయు

  • అందముగా నుండు. పాండు. 3. 32.

కొమరేఱు

  • స్వామిపుష్కరిణి.
  • "కొమరేఱు కల్యాణకమలషండంబుల." భీమ. 2. 62.

కొమరొందు

  • అంద మగు.
  • "కొండిక మచ్చయును బోలెఁ గొమరొందు." పాండు. 2. 60.

కొమ్మ నాటు

  • చెట్లు వేయు. కొన్ని మొక్కలను విత్తనం అవసరం లేకుండా కొమ్మలు తెగ నఱికి నాటితే చెట్లవుతాయి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "కొమ్మ నాఁటంగ దగునెడఁ గొమ్మనాఁటు..." కళా. 4. 79.

కొమ్మలు వోవు

  • కొనలు దేరు, వర్ధిల్లు.
  • "రతి కోర్కులు కొమ్మలు వోవ." నిర్వ. 8. 73.

కొమ్ము కాచు

  • సహాయముగా ఉండు. నీపక్షం నే నుంటాను లే అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "నీ కెందుకు? నువ్వు ముందు నడు. నేను కొమ్ము కాస్తాను." వా.

కొమ్ము కొట్టే గుణం

  • ఇతరులను వెనుక అవహేళన చేసేగుణము.
  • ఎద్దులు కొన్నిటికి కొమ్ముకొట్టే గుణం ఉంటుంది. రాత్రిలో తడవ తడవకూ కొమ్ము గాడిపాటి రాతికో కంబానికో వేసి కొట్టుకుంటుంటాయి. అందుపై వచ్చిన పలుకుబడి.
  • "వా డంతా మంచివాడే కాని వెనకల ఎత్తివేస్తూ ఉంటాడు. ఆ కొమ్ము కొట్టే గుణం ఒకటి లేకపోతే..." వా.

కొమ్ముతీరు

  • పశువుల విషయంలో గణించ వలసిన లక్షణం.
  • కొమ్ముతీరూ, నడకతీరూ చూచి ఎద్దును కొనా లంటారు.
  • "ఈ కోడెకు కొమ్ముతీరు బాగా ఉంది." వా.
  • కొమ్ము పూర్వపదంగా కొమ్ము కాకర, కొమ్ముచేప, కొమ్ముటుడుము, కొమ్ము టేనుగు, కొమ్ము తేజి, కొమ్ము పెసర - ఇలాంటి పదాలు చాలా చాలా ఉన్నవి. కాని విశేషార్థస్ఫూర్తి, విభిన్నార్థస్ఫూర్తి ఉన్న కొన్నే ఇట ఇవ్వబడినవి. మిగతవి ఊహ్యములు.

కొమ్ము మాచకమ్మ

  • స్తనా లున్న మాచకమ్మ. బ్రౌన్.
  • మాచకమ్మ అంటే సమర్త కాకుండా ఉండే స్త్రీ.
  • "మాచికమ్మ సమర్త మఖైతే నేం పుబ్బ అయితే నేం?" సా.

కొమ్ములాడు

  • పంది ; కొమ్మువాడు.
  • "లాఁచి తప్పిన జాగిలము రొట్టు కొట్టునఁ, గూడినపిడిఁ గూల్చెఁ గొమ్ము లాఁడు." కకు. 4. 77.

కొమ్ములు చివ్వు

  • పౌరుషము లెక్కించు.
  • "పరుల,కొమ్ములు చివ్వినఁ గొంక నేరుతునె." వర. రా. యు. 59 పు. పం. 7.

