పదబంధ పారిజాతము/ఊ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉసు_____ఉసు 227 ఉసు_____ఊక

నా యుసురు తాకి, దీపములు సైత మల్లాడు దెఱవలార!" శుక. 2. 63. పే.

 • "ఆ భార్యను వాడు నానా బాధా పెట్టి హింసించాడు. ఆవిడ ఉసురు తాకి వీడు పుట్టగతులు లేకుండా పోయాడు." వా.
 • చూ. ఉసురు తగులు.

ఉసురు పెట్టుకొను

 • వేధించు, బాధించు.
 • "వాడి ఉసురు ఎందుకురా పెట్టుకొంటావు." వా.
 • చూ. ఉసురు పోసుకొను.

ఉసురు పోసుకొను

 • చూ. ఉసురు పెట్టుకొను.

ఉసురు మను

 • బాధపడు, దు:ఖించు.
 • "ఆడది యుసురు మన్న, గొఱగాదు సుమీ." సా. 2. 123.
 • "ఆడకూతురిని ఉసూరు మనిపిస్తావు దేనికి రా?" వా.
 • "వాడు ఉసూరు మంటూ ఈ ఊరు వదిలిపెట్టి పోయాడు." వా.
 • "వాడు ఉసూరు మంటూ వచ్చాడు." వా.
 • చూ. ఉస్సు రను.
 • రూ. ఉసూరు మను.

ఉసుల నిచ్చు

 • కదల నిచ్చు; ఉసి దొరక నిచ్చు.
 • "మొదల నీయరు... వసుల పాతర లై వీరు నుసుల నీయరు." సారం. 2. 127.

ఉసుఱుకొను

 • కలకలలాడు; కోలుకొను.
 • "పెసరుసుఱుకొనియె." కాశీ. 3. 23.

ఉసుళ్ల విధంబున

 • అధికముగా. వాన వచ్చినప్పుడు ఉసుళ్లు విపరీతంగా చెలరేగుటమీద వచ్చినపలుకుబడి.
 • "వెల్లి విరిసినచాడ్పున నుసుళ్ల విధంబున మిడుతలగమిలాగున..." హంస. 3. 29.
 • ఇది నేటికీ వాడుకలో నున్నది.
 • "ఉసుళ్ల పుట్ట పగిలినట్లుగా జనం వచ్చారు." వా.

ఉస్సు రని యూర్చు

 • నిట్టూర్చు.
 • "అడుగుల బుప్పొడు లంటి చుర్రడుచుచో, నుస్సురు మని వెస నూర్చి యూర్చి." కవిక. 3. 92.

ఉస్సు రను

 • నిట్టూర్పు పుచ్చు-బడలికతో
 • "అంతదూరం వచ్చి ఉస్సురు మంటూ కూలబడ్డాడు." వా.
 • చూ. ఉసురు మను.

ఉస్సురస్సురు మను

 • ఉస్సు రను, ధ్వన్యనుకరణము.
 • "అతిశయిల్ల నుస్సురస్సు రనుచు." పరమ. 3. 148.

ఊకదంపు

 • నిష్ప్రయోజనము. వట్టి ఊకను (పొట్టు) దంచినట్లనుట; తేలే దేమీ ఉండదు కదా.
 • "వాని దంతా వట్టి ఊకదంపు ఉపన్యాసం." వా.
 • చూ. ఊకదంపుపాట. ఊక___ఊకొ 228

ఊకదంపు పాట

 • వట్టి వాగాడంబర మనుట.
 • చూ. ఊకదంపు.

ఊకబంతి

 • చెండుమల్లె (బంతి) జాతిలో ఒక రకం.

ఊకర లిచ్చు

 • ఊకొట్టు.
 • "వెడ యేడ్చు నంతన యుడుగునుగ్గడంగు, నూకర లిచ్చు నాలకించు." భోజ. 1. 176.
 • చిన్న పిల్లల విషయంలోనే యిది ఉపయోగిస్తారు.

ఊకరలు గొట్టు

 • హుంకరించు.
 • "ఊకరల్ గొట్టుచు నుత్తలపడుచు." బస. 7. 868.

ఊకరలు వెట్టు

 • చూ. ఊకరలు గొట్టు.

ఊకర ల్వెట్టు

 • హుంకరించు.
 • "ఊకరల్వెట్టుచు నుఱవడింపుచును." బస. 5. 139. పు.
 • (ఎద్దు ఇక్కడ ప్రసక్తం).
 • చూ. ఊకరలు గొట్టు.

ఊకొట్టు

 • 1. అంగూకరించు; అంగీకారము తెలుపు.
 • "మొనయక యూకొట్టి ంరొక్కుచునున్న." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1325.
 • రాయలసీమలో వీటికే పిసుకుళ్లని పేరు.

ఊచముట్టుగా

 • పూర్తిగా, నిశ్శేషముగా.
 • "ఊచముట్టుగ గీము లాహుతి గొనంగ." రామా. 6. 250.
 • "ఊచముట్టుగ నిలు దోచి యుఱికి చనుట." పాండు. 3. 50.

