నేటి కాలపు కవిత్వం/వికారాధికరణం
శ్రీ ర స్తు.
వాఙ్మయ పరిశిష్టభాష్యం.
వికారాధికరణం
వికారాలు
దయా, సత్య, విజ్ఞాన, ప్రభృతిగుణాలచేత తేజస్వి అయిన మనిషికి వేషాదులు అప్రధానమై అప్రధానంగా తేజస్సుగోచరిస్తుంటుంది. అది లేనప్పుడు వేషం సవరించడం జుట్టుదిద్దడం, ఇట్లాటివి ప్రధానమౌతవి. ఇట్లాటివికారాలు ఈకాలపుకవిత్వంలో తరుచుగాకనబడుతున్నవి.
నాలుగుపాదాలు ముగించి ఆఖరున రెండుమాటలు తగిలిస్తారు. కొందరు దరువులు పట్టిస్తారు కొందరు కృష్ణపక్ష కర్త మూడుపాదాలు వ్రాసి నాలుగోపాదంలో రెండుమాటలు వ్రాసి చాలిస్తాడు.
"మొగముగంటి గనులుగంటి, మొగిలుగంటి పాటవినుచుంటి"
"అదయతను ద్రుంచినారే
పెంధూళిఁ
జిదిమి వెదజల్లినారే
మొదలంట దూర్చినారే
భయదాగ్ని
కీలలను వ్రేల్చినారే"
అని పాదాల్లో యిమడని మాటలను రెండుపాదాల మధ్యన వేసి దరువు కొట్టుతున్నాడు.
"గళఘోరగంభీర ఫెళఫెళార్బటులలో
మెరపేలా?
నిబిడ హేమంతరాత్రీకుంతలములలో
చుక్కేలా?"
అని నాలుగుపాదాల్లో యిమడని వాటిని అంతాన వేస్తున్నాడు.
"నీ
కనుఱెప్ప కొనలనొక
చినుకైన కదలనీ
నీ
పెదవిచివురులనొక నిడుదయూర్పువిసరనీ"
అని పాదాల నెత్తిమీద ఒంటిగా "నీ" లను నిల్చుతున్నాడు. ఒక్కొక పేజీలో నాలుగు పంక్తులే అచ్చువేసి తక్కినకాగితమంతా ఖాలీచేస్తున్నాడు. కొన్ని పద్యాల నెత్తిమీద చుక్కబెట్టుతున్నాడు. ఒక వేళ యీసవరణలన్నీ సొగసుకూర్చేవని ఒప్పుకొన్నా అసలుకావ్యం వికృతమైనప్పుడు.
"వపుష్యలలితే స్త్రీణాం
హారో బారాయతే పరం" (ఆగ్నేయ)
అన్నట్లు వికారాలుగానే పరిణమించడం సహృదయులకు విదితం అసలు తేజస్వికి ఈ వేషవికారాలు అనావశ్యకం. ఈదరువులు విరుపులు తాళాలు వికారాలే అవుతున్నవని క్రమంగా స్పష్టపరుస్తాను గనుక ఈచర్చ యింతటితో వదలుతున్నాను.
అని శ్రీ ... ఉమాకాన్త విద్యాశేఖర కృతిలో వాఙ్మయసూత్ర
పరిశిష్టంలో వికారాధికరణం సమాప్తం.