పంచతంత్రము (దూబగుంట నారాయణ)/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

పంచతంత్రము

సంధివిగ్రహము

క.

శ్రీపతిదృఢపదయుగళ, స్థాపితహృత్కమల సకలజలనిధిమధ్య
ద్వీపయుతరత్నగర్భా, ప్రాపితదక్షిణభుజాగ్ర బసవాధీశా.

1


వ.

ఏకాగ్రచిత్తుండవై తత్కథాసుధారసంబు వీనులం గ్రోల నవధరింపుము. సుదర్శన
క్షితీశ్వరనందనులు విష్ణుశర్మకుం బ్రణమిల్లి యనఘా మీవలన మిత్త్రభేద సుహృ
ల్లాభంబుల తెఱంగులు తేటపడ వింటి మటమీఁదఁ దృతీయం బగుసంధివిగ్రహం
బెఱింగింపు మనిన నతం డిట్లనియె.

2


చ.

అలఘువిరోధి కార్యమునకై కడుచుట్టఱికంబు చేసినన్
వలవదు నమ్మ నమ్మిన నవశ్యము నె గ్గొనరించు నిశ్చయం
బొలసి దివాంధకోటి గుహ నుండఁగ వాకిట నింగలంబుఁ గా
కులు దగిలించి యన్నిటిని గుత్సితభంగి వధించెఁ జూడుఁడీ.

3


వ.

అనినఁ దత్కథాక్రమం బెట్టి దని నృపకుమారు లడిగిన విష్ణుశర్మ యిట్లనియె.

4


ఉ.

మెండగుశాఖలన్ ధరయు మిన్నును దిక్కులు నాక్రమించి మా
ర్తండమరీచిజాలములఁ దార్కొననీయనియాకుజొంపముల్
నిండి మహాండజంబులకు నిల్కడగా నొకకొనలోన బ్ర
హ్మాండము ముట్టి యొక్కవట మద్భుతమై పెనుపొందు నెంతయున్.

5


గీ.

అనుదినంబును దనచల్లఁదనముచేత, జలద మెబ్భంగి సకలజీవులను బ్రోచుఁ
దాను నాచందమున జంతుతతి భరించుఁ, గారవము కిమ్ముగా నామహీరుహంబు.

6


ఉ.

ఆమహనీయభూరుహమునం దనిశంబు ననేకబాంధవ
స్తోమము దన్నుఁ గౌతుకముతోఁ గొలువంగను మేఘవర్ణుఁ డన్
నామము దాల్చి ప్రాభవమునం బెనుపొంది వసించు వాయస
స్వామి విపక్షపక్షికులసంహరణప్రవణాంతరంగుఁడై.

7


వ.

ఇట్లు వాయసనివాసం బైనయవ్వటముహీరుహంబున కనతిదూరంబున.

8


ఉ.

వేఱొకవంకఁ గొండగుహ వేశ్మముఁ గాఁగ నులూకభర్త దన్
మీఱినయట్టిమంత్రులగమిం గలవాఁ డుపమర్దనాముఁ డా

యీఱమునందు రేలు దమయిచ్చల మేసి దివంబు లాగుహన్
దూఱి వసించుచుండి యొకదుష్టత యాత్మకు నింపు పెంపఁగన్.

9


వ.

అతం డొక్కనాఁటినిశాసమయంబునఁ దనకుం గలమంత్రులం బిలిచి వారలతో
నిట్లనియె.

10


క.

మహిఁ గాకులకును మనకును, సహజం బగు వైర మగుటఁ జంపఁగఁ దగు నా
గ్రహ మధిక మెపుడు నాకుం, బ్రహరింతు నిశాంధవృత్తిఁ బరఁగెడువానిన్.

11


క.

మీరును మీమీసేనలఁ, దోరముగాఁ గూర్చుకొనుచుఁ దోడ్తెం డనినన్
వా రట్ల సేయ ఘూకము, లారాతిరి నడుచుచుండి యన్నియుఁ దమలోన్.

12


లయగ్రాహి.

రండు వెస దండు వెడలుం డొకఁడు నుండకని యొండొరులఁ జేరుచును మెండుకొని దిక్కుల్
నిండుకొని ఘూకము లఖండగతిఁ గూడుకొని దండధరకింకరులతండములమాడ్కిన్
జండతరతీక్ష్ణఘనతుండహతిఁ గాకములపిండుపయి గిట్టి కడిఖండలుగ మోఁదన్
గొండికలు పెద్ద లనకుండ నవి యన్నియును భండనపునేలఁ బడి యుండవలె నంచున్.

13


క.

చెలఁగుచును దివాభీతం, బులు వడి నిబ్భంగి నడవఁ బొడగని విభుఁ డ
బ్బలములతో నీరీతిని, వలనుగఁ గదనమున నుండవలయుం జుండీ.

14


సీ.

అనుచు నయ్యుపమర్దుఁ డర్ధరాత్రపువేళఁ, గదలుచుఁ గలయులూకములఁ గూర్చి
కొని మంత్రులును దాను గొదగొని పఱతెంచి, యరికట్టుకొని మఱ్ఱితిరుగువాఱఁ
గావలి పదిలంబుగా నసంఖ్యల నిల్పి, తాను గొన్నింటితో లోను జొచ్చి
యధికనిద్రాసక్తి నంది మే నెఱుఁగక, కాకంబు లున్నట్టికందు వెఱిఁగి


గీ.

యుఱికి కొన్నిటికంఠముల్ నఱికివైచి, యేచి కొన్నిటివక్షంబు లూచి వైచి
కదిసి కొన్నిటిపార్శ్వముల్ చదిపివైచి, గ్రుచ్చి కొన్నిటికడుపులు వ్రచ్చివైచి.

15


వ.

మఱియు ననేకప్రకారంబుల నయ్యులూకంబులు కాకంబులకు మహాప్రళయం బాపా
దించి ము న్నత్యంతకోలాహలబహుళం బైనవటగర్భంబు నిశ్శబ్దం బై యున్నం గనుం
గొని పగర ననవశేషంబుగా సంహరించితి మని సంతసిల్లి తమయంతపట్టునుం గూడు
కొని యులూకంబులు నిజనివాసంబునకుం జనియెఁ దదనంతరంబ.

16


గీ.

అట్టియుత్పాతకాలంబునందు మేఘ, వర్ణుఁ డొకతొఱ్ఱఁ దనమేను వైచి యుండఁ
దెల్లవాఱంగ నాత్మీయు లెల్లఁ బడుట, కాత్మఁ దలపోసి చింతించునవసరమున.

17


క.

అతనికిఁ గులక్రమాగత, మతియుతు లగుమంత్రివరులు మాన్యులు గల ర
ద్భుతచరితు లేవు రప్పటి, గతికిం బ్రాణములతోడఁ గడచినవారల్.

18

వ.

వార లెవ్వ రంటేని యుద్దీపియు సందీపియు నాదీపియుఁ బ్రోద్దీపియుఁ జిరంజీవి
యు ననువా రామంత్రివరులు కదిపిన నాలోకించి దీనాననుం డగుచు మేఘవర్ణుం
డిట్లనియె.

19


గీ.

ఏను లేనిమీర లెందును గొఱగారు, మీరు లేని నేను మృతునియట్ల
కాన నేను మీరుఁ గలిగితి మీవేళ, భాగ్యమహిమఁ బగరబారిఁ బడక.

20


క.

మీబుద్ధిబలముప్రాపున, నాబాహుపరాక్రమమున నడచితిమి తుదిన్
గూబలచే ని ట్లైతిమి, ద్రాబలమై మీఁదికార్యతంత్రము చెపుఁడీ.

21


వ.

అనిన మేఘవర్ణునకు నుద్దీపి యనునమాత్యుం డిట్లనియె.

22


సీ.

బలవద్విరోధికిఁ దొలఁగి యవ్వలనొండు, బలవంతుతోఁ గూడి నిలుచు టొండె
స్థల ముజ్జగించి యసాధ్యమార్గంబున, రెండుచో నవ్వల నుండు టొండెఁ
గాక దూరంబుగా గడిభూములకుఁ బోయి, యుడుకారి యచ్చట నుండు టొండెఁ
కార్యంబు లని నాకుఁ గానవచ్చినభంగిఁ, జెప్పితి నింక నీచి త్త మనిన


గీ.

నతనిపలుకులు విన్నవాఁడై యతండు, వరుస సందీపి యనియెడివానిఁ జూచి
నీతలం పెట్టి దన్నను నెమ్మి నతఁడు, వినయశీలుఁడై మేఘవర్ణునకు ననియె.

23


గీ.

తొలుత నుద్దీపి దేవరతోడ నిపుడు, సరవిఁ జెప్పినమూఁడుపక్షములు నమరు
నందు విడు ముత్తమంబును నదియు మిగుల, వేగపడిపోవుకార్యంబు వెరవు గాదు.

24


క.

తనయున్నచోట నుండఁగ, ననుకూలతఁ గార్యసిద్ధు లగుఁ దగినక్రియన్
విను మేఁకపొదుగుచన్నుల, జనితం బగుపాలు గళముచన్నులఁ గలవే.

25


చ.

నెలవున నప్రమత్తమతి నిల్చినరాజు జయంబు చేకొనున్
వల దనుమాన మేమియును శ్వానము పెంచినయింట నుండ న
వ్వలనికి నెందఱే నరుగ వారల నందఱ మాటమాత్రలో
గెలుచు నసాధ్య మెద్ది పరికింపఁగ స్థానబలంబు పెంపునన్.

26


గీ.

కాన నెలవు విడువఁగా రాదు విడువక, పోక యున్న రాకపోక యైన
దేశకాలబలము దెలియుచుండినఁ గార్య, సిద్ధి నిజము వేయుఁ జెప్ప నేల.

27


వ.

అనుటయు.

28


క.

విని యాదీపిం గనుఁగొని, యనుకూలం బైనకార్య మడుగుటయును నా
మనమునఁ దోఁచినయర్థము, వినిపించెద ననుచు నాత్మవిభునకు ననియెన్.

29


చ.

అతిబలవంతుఁ డైన వినయంబున వారలతోడిమైత్త్రి సం
తతమును నిశ్చలం బగుమనంబునఁ జేసి నిజప్రదేశసం

గతుఁ డయి పొల్చు టొప్పు నది గాదని యొండొకదేశ మేఁగినన్
ధృతిమెయిఁ బోరిన న్వినుము ధీయుత నొచ్చు నతండు నేరమిన్.

30


క.

అటు గాన నధికబలములఁ, దటుకున మన మిచటఁ గూర్చి తగుసంధియ సం
ఘటితముగఁ జేసికొని యీ, వటదుర్గమునందు నిలువవలయుం జూడన్.

31


వ.

అని చెప్పుటయును.

32


క.

అమ్మాటలు వెడయూఁకొని, క్రమ్మఱఁ బ్రోద్దీపివంకఁ గనుఁగొని తగ నీ
నెమ్మనమునఁ గలకార్యము, సమ్మతితోఁ జెప్పుమా నిజంబుగ ననినన్.

33


వ.

అతం డవ్వాయసపతి కిట్లనియె.

34


గీ.

రాత్రిగాని కానరా దులూకములకుఁ, బగలుగాని కానఁబడదు మనకు
రాయబారి సంధిచేయుటకై పోవఁ, గాల మెద్ది పొందు గాదు దలఁప.

35


క.

అదిగాన రాత్రిఁ గానక, కదలక నిద్రించుమనలఁ శౌర్యం బెసఁగన్
జదియంగ మోఁది పఱచిరి, వదలక యయ్యనువు దెలియవలదా మనమున్.

36


గీ.

పగలు గానకున్న పగతుర నరికట్టి, తెగ వధింప కేల పగ యడంగు
నాకుఁ జూడ ననియె నల్వురు నీభంగిఁ, బలుక నాలకించి పక్షివిభుఁడు.

37


వ.

సకలనయశాస్త్రతత్వజ్ఞుం డైనచిరంజీవి యనునమాత్యుం గనుంగొని యతనికిం బ్రియ
పూర్వకంబుగా నిట్లనియె.

38


క.

ఓతండ్రి నీదుబుద్ధి, ద్యోతంబున రాజ్య మేను దుది ముట్టంగాఁ
బ్రీతిన్ జేసితి బంధు, వ్రాతముతోఁ గూడ నధిక రాజసవృత్తిన్.

39


వ.

కావున.

40


క.

ఇప్పటికిఁ జేయఁ దగియెడు, నప్పనికిం దెరువు పెట్ట నర్హుఁడ వనినన్
జెప్పఁదొడంగె నిజేశ్వరుఁ, గప్పినశోకతమ ముడుప ఖద్యోతనుఁడై.

41


క.

వీరిందఱుఁ బరమాప్తులు, నేరుపు గలకార్యమతులు నీ కెఱిఁగింపన్
వీరలకంటెను నెఱిఁగెడు, వా రెవ్వరు నీతిశాస్త్రవాసన నెందున్.

42


క.

ఐనను నాయెఱిఁగినపని, యే నించుక విన్నవింతు నిందఱు నాప్తుల్
గా నమ్మి మెలఁగెనేనియు, మానవపతి కెందు గుప్తమంత్రము వలయున్.

43


గీ.

మంత్ర మాప్తపరంపర మ్రందిపోవు, నఖిలకార్యంబులకు విఘ్న మావహిల్లు
విఘ్నమునఁ జేసి కార్యంబు వృద్ధిఁబొంద, దట్లు గావున మంత్రంబు నరయవలయు.

44


వ.

కావున మంత్రరక్షయ భూవల్లభులకుఁ బ్రధానకార్యం బని కార్యాకార్యజ్ఞుం డైన
చిరంజీవి యిట్లనియె సంధివిగ్రహయానాసనద్వైధీభావసమాశ్రయంబు
షాడ్గుణ్యంబులు నెఱింగి కర్మప్రారంభపురుషద్రవ్యసంపత్తి దేశకాలవిభాగవిని

పాతప్రతీకారకార్యసిద్ధు లనుపంచాంగమంత్రంబులం బ్రవీణుండై సామదానభేదదం
డంబు లనుచతురుపాయప్రయోగసమయంబులు నెఱిఁగి పభుమంత్రోత్సాహశక్తి
త్రయసంపన్నుండై తత్తదుచితానుషానంబులం బ్రవర్తింపవలయుఁ గావున మనకులం
బు గూడకుండుటంజేసి యుద్ధంబునకు సామర్థ్యంబు లేదు కాలంబునుంగాదు
దనశక్తియుఁ బరశక్తియు దేశకాలంబులును విచారించి బకప్రకారం బదను గాచి
యుండునది పంచాస్యంబునుంబోలె నాసన్నం బైనకార్యంబునప్పు డహితం నా
హుతి గొనునది యని చెప్పి మఱియుం జిరంజీవి యిట్లనియె.

