నీతి రత్నాకరము/మూడవ వీచిక

వికీసోర్స్ నుండి

ఒక్కరి గొప్పతనమున కసూయపడుచుండుట మానవ సామాన్య స్వభావము దుర్గుణములయందెల్ల నసూయ ముందుగఁ బరిగణింపఁబడును. దానివంటిది వేఱోకఁడు లేదని పెద్దలందురు. అది యొక్కఁడున్నదికదా యనరాదు. అన్ని దుర్గుణము లుండిన గాని యది నిలువఁజాలదు కాన నసూయ యుండిన నన్ని యవగుణము లుండినట్లే యూహింపవలయును. లోకమున నసూయయే పెక్కండ్ర, బాధించుచుండును. ఎందఱి గొప్ప తనమునకో యపకీర్తిని గల్గించుచుఁ దాను రాజ్యము చేయుచుండును. దాని జయించుటయే దిగ్విజయమనంబడును. దానిని జయింపక యెన్ని దేశముల జయించిన నది విజయము కానేకదు. ఆవిజయమునఁ దనకు సుంతయు మేలు లేదు. అసూయను జయించినవాఁడే భగవదను గ్రహమునకుఁ బాత్రుం డగును.

విలాస ధామమున నిరువురుమిత్రు లుండిరి. వారు శ్రీనివాసదాసు తెగకుఁ జేరినవారే. ఇందిరా దేవి పితృపక్షపువారు. వారు సోదరులు గారు. కాని వావింబట్టి సోదరులవంటివారే. ఒక్కని పేరు పాతాళుడు. రెండవవాని పేరు కుంతలుఁడు. పాతాళుఁడే యిందిరాదేవికి నించుక సమీపబంధువు. అనఁగా సోదరుఁడు, కుంతలుఁడు పాతాళునకు దూరపుసోదరుఁడు. వీరిద్ద ఱోక్కగురువుకడ నేమో మంత్రములు నేర్చుకొనిరి కావున సతీర్థ్యులు. కుంతలుఁడు స్వీయబుద్ధి ప్రభ లేనివాఁడు. పాతాళుఁడు మాయావి, టక్కు, టమార, గోకర్ణ, గజకర్ణములు లోనగు విద్యలయం దాఱి తేఱిన మేటి. చూచుటకుఁ బరమసాధువుగ నే తోఁచును కానీ నిలువెల్ల విషమే. ఏమాట పల్కిన నందొక్క విషబిందువు లేకయుండదు. కావుననే యెల్ల వారు వానిమాట లను నమ్మకయుండిరి. క్షుద్రవిద్యలయందు నిరుపమాన పాండిత్యమును సంపాదించెను వానిచేఁ బామరు లాతని మాంత్రికుఁడని భ్రమపడి పిలుతురు. ఆభిచారికహోమములఁ జేయుచుండుట యాతనియలవాటులలో మొదటిది దానిచేఁ బెక్కం డ్రాతనికి భయంపడుచుందురు. కుంకుమ రేఖ యతని కనుబొమలనడుమ విరాజిల్లుచుండును. కుంతలుఁ డాతనిననుసరించి మాంత్రికుఁ డని పించుకొన్న వాఁడే. ఐనను బాతాళునిమాట జవదాటువాఁడు కాఁడు.

