పండ్రెండు రాజుల కథలు/జయసేనమహారాజు కథ
2. జయ సేన మహారాజుకథ
తోల్లి మగధ దేశంబును, ధర్మాత్ముండగు, విజయసేనుండను మహారాజు జనరంజకంబుగఁ బెక్కు వర్షంబులు పరిపాలించెను. ఆవిజయ సేనునకు జయసేనుఁడను నొక్క కుమారుండును, అతని సోదరుండగు ప్రతాపసేనునకు, వినయ సేనుండను నొక్క కుమారుండునుఁ గలిగిరి. జయసేనుఁడు విజయసేనునకన్న నాల్గువత్సరంబులు పెద్దవాఁడగుటం జేసి, వినయసేనుం డగ్రజునియెడ వినయభ క్తివాత్సల్య తత్పరత మెలంగుచు నతనితో గూడి యఖిల విద్యారహస్యంబులను గురుముఖంబున నేర్చుచు నాతని నహోరాత్రంబు లన్న పానీయ సమయంబులందు సయిత మేమఱక సదాచాయవలె నంటియుండెను. ఇట్లుండఁ గొన్ని దివసంబులకు వార్థక్యంపు పెంపున, నవ్విజయసేనుం డాసన్న మరణుండై —— తన సహోదరుండగు ప్రతాపసేనునిఁ దనదరికిఁ జేరంజీరి, "సోదరా! నాకుఁ గాలము చెల్లిపోయినది. నేను శాశ్వతముగా నీ యిలాతలముంబాసి పోవుచున్నాను. ఇఁక మీదట, ప్రపంచజ్ఞాన రహితుండును, బాలుండును నగు, మన జయసేనునకు నాపిదప జనకుండవును రక్షకుండవును, నీవుదప్ప వేఱెవ్వఱును లేరు. మన జయసేనున కర్ష ప్రాయమువచ్చు నంతదనుక రాజ్యంబును నీవ సంరక్షించి పిదప కుమారునకుఁ బైత్రుకంబగు రాజ్యంబు నొసంగుమని జయసేనునిఁ బినతండ్రి కప్పగించి దేహము చాలించెను. సహోదర నిర్యాణానంతరంబునఁ బ్రతాపసేనుని హృదయము విషసంకల్ప సమాకీర్ణమై స్వపుత్రకుఁడగు వినయసేనుని రాజుగా నొనరించి, యేతంత్రంబుననైన జయసేనుని మడియింపఁదలఁచి యనేక, తంత్రోపాయంబుల నాతనిపైఁ " బ్రయోగించుచు వచ్చినను, తత్తంత్రం బులెల జయసేనునిఁ గంటికి ఱెప్పవలె నిరంతరముఁ గాచుకొనియుండు స్వపుత్రుండగు వినయసేనునివలనఁ బటాపంచలుగా నొనరింపఁ బడు చుండుటకుఁ బ్రతోపసేనుఁడు తన మనంబున నత్యంతవ్యాకులతంగాంచి కొన్ని దినంబులు జయసేనుని రాజ్యభ్రష్టునిఁగా నొసరింప నంత్య సంకల్పంబు నొనరించి యొక్క నాడు జయసేనుం దనదఱికిఁబిలిచి "కుమారా! ఏ కారణంబుననో రాష్ట్రీయజనంబున కనేకులకు నీపైఁ గ్రోధముగల్లి యున్నది. వారి క్రోధంబు చల్లాఱునంత దనుక నీవే యన్య రాష్ట్రంబుననైనఁ దలఁదాచుకొని, దేశ కాలస్థితు లనుకూలించిన పిదప నాయాజ్ఞ నంది మగుడ నిందురాఁదగును. నిన్ను విడుచుట యనిన, నాకును మిక్కిలి విచారంబు గల్గుచున్నయది. ఐనను నేనిందు నీ కెట్టి సహాయమునుఁ జేయనేఱని న్యర్ధుండ నైతిని. ఇప్పట్టున నిట్లు నేనొనరింపనేని దుర్మార్గులగు రాష్ట్రీయ జనులు నన్నును రాజ్యమునుఁ గూడ మ్రింగి వేయ సంకల్పించియున్నవారు; కావున నీవు రేపటి దినంబున నాయాజ్ఞను పాలింపుము. నీ నిర్గమన వ్రుత్తాంతమును విషయసేనునకైన నెఱింగింపవల" దని శాసించినఁ బితృభక్థిపరాయణుండగు జయసేనుండు వినయ వినమితమస్తకుండై పితృవ్య శాసనంబు నౌదలందాల్చి —— “తండ్రీ ! నాజనకుని యనంతరంబున, నీవేనా జనకుఁడవు. నీశాసనము నాకు శిరోధార్యము. మనము శ్రీరామచంద్రుడు జన్మించిన సూర్యవంశంబుననే జన్మించుటం జేసి యామహాత్ముని ప్రవర్తనమే మనకును మార్గదర్శంకంబై యున్నది. కావున నాతండెట్లు పితృశాసనంబును నిర్వర్తించెనో నేనును, నట్లే నీశాసనంబునుఁ బాలింపరేపే ప్రవాసినై పోవుదును. నాకు సెలవి” మ్మని పలికినఁ బ్రతాపసేనుం డానందించెను. జయసేనుండా మఱునాటి వేఁగుజూముననే, చిర కాలావాసమగు స్వజన్మస్థానమును, తనకు విధేయుండై ప్రేమభాజనుండగు ముద్దుతమ్ముని వినయసేనునివదలి గమ్యస్థాన నిర్దేశం బొనరించుకొనకయే పురముంబాసి యొక మహారణ్య మార్గంబునఁబడి నిర్గమింపసాగెను. అట్లు మహాభయంకర నిబిడంబగు నరణ్య మార్గంబున నరుగుచు, నారాజకుమారుండు తన నెమ్మనంబున, “దైవమా! నేనెందరుగు వాఁడ! మగధ దేశాధీశ్వర నందనుండనని యెవ్వఱితో నేమని చెప్పుకొందును! ఇట్లు నీవు రాష్ట్ర త్యాగినై రాగతం బేమియని ప్రశ్నించినవారల కెట్టి ప్రత్యుత్తరం బీయనేర్తును? జగద్రక్షకా! నాభావిజీవితము నీకృపారసముపై నాధారపడి యున్నయది. ఏరాజోత్తంసుని కడనైన నేవక వృత్తిని బ్రచ్ఛన్న కులగోత్ర నామధేయుండనై మెలంగనున్నాను. ఇదియ నాసంకల్పము. దానిని నెఱవేఱఁ జేయు భారమునీయదియే!" యని పరమేశ్వర ధ్యానంబు సేయుచు బహుతీరా రణ్యపర్వత నదీనదంబులను నిర్గమించి కట్టకడ కొక్క మహానగరముం బొడఁగాంచి పెన్నిధింగన్న పేదచందంబున, నానందించుచు, నప్పుఱభేదన, బహిఃప్రాంతంబునఁగల, భవానీ దేవ్యాలయముం జేరి తత్పరిసర సరోవరంబునఁ గడుపార జలంబులం గ్రోలి, ఫలవృక్షముల గాన్పించిన మధురఫలరసంబుల నారగించి క్షుత్సిపాసల నణంచుకొని, యాలయాంతరంబునకరిగి యద్దేవ దేవికిం బ్రదక్ష్మిణ నమస్కారాదుల నొనరించి మార్గశ్రాంతి నణంచుకొనఁగోరి, యాలయముఖమంటపంబున శయనించెను. కొండొకవడి కాతని శ్రవణపుటంబుల కాందోళికా గమన సూచకంబగు వాహకుల యోంకార నినాదంబు వినంబడుటయు, నించుక తలయెత్తి మార్గంబున వీక్షింప నల్లంత దూరంబున, వింశతిపరిచారికా పరివేష్టితంబగు నొక్క యాందోళిక, దేవాలయాభిముఖంబుగ నరుదెంచుట గాన్పించెను. అంత నయ్య వనీధవనందనుం డాత్మగతంబున, "సయ్యారే! ఈ యాందోళిక యీ దేవాలయంబునకే వచ్చుచున్నయది. పైఖరిం బరికింప నెన్వరో రాజకీయాంతః పురాంగనామణులు దేవీ పూజార్థమై యరు దెంచుచున్నట్లు తోఁచెడును. యువకుండ నగు నేనిందుగాన్పించుట కర్జంబుగాదు. ఇందెందేని దాగియుండెద!"