కొమ్ములు చూపి గేదె బేరమాడు

  • విషయం అంతటిని బయట పెట్టకనే వ్యవహారం సాగించడానికి పూనుకొన్న ప్పుడు అనే మాట.
  • "అసలు ను వ్వేం రాశావో యేమిటో చూపకుండానే పత్రికలో వేసుకుంటారా లేదా అంటే యేం చెప్పను? వా.
  • "నీ వ్యవహారం చూస్తే కొమ్ములు చూపి గేదె బేర మాడినట్లుగా ఉంది." వా. కొమ్ములు తిరిగిన
  • గొప్పపేరు గడించిన.
  • "ప్రపంచమునఁ గొమ్ములు తిరిగిన విద్వాంసు లున్నారు." సాక్షి. 320.
  • చూ. కొమ్ములు మొలుచు; కొమ్ములు వచ్చు.

కొమ్ములు మొలుచు

  • అంత గొప్పవాడా? కొమ్ములు వచ్చినవా? అనుట.
  • "వాడి కేం కొమ్ములు మొలిచాయా? వాడు తప్ప మరెవడూ పనికి రా డంటావు?" వా.
  • చూ. కొమ్ములు వచ్చు; కొమ్ములు తిరుగు.

కొమ్ములు వచ్చు

  • గొప్పవా డగు; ఆధిక్యం కలుగు. సాక్షి. 47.
  • "పోనీ. వాడే రానీ. వాని కేం కొమ్ము లొచ్చాయా?" వా.
  • చూ. కొమ్ములు మొలుచు.

కొమ్ములు సూపు

  • బెదరించు.
  • ఆధిక్యము కనబఱచు. ఇక్కడ శ్లేషలో ఈ అర్థం ఉన్నది.
  • "అబల నీయెలుఁగు పికారావ మని నీకుఁ, జూతమ్ముఁ గొమ్ములు సూప వెఱచు." కుమా. 5. 165.
  • "కుంభోదకముఁ బోసి యంభోజముఖి పెంపఁ, జూతంబు కొమ్ములు సూపఁ దొడఁగె." విక్ర. 1. 156.

కొమ్మెక్కి కూర్చుండు

  • ప్రాధేయపడు కొలది బిగువు సూపు.
  • "అయ్యా మీరు చెప్పినట్లే చేస్తా మని మనం లొంగేకొద్దీ అతను మరీ కొమ్మెక్కి కూర్చుంటున్నాడు." వా.
  • చూ. కొఱ్ఱెక్కి కూర్చుండు.

కొయ్య

  • విరసుడు. సరసుడు కాని వాడు.
  • "ఆలుబిడ్డ లేని యట్టి త్రిమ్మరి యగు, కొయ్య గాక కుదుట గూడు వెట్టి, కుడుచువార లిట్టి క్రొవ్విదంబులు సేయఁ, జొచ్చు టిచ్చగించి చూతురయ్య." భార. ఉద్యో. 2. 9.

కొయ్యకాటుక

  • ఒక రకమైన కాటుక. వివరం తెలియదు. 'దళముగా నలఁదిన కాటుక.' అని వావిళ్ళ ని.
  • "కుటిలంపుఁ జూపులుఁ గొయ్యకాటుకలు." పండితా. పర్వ. 341 పు.

కొయ్యకాలు

  • సజ్జ జొన్న వరి ఇలాంటి పైరు కోయగా నేలపై మిగిలిన మొక్క.
  • "చేలపంటల కొయ్యకాలె తెలుపు." రామలిం.
  • నేడు 'కొయ్య' లనే వీని నంటారు. కొయ్యకూర
  • తోటకూర.

కొయ్యతోటకూర

  • ఒక విధమైన కూర.

కొయ్యతనములు

  • 1. దుడుకుపనులు
  • "నీవు దర్పమునఁ జేయు కొయ్యతనములు వీక్షించి." కాశీ. 4. 94.
  • 2. శఠత్వం.
  • "కొయ్యతనమునఁ గోపించుఁ గొంత తడవు." వరాహ. 11. 76.
  • 3. పారుష్యం.
  • "సురశాఖ యయ్యుఁ, గొయ్యతనమున వర్తింపఁ గోరఁ డెచట." ఉద్ధ. 3. 333.