ఊచముట్టుగొను

 • చంపు.
 • "నీ తమ్ము గుఱ్ఱల నూచముట్టుగొనియె నేవిధి." భార. శల్య. 1. 28.

ఊచినకఱ్ఱ వంపని

 • బలహీనురా లయిన. సుకుమారురా లయిన. సన్ననికఱ్ఱను కూడా వంచలేని దనుటపై వచ్చిన పలుకుబడి.
 • "ఊచినకఱ్ఱ వంపనిపయోరుహలోచన మింట మంటలం, బూచినబాణజాలమున." ఉ. హరి. 1. 163.

ఊటచెలమ

 • తఱుగనిది; చెలమలో నీరు వినియోగ మయ్యేకొద్దీ తిరిగీ ఊఱుతూనే ఉంటుంది. తాళ్ల. సం. 11. 122.

ఊటాడించు

 • గట్టిగా కదలించు.
 • "మదాళిమాలికల నూటాడించు వేణీ రుచుల్." విజ. 2. 16.

ఊడదన్ను

 • పోగొట్టు, పోవునట్లు తన్ను. ఊచ____ఊచ 229 ఊచ____ఊడ

ఊచక యాచక

 • సంకోచింపక. జం.
 • "తొయ్యలి యూచక యాచక, పయ్యెద గొబ్బున బటాన బయలుగ జేసెన్." సారం. 3. 16.
 • చూ. ఊచకాచక.

ఊచకాచక

 • సంకోచింపక.
 • ">>>ఊచకాచక మదిలో." రాధి. 2. 57.
 • చూ. ఊచక యాచక.

ఊచకోత

 • మొదలంట కోయుకోత. త్రివేణి. పు. 20.

ఊచపడు

 • కృశించు.
 • "సరసిజగంధి పెందొడల సాటికి రా నెదురించి పోరునీ, కరభము లెల్లం జేపడగ గన్గొని యుండియు దజ్జయార్థమై, పొరల బెనంగి యూచపడి పోవుట లింతియ కాక ధాత్రిపై, నరటులు పిల్లపిల్లతర మైనను సామ్యము పొంద నేర్చునే? భాను. 2. 13.
 • రూ. ఊచవడు.

ఊచపోవు

 • సన్న వడు భల్లాణ. 4.
 • "ఆ పిల్లవాడికి పాపం! చిన్నతనంలోనే కాళ్లు ఊచపోయినవి." వా.
 • చూ. ఊచపడు.

ఊచబియ్యము

 • పాలకంకులను కోసి చేతితో నులిమి రాల్చినగింజలు. రాయలసీమలో వీటికే పిసుకుళ్లని పేరు.

ఊచముట్టుగా

 • పూర్తిగా, నిశ్శేషముగా.
 • "ఊచముట్టుగ గీము లాహుతి గొనంగ." రామా. 6. 250.
 • "ఊచముట్టుగ నిలు దోచి యుఱికి చనుట." పాండు. 3. 50

ఊచముట్టుగొను

 • చంపు.
 • "నీ తమ్ము గుఱ్ఱల నూచముట్టుగొనియె నేవిధి." భార. శల్య. 1. 28.

ఊచినకఱ్ఱ వంపని

 • బలహీనురా లయిన, సుకుమారురా లయిన. సన్ననికఱ్ఱను కూడా వంచలేని దనుటపై వచ్చిన పలుకుబడి.
 • "ఊచినకఱ్ఱ వంపనిపయోరుహలోచన మింట మంటలం, బూచినబాణజాలమున." ఉ. హరి. 1. 163.

ఊటచెలమ

 • తఱుగనిది; చెలమలో నీరు వినియోగ మయ్యేకొద్దీ తిరిగీ ఊఱుతూనే ఉంటుంది. తాళ్ల. సం. 11. 122.

ఊటాడించు

 • గట్టిగా కదలించు.
 • "మదాళిమాలికల నూటాడించు వేణీ రుచుల్." విజ. 2. 16.

ఊడదన్ను

 • పోగొట్టు, పోవునట్లు తన్ను, ఊడ_____ఊడి 230 ఊడు____ఊత
 • "పాఱు తెంచిన యొడ్డీని పెనులావు లూడదన్ని." జైమి. 1. 45.
 • "ముందుపండ్లు నాలుగూ ఊడదన్ని పంపిస్తే పోతుంది." వా.
 • చూ. పండ్లూడదన్ను.

ఊడనిబాడు

 • ఊరు వదలిపోవు, పాఱిపోవు.
 • "ఒకనాటిరాత్రి పడుపడు,కకు జెప్పక యిల్లు వెడలి గాఢతరతమో, నికరము తన తగుతోడుగ, నొకరుడు పేరడనవి త్రోవ నూడనిబాడెన్." పాండు. 3. 49.
 • "అక్కాంతామణి నెచ్చెలు, లొక్కొక పని పేరు చెప్పి యూడనిబాడన్." కవిజన. 3. 98.
 • "అయ్యురగము లెల్ల నల్దెసల నూడని బాడిన." ఉత్త. హరి. 6. 239.