నని తలంచి యందొక్క గుప్తప్రదేశంబుననిలచి యుండి, తదంగనామణుల వ్యవహారముం గమనించుచుండెను. ఏత దాందోళిక యాలయంబున కరుదెంచినపిదప, నప్పరిచారికలాందోళికాచ్ఛాదితంబగు రత్న ఖచితపటంబు నించుక తొలగించి "భర్తృదారీకా మణిమంజరీ! వెలికి రావచ్చునని పలుక, దేదీప్యమాన ప్రభాసౌందర్య విభాసురాంగియగు నొక్క బాలాలలామము, మందగమనంబున వెలికరుదెంచి, పరిచారికాజనంబు కేలూతలొసంగ, దేవీసాన్నిధ్యంబునఁ దాఁదెచ్చిన పూజాద్రవ్య ఫలాది కోపహారంబులనుంచి ధూపదీపనైవేద్య పూజాదుల నబ్భవానీదేవి నర్చించి, నిమీలితలోచనియై బద్ధాంజలియై కొండొకతడవు మానస ధ్యానంబుగావించి, మగిడి సఖీజనంబులతో గలసి, యలయంబు వెల్వడి యాందోళికారూఢయై పట్టణాభిముఖంబుగ నరిగెను. గుప్తప్రదేశంబున నిలచి యక్కాంతాజనం బొనరించిన కృత్యంబుల నెల్లం దిలకించుచుండిన జయసేనుండు మహాద్బుత చేతస్కుండై —— "ఓహోహో! ఈసుందరాంగి యెవ్వతెయైయుండును? ఇదియొక వేళ మానవకాంతగాక దేవకాంతయై యుండునా? కాదు. కాదు —— దేవకాంత లనిమిష లని విందుము గదా! అట్టి లక్షణంబీ నారీతిలకము నెడంగానమే! —— ఇది విద్యుల్లతకాఁబోలును; విద్యుల్లతయైనచో నిలుకడయుండదుగదా! కాకయిది చంద్రబింబమేమో! చంద్రబింబమునం గళంకముండుఁగదా! ఈ బాలిక యందు కళంక మెక్కడిది? కావున నిదియొక రాజపుత్రికయగుటయే నిక్కము. ఇది యేరాజ్యమో! ఏపట్టణమో నేనెఱుంగినైతి. ఈమె యొకవేళ యీ దేశాధీశ్వరుని తనయకాఁగూడదా! ఔను, అందుల కేసందియంబును లేదు. ఈమె యీ దేశపు రాజకుమారితయే! క్షణమాత్రంబున నీయన్నులమిన్న నన్ను చిత్తజుని నారాచంబుల భారింబడవైచిచనియె. నేనీ దుస్సహంబగు మదన తాపంబు నెట్లు సైరింతును! యేదియెటున్నను తోలుదోలుత నిది యేరాజ్యమో కనుంగొనవలయు ననితలంచి, యాలయంబును వదిలి పురప్రవేశం బొనరించి యదిమత్స్య దేశంబనియు, నబ్బాలికి మత్స్య దేశాధీశుని నందనయనియుఁ బురజనుల వలన నెఱింగి, తన మనంబున, "తొల్లి మత్స్య దేశాధీశున కొకానొక రాజన్యునితోఁ గలిగిన ప్రచండ సంగరంబున మజ్జనకుండీరాజునకు సహాయం బొనరించుటయేగాక యాతని ప్రాణంబులను సయితము రక్షించెననియును తత్కారణంబు నీరాజు మాకుటుంబమున కత్యంత మిత్రుండనియు, జెప్పగా విందు. దయార్ద్రహృదయుండును మాకవశ్యము మాననీయ బంధుసమానుండును నగు నీధరాధినాథుని పొంతనే కొన్ని దినంబు లజ్ఞాతకులశీల నామధేయుండనై 'మెలంగెద! ఆవల నా యెడల నాభవానీ దేవి కరుణంజూపు నెడల నిక్కన్య కారత్నంపుపాణినిఁ గూడ గ్రహింప గల్గుదు నేమో!" యని యేమేమియో వెఱ్ఱి యోచనలు సేయుచు మఱలం దనలో—— “అయ్యయ్యో! నేనెంత వెఱ్ఱివాఁడను. పితృ మాతృవిహీనుండడై 'రాజ్యభ్రష్టుండనై యున్న నా కెట్టి పేరాసలు గల్గుచున్నయవి. దురదృష్టశాలినగు నాకీకన్యకామణిం జేపట్టఁగల మహా భాగ్యంబబ్బునే! అట్టి దురాశం బరిత్యజించి యీరాజేంద్రు నోలగంబున భటమాత్రుండనై దినంబులం బుచ్చెదఁగాక!" యని చిత్తమును