కొయ్యనగాడు

  • మూర్ఖుడు; దుష్టుడు.
  • "కొఱగాని జఱభులఁ గొయ్యనగాండ్ర, గొఱియల వార్తలు గూడునే త్రవ్వ." బస. 5. 91.

కొయ్య పొడ్వనా

  • ఎందుకు? కాల్చనా? అనే అర్థంలోనే ఉన్నమాట.
  • "...భక్తి విహీనులబ్రదుకు, గొయ్య బొడ్వన దానిఁ గొనిపోయి గాల్ప." పండి. పర్వ. ద్వితీ. 418. పు.

కొయ్యల గోపి

  • కోతివెధవ.
  • "వాడు ఒట్టి కొయ్యల గోపి, వాడి దగ్గరికి వెళ్లా వంటే నీపని అసలు కాదు." వా.

కొరకచ్చు

  • కొఱివి కట్టె. ఒక తిట్టు.
  • "అగ్గిరాములు కొరకచ్చు లక్కు పక్షులు." ప్రభా. నాట. 5.

కొరకరాని కొయ్య

  • 1. ఏమాత్రం ఎవరిమాటా వినని మనిషి.
  • "వాడా? కొరకరానికొయ్య. ఎవ డేం చెప్పినా వినడు." వా.
  • 2. అవగాహనకు అతీత మయినది.
  • "నైషధం కొఱకరాని కొయ్య. అర్థం కావడం కష్టం." వా.

కొర కొర మను

  • చెలరేగు.
  • "అందుల కసూయ గొరకొర మంచు మిగుల." సారం. 3. 127.

కొర కొర లాడు

  • కోపముతో చిరచిరలాడు.
  • "ఆ పిల్ల పొద్దున్నుంచీ యేమో కొర కొర లాడుతూ ఉంది. ఏ మంటే యేమో అని నేనూ నోరు మూసుకొని కూర్చున్నాను." వా.

కొరగాని

  • పనికి రాని; అల్పము లైన.
  • "పాప నీ రెన నీర్బలి ప్రాచిపురువు, లాది కొరగానిజంతువు లన్ని విడిచి." హంస. 4. 186.

కొరమాలు

  • పనికి మాలు.
  • "విరసపుఁ బాపముల వినికిచే దీనులెల్లా, గొరమాలె." తాళ్ల. సం. 6. 61. కొఱకరాని కొయ్య
  • దుస్సాధ్యుడు.
  • "వాడు కొఱకరాని కొయ్య. వాడి దగ్గరికి ఎవరూ పోలేరు." వా.

కొఱక వచ్చు

  • కసురుకొను.
  • "వాడు మాట్లాడితే చాలు కొఱక వస్తాడు."
  • చూ. కఱవ వచ్చు.

కొఱకుల తెరువుల పట్టించు

  • అడవులపాలు చేయు, తఱిమి వేయు ; కొఱకు = బీడు.
  • పచ్చికబీళ్లు పట్టించు - దిక్కులు పట్టించె ననుట వంటిదే.
  • "పురములు గైకొని కొఱఁకుల, తెరువులఁ బట్టించె నన్ను దిక్పాలకులన్." ఉ. హరి. 1. 129.

కొఱకొఱ చూచు

  • కోపముతో చూచు.
  • "వా డెందుకో ఈ మధ్య నేనంటే కొఱకొఱ చూస్తున్నాడు." వా.

కొఱకొఱలాడు

  • రుసరుసలాడు. రసిక. 5. 163.

కొఱ గల

  • పనికి వచ్చునట్టి.
  • "తఱి చనుదేర నాతని కుక్షివలనఁ, గొఱ గల యొక మంచి కొడుకు జనించె." ద్వి. భాగ. 8. శ. ర.