ఊడబొడుచు

 • ఉద్ధరించు వంటిది. వాడు చేసింది మహా యేమిటి అన్న అర్థంలో ఉపయోగిస్తారు.
 • "వాడు ఊడబొడిచింది ఏముంది యిందులో?" వా.

ఊడిన నాగ లైన

 • మూలబడిన, సరి యైనస్థితిలో లేని.
 • "ఊడిననాగ లైనపతి కున్నవి లేనివి నచ్చబల్కి." రుద్రమ. 19 పు.

ఊడిపడు

 • హఠాత్తుగా వచ్చు./
 • "వాడు ఎక్కడనుండో ఆవేళకు సరిగ్ఘా ఊడిపడ్డాడు." వా.

ఊడుకొన జేయు

 • పాఱునట్లు చేయు.
 • "ఊడుకొన జేసి వే ఱొక్క దిక్కు తెరువుగా." భాస్క. అర. 2. 126.

ఊడుగవిత్తనంవంటి

 • ఎప్పుడూ వదలని. ఊడుగువిత్తనా లన్నీ తిరిగీ ఉరుమురిమితే ఊడుగుచెట్టు మొదలును కరుచుకొంటాయి అని ఒక ప్రథ. దానినిబట్టి వచ్చిన పలుకుబడి.

ఊడ్చి పెట్టు

 • ఉన్న దంతా దోచిపెట్టు.
 • "ఆవిడ పుట్టింటికే ఉన్నదంతా ఊడ్చి పెట్టింది. ఇంక తన కొడుకుల కేం మిగులుతుంది?" వా.

ఊడ్చి పెట్టుకొని పోవు

 • సర్వం పోవు.
 • "ఉన్న దంతా ఊడ్చిపెట్టుకొని పోయే సరికి వాళ్లు ఆ ఊరు వదిలి వేరే ఊరు పోవలసి వచ్చింది." వా.

ఊతకోల

 • ఆధారము; తోడు; చేయూను కఱ్ఱ.
 • "అందునకు నూతకోలగా నకట యొకని, నైన నిలుపక..." భార. స్త్రీ. 1. 170.

ఊతగొను

 • ఆధారముగా చేసికొను.
 • "ఒండొరుల కేలు దమ్ముల నూత గొనుచు." పారి. 4. 27. ఊత____ఊద 231 ఊద____ఊదు

ఊతనీరు

 • అశాశ్వతము; భంగురము. ఎత్తిపోయునీరు కొంచమే ఉంటుంది. త్వరగా ఎండిపోతుంది అనుటపై ఏర్పడినది. అశాశ్వతము అని భావార్థం నిలిచినది.
 • "ఊతనీరు, చెలదిసేత, మూటాయిటి దూది, యెండపసుపు, దొఱ్ఱి యక్కరంబు మేను." ఆము. 6. 62.

ఊత యొసగు

 • ఊత యిచ్చు.
 • "రామునిడించి కరం బూత యొసగి." వర. రా. అయో. పు. 256. పం. 1.

ఊదజెప్పు

 • నొక్కి చెప్పు.
 • "సంస్కృతశబ్ద మూద జెప్పిన నవి దర్భముం డ్లనుచు బెట్టరు వీనుల." సంహా. 1.32.

ఊదబడి పోవు

 • తఱుమబడి పాఱిపోవు. ఊదుకొనిపోవు (తఱుముకొనిపోవు) అన్న రూపంలో నేడీ పలుకుబడి పశ్చమాంధ్రంలో వినవస్తుంది.
 • "తలతో నూదబడి పోయె ధనదుడు కృతి యై." కవిక. 2. 122.

ఊదబొడ్డు

 • పైకి ఉబికి ఉన్న బొడ్డు

ఊదరగొట్టు

 • ఏదో ఒకటి చెయ్య మని పోరు. ఊపి రాడనీయకుండా.
 • "అక్కడికి వెళ్లేసరికి వాడు అదేపనిగా తనగొడ వంతా చెప్పుకొని ఊదరకొట్టి వదిలి పెట్టాడు." వా.

ఊదర పెట్టు

 • పందికొక్కులూ మొదలయిన వాని కలుగులలో పొగపెట్టు. అలా పొగ పెడితే అవి ఊపిరి తిప్పుకో లేక బయటికి వస్తాయి. అప్పుడు వాటిని చంపుతారు లక్షణయా ఊపిరి తిప్పుకోనీయకుండా వేధించు.
 • "వాడు పొద్దున్నించీ ఒకటే ఊదరపెడుతున్నాడు ఊరికి పోదామని." వా.
 • చూ. ఊదరకొట్టు.

ఊదర లిడు

 • "ఉరుధూమతతుల బిట్టూదర లిడిన, పరుసున దొఱటల బాములు నుడియ." గౌర. హరిశ్చ. పూ. 2238.
 • చూ. ఊదరపెట్టు.

