Jump to content

పంచతంత్రి/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

మాతృకలు

చెన్నపురి ప్రభుత్వప్రాచ్యలిఖితగ్రంథాలయమున, నీ భానుకవి పంచతంత్రిఁ బ్రతులు రెండు గలవు, ఒకటి తాళపత్రప్రతి. డి. నంబరు, 3025. వేఱొకటి కాగితపుఁబ్రతి. డి. నంబరు, 2684. కాఁగితపుఁబ్రతి మొదటిదానికిఁ బుత్రిక. దీనియం దచ్చటచ్చటఁ గొన్నిపద్యచరణములును, గొన్నిపదములును లోపించినవి. పంచమాశ్వాసమున, మొదటఁ గొంత గ్రంథపాతము గలదు. అసంప్రేక్ష్యకాంత్వమను నీ యైదవతంత్రమున, బహుశః మొదటి కథయును, రెండవ కథలోఁ గొంత భాగమును లోపించినవి. అశిథిలమగు ప్రత్యంతరము దొరకమిచే, లుప్తభాగములను బూరించుటకుఁగాని, సందిగ్ధస్థలములఁ బాఠనిర్ణయ మొనరించుటకుఁగాని యవకాశము లేమిని, తోఁచిన రీతిని, ఆయాస్థలములలోఁ బరిశిష్టభాగములను బట్టి, భావములను బొల్చికొని కొన్ని కొన్నిపూరణములను, సందిగ్ధస్థలములఁ బాఠనిర్ణయములను జేయవలసివచ్చినది. అనువుకాని స్థలములను యథాతథముగనే యుంచి ముంద్రింపవలసివచ్చెను.

పంచతంత్రములు

మడికి సింగనార్యుఁడు తన “సకలనీతిసమ్మతమునఁ” బంచతంత్రములోనివని కొన్నిపద్యముల నుదాహరించియుంచుటవలన, నిప్పటి కుపలభ్యమానము లగుచున్న చంపూరూపములగు పంచతంత్రములకన్న ముందే, ఒక పంచతంత్ర ముండియున్నట్లు తెలియుచున్నది. కాని, అది నామమాత్రావశిష్టము.

శ్రీకృష్ణ దేవరాయలయుగమునఁ జంపూరూపమున వచ్చిన పంచతంత్రములు మూఁడు.

1. దూబగుంట నారాయణ కవిది.
2. తిప్పయభాస్కరునిది (ప్రకృత కావ్యము).
3. పర్వతరాజు వేంకటనాథ కవిది.

ఈ మూఁడును, శ్రీకృష్ణదేవరాయల యుగమునఁ బరిమిత..... గొంచెము, ముందు వెనుకలుగ వెలసినవి.

ఇందు దూబగుంట నారాయణకవి గ్రంథము మొదటిది. కీ॥ శే॥ శ్రీ డాక్టరు చిలుకూరి నారాయణరావుగారి పరిశోధనవలన, వేంకటనాథ కవి యచ్యుతదేవరాయలకు సమకాలికుఁడని తేలుటవలన, ప్రకృతమగు నీ భానుకవి పంచతంత్రము రెండవదియును, వేంకటనాథునిది మూఁడవదియు నగుచున్నవి.

కృతికర్త

తిప్పయభాస్కరునిఁ గూర్చి, యీ కావ్యప్రస్తావనలో నున్న—

మ.

“పరవాగ్వైఖరి, లక్షణజ్ఞతను, శ్రీవత్సాన్వయఖ్యాతి, భూ
వరమాన్యప్రకృతిం బురాతనసుకావ్యప్రౌఢిమన్ భారతీ
వరమంత్రిప్రతిభన్ మహేశపదసేవానిష్ఠ నిన్ బోల రు
ర్వరలోఁ దిప్పయ భాస్కరేంద్ర! [బుధవర్ణ్యమ్ముల్?] భవద్భాగ్యముల్.”

యీ పద్యము వలన, నీతఁడు లాక్షణికుఁ డనియును, శ్రీ వత్సగోత్రజుఁ డనియును, రాజసభాపూజ్యుఁ డనియును, ప్రాచీనకావ్యభంగుల నెఱిఁగినవాఁ డనియును దెలియుచున్నది. ఆశ్వాసాంతగద్యములలో "భారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రిపుత్ర, సుజనవిధేయ, భానయ నామధేయ" ఆని యుండుట వలనఁ, దండ్రిపేరు తిప్పయ యనియును, నితనికి భానయ యనికూడ వ్యవహారమున్నట్లును, దెలియుచున్నది. కావ్యాంతమున, నితఁ డిట్లు చెప్పికొనెను,—

సీ.