కొఱగాడు

  • పనికి రాడు, సరిపడని వాడు.
  • "ఏలినవానిన్, గొఱగాఁ డని కైకొన కిం,దఱఁ దెచ్చితి వీర లీశుదాసులు గారే?" కుమా. 2. 25.
  • వాడుకలో: సరిపడని వా డనుటలో ఎక్కువగా ఉన్నది. రెండవది లేక పోలేదు.
  • "వానికి నన్ను చూస్తే కొఱగాదు." వా.
  • "వాడు దమ్మిడీకి కొఱగాడు." వా.

కొఱగాని

  • పనికి రాని, కూడని.
  • "పతి నే మేనియు నాడుట, సతికిం గొఱ గాదు." రుక్మాం. 4. 27.

కొఱగామి

  • చెడుగు.
  • "పార్థుఁడు తండ్రి బిడ్డలం, గలిపిన మేల కాక కొఱగామియుఁ గీడును నెద్ది పేర్కొనన్." జైమి. 1. 93.

కొఱడు కొట్ర

  • కఱ్ఱా కంపా. జం. బస. 3. 65.

కొఱడుపాఱు

  • కొయ్యబాఱు. బ్రౌన్.

కొఱడువడు

  • కొయ్యబాఱు. అప్ప. 2. 196.

కొఱత పడు

  • న్యూనత పడు, లోపించు.
  • "కొంత దివ్యులలోపలఁ గొఱఁత పడఁగఁ." నిరంకు. 4. 37.

కొఱత పల్కు

  • నీచముగా మాటలాడు, ఉదాసీనముగా మాటలాడు.
  • "పందనుం గొఱఁత పల్కఁడు శూరతఁ దాను మించియున్." ఆము. 2. 40.

కొఱత పెట్టు

  • దాచు, వదలు, మిగుల్చు.
  • "వజ్రనాభు రాజ్యావసాన సామీప్యంబు స్వామికి నేమియుం గొఱంత పెట్టక విన్నవింపుము." ప్రభా. 1. 117.

కొఱ తలచు

  • చెడు తలచు, తప్పని భావించు.
  • "నిరపరాధులమీఁద గొఱ తలంచి..." సానం. 2. 86.

కొఱతవడు

  • లోపము కలుగు; మిగులు.
  • "....గురువులు శిక్షింపఁ గొఱత వడునె." భాగ. 8. 647.
  • "తద్వృత్త మొకటి కొఱఁతపడకుండఁ బ్రత్యక్షపరిచితం బైనది గాదె." హరి. పూ. 1. 48.

కొఱత వెట్టు

  • చూ. కొఱత పెట్టు.

కొఱత వేయించు

  • ఉరి తీయించు.
  • శిక్షగా -
  • "కొఱఁత వేయింతుఁ గను దీనికొఱకు దాని." నిరంకు. 4. 37.

కొఱత వోవు

  • తక్కు వగు. శుక. 2. 166.

కొఱనవ్వు

  • చిఱునవ్వు.

కొఱనెల

  • క్రొన్నెల, బాలచంద్రుడు.
  • "కొఱనెల సుధారసంబునఁ, గఱవోవఁగ నొఱసి కడిగి..." కుమా. 3. 63.

కొఱప్రాణముతో తన్నుకొను

  • అవసానదశలో ఉండు.
  • "ఊర్వుల్, పఱవ మిడిగ్రుడ్ల వణఁకుచుఁ, గొఱప్రాణముతోడఁ దన్నుకొనునమ్మొదవున్." ఆము. 3. 23.

కొఱమాలు

  • పనికి మాలు.
  • "మనచేతఁ, గొఱమాలి చెవులు ముక్కును బోవ నాడు, జంత." వర. రా. అర. పు. 224. పం. 23.

కొఱముట్టు

  • పనిముట్టు.

కొఱలుకొను

  • ఒప్పు.

కొఱవి

  • కఠినుడు, కలహశీలుడు.
  • "వాడు ఒట్టి కొరివి. ఎక్కడికి పోయినా ఏదో తగాదా తెస్తాడు." వా.