ఊది పిఱింది త్రాడగు

 • వెంట నుండు. వెనుకకు కట్టుకొని యుండు త్రాడు వెంట వచ్చినట్లు.
 • "ఏదెస దొలంగినను నూది పిఱింది త్రాడై యాదిగొని." ఉ. హరి. 4. 29.

ఊదుకడ్డీ

 • సాంబ్రాణివత్తి.
 • "సాయంకాలం రెండు ఊదుకడ్డీలు ముట్టిస్తే మంచిది." వా.
 • చూ. ఊదువత్తి. ఊదు____ఊదు 232 ఊపా___ఊపి

ఊదుకు పోవు

 • తఱుముకొని పోవు. ఊదుక పోవు. క్రిందిప్రయోగంలోని శ్లేషలో రెం డర్థాలూ ఉన్నవి.
 • "ఊదుకు పోవు శంఖము నహో! గళరేఖ." విజయ. 1. 134.
 • "కుందేళ్లను నక్కలు ఊదుకొని పోయినవి." వా.

ఊదుకొను

 • నాటు.
 • "ఊదుకొనబడు మధూళిక-" ఆము. 5. 137. హరి. ఉత్త. 9. 231.

ఊదుగ్రోవులు

 • బాలక్రీడావిశేషము.

ఊదువత్తి

 • సాంబ్రాణికడ్డీ.
 • చూ. ఊదుకడ్డీ.

ఊదువెండి

 • పరిశుద్ధ మైనవెండి. వెండిలో ఏదయినా కల్తీ ఉన్నప్పుడు దానితో పాటు సీసం కూడా వేసి, మూసలో వేసి. కుంపట్లో పెట్టి ఒక తిత్తితో ఊదుతారు. కడపటికి మేలిమి వెండి తేలుతుంది. బంగారం పుటం పెట్టి నా రన్నట్లే వెండిని ఊదడం అనే అంటారు.
 • "తగ్గువెండి చాలా ఉంది. ఊదించాలి." వా.
 • "దీని కేం ఊదువెండి. చొక్కం." వా.

ఊపాడు

 • ఊగాడు.
 • "చూపు దేటుల పిల్ల లూపాడ జొచ్చె." రాజ. చ.

ఊపరలాడు

 • వట్టి దంభోక్తు లాడువాడు. ఉత్త. హరి. 5. 178.

ఊపిరాడడం లేదు

 • పని యెక్కు వైన దనుట.
 • "పొద్దుటినుంచీ ఒకటే పని. ఊపిరాడ్డం లేదు." వా.
 • చూ. ఊపిరి సలపడం లేదు.

ఊపిరికుట్టు

 • ఊపిరి పీల్చుటకు వీలు లేనట్లు కడుపుకుట్టు పట్టుకొను.
 • "అ,బ్బల్లిదు ప్రక్క నొంచిన నపాయపు టూపిరికుట్టు వట్టి మూ,ర్ఛిల్లి." కకు. 2. 146.
 • "పాపం అతనికి ఊపిరి కుట్టుపట్టి విలవిలలాడి పోతున్నాడు." వా.

ఊపిరి ఆడకుండు

 • పని తెమలకుండు; నిర్విరామంగా, ఎడతెఱపి లేకుండా ఉండు.
 • "నీరు వోయువారు నారు నాటెడువారు, ఊపి రాడకుండ నొరిసికొనిరి." క్షేత్రలక్ష్మి. 42. పు.
 • "పొద్దున్నుంచీ వచ్చే చుట్టాలూ పొయ్యే చుట్టాలూ, ఊపి రాడ్డం లేదు." వా.
 • చూ. ఊపిరి సలపకుండు. ఊపి____ఊర 233 ఊర____ఊర

ఊపిరి తిప్పుకొన లేక పోవు

 • ఉక్కిరి బిక్కిరి అగు.
 • "ఈ పనితో ఊపిరి తిప్పుకొన లేక పోతున్నాను." వా.
 • చూ. ఊపిరి ఆడకుండు.

ఊపిరి బిగబట్టు

 • కాస్త ఓపిక పట్టు.
 • "ఈ ఒక్కరోజూ కాస్త ఊపిరి బిగపట్టి ఉండు వదినా! రేపు మేము వెళ్లిపోతాం. అప్పుడు నీయిష్టం వచ్చినట్టు నీపిల్లలను కొట్టుకొందువుగానిలే." వా.

ఊపిరి మోచు

 • బ్రతుకు.
 • "ఊపిరి మోచిననాడే బట్టికొంటివాస లెల్ల." తాళ్ల. సం. 8. 83

ఊపిరి సలపడం లేదు

 • పని యెక్కు వైన దనుట.
 • చూ. ఊపిరాడడం లేదు.