స్థిరపఱచుకొని, రాజప్రసాదద్వారముం జేరి తనరాకను భట మూలంబున నాస్థానంబునకుం గబురంపెచు, అనతి కాలంబుననే, తద్భటుండరు దెంచి. జయసేనుం జూచి, యోమానవోత్తమా! ప్రస్తుతం బీ దేశాధీశ్వరుం డిందు లేఁడు; వంగ దేశాధీశ్వరునిపై దాడి వెడలియున్న వాఁడు. ఐనను మంత్రిసత్తములుగలరు. దర్శనంబునకు ముదల యొసంగిరి. నీవాస్థానఁబున కరుగవచ్చు. " నని పలికెను. ఆపలుకుల నాలకించి యాశాభంగమునొందియు మంత్రినైన సందర్శించినఁ గొంతఫలంబుగల్గు నేమో యను నతిసూక్ష్మంబగు నాశాబంధము ముందునకీడ్వ, నాస్థానమునకరిగి ప్రెగ్గడను డగ్గఱి నమస్కరించి మోసల నంజలిబద్ధుఁడై నిలువ వినయంధరనాముండగు నమ్మంత్రి యాతని రూపలావణ్య ముఖగాంభీర్యాదులం దిలకించి విస్మయ చేతస్కుడై యాతండొక మహాకులీనుండు గాని సామాన్యుండుగాడని తలంచి, నీయాశయం బేల నిటకేలవచ్చితివి నీ నెవ్వండవని యడుగ జయసేనుండు——"సచివోత్తమా! నాది మగధ రాజ్యంబునకుఁ ప్రధాన నగరంబగు నుజ్జయినీ పురంబు; నా పేరు మణిమంతుఁడు. నేనత్యంత దరిద్రుండనగుటఁ దమయాశ్రయంబున నెద్దియేని భటోద్యోగముం గాంక్షించి వచ్చితి: ” నావుడు వినయంధరుండు—— “మణిమంతా! నీకోరిక యత్యల్పంబే యయ్యును దానిందీర్ప నేనశక్తుండ నగుటం జింతిల్లెద; ప్రస్తుతము మాకును వంగ దేశీయులకు మహాయుద్ధంబు జఱుగుచున్నయది. యుద్ధ సమయంబుల నూతనోద్యోగంబుల నెవ్వఱికిఁ గానియొసంగుట మా నియమంబుగాదు; యుద్ధానంతరంబునఁ గాన్పింతు వేని నిన్నొక సైనికునిగాఁ జేర్చుకొందు" మని పలికెను.
జయసేనుండట నాశాభంగంబునొంది యప్పురిం బాసి, మత్స్య దేశాధీశుని తనయ యగు, మణిమంజరియందే హత్తుకొనిస చిత్తంబుతో నున్మాదుని భాతినొక మహారణ్యంబునంబడిపోవుచు, దనలోఁ దానేమియో గొణుగుకొనుచుండెను. తత్సమీపంబుననేగల, మతంగమహా మున్యాశ్రమమునుండి తచ్ఛిష్యుఁడగు పతంజలి యను బ్రహ్మచారి కుశాదుల సంగ్రహింప నందందుఁ దిరుగుచు, నున్మత్త ప్రాయుఁడై పలువరించుచు మార్గంబుగానక నరుదెంచుచున్న జయసేనుం గాంచి, యాతఁడొక వెఱ్ఱివాఁడై యుండునని తలంచి యాతనింగొని చని నిజగురు సన్నిధానంబున నిలిపెను. ఆ మతంగమహర్షియు జయసేనుని సౌందర్యాది రూపసంపదల కాశ్చర్యపడి, యాతనివలస నాతని నిజచరిత్రం బెల్ల నెఱింగి మిగుల జూలినంది, "యోవత్సా! నీ వెంత వెట్టివాఁడవు! సమస్త విద్యల నామూలాగ్రంబుగా నెఱింగియు, నొక బాలికఁ గాంచి యమిత హేయమైన యద్దాని ముట్టుకొంపనాసించి యిట్లున్మతుండవైతివిగా ! మలమూత్ర దుర్గంధభరితంబగు యోనియందుగల్గు తాత్కాలిక సుఖంబునాసించి శాశ్వతం బైన పుణ్యపదంబును కాలందన్నుకొను వెంగలి, నీకన్న నెవ్వఁడైన నుండునా? నీవిబ్రాంతిని విసర్జించి, కొంత కాలము నా సన్నిధిని, నిలచి, యీ చర్మశల్యాది