రాధికకు నించుక ప్రాయముకాఁగాఁ దనకా కన్యక నిమ్మని యిందిరాదేవికి వార్త పంపుచుండెను ఆమాటనే యామె చెవిఁ జొరనీయక యుండెను. చాలప ర్యాయము లా ప్రయత్నమును సాగించి యిఁక లాభము లేదని నిరాశుఁ డయ్యెను. కాని మనస్సున నాకన్యకను హరించికొని పోయి "పెండ్లియాడవలయునని నిశ్చయించుకొనియెను. దానికిఁ గావ లయుపరికరములను సిద్ధము చేయుచుండెను. భరతపురమును గ్రామ మావిలాస ధామమునకు మూఁడుక్రొశముల యంత దూరమునఁ గలదు. అది కుగ్రామమైనను భరతపురమను పేరును వహించెను. పూర్వమెప్పుడో నగరముగనే యుండెనఁట ఆగ్రామమునకుఁ దూర్పుదిశయం దొక దేవాలయము కలదు. అది ప్రాచీనమే కాని నవీనముగా నిర్మింపఁబడినది కాదు. దాని నెవరు కట్టించారో తెలియదు గాని దానినిర్మాణ మతివిచిత్రము. అందు రెండు గర్బాగారములు గలవు. ఒక్క దానియందు నృసింహమూర్తియు వేఱోక తావున మహా కాళియుఁ బ్రతిష్ఠింపఁబడిరి. ఆ నిర్మాణము కొత్తది. మఱెందు నిట్టివిధము కానరాదు. దానిం గట్టించిన వాఁడు నరసింహభ క్తుఁడు. కాళీ సేవకుఁడు కూడ నయినట్టు పొడగిట్టక మానదు. ఈ యిద్దఱు దేవతలు క్రూర దేవతలని కొంద ఱందురు. కాని వారు క్రూరదేవత లేకాలమునను గారు. భక్తుల వాంఛలననుసరించి దేవతా రూపము శాంతక్రోధములఁ దెలుపుచుండును. పేరును బట్టి తత్త్వ మెఱుఁగనివారు వెక్కండ్రు, క్రూరత్వ సౌమ్యత్వముల నారోపింతురు. అది పొరపాటుగాని వాస్తవము కాదు. ఆ దేవాలయము భరతపురమునకు మిక్కిలి సమీపముగాఁ గాక దూరముగాక యుండును. దాని ప్రాకార మత్యున్నతమై. యప్పుడు కట్టినట్లగపడును. ధ్వజ స్తంభము కూడ నున్నతమైనదియే. నిత్య నైవేద్య దీపారాధనములు మాత్రమే సాగును. ఇరువు రర్చకులు, వారికిం దృప్తిగా భూములు కలవు. వాని ననుభవించుచు నావిగ్రహములం గడుగుకొని వారు బ్రదుకు చుందురు.

ఆదేవాలయమునఁ బెక్కు మండపములు గలవు. వివాహము లామండపముల సాగుచుండును. లక్ష్మీదేవి నృసింహస్వామి పక్షమున నిలుచుటు జేసి యా దేవుని క్రూరత్వము ఫలింపదనియు మేలే కలుగుచుండుననియుఁ బామరుల విశ్వాసము.

శ్లో. 'యాదృశీ భావనా యత్ర సిద్ధి ర్భవతి తాదృశీ'

అన్న పెద్దలమాట తప్పదుకదా. ఆ దేవాలయమున మధ్యాహ్న సాయంకాలముల నర్చకు లుందురు. ఇతర కాలములయందు మహర్షులు పావురములుగా వచ్చి యా దేవు నారాధింతురని కొందఱు వాకోనుదురు. ఎతవఱ కది నిశ్చయమో కానీ పావురములు మాత్రము కలరవములు చేయుచు గోపురము మీదను, విమానములపై నను దిరుగుచుండుట నిశ్చయము. ఆపావురము లే మహర్షులు, ఆకలరవము లే సామగానములు, అగునన్నఁ గాదనువా రెవ్వరు ?

ఆదేవాలయమునకుఁ బాతాళుఁడు కుంతలుఁడు పోవు చుండువారు. ఆయర్చకులు పాతాళునకు మిత్రులు, ఎపుడైన నతఁడు హోమము చేయుచు నాలుగుడబ్బులు పూజారుల కిప్పించుచుండుటం బట్టి వారు వానికి మిత్రులైరి. వారితో నొకనాఁడు పాతాళుఁడు తన మనోగతము నిట్లెఱింగించెను. మీరు నాకుఁ జిర కాలమిత్రులు. ఎన్నఁడుగానీ మీ వలన నొక కార్యము కావలసియున్న దని చెప్పినది లేదు. ఇపు డొకమహా కార్యము నాకుఁ గల్గినది. నావలన మీకు ముందెంతో మేలు కలుగఁగలదు. అది యిపుడే తెల్పుట న్యాయము కాదు. విషయమును వినుండు. దాని వెలిపుచ్చమని ప్రమాణము చేయవలయును. అని వారట్లే ప్రమాణముచేయఁగా నిట్లు తెల్పెను. మాపట్టణమున శ్రీనివాసదాసు గలఁడు కదా. అతని భార్య నాతోబుట్టువు. చిన్న తనము నుండి తనకూఁతును రాధికను నాకిచ్చి పెండ్లి చేయుదునని వాగ్దానము చేయుచు నిపు డీయననుచున్నాఁడు. ఈకన్యకను నమ్మి యెందఱో కన్య కల నిత్తుమన్న వలదంటిని. నన్ను నమ్మించి యిపు డిట్లు చేయుట న్యాయమా! ధనవంతుఁడు కాన నేది యెట్లు చేసినను జెల్లును. ధసహీనుఁడనగుట నాపక్షమున నెవ్వరు న్యాయముకూడఁ బలుకరు. కాలమహిమ మిట్లున్నది. కావున న్యాయమును నిలుపఁ బూని నే నొకయుపాయము చేసితిని. ఆకన్యకను నడికి రేయి నిటఁ గొనివత్తును. దేహస్మృతి లేకయుండఁ జేసి తెచ్చెదను. మీరు రాత్రు లిందుంట వాడుక లేదు కదా. తలుపులు తెఱచి యుంచుఁడు. ఆ రేయి వివాహము జరపుకొని యెందో పోవుదుము. మఱుదినము మీరందఱతో నెవరో తలుపులు తెఱచి రని చెప్పుఁడు. మీకేమియు బాధయుండదు. నాపనియు నగును. ఈయుపకారమునకై మీకెంతో ధనమిత్తును. ఆజన్మము. మీకుఁ గృతజ్ఞుడనై యుందును. ఈవార్తను బదిలముగ మది నిలుపుఁడు. ఆని యుక్త యుక్తముగాఁ దెలిపితిని గదా యని సంతసించుచుఁ దెలిపెను. వా రామాటల నమ్మి యట్లే కానిమ్మని యంగీకారమును దెలిపిరి.