పంపా విరూపాక్ష భైరవ విఠ్ఠలే
        శ్వర ముఖ్య దేవతావ్రజముచేత,
పరిపంథిగర్వవిభాళన శ్రీకృష్ణ
        రాయభూధవభుజారక్షచేత,
భటనటజ్యౌతిషపౌరాణికభిష
        గ్విచక్షణ సత్కవీశ్వరులచేత,
సంతతమదవారిచారుశుండాలఘ
        టాజవప్రకటఘోటములచేత,


గీ.

రమ్యమై యున్న విద్యాపురంబుసంధు,
నిమ్మహాకృతి భాను కవీశ్వరుండు

తెనుఁగు బాస నొనర్చెను వినుతికెక్క
నవని నాచంద్రతారార్క మగుచు నుండ.

దీనివలన కృష్ణదేవరాయల పరిపాలనకాలమున నీతఁడు విద్యానగరమునం దుండి యీ కావ్యమును రచించినట్లు తెలియుచున్నది. ఏతత్—

కృతిపతి

భండారు లక్ష్మీనారాయణుఁడు (ఈతనికి లక్ష్మమంత్రి యనియును, లక్ష్మయమంత్రి యనియును గూడ వ్యవహారము) శ్రీకృష్ణదేవరాయల యంతఃపురమున నాట్య, సంగీతవిద్యలకు నాచార్యుఁడు. ఈయన గొప్పవిద్వాంసుఁడు. సంస్కృతమున “సంగీతసూర్యోదయ” మనుపేర నుత్తమమగు నొక నాట్య, సంగీత లక్షణ గ్రంథమును రచించెను. అది తాళ, నృత్త, స్వరగీత, రాగజాతి, ప్రబంధాధ్యాయములను నైదుప్రకరణముల గ్రంథము.

ఆ గ్రంథము యొక్క ప్రస్తావనలో శ్రీకృష్ణదేవరాయలవిజయయాత్రలను, తనకు రాయ లొనరించిన సన్మానవిశేషములను, నీ లక్ష్మమంత్రి యిట్లు పేర్కొనెను.

శ్లో.

కర్ణాటాహ్వయదేశసౌఖ్యజననీ శ్రీతుంగభద్రావృతా,
మాతంగోన్నతమాల్యవత్క్షితిధర......ర్వతా,
పంపాధీశ్వర విఠ్ఠలేశ్వర కృపాదృష్టిప్రభామండితా
శ్రీ విద్యానగరీ విభాతి ధరణీ మాణిక్య ధమ్మిల్లవత్.


శ్లో.

తస్యాం కాంచనమంటపే పరిలసన్మాణిక్యహీరావళీ
ప్రాంతప్రోతవిశుద్ధమౌక్తికమణిశ్రేణీరవైరంచితం
ఆరుహ్యద్విరదారి పీఠమతులం క్ష్మామీశ్వరస్యాత్మజో
నిస్తంద్రః ప్రశశాస తుర్వసుకులోత్తంసో నృసింహో నృపః.


శ్లో.

కీర్తి స్ఫూర్తిభిరహ్న్యపి ప్రతికలం జ్యోత్స్నాం పరాంజృంభయన్
సద్వర్త్మ న్యభికామితేన సకలాన్ సంప్రీణయన్ ప్రాణినః
నిత్యాభిశ్చ కలాభిరుత్సుకతరం ధిన్వన్ బుధానాం వ్రజాన్
తస్మాద్దుగ్ధపయోనిధె రివ విధు శ్రీకృష్ణరాయో౽జని.

శ్లో.

బాల్యే౽ సౌ సకల కలాకలాపయుక్త
స్సప్రాణం సపది విజిత్య గంగరాజం
భంక్త్వా తచ్ఛివన సముద్రముత్కటం ద్రా
గావాసం వ్యతనుత నిర్భరం శివానామ్.


శ్లో.

దుర్గం జిత్వాథసో౽సా వుదయగిరివరం తత్ర రాహుత్తరాజం
బందీకృత్వా౽శు హృత్వా యుధి నగరవరే కొండవీడ్ కొండపల్ల్యౌ
జీవగ్రాహం గృహీత్వా గజపతితనయం పొట్టునూర్పట్టణాగ్రే
విశ్వశ్లాఘ్య ప్రతాపో బిరుదయుత జయస్తంభముచ్చైర్న్యఖానీత్.


శ్లో.

సో౽యం కృష్ణనరేశ్వరో గజపతిం జిత్వా తదీయ శ్రియా
సాకం తస్య సుతా ముదూహ్య యవనక్ష్మాపం సపాదం తతః
గొబ్బూరు స్ధలవాసినం సరభసం జిత్వాను విద్రావ్యతం
హస్త్యశ్వాన్ సతదీయదుర్గ మతులం రాచూరు మాదత్తవాన్.


శ్లో.

