Jump to content

పదబంధ పారిజాతము/అడ్డు

వికీసోర్స్ నుండి

అడ్డ_____అడ్డ 49 ఆద్ద_____అడ్డ

అడ్డగాడిద

  • తిట్టు, పనీపాటా లేకుండా తిరిగేవాడు.
  • అల్లరిచిల్లరిగా తిరిగేవాడు.
  • మాటా. 9.
  • "వాడు అడ్డగాడిదలా ఊరంతా ఎప్పుడూ తిరుగుతుంటాడు." వా.

అడ్డగాలు వేయు

  • అడ్డగించు.
  • "పోకు మని యడ్డగాల్ వేయంగన్." సారం. 2. 16.

అడ్డగోడ

  • కొంచెం ఎత్తుగా హద్దు నేర్పరుస్తూ పెట్టుగోడ.
  • "వాళ్లింటికీ వీళ్లింటికీ మధ్య అడ్డగోడ ఒక్కటే వ్యవధానం. వా ళ్లెప్పుడూ అన్న దమ్ముల్లాగా ఉంటారు." వా.

అడ్డగోడమీద దీపం పెట్టినట్లు

  • అటూ యిటూ కూడా ఉన్నట్లుండు. ఎటోఒక వైపు మొగ్గక అనుట.

అడ్డగోడమీది పిల్లి

  • చూ. గోడమీది పిల్లి.

అడ్డగోలుగ

  • ఎటు పడితే అటు.
  • రుద్రమ. 84. పు.

అడ్డగోలు వ్యవహారం

  • గందరగోళపు వ్యవహారము.

అడ్డపట్టుపాప

  • అడ్డపాప.
  • "అడ్డపట్టెడు పాప డంటవె యోయమ్మ." సారం. 2. ఆ.
  • చూ. అడ్డపాప.

అడ్డపట్టుల పాప

  • చిన్ని పాప.
  • అడ్డాలలోని పాప. తె. జా.

అడ్డపచ్చ

  • ముదురుపచ్చ.
  • "సుకుమార శుకచ్ఛదచ్ఛటా దాయా దంబు లై యడ్డపచ్చ గొనునవియును."
  • కాశీ. 7. 26.

అడ్డపడు

  • 1. కాళ్ళమీద పడు. 2. అడ్డు వచ్చు.
  • "నెగులున నడ్డపడి యేడ్చి." సారం. 3. 199.
  • "తప్పుదు బ్రహ్మశతం బడ్డపడిన." గౌర. హరిశ్చం. పం. 1078.
  • "అడ్డపడి చెప్పుకుంటే వినక పోతాడా." వా.

అడ్డపాప

  • పసిబిడ్డ.
  • చిన్న తనంలో పసిపిల్లలను చేతులపై అడ్డముగా పెట్టుకొని పోవుటపై వచ్చిన పలుకుబడి. అడ్డాలలో బిడ్డ డనుట.

"...నోరిలోపలన్ వ్రేలిడినప్పుడన్
గఱవనేరడు నీసుతు డడ్డపాప యౌ." సారం. 3. 58.

  • చూ. అడ్డపట్టుపాప.

అడ్డపెట్టు

  • అడ్డగించు.
  • "ధర్మపరిపాలుర మమ్ము నడ్డపెట్ట..." భాగ. షష్ఠ. 81. ప. అడ్డ____అడ్డ 50 అడ్డ____అడ్డ

అడ్డపెట్టు లేక

  • ఆటంకము లేకుండ.
  • "బొడ్డనబావుల నడ్డ పెట్టు లేక విహరించుటకు వజ్రనాముదల యడిగి." ప్రభా. 1. 121.

అడ్డ పేరు

  • ఏదో ఒకందుకై నడుమ ఎవరో పెట్టిన పేరు.
  • "అతని పేరు శంకరశాస్త్రే అయినా కూరగాయల కెప్పుడూ దేవిరిస్తూ ఉండడంచేత కూరగాయలశాస్త్రి అని అడ్డపేరు వచ్చింది." వా.