ఊరక పడి యుండు

 • మరొక ఆలోచన లేకుండా ఉండిపోవు.
 • "ఎవ్వారి దాన నిచట నూరక పడియుండ." కళా. 4. 110.
 • "ఏదో ఇంత తిని ఊరికే పడి ఉండరా?" వా.
 • "నా కెందుకు? వాళ్లేమైనా చేసుకొనీ. నేను ఎక్కడో ఒకచోట ఊరికే పడి ఉంటాను." వా.

ఊరక పోదు

 • వ్యర్థము కాదు.
 • "నాకును బ్రియం బగు టొక్కటి యెక్కు డాప్రియం, బూరక పోదు..." కళా. 5. 195.
 • "నా వంటివానికి చెరుపు చేస్తే ఊరికే పోదు." వా.

ఊరగుంత

 • రొచ్చుగుంట వంటిది. తాళ్ల. సం. 12. 151.

ఊరంత బలగము

 • ఎక్కువ బలగము.
 • "ఊరంతబలగంబు." విజయ. 3. 133.
 • "వారి కేమమ్మా, ఊరంత బలగ ముంది. ఏ పని పట్టుకున్నా గబగబా ముగించగలరు." వా.

ఊరంతా ఉడుకు

 • గగ్గో లగు.
 • "ఓషధిప్రస్థ ముల్లల నుడుకుచుండ." హర. 5. 10.
 • "పక్క ఊళ్లో దొంగలు పడ్డారని తెలిసి ఈ ఊరంతా ఉడికిపోతూ ఉంది." వా.
 • "వా డాపిల్లను లేవదీసుకు పోయా డని ఊరంతా ఉడికి పోతూ ఉంది." వా.

ఊరంతా గుప్పు మను

 • పొక్కు; ఊరందరికీ తెలియు. కొత్త. 434.

ఊరకుక్క

 • పనికి మాలినది.
 • "నూరు ఊరకుక్క లైనా ఒక వేట కుక్కతో సరి పోవు." వా.

ఊరజోగి

 • ఊరూరు తిరిగి భిక్ష మెత్తుకొనువాడు.
 • "ఊరగకంకణుతోడ నూరజోగులను, సరి చేసి యెన్నినచందాన నీవు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 175-176. ఊర____ఊర 234 ఊర____ఊరిం

ఊరడించు

 • ఓదార్చు.
 • "వట్టి ఊరడింపుమాటలతో ఏంలాభం? ఏదో సాయపడాలి గానీ." వా.

ఊరదైవములు

 • చిల్లర దేవతలు.
 • "ఈతడే శిక్షింప రక్షింప ఊరదైవములు నొగి నితని సరా." తాళ్ల. సం. 9. 240.
 • చూ. ఊరబసువులు (వివరణము).

ఊరపంది

 • ఒక తిట్టు; సోమరి; పనికి మాలినవాడు.
 • "ఊరపందిలా బలిసిపోయాడు." వా.
 • "వాడు వట్టి ఊరపంది." వా.

ఊరపిచ్చుక

 • ఇండ్లలో తిరుగు పిచ్చుక.
 • "వైనతేయఖగంబుతో నూరపిచ్చుక, రాజరత్నంబుతో గాజుపూస." చెన్న.

ఊర ప్రొద్దు గ్రుంక లేదు

 • ఊరు మాటు మణగ లేదు. రాత్రి చాలా పొద్దు పోవలేదు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
 • "నిండినింటిలోన నీ కేల భీతిల్ల, గోల యూర బ్రొద్దు గ్రుంక లేదు." హంస 4. 237.

ఊరబండు

 • తేనెలో ఊరవేసినపండు.

ఊరబసువులు

 • ఊరిలోని పశువులు. ఊరకుక్క, ఊరపందివంటిది. ఇలాంటివాటిలో 'ఊర' వచ్చినప్పు డల్లా కాస్త నీచ మన్న భావము కానవస్తుంది.
 • "కావించిన యలనామధేనువుల కేవి యూరబసు లీ డౌనా." తాళ్ల. సం. 9. 61.
 • చూ. ఊరదైవములు.

ఊరబ్బ నారబ్బ చేయు

 • ఊరూ నాడూ ఏకం చేయు, అల్లరి పెట్టు.
 • "మొగు డొక్కమా టంటే చాలు. అది ఊరబ్బ నారబ్బ చేస్తుంది." వా.
 • ఇది రాయలసీమలో బాగా వినబడే మాట.
 • చూ. ఊరూ నాడూ ఏకము చేయు.

ఊరళ్లు గొను

 • వ్రేలిగణుపులు వాచు. ఊరగా (వానలో తడిసి) ఉబ్బగా, వాయగా.
 • "క్రిందటను వఱదవారగ మీద వానయు గురియ....వ్రేళ్ల సంధులును నూరళ్లు గొనంగ." పండితా. ప్రథ. దీక్షా. పుట. 147.

ఊరార్చు

 • ఓదార్చు.
 • చూ. ఊరడించు.