45


క.

తనబలము నెదిరిబలమును, మనమునఁ జింతింప కరుల మర్దించుటకై
గొనకొనినవాని కొప్పమి, జనియించుట తప్ప దండ్రు శక్రుని కైనన్.

46


వ.

మఱియును.

47


చ.

అతులితసత్ప్రతాపమహిమాస్పదుఁ డైన విరోధి దూరసం
స్థితుఁ డగునేనిఁ దద్విపులతేజము తా నడఁగించు నల్పుఁ డా
యతశితశస్త్రహస్తుఁ డయి యౌదలదగ్గఱ నుండెనేనియున్
జతురుఁడు గాఁడు వైరిజనసంహరణంబునకున్ నిజంబుగన్.

48


చ.

ఒనరఁగ బుద్ధిమంతుఁ డయి యోరుపు గల్గి యొకప్డు వేళ వ
చ్చినయెడఁ బౌరుషంబుఁ దగఁ జేయఁగ నేర్చి పరాత్మదోషముల్
గనుఁగొనియుండి శాత్రవు నొకానొకనాఁడును విశ్వసింపఁగా
జనడు వివేకియై నరుఁడు సారమతిన్ బ్రతుకం దలంచినన్.

49


చ.

వదల కుపాయవంతుఁ డగువానికి నెన్నఁడు రాగశక్తిమైఁ
బదనికి రానిబాలఁ దలపట్టుక యీడిచి తెచ్చినట్లుగా
కొదుగక చొచ్చి శ్రీసతి మహోన్నతిమైఁ దనుదాన వచ్చి త
త్సదనమునందు నిల్చుఁ బ్రమదస్థితిఁ బాయక యెల్లకాలమున్.

50


క.

వరమంత్రశక్తివశమై, గురురాజ్యశ్రీభుజంగకుటిలవిహార
స్ఫురణంబు దొఱఁగి సతతము, నరపతులకు భోగదర్శనం బొనరించున్.

51


క.

ఖలులకు మందులకును గ్రో, ధులకును లోభులకు గర్వితులకును నతిమ
త్తులకును గామాతురులకు, సులభంబే దండనీతి శోధింపంగన్.

52


ఉ.

నాయము దప్ప కెంతయు మనంబున గర్వము లేక కార్యముల్
సేయునెడన్ విచారమతిఁ జేయుచు నేర్పును నొప్పుసద్విధో
పాయము బుద్ధియుం గలనృపాలవరేణ్యులచేత సాధ్యమై
పాయక దండనీతి సులభస్ఫురణన్ ధరియింపఁ బొందగున్.

53

వ.

అని చెప్పి చిరంజీవియు నిట్లనియె మనకు నియ్యెడం గయ్యంబునఁ గాలంబు గా
దెట్లనిన.

54


క.

బలసంపద లేకుండిన, వలయు ధనము మంత్రనిధియు వసుధాపతికిన్
బలుపగర నోర్చు ధనమున, విలసితమంత్రంబుచేత విశ్వము గెలుచున్.

55


క.

విను ప్రాణము వంచించిన, జనులకుఁ బొందంగ రానిసంపద యర్థిం
దనుదాన వచ్చి యుండును, వినుత ఘనోద్యోగపరునివేశమునందున్.

56


గీ.

మంచిగుణములు గలిగినమనుజునందు, ఫలము గలుగుట కనుమానపడఁగ వలదు
వర్తనంబున ననువైనవాని కధిక, సమధికైశ్వర్యసంప్రాప్తి సంభవించు.

57


క.

శూరులు నుదారశుద్ధులు, సారమతులు నైనబుధులసాహాయ్యమునన్
భూరమణుం డున్నతుఁ డగు, నారయ నృపుఁ డగుట సత్సహాయతఁ గాదే.

58


చ.

వల నగురాజ్యలక్ష్మి వరవంశపరంపర వచ్చినట్టు ని
ర్మలగుణు నైన రూపజితమన్మథు నైన మనీషి నైనఁ గా
వలె నని తా వరింప దతివాంఛ వరించు రహస్యవంతుఁడై
యలవడి సత్సహాయయుతుఁ డైననృపో త్తము నెల్లభంగులన్.

59


గీ.

ధరణి సత్సహాయవిరహితునకుఁ గార్య, మొక్కఁ డైనఁ జేయ నొరపు గాదు
పక్షహీన మైనపక్షికి నాకాశ, గమన మనువుపడనికరణి నధిప.

60


ఉ.

ఏలిక యాత్మబుద్ధిఁ దన కించుక దోఁపనికార్య మాప్తుఁడై
చాలవివేకి యైనఘనుసన్నిధి నూహ యొనర్ప నేర్చినం
బోలఁగ నెల్లభంగులను బొం దగుచుండు విఘాతదూరతన్
మాలిమిచేత నోడ జతనంబుగఁ దీరము చేరుచందమై.

61


చ.

సతతము నాయమున్ వ్యయము సన్మతితోడ నెఱింగి గుప్తమం
త్రతయును గూఢచారపరిరక్షయుఁ జేసినరాజు ప్రాణిసం
హతి కహితంబు పల్కక దయాపరుఁ డైనఁ జతుస్సముద్రము
ద్రితనిఖిలోర్వి యంతయు నతిస్థిరతన్ భజియించువాఁ డగున్.

62


క.

చెడు నాత్మశక్తి యెఱుఁగక, కడుగర్వముతోడఁ గడిఁదికార్యము చేయన్
దొడరి యవిచారమూఢుం, డడవిన్ గూపమునఁ బడినయంధుఁడువోలెన్.

63


వ.

కావునఁ గయ్యం బియ్యెడం కార్యంబు గా దులూకంబులకును మనకును సహజవైరం
బుకతంబున సంధియుం బొసంగ నేర దనిన విని మేఘవర్ణుం డిట్లనియె.

64


క.

మన కయ్యులూకములతో, ననఘా సహజంబు వైర మగు టేకతనన్
జనియించె ననిన నతఁ డి, ట్లను వాగ్దోషమున వైర మయ్యెను వినుమా.

65

గీ.

తొల్లి యొకగార్దభము పులితోలుతోడఁ, గప్పఁబడుటను వేసవికాల మెల్లఁ
బైరు గడవార మేయుచు బ్రతికి యుండి, యంత వార్దోషమున హతమయ్యెఁ గాదె.

66


వ.

అనిన నవ్విధం బెట్లని మేఘవర్ణుం డడిగినఁ జిరంజీవి యిట్లనియె.

67


సీ.

ఒకయూర నొకచాకి యొక్కగాడిదఁ దెచ్చి, దాని లావుగ మేపఁ దలఁపు పుట్టి
పులితోలు పైఁ గప్పి పొసఁగఁ బండినచేలు, మేయ రాత్రులు దోల మేసి తిరుగఁ
బులి యనుబుద్ధి నాపొలముకావలివారు, దూరంబునను జూచి తొలఁగి పఱవఁ
బై రెల్ల వృథ యైనఁ బరికించి యొకనాఁడు, విసివి యొక్కరుఁడు సాహసముతోడ


గీ.

గడఁగి దూరంబునందునఁ గంబళంబుఁ, గప్పికొని వింట శర మిడి కాచి యుండ
నాఖరము వచ్చి యాతని నచటఁ గాంచి, పెంటిగాడిద యని చాలఁబృథురవమున.

68


వ.

చేరం జూచి దానికయి పొంచినయతండు.

69


క.

పులి యని పాఱితి నక్కట, బలుగాడిద యెలుఁగుకతన బై లయ్యె నిఁకన్
దొలఁగ భయం బేలని యొక, యలఘుప్రదరమున దానియసువులఁ బాపెన్.

70


వ.

కావునఁ గాకులకు నులూకంబులకు వాగ్దోషంబునంజేసి ప్రబలవిరోధంబు సంభవించె
నవ్విధంబు విను మని యిట్లనియె.

71


క.

ఈక్షితిలోనం గలిగిన, పక్షులు దమలోనఁ గూడి ప్రభువై మనలన్
రక్షింపఁగవలె నని నిజ, పక్షమున నులూకవిభునిఁ బట్టముగట్టన్.

72


వ.

ఉద్యోగించుసమయంబునం దొకవృద్ధకాకం బాపక్షిసమూహంబుకడకుం జనుదెంచిన
నవి తమయుద్యోగించినకార్యం బాకాకంబున కెఱింగించిన నది యిట్లనియె.

73


ఉ.

క్రూరము ఘోరదృష్టియు విరూపము నీచము నైజకోపదు
ర్వారము నై దివాంధ మన వర్తిలుఘూకముఁ బక్షిరాజుఁగా
మీరలు సేయ నేమిటికి మీఁదట దీని నెపంబునన్ ముదం
బారఁగ రాజ్యరక్ష మన కబ్బడుదు సుం డెడ రైనవేళలన్.

74


గీ.

రాజు లేక యున్న రా జున్నయట్ల కా, రాజునెపము చెప్పి బ్రతుకవచ్చుఁ
జంద్రునెపము వెట్టి శశకంబు లొకచోట, నెడరు వాసి సుఖముఁ బడసెఁ గాదె.

75


వ.

అనిన విని పక్షు లావృత్తాంతం బంతయు నెఱిఁగింపు మని యడిగిన వావృద్ధకాకం
బిట్లనియె.

76


సీ.

ఏకొండ చూచిన నెరగలి వడిఁ బర్వి, పొగ లేనియనలంబు లెగయుచుండ
నేచెట్టు చూచిన నెలమిఁ బచ్చనియాకు, వెదక మందున కైనఁ జిదుమలేక
యేనది చూచిన నెల్లెడ జల మింక, విసరెడిగాలితో నిసుము చల్ల
నేదిక్కు చూచిన నెండమావులపజ్జ, మృగములు జల మంచుఁ దగిలి పఱవ

గీ.

సలిలతత్వంబు వనరుహాసనుఁడు మాన్పఁ, బోలునో కాక యింతలోఁ బొడ వడంగ
వనఁగ సకలజంతుభయావహంబు గాఁగ, దూషితముగ ననావృష్టిదోష మయ్యె.

77


వ.

ఇవ్విధంబునం బండ్రెండుసంవత్సరంబు లనావృష్టిదోష మైన నొక్కయెడ మహాగ
హనంబునం గలగజంబు లన్నియుం గూడుకొని తమకు నేలిక యైన గజయూథనా
ధునిం గనుంగొని యిట్లనియెఁ బల్వలోదకంబు లల్పమృగంబులకు నొడలు దడుపం
జాలుఁ గాక ఖరకరకిరణంబులం దపియించుమాకుం దగినయుదకంబులు లే వని మఱి
యు నిట్లనియె.

78


గీ.

వెన్ను మునుఁగంగ నుదకంబువిరివి గలుగు, వారిజాకర మెందైన మాకు వలయు
నల్పజలముల మాదాహ మడఁగనేర, దేమి సేయుదు మనిన గజేంద్రుఁ డనియె.

79


క.

దిక్కులకుఁ గొంద ఱరుగుం, డక్కడ జల మరసి యిచటి కరుదేరంగా
జొక్క మగుచోటి కరుగుద, మిక్కీడున కేల వెఱవ నేఁ గలుగంగన్.

80


వ.

అని యగ్గజేంద్రుఁ డగ్గజంబులలోన నధికజవసత్వంబులు గలయేనుంగులఁ గొన్నిటిని
దిక్కులకు నీ రారయం బంచిన నవియునుం బోయి జలం బెందునుం గానక తిరుగ
నొక్కమహానాగం బాగజేంద్రునిఁ గదియం జని యిట్లనియె.

81


ఉ.

ఇన్నిదినంబు లయ్యును గజేశ్వర చంద్రసరోవరంబు నా
నెన్నిక కెక్కినట్టికొల నేర్పడి యున్నది గాన మైతి మీ
యున్నవనంబుపొంతఁ గమలోత్పలకైరవహల్లకాదిచం
చన్నవపుష్పసౌరభవిశంకటశీతపయఃప్రపూర్ణమై.

82


చ.

కురువకతింత్రిణీలికుచకోమలతాలతమాలసాలకే
సరకదళీలవంగపనసక్రముకార్జుననారికేళని
ర్జరకనకామ్రవంశముఖచారుమహీరుహపంక్తిచేత సు
స్థిరతర మైనయక్కొలనితీరము సొంపు వహించు నెంతయున్.

83


గీ.

జమ్ము ముమ్మర మశ్వత్థసమితి యమిత, మబ్జములు కేతకంబులు నపరిమితము
లధిప మన కుండ మంచిచో టబ్బె నేఁడు, వేగ విచ్చేయు మన మదద్విరదవిభుఁడు.

84


వ.

నితాంతసంతుష్టాంతరంగుం డగుచు నచ్చోటికిఁ గదలి పోవ నుత్సహించుచుండునంత
ట నీ రారయం బోయినగజంబులుఁ జనుదెంచి నిలిచి చంద్రసరోవరంబుం గాంచి
వచ్చితి మని విన్నవించిన శతసహస్రసంఖ్యలు గల గజంబులఁ గూడుకొని సంరంభవి
జృంభితుండై కదలునట్టిగమనవేగంబున.

85


సీ.

పాదఘట్టన నేల భార మగ్గల మైన, మ్రగ్గి దిగ్గజములు మ్రొగ్గి పడఁగ
నురువడిఁ బాఱుచో నెరసినతరు లెల్లఁ, దిట్టలై మహిఁ జాఁపకట్టు వడఁగ

ఘీంకారరవము సంకీర్ణ మై పర్వఁగ, దండుకొండలు ప్రతిధ్వనుల నీనఁ
గర్ణజానిలమున గగనభాగమునకుఁ, దేలి మేఘంబులు దూలి పోవ


గీ.

దేవసైన్యంబులకు నోడి దితిజకులము, నిలువఁ జో టెచ్చటను లేక జలధి చొరఁగఁ
బాఱుతెంచినచందమై భద్రకరులు, త్వరితగమనంబునను సరోవరము చేరి.

86


గీ.

అట్టి సంరంభగమనంబునందు నందుఁ, గలశశకంబులు తత్పాదఘట్టనమున
మంది మృతిఁ బొందుటయుఁ జింత నొంది శశక, నాయకుండు శిలీముఖనాముఁ డొకఁడు.

87


వ.

తా నరణ్యంబునం గలశశకంబుల కెల్లను రాజు గావునఁ దనబంధుప్రీతంబు మృతిఁ
బొందుటకుఁ బరితప్తాంతఃకరణుం డగుచుఁ జింతించుసమయంబున నతనియమాత్యులు
కొందఱు దైవయోగంబున శేషించినవార లచ్చటికిం జనుదెంచి యభివందనంబు
లాచరించినం గన్నీ రొలుక వారలం గనుంగొని శిలీముఖుం డిట్లనియె.