ఒక్కనాడు కుంతలుని బిలిచి పాతాళుఁ డిట్లు బోధించెను. వ్యాధులు తొమ్మండ్రుగురు నామాట జవదాటక చేయువారు గలరు. ఈకృష్ణసప్తమీశుక్రవారము సాయం కాలము వారు నీయింటికి వత్తురు. వారి కన్నము పెట్టి తాంబూల మిమ్ము. జామురాత్రి, కాఁగా నిరువురు మనుష్యులు సురాభాండములఁ దీసికోని మీయింటి వెనుకటిభాగమునుండి పిలుతురు. ఆందేయుండి తలుపుతీయుము. తొమ్మండ్రుగురు వ్యాధులు తనివితీఱఁ ద్రావుదురు. వారిం దోడ్కొని శ్రీనివాసు దాసు నింటి వెనుకటి భాగముకడకు రమ్ము, అందొక్క వట. వృక్షము కలదు కదా. దానిమూలముకడ మీరెల్ల నుండుఁడు. లోపలినుండి యా రాధికను దీసికొని మేము వత్తుము. మన మందఱము కలిసి భరతపురమునకుం బోవుదము. ఈనడుమ నీవు వివాహమంత్రములు నేర్చుకొనుము. దానికిం గావలసిన పరికరముల సిధ్ధము చేయించి యుంచుము. అపుడు తడవుకోన రాదుసుమీ. నీవీ కార్యమునఁ గడుజాగరూకుఁడవై యుండుము. నా కింతకంటె మేలుచేయు సమయమురాదని నమ్ముము. అని నచ్చఁ జెప్పెను.

కుంతలుఁ డామాటలకు మదిజంకుచు నిట్లు హిత ముపదేశించెను. మిత్రమా! నీవన్నింటను జతురుండవని నే నెఱుంగుదును. కాని శ్రీనివాసదాసు ధనవంతుఁడు. మంచి వాఁడని విఖ్యాతిం గాంచిన వాఁడు. ఎవరినోటనుగూడ దాసు ధర్మాత్ముఁడన్న మాటయే వెడలును. ఇందిరాదేవి పతివ్రతాశిరోమణి. రాధికయు సంగీతసాహిత్వచిత్రకళలయం దసమానపాండిత్యమత్యల్పవయస్సుననే సంపాదించినది. ఆనాఁటీసభలో నా కన్యకకుఁ గలసంగీతజ్ఞానమును మెచ్చుకొననివాఁ రొక్కఁడైనఁ గలఁడే. అట్టికన్యకను దొంగిలికొని పోయి భరతపుర దేవాలయమునఁ బెండ్లి చేసికొనుట యసంగత కార్యము. అది సాగుట కష్టము. సాగినదనియే యనుకొందము. మరల మన మీలోకమున మనఁగలమా! మర్యాదగల యేమానవుఁడైన మనలఁ జేరనిచ్చునా! కావున నీ కార్యము మానుట మంచిది. అంతియ గాదు. రాధికకు నీకును హస్తిమశకాంతరము గలదు. ఆమె రూపవతియగుటయే గాక విదుషీమణి. నీవో నిరక్షరకుక్షివి. నీ కాకన్నియఁ దగినది కాదు. ఆప్రయత్నము మానుమని మఱి మఱి నొక్కి చెప్పెను.