కృష్ణా ముత్తీర్య సో౽యం యవనజనపదం వహ్నిసాత్కృత్య సర్వం
ఫేరోజాబాద సింబాద్యురునగర సమాఖ్యాని దుర్గాణి జిత్వా
భంక్త్వోచ్చైః పారశీకం కలుబరిగపురీం ద్రాక్ ససాదార్దమానః
కా(క్రా)న్తా(న్త్వా) వ్యాకృష్ణవాన్ దోర్బల ఘనమహిమా త్రీన్ సురత్రాణపుత్రాన్.


శ్లో.

తస్య శ్రీకృష్ణరాయస్య కృపా క్షీరాబ్ధి చంద్రమాః
లక్ష్మీనారాయణో నామ వర్ధతే సరసాగ్రణీః.


శ్లో.

యో భారద్వాజ గోత్రే సమజని శ్రుతవాన్ కేశవామాత్య వర్యః
తద్దేవీ గౌరమాంబా తదమల జఠరే విఠ్ఠలార్యో వరేణ్యః
తద్భార్యా రుక్మణీతి ప్రచురతరగుణా తత్సుధాపూరగర్భే
లక్ష్మీ నారాయణో౽యం జయతి భువి యతస్స్యాదపత్యం సులక్ష్మా.


శ్లో.

సో౽యం శ్రీ లక్ష్మణార్యో భరతమత మతంగాది మార్గేణ సర్వాన్
కృత్వా వేలాన్ ప్రబంధాన్ బుధ జన కవి సంగీత విద్యాధికానాం
మౌళీ నాకంపయం స్తానివ దివి విబుధాన్ నారదః కిన్నరాదీన్
భూమౌ శ్రీకృష్ణరాయ క్షితిపతి కృపయా వర్ధతే సర్వవన్ద్యః.

శ్లో.

సదా౽భినవశబ్దాది భరతాచార్య నామకం
బిరుదం ఛారణీ చక్రే ధత్తే చక్రమివాచ్యుతః.


శ్లో.

శ్రీ షత్కృష్ణ నరేశ్వరస్య కృపయా స్వర్ణాంచితాం పాలకీం
ముక్తా గుచ్ఛ శతానుబద్ధ వలయం ముక్తాతపత్రద్వయం
శశ్వన్మత్తమతంగజాన్ మలహరీ వాద్యం నిజాంతఃపుర
స్థానే, నాట్యరసాధిపత్య మసకృల్లక్ష్మీపతిః ప్రాప్తవాన్.


శ్లో.

స్వామినా కృష్ణరాయేణ సంసారానంద చిత్తవాన్
లక్ష్మీనారాయణో వక్తి కార్య సాధన కారణం.


శ్లో.

సంగీతాగమ లక్ష్య లక్ష్మ నిపుణై శ్రీవిష్ణు భట్టారకైః
జ్ఞాత్వా దత్తిల కోహళాది భవత గ్రంథాన్ సుటీకాన్వితాన్
భూమౌ కీర్తి శరీర రక్షణధియా గ్రంథః కృతో౽యం మయా
సంగీత గ్రహయోగ్యతాధికతర స్సంగీత సూర్యోదయః.


గద్య.

ఇతి శ్రీమద్విప్రకులధుర్య భండారు విఠ్ఠలేశ్వరనందన, సూక్ష్మ
లిఖితాచార్య, రాయబయకార, తోడరమల్ల, అభినవభరతాచార్య శ్రీ లక్ష్మీ
నారాయణ విరచితే సంగీత సూర్యోదయే తాలాధ్యాయః ప్రథమః.”

పై శ్లోకములవలన బ్రసిద్ధములగు శ్రీకృష్ణదేవరాయల యౌవనారంభమునుండి ప్రవృత్తములైన, శివనసముద్ర విజయము, ఉదయగిరి కొండవీడు కొండపల్లి విజయములు, పొట్టునూరున జయస్తంభప్రతిష్ఠాపనము, గజపతి విజయమును, గొబ్బూరు రాచూరు విజయములు మున్నగునవే కాక, ఈ లక్ష్మమంత్రి రాయల కృపాక్షీరాబ్ధికిఁ జంద్రుఁ డనియును, నాట్యసంగీతముల నప్రతిమానుఁ డనియును, దత్ప్రతిపాదకములగు ననేకగ్రంథములను రచించి, నాఁటి విద్వత్కవులచేతను సంగీతవిద్యాధికులచేతను మిగులఁ బ్రశంసింపఁబడినవాఁ డనియును, దన విద్యాప్రాభవమువలన, ననన్యసాధారణమగు “అభినవభరతాచార్య"బిరుదమును వహించినవాఁ డనియును దెలియుచున్నది.

ఇంతియకాక కృష్ణదేవరాయలవలన, బంగారుపాలకియును, శతమౌక్తికస్తబకాలంకృతములగు రెండు మౌక్తికచ్ఛత్రములను, మదగజము లను, ప్రాభవసూచకమగు మలహరీ వాద్యమును, రాజాంతఃపురమున నాట్యవిద్యాధిపత్యగౌరవమును గూడఁ బడసినవాఁడని తెలియుచున్నది.