88


చ.

వఱపు జనింప నేల యనివారణ వారణపంక్తు లింతగా
బఱవఁగ నేల యిట్లు గలబాంధవు లందఱు గాలిధూళిగా
నుఱక విధాత యేమిటికి నుండఁగఁ జేసెను నాదుజీవనం
బెఱుఁగఁగ నేర నైతి నుతిహీనుల కెక్కడి వేశుభంబులున్.

89


వ.

అని యిట్లు చింతాక్రాంతుండై యున్నతనయేలికం జూచి బహువృత్తాంశవిదుం
డగు విజయుం డనునమాత్యుం డిట్లనియె.

90


ఉ.

చచ్చినవారికిన్ వగవఁ జయ్యన వారలు లేచి క్రమ్మఱన్
వచ్చుట లేమి దెల్ల మిఁక వారణముల్ మగుడంగ నింతగా
వచ్చిన నున్నవారము నవశ్యముఁ జత్తుము గాన దీనికిన్
జెచ్చెరఁ జింత సేయుము విశేషమతిం బ్రతుకం దలంచినన్.

91


వ.

అనినం దెలి వొందినచిత్తంబుతోడ సుముఖుం డగుచు శిలీముఖుండు దనయమాత్యుం
డగువిజయున కిట్లనియె.

92


క.

గిరిగహ్వరముల కొండెను, ధరణీవివరముల కొండెఁ దడయక చని య
య్యిరవుల నొరుగుద మనినన్, వెర వగునది మనకు ననుచు విజయుం డనియెన్.

93


గీ.

ఏమఱుటఁ జేసి యిటువంటియెడరు పుట్టె, మోసపోయితి మెఱిఁగిన మోస గలదె
నెలవు విడువక నిలువంగవలయుఁ గాక, పందతనమునఁ బాఱు టేపౌరుషంబు.

94


వ.

అనిన శిలీముఖుం డిట్లనియె.

95


గీ.

నిన్నుఁ గడచినట్టినిజ మైనహితుఁడును, నీతియుతుఁడుఁ గలఁడె నిర్మలాత్మ
జయము నాకుఁ గలుగు సమధికోపాయంబు, తలఁపు నీవు నాకుఁ గలఫలంబు.

96


వ.

అనుమాటకు విజయుం డిట్లనియె.

97

క.

దేవ నను భారపెట్టితి, గావున నాసామజములకడకుం జని యా
త్రోవ మనమీఁద రాకయె, పోవునుపాయంబు చేసి పుచ్చెదఁ గడఁకన్.

98


వ.

అని యతం డాప్రొద్ద కదలి పోయి చంద్రసరోవరతీరంబున నున్న యగ్గజయూథం
బులం బొడగని దనమనంబున.

99


సీ.

చేరినఁ జేసాచి చెనకెడుగతి దంతి, నిజకరంబునఁ బట్టి నేలఁ గలపు
నొక్కింత మూర్కొన్న యోజమై, నురగంబు గదియఁ బోయినమాత్రఁ గఱచి చంపు
మేలమాడెడువాఁడుపోలె వినోదంబు, వెలయ నవ్వుచు మహీవిభుఁడు చెఱుచు
నత్యంతవినయసాంగత్యంబు మెఱయంగఁ, గూడి దుర్మార్గుండు గీడు సేయుఁ


గీ.

గాన నాకు వీనిఁ గదియంగ నేలంచుఁ, జెంత నున్న శైలశిఖర మెక్కి
నిక్కి యోగజేంద్ర నీకు సేమమె యన్నఁ, దొండ మెత్తి చూచెఁ గొండమీఁదు.

100


వ.

చూచి సూక్ష్మరూపంబున నున్న యాచెవులపోతుం గనుంగొని గజేంద్రుం డోరీ
నీ వెవ్వండ వెచ్చటనుండి యిచ్చటికిం జనుదెంచితి వనిన నతఁడు నా పేరు విజయుం
డని యిట్లనియె.

101


గీ.

ఓషధులఁ బ్రోచి జీవుల నుద్ధరించు, కైరవాప్తునిదూత నిక్కడకు నన్ను
నతఁడు పుత్తేర వచ్చితి ననినఁ గజము, కార్య మే మిచ్చటను మమ్ముఁ గనుట కనిన.

102


వ.

అగ్గజశ్రేష్ఠునకు విజయుం డిట్లనియె.

103


చ.

పెఱికినయాయుధంబు గొని భీతిలఁగాఁ బొడువంగఁ జూచినన్
వెఱవక దూత స్వామిహితనిశ్చితకార్యము పల్కు టొప్పు న
త్తెఱఁగున వాఁడు రాజునకుఁ దెల్లమి పుత్త్రసమానుఁ డట్లకా
నెఱుఁగుము నన్నుఁ జంద్రునకు నిష్టతనూభవుఁగా మనంబునన్.

104


వ.

కావున నేను నిజంబు పల్కెద నాకర్ణింపుము.

105


క.

ఎదిరితనసత్త్వ మెఱుఁగక, మదమున వైరమ్ము గొన్న మతిహీనునకుం
దుదిఁ గీడు పొందకుండునె, వదలక యివ్విధముఁ దెలియవలయున్ మీకున్.

106


క.

ఈకొలను చంద్రుపేరన్, బ్రాకటముగ మున్ను కలిగె బహుపక్షికుల
వ్యాకీర్ణతటసమీపా, నోకహసురసిద్ధసాధ్యనుతిపాత్రం బై.

107


క.

ఇందులకుం గావలిగాఁ, బొందుగ మ మ్మునిచినాఁడు బుధజనకుఁడు మ
మ్మిందఱను మట్టి చంపితి, రిందునితో వైరపడఁగ నెంతటివారల్.

108


క.

శశికి వంశ్యుల మగుటను, శశకము లనఁ బరఁగి ధాత్రిఁ జరియింతుము క
ర్కశహృదయులార మీకును, వశ మగునే నిలువ ననిన వారణ మనియెన్.

109


క.

ఈతెఱఁ గెఱుఁగక వచ్చితి, మీతెరువున నడవ మింక నేఁగెద మిదె మీ
రీత ప్పోర్వఁగఁ దగు నన, మాతంగమునకు శశము మఱియుం బలికెన్.

110

క.

ఈయపరాధంబున కీ, రేయి కళానిధికి మ్రొక్కి ప్రియమున ననుపన్
బోయెదవుగాక యనుటయు, నాయేనుఁగు నీయకొనియె నౌఁగా కనుచున్.

111


ఉ.

అంతటఁ బ్రొద్దు గ్రుంకుటయు నాశశకంబు గజేంద్ర రోహిణీ
కాంతునికొల్వు చూచుటకుఁగాఁ దోడి తెచ్చితిఁ జూడు మంచు ని
శ్చింతతఁ జేరి దంతికి శశిప్రతిబింబముఁ జూప మ్రొక్కుచో
రంతులు చిత్తగింపు మపరాధము సైపు మటంచు వేడుచున్.

112


క.

ఆచెవులపోతు కరిపతిఁ జూచి శశాంకుండు కరుణసొంపున నిన్నున్
గాచి విడిచి యనిపెను సం, లోచింపక వేగఁ బొమ్ము కోరినయెడకున్.

113


క.

వచ్చినతెరువునఁ బోయిన, వచ్చుఁ జుమీ చేటు కాన వచ్చినపని నే
మచ్చికఁ జెప్పితి ననుటయు, నెచ్చరికన్ గరివిభుండు నెఱుఁగుదు ననుచున్.

114


క.

గజయూథంబులు గొలువఁగ, గజనాథుఁడు గదలెఁ తీవ్రగమనంబున న
వ్విజయముఁ గైకొని చెలఁగుచు, విజయుం డనుశశక మేఁగె విభుఁ డున్నెడకున్.

115


వ.

చనుదెంచి తత్పాదంబులకుం బ్రణామం బాచరించి దేవా గజయూథంబులు మన
మీఁద రాక యుండునట్టియుపాయంబును సరోవరతీరంబున నిలువనేరక దూరం
బరుగునట్టితెఱంగునుం జేసి వచ్చితి నెలవు దొలంగక సుఖస్థితి నుండుం డనిన నవ్విజ
యుం గౌఁగిలించుకొని ప్రీతుండై బహువిధంబులఁ బ్రశంసింపుచు నచ్చోటు కద
లక శిలీముఖుండు సుఖంబున నుండె.

116


క.

కావున నీయల్పుఁడు ప్రజ, నేవెరవునఁ బ్రోచు టరిది హీనునిఁ బతిఁగా
సేవింప శశ కపింజల, భావంబునఁ జేటు గల్గుఁ బరమార్థ మిలన్.

117


వ.

అనినఁ బక్షులు మాకు నక్కథ వినవలయుఁ జెప్పు మనిన వృద్ధకాకం బిట్లనియె.

118


చ.

ఒక పెనుమ్రానికొమ్మతుద నొప్పగుగూఁట వసింతు నేను దా
నికి నట క్రిందితొఱ్ఱఁ దగ నిల్చి కపింజల ముండు నున్నచో
నకుటిలమిత్త్రభావమున నర్మిలి నాహృదయంబు దాని పైఁ
బ్రకటము గాఁగ నిద్దఱము పాయక యుండుదు మెల్లకాలమున్.

119


గీ.

అట్లు మెలఁగంగ నొక్కనాఁ డాఖగంబు, పొసఁగ మేఁతకునై పోయి మసలుటయును
గొందలంబున వెదకంగఁ గోరి పోవ, వెనుక నాపక్షి యుండెడునునికిపట్టు.

120


వ.

దీర్ఘకర్ణుం డనుపేరం బరఁగుశశకంబు చొచ్చికొనియున్నసమయంబున నాపక్షి
యుం జనుదెంచి యిట్లనియె నే నుదరపోషణార్థం బరిగి వచ్చునంతకు నాయిల్లు
చొరఁ దగ వగునే వెడలు మనిన దీర్ఘకర్ణుం డిట్లనియె.

121

గీ.

విడిచిపోయినయింటికిఁ బుడమిఱేఁడు, లేనిధరణికి మగదిక్కు లేనిసతికిఁ
గడఁక నెవ్వనికిని నాస గాకమాన, దేను బలవంతుఁడను నీకు నేల విడుతు.

122


క.

నా కిప్పు డుండ నర్హం, బీకోటర మేల విడుతు నిలఁ జెఱువులుఁ బ
ద్మాకరములుఁ గూపంబులుఁ, గైకొన్నవి వారిసొమ్ముగా మను పనియెన్.

123


వ.

మనుస్మృతిమార్గంబు గలదు గావున నే నిచ్చోటు విడువ ననినఁ బక్షి యిట్లనియె.

124


క.

మొగమోట లేక నాయి, ల్లగు నని గైకొనఁగ నీకు నర్హమె యిచటన్
దగవునకు రమ్ము లేదా, జగడం బగు నీకు నాకు శత్రుత్వమునన్.

125


వ.

అనుటయు దీర్ఘకర్ణుండు తగ వనినం గా దనవచ్చునే రమ్మని వెడలిన నాపక్షియుం
దోడన కదలునప్పు డీయాశ్చర్యంబు నేనునుం జూచెదఁ గాకనుచు నింతనంతం
జనుచుండ నవి గొంతద వ్వరిగి యరిగి మనకుం దగవు చెప్పం దగువా రెవ్వరనినఁ బక్షికి
శశకం బిట్లనియె.

126


క.

యమునానదీతటంబునఁ దమసత్యవ్రతుఁడు గలఁడు దధికర్ణుఁ డనన్
గ్రమ మెఱిఁగినమార్జాలము, తెమలక మన మతని నడిగి తెలియుద మనినన్.

127


వ.

కపింజలం బిట్లనియె.

128


క.

పిల్లి కడుఁ గ్రూరహృదయం, బెల్లప్పుడు నమ్మఁ బోల దే నెఱుఁగుదు నీ
యుల్లమున కెట్లు గలిగెన్, జెల్లంబో నమ్మి కనినఁ జెప్పం దొడఁగెన్.

129


క.

ఆచారవంతుఁ డుత్తముఁ, డీచేరువవార లెల్ల నెఱుఁగుదు రతనిన్
నాచేరువగా వెఱవక, లే చనుదె మ్మనినఁ బక్షి విని యిట్లనియెన్.

130


గీ.

భయము నీకు నాకుఁ బరఁగంగ నేకంబు, నాకు వచ్చుకీడు నీకు రాదె
చెప్పఁ దగినబుద్ధి చెప్పితిఁ గాకంచు, నదియు నదియుఁ గదలి కదియఁ జనక.

131


వ.

ఎడదవ్వుల నిలిచి దధికర్ణు నుద్దేశించి.

132


క.

ఇరవునకునై వివాదం, బిరువురకుం గలిగి యిచటి కేతెంచితి మీ
వరుసను సమచిత్తుఁడవై, వెరవున మముఁ దీర్చి పంపు వేగం బనినన్.

133


వ.

విని యల్లన తల యెత్తి చూచి దధికర్ణుం డిట్లనియె.

134


గీ.

మున్నువలెఁ గాదు మిక్కిలి ముసలి నైతిఁ, గదిసియుండినయది గాని కాన రాదు
వాటముగ నంతదూరంపుమాట వినను, మిగుల నింద్రియవైకల్య మగుటఁ జేసి.

135


క.

నను విశ్వసించి చేరం, జనుదెం డని పలుక నవియుఁ జకితస్థితి నొ
య్యనఁ గదియ వెఱవ నేటికిఁ, బనివడి యిట వచ్చి ప్రకృతిబాంధవు లయ్యున్.

136


క.

ధర్మంబు చెఱుపఁ జెఱుచును, ధర్మము రక్షించువానిఁ దా రక్షించున్
ధర్మంబు చెడక యుండను, నిర్మలమతి నడపవలయు నిశ్చలనియతిన్.

137

క.

ధర్మంబు పరమమిత్త్రుఁడు, ధర్మము వెనువెంట వచ్చుఁ దక్కినధనముల్
కర్మాయత్తశరీరము, నిర్మూలం బైనచోటనే వసియించున్.

138


గీ.

ఇట్టిమాట లెల్ల విని నిజంబులు గాని, యధమవృత్తిఁ గల్లలాడ నేను
గల్లలాడునట్టికష్టుఁ డెవ్వం డైన, మొనసి నరకకూపమున వసించు.

139


క.

తలఁప నహింసకు మిగులం, గలిగినధర్మంబు లేదు గావున నే నీ
తెలివిని దగ జీవాత్మం, దలఁపుచు నున్నాఁడ నొండు దలఁపనిబుద్ధిన్.

140


క.