పాతాళుఁ డాతనిం గాంచి నవ్వి యిట్లు పలికెను. వెఱ్ఱివాఁడా! పెండ్లి కానిమ్ము. ఆవల నన్నుఁ గన్యాజనకు లేమియుఁ ననఁజాలరు. రెండుమూడుదినములా గ్రహించి మరల సాదరముగాఁ జూతురు. మనల నింకొక్కనికిచ్చి పెండ్లి చేయఁ జాలరు. అట్టియాచారము లేదుకదా. విధి యిట్లున్న దని క్రమక్రమముగా నాయందుఁ బ్రీతిఁ జూపుదురు, కన్నియయు నిఁకఁ దప్పదుకదా యని నన్నుఁ బ్రేమించును. అన్నియు సరిపడును. నన్నే యెల్లవా రాశ్రయింతురు. ఆయింటి కధికారిని నే నగుదును కావున జంకుమాని నాయా నతిఁ జేయఁబూనుము. మంచిలాభమును బోఁగొట్టుకొనకుము. అని గట్టిగా బలికిన నేమి యుననఁజాలక కుంతలుఁ డట్లే యొనరింతునని యంగీకరించెను.

ఆమీఁదఁ బాతాళుఁ డింటికిం బోయి యంబాపూజా ర్దము కొన్ని వస్తువుల సేకరించెను. తనమాటలో మెలఁగు వారి కెల్ల నీవిషయము తెలిపెను. వారెల్ల సిద్ధముగ నుండిరి, కొన్ని మూలికలం దెప్పించి యొక యంజన ద్రవ్యము సిద్ధము చేసెను. మఱికొన్ని వస్తువులం గలిపి విస్మృతిని గల్గించు పానకము సిద్దపఱచెను అడవినుండి యుడుముల నాల్గింటిని దెప్పించి కాపాడుచుండెను. తనకుఁగల మంత్ర విద్యాపాండి త్యమునకు ఫలముగా నన్ని పనులు సిద్ధము చేసికొని వేళకై వేచియుండెను. పాతాళునకుఁ గర్ణపిశాచికావిద్య తెలియును. దానినే చక్కగ నారాధించు వాడు. అది క్షుద్ర దేవతయే యైనను కొన్ని కొన్ని సమయములయందు విశేషించి యుపకరించును. తిరస్కరిణి యనువిద్య యతఁ డెఱుంగును. దానిచేఁ దానితరులకుఁ గనఁబడకయుండ నుండఁగలడు. అట్లుండుట కొలఁది ముహూర్తము లే యైనను జమత్కారముగ నుండుటయే గాక యల్పముగ సాయము కూడ నగును కదా. అట్టి కార్యముల వలన ముందు హానికల్గినను దత్కాలము మహోపకారముగ నావిద్య కనఁబడును. పెక్కుమూలికల నాతఁ డెఱుంగును, వీనియన్నింటిసాయమున నాఘన కార్యమును జేయఁబూనెనే కాని విధి వీనినన్నింటినీ మించి పనిచేయఁ గలదుగదా యను నూహ యాతనికి లేక యుండెను. దేవతలచే నీచ కార్యము చేయింపఁ బ్రయత్నించిన నవి యెదురెక్కి తన్నే మృతినొందఁ జేయునన్న విషయము నెఱుంగఁ జాలినంత జ్ఞానము కలవాఁడు కాఁడు. విశేషించి యైహికఫలములే ముక్తిఫలాధికము లను కొనునల్పుల కట్టివిశేషవిషయములు గోచరింప వనుట నిక్కము. నాలుగు దినములు కొఱఁతగా నాతఁ డనుకొన్న కాలము ముగిసెను. త్వరపడ వలసిన యవసర మేర్పడియెను. కుంతలాదులను హెచ్చరించెను. వారు చెప్పినట్లు చేయ సిద్ధముగా నుండిరి.