అడ్డపొగ వేయు

  • అడ్డు వేయు.

అడ్డబాస

  • బులాకీ. తె.జా.

అడ్డమాడు

  • వ్యతి రేకించు.
  • రుద్రమ. 40 పు.

అడ్డము చెప్పు

  • వ్యతి రేకించు.
  • "ఏది చెప్పినా వాడు అడ్డం చెప్తాడు." వా.

అడ్డముపడు

  • అడ్డు వచ్చి కాపాడు.
  • "దాని కడ్డముపడ నెవరు వచ్చిన సమ యింపుము." మార్కం. 6. 158.
  • ఎవ రడ్డం వస్తారో చూస్తాను అనే రీతిగా కూడా వినవస్తుంది.

అడ్డము వచ్చు

  • అడ్డము వచ్చి కాపాడు. అడ్డుపడు.
  • "అమ్మధురాపురీరమణు లడ్డము వత్తురు గాక." భాగ. దశ. పూ. 1474.

అడ్డ మూడే కళ్లుగా తినువాడు

  • అడ్డబియ్యం వండగా మూడు ముద్దలతో మింగి వేస్తా డనుట.
  • అంటే తిండిపోతు.

అడ్డమైన

  • ఏది పడితే అది, సమయాను కూలంగా, నీతీ నియమం లేకుండా.
  • కాశీ. 7. 232.
  • "వాడు అడ్డ మైనకూళ్లూ తింటాడు."
  • "అడ్డ మైనవాళ్ల కాళ్లు పట్టుకొంటాడు."
  • "అడ్డ మైనపని చేస్తాడు." వా.

అడ్డమైన కూళ్లు కుడుచు

  • అన్ని నీచాలకూ పాల్పడు.
  • "వాడు అడ్డమైన కూళ్లూ కుడుస్తున్నాడు." వా.

అడ్డమైన గడ్డి తిను

  • నీచానికి లోబడు.
  • చూ. అడ్డ మైనకూళ్లు కుడుచు.

అడ్డమైన చాకిరీ

  • నానా పనులూ
  • "వాడు నాచేత అడ్డమైన చాకిరీ చేయించుకొని తరిమేశాడు." వా.

అడ్డమైన వాడు

  • 1. ఎవడు పడితే వాడు. అడ్డ______అడ్డా 51 అడ్డా_____అడ్డు
  • "ఆ ఊళ్లో అడ్డమైనవాడూ పెద్ద మనిషే." వా.
  • 2. ప్రతివాడు.
  • "అడ్డమైనవాడూ నన్ను ఆక్షేపించే వాడే."
  • "ఆ సత్రంలో అడ్డమైనవాళ్లూ దిగుతుంటారు." వా.

అడ్డమైన మాటలు మాటలాడు

  • నోటికి వచ్చినట్లు మాట్లాడు.
  • "వా డక్కడికి వెళ్లేసరికి అడ్డమైన మాటలూ మాట్లాడాడు." వా.

అడ్డవాటు

  • అడ్డుపుల్ల.
  • "అడ్డవాట్లు వేసి చెఱచినం గాని నీకు గునుకు పట్టదు." తె. జా.

అడ్డవాతియమ్ము

  • అర్ధ చంద్రబాణము.

అడ్డదిడ్డముగా

  • వక్రముగా.
  • "వా డెప్పుడూ అడ్డాదిడ్డంగా మాట్లాడుతాడు." వా.

అడ్డాదిడ్డిగా

  • ఇష్టం వచ్చినట్లుగా, ఒక క్రమం లేక అనుట.
  • "ఆ ఊరు అడ్డాదిడ్డిగా పెరిగిపోతూ ఉంది. అందమా? చందమా?" వా.

అడ్డాదిడ్డులు

  • ఆటంకాలు. జం.
  • "వినయంబుతో జేరి పని యేమి యను వాడె, యరయ కడ్డాదిడ్డు లనుప సాగె." కువల. 2. 24.