పరభామఁ గన్నతల్లిఁగఁ, బరధనముం బెంకు గాఁగ భావింపుచు స
త్పురుషుండు సర్వజీవుల, నిరతముఁ దనయాత్మఁ గాఁగ నెమ్మదిఁ జూచున్.

141


గీ.

సకలభూతసమితి సౌఖ్యదుఃఖంబులు, తనవిగాఁ దలంచుతత్త్వవిదుఁడు
జన్మమృత్యుభయవిచారంబు దిగఁ ద్రోచి, లలితగతిని మోక్షలక్ష్మిఁ జెందు.

142


వ.

అట్లు గావున.

143


గీ.

ఎవ్వరికి హింస చేయక హితము చేసి, నాఁడునాఁటికిఁ జాంద్రాయణవ్రతంబు
సలుపుచున్నాఁడ నాతపోబలము కలిమి, నడుగుఁ డేమైవఁ జెప్పుదు నభిమతములు.

144


క.

అని తమ్ము నమ్మఁ బలికిన, విని వెఱవక చేరఁ బోవ వేగమె రెంటిన్
మునుగాళ్ల నడఁచి వానిన్, దినియెన్ గ్రూరాత్ము సమ్మతింతురె యెందున్.

145


వ.

కావున నీయల్పుండు రాజ్యార్హుండు గాఁ డని యావృద్ధకాకంబు పలికినం బక్షులు
విని యిది నిజంబు పలికేం దప్ప దని యాయులూకంబును రాజ్యాభిషేకంబునకుం
దొలఁగించి పక్షు లయ్యైదిక్కులకుం జెదరిపోయినఁ దదనంతరంబ యయ్యులూకంబు
వృద్ధకాకంబుకడకుఁ జనుదెంచి రోషసంరక్తలోచనంబులు మెఱయ నుద్ధతం బగుచు
నిట్లనియె.

146


క.

నీ కేమికీడు చేసితిఁ, గాకమ రాజ్యార్హుఁ డితఁడు గాఁ డని నన్నున్
గైకొనక పలికి తల్పుఁడ, నై కానంబడినభావ మది యెయ్యదియో.

147


వ.

అని మఱియు నిట్లనియె.

148


సీ.

తొడరి వాఁడిశరంబు దూఱి పాఱినగంటి, మంత్రౌషధంబుల మాన నేర్చుఁ
బరశుఖండితమహాపాదపోన్నతశాఖ, జిగి మించఁ గ్రమ్మఱఁ జిగురు వెట్టు
దర్పితభయదోగ్రదావాగ్నిశిఖలచే, మాడినతృణ మెల్ల మగుడ మొలచు
నిష్ఠురోక్తులచేత నెఱిఁ జెడ్డకార్యంబు, మగుడ నెన్నండును నిగుడకుండుఁ


గీ.

గాన నాకుఁ బక్షిగణము లనుష్ఠించు, ప్రాభవంబు చెఱుపఁబడియెఁ గాన
నోరి మీకు మాకు వైరంబు వాటిల్లె, ననుచు గూబ చనియె నాగ్రహమున.

149


వ.

అదియ కారణంబుగా నులూకంబులకుఁ గాకంబులకు సహజవైరంబు వాటిల్లె నని
చిరంజీని చెప్పి మఱియు నిట్లనియె. దేవా మును చెప్పంబడినషాడ్గుణ్యంబులలోన

సంధివిగ్రహంబు లిప్పటికిఁ బ్రయోజనంబులు గా వాసనయానద్వైధీభావసమాశ్రయం
బులు విచారణీయంబు లనిన విని యతం డాసనక్రమం బెట్టి దనిన.

150


గీ.

వినుతుఁ డధికుఁడై కడుసమీపమున నున్న, హీనబలునకుఁ దనయున్నచోన యునికి
కడుఁబ్రమాదంబు గావున గాడు మనకు, సబలునకు నైన నొప్పు నాసనగుణంబు.

151


క.

యానంబు గదలి పోవుట, గాన బలము లేని మనకుఁ గా దదియుం బెం
పూనినద్వైధీభావము, ధీనిరతులు ధనసమృద్ధిఁ దీర్పఁగవలయున్.

152


గీ.

చిరసమాశ్రయవర్తన స్థిరతఁ జేసి, శత్రువరులను గెలుచుట సంశ్రయంబు
తద్గుణంబులు దెలిసి యుద్దండరిపుల, మూల మడఁచిన వారలు మున్ను గలరు.

153


క.

ఒడలికి నలజడి యైనన్, గడఁగి సమాశ్రయము నేన కావించెద ని
ప్పుడు వైరు లధికు లైనన్, దడఁ బఱచెద నాదుబుద్ధి తాలిమి పేర్మిన్.

154


క.

బలవంతు రైనశత్రులఁ, బలువురనేనియును బుద్ధిబలమున గెలువన్
వలనగు యాగార్ధము ధూ, ర్తులచే విప్రుండు వంచితుం డగుభంగిన్.

155


వ.

అనినఁ గాకప్రభుం డత్తెఱం గెఱింగింపు మనినఁ బ్రధానాగ్రగణ్యుం డగుచిరంజీవి
యిట్లనియె.

156


సీ.

యజ్ఞార్థ మనుచు ధరామరుఁ డొక్కఁడు, కొని యొకమేషంబుఁ గొంచు రాఁగఁ
దెరువున దుర్జనుల్ దృష్టించి తమలోన, మోసపుత్తము గాక ముని నటంచుఁ
గడునిర్దయాత్ముండు గా కుర్వి విప్రుండు, వెఱవక హింస గావించు టెట్లు
గనుఁగొన్నమా కెల్లఁ గనికరం బయ్యెడు, దీనిఁ జంపఁగ సమ్మతించుట కిది


గీ.

యనఁగ నమ్మి చీంబోతుఁ దా నచటఁ గట్టి, యాతఁ డాచమనార్థమై యరుగఁ దడవ
సరభసంబునఁ జీబోతుఁ జంపి తినిరి, బుద్ధిగలవారు గెలువ నోపుదురు పరుల.

157


ఉ.

కావున నేను శాత్రవనికాయము గెల్చెద సాహసంబుతో
నావచనంబు నమ్ముఁడు మనంబున నింతయుఁ జింతదక్కి నే
జీవముఁ బాసినట్టు గతిచేడ్పడి యుండెద రక్తపూరముల్
జేవురుచాయగా మెడలఁ జిప్పిలఁ జల్లుఁడు చల్లి యత్తఱిన్.

158


గీ.

మున్ను చచ్చినకాకులమూఁక నడుమ, నన్నుఁ బడవైచి తొలఁగి మిన్నక చనుండు
నే సమాశ్రయ మొనరించి మోసపుచ్చి, వత్తు ననుటయు నా మేఘవర్ణుఁ డపుడు.

159


గీ.

ఆచిరంజీవిఁ జెప్చినయట్ల చేసి, తానుఁ దనవారు నవ్వల తరువుఁ బాసి
తొలఁగి తనమంత్రి పన్నినయలఘుకార్య, మాత్మఁ దలపోయుచుండె నయ్యవసరమున.

160


ఉ.

పొంగినవేడ్కతోడ మును పూర్వదిశాంగనఁ గూడి యుంటి నా
కుం గలరాగ మెల్ల ననుకూలతఁ జూపెద నంచుఁ బశ్చిమా

శాంగనఁ జేరెనో యనఁగఁ నస్తగిరిన్ రవి చేరి క్రుంకినన్
నింగియు నేలయుం దమము నెక్కొన దిక్కులఁ గప్పె నొప్పులన్.

161


వ.

అయ్యంధకారంబున జిరంజీవి తాను మున్నున్నవటమహీరుహంబుక్రింద మృతకాక
మధ్యంబునం బడి రక్తంబునం దొప్పదోఁగి యెఱకలు విచ్చి నేత్రంబులు మూసికొని
మృతిం పొందినచందంబున డెందంబుకొందలం బడపుకొని యున్నసమయంబున
నక్కడ నుపమర్దనుండు తనమంత్రులం గనుంగొని యిట్లనియె.

162


గీ.

శత్రునిశ్శేషముగఁ జేసి చంపకున్న, నొకఁడు దప్పిన మన కది యొప్పకుండు
గాన వేగంబ యామఱ్ఱికడకుఁ బోయి, వెదకి చంపుట గార్య మీవేళ ననిన.

163


వ.

అప్పలుకు లాకర్ణించి యతనిమంత్రు లేకవాక్యంబుగా నిట్లనిరి.

164


ఉ.

దేవర నీతివాక్యము సుధీవిభవాఢ్యులు మెచ్చ నాడితౌ
పోవుట మేలు వాఁ గదలి పోయి వటం బరకట్టి చుట్టునుం
గావలి వెట్టి చొచ్చి యొకకాకముఁ గానక కాకు లన్నియున్
జీవములం దొఱంగె నని చెప్పఁగఁ గ్రమ్మఱి పోవునత్తఱిన్.

165


వ.

అవ్విధం బంతయు నెఱింగి చిరంజీవి తనలో నిట్లని వితర్కించె.

166


గీ.

మొనసి చేయవలయు మొదల నుద్యోగంబు, చేసెనేని కార్యసిద్ధిఁ బొందఁ
జేయవలయుఁ గానఁ జేసెద నని చిరం, జీవి నిశ్చయించి చింత దక్కి.

167


వ.

ఉన్న సమయంబున.

168


క.

కాకంబు లెల్ల మడిసెం, గా కిచ్చట నొకటి యైన గలిగెనె యనుచున్
గాకారు లరుగునంతట, నాకాకము కావు కావు మని యెలుఁగింపన్.

169


వ.

ఇట్లు గూసినచిరంజీవికూత విని యులూకంబులు పోక మగిడి వచ్చి యచ్చోటు
వెదకి చిరంజీవిఁ బట్టుకొని పోయి తమయేలిక యగునుపమర్దుముందటం బెట్టిన గనుం
గొని యతండు నీ వెవ్వఁడ వనిన నతండు నాపేరు చిరంజీవి యనుటయు నోరీ నీవు
మేఘవర్ణునకుఁ బ్రధానాగ్రగణ్యుండ వేతెఱంగున నిట్టివాఁడ వైతి వనిన జిరంజీవి
యతని కిట్లనియె.

170


సీ.

అవధరింపుఁడు నన్ను నమ్మేఘవర్ణుండు, దప్పక కార్యంబు చెప్పు మనిన
నుపమర్దభూపాలుఁ డుగ్రుండు సాహసి, యధికబలప్రతాపాన్వితుండు
సరగున మన మేఁగి శరణంబు చొచ్చిన, నతఁడు నీ కెంతయు హిత మొనర్చు
నని బుద్ధి చెప్పిన నతనిచిత్త మెఱింగి, యనుచరవర్గంబు లాగ్రహించి


గీ.

యోరి పగవారిపక్షమై నోరికొలఁది, నోడితివి దీనఁ జే టగుఁ గుడువు మనుచుఁ
జరణఘాతంబులను మేను చఱచి మట్టి, చంచుపుటములఁ గఱచి నొప్పించి చనిన.

171

క.

దిగ విడువక ప్రాణంబులు, తగ నాకంఠమున నిలిచి తల్లడపఱచెన్
దెగ నడవుఁడు మీరైనను, సుగతికిఁ జనునట్టిభంగి చొప్పడ నన్నున్.

172


వ.

అనుటయు నుపమర్దుండు రక్తాక్షుండు మొదలయినతనయమాత్యులం గనుంగొని వీని
నేమి సేయుద మనిన నందు రక్తాక్షుం డిట్లనియె.

173


ఉ.

ఈతఁ డసాధ్యశత్రుఁ డని యించుకయు న్మతి లేక వీని దు
ర్నీతిఁ గృపాకటాక్షమున నిల్పఁగఁ జూచెదు గాని మీఁద న
త్యాతురతం బ్రమాద మని యాత్మ నెఱుంగవు వీనియున్నయీ
రీతి నిజంబు గాదు ప్రహరింపుఁడు పంపుఁడు కాలుప్రోలికిన్.

174


గీ.

 వీఁడె కాఁడు హీనవిమతుఁ డైనను నొచ్చి, చిక్కినపుడ వేగఁ జెఱుపవలయు
గరుణఁ గాచెనేని కాలాంతరంబునఁ, బ్రతిఘటించి వాఁడె పగ యడంచు.

175


వ.

అనుటయు నుపమర్దనుండు క్రూరాత్ముం డనుతనయమాత్యు నడిగిన నతం డిట్లనియె.

176


క.

శరణము జొచ్చినవానిన్, బరిమార్చినయతని కధికపాపం బనుచున్
బొరిఁ జెప్పు ధర్మశాస్త్రము, పరమకృపం గావు వీనిఁ బక్షికులేంద్రా.

177


వ.

అనిన నతండు దీప్తాక్షుం డనునమాత్యుం గనుంగొని నీమదిం దోఁచిన కార్యంబు చెప్పు
మనిన నతం డిట్లనియె.

178


చ.

అనఘ యెఱుంగ వెందు శరణాగతుఁ జంపినచోటు చెప్పఁగా
వినవె కపోతమున్ శరణు వేఁడిన నాత్మశరీరమాంసమున్
గోను మని బోయ కిచ్చె శిబి క్రొత్తగ విన్నది చెప్ప నేల యొ
ప్పును మును వైశ్యచోరులకుఁ బుట్టినవాదము చిత్తగింపుమా.

179


వ.

అనుటయుఁ దత్కథాక్రమం బెట్టి దనిన నుపమర్దున కతం డిట్లనియె.

180


ఉ.

ము న్నొకపట్టణంబునఁ బ్రమోదమునన్ ధనగుప్తనామసం
పన్నుఁడు వైశ్యుఁ డుండు నొకభౌమిని వానికిఁ జంద్రరేఖ నా
నెన్నిక కెక్కి యొప్పుఁ గమలేక్షణ రూపవిలాసవిభ్రమో
త్పన్నవయోవిభాసి కులభామలయొప్పుఁ దృణీకరింపుచున్.

181


గీ.

మెలఁగు నాసతి దనపతి మిగులవృద్ధు గాన వెన్నఁడు నొల్లక కదియనీక
యున్నయెడఁ జోరుఁడొకఁడు వారున్నయిల్లు, కన్న మిడి చొచ్చి ధనమున్నకందు వరయ.

182


వ.

ఆచోరుండు నలుదిక్కులం బరికించునప్పు డనర్ఘ్యమణికనకభూషణాలంకృతయై
మృదుతల్పంబునం దనపురుషునొద్దఁ బరాఙ్ముఖియై నిద్రించునంగనాతిలకంబుం
బొడగని నాకు నితనిమందిరంబున ధనంబు వెదక నేల యివ్విభూషణంబులలోన
నొక్కతొడవు నాకుఁ జేపడిన నంతియ చాలు నని దీప్తజ్వాలాజాలంబులకుం దగిన

తదీయాభరణకాంతు లినుమడింప నక్కంబుకంఠికంఠాభరణం బపహరింపం గరంబు
చాఁచిన.