హేయవస్తుభరితంబగు శరీరముయొక్క యుత్పత్తి తేఱంగంతయు నాలకించి, యన్యజనదుస్సాధ్యంబులగు సమస్త శస్త్రాస్త్ర మంత్ర రహస్యంబులం గఱచి మతిపొ"మ్మని యానతీయ, జయసేనుం డత్యంతానందభరితుండై యమ్మునికి సాష్టాంగ నమస్కారంబుల నొనరించి, “మహాత్మా! నేను ధన్యుడనైతిని. యుష్మద్దర్శ నంబువలననే ప్రచండవాతాహతింజల్లా చెదరై పోవు మేఘంబుకరణి నా భ్రాంతి సగముతొలంగె—— నాకు జ్ఞానోప దేశంబొనరింపవే!" యని ప్రార్థింప సమ్మతంగ మహాముని జయసేనునకు సాంఖ్యసూత్రంబు నుపదేశించెను. జయసేనుండును, ధన్యుండనై తినని యుప్పొంగుచుఁ గతిపయదినంబులాముని శ్రేష్ఠున కత్యంత భక్తితత్పరుండై శుశ్రూషలంగావించి యొకానొక దినసంబుస, నమ్మతంగ ముని ప్రమోదమాన మానసుఁడై యున్నతరి నామహాత్ముని పాదంబుల నొత్తుచు, “నోమహాత్మా ! మీరుబోధించిన శస్త్రాస్త్ర మహిమంబు లసాధ్యంబులయ్యును, నుపయోగంబు లేమింజేసి, బూడింబోసిన పన్నీఁటికరణి వ్యర్ధంబులగుచున్నయవి. మత్పిత్రు మిత్రుండగు, మత్స్య దేశాధీశ్వరుండిప్పుడు వంగ దేశంబునఁ దన శత్రువులతో రణంబొనరించుచున్నవాఁడు, తమ యాజ్జ యగునేని, నేనును తద్రణంబున కరిగి, తమరు నేర్చిన విద్యా కౌశలముం బ్రదర్శించి సార్థకంబొనరించెద" నని ప్రార్ధింప నమ్మౌని ప్రమోదమానమానసుండై "వత్సా నీకు శుభంబగుగాక!" యని దీవించిపంపెను.
మతంగ మహర్షినివీడ్కోనిచనిన జయసేన మహారాజు కోలది దినంబులకు వంగ దేశముం జేరి, మధ్య దేశాధిపతియగు ఋతుద్వజునకును , వంగ దేశాధిపతి యగు సనంగసేనునకునుం బ్రవర్తిల్లు మహాసంగ్రామముల గాంచి, దేహముప్పొంగ, సనాహూయమానంబుగ మత్సదేశ సైన్యంబులంజేరి, మునిని మనంబునందలంచుకొని తమ్మని దత్తంబులగు నపూర్వ శర సహస్రంబునకు నమస్కరించి సమంత్రికంబుగ వదలిన నత్తూణీరంబులు జాజ్వల్యమానంబులై భూనభోంతరాళంబుల భస్మీపటలంబోనరించు మాడ్కి మహాట్టహాసం బొనరించుచు వంగరాజన్యవ తాకినుల నామావశేషంబొనరించుటం గాంచి, ఋతుధ్వజుండబ్బురంపడి, యీయనాహూయ మానంబగు సహాయం బెవ్వరిదోకోయని విచారించి యెట్టకేలకు జయసేనుంగనుంగొని, “మహాత్మా! నీ వెవ్వండవు; నిర్నిమిత్తంబుగ నిమ్మహా ప్రమాదసమయంబున నిటకరుదెంచి నాకు సహాయంబొనర్ప గతం బేమని ప్రశ్నింప, జయసేనుండు విసమితాంజలియై— “రాజేంద్రా ! నేనొక నిరుపేదను.నన్ను మణీమంతుడందురు, నాది యుజ్జయినీ నగరము; పేదఱికంబుస జీవనోపాధికై యుష్మ ద్రాజ్యంబునకఱుగ నట సచివ శేఖరుండు నూతనుండ నగుట నన్నోలగంబునందుంచుకొన ననుమానించెను. అంతట గత్యంతరంబుఁగానక నాకునై నేనిటకరు దెంచి తమయాజ్ఞనందకయే రణంబునఁ బాల్గోనినందులకు మన్నింప వేడెద" నని పలికెను. ఆపలుకులువిని ఋతుధ్వజుండాశ్చర్యమునంది "యోహో! సజ్జనవరేణ్యా !