ప్రభువాల్లభ్యమున సమస్తవైభవములను బడసి పూర్ణకాముఁడైన యీయనఘుఁడు, పూర్వాచార్యమతములనెల్లఁ బరిశీలించి కీర్తిశరీరరక్షణార్థమై యితరసంగీతలక్షణగ్రంథముల వన్నెయు వాసియుఁ దఱుఁగునట్లు సంగీత సూర్యోదయమును నీ మహాగ్రంథమును రచించెనఁట.

ఈ లక్ష్మీనారాయణుఁడు భారద్వాజగోత్రుఁడు, గౌరమాంబా కేశవామాత్యుల పౌత్రుడు. రుక్మిణీ విఠ్ఠలేశ్వరమంత్రుల పుత్రుఁడు. ఈతనిచేత గురువుగాఁ బేక్కొనఁబడిన విష్ణుభట్టారకులను పంచతంత్రప్రస్తావమున, భానుకవి గూడ “నానావిధకళాప్రవీణత దిక్కుల వెలసిన భరతము విష్ణుభట్లు” అని పేర్కొనెను.

సూక్ష్మలిఖితాచార్య, రాయబయకార, తోడరమల్ల, అభినవభరతాచార్య అను నివి లక్ష్మీనారాయణుని బిరుదాంకములు.

పంచతంత్రము

సంస్కృతమున విష్ణుశర్మ బాలశిక్షార్థమై, సకలనీతిశాస్త్రములసారముమద్ధరించి మిత్రభేద, మిత్రలాభ, సంధి విగ్రహ, లబ్ధనాశ, అసంప్రేక్ష్యకారకము లను నైదుతంత్రములతోఁ బంచతంత్రమను గ్రంథమును రచించెను.

"సకలార్థశాస్త్రసారం
జగతి సమాలోక్య విష్ణుశర్మేదం
తంత్రైః పంచభి రేత
చ్చకార సుమనోహరం శాస్త్రం.”

వ్యుత్పత్తిలాభమునకై ప్రథమాభ్యసనియదుగు నొక్క శబ్దశాస్త్రము నభ్యసించుటకే పండ్రెండేళ్లు పట్టును. పిమ్మట, మన్వాది ధర్మశాస్త్రములును, కౌటిలీయాద్యర్థశాస్త్రములుకు, వాత్స్యాయానాది కామశాస్త్రములును నేర్చి ననే కాని పురుషార్థవివేకము సిద్ధింపదు. మనుష్యజీవితవ్యవధి యత్యల్పమును, అనిశ్చితమునుగాన చిరకాలపరిశ్రమసాధ్యములగు నీ శాస్త్రములను విడిచి సులభమార్గమునఁ బిన్నలకు సకలనీతిశాస్త్రసారమును దెలిపి, బోధాన్వితులను జేయుటకై విష్ణుశర్మ ఈ నీతిశాస్త్రసంగ్రహమును రచియించెను.

నాఁటినుండి యీ గ్రంథ మొకభారతదేశమునందేకాక, పరదేశభాషలయందుఁ గూడఁ బరివర్తితమై మిగులఁ బ్రయోజనము కలదగుటవలన, బహుళప్రచారము గలదయ్యెను.

ఆంధ్రీకరణపద్ధతులు

తెనుఁగునఁ జంపూరూపమునఁ బరివర్తితములైన పై మూఁడు గ్రంథములయొక్క యాంధ్రీకరణపద్ధతులను, ఒండొంటితోఁ బోల్చి యించుక పరిశీలించుట యిట నప్రస్తుతము కాదు.

క.

కోపప్రసాదగుణములు
భూపాలునియందుఁ దెలిసి బుద్ధి నధికుఁడై
చాపలవిరహితహృదయుం
డై పెంపునఁ గొలువ నధికుఁడగు సేవకుఁడున్.

—భానయ

క.

కోపప్రసాదచిహ్నము
లే పార్థివునందు భృత్యుఁ డెఱిఁగి చరించున్
దీపించి వాఁడు నృపుచే
నేపారఁగ మంతుకెక్కు నెక్కుడు కరుణన్.

—నారాయణకవి

క.

కోపప్రసాదచిత్త
వ్యాపారము లెఱిఁగి కొలిచి వర్తిల్లు భటుల్
భూపాలబాహుశాఖా
రోపితులై యుంద్రు చనవు రొక్కంబవుటన్.

—వేంకటనాథుఁడు

క.

ఒరులాడిన వాక్యమ్ముల
సరవిం బ్రతివాక్యములు రసస్థితి వొడమున్
ధరణిని బీజమ్ములు దా
మురువృష్టినిఁ బొడము కరణి నుచితమ్మగుచున్.

—భానయ

క.