183


క.

తొడగినతొడవులదీప్తులు, తొడిఁబడి చీఁకట్లు దూలఁ దూలఁగఁ దనపైఁ
దొడరినహస్తము సోఁకినఁ, బడఁతుక మేల్కాంచి చూచి భయకంపితయై.

184


వ.

తనజీవితేశ్వరుం డున్నదిక్కున కభిముఖియై.

185


సీ.

కరికుంభములకంటెఁ గడుసైనచనుదోయి, యుగ్మలి బిగియార నొత్తి యొత్తి
బిసకాండములకంటెఁ బసమించుకరముల, నతివ యంతంతెకు నలమి యలమి
పల్లవంబులకంటె బాగైనకెంగేల, లలితాంగి యల్లన తెలిపి తెలిపి
పికనాదమునకంటెఁ బెంపారు నెలుఁగున, బింబోష్ఠి పలుమాఱు పిలిచి పిలిచి


గీ.

తెలుపునంతట మేల్కని తెలివి నంది, తనకుఁ బ్రియకాంత చేసినధన్యతకును
మేను పులకాంకురంబుల నీనుచుండ, మెలసి సౌఖ్యాంబునిధిలోన నోలలాడి.

186


వ.

ఆవైశ్యుండు కొండొకసేపున కాకుటిలకుంతల కిట్లనియె.

187


క.

ఏకాలంబున వెనుకను, నీకౌఁగిలి నాకు నబ్బ నేరదు భాగ్యం
బోకొంత నేఁడు గలిగెను, మేకొనుటకు దీని కేనిమిత్తము చెపుమా.

188


వ.

అనిన నయ్యింతి భయముకతనం బలుకక నిజకటాక్షవీక్షణంబులం గరాభినయ
సంజ్ఞాభావంబులం దెలుపం దెలియక యీలేమ యిటు సేయుటకుఁ గతం బెయ్యది
యని నలుదిక్కులం గనుంగొన నప్పుడు తనవెనుకదిక్కున నొదిగియున్న చోరునిం
గనుంగొని యిట్లనియె.

189


ఉ.

ఈరమణీలలామ నను నెప్పుడు వృద్దుఁ డటంచు దగ్గఱం
జేరదు నేఁడు నిన్నుఁ గని చెందినభీతిని గౌఁగిలించుటన్
హారివిశేషసౌఖ్యముల నంది కృతార్థుఁడ నైతిఁ గావునన్
నారుచిరార్థసంపద గొనం దగు నిచ్చెదుఁ బుచ్చుకోవనా.

190


వ.

అనినఁ జోరుం డిట్లనియె.

191


చ.

కలధన మెల్ల దేవుకొని గ్రక్కునఁ బోయెద నంచు వచ్చి నీ
యలఘుమృదూక్తుల న్మనము హర్షముఁ జేయుట నర్ధ మొల్ల ను
గ్మలి విను నేఁటియ ట్లితనిఁ గౌఁగిటఁ జేర్చి రమింపకున్న నన్
దలఁచినవేళ వచ్చి మొగ తప్పక మ్రింగుదు నంగిటం బడన్.

192


వ.

అనిన వైశ్యుం డతని కిట్లనియె.

193


క.

ఉపకారంబునకును బ్ర, త్యుపకారము సేయ కుంట యుచితమె నీ వీ
యపరిమితార్థముఁ గొని చను, నెప మేమియుఁ బలుక కనుచు నిలయమునందున్.

194

వ.

తనకుం గలిగినధనం బంతయు నతనిముందటం బెట్టి నీ వేమియుం బెనంగక కొనిపొ
మ్మనిన నతం డేమియు నొల్లక న న్నీపక్షంబు తుదముట్టం జూడు మనుచు నేమి
యు ముట్టక చనియెఁ జోరవ్యవహారంబు జీవనంబుగా నొడలెత్తినయతండును
నవ్వైశ్యునికి నుపకారంబు చేసి పోయెం గావున నీవును నీవాయసంబువలనఁ గృప
గలుగవలయు ననిన నుపమర్దనుండు వక్రనాసుం డనుమంత్రిం జూచి నీతలంపునుం
జెప్పు మనుటయు నతం డిట్లనియె.

195


క.

తెగి చంపరాదు కాకముఁ, బగతురు దమలో విరోధపడిరేని శుభం
బగు మన కొకరాక్షసగో, యుగచోరులకథ వినంగ నొ ప్పగుఁ దెలియన్.

196


వ.

అనినఁ దత్కథాక్రమం బెట్టి దని యుపమర్దుం డడిగిన నావక్రనాసుం డిట్లనియె.

197


చ.

ఘన మగునగ్రహారమునఁ గర్మవిదుం డొకబ్రాహ్మణుండు పా
వనచరితుండు గోవులఁ బ్రవర్ధన మొందఁగ రెంటి మేపఁగాఁ
గనుఁగొని తాఁ బ్రమోదమునఁ గైకొనఁగాఁ దఱి వేచి యుండు మ్రు
చ్చనిశము నొక్కనాఁ డొకమహానిశి నొక్కఁడుఁ బోవుచుండఁగన్.

198


గీ.

మొగులు సన్నపుఁజినుకుతో ముసురుకొనుట, మీఁదఁ జీఁకటి దట్టమై మెండుకొనుట
మనుజవిరహితమును నిశామధ్య మగుటఁ, బొదలుమనమున నాదొంగ పోయిపోయి.

199


సీ.

ఎదురుగా నొక్కరుఁ డేగుదెంచిన వానిఁ, దరలక చోరుండు దాఁకి బెదరి
యెవ్వండ వనుటయు నే బ్రహ్మరాక్షసుఁ, డను నన్నుఁ దాఁకిన ఘనుఁడ వైన
నీ వెవ్వఁ డనుటయు నే మ్రుచ్చుఁ బొమ్మన, నింతప్రొ ద్దెచ్చటి కేఁగె దనిన
నీపురిలోన మహీసురోత్తముధేను, వులు రెండు మంచివి గలుగఁ జూచి


గీ.

యపహరించుకొఱకు నరిగెద నే నన్న, నేను నతనిఁ బట్ట నిపుడు వత్తు
రమ్మటంచుఁ గదలి బ్రహ్మరాక్షసుఁడును, నతఁడు నంతఁ గూడి యతనిగృహము.

200


వ.

కదియం బోయి యమ్మహీదేవుగృహద్వారంబునొద్ద నిలిచి చోరునిం జూచి బ్రహ్మ
రాక్షసుం డిట్లనియె.

201


గీ.

ఏను మున్ను పోయి యీయింటివిప్రునిఁ, బట్ట భుక్తి నాకుఁ బెట్టఁ జూచి
పిదప నీవుఁ గదిసి మొదవులఁ దోలుకొ, మ్మనిన నతనిమాట కాగ్రహించి.

202


వ.

చోరుం డిట్లనియె.

203


గీ.

తొలుత నీవు విప్రుఁ దెలిపిన మఱి నాకుఁ, బట్ట నెట్టు వచ్చుఁ బశుయుగంబు
వారు నతనిపొరుగువారును మేల్కన్నఁ, బాఱవలసియుండుఁ బసుల విడిచి.

204


వ.

అని మఱియు నిట్లనియె.

205

క.

చొరఁబడి గోయుగముం గొని, సరగున నే నూరు వెడలి చనునంతట భూ
సురు నీవు పట్టు మనుటయు, నరుణాక్షులు మెఱయ నతఁడు నాతని కనియెన్.

206


క.

పసుల మును నీవు దోలిన, ముసరిన నెవ్వగల నతఁడు ముచ్చిరుచుండన్
బస లేదు నాకుఁ బట్టఁగ, వెస నేము న్నరుగ నీవు వెనుచను మనినన్.

207


వ.

ఇవ్విధంబున నయ్యిరువురు నొండొరులమీఁదియాగ్రహంబున మెల పెఱుంగక
రొదకొట్టునంతట నాయింటిగృహపతి మేల్కని తలవాకిటికిం జనుదెంచి యర్ధరా
త్రసమయంబున వచ్చి మావాకిటం బోరుచున్నవా రెవ్వ రనిన నతనికిఁ జోరరాక్షసు
లిట్లనిరి.

208


ఉత్సాహ.

వెస నితండు నిన్నుఁ బట్ట వేచి వచ్చె బ్రహ్మరా
క్షసుఁ డటంచుఁ జోరుఁ డనినఁ గనలి నీపశుద్వయం
బెసఁగువేడ్క వీఁడు వేగ నిపుడు దోల వచ్చె సా
హసికవర్యుఁ డితఁడు దొంగ యంచుఁ జెప్పెఁ జెప్పినన్.

209


గీ.

విని మహీసురవర్యుండు వితతమంత్ర, బలమునను బ్రహ్మరాక్షసుఁ బాఱఁ దోల
నంత నటమున్ను చోరుండు నరిగెఁ గానఁ, బొసఁగ నహితులు దమలోనఁ బోర మేలు.

210


క.

కావున శరణాగతునిం, గావం దగుఁ గాని చంపఁ గా దనినయెడన్
దా విని ప్రకారవర్ణుని, నీవివరము జెప్పు మనిన నేర్పున నతఁడున్.

211


వ.

వక్రనాసుండు చెప్పినయట్ల చెప్పిన విని రక్తాక్షుండు సముస్థితుండై మ్రొక్కి యుప
మర్దున కిట్లనియె.

212


గీ.

దీనదశ దోఁపఁ బగతుండు హీనవృత్తి, నడఁగి బల మబ్బువేళను మడఁగఁజేయు
దృష్టముగఁ గీడు చేసిన దుష్టువలని, వినయవాక్యంబులకు మెచ్చు వెఱ్ఱివాఁడు.

213


వ.

అని మఱియు నిట్లనియె ము న్నిట్టిప్రియాలాపంబుల కలరి.

214


క.

ప్రేమను జారిణి యగుతన, రామను శిరసావహించె రథకారుఁ డొకం
డీమహి నవివేకి యనుడు, నామంత్రిమొగంబు చూచి యతఁ డెట్లనినన్.

215


వ.

అతం డిట్లను రథకారుని కొక్కకులకాంత గలదు దానితెఱంగు వినుండు.

216


క.

నగుమొగముఁ గలికికన్నులు, బిగిచన్నులు నసదునడుము బింబాధరమున్
జిగి దొలఁకుపదతలంబులుఁ, దగి యొప్పున్ బద్మముఖికిఁ దరుణులలోనన్.

217


క.

ఆపొలఁతుక పరపురుష, వ్యాపారము సేయుచుండ వరుఁ డెఱిఁగి నిజం
బేపారఁ దెలియుతలఁపునఁ, గోపం బడంచుకొని పలికెఁ గోమలితోడన్.

218


ఉ.

బాలరొ నన్ను రాజు పనిపంపఁగఁ బోవుచునున్నవాఁడఁ బో
జాల నటంచు భృత్యునకు సందుల దాఁగఁగఁ బోల దెందు నే

నేల నృపాలుకొల్వునకు నేగతి వచ్చె నవస్థ యంచుఁ జిం
తాలసుఁ డైననాథునకు నంగన యిట్లనియెన్ ముదంబునన్.

219


ఉ.

ఎన్నికబంట వీవు నిను నేలిక పిల్చి ప్రియంబు చెప్పినన్
సన్నక సన్నఁ బోక పెఱసన్నల సాకులు పన్ను టొప్పునే
తిన్నఁదనంబుతోడఁ బని దీర్చుక వచ్చి సుఖింతు గాని పో
కున్న నృపాలుఁ డుగ్రుఁ డదయుండు చలంబున నేమి సేయునో.

220


వ.

అని ససంభ్రమంబును సకౌతుకంబునుంగా నమ్మగువ యతని మజ్జనభోజనాదులం
బరితృప్తుం జేసి తాంబూలం బిచ్చి సెజ్జకుఁ దార్చి యిట్లనియె.

221


క.

తడ నోర్వవు ప్రాణంబులు, దడసి నినుం బాసి నాకుఁ దప్పదు నీకున్
బడఁతుక లచ్చటఁ గల రని, తడవును రా కున్న విడుతుఁ దనువు నిజేశా.

222


గీ.

అనుచుఁ గందర్పసంక్రీడ నాత్మనాభు, నుల్ల మలరంగ నేర్పుల నోలలార్చి
చలిదియును సంబడంబును జాల మెసఁగి, ప్రొద్దు గ్రుంకెడునంతన పుచ్చె నతని.

223


క.

పుచ్చి యుపనాథుఁ బిలువం, బుచ్చి యుదక మాడఁబోవఁ బోవక మగుడన్
వచ్చి యిలు చొచ్చి సూతుం, డచ్చటిమంచంబుక్రింద నడఁగినవేళన్.

224


వ.

పదంపడి యక్కాంతయు.

225


చ.

ఒడలికి నాడి సన్నమణుఁ గొప్పఁగఁ గట్టి సుగంధ మంతటం
బొడవడకుండ మేన నెగపూఁతగఁ బూసి వినీలకేశముల్
ముడి వడకుండఁ దీర్చి విరులుం గురువేరుఁ గదంబకంబుగాఁ
బొడవుగఁ గొప్పు పెట్టి మణిభూషణముల్ ధరియించె వేడుకన్.

226


గీ.

ఇవ్విధంబునఁ గైసేసి యిందువదన, దీప్తు లడరంగ నద్దంబు తెచ్చి చూచి
తనముఖావయవంబులు తానె మెచ్చి, సుదతి యుపకాంతున కెదురు చూచుచుండె.

227


వ.

అయ్యవసరంబున నుపనాథుండును నతిసంభ్రమంబున నలంకరించుకొని దూతి
కానుగమ్యమానుండై పద్మముఖిమందిరంబునఁ బ్రవేశించి పర్యంకంబునందుఁ
గూర్చుండి యుండె.

228


క.

ఆసమయంబునఁ బుష్పశ, రాసనుసామ్రాజ్యలక్ష్మి యన శృంగారో
ద్భాసితయై నిజపర్యం, కాసనమునఁ గాంత జారు నల్లన చేరెన్.

229


వ.

ఇట్లు చేరినకాంతాతిలకంబునకుం గదిసి యతం డిట్లనియె.

230


ఉ.

ఎప్పుడు పిల్చుఁ బద్మముఖి యెప్పుడు దానిప్రియుండు వోవు న
న్నెప్పుడు గారవించుఁ గమలేక్షణ యంచు నహర్నిశంబు

నెప్పుడుఁ గోరుచుండుదు మహిం దలపోయఁగ నేను ధన్యుఁడన్
జెప్పఁగ నేల నన్నిపుడు శీఘ్రమ రమ్మని పిల్వఁ బంచుటన్.