అడ్డాయుధము

  • కత్తి - అడ్డకత్తి.
  • బస. 5 ఆ. 147 పుట.

అడ్డావిడ్డము తిరుగు

  • ఎటు పడితే అటు తిరుగు.
  • "అడ్డావిడ్డము తిరిగే, తెడ్డెఱుగునె పాలతీపి." వేమన.

అడ్డాదిడ్డములు

  • అవీ ఇవీ.
  • "వడ్డించు మనుచు గుడుచుచు, నడ్డా విడ్డములు పలుకునంతటిలోనన్." బసవ. 6. 191.
  • చూ. అడ్డాదిడ్డులు.

అడ్డిపోవు

  • ఆగిపోవు.
  • కొన్ని ప్రాంతాలలో విరివిగా వినిపించేపలుకుబడి.
  • "అంతా యేర్పా ట్లయిన తర్వాత ఉన్నట్లుండి ఆ పెండ్లి అడ్డిపోయింది." వా.

అడ్డుకఱ్ఱ వేయు

  • విఘ్నము కలిగించు.
  • అడ్డుకఱ్ఱ - ఆటంకము.

అడ్డు గఱ్ఱమాటలు

  • అడ్డుమాటలు.
  • "నీయడ్డుగఱ్ఱమాటల కీ యెడ బని యేమి?" రుక్మాం.
  • చూ. అడ్డుపుల్ల వేయు.

అడ్డుపుల్ల వేయు

  • విఘ్నము కలిగించు.
  • "వాడు ఎక్కడికి వచ్చినా ఏమి జరుగుతున్నా ఏదో ఒక అడ్డుపుల్ల వేయకుండా ఉండడు." వా. అడ్డువాట్లు వేయు
  • విఘ్నము కలిగించు.
  • రుద్రమ. 70.

అడ్డేటుమీద గుడ్డేటు

  • కాక తాళీయంగా తగిలిన దెబ్బ పై మరొక దెబ్బ తగులు.

అణక వేసుకొను

  • మెడమీద నున్న కాడిమాను మెడకిందికి వచ్చునట్లుగా ఎద్దు ఎద్దు తిరుగ బడు.
  • "ఆ యెద్దు అణికె వేసుకుంది. దాన్ని లేపేదాకా మనం గోళ్లు గిల్లుకుంటూ మూర్చోవలసిందే." వా.

అణుమాత్రము

  • ఏకొంచెమున్ను.
  • "అణుమాత్రమును గర్వగుణము లేక." కా. మా. 2.7.
  • "నా కా విషయంలో అణు మాత్ర మైనా సందేహం లేదు."
  • "వాడికి అణుమాత్రం కూడా కృతజ్ఞత లేదు." వా.

అణో రణీయాన్ మహతో మహీయాన్

  • చిన్నలలో అతిచిన్న, పెద్దలలో అతిపెద్ద.
  • "భగవంతుని విషయంలో ఉపయోగించే వైదికసూక్తి.

అతంత్రపుమనిషి

  • నమ్మడానికి వీలులేని మనిషి.
  • "వాడు చాలా అతంత్రపు మనిషి. వాణ్ణి నమ్మి యే పనిలోకి దిగడానికి వీలు లేదు." వా.

అతంత్ర మయిన

  • భద్రంగా లేని.
  • శ. ర. లో అతంత్రం అంటే స్వాతంత్ర్యము తప్పినది అనుట సరి కాదు. ఇది నేటికీ వాడుకలో భద్రంగా లేదు అన్ంస్ అర్థంలో విరివిగా వినవస్తున్నది.
  • "మా తామహుయాగతంత్రము నతంత్ర (ద్ర)ము చేసి." కాశీ. ఆ. 6.
  • "ఈ యిల్లు చాలా అతంత్రంగా ఉంది. ఇంతమంది పిల్లలతో వానాకాలంలో ఉండా లంటే భయంగా ఉంది."
  • "ఆ కుర్చీకాలు కాస్త అతంత్రంగా ఉంది. జాగ్రత్తగా కూర్చో." వా.