కొఱవి చేత పట్టుకొని వచ్చు

  • మండుతూ వచ్చు.
  • "కొఱవి చేతఁ బట్టుకొని చంద్రుఁ డదె వచ్చె." కళా. 6. 269.

కొఱవితో తల గోకునట్లు

  • బాధోపశమనార్థ మై పోయి మరింత బాధ తెచ్చు కొన్నట్లు అనుట.
  • తల నవ్వ పెట్టినప్పుడు చేతితో కాక కొఱవితో గోక్కుంటే నవ్వమాట దేవు డెఱుగును ముందు తలా కాలి పోతుంది కదా!
  • "కొఱవి గొని వెఱ్ఱినే తల గోకి కొనఁగ." భార. అర. 5.
  • "ఎఱిఁగి యెఱిఁగి తన యౌఁదల, కొఱవిం గొని గోకఁ దివురు కుమతియుఁ గలఁడే." పాండు. 5. 254.
  • "ఇట్టి చలపాది నౌట న న్నెఱిఁగి యెఱిఁగి, యెట్లు గైకొనె దమయంతి నీ నలుండు, కొఱవి చేఁ బూని తల గోకుకొనఁ దలంచెఁ, గటకటా గర్వమున మీఁదు గానఁ డయ్యె." నలచ. 4. 252.

కొఱవిదయ్యము

  • బగ్గుబగ్గు మని మండుతూ చీకటిలో కనిపించే నేలమీది మంట లాంటిది.
  • అది దయ్యం కాకున్నా దయ్య మని పాతనమ్మకం.

కొఱవి వీచినభంగి

  • కొఱవి త్రిప్పినట్లు.
  • గిరగిర తిరుగుతూ మిఱుమిట్లు గొల్పుతూ అనుట.
  • "అంగుళీయకఖచితో,ర్వను సమవర రత్నోజ్వల, వినుతద్యుతు లెసఁ గెఁ గొఱవి వీచినభంగిన్." కుమా. 12. 158.

కొఱసంది

  • ఆయువుపట్టు.
  • "పఱతెంచి కరిమదము నే డ్తెఱ దొండం బెత్తి వ్రేయ దెప్పఱికమునన్, గొఱసంది దాకి నేలకు, నొఱిగిన..." నిర్వ. 10. 29.

కొఱుకుకు పోవ బడిగల్లు వడు

  • ఆశపడి పోగా అనర్థము కలుగు అని భావము.
  • మేతకు పోగా కాలికి బండ తగులుకొన్నట్లు.
  • దొంగమేత మరిగిన పశువులకు మెడకు మెడకొయ్య వేయడం, కాలికి ఒక గుదిబండను గొలుసుతో కట్టివేయడం అలవాటు. అది మరీ తిరగకుండా ఉండుటకై ఈ శిక్ష.
  • "చింత యెఱుఁగక యేఁగుదెంచితిఁ గొఱుకుడుఁ, బోవ బడిగల్లు వడియె నో పొలతి యనియె." కళా. 3. 105.

కొఱుకుడు పడని

  • అవగాహన కాని. అతిగహన మైన.
  • "అధివాస్తవికకవిత్వం అందరికీ కొఱుకుడు పడదు." వా.

కొఱుకునకు లేక

  • తిండికి లేక.
  • "కొఱుకునకు లేక మూషికకోటి చేర, కునికి మార్జాలజాల మాతని నికాయ, సీమ వీక్షింపఁగా..." శుక. 3. 242.
  • చూ. పంటి కిందికి లేదు, చాలదు.