231


క.

అని మఱియుఁ బ్రియము చెప్పుచు, ఘనపరిరంభంబు చేసి కాంతయు నతఁడున్
మనసిజసంక్రీడలమై, ననుపమశయ్యాతలంబునం దున్నయెడన్.

232


గీ.

మగువ కాలు చాప మగనిఁ దాఁకుటయును, నతివ యాత్మలోన నది యెఱిఁగి
వీఁడు మగఁడు గాని వింతవాఁ డెవ్వఁడుఁ, గాఁ డంచుఁ గాంత కళవళించి.

233


వ.

విచారించుసమయంబునం గూటమితమకంబున నమ్మగువయభిప్రాయం బెఱుంగమిం
జేసి పరపురుషుండు దాని కిట్లనియె.

234


గీ.

నాకు వలతొ మున్ను చేకొన్నమగనికి, వలతొ నిజము చెప్పవలయుఁ జెలియ
నోపి చెప్పకున్నఁ గోసెదఁ జూ ముక్కు, సెవులు ననిన వాని కువిద యనియె.

235


ఉ.

ఓరి దురాత్మ నీవును బ్రియుండవె నాహృదయేశుకాలిపై
గోరును బోల వీవు నసగూఁటఁ గడున్ జపలస్వభావలై
నారులు రూపయౌవనమున న్నిలుపోపక యివ్వలవ్వలన్
జారహితంబు సేయ విభుచక్కటిమోహము మాన నేర్తురే.

236


వ.

అదియునుంగాక.

237


సీ.

మగఁడు దైవం బని మదిఁ దలంచినయట్టి, మగువ పుణ్యాంగన మగువలందు
విభుఁడు శరీరంబు విడిచి పోయెడివేళ, నగ్నిముఖంబున నరుగఁగాక
తరుణి యుండఁగ లేక తగనికార్య మొకటి, నేరక చేసిన నిముడుకొనుచు
సతిలేనిధర్మంబు పతికి నేయెడ లేదు, పతి వెలిగా లేదు సతికి మేలు


గీ.

గాన సతియుఁ బతియుఁ గలకాల మెల్లను, దోడునీడ గాఁగఁ దొలఁగ రనిన
శయ్యక్రింద నుండి సంతోషమున రథ, కారుఁ డద్భుతంబు గ్రమ్ముమదిని.

238


వ.

ఇట్లని తలంచె.

239


గీ.

మిగులఁ బక్ష మైనమెలఁతుక యొకనాఁడు, ప్రియము పుట్టి యొకనిఁ బిలిచెనేని
నేమి దప్పె ననుచు నెంతయు ముద మంది, యలుక విడిచి యున్నయవసరమున.

240


క.

పరపురుషుండును దరుణియు, సురతశ్రమపారవశ్యసుఖసుప్తిమెయిం
గరచరణంబులు పెనఁగొనఁ, బరిరంభణకేళి నున్న భావించి మదిన్.

241


ఉ.

ఆరథకారుఁ డల్లన నిజాంగనఁ దెల్పినఁ గన్ను విచ్చి యా
సారసనేత్ర యిట్లనియెఁ జయ్యన నీవు తొలంగు మంతకా
కారుఁడు వీఁడు మేల్కనిన గ్రక్కున నిన్నును నన్నుఁ జంపు ము
న్నారసి వీఁడె పట్టిన భయంబునఁ బోవక చిక్కి యుండితిన్.

242

గీ.

అనిన దానినాథుఁ డటఁ బాసి తొలఁగిన, నొద్ద నిదురపోవుచున్న విటునిఁ
దెలుప వెఱచి తాను దెలియక నిద్రించు, మగువఁ గాంచి యపుడు మగఁడు కినిసి.

243


క.

ఆమంచము తల నిడుకొని, ప్రేమంబునఁ బెద్దవీథిఁ బెట్టిన జారుం
డామగువఁ బాసి తొలఁగిన, నేమియు నన కతివఁ గొనుచు నింటికిఁ జనియెన్.

244


వ.

కావునఁ బ్రత్యక్షదోషంబు చేసినవానిం జూచి యైన నవివేకి మంచిమాటలకుం జొక్కి
మోసపోవు నని పెక్కుభంగుల రక్తాక్షుండు చెప్పిన నతనిమాట లవధరింపక యాచి
రంజీవిం దోడ్కొని నిజనివాసంబునకుం జని యతని నత్యంతగౌరవంబునం గొలి
పించుకొని యున్నసమయంబున నచిరకాలంబునకు నొక్కనాఁ డుపమర్దుండు సకల
భృత్యామాత్యనివహంబుతోడఁ గొలు వున్నసమయంబునఁ జిరంజీవి చనుదెంచి యత
నికి మ్రొక్కి యిట్లనియె.

245


ఉ.

నీపగవానిముందటను నీగుణముల్ గొనియాడఁ గోపసం
తాపపరీతచిత్తుఁ డయి దండితుఁ జేసెను నన్నుఁ బ్రాణముల్
తీపని యుండ నొల్ల సడి తెచ్చినయీబ్రతు కేల యగ్నిలో
నేపునఁ జొచ్చి దేహము దహించెద నడ్డము రాకుఁ డెవ్వరున్.

246


క.

తనయేలిక ముదల కొనక, గొనకొని ప్రాణంబు విడువఁ గొఱగా దనినన్
నిని రక్తాక్షుఁడు వానిం, గనుఁగొని యిట్లనియె మనసు గనుఁగొనుబుద్ధిన్.

247


గీ.

చచ్చి యేమి సేయు దిచ్చట నీ వన్న, నతఁడు దా నులూక మగుచుఁ బుట్టి
కాకకులము నెల్ల గ్రక్కునఁ జంపుదు, గాలి వోవకుండఁ గాంక్ష దీఱ.

248


వ.

అనిన విని రక్తాక్షుం డవ్విధంబు సేయ నీకు సాధ్యంబుగా దెట్లనినఁ దొల్లి యొక్క
మూషికంబు సూర్యానిలదేవేంద్రమేరుపర్వతంబులు దనకుఁ బ్రత్యక్షంబు లైనను నెప్ప
టిరూపంబునె పొందెఁ గాని యుత్కృష్టజన్మంబు నొంద నేర దయ్యె ననినఁ జిరంజీవి
తత్కథాక్రమం బెట్టి దనిన రక్తాక్షుం డిట్లనియె.

249


సీ.

మునివరుఁ డొకరుండు ముఖ్యతీర్థము లెల్ల, నాడి భాగీరథి కరిగి యందు
నవగాహనము చేసి యాదిత్యుఁ డుదయించు, తఱి నర్ఘ్యజలము హస్తములఁ బట్ట
నయ్యవసరమున నాకాశవీథిగా, నొకడేగ యెలుకఁ బట్టుకొని చనఁగ
నాయెల్క విడివడి యమ్మహీసురు చేతి, యర్ఘ్యజలంబులయందుఁ బడిన


గీ.

నతఁడు గనుఁగొని కౌతుకాయత్తచిత్తుఁ, డగుచు నమ్మూషికముమీఁద నిగుడుకరుణఁ
గన్య యగుఁ గాక యనుటయుఁ గాంత యయ్యె, దానిఁ దనభార్యచేతి కమ్మౌని యొసఁగ.

250


క.

ఆరామయుఁ దనకన్నకు, మారికకం టెను గరంబు మక్కువ మెఱయన్
గారామునఁ బెనుపఁగ న, న్నారీరత్నంబు యౌవనప్రాయమునన్.

251

వ.

అతిమనోహరాకార యైనయక్కొమ్మం గనుంగొని యొక్కనాఁ డమ్మునీశ్వరుండు
మనంబున నిట్లు విచారించె.

252


క.

ఈకన్నియఁ దగువరునకు, నీకున్న రజస్వల యయి యిది వృషలి యగున్
బ్రాకటనిందాపాత్ర, వ్యాకుల యగు ననుచుఁ దనమహత్వముపేర్మిన్.

253


క.

త్రిభువనదీపకుఁ డగునా, నభోమణిఁ దలంచిన వేగ నమ్మునిమ్రోలన్
శుభమూర్తి వచ్చి నిలిచిన, నభివందన మాచరించి యతఁ డిట్లనియెన్.

254


క.

ఈరూపవతికి మర్త్యులు, గా కని నిలిపితిని భార్యఁ గైకొనుమీ
కోరిక నా కిది యనుటయు, నారవి విని యపుడు వేడ్క నాతని కనియెన్.

255


ఉ.

ఏణవిలోలనేత్ర వరియింప మహాబలుఁ డైనయాజగ
త్ప్రాణుఁడు గాని కాఁ డతనిఁ బ్రార్థన సేయుము నన్ను మీఱు న
క్షీణవిభూతి నాతఁ డని చెప్పి దివాకరుఁ డేఁగినన్ దప
స్త్రాణపరాయణత్వమునఁ దాపసుఁ డయ్యనిలుం దలంచినన్.

256


చ.

తలఁచిన నాసమీరుఁడును దత్పరతం బొడచూపి నిల్చినన్
దళితసరోజనేత్ర యిది నాకుఁ దనూభవ నీకుఁ బత్నిఁగా
నొలసి పరిగ్రహింపు మని యుగ్మలిఁ జూప మునీంద్రుఁ జూచి హా
సలలితవక్త్రుఁ డై మృదువచస్థితితోఁ బవమానుఁ డిట్లనున్.

257


ఉ.

నా కధికుండు దేవపతి నాతుక నాయన కిచ్చినన్ దగుం
గాక మహేంద్రుఁ డైనతనిఁ గా దని యన్యుల కిచ్చు టర్హమే
నాకనివాససౌఖ్యసుమనస్సరసీరుహలోచనాశిర
శ్శ్రీకరపాదపద్మ యయి చెన్నెసలారుచు నుండు టొప్పదే.

258


వ.

అని యిట్లు వాయుదేవుం డమ్మునీంద్రు నొడంబడం బలికి యతనిచేత ననుజ్ఞా
తుండై నిజేచ్ఛం జనియెఁ దదనంతరంబ యమ్మునీంద్రుఁ డింద్రు నారాధించి తలంచిన
నతండును జనుదెంచి పొడచూపి నిలిచి నన్నుఁ దలంచిన కారణం బేమి యని యడి
గిన నయ్యింద్రునకు నమ్మునీంద్రుం డిట్లనియె.

259


చ.

అతులతపస్సమాధినియతాత్ములు నధ్వరకర్తలున్ దృఢ
వ్రతులును దానశూరులును వాసవునిన్ బొడగాననేర ర
ద్భుతము దలంచినంత వృథ పుచ్చక నన్నుఁ గృతార్థుఁ జేయ వ
చ్చితి మునికోటిలోపలఁ బ్రసిద్ధుఁడ నైతిఁ ద్రిలోకనాయకా.

260


వ.

అని మఱియు ననేకప్రకారంబులఁ బ్రస్తుతింపఁ బ్రసన్నముఖుం డైనశతమఖున
కతం డిట్లనియె.

261

సీ.

కలికిచూపులకాంతిఁ గలువతోరణములు, పచరించినట్లున్న బాలఁ జూడు
మెఱుఁగుఁజెక్కిళ్లను మించుటద్దంబులఁ, జూపెడు నీకు నీసుదతిఁ జూడు
గురుకుచంబులు పూర్ణకుంభంబులునుబోలె, నిలిపిన ట్లున్నయీనెలఁతఁ జూడు
చిఱునవ్వు వెన్నెల శీతలామృతమట్లు, చిలుకుచు నున్న యీచెలువఁ జూడు


గీ.

నమరవల్లభ నీకైన నమరుఁ గాని, నరసురాసురయక్షకిన్నరవరులకు
నీడు గా దని నిలిపితి నీమృగాక్షిఁ, గోర్కి నిగుడంగ దీనిఁ జేకొందు గాక.

262


వ.

అని యిట్లు మహేంద్రునకు నన్నారీరత్నంబుపయిం బ్రియంబు పుట్టం బల్కిన తప
స్విం గనుంగొని దానిజన్మప్రకారంబును మునీంద్రునకుం గలిగిన వాత్సల్యంబును నెఱిం
గినవాఁడై నవ్వుచు మునీంద్రునకు నింద్రుం డిట్లనియె.

263


చ.

సురుచిరరత్నసానువుల శుద్ధసువర్ణమహోన్నతాయత
స్ఫురదురుశృంగసంఘముల సూర్యసుధాకరతారకానిరం
తరపరివర్తనంబుల గదాధరపద్మభవాదిదేవతా
పరిచితమౌళిభాగములఁ బ్రస్తుతి కెక్కి వెలుంగు నెంతయున్.

264


ఉ.

మేరుమహామహీధరము మీకును మాకును బెద్ద గావునన్
వారిరుహాక్షి నగ్గిరి కవశ్యము నిచ్చుట మేలు కాంతకుం
గోరిక వల్లభుండు ధనికుండును సత్వయుతుండుఁ గాఁగ మే
లారసి కాంచనాద్రికిఁ బ్రియంబున నిమ్మని యింద్రుఁ డేఁగినన్.

265


వ.

అమ్మునీంద్రుండు తనమనంబున.

266


గీ.

పిలిచి యీఁబోవ నెవ్వారు దొలఁగనాడి, పడుచు నొల్లమి లోకంబుపాడి గాదె
భాస్కరానిలస్వర్లోకపతులు దగిన, యొరపు చెప్పిరి గాని తా రొల్లరైరి.

267


వ.

ఒల్లకున్న నేమి యగు నని మహామేరువుం దలంచిన నమ్మహీధరంబును నత్యంతసుకు
మారత్వంబును ధరియించి యాతనిముందట నిల్చినం గనుంగొని యర్హసత్కారంబులఁ
బరితుష్టుం జేసి మునీంద్రుం డిట్లనియె.

268


గీ.

ఎవ్వరికి నీక నీకు నే నిత్తు ననుచు, నింతగాఁ బెంచినాఁడ నీయిందువదన
నింపు సొంపార నీవు మాయింట నీపుడు, వియ్య మొందంగవలయు నుర్వీధరేంద్ర.

269


వ.

అన నమ్మహీధరం బిట్లనియె.

270


గీ.

చూడ సూక్ష్మంబు గాని నా సొబగుమేను, ఘాతగొని పెక్కు లాఁగలు గాఁగఁ ద్రవ్వు
గాన నాకంటె నధికమై ఘనతఁ చేర్చు, వేషధారిణి యైనయిమ్మూషికంబు.

271


ఉ.

కావున నీకుమారికకుఁ గాంతుఁడు మూషిక మైన నొప్పుఁ గా
కీవగ గాఁగ నల్పులకు నిచ్చుట నీ కది బుద్ధి గాదు నన్
బోవఁగ నంపు మంచు మునిపుంగవు వీడ్కొని మేరు వేఁగినన్
దేవసమానవిప్రునకు దీని నొసంగెద నంచు వేడ్కతోన్.

