నేటి కాలపు కవిత్వం/ప్రస్తావన

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రస్తావన

నావాఙ్మయసూత్రపరిశిష్టంలో నేటికాలపు కవిత్వమనే యీ కృతి ప్రథమాధ్యాయం నేటికాలపువిద్య, నేటికాలపుకృతులు అనేవి ద్వితీయతృతీయాధ్యాయాలు తృతీయాధ్యాయంలో పరిశిష్టం సమాప్తమవుతుంది మద్రాసులో కొంతకాలం కింద జరిగిన ఒకసమావేశంలో శ్రీ వింజమూరి రంగాచార్యులవారు శ్రీ భావరాజు సుబ్బారావుగారు అదివరకు వ్యాకరణసిద్ధాన్తాలను ప్రవచనంచేయడానికి ఆంధ్రదేశమందలి ముఖ్యపట్టణాలకు పోయినప్పుడు మరికొందరు మిత్రులు నేటికాలపు కవితను గురించి ప్రస్తావించా రని ఆసమయంలో నేనేమీ చెప్పలేదని నాకు జ్ఞాపకం. అప్పటికి ఆపరిశీలనం ముగియకపోవడమే దానికి కారణం. విచారణ ముగిసిన తరువాత యీకృతిలో వున్న విషయాన్ని 5027 సం॥ చైత్రంలో చెన్నపురి ఆంధ్రసభలో ఉపన్యసించాను. ఆంధ్రపత్రికలో ప్రకటితమైన ఆఉపన్యాసాల విస్తరరూపమే యీకృతి. వాఙ్మయసూత్రం ప్రకటితమైన తరువాత పరిశిష్టం ముద్రితం కావడం క్రమమైనప్పటికీ, పరిశిష్టం ఒక వేరైన భాగంకావడంవల్ల మహావాక్యానయత్వం వ్యక్తం కాకున్నా అర్ధబోధానికి ప్రాతికూల్యం అపతితంగాదు.

ఈకృతి ముద్రితంకావడానికి దయతో తోడ్పడ్డ శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రులవారికి కృతజ్ఞతాసూచకంగా నమస్కృతు లర్పిస్తున్నాను. మనదేశంలో విద్యయిప్పటికీ వేరువేరు మార్గాల్లో నడుస్తున్నది గనుక జిజ్ఞాసావిషయాలను సంస్కృతంలోను ఇంగ్లీషులోను సయితం ఉపోద్ఘాతరూపాన క్లుప్తంగా తెలిపినాను. విచారణోపక్రమంలో సహాయులైన సాహిత్యతత్పరులను కృతజ్ఞతతో స్మరిస్తున్నాను.


చెన్నపురి
5027 శ్రావణ పంచమి

అని
ఉమాకాన్తుడు