Jump to content

నేటి కాలపు కవిత్వం/సమకాలాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీగణేశాయనమః.

వాఙ్మయపరిశిష్టభాష్యం.

సమకాలాధికరణం.

పూర్వపక్షం.

అవునయ్యా; సమకాలపువారలు మెచ్చరే గదా అని అన్నట్లు మీరు సమకాలికులు గనుక వీటిని మెచ్చరు

"యే నామ కేచిదిహ నః ప్రథయత్యవజ్ఞాం,
 జానంతి తే కిమపి తాన్ ప్రతి నైష యత్నః.
 యథా స్త్రీణాం తదా వాచాం సాధుత్వే దుర్జనో జనః?"

అనిభవభూతి
  
"దిజ్నాగానాం పథిపరిహరన్"

అని కాళిదాసు
   
"మద్వాణి మా కురు విషాదమనాదరేణ,
 మాత్సర్యమగ్న మనసాం సహనాఖలానాం."

అని జగన్నాథుడు ఈతీరుగా తమకావ్యాలనువిమర్శించేవారిని గురించి అన్నారు మాకావ్యాలు మంచి వేనంటారా?

సమాధానం

చెప్పుతున్నాను. క్షుద్రకులటలు సయితం ఈవాదం ఆధారం జేసుకొని పరిశుద్ధురాలైన సీతను లోకులు దూషించలేదా? అట్లానే మమ్మునుదూషిస్తున్నారు. అని వాదించ వచ్చును గదా? ఇది అసంబద్దవాదం ప్రాచీనుల్లో భవభూతి మొదలైన వారిని నిందించారు. నిజంగా కుత్సితకవులునూ నిందించారు. భవభూతి మొదలైనవారిని నిందించిన సంగతి విదితమే గనుక వాటిని మళ్లీ ఉదాహరించలేదు.

"ఆకీర్తివర్తనీం త్వేవం కుకవిత్వవిడంబనామ్" (కా.సూ.వృ)

అని వామనుడు కుకవితను నిందిస్తున్నాడు.

"బూడిదెబుంగలైయొడలు పోడిమిదక్కి మొగంబు వెల్లనై
 వాడల వాడలందిరిగి వారును వీరును చొచ్చుచోయనన్
 గోడల గొందులందొరిగి కూయుచునుండెడి కొండవీటిలో
 గాడిదె! నీవునుంగవివిగావుగదా అనుమానమయ్యెడున్"
                                           (ప్రభాకరశాస్త్ర్యుదాహృతం!)

అని కుత్సితకవులు నిందితులవుతున్నారు. సమకాలపువారు నిందిస్తారనేదే కావ్యానికి ఒక యోగ్యతగాదు. ఇట్లా వాదించడమే సవ్యభిచార మనేహేత్వాభాసమని నైయాయికలు చెప్పుతున్నారు.

ఈహేత్వాభాసమిది. వీరు ఉత్తమకవులు సమకాలంలో నిందితులు గనుక. భవభూతి కాళిదాసాదులవలె, అని వీరివాదం. ఈవాదం తోనే అధమకవులనిగూడా తేల్చవచ్చును.

వీరు అధమకవులు. సమకాలంలో నిందితులు గనుక, కొండవీటి గాడిదెవలె ఈతీరుగా పరస్పరవిరుద్ధమైన రెండుసిద్ధాంతాలు తేలుతున్నవి. గనుక ఈవాదం హేత్వాభాసంతో కూడివున్న దన్నాను. ఇప్పటి కృతు లనేకం పులుముడు అయోమయం, చిల్లరశృంగారం మొదలైన దోషాలతో కూడినవని నేను విశదపరచాను. ఇవి ఆదోషాలతో నిండివుండ లేదని వివరిస్తే, ఆమాటలు ఉచితమైన ప్రతివచనంగా వుంటే స్వీకరిస్తాను. మళ్లీ సమాధానంవుంటే చెప్పుతాను. లేదా ఆమాటలు శిరసా వహిస్తానంటున్నాను.

అని శ్రీ..ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో సమకాలాధికరణం సమాప్తం.