అపజయశంకాసంకులిత స్వాంతులమైన మాకుసహాయమైనదటుండ నిన్ను మన్నింపవలయునా ! నీవు నరమాత్రుండవుగావు. నీవు నాయోలగ ముంగోరివచ్చుట నన్ను ధన్యుం జేయుటకుఁగాదే! నాసేనలకధినాధుండవై యుండుమని నియమించెను—— ఇది యిట్లుండ నటఁ బ్రతాప సేనుండు, జయసేనుని పోబడింగానక యాతని నెట్లయిన సంహరించినఁగాని రాజ్యమునం దనకుఁగల కంటకముతోలంగదని దురాలోచనంబొనరించి గూఢ చారులచే మణీమంతుని వ్రుత్తాంతంబు నెఱింగి, యతండేజయసేనుండని యనుమానించి వంగ దేశాధిపతితోఁ దనకుఁగల పూర్వమైత్రిం బురస్కరించుకొని ప్రచండ సేనలతోఁ గలసి వంగ దేశ ప్రభుపక్షంబున ఋతుద్వజుని పైకెత్తివచ్చెను,.ప్రతాపసేనునిరాకడంగాంచి, జయ సేనుండును రణంబునకాయత్తుండై, సేనలను మాత్రమే సంహరింపవలయుఁగాని, ప్రతాపసేనునకుఁ బ్రాణాపాయముంగల్గింపవలదని స్వసైనికుల కొనతియిడి, ప్రచండ సంగరంబాచరించి మగధరాజ సేనలంబరాభవించి ఋతుధ్వజునకు విజయముం జేకూర్పి, తద్రణంబునఁ బ్రతాప సేనుండు సైనికులచే బంధింపఁబడ, ఋతుధ్వజుండాతని గారాగారంబుననుంచెసు, పితృభక్తిపరాయణుండగు జయసేనుండు పితృవ్యునకుంగల్గిన పరాభవముంగని సహింపఁజాలక, యానాటి నడురేయి, చద్మవేషముందాల్చి పితృవ్య బంధిత కారాగారంబున కరిగి, యటఁగాపుండిన భటునిఁ గార్యాంతరమున నెటకే నంపివేసి, తలుపులం దెఱచుకొని, పితృవ్యుని చెంగటికేగి నిలిచెను. ప్రతాపసేనుఁడు సోదరపుత్రుని గుఱితించి, యదేసమయంబని కరవాలంబున నాతనిం దెగటార్పనెంచి, బలంబుగ నాతనిశిరంబునఁ గత్తిని గుఱి చూచి విసరెను. భగవత్కృపచే నాయాఘాతంబు జయసేనుని శిరంబునకు దగులక భుజము పైఁదగుల రక్తప్రవాహంబు గాఁజొచ్చి నను జయసేనుండద్దానిని శాంతము నసహించి, "తండ్రీ! 'నేనిందు సేనానినై యున్న కారణమన విధిలేక మన సేనలతోడనే కలహింపవలసి వచ్చెను క్షమింపుము; నీవుశత్రువులచే బంధింపఁబడుట మనకులంబున కపకీర్తి కరంబగును కావున నిన్ను నేను విడిపింపవచ్చితిని, ఈయంగుళీ యంబును సాంకేతికంబుగాఁ జూపినచో భటులెవ్వఱును నిన్నా టంక పఱుపరు. పుర బాహిరంబున నీకొఱ కొక ససతాశ్వంబు నుంచితిని. దాని నారోహించి మనపురంబున కరుగుము. నీకు మారుగ నేనిందుండెడను. నాకులశీలనామంబుల నిందు నేను బహిరంగ పఱుప లేదు. గావున నీరాజు నా కుఱిశిక్షను విధించినను కులమున కప్రతిష్ఠ రాఁజూలదు.” అని పలికి యంగుళీయంబు నొసంగినంతనే మహాసహనశీలంబులును, త్యాగసహితంబులును నగు నక్కుమారుని పలుకులకుఁ బ్రతాపసేనుని హృదయంబునఁగల యీర్యానలంబెల్ల నశించి, మహావిజ్ఞాన కాంతి యద్భుతంబుగ నుద్భూతంబయ్యెను. అంతట నాతఁడటనుండి పలాయితుండగుట కంగీకరింపక, నాతనితో గొంతదడవు వినాదంబుసల్పియు జయసేన ప్రోద్పలంబున వెడలిపోయెను. మార్గంబునంగల భటుల కాతఁడు