ఊరించు

 • 1. ఆశ కల్పించు. నోట నీరూరించుటకై వచ్చినపలుకుబడి. ఊరి_____ఊరి 235 ఊరి____ఊరు
 • "మాటిమాటికి వేలు మడిచి యూరించుచు, నూరుగాయల దినుచుండు నొక్కడు."భాగ. దశ. పూ. 496.
 • 2. ఆకర్షించు. నా. మా. 73.
 • "ఆఅబ్బాయి నలా ఊరించడం తప్పితే అది దగ్గర చేరనిచ్చినపాపాన పోలేదు." వా.

ఊరికి ఊరు

 • ఊరంతా.
 • "ఇటీవల వరద వచ్చి ఊరికి ఊరు కొట్టుకు పోయింది." వా.
 • ఇలాగే 'ఊరు' బదులు గ్రామం ఇత్యాదులతో కూడ ఈ పలుకుబడిని ఉపయోగిస్తారు.
 • "గ్రామానికి గ్రామం దేశానికి దేశం అల్లాడి పోతుంది." వా.

ఊరికి పోవు

 • చూ. ఊరు పోవు.

ఊరిదారి పట్టు

 • వెనుదిరుగు.
 • "తత్తరమ్మున నూరిదారి పట్టె." శేవ. 2. 65.

ఊరిమీద పడు

 • పని లేక ఊరంతా తిరుగు.
  ఇంట్లో దండించేదిక్కు లేక వాడు ఊరిమీద పడ్డాడు." వా.

ఊరిలో ఇల్లు లేదు అడివిలో చేను లేదు

 • ఏమీ లే దనుట.
 • "వాడికి పిల్ల నిస్తా నంటా వేమిరా? బుద్ధి ఉందా లేదా? వానికి చూడబోతే ఊళ్లో ఇల్లూ లేదు, అడివిలో చేనూ లేదు. వాణ్ణి కట్టుకొని మన పిల్ల ఏం సుఖపడుతుంది?" వా.

ఊరివారల తలనొప్పి

 • ఊరివారికి బాధ కలుగజేయునట్టి.
 • "వాడకు బగ యూరివారల తల నొప్పి." శుక. 3. 20.

ఊరు కాచి తిరుగువారు

 • గ్రామరక్షకులు, తలవరులు.
 • "కత్తివాతులతో నూరుగాచి తిరిగి, యాడుమురుపా ళెముల గాంచె." ఉ. హరి. 1. 140.

ఊరుగాయ

 • నిలవ ఉంచుకొనుటకై ఉప్పు, నూనె మొదలయినవాటితో పెట్టిన మామిడికాయ, నిమ్మకాయ మొదలగు ఊరగాయ.

ఊరు చక్కబెట్టు

 • స్వేచ్ఛగా ఊరంతా తిరుగు. వ్యభిచరించు అని సూచన.
 • "మొగుడు ఊరు వెళ్లేసరికి ఆవిడ ఊరు చక్క బెట్టి వస్తుంది." వా.

ఊరుపిండి

 • పచ్చడి. రాయలసీమలో పచ్చడిని ఊరుపిండి అనే అంటారు.
 • రూ. ఊరుబిండి.

ఊరు పేరు తెలియు

 • వివరము తెలియు.
 • "వేగమే, యూరును బేరునుం దెలిసి యొద్దిక సేయుద మెల్లకార్యముల్." ఉషా. 1. 49. ఊరు_____ఊరు 236 ఊరు____ఊరూ
 • "ఊరు పేరూ తెలిశాక గానీ ఎవరితోనూ స్నేహం చేయ రాదు." వా.

ఊరు పేరు లేని

 • అనామక మైన.
 • "ఊరు పేరు లేనివా ళ్లెంతమంది వస్తే నేం?" వా.

ఊరుపోక

 • ఉబుసుపోక.
 • "ఒడ లుమ్మలించిన నొకపూట వెలుపట నుండుమీ చనుదెంచి యూరుపోక." భోజ. 5. 210.

ఊరుపోవు

 • మఱొకయూరికి పోవు.
 • "ఆ అబ్బాయి ఊరు పోయాట్ట. పది రోజులకు గానీ రాడు." వా.

ఊరు మెచ్చు పెండిలి

 • ఊరివా రందఱు మెచ్చదగు వివాహము.
 • "చిక్కొట్టు వలదు చెలులకు, బెక్కేటికి నూరు మెచ్చు పెండిలి గలిగెన్." ఉ. హరి. 5. 152.

ఊరుమేలు తోడుమేలు

 • స్వగ్రామము. సహచరుడు - వీరివల్ల కలిగేమేలు. సదానంద. శత. 61.

ఊరు లేక పొలిమేర గల్గునా?

 • అసలు లేనిది వడ్డీ ఎక్కడిది వంటిది. ఊరే లేనప్పుడు ఆ ఊరి పొలిమేర ఎలా ఉంటుంది?
 • "తలంప నెచ్చట నైన దా నూరు లేక, పొలిమేర గల్గునే?" పండితా. ప్రథ. వాద. పుట. 636.
 • చూ. పురం లేనిది అంత:పురమా?