ఉత్తరమునఁ బొడమెడుఁ బ్ర
త్యుత్తర ముత్తరము లేక యుత్తరమగునే!
హత్తిన సువృష్టివలనన్
విత్తులకుం బొడమినట్టి విత్తులఁ బోలెన్.

—నారాయణకవి

క.

తొడవుల క్రియ భృత్యుల నిలి
పెడి చోటుల నిలుపవలయు పృథివీశుఁడు పెం
పడర నటుగాక తక్కినఁ
దడఁబడుఁ గార్యములు దద్విధంబునఁ దలఁపన్.

—భానయ

గీ.

కనకభూషణసముచితకమ్రమౌక్తి
కమ్ము లోహానఁ గట్టిన కరణి నధిక
[విధుల] పతిహితమతులందు వెలయు భటులఁ
గూర్చు సిరికన్య పురుషులఁ గూర్పఁ జనదు.

—భానయ

క.

నరపతి భృత్యులఁ దొడవుల
నొరసి తగిననెలవులందు నునుపక యున్నన్
జరణమ్మునఁ జూడామణి
శిరమున నందియయుఁ బెట్టు చెలువము గాదే!


గీ.

కుందనము గూర్ప నందమై పొందు పడిన
పృథులరత్నమ్ము వెండిలోఁ బెట్టెనేని

రత్నమున కేమి కొఱఁతగు! రాజు బంటుఁ
దగినపనిఁ బెట్టకుండిన తగవుకాక.

—నారాయణ కవి

క.

శిరమున మకుటము, రశనా
భరణము కటి, నూపురంబు పదమునఁ బోలెన్
గురుబంధుభటుల నిల్ప, న
మరు నుత్తమమధ్యమాధమస్థానములన్.


ఆ.

అధమవృత్తి కధికు నమరించు పతి తిట్టుఁ
గుడుచు గాదె! యారకూట కటక
కలితమణికి నిందగాద, పొనర్చిన
కుత్సితుండు నిందఁ గుడుచుగాని.

—వేంకటనాథుఁడు

సీ

అరయ జాత్యంధున కద్దమ్ముఁ జూపు చం
        దమున నరణ్యరోదనము మాడ్కి
చెవిటి కేకాంతమ్ము సెప్పిన కరణిఁ గృ
        తఘ్నునితోడి మిత్రత విధమున
జడధిఁ జిన్కిన వృష్టి వడువున నూషర
        స్ధలమునఁ జల్లు బీజముల పగిది
షండుండు కన్య విచారించు పోలిక
        పందికిఁ జందనపంకమట్లు
నతి వివేక విరహితాత్ముండునగు మహీ
పతికి నాచరించు హితవు, నిష్ఫ
లంబు నీతిఘనకళాచతురుం డది
తెలియవలయు లక్ష్మ! ధీసమేత!

—భానయ

సీ.

దారుణాటవి రుదితంబుఁ జేసినయట్లు
        చేరి శవంబుఁ గైసేసినట్లు

నిర్జలంబైనచో నీరజం బిడినట్లు
        వట్టిచోటను విత్తు పెట్టినట్లు
సారమేయము తోఁక జక్క గట్టినయట్లు
        చెవిటి కేకాంతమ్ము సెప్పినట్లు
తనకఁ జీఁకునకు నద్దమ్ముఁ జూపినయట్లు
        వెలిమిడిలో నెయ్యి వ్రేల్చినట్లు
చాల నవివేకి యైనట్టి జనవరేణ్యుఁ
దగిలి కొలుచుట నిష్ఫలత్వంబు సేయు
సేనకుల కెల్లభంగి విశేషబుద్ధి
నిల వివేకంబు గలరాజుఁ గొలువవలయు.

—నారాయణకవి

సీ.

బహుళాంధకారమ్ము వాప దీపము, జీవ
        నంబుల దాఁటంగ నావ, భద్ర
దంతావళముల మదం బణంపఁగ నంకు
        శము, పన్నగముల రోషంబు చెఱుప
గారుడమంత్రంబు, ఘనతరాఘంబుల
        హరియింప ధర్మువు, నతిదరిద్ర
బాధఁ దీర్పంగ సంపద, శోకముల నోటు
        పఱుప నానాకళాప్రౌఢిమయును
బ్రేమమున నబ్జభవుఁడు కల్పించెఁగాని
చేయ నోపంగ లేఁడయ్యెఁ జెనఁటి హృదయ
దంభ మొక్కింత మాన్పంగ, ధాత్రిలోన
లాలితోదార! విఠ్ఠయలక్ష్మధీర!

—భానయ

చ.

శరనిధిఁ దాఁట నావయును సంతమసం బడఁగింప దీపమున్
వరకరిశిక్ష కంకుశము వాయువుఁ గూర్పఁగఁ దాళవృంతమున్
వెరవునఁ జేసె బ్రహ్మ పదివేలవిధంబుల మూర్ఖచిత్తవి
స్ఫురణ మడంపలేక తలపోయుచు నిప్పుడు నున్నవాఁ డహో!