కుమారదత్తాంగుళీయముం జూపినంతనే ——భటులు నిరాటంకంబుగ వదలుటయే కాక, రణంబున నాతని ప్రాణంబుల కపాయము రాకుండ జయసేను డొనరించిన శాసనంబునుసయిత మాలకించి యట్టి సద్గుణరత్నంబగు కుమారరత్నముం జంపఁదలంచిన నేనెంత పాపాత్ముండనని తలఁగొట్టుకొని, విలపింపఁదొడంగెను. పదంపడి తద్రాత్రంబున రాజభటులు కారాగృహంబున కరుదెంచి, ప్రతాపసేనుండు పలాయితుండగుటయు, జయసేనుండు క్షతగాత్రుఁడై యుంటయుం దిలకించి, ప్రతాపసేనుఁడే జయసేనుని నఱకి పారిపోయెనని ఋతుధ్వజున కెఱింగించరి. మఱునాడు ఋతుధ్వజుఁడు, పేరోలగంబుండి, రక్తసిక్తాంగుఁడైన జయసేను నందురప్పించి గతరాత్రంబున నేమి ఘటిల్లెనని ప్రశ్నింప, నాతండు తానుద్దేశపూర్వకంబుగ, ప్రతాపసేనుని విడిచితిననియును తన్నిమిత్తమై విధింపఁబడనున్న యుఱి శిక్షకైన సంసిద్ధుండ ననియును వచించేను. ఋతుధ్వజుండదివిని విస్మితుండై జయసేనుఁడు తనకొనరించిన యుపకారములం దలంచి శిక్షింప బుద్ధి రామిం జేసి, నీవాతని నేలవదలితివి; ఎట్టి ఘోరంశిక్షకై న నేలఁ బాల్పడితివని యెన్ని విధంబుల నడిగినను మాఱువల్కఁడయ్యె. తుదకు విధి లేక రాజశాసన ప్రకారం బాతని కుఱిశిక్ష నాజ్ఞాపించెను. భటులు నిర్భయానంద చేతస్కుండై యున్న మణిమంతుం గొనిపోవ సంసిద్ధులై యున్న తరిఁ దత్సభామధ్యమునం దెటనుండియో——వికృతాకారుండగు నొక్క పురుషుండు వెడలివచ్చి, “రాజా! చాలు చాలు; నీ విశ్వాసబుద్ధి నేడుగదా తెలిసెను! నీకు నే కోవ కృతుల నొనర్చి విజయ సంపాదకుడై యున్న యీ బాలవీరునా నీవు వధించెద " వని గంభీరభాషణంబులం బలికెను. ఆ పురుషునిఁ బ్రతాపసేనునిగా నెఱింగి సభాసదులు వెఱఁగలది చూచుచుండ, నాతఁడు రాజా ! ఈ బాలు న్వెవ్వనిఁగాఁ దలంచితివి. ఇతఁడు నీ పూర్వమిత్రుండును, మగధ దేశా ధీశ్వరుండును నగు విజయసేనుని కుమారుండగు జయసేనుండు. నా కారణంబున రాష్ట్ర త్యాగియై యిట్లజ్జాత వాసంబోనర్పఁ బాల్పడియున్నాఁడు. ఈ కుమార శ్రేష్ఠుని, శ్రేష్టమానసంబు నెఱుంగక యజ్క్షానినై——చంపదలచి యీయెడకు సంగరమిషంబున నరుదెంచి మీచే బంధింపఁబడితిని. ఈ కుమారుండు నాయవమానముంగని యోర్వం జాలక, నన్ను విడిపింపఁ గారాగారంబున కరుదెంచి యందుసహితము నాచే క్షతగాత్రుఁడుగా నొనర్పఁబడియెను. ఇట్టి కుమారుం జంపఁ దలఁచిన పాపిని నేనింక జీవించినఁ బ్రయోజనము గలుగ " దని పలికి తనచేతనున్న కటారితోఁ బొడుచుకొనఁబోవ జయసేనుం డాతని కరముం బట్టి నిలిపి, "తండ్రి ! నీకింత సాహసము చెల్లునే! నీవు మరణించినచో తండ్రి లేని నాకు దిక్కెవ్వ” రని కన్నీరు వెట్టుకొనియెను. తన మిత్రుఁడగు విజయసేనుని కుమారునిగా మణిమంతు నేఱింగి, ఋతుద్వజుండు మహానందముతోవచ్చి యాతనిం గౌగలించుకొని, జయసేన ప్రార్థితుండై