విలాసధామముననే యొక్క శ్రోత్రియ బ్రాహణుఁడు కలఁడు. అతని పేరు శంకరాభరణశర్మ. అనంతాచలశర్మ యనియు నాతనిఁ బిలుతురు . రెండవ పేరే ప్రసిద్ధమయ్యెను. ఆభూసురుఁడు దరిద్రుడు. కాని యయాచకుఁడు ప్రాప్తలాభ మున నానందించువాఁడు. అనురూపవతియు ననుకూల ప్రవృత్తి మతియు నగుకళత్ర మాతనికుండెను. మంచి శాస్త్రపాండిత్యము గడించియు గర్విగాక శాంతధనుఁడై యేమియుఁ దెలియనివాని చందమున నుండువాఁడు. ఆతనికడఁ జదువు కొనుశిష్యులు కొందఱు గలరు. మంత్ర విద్య యాతని సొమ్మన వలయు. భరతపురమునఁ గల కాళికాదేవి కాతనియందుఁ బ్రీతి యధికము స్వప్న మున దర్శనమిచ్చుచుండును. కాని యావిషయమాతనికి నా దేవికిఁ దప్ప నితరుల కెఱుఁగఁ దరము గాదు. కొంద ఱుపాసకు లావార్తను బలుకుచుందురు. ఏది యెట్లున్నను దేవీ పూజాతత్పరుఁ డనుట కావంతయు శంక లేదు.

క్షుద్రవిద్య లాతఁ డెఱుంగఁడు. కాని పాతాళుఁ డన్యాయ ప్రవర్తకుఁడని నీచమతియని పరమఘాతుకుడని యాయన యెఱుంగును, శ్రీనివాసదా సెప్పుడో యొకప్పుడనంతాచలశర్మను జూడఁబోయి రాధికా వివాహమునుగూర్చి ప్రస్తావించియుండెను. ఆయాలోచనము మంచిదని యాతఁడు హిత ముపదేశించెను. అంతమాత్రపుఁ బరిచయమే కాని విశేషసంబంధ మాయిరు వురకు లేదు. రాధిక విద్యావతి, గుణవతి యని యాతఁ డెఱుంగును. కాన విద్యాపరీక్షా దినమున నాతఁడు నాహూతుఁడై వచ్చి మెచ్చుకొనిన వారిలోఁ బ్రథముఁడుగ నుండెను. ఆనాడు మొదలుకొని యపుడపుడు రాధిక కుశలముల నరయుచుండు వాఁడు. విశేషించి శిష్యుల మూలమున నాకన్యక కుశలముల నెఱుఁగుచుండెను. పాతాళుని మిత్రకోటిలో నొక్కఁడు 'చాల కాలము నుండి యనంతాచలశర్మ కడ విద్య నభ్యసించుచుండువాఁడు. వానిపేరు తుహినకిరణ శేఖరుఁడు. బుద్ధిమంతుఁడే కాని పాతాళుని స్నేహమున నించుక నీచ కార్యముల నొసరింప సాహసించుచుండువాఁడు. ఆ కార్యము గురువులకుఁ దెలియకుండ నేచాటుననో చేయుచు జంకుగలిగియే యుండువాఁడు. పాతాళుఁ డాతనిని దన ప్రియమిత్రులలో నొక్కనిగా భావించుచుఁ దనరహస్యములెల్లఁ దెలుపుచుండెను. ఆవాడుక చొప్పున వివాహ ప్రయత్నము తాఁ జేయుటయు దానికిఁ గుంత లాదులు తోడ్పాటు చూపుటయుఁ దెలిపెను. మఱెవ్వరితో నీవిషయము తెలుప రాదని చెప్ప మఱచిపోయెను. తన ప్రియ మిత్రుఁడన్న విశ్వాసమే యీ ప్రమాదమునకు హేతువని చెప్పవచ్చును.