ఊరు లేనిపొలిమేర

 • ఉండ దనుట. తాళ్ల. సం. 12. 55.

ఊరువాడు చెలమ

 • సులభగమ్యము. తాళ్ల. సం. 3. 460
 • ఊరందరూ నీళ్లు తెచ్చుకొనే చెలమ అందరికీ అందుబాటులో ఉంటుంది.

ఊరు వెళ్లు

 • చూ. ఊరు పోవు.

ఊరూ నాడూ ఉడికిపోవు

 • ఏదో సంగతితో ఊరంతా గగ్గో లగు.
 • "కన్నతండ్రి మరణకారకు డని సైత, మూరు నాడు నేటి కుడికిపోవు." నాయకు. 90. పు.

ఊరూ నాడూ ఏక మగు

 • అల్లకల్లోల మగు.
 • "ఆ ఊళ్లో మొన్న జరిగిన కొట్లాటలో ఊరూ నాడూ ఏక మయింది." వా.
 • చూ.ఊరూ వాడా ఏక మగు.

ఊరూ నాడూ ఏకము చేయు

 • విపరీత మయిన ఆర్భాటము చేయు.
 • "తోడికోడలు ఏమో అనిం దని ఆ పిల్ల ఊరూ నాడూ ఏకం చేసింది." వా.
 • చూ. ఊరబ్బ నారబ్బ చేయు. ఊరూ____ఊర్గా 237 ఊర్జి____ఊఱ

ఊరూ పేరూ లేనివాడు

 • అనామకుడు.
 • "ఆ ఊరు పేరూ లేనివాడికి పిల్లను ఎవరిస్తారు?" వా.
 • రూ. ఊరూ పేరు లేని....

ఊరూ వాదా ఏక మగు

 • చూ. ఊరూ నాడూ ఏక మగు.

ఊరేగించు

 • మెరవణి చేయు. వ్యంగ్యార్థంలోనే ఈ పదం ఎక్కువగా ఉపయోగిస్తారు.
 • "ఆ వీ ళ్ళేమో ఉల్లిగడ్డలు కట్టి ఊరేగిస్తా రట ఆ ఊరు పోతే." వా.

ఊరేగు

 • తన గొప్పను ప్రదర్శించుకొను. వ్యంగ్యంగా, నిరసనగా 'పోవు' అనే అర్థంలో కూడా ఉపయోగిస్తారు.
 • "వాడు తా నేదో గొప్ప కవి నని ఊరేగుతున్నాడు." వా.
 • "వా డెక్కడికి ఊరేగాడో? మన కెక్కడ కనిపిస్తాడు?" వా.

ఊరేటిచెలమ

 • వట్టిపోనిది. చెలమ ఎన్నడూ శూన్య మై పోదు.
 • "తీరనిమోహాల తెందేపలు ఊరేటిచెలమలు ఉడివోనిపంటలు." తాళ్ల. సం. 11. 11.

ఊర్గాయ

 • ఊరుగాయ.
 • "ఊర్గాయలున్ వనపర్ణ భోజనములం దొప్పార." బహు. 4. 49.
 • చూ. ఉరుగాయ.

ఊర్జితము చేయు

 • లాభము కలిగించు.
 • "వాడు సంసారానికి చాలా ఊర్జితం చేస్తున్నాడు." వా.
 • "వీ డేదో మహా ఊర్జితం చేస్తున్నట్లు మాట్లాడుతున్నాడే?" వా.

ఊర్ధ్వపుండ్రాలు

 • పట్టెనామాలు

ఊర్బిండి

 • ఊరుబిండి

ఊర్బిండివడెము

 • వడియము.
 • "గుడి మ్రింగువానికి లింగ మూర్బిండి వడెము." సిం. నార. 36.
 • చూ. ఉట్రవడియము.

ఊఱట బుచ్చు

 • ఊఱడించు.
 • "లో నుంచకు భీతి యంచు వినయోన్నతి నూఱట బుచ్చి యంతటన్." హంస. 3. 121.

ఊఱడ బల్కు

 • ఓదార్చు.
 • "ఈ పగిదిన్ మురారి హృదయేశ్వరి నూఱడ బల్కి." పారి. 4. 13.

ఊఱడ బ్రోచు

 • ఊఱట కలిగించు.
 • "ఓ యదువీర! వృష్టి బసి నూఱడ బ్రోవవె సప్తరాత్రముల్." ఆము. 4. 29.

ఊఱడించు

 • ఓదార్చు. ఊఱ____ఊళ్లూ 238 ఊళ్లో____ఊసు

ఊఱడిలు

 • చూ. ఊఱడిల్లు.

ఊఱడిల్లు

 • ఓదార్పు చెందు.
 • చూ. ఊఱడిలు.

ఊలమాలగుడుచు

 • కలతపడు, క్షోభ చెందు.
 • "చిడిముడి బొందుచు సిగ మిట్టి మిట్టి, పడగ బల్కులు తొట్రుపడ నూల మాల, గుడుచుచు..." నవ. 3 భా.