కొఱుత నుఱుకు

  • ఎంత సాహస మైనా చేయు.
  • "కొఱుత నుఱుకుఁ గాని కొడు కెన్నఁడును గార్య, తంత్రమునకుఁ జొరఁడు." భార. స్త్రీ. 1. 17.
  • 2. క్రూరుడు, దుష్టుడు.
  • "చెలువ మగని దిక్కు చేసన్నఁ జూపి యీ, కొఱుత నుఱుకు ముక్కు గోసె ననియె." విక్ర. 7. 160.
  • "వారలు (కౌరవులు) కదా మీఁదెఱుం గక కొఱుత నుఱుకు లై చెడు తెరువునం బోయెడువారు." భార. ఉద్యో. 1. 343.
  • 3. సాహసి.
  • "చుఱుకు చూపునఁ గాలిన కొఱుత నుఱుకు." కాళ. 3. 71.

కొఱ్ఱు ఇంటికంబము సేయు

  • చిన్న దానిని పెద్ద కార్యమునకు ఉపయోగించు.
  • కంబమువలె కొఱ్ఱు ఇంటికి ఆధారము కా జాలదు కదా!
  • "విన మింతకు ము న్నెన్నఁడుఁ, గని కని కొ ఱ్ఱెవ్వఁ డింటికంబము సేసెన్." ఉ. హరి. 1. 94.

కొఱ్ఱుల బెట్టు

  • కొఱత వేయు
  • పూర్వం శిక్షలలో ఒకటి - ఒక యినుపకొఱ్ఱు నాటి కొఱత వేసేవారు.
  • "వివేకశూన్యులను గొఱ్ఱులఁ బెట్టఁగ లేదు." రుక్మాం. 2. 29.
  • రూ. కొఱ్ఱుల విడు.

కొఱ్ఱెక్కి కూర్చొను

  • అడిగిన కొలదీ దిగి రాక మరింత పైకి పోవు.
  • "ఏదో పిల్ల నిస్తాను చేసుకోరా అని బతిమాలేకొద్దీ వాడు కొఱ్ఱెక్కి కూర్చొంటున్నాడు." వా.

కొలకుండ

  • 1. కొలుచునట్టి కుండ. ధాన్యాదులను బానలతో - కాగులతో కొలవడం నేటికీ ఉన్నది.
  • 2. నేల తవ్వుతున్నప్పుడు ఇంత లోతు తవ్వినా మని తెలియడానికై కొంత భాగం నడుమ తవ్వకుండా వదిలి పెడతారు. క్రింది ప్రయోగంలో ఈ అర్థం సరిపడుతుంది. కొలకొండ్ర అనగా కొలతకై వదిలివేసిన కొండ్ర = నేల - కొలకుండ అయినది.
  • "కుతలంబు నడుకొనఁ గొలకుండ గా నిల్పి, శరనిధిఁ గ్రొచ్చిరి సగరసుతులు." కుమా. 1. 52.

కొలకొల కూయు '*కల కల మని ధ్వని చేయు. ధ్వన్యనుకరణము.

  • "కొలకొలఁ గూయుఁ బై నొఱగుఁ గుత్తుకఁ గుత్తుకఁ జుట్టుఁ బాఱు చి,ల్వల క్రియ." మను. 3. 62.

కొలకొల మని

  • బిలబిల మని. ధ్వన్యనుకరణము.
  • "కొలకొల మంచు మేఁతలకు గూఁడులు వెల్వడు పక్షిరావముల్, కలమృదు వాక్యవైఖరులుగా." పారి. 2. 70. కొలకొల మను
  • కలకలము చేయు. ధ్వన్యనుకరణము.
  • "సందడించుచు దశాక్షౌహిణీ సైన్యంబు, లనిశంబుఁ గొలకొల మనుచు నుండు." జైమి. 1. 84.

కొలకోల

  • కొలత కఱ్ఱ.
  • "ఈ వార్ధి విస్తార మింత యౌ నని నల్వ, కొల్చి తివ్వని కొలకోల యనఁగ..." సుద. 1. 102.