—నారాయణకవి

చ.

తిమిరనివారణక్రియకు దీపము, వారిధి ని స్తరింపఁ బో
తము, చలిఁ బాప వహ్ని, రవితాపభరం బడఁగింప నాతప
త్రము, కలుషమ్ములం జెఱుప ధర్మము బాల్పడియుండుఁ గాని య
క్కమలజుఁడున్ సుఖోద్యముఁడు గాఁడు దురాత్మునిఁ జక్కఁజేయఁగన్.

—వేంకటనాథుఁడు

గీ.

సుజనులకు లేమి, గ్రహపీడ సోమసూర్యు
లకు, భుజంగేంద్రమాతంగశకునసంచ
యమున కరయంగ బంధన మాచరించు
నలఘుతరమైన విధి శక్తిఁ దెలియవశమె!


శా.

తారామార్గమునం జరించు ఖగసంతానంబు వారాశిలో
నారూఢస్థితినున్న మీనతతి దైవాధీనతన్ భూజనో
గ్రారంభంబునఁ గాదె చిక్కువడుఁ గాలాతిక్రమక్రీడ నె
వ్వారల్ నేర్తు రూపాయధైర్యబలగర్వఖ్యాతిఁ బెంపొందినన్.

—భానయ

క.

గ్రహపీడ చంద్రసూర్యుల
కహిగజవిహగముల కుగ్రమగు బంధనమున్
బహుమతికి దరిద్రత్వము
విహితంబుగఁ జేసినట్టి విధి నేమందున్.


చ.

అరుదుగఁ జేరరాని గహనాబ్ధులఁ గ్రుమ్మఱు నాఖగాండజో
త్కరములుఁ జిక్కుఁ బెల్వలలఁ, గానవు దుర్నయసచ్చరిత్రవి
స్ఫురణము దెల్వి స్థానబలమున్ మఱి యెయ్యదియౌఁ గదా! క్రియా
పరుఁ డవుచున్ గ్రహించు విధి ప్రాణుల దవ్వులఁ గేలు సాచుచున్.

—నారాయణ కవి

చ.

సరసుల నక్రముల్ మలయజంబులఁ బన్నగరాజు కేతకీ
తరువులఁ గంటకమ్ములు నిధానములన్ బహుభూతముల్ సుధా

కరునిఁ గళంకమట్లు నధికంబుగ దుర్దశ లుర్విలోన స
త్పురుషులఁ బొందుచుండుఁ దమ పూర్వకృతంబగు పాతకమ్మునన్.

—భానయ

చ.

లలితపటీరపాదపములన్ జిలువల్ గమలోజ్జ్వలజ్జల
స్థలముల గ్రాహముల్ గుణుల చక్కిఁ బరప్రతికూల దుర్జనుల్
పొలుచు నిధాన జాతముల భూతములుం గమనీయ మాక్షికా
వళి సరఘల్, సుఖంబులకు వారని విఘ్నము లేర్పడుంగదా!

—వేంకటనాథుఁడు

చ.

మలయజశీతలమ్ములగు మాటలఁ దేల్చును వచ్చినంతఁ బెం
పలవడ లేవఁ జూచును బ్రియమ్ము లొనర్చును లేతనవ్వు వె
న్నెలలు ముఖేందునం దమర నిష్ఠురదంభము మానసమ్మునన్
దలముగఁ బొల్చు దుర్జనుఁడు ధాత్రితలమ్మున లక్ష్మధీమణీ!

—భానయ

మ.

పురతఃప్రాంజలి, సాశ్రుదృగ్జలజుఁ డుత్ఫల్లాస్యుఁ డాశ్లేషణా
చరణారంభణకేళి సత్ప్రియకథాసంప్రశ్న దత్తాధికా
దరుఁడు, న్మాయి బహిర్మహామధురుఁ డంతర్గూఢహాలాహలుం
డరుదే! దుర్జనుఁ డెంత శిక్షితుఁ డపూర్వాఖర్వనాట్యౌచితిన్.

—వేంకటనాథుఁడు

ఈ యుదాహరణములవలనఁ దుల్యవిషయములపై జాలువాఱిన యీ మువ్వురు కవుల వాణీమార్గములలోని భేదములును దేటపడుచున్నవి. సరళమధురవిధురగమనములగు నీ మూఁడు కవితాప్రవాహములును నేకవిషయమున సంగమించి, గంభీరమగు నీతిశాస్త్రతీర్థమునఁ దెనుఁగుప్రజకు సులభావగాహసౌఖ్యమును బ్రసాదించినవి.