ప్రతాపసేనుని క్షమించెను. తత్సమయంబున కటకుభగవానుండగు మతంగమహర్షి యరుదెంచి——సర్వజన సంపూజితుండై యుచితాసనంబు నలంకరించి "యోఋతుధ్వజా! ఈ జయసేనుఁడు పుణ్యాత్ముండు. నా శిష్యుఁడై నావలన సాంఖ్యసూత్రంబు నెఱింగిన పవిత్రుఁడు. ఇతఁడు నీ పుత్రికయగు మణిమంజరింగామించి యున్నవాఁడు. కావున నతని నీ యల్లునిగా నొనర్చుకొ"మ్మని పలుక నాతడు "మహాత్మా! నాకింతకన్నా ధన్యతగలదే! ” యని మహానందముతో నామోదించెను. తదనంతరము మతంగమహర్షియే వంగదేశ మత్స్య దేశంబులకు, సమాధానం బోనర్చి తద్దేశాధీశులను మిత్రులుగా నొనగించి, వంగ దేశాధిపతి పుత్రిక యగు; గుణమంజరిని, ప్రతాపసేన పుత్రుఁడగు వినయసేనున కిచ్చి యుద్వాహన బొనరింప నిర్ణయించెను. మణిమంజరీ జయసేనులకును, గుణమంజరీ వినయసేనులకును మునిసన్నిధానమున మహావైభవముతో కల్యాణములు గావింపఁబడియెను. కోడుకులు రాజ్యముం బాలించుచుండ ప్రతాపసేనుఁడు తన జీవిత శేషమును మతంగాశ్రమంబున వానప్రస్థుండై గడపెను.
రెండవరాత్రి కథ.
మఱుసటి దినంబున సయితము కృష్ణ పార్థులిరువును సాయంకాలమే సుఖభోజనంబొనరించి యమునా సైకతస్థలములంజేరి తాంబూల చర్వణం బొనరించు నవసరంబున, నర్జునుండు గోవిందుందిలకించి, “యో పురాణపురుషా ! తాము చెప్పిన ద్వాదశ మార్గంబులలో మొదటిదియగు, సాంఖ్యంబు నాకర్ణించి ధన్యుండ నైతిని. నేటి రాత్రి ఛాయాపురుషలక్షణ లక్షితంబగు మఱియొక పుణ్య చరిత్రము నానతీయవే"యని వేడిన నారాయణుండు మీన కేతన మహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యిట్లు చెప్పఁదొడంగెను.
3. మీన కేతన మహారాజు కథ.
శ్వేతవాహనా ! తోల్లి ——భోజమహారాజు ధారానగరముంబరి పాలించు కాలంబున, నప్పురంబున దేవశర్మాభిధానుండగు విప్రోత్తముం డొక్కఁడు విధ్యుక్తవిప్రాచార పరతంత్రుఁడై సదాహ్మణుండనం బ్రసిద్ధి కెక్కి యుండియు నొక్కనాడు నిజజనకుని యాబ్దికంబునకై సర్వశ్రేష్ఠుఁడగు బ్రాహ్మణుని భోక్తగాఁగోరి మహాకవియగు కాళిదాసుని భోక్తగా నిమంత్రించెను. తత్కారణంబున కాళిదాసుని మహిమ నెఱుంగని పామరజను లాతఁడు మత్స్యమాంసభోజియనియు, మధుపాయియనియు,వేశ్యాలోలుఁడనియు, సద్రాహ్మణుంచుగాఁడనియు, నట్టివానిని భోక్తగాఁబిలిచిన దేవశర్మ కులభ్రష్టుఁడయ్యె ననియు నిందించి, వెలివేసిరి. అప్పటికీ దేవశర్మకు, సుమతి, దీమతి యను నిర్వుఱు కుమారులును, సౌందర్యమున రతీదేవి కెనయగు, ననసూయ యనుపుత్రిక యుం గల్లియుండిరి. కులంబున వెలివేయంబడిన కారణంబున, దేవశర్మయే పుత్రులకుం బుత్రికకును సమస్తవిద్యలను నేర్పి——ప్రవీణులంజేసెను. అనంతరము కొన్ని దినంబుల కావల కాలవశంబున దేవశర్మ మృతి నొంద, దత్సతి యాతనితో, సహగమనం బొనరించి పురంబున వెలి