272

క.

ముని పుణ్యాశ్రమభూములు, వనితం గొని తిరిగి తిరిగి వరియింపుఁ డటం
చును విప్రవరుల నడిగినఁ, గనుఁగొని వా రధికబోధకలితాత్మకులై.

273


గీ.

ఇంత చక్కనితరుణి మహీసురులకు, నమర నేర్చునె రాజుల కైనఁ గాక
చెలువ నే మొల్ల మనఘ విచ్చేయు మనిన, నతఁడు గడులజ్జ నింటికి నరుగుదెంచి.

274


క.

ఇది దాఁ గన్యాత్వంబున, ముదిసినఁ గడుధర్మహాని మున్నిటిరూపం
బొదవంగ మూషికంబై, వదలక చరియించుఁ గాక వసుమతి నెందున్.

275


క.

అని పలుక నపుడు మూషిక, తనువునఁ దనమ్రోల నున్నదానిని ఖేదం
బున యొక్కపురుషమూషిక, మున కంటఁగఁ గట్టి రెంటి మునివరుఁ డంపెన్.

276


వ.

అట్లు గావున.

277


తరల.

ఇనసమీరణదేవతాధిపహేమశైలము లాదిగాఁ
దనకు సన్నిధి చేసెనేనియు దానిమూషికజన్మము
న్వినము మాఱఁగ నేర దయ్యెను నీకు నట్టిద మాకులం
బున జనించు టనంగ నాతఁడు పొంక మింక నడంగినన్,

278


వ.

అంతట నుపమర్దుండును జిరంజీవిఁ జేరంబిలిచి యభయం బిచ్చి వెఱవ కుండు మని
వీడ్కొల్పినఁ గొంతకాలం బుండి దుర్గస్థానమర్మంబు లెఱింగి యాచింజీవి యొక్క
నాఁడు దనలో నిట్లని తలంచె.

279


క.

అరులకుఁ గలసత్త్వంబును, దెరువులు నునికియును వారు ద్రిమ్మరుతావుల్
గిరిదుర్గము సాధించెడు, వెరవును నెఱిఁగితిని నాకు వేళగుఁ జెఱుపన్.

280


గీ.

అని విచారించి గుహచుట్టు నరయఁ దొల్లి, యాలమందలయునికిప ట్టగుటఁజేసి
కుప్పలై యున్నయెరు వెల్లఁ గొక్కిరించి, చరణముల సన్నతెరువుల సరవిఁ బఱచి.

281


వ.

తిరిగి పెద్దవాకిట వచ్చి యులూకంబులఁ జూచునప్పు డవి రాత్రి దూరదేశంబులు
బరిభ్రమించి మేసి వచ్చి యలసి సూర్యోదయసమయంబున మే నెఱుంగక యొం
డొంటిపయిం బడి నిద్రింపఁ జూచి తల యూఁచి చిరంజీవి తనలో నిట్లనియె.

282


ఉ.

నమ్మినవారిఁ జంపినను నాకు నధర్మము గాదు లెస్సగా
నమ్మక చంపరాదు రిపు నన్ను నిజంబుగ నాత్మభృత్యుఁగా
నమ్మినదోష మెవ్విధమునం దగఁ బొందె విచార మేటికిన్
నమ్మిన నానిజేశునకు నాదు హితం బెఱిఁగింతు నంతయున్.

283


ఉ.

ఏపని చేయు మంచుఁ దనయేలిక సేవకుఁ బంచెఁ బొందుగా
నాపని దీర్చి వచ్చుటయ యాతనికిం దగుధర్మ మిట్టిచోఁ
బాపము పుణ్యమున్ విభునిపా లగు భృత్యుని కేమి కారణం
బేపున మేఘవర్ణునకు నీసమయం బెఱిఁగింపఁ బొం దగున్.

284

సీ.

అని నిశ్చయింపుచు నతివేగమునఁ జని, యేలికఁ గాంచి కే లెత్తి మ్రొక్కి
మనపగ సాధింప ననువైనకాలంబు, తఱిగాంచి వచ్చితిఁ ద్వరితముగను
వెనుక నత్తెఱఁ గెల్ల విన్నవించెదఁ గాని, వీరు వా రన కెల్లవారిచేతఁ
గాష్ఠతృణంబులు గఱచి తే నియమింపు, మని తాను మండుచున్నట్టికొఱవి


గీ.

మెఱసి నేర్పున ముక్కునఁ గఱచిపట్టి, కడలఁ దృణకాష్ఠములు గొంచుఁ గాకకులము
మేఘవర్ణునివెనుక నమిత్త్రతతిని, గెలుచువేడుక నుడువీథిఁ జెలఁగి పఱవ.

285


క.

ఘూకంబు లున్నగుహకునుఁ వాకిటఁ గాష్ఠములుఁ దృణము వడిఁ గప్పింపన్
వే కవిసి చిరంజీవియుఁ, దాకొనఁ దనముక్కు కొఱవిఁ దగిలించి వడిన్.

286


వ.

తనదుపక్షానిలంబునంజేసి యయ్యనలంబు నిగుడం జేసిన.

287


శా.

ధూమజ్వాలలతోడివహ్ని గుహలోఁ దూరంగ నయ్యండజ
స్తోమంబుల్ భయసంభ్రమంబు లడరం దూరంబు గాఁ బాఱఁ ద
త్సీమారంధ్రము లెందు లేకునికి నార్తిం బొంది యచ్చో నిజ
స్వామిం జేరి యచేతనంబు లగుచుం జావంగ వీక్షింపుచున్.

288


వ.

రక్తాక్షుం డుపమర్దున కిట్లనియె.

289


క.

తెగి చంపరాదు గాకముఁ దగ వని దుర్ణీతు లపుడు దలకొల్పఁగ నీ
దగుమంత్రులు నీవును నీ, పగిదిం బడవలసె నిట్టిపాపము గంటే.

290


క.

హితుఁ డైనమంత్రి పలుకులు. మతి ననుమానించి విననిమావవపతి యీ
గతి దుర్దశలం బొందును, సుతసోదరబంధుమిత్రసుదతులతోడన్.

291


వ.

అనిన విని యుపమర్దుం డిట్లనియె.

292


గీ.

విను మధర్మమైనపని ధర్మ మని తోఁచుఁ, గానితెరువు తెరువుగాఁ దలంచు
శత్రు మిత్త్రుఁగాను మిత్త్రు శత్రునిగాను, గాంచు నరుఁడు చేటుకాలమునను.

293


ఉ.

కావున నాకుఁ బధ్య మగుకార్యముగాఁ గడు నొత్తి యమ్మెయిన్
నీవు హితంబు చెప్ప విననేరక దుర్ణయశీలినై చిరం
జీవిఁ బరిగ్రహించి జముఁ జేర నుపాయము చేసికొంటి నే
దైవిక మైనచేఁతకును దప్పునుపాయము లొండు గల్గునే.

294


మ.

ఒకయక్షౌహిణితోడఁ బాండవబలం బున్న న్నిశామధ్యవే
ళను ద్రోణాత్మజుఁ డొక్కఁడుం గదిసి లీలన్ సంహరింపంగ ను
త్సుకతన్ మాన్పఁగఁ జాలెనే హరియు నచ్చో నుండి సర్వంబు దై
విక మంచున్ దెలియంగలేక విధిపై ద్వేషించినం దప్పునే.

295


గీ.

అని యూరకుండునంతట, ననలశిఖాసమితిచేత నన్నియు సమయం
గనుఁగొనుచు వాయసంబులు, పనివడి గుహఁ జొచ్చి చూచి పరమప్రీతిన్.

296

క.

అవి యుపమర్దనునంగము, లివి యారక్తాక్షముఖ్యహితమంత్రిసుహృ
న్నివహములతనువు లనుచును, వివరించి యులూకసమితి వెడలి కడంకన్.

297


గీ.

అపుడు మేఘవర్ణాదివాయసకులంబు, పొరిఁ జిరంజీవిఁ బొగడుచుఁ బోయి నిజని
వాసమున నంచితోన్నతవైభవమున, మేఘవర్ణుండు కొలువున మెఱయుచుండి.

298


వ.

చిరంజీవి నాలోకించి నీ విన్నిదినంబులు శాత్రవజనంబులు నమ్మునట్లుగా నెవ్విధం
బునం గొలిచి తిరిగితి వనిన నతం డిట్లనియె.

299


గీ.

సకలదిక్కుల రాజుల శౌర్యమహిమ, గెలిచి తనుఁ గొల్చుతమ్ములు గలుగునట్టి
పాండవాగ్రజుఁ డనువు గాకుండునట్టి, వేళ హీనుఁడై కొలువఁడే విరటునగర.

300


సీ.

కాషాయదండంబు గైకొని యమసూతి, కంకుభ ట్టనునామకంబు దాల్చె
నడబాలతనమున నధముఁడై పావని, వలలుండు నాఁగ నవ్వలన నిలిచె
నటవేషమున నింద్రనందనుఁ డొకయేఁడు, పేడితనంబునఁ బెంపుదొఱఁగె
హయశిక్షకుం డయి యాలగాపరియు నై, మాద్రేయు లుండిరి మహిమ దొలఁగి


గీ.

కృష్ణ సౌభాగ్యరేఖ నుత్కృష్ట యయ్యు, నిలిచె సైరంధ్రి యను పేర నీచవృత్తి
బలపరాక్రమవంతు లౌపతుల గలిగి, బ్రతుకరా వారు మగుడంగఁ బక్షినాథ.

301


క.

ఏనును నవ్విధమునఁ గడు, హీనదశం బగరఁ గొలిచి యీడేర్చితి నీ
దైనమహాకార్యమును, న్మానసమున నెపుడు నిలిపి మహితవిచారా.

302


వ.

అనిన మేఘవర్ణుండు చిరంజీవి కిట్లనియె.

303


క.

నీ వసిధారావ్రతమున, నావంతయు శంక లేక యహితులలోనన్
జేవ చెడ కెట్లు మెలఁగితి, నావుడు నాతండు పక్షినాథున కనియెన్.

304


సీ.

అవధరింపుం డులూకాధీశమంత్రుల, లోన రక్తాక్షుఁ డనూనవిభవ
సంపన్నుఁడును నయశాస్త్రవిదుండును, సజ్జనప్రియుఁడును సాధుహితుఁడు
విక్రమోదగ్రుండు నక్రూరచరితుండు, నగుచు సర్వజనంబు పొగడుచుండ
బుద్ధిబలంబునఁ బూజ్యుండు నాకంటె, నతఁ డుపమర్దుతో నర్థి నెపుడు


గీ.

నన్నుఁ జంప బుద్ధు లెన్నియేనియుఁ జెప్ప, వినయమున నులూకవిభుఁడు వినక
మఱియుఁ దనకుఁ గలుగుమంత్రులతో నాదు, మతము నడుగ నొక్కమాట గాఁగ.

305


క.

శరణాగతులం జంపెడు, పురుషులు నెచ్చోటఁ గానమును వినమును సు
స్థిరధర్మనిర్మలుఁడవై, పరమకృపం గావు వీనిఁ బక్షికులేంద్రా.

306


వ.

అనిన వారివచనంబు లవలంబించి రక్తాక్షుపలుకు లనాదరంబు చేసి నన్నుఁ దోడ్కొ
ని పోయి కొలిపించుకొని యతం డింత దెచ్చుకొనియె నని యుపమర్దువృత్తాంతం
బంతయుం జెప్పి చిరంజీవి వెండియు నిట్లనియె.

307

క.

పగవానిపక్షమునవాఁ, డగపడినం గాచెనేని నత్యాసన్నుం
డుగ మెలపఁదగదు మెలపినఁ, దెగు నుపమర్దుండపోలె ధీరహితుండై.

308


గీ.

అరులవద్దనుండి యరుదెంచి కొల్చిన, భటుఁడుఁ బాము నొక్కభంగి గాన
మోసపుచ్చి చెఱుచు నాసన్నుఁ డౌవాని, నమ్మినట్లయుండి నమ్మఁదగదు.

309


వ.

అని చెప్పి మఱియును.

310


సీ.

జలక మాడెడువేళ సరసాన్నపానంబు లింపైనయవి భుజియించుతఱిని
కామినీసంభోగకాలంబులెడ మృగ, యావినోదంబుల కరుగుపట్ల
విమతులపై దండు వెడలుచో నట పోయి, విడియుచు నిద్రించువేళలందు
నాస్థానమునఁ గొలువైయున్నయప్పుడుఁ నారామకేళీవిహారములను


గీ.

నృపుఁడు దేహంబుసంరక్ష నియతిఁ జేయఁ, దగును ధర్మార్థకామసాధనము గాఁగ
మనుజనాయకుఁ డించు కేమఱియెనేని, చెడుట సహజంబు నయశాస్త్రసిద్ధమతము.

311


సీ.

దుర్మంత్రి నేలినతోడనే చెడు రాజు, చెడు నపథ్యంబులు చేసి రోగి
కలిమికి గర్వించి కలవాఁడు చెడు వేగ, లోలుఁడు చెడుఁ బరస్త్రీలవలన
బుద్ధి చాలక యుండుపురుషుచేఁ జెడు గీర్తి, నడవడి గొఱగామిఁ జెడును మైత్త్రి
చెడు ననాచారిచేఁ జెందినకుల మెల్ల, నర్థలోభమునఁ బుణ్యంబు చెడును


గీ.

వింతభంగి దుర్వ్యసనికి విద్య చెడును, జెడు సుఖంబు పరాధీనసేవకునకు
నాజ్ఞ పాలింపఁ గొఱగానియధిపుఁ డేలు, మండలం బెల్లఁ జెడు మాటమాత్రలోన.

312


సీ.

శుష్కకాష్ఠంబులసోఁకున నగ్నియు, నతిమూర్ఖువలనఁ గ్రోధానలంబుఁ
జపలునివలన దోషంబును మగువలవలనఁ గామోద్రేకవర్ధనంబు
దక్షునివలన నుదాత్తధనంబును, దయగలవారిచే ధర్మములును
మహితాత్మువలనను మహితధైర్యంబును, మనుజేంద్రువలన భూమండలంబు


గీ.

నంతకంతకు నభివృద్ధి నందునట్లు, విశ్రుతోద్యోగనిజధైర్యవిక్రమముల
నతిసమర్థుఁడ వగుట నీ వరుల గెలిచి, యసమజయలక్ష్మిఁ గొంటి వాయసకులేంద్ర.

313


వ.

అని మఱియును.

314


ఉ.