కొల గట్టుకొను

  • హత్యాపాతకమును కట్టు కొను.
  • "కొలగట్టుకొనె వియోగుల వేచి మరుఁడు." వర. రా. కిష్కి. పు. 395. పం. 18.

కొలగాడు

  • ధాన్యాదులు కొల్చువాడు. శ. ర.

కొలగారము

  • ధాన్యం కొలిచినందుకు ఇచ్చే కూలి. బ్రౌన్.

కొలదికి మించు

  • అపరిమిత మగు.
  • "కొలఁదికి మించు కెంజిగురు గుత్తుల మొగ్గలఁ బుష్పగుచ్ఛకం,బులఁ బువుఁ దేనెఁ బుప్పొడుల..." కళా. 1. 118.

కొలదికి మీఱు

  • అధిక మగు.
  • "తలఁపు గొలఁదికి మీఱెన్." భార. ద్రోణ. 2. 229.

కొలది గడచు

  • గడువు ముగించు.
  • "తలఁపఁగ రిపులకు నిమ్మగు, కొలఁదిఁ గడచి వచ్చితిమి." భార. విరా. 4. 93.

కొలది మిగులు

  • అపరిమిత మగు; అధికాధిక మగు.
  • "జగము లెల్ల నిమ్ము సాలక మల్లడి, గొనియె గుహుబలంబు గొలఁది మిగిలి." కుమా. 11. 12.

కొలది మీఱు

  • అపరిమిత మగు.
  • "కొలఁది మీఱు కుడుపుఁ గుడువ మియును." భార. ఆను. 5. 263.

కొలది యిడరాని

  • అపరిమిత మైన.
  • "కొలఁది యిడ రాని యొక వింత చెలువు గలిగి." పారి. 1. 78.

కొలది వెట్టు

  • 1. ఇంతా అని చెప్పు.
  • "...జలనిధులుం, బరఁగిన దీవులు వర్షము, లరయంగాఁ గొలఁది వెట్ట నలవియె ?" భాగ. 5. 211.
  • 2. క్రిందుపఱచు.
  • "పొడవుల సడి సన్న యొడళుల టెక్కియ, మ్ముల పెంపు గగనంబుఁ గొలఁది వెట్ట." భార. విరా. 3. 167.

కొలదివేరు

  • వట్టివేరు. కుమా. 5. 139.

కొలనాడు

  • స్నానము చేయు.
  • "కైసేసి కొలనాడఁ గదలుభంగి." కాశీ. 2. 86.

కొలనికి కాపుండు

  • నిష్ప్రయోజన మగుకార్యము చేయు. గువ్వలచెన్న. 13.

కొలపగ

  • కులవిరోధం.
  • "తీరని కొలపగయుంబలె, నీ రమణికి నాకు నెనయదు." వేం. పంచ. 3. 195.

కొలపగతురు

  • జాతివైరులు.
  • "కొలపగతురు గారె యాచకులు లోభులకున్." వేం. పంచ. 2. 141.

కొల పెట్టు

  • కొలుచు. వరాహ. 12. 43.

కొలముసాములు

  • కులస్థులు, ఒకే జాతివారు. అనగా చుట్టము లనుట.
  • "కొలము సాము లటంచుఁ గూడి రాకుండను, బాదాంగదమ్ములఁ బరిహరింపు." రాజగో. 2. 14.

కొల యొనర్చు

  • హత్య చేయు. కొలై - (తమి) కొలె (కన్న) హత్య అని అర్థము.
  • "నీ వేమొ కొల యొనర్చితి, వీవగ నది సోకు డగుచు నేచఁ దొడంగెన్." శుక. 1. 324.

కొలవేరు

  • వట్టివేరు. కుమా. 5. 149.

కొలసామి

  • జాతిపెద్ద. కేయూర. 3. 150.

కొలారుబండి

  • పై కప్పున్న బండి. శుక. 1. 271.
  • చూ. కొల్లారుబండి.