ఈమువ్వురు కవులును మూలములోని కథల నన్నింటిని యథాతథముగఁ గైకొని తెనిఁగించినవారు కారు. పెక్కు కథలను విడిచిరి. కొన్ని కథలను మూలభిన్నముగ నిర్వహించిరి. ఏయే కథలను విడిచిరో, ఏయే కథల నిర్వహణమునందు భిన్నమార్గముల నవలంబించిరో, యిచ్చట నిరూపించుట కవకాశము చాలనందున, వేంకటనాథ నారాయణ కవుల కావ్యములలో లేనిదియును భానుకవి కావ్యమునందు మాత్రమే యున్నదియునగు నొకకథఁ యిచ్చట బేర్కొనఁబడుచున్నది. అది యొక రాజకీరమునకును వేశ్యకును సంబంధించినదియై కైతవమును గైతవముచేతనే జయింపవలయునన్న యంశమును బ్రతిపాదించుచున్నది. భానుకవి గ్రంథమునఁ బ్రథమాశ్వాసాంతమున నిది కానవచ్చుచున్నది. ఈ కథ కదిరీపతి “శుకసప్తతి"లోఁ గలదు. దీనిని భానుకవి సరసముగ నిర్వహించెను.

వేంకటనాథునకు నీతివిషయ మాలంబనమాత్రము. కథావిస్తరణమునను, వర్ణనలను బ్రవేశ పెట్టుట యందును, స్వాతంత్ర్యమును వహించి యాతఁడు తన గ్రంథమునకుఁ గావ్యముద్రను హత్తించెను. బాలావబోధనఫలమై కథాచ్ఛలమునఁ బ్రవర్తిల్లిన నీతి ప్రపంచనమున, నీతని కావ్యగుణలోభము, ఉక్తి జటిలత్వమునకును, బ్రౌఢవర్ణనములకును నెడమిచ్చినది. కావ్యదృష్టిచే నివి సంభావ్యములే యగును.

నారాయణ కవి గ్రంథమును భానుకవి గ్రంథమును, గావ్యగుణములయందును బరిమాణమునందును వేంకటనాథుని కావ్యమునకుఁ గొండిక లయ్యును వివక్షితార్థమునందుఁ దాత్పర్యము గలవియై వాని ప్రయోజనమును నెరవేర్చుచున్నవి.

భానుకవి గ్రంథముకన్న నారాయణకవి గ్రంథము కథాపరిస్ఫుటత్వమునను, వర్ణనాపరిపోషమునను, సంభాషణలయందును నించుక వాసిగాఁ బొడకట్టుచున్నను, ఈ రెంటికిని శైలియందు సాదృశ్యము గలదు. ఆ సాదృశ్యము, అక్కసెల్లెండ్ర సాదృశ్యము వంటిది. నారాయణకవి గ్రంథములోని పద్యములే నాలుగు భానుకవి గ్రంథమునందును గానవచ్చుచున్నవి.

క.

పరదేశమె నిజదేశము
పరులే బాంధవులు ద్రవ్యపరిపాలునకున్
ధరణి నసాధ్యం బెయ్యది
పరమార్థం బిదియె నూత్నభరతాచార్యా!

70


క.

కులసతి రోయును జుట్ట
మ్ములు వాయుదు రొరులు కష్టపుం బలుకుల ని

మ్ములనాడఁ దొడఁగుచుందురు
కలియుగమున ద్రవ్యహీనుఁ గరణిక లక్ష్మా!

71


క.

మృతిఁ బొందిన నరునైనను
హితులెల్లను డాయుదురు మహీస్థలిలోనన్
మతిఁ దలఁపఁ బేదఁ జేరరు
బ్రతిమాలిన నొరులు నూత్నభరతాచార్యా!

72


చ.

అతిబలవంతుడైన వినయమ్మున నాతనితోడి మైత్రి సం
తతమును నిశ్చలంబగు మనమ్మునఁ జేసి నిజప్రదేశసం
గతుఁడయి పొల్చుటొప్పు, నది గాదని యొండొకదేశ మేగినన్,
ధృతిమెయిఁ బోరినన్, వినుము ధీయుత! నొచ్చు నతండు నేరమిన్.

పై మూఁడు కందములును నారాయణ కవి గ్రంథమున 2వ యాశ్వాసమున 108, 109, 110 సంఖ్యలలోను, దిగువ చంపకము తృతీయశ్వాసమున 30వ సంఖ్యలోను గనఁబడుచున్నవి. నూత్నభరతాచార్యా! కరణిక లక్ష్మా! అను సంబోధనలు మాత్రమే భానుకవివి.

ఇంత గ్రంథము వ్రాసిన కవికి నీ నాలుగు పద్యములను నితరకవి కావ్యమునుండి యెరవు తెచ్చికొనుటకుఁ గల కారణము తనకుఁ బూర్వుఁడగు నారాయణ కవియందు నీతనికున్న గౌరవభావమని యూహించుటకన్న వేఱొకటి సమంజసముగాఁ దోఁచదు. లేనిచోఁ గారణ మన్వేషింపవలసియున్నది.