అతకుత లగు

  • అతలకుతల మగు.
  • "అకట యవి సవరింపగా నతకుతలయి." బాల. 7.

అతనిచేతులలో చెంగలమ్మగొట్ట

  • ఒక సాపెన.
  • "అకట! వయ్యాళి గాగ బొమ్మనుచు గొట్టు, నతని చేతులలో జెంగలమ్మ గొట్ట."
  • శుక. 3 ఆ. 403 ప.
  • చూ. అతని చేతులు పడిపోను.

అతని చేతులు పడిపోను

  • ఒకసాపెన.
  • "ఎంత దెబ్బ వేశాడు - అతని చేతులు పడిపోను." వా.

అతలకుతల మగు

  • క్రక్కదలిపోవు.
  • "కుతలము పడహతుల నతలకుతలం బయ్యెన్."
  • సింహా. 1. 154. అటి_____అటి 53 అక్వ్తి_____అతి
  • "ఎడ్లబండిలో ఆ పదిమైళ్లూ ప్రయాణం చేసేటప్పటికి ఒళ్ళంతా అతలకుతల మై పోయింది."
  • "మిలిటరీవాళ్లు దిగడంచేత ఆ ఊరంతా అతలకుతలం అయిపోయింది." వా.

అతిక మాత్ర

  • అధిక ప్రసంగి.
  • ఇది చిత్తూరుజిల్లాలో విశేషంగా ప్రచారంలో ఉండే పలుకుబడి.
  • చూ. అదనప్రసంగి.

అతిగహనము

  • చాల క్లిష్ట మయినది.
  • "దీని విధానం బెఱుగంగా.......దా నతిగహనంబు." భార. అర. 1. 330.

అతిథీ అభ్యాగతీ

  • వేళకు వచ్చే పథికులూ వారూ. జం.
  • "వాళ్లింటికి రోజూ అతిథో అభ్యాగతో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు." వా.

అతి పనికి రాదు

  • ప్రతిదానికి పరిమితి ఉండా లని చెప్పునపుడు అనేమాట.
  • "స్నేహాలూ, ప్రేమలూ, రావడాలూ, పోవడాలూ ఇవన్నీ ఉండవలసిందే కాని అతి పనికి రాదు రా బాబూ!" వా.

అతిమనిషి

  • మితి మించి ప్రవర్తించు వాడు.
  • "వాడు వట్టి అతిమనిషి. ఏమాత్రం చను విచ్చినా నెత్తిన కూర్చుంటాడు.? వా.

అటిరథులూ మహారథులూ

  • ఎత్తిపొడుపుగా, వాళ్ళంతా చాల గొప్పవాళ్లు లే అన్నట్లు ఉపయోగించేపలుకుబడి.
  • ప్రాచీనయుద్ధ పరిభాషద్వారా వచ్చినది.
  • "ఉన్నారు గా మీ వాళ్ళంతా అతిరథులూ, మహారథులూ. నా సాయం ఎందుకు కావలసి వచ్చింది." వా.

అతిరసాలు

  • ఒక పిండివంట.

అతివాసము

  • చూ. అధివాసరము.

అతివినయము

  • ధూర్తత.
  • అతివినయం ధూర్తలక్షణం అనే నీతివాక్యంపై ఏర్పడినది.
  • "అదంతా వినయం కాదు. అతివినయం సుమా." వా.

అతివృష్టీ అనావృష్టీ

  • ఏ దొచ్చినా ఎక్కువే అనుట.
  • వర్ష సంబంధ మైన పలుకుబడి.
  • "వాడు వస్తే రోజూ వస్తాడు. లేదా కొన్ని నెలలు కనిపించడు. వాడి దంతా అతివృష్టీ అనావృష్టీ." వా.

అతిశయం

  • గర్వం.
  • "కలవారింటి కోడ లని దానికి మహా అతిశయం." వా.
  • "అంత అతిశయాలకు పోవద్దురా? మన మేమి ఉన్న వాళ్లమా? ఏ మన్నానా?" వా.