కొలికికి వచ్చు

  • ఒక రూపమునకు వచ్చు.
  • "కార్యంబును గొలికికి వచ్చినది." వీర. 3. 54.
  • "చిలుకల కొలికిం గనుఁగొన్న నొక్క కొలికికి వచ్చున్." విప్ర. 2. 44.
  • "వాడి మేనమామ వచ్చిన తరవాత గాని యీ వ్యవహారం ఒక కొలికికి రాదు." వా.
  • ఇట్లే : కొలికికి తెచ్చు.

కొలికిపూస

  • ప్రధాన మైనది, ముఖ్యము.
  • "ఇందులో ఈ పద్యం కొలికిపూస."
  • రూ. కొల్కిపూస.

కొలు వగు

  • కొలువు తీరు.
  • "ధవళాక్షుల్ భజియింప నిండు కొలు వై." పాండు. 1. 21.

కొలు విచ్చు

  • దర్శన మిచ్చు.
  • "కొలు విమ్ము రాజన్యకోటికి నెల్ల." వర. రా. అయో. పు. 307. పం. 20. కొలువుండు
  • కొలువు తీరు.
  • "ఆస్థానమ్మునఁ గొలువుండి." జైమి. 3. 5.

కొలువుగొను

  • 1. కొలుచు.
  • "నన్నుం గొలువు గొని మీ రిందు నిలుచుట." దశ. 11. 58.
  • 2. కొలువు తీర్చు.
  • "ప్రజ గొలువుగొనన్." సాంబో. 2. 37.

కొలువు చాలించు

  • సభ చాలించు.
  • "కొలువు చాలించి శచీకంతుఁ డంత:పురంబున కరిగె." నిరంకు. 4. 48.

కొలువు పట్టు

  • సేవించు.
  • "వలదు సీత నిచ్చి నలినాప్తకులనాథు, కొలువు వట్టి యిల్లు నిలుపుకొనుము." రామా. 7. 74.

కొలువు సింగార మగు

  • సభకు తగిన యలంకరణము చేసికొను.
  • "ఈదారి రాజగోపాలశౌరి చెలువు పొంగార కొలువు సింగార మై పదాఱు వన్నె బంగారు కొలువుకూటంబునకు వచ్చి..." హేమా. పు. 5.

కొలువు సింగారము చేసికొను

  • సభకు వెళ్లుటకు తగినట్లుగా అలంకరించుకొను.
  • ఒక్కొక్క సమయానికి తగిన వేష ధారణము సహజము. అందులో రాజాస్థానాలకు వెళ్లునప్పుడు ప్రత్యేకమయిన - నిర్దిష్ట మైనవేషం ఉంటుంది.
  • "కలభాషిణియు...వేగంబు కొలువు సింగారంబు సంఘటించుకొని కృష్ణ నగరి కరిగె." కళా. 1. 208.

కొలువు సేయు

  • సభ చేయు. పాండు. 1. 181.

కొలువు సేసికొను

  • నౌకరీ సంపాదించుకొను.
  • "కని కొలువు సేసికొని మా, లిని నాఁజని..." భార. విరా. 1. 106.

కొలు వొసగు

  • దర్శన మిచ్చు.
  • "ఒక వేళ యవన చోళ కళింగ శక వంగ, గూర్జరు ల్గొలువంగఁ గొలు వొసంగు." శుక. 1. 355.

కొల్పుడు చేతులు

  • నమస్కారములు. హంస. 4. 212.

కొల్ల కొల్ల

  • చాలినంత.
  • "...నుడువు లపుడు, చెల్ల వో యేమి చెప్పుదుఁ గొల్ల కొల్ల." రాధి. 2. 140.
  • "పది రూపాయ లయితే సంత ఖర్చుకు మనకు కొల్ల కొల్ల." వా.

కొల్ల పెట్టు

  • 1. కొల్లగొట్టు. కాశీయా. 244.