శిక్షాసముచితవయస్కులగు బాలు రెల్లరును నీతిశతకములనువలెఁ గంఠస్థము చేయుటకు ననువగు సరళశైలిలో నీతిసారములను దఱచుగఁ గందములు; తేటగీతులు, నాటవెలఁదులవంటి చిన్న చిన్న పద్యములలో సూటిగ నమరించి, ధారణయోగ్యములగునటుల భానుకవి సంతరించెను. కావ్యగుణసంపాదనమునందు కన్న బాలావబోధనముగ నీతులను బొందుపఱుచుటయందే యితనికి దృష్టి యెక్కువ. ఇట్లనుటవలన నిందుఁ గావ్యగుణములు కొఱవడినవని కాదు. వానికై ప్రయత్నము లేదని భావము.

స్వచ్ఛసుందరమగు నీతిని శైలి బహుస్థలములయం దిట్లు జాలువాఱుచున్నది.

చ.

నృపతి మదోద్ధతుండయిన నేర్పున మంత్రివరుండు రాచకా
ర్యపు సరవుల్ ప్రజావితతి నంటని యాపద, మంచివేళఁ దె
ల్విపడగఁ జెప్పి వాని యవివేకము మాన్పి హితం బొనర్చినన్
విపులయశమ్ము నొందు గుణవిశ్రుత! విఠ్ఠయ లక్ష్మధీమణీ!


చ.

గురు వెలయన్ బ్రధాని, నృపకుంజరు నర్భకురీతి, నీతిశా
స్త్రరుచిరచిత్తుఁ జేసి పరరాష్ట్రసభాజనమెల్ల మెచ్చఁ బెం
పరుదుగ నుండెనేనిఁ దను నత్యధికంబగు నూత్నభోగముల్
సిరియును గీర్తి బొందు నిది సిద్ధము విఠ్ఠయ లక్ష్మధీమణీ!


ఉ.

ఆరసి చూడ రాజు సుకృతాంచితుఁడైనఁ దదీయసేవకున్
గ్రూరపుమంత్రి డాసిన నకుంఠమతిం బ్రజ తల్లడింపుచున్
జేరదు నక్రమున్న సరసింబలె, నుగ్రఫణీంద్రమున్న ధా
త్రీరుహమట్లు వానిఁ గులదీపక! విఠ్ఠయ లక్ష్మధీమణీ!

ప్రయోగవిశేషములు

లక్షణజ్ఞుఁడని పేర్కొనఁబడిన యీ కవి కావ్యమునఁ గొన్ని నీహారలేశములవంటివి, “విష్ణుశర్మను” (విష్ణుశర్మ + అను]మున్నగునదంత తత్సమపదసంధులును, “మేసచ్చట”, “అణఁగున్న" మున్నగు క్త్వార్థకసంధులును గానవచ్చుచున్నవి.

క.

"లాంగూలం బల్లార్చి
మ్రోఁగుచు”

మున్నగు పూర్ణబిందు ఖండబిందు ప్రాసములును,

క.

"ఆకఁట చేతను మీరలు
ప్రాకటఫలసంగ్రహమ్ము”

మున్నగు సబిందు నిర్బిందు ప్రాసములును గానవచ్చుచున్నవి. ఆత్మార్థమున వనుప్రయుక్తమగు “కొను” ధాతు వుండవలసిన స్థలములలోఁ "బుచ్చుక”, “చేసుక”, “నిర్మించుక” అను రూపములును, “రాజుకు”, “భూతలాధిపుకు” మున్నగు నగాగమవిరహితరూపములును గానవచ్చుచున్నవి. “దంష్ట్రించి” యను ప్రయోగము కనఁబడుచున్నది.

“వానగాలిచేత వడలెల్ల స్రుక్కెను”

ఒడలని సంస్కరించిన యతిభంగ మగును. దీనినిఁ గవి బుద్ధిపూర్వకముగనే వాఁడినట్లు తోఁచుట వలన నట్లే విడువఁబడినది.

ప్రథమాశ్వాసము 263 వ పద్యము

క.

“మృతి వొందినట్లు తెలిసిన
యతనిం బొడగాంచి వార లావల నిడి యం
చితగతిఁ జన నతిగర్విత
మనస్కుఁడై యా భవిష్యమతి యున్నంతన్.”

అను దానిలో నాలుగవచరణమునఁ బ్రాస భంగమైనది. ప్రత్యంతరము లేమిని సాధుపాఠమును బోల్ప ననువు పడలేదు.

“అతి గర్విత
మతి యగుచును నా భవిష్యమతి యున్నంతన్.”

అని చదివికొనిన సరిపడును.

గుణాభ్యర్హితమగు నీ కావ్యమున నిట్టి యల్పదోషములు పరిగణనీయములు కావు.