తుహినకిరణ శేఖరుఁడు రాధికం బాతాళుడు దొంగిలి కొనిపోయి భరతపుర దేవాలయమునఁ బెండ్లియాడఁ జేయు చున్న ప్రయత్నములను మాట వెంబడిని సంగ్రహముగ గురువునకుం దెల్పెను. పిదప నిది యిట్లు జరగుట దైవవశముననే యనుకొని యతఁడు గుటకలు మ్రింగసాగెను. అనంతాచల శర్మయు నామాటల విని విననట్లు నటించి యెట్లో పాఠము ముగించి శిష్యులనెల్ల సాగనంపి తనలో నిట్లు తలపోయఁ జొచ్చెను. “పాతాళుఁడు పరమదుర్మార్గుడు. క్షుద్ర మంత్ర, తంత్ర ముల నెఱుంగును విశేషించి ఘాతుకుఁడు. ఎట్టివారినైన స్మృతి లేకయుండ మూలికా ప్రభావమునఁ జేయఁగలడని విన్నాఁడను. రాధిక నెట్లైన గొనిపోయి పెండ్లియాడును. లేదా బలియిచ్చును. కాళికాలయమున వాఁ డపుడపుడు నాభిచారిక హోమములఁ జేయుచుండునన్న మాట నే విని యుంటిని. వాఁ డే ప్రయత్నము చేయునో తెలియదు. ఈ కార్యమును సాగకుండ నిపుడే చేసినఁ బాతాళునకు హాని గల్గును. నామూలమున నెట్టివానికిఁ గాని హాని కలుగరాదు. కావునఁ దగిన ప్రయత్నము చేసెద. కాళికా దేవి నాయందుఁ గరుణ గలదియే యని నాకు విశ్వాసము కలదు. ఆజగజ్జనని, బ్రార్థించి రాధిక కించుకే నపాయము కలుగకయుండఁ బ్రయత్నించెద." అని తలపోసి తనశిష్యులలో మిగుల నుత్తములగు వారిని నల్వురం బిలిచి రహస్యముగా నావృత్తాంతమంతయు నెఱిఁ గించి మీరు సప్తమీశుక్ర వారమునఁ దొలిజాముననే పోయి యం దెట్లో దాఁగియుండి పాతాళుడు రాధికను దెచ్చి పెండ్లి యాడఁ బూనుసమయమున వాని బంధించి కొని రండు. లేదా మువ్వు రందుండి గ్రామవాసులకుఁ దెలిపి వారిని దోడిచ్చి యొక్క ని నిట్లకుం బంపుఁడు. పాతాళుడు పెక్కండ్రం గూడి వచ్చు నేమో యనుభీతి మీ కుండదని నమ్మెదను. మీరు దేహబలముగలవారు. కృపాణపాణులగు మిము వా రెంద ఱైనను మార్కోని యోడింపఁజాలరని నావిశ్వాసము. అందును భగవతికి ధర్మపక్షమున నభిమానము మెండు. మనము న్యాయపక్షము నవలంబించువారము. న్యాయమున భగవంతుఁడుండునన్న శ్రుతు లసత్యములు కావు, కావున మీ రీవిషయమును రహస్యముగా నునిచి యా కార్యము నెఱవేర్పవలయునని తెల్పెను. గురువునానతి శిరసావహించువారు గాన వా రామాటలు వినినంతనే శ్రద్ధాళువులై యట్లే యొనరింతుమనిరి . ఆ నలువురిలో వేంకటేశ్వరుఁడు సాము చేసినవాడు, బలశాలి, ధీరుఁడు నగును. కాళీచరణదాసు బలశాలియగుటయే గాక యుపాయముల నెఱింగినవాఁడు. ప్రత్యుత్పన్నమతియనం జనును రామకిశోరశర్మ జన్మ ధార్ఢ్యము గలవాఁడు. కార్యము పట్ల ముందు వెనుక లాలోచించువాఁడు కాఁడు. అంతియ గాక ఖడ్గ చాలనమున రెండవ భీముఁడే యనవచ్చును. శ్యామ సుందరుఁడు పై వారి నొక్కొక విషయమున మించువాఁడే కాని సామాన్యుడు కాడు ఈనల్వు రిట్టివారు కాఁ బట్టియే గురువుగారు రహస్యముగ నీ కార్యము చక్కపెట్ట నియోగించెను. వారెల్లరు శుక్రవారము రాకకై వేచియుం డిరి. ఆనంతాచలశర్మ యుఁ దనయిష్ట దేవత నారాధించుచు రాధిక కించుకంతయుఁ గీడుకలుగకయుండునట్లు కరుణింపవలయు నని ప్రార్థించుచుండెను. తుహినకిరణ శేఖరుఁడు పొరపాటున నీమాట యేల జాఱవిడిచితినని విచారించుచు గురు వీమాట నాలకించినజాడ కానరాలేదే యని మరలఁ దృప్తినొందుచు నుండెను.


నాల్గవ వీచిక.

జాలంధరపురమున మహోత్సవము సాగుచుండెను. ఆది శక్తి కేటేట నాయుత్సవము సాగునాచారము కలదని పాఠకులు ముందే చదివియుందురు. లక్షలకొలఁది మానవు లరు