మూఁపున మోసి యైన రిపుమూర్తిఁ జెడం దఱి వేచి యుండఁగా
నోపుట లెస్స బుద్ధియుతుఁ డోపిక గల్గి చలంబు వట్టి ము
న్నేపునఁ జేరి కృష్ణభుజగేంద్రుఁడు కప్పల మోచి యన్నిటిన్
రూపు చెడన్ వధించె నని రూఢిగ వింటిమి గాదె యేర్పడన్.

315


వ.

అనిన మేఘవర్ణుం డక్కథ వినవలతుం జెప్పు మనినఁ జిరంజీవి యిట్లనియె.

316


గీ.

మందవిషుఁ డనుపేరిట బొందుపడిన, యురగ మిట్టట్టు నాఁకటఁ దిరుగుచుండి
కాంచె మండూకగణసమాక్రాంతికలిత, జీవనం బగు నొక్కసరోవరంబు.

317

క.

కని యక్కొలనిసమీపం, బునకున్ జేరంగ నరిగి భోగివిభుఁడు గ్ర
క్కున జలపాదుం డనియెడు, ఘనభేకముఁ గాంచి దైన్యకంపితుఁ డగుచున్.

318


వ.

ఎలుంగు కుత్తుకం దగుల హీనస్వరంబున నిట్లనియె.

319


క.

నాకడుపుకొఱకు దైవం, బీకార్పణ్యంబు దెచ్చె నెవ్వరి నడుగం
బోకుండితి గతకాలము, మీ కిదె భృత్యుండ నగుచు మెలఁగఁగ వలసెన్.

320


వ.

అనుటయు నమ్మండూకాధీశ్వరుం డగుజలపాదుండు మమ్ము నిప్పు డాశ్రయించు
టకుఁ గతం బేమి యని యడిగిన నమ్మందవిషుం డిట్లనియె.

321


సీ.

అర్ధరాత్రపు వేళ నాఁకొని డస్సి నే, నెరకునై యిట్టట్టుఁ దిరుగుచుండ
నవనీసురాన్వయునర్భకుఁ డొక్కరుం, డాచమనార్థమై యరుగుదెంచి
కానక నామేను కడువడిఁ ద్రొక్కిన, నత్యుగ్రభంగి నే నతనిఁ గఱవ
విష మెక్కి మూర్ఛిల్లి వేగ నన్ బొడగాంచి, పిన్నపాపనితండ్రి భీతి మిగుల


గీ.

మంత్రవాదులఁ గొనివచ్చి మందు లొసఁగి, యతిని బ్రతికించుకొని నన్ను నాత్మఁదలఁచి
యద్భుతోత్పన్నకోపారుణాక్షుఁ డగుచు, బాంధవులఁ జూచి యిట్లనె బ్రాహ్మణుండు.

322


క.

పసిపాపఁ డనక నాసుతుఁ, గసుమాళపుఁజెడుగుఁబురుగు కఱచెను దీనన్
ముసుఁగువడుపాపమున నది, దెసలం జరియించుఁగాత దీనతతోడన్.

323


వ.

అని యతం డెంతయు నలుక వొడమిన వెండియు.

324


ఉ.

కప్పల మోచిమోచి కడగానక వాసిన గొల్చి యాఁకటన్
గప్పిన నెవ్వగన్ వనరఁగా నవి చూచి కృపాకటాక్షముల్
చొప్పడుగ్రాస మిచ్చి తమలో నొకఁడై చరియించువానిఁగా
నెప్పుడు నాత్మలం దలఁప నీభుజగం బటు లుండుఁ గావుతన్.

325


గీ.

సుతుఁడు చచ్చేనేని సుతునితోడనె కూడ, నరుగునట్లు గాఁగ నహి శపింతుఁ
జావఁ డయ్యెఁ గానఁ జావనిమననట్టి, నుగ్గయై చరించు నోరుమాలి.

326


వ.

అని యిట్లు ఘోరంబుగా శపియించిన నమ్మహీసురవరునిష్ణురాలాపంబులు నాకుఁ
గర్ణశూలంబులుగాఁ దత్సమీపవల్మీకగతుండనై యాకర్ణించి మదాత్మగతంబున.

327


గీ.

అశనిహతుఁ డైన శూలవిద్ధాంగుఁ డైనఁ, బడక యొకచోటఁ గొఱ దప్పి బ్రతుకుఁ గాని
విప్రశాపాగ్ని తొడరిన వికృతిఁ బొంద, కుండ బ్రతుకుజంతువులు లే వుర్విమీఁద.

328


తరల.

అనువిచారము నామదిం గడు నగ్గలంబుగఁ బర్వినన్
విను మహీసురశాపభీతిని నీవ దిక్కని చేరితిన్
గనికరంబున నన్నుఁ గైకొని గ్రాస మొక్కొకపూఁటగా
నను భరించిన నీకుఁ గీర్తివినాశ మెప్పుడుఁ గల్గునే.

329


వ.

అని మఱియును.

330

శా.

మామీపెద్దలు బుద్ధిచాలమిఁ గడున్ మైత్త్రిన్ సుఖామోఘవి
శ్రామంబుల్ నడపంగ నొల్లక వృథాక్రౌర్యంబు వాటించి తా
రేమేలుం గనలేకపోయి రిది దా, నేకార్య మూహింపుమా
యేమున్ మీరునుఁ బాయకుండఁ దగుఁగా నెల్లప్పుడున్ జూడఁగన్.

331


ఉ.

ఉండిన నూరకుండుదునె యొక్కరుఁ డీపని చేయ నోపఁ డీ
తం డనుచుం దలంపకు నిధానమువంటినినుం బ్రధానులన్
మండితమస్తకాగ్రముల నాదగువీఁపున మోచి యాడెదన్
మండెడుదీపనానలము మాన్పఁగ భారము మీది గాదొకో.

332


వ.

అనినం బ్రమోదాయత్తచిత్తుండై జలపాదుం డలవు మిగులఁ బుట మెగసి ఫణిపతి
శిరంబులపయిం బ్రవేశించి తత్ఫణామణిమరీచులఁ దనమొగంబు ప్రతిబింబంబు గానం
బడం జూచుచుండె నతనియమాత్యులును నయ్యురగంబు వెన్నెక్కి నిలిచి రివ్విధం
బున మండూకంబుల మోచుకొని నా నాగతివిశేషంబులఁ గొంతప్రొద్దు పుచ్చి
యలసినవాడుంబోలె మందవిషుండును మందగమనంబునం గదల నతనికి జలపాదుం
డిట్లనియె.

333


క.

వడిగా నడచిన మాకుం, గడువేడుక గాక మందగమనము మా కి
ప్పుడు హర్ష మొదవఁ జేయదు, బడుగువుగా వెద్దికతము బలహీనతకున్.

334


వ.

అనుటయు మందవిషుం డిట్లనియె.

335


గీ.

మీరు పెట్టక కాని యాహార మిచట, నబ్బకుండుట తెలిసినయదియ కాదె
వెట్టిపనివాని కైనను వేళతోడఁ, గడుపునకుఁ బెట్టి పనిగొంట గలదు గాదె.

336


వ.

అని మఱియును.

337


క.

ఈకొలఁది చూడ దేహము, నా కేమియు వశము గాదు నడవఁగ నోపన్
మీ కేను భృత్యభావము, గైకొనుటకుఁ బ్రాణరక్ష గావింపఁదగున్.

338


వ.

అనుటయు భేకకులాధీశ్వరుం డయ్యహికిం గరుణించి నీకు ముదల వెట్టితి నిక్కొలని
మండూకంబులలోన నీవలసినవానితోడ నుదరపోషణంబు చేసికొని శీఘ్రంబ
చనుదెంచి నాకు వాహనప్రయోజనంబు దీర్పు మనిన మహా ప్రసాదం బని యతనిఁ
బ్రధానుల నచ్చట డించి మందవిషుండు జలమధ్యంబునకుం జని.

339


చ.

వలసినకప్పలం గడుపువాచఁగఁ బారణ చేసి వచ్చి ని
చ్చలుఁ దనుపూనువాహనపుఁజందము కొండొకసేపు దీర్చి లో
పలికుటిలత్వ మేమియును బాహిరమై చననీక యన్నిటిం
బొలియఁగజేసె నమ్మడుఁగుఁ బొల్పెసఁగెన్ జలపాదశేష మై.

340

వ.

అంతట నొక్కనాఁడు మందవిషుండు జలపాదశేషం బైనసరోవరంబునఁ గ్రుమ్మరి
మండూకంబులం గానక నా కింక నిచ్చట నిలువం బని లేదు జలపాదభక్షణానంత
రంబునఁ జనియెదంగాక యని యెలుఁగెత్తి పలికిన నప్పలుకు లాకర్ణించి జల
పాదుండు నాకుం గీడు సేయం దలంచితివే యనిన మందవిషుం డిట్లనియె.

341


క.

భూసురశాపము నన్నుం, జేసినదోషంబు నిన్నుఁ జెందినపనికిం
గాసిలఁగ నేల రమ్మని, డాసినజలపాదు రూపడంగ వధించెన్.

342


వ.

వధియించి యాకృష్ణసర్పంబు నిజేచ్ఛం జనియెం గావున నేనును నవ్విధంబున శత్రుల
నాశ్రయించితి నని పలికి వెండియు నిట్లనియె.

343


గీ.

అగ్నిశేషంబు ఋణశేష మహితశేష, మడఁపలేకున్న నవి వృద్ధి యగుడు నేచి
నిర్దహించును బొదలును నిగిడి చెఱచు, పెఱిఁగి నిశ్శేషముగ నడఁగించు టురవు.

344


గీ.

అడవి నిర్దహింప ననలంబు తరుమూల, రక్ష సేయ మొలచుఁ గమ్మఱంగ
నట్లుగాక శత్రు నాబాలవృద్దంబు, మొనసి చంపవలయు మొదలడంగ.

345


వ.

అని విచారించి పగతుగ నిరవశేషంబుగా సంహరించిన భాగ్యవంతుండ వని పలికి
చిరంజీవి యిట్లనియె.

346


సీ.

వ్యసనశీలుఁడు గాక వసుమతీనాథుండు, సకలప్రజానురంజనము వడసి
క్రోధలోభమదాదిగుణముల వర్ణించి, సత్యధర్మక్షమాశాలి యగుచు
మొనసి యాత్మచ్ఛిద్రములు గాననీ కన్య, మానవచ్ఛిద్రము ల్మది నెఱింగి
దేశకాలంబులు దెలిసి సప్తాంగసం, రక్షకుండై పరాక్రమము మెఱసి


గీ.

యాత్మసంరక్ష మఱవ కహర్నిశంబు, ధార్మికుం డని జగ మెల్లఁ దన్నుఁ బొగడ
నిగిడి సత్కీర్తి దిక్కుల నించెనేని, దేవతాంశమువాఁ డని తెలియవలయు.

347


వ.

అని మఱియును.

348


క.

కడిఁదిపగరు గైదువు గొని, పొడిచినయెడ నైన బ్రదుకు బుద్ధిని జెఱుపం
బడినయమిత్రుఁడం మఱి యె, న్నఁడుఁ దా బ్రతుకంగలేక నాశము నొందున్.

349


చ.

అలఘునిశాతహేతి నదరంటఁగఁ దాఁకినవైరి యాహవ
స్థలమున నోర్చుఁ గాని బహుసైన్యములన్ బొలియింపలేఁడు ని
శ్చలనయతత్త్వసాధనము శాత్రవపుత్త్రకళత్రమిత్త్రమం
డలబలశౌర్యవైభవవిడంబములన్ హరియించు గ్రక్కునన్.

350


వ.

అని మఱియును.

351


క.

ఏపని యుద్యోగించిన, నాపని దైవానుకూల మైన ఫలించున్
రూపింపఁగ మానుష మని, చేపట్టి పెనంగెనేని సిద్ధింప దిలన్.

352

వ.

కావున దైవానుకూలత లేని పౌరుషవ్యాపారంబు నిరర్థకం బెట్లంటేని.

353


సీ.

తాపసవేషంబు ధరియించె రాముఁడు, బంధనప్రాప్తుఁడై బలి యడంగె
వనవాసగతు లైరి వగఁ బాండుతనయులు, యాదవు లన్యోన్యహతులఁ జనిరి
ఘోరదుర్దశ నొంది కుందె నైషధరాజు, శరతల్పగతుఁ డయ్యె శాంతనవుఁడు
వామనరూపంబు వాసుదేవుఁడు దాల్చె, దశకంఠుఁ డర్జునోద్ధతికి నొదిగె


గీ.

సర్వమును దైవవశమున జరుగు జగము, గాన నేరక తాఁ గర్తగాఁ దలంచు
మూఢచిత్తుఁడు సుజ్ఞానమూర్తి యైన, పురుషుఁ డిన్నియు నెఱిఁగి సుస్థిరతనుండు.

354


వ.

అని మఱియును.

355


చ.

శ్రుతమునఁ జేసి బుద్ధి మతిశూన్యఘనవ్యసనంబుచేత మూ
ర్ఖతయు మదాలసత్వమునఁ గాంతయుఁ జంద్రునిచేత రాత్రియున్
వితతసమాధిచే ధృతి పవిత్రజలంబులచేత నేఱు నూ
ర్జితనయమార్గవర్తనముచే నృపతిత్వ మలంకృతం బగున్.

356


వ.

అని యిట్లు చిరంజీవి చెప్పినహితోపదేశంబునకుఁ బగ సాధించినసాహసంబునకుఁ
బ్రియం బంది మేఘవర్ణుం డతని కర్ధరాజ్యం బిచ్చి తానును సామ్రాజ్యంబునం బూ
జ్యుండై సుఖం బుండె నని చెప్పుటయు.

357


ఉ.

హారపటీగహీరరజతాద్రితుషారధరాధరేంద్రమం
చారమరాళరాజహరనారదపారదకుందచంద్రికా
క్షీరమృణాలశంఖసురసింధురఫేనఫణీశకాశక
ర్పూరసమానకీర్తివరభూషణ సజ్జనలోకపోషణా.

358


క.

ఉభయదళరుద్ర లక్ష్మీ, శుభమందిర సతతదానశోభిత సమ్య
గ్విభవసురాధిప విలస, త్ప్రభవా హేమాద్రిధీర బసువకుమారా.

359


మత్తకోకిల.

వాసవప్రతిమానవైభవ వైరిరాజభయంకరా
వాసుదేవపదాబ్జపట్పదవాంఛితార్ధసురాంఘ్రిపా
భాసురప్రమదామనోభవ భానువంశసముద్భవా
ప్రాసతోమరకుంతముద్గరపట్టసాయుధసాధనా.

360

గద్యము. ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర బ్రహ్మనామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ నారా
యణనామధేయప్రణీతం బైనపంచతంత్రంబనుమహాకావ్యంబునందు
సంధివిగ్రహం బనునది తృతీయాశ్వాసము.

————