ఊలవడు.

 • శబ్దించు, భోరు మను.
 • "ఊలవడి చూచి కామాక్షి నుత్తరించె...అకాలవృష్టి." హర. 2. 22.

ఊలుకొను

 • నిలుచు.

ఊలుకొలుపు

 • నిలుచునట్లు చేయు.

ఊల్కొను

 • చూ. ఊలుకొను.

ఊల్కొల్పు

 • చూ. ఊలుకొలుపు.

ఊళ్లు దోచి గుళ్లు కట్టు

 • ఒక మంచిపనికై యెక్కువ చెడుపనులు చేసేపట్ల ఉపయోగించే పలుకుబడి. మదన. శత. 40.

ఊళ్లూళ్లవారు

 • గ్రామ గ్రామంవారు, ఊరూరి వారు.
 • "తమ యూళ్లూళ్లవారి నెల్ల రావించి." పండితా. ప్రథ. పురా. పుట. 416.

ఊళ్లోవాళ్ల సొత్తు

 • ఇతరుల సొత్తు.
 • "ఊళ్ళోవాళ్ళ సొత్తుకు అందరు అధికారులే అంటారు!" వా.

ఊవాడు

 • ఊగాడు.
 • "ఆలరుం బోడుల లోపల, నలరుం బోడుములు నీకు నగ్గల మవుచుం, దలపూ వాడక యుండుము, తలపూవు ధరించి వికచతామరసాక్షి!" పారి. 1. అ.

ఊసకాళ్లు

 • ఊచపోయిన కాళ్లు.

ఊసరిల్లు

 • చిక్కు, కృశించు.

ఊసివాసము

 • ఈర్ష్య. శ. చ.

ఊసు (నీ) కెందుకు ?

 • నా (నీ) విషయంలో కల్పించుకోవద్దు అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
 • "నా ఊసు నీ కెందుకు? నీ సంగతి నీవు చూచుకో." వా.
 • "నీ ఊసు నా కెందుకు. నా సంగతి నేను చూచుకుంటాను." వా.

ఊసుపోక

 • ఉబుసుపోక.

ఊసుపోవు

 • కాలక్షేప మగు. ఊసు____ఋణ 239 ఋణ____ఎం

ఊసులాడు

 • కబుర్లు చెప్పుకొను.
 • "నెలతల్ ముచ్చట కూసులాడెదరు." క్షేత్రలక్ష్మి. 74.

ఊహాగానము చేయు

 • ఏదో ఒక విషయముపై ఊరికే ఊహించు.

ఊహాపోహలు కల...

 • ఊహాపోహలు కలవా డంటే వివేకి, బుద్ధిమంతుడు.

ఋణము తీర్చుకొను

 • ఎవ రైనా మేలు చేసినప్పుడు ఉపకారమునకు ప్రత్యుపకార మొనరించు. ఇది రకరకాలుగా ఉపయోగ పడుతుంది. 'నీ ఋణం తీర్చుకోలేను' 'నీకు నేను ఋణపడినాను' 'నీ కేదో చేసి యీ ఋణం తీర్చుకోవాలి' ఇత్యాదులు.
 • "నీ ఋణము దీర్ప గలవాడనే యటంచు." హంస. 1. 255.

ఋణము తీరు

 • సంబంధము తెగిపోవు.
 • "...నీకు నాకును ఋణము దీరె." శ్రవ. 5.83.

ఋణము పణము

 • అప్పూ సప్పూ. జం.
 • "పాలు గాఱెడు నీదుకపోలఫలక, మందు గనుగొన నిమ్ము నాయకము నేడు, మొద్దు లద్దాలు గిద్దాలు మోటు గావె, ఋణమొ పణమో విచారింత మెప్పు డేని." కవిమాయ. అం. 2. పు. 28.

ఋణము వడ్డితో నీగు

 • చేసినపనికి పూర్తిగా ప్రతీకారము చేయు; వడ్డీతోపాటు అప్పు తీర్చు.
 • "ఆ సభలో గొన్నఋణ మంతయు నీగగ గంటి వడ్డితో." భార. కర్ణ. 3. 195.

ఋణానుబంధము తెగు

 • ఋణము తీరు. 'ఋణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయా:' అన్న దానిపై వచ్చినది.
 • "తప్ప రాదు ఋణాను బంధంబు దెగిన, బ్రాణపద మైనవలపును బాసి చనదె." మను. 3. 140.
 • "వానికీ నాకూ ఆనాటితో ఋణాను బంధం తెగిపోయింది." వా.

ఋతుకాలము

 • రజోదర్శన మయిన పది దినాలవరకూ ఋతుకాల మని కళాశాస్త్రం.

ఋతుమతి యగు

 • రజస్స్వల యగు.

ఎం. ఆర్. ఆర్. వై.

 • మహారాజరాజశ్రీ. ఈమాటకు ఇంగ్లీషు పొడి అక్షరాలు